Saturday, December 30, 2017

మాండుక్యోపనిషత్తు

మనసులో మాట

మాండుక్యోపనిషత్తు అధర్వ వేదానికి చెందినది. మహర్షి మండూకుని ద్వారా దర్శింపబడిన కారణంగా దీనిని మాండుక్యోపనిషత్తుగా చెపుతారు
            దర్శన అంటే చూడడం (Sight) కాగా దివ్య దృష్టి (Insight) అంటే లోతైన ఆలోచనతో విమర్శనా పూర్వకంగా, హేతుబద్ధమైన దృష్టితో పరిశీలించడం. చూడడం (Sight) వల్ల భౌతిక స్వరూపాన్ని అర్ధం చేసుకోగలుగుతాము; కాని పరిశీలన వల్ల అంతర్యాన్ని గ్రహించ గలుగుతాము.  భారతీయ వేద వాజ్ఞ్మయాన్ని, ఉపనిషత్ సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పరిశీలనా దృష్టి (Insight) అవసరం.
పరిశీలనాదృష్టి విద్యవల్ల అలవడుతుంది. అది సరే, అసలు విద్య అంటే ఏమిటి? అక్షరాలు నేర్వడం మాత్రమే విద్య కాదు. విద్య ఆత్మ వికాసాన్ని ఇవ్వాలి. విశ్వాసాన్ని పెంచాలి. విద్య సమష్టి తత్త్వాన్ని పెంచాలి. ఇతరుల పట్ల సహనాన్ని పెంచాలి. పోతన గారన్నట్లు, చదివిన సదసద్వివేక చతురత నిచ్చేది చదువు లేదా విద్య.
విద్య లేదా నేర్చుకోవడం అనేది పాదరసం లాంటిది అంటారు. విజ్ఞుడు లేదా నైపుణ్యం  కలిగిన వాని చేతిలో అది ప్రపంచాన్ని అత్యున్నత స్థాయికి తీసుకు వెళుతుంది. అదే అజ్ఞుని చేతిలో లేదా స్వార్ధపరుడు, అహంకారి, పటిమ లేనివాని చేతిలో హానికరమైన ఆయుధంగా పరిణమిస్తుందంటారు. ఏది చదివినా, నేర్చినా మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని గుర్తించలేని విద్య నేర్వడం వల్ల ప్రయోజనం లేదు. నిజానికి ఏది యుక్తమైనదో, ఏది అయుక్తమైనదో తెలుసుకోవడమే విద్య.
విద్ అనే ధాతువు నుండి వచ్చింది విద్య.  విద్ అంటే తెలుసుకోవడం. అయితే ఈ  తెలుసుకోవడం లేదా ఈ విద్య  నేర్వడం ఎప్పటి వరకు? జీవితాంతం ఈ విద్యను నేరుస్తూనే ఉండాలా? అంటే ఏదైతే  తెలుసుకోదగినది ఉన్నదో ఆ దానిని అవగతం చేసుకోని ఇక తెలుసుకునేందుకు ఏమీ లేదు అనుకునేంత వరకు నేర్చుకోవాలి. అది క్షణంలో కలగవచ్చు, జీవితకాలం పట్టవచ్చు.
Learning gives credibility. Credibility leads to thinking. Thinking provides knowledge and knowledge makes you GREAT అంటాడు, APJ అబ్దుల్ కలాం.
దాదాపు 14 బిలియన్ సంవత్సరాలకు పూర్వం ఒక ప్రేలుడు సంభవించిందనీ, దానితో ఈ  విశ్వం ఆవిర్భవించిందనీ, దాదాపు 500 కోట్ల పై సంవత్సరాల క్రితం భూమి పుట్టిందనీ, కొన్ని లక్షల సంవత్సరాలుగా జీవకోటి ఈ భూమిపై నివాసముంటుందనీ భౌతిక శాస్త్రం చెపుతుంది. అలాగే భారతీయ ఋషులు దర్శించి ప్రవచించిన వేదాల ప్రకారం ఆది శక్తి లేదా మూల శక్తి  లేదా మూల ప్రకృతిలో ఏర్పడిన ప్రకంపనల వల్ల విశ్వ సృజన జరిగిందనీ దాదాపు 450 కోట్ల పై చిలుకు సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించిందనీ తెలుస్తుంది.
సాధారణంగా తెలిసిన దానిని ఆలంబనగా చేసుకొని తెలియని దానిని సాధించే ప్రయత్నం జరుగుతుంది. మానవుని యాత్ర కూడా Known to unknown సాగుతుందంటారు. భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వం యొక్క మూలాలను ఛేదించే ప్రయత్నంలో తపించారు. అలాగే తత్త్వ జిజ్ఞాసువులు, ఆధ్యాత్మిక సాధకులూ ఈ విశ్వ చైతన్యానికి మూలమైనదేదో తెలుసుకునేందుకు తపించారు. తమ తమ జిజ్ఞాసలలో తమకు పరిచితమైన ప్రకృతిని అన్వేషిస్తూ భౌతిక ఆధ్యాత్మిక అంశాలను సమన్వయ పరుస్తూ సమగ్రతను సాధించే ప్రయత్నం చేసారు, చేస్తున్నారు.
            ఈ జిజ్ఞాస వల్ల ఏమిటి ఉపయోగం? పశుతుల్యంగా బ్రతుకు లీడ్చిన మానవజాతి ఆ స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరేందుకు కావలసిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సమ కూర్చుకోవడానికి ఈ జిజ్ఞాసయే మూలం. నేనెవరు? ఈ కనిపించే ప్రకృతి ఎక్కడి నుండి వచ్చింది? శాశ్వతంగా ఉంటుందా లేక నశించిపోతుందా? ఒకవేళ నశిస్తే ఏమవుతుంది? ఎక్కడికి పోతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించేందుకు ప్రేరణ నిచ్చింది, జిజ్ఞాసయే.
            పురుష సూక్తం ఇలా చెపుతుంది.... "పురుష ఏ వేదగుం సర్వమ్ యద్భూతం యచ్చ  భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనా తిరోహతి" మునుపు ఏది ఉన్నదో, ఇక ముందు ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. చావు పుట్టుకలులేని అమృతత్వ స్థితికి మూలమైన వాడు ఆ భగవంతుడే.  "ఏతావానస్య మహిమా; అతో జ్యాయాగ్ శ్చ పూరుషః; పాదో ౨ స్య విశ్వా భూతాని; త్రిపాదస్యామృతం దివి!" అంటుంది పురుష సూక్తం. ఏతావాన్... ఇక్కడ దృశ్యమానమైనదంతా లేదా కనిపించేదంతా కూడా భగవంతుని మహిమమే. సకల చరాచర ప్రకృతిగా దృశ్యమానమైనది అంతా ఆ మూల ప్రకృతిలో ఒక వంతు మాత్రమే. మిగిలిన మూడు భాగాలు ఆకాశంలో వ్యాప్తమై ఉంది. శూన్యం, పదార్ధం, శక్తి”; ఈ మూడింటి సమష్టి తత్త్వమే సకల చరాచర ప్రకృతి.  ఇందులో పదార్ధం కనిపిస్తుంది. అలాగే శక్తి పదార్ధ రూపంలో ప్రకటింప బడుతుంది. ఇక అన్నింటికీ ఆధారమైనది శూన్యం. ఆశూన్యమే అదృశ్యంగా మూడు భాగాలు నిండి ఉన్నది.
            మరో కోణంలో దీనిని పరిశీలిస్తే... పుట్టినవన్నీ గిడుతున్నాయి. ఏది జన్మిస్తుందో అది నశిస్తుంది. ఉవ్వెత్తున లేచినదేదీ అక్కడే ఉండడం లేదు మరలా పడిపోతుంది. నశించడం లేదా పడిపోవడం; మరలా జన్మించడం లేదా లేవడానికి కారణం అవుతున్నాయి. ఇదే కార్య కారణ (Cause & Effect) సంబంధంగా పరిణమిస్తుంది. అంటే ప్రకృతిలో "తీసుకోవడం, ఇవ్వడం" అనే ధర్మం ఉంది. కాబట్టి ఆ ప్రకృతిలో అంతర్భాగమైన మనం ఆ ధర్మానికి బద్ధులమై జీవనం సాగించాలి.  అంటే వ్యక్తి జీవితానికి అవసరమైన ప్రతిదీ సమాజం నుండి లేదా ప్రకృతి నుండి లభిస్తున్నదే కాబట్టి మనమూ మన దగ్గర ఉన్నది సమష్టికి అంటే సమాజానికి తిరిగి ఇవ్వవలసిందే అనే సామాజిక సూత్రాన్ని లేదా ధర్మాన్నిపురుషసూక్తం ప్రతిపాదించడం జరుగుతుంది.
            మరొక ముఖ్య విషయాన్ని పురుష సూక్తం వివరిస్తుంది. ఈ సృష్టి రెండు భాగాలుగా ప్రకటింప బడింది. మొదటిది "పూర్వ సృష్టి" రెండవది "ఉత్తర సృష్టి". సకల ప్రాణి కోటి పూర్వ సృష్టిగా చెప్పబడితే; ఆ ప్రాణుల అవసరాలను తీర్చగలిగే ఆహార పదార్ధాలు, జీవితావసరాలు ఉత్తర సృష్టిగా అవతరించాయి. జీవకోటిని సృష్టించిన ప్రకృతి ఆ జీవకోటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన వనరులనూ సమకూర్చింది. అలాగే.... దంపతులు తమ కామ వాంఛలు తీర్చుకోవడానికి మాత్రమే బద్ధులై సంతానాన్ని కనరాదు. వారిని కనే ముందే తమ శక్తిసామర్ధ్యాలు గుర్తెరిగి వారిని పోషించడానికి అవసరమైన ఆర్ధిక వనరులనూ సంపాదించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆ సంతానం సమష్టి తత్వాన్ని గుర్తించి, తమ సామాజిక బాధ్యతను నిర్వహించేందుకు అవసరమైన శిక్షణను అందించాల్సి ఉంటుంది. సంతానాన్ని కనడం పూర్వ సృష్టి కాగా సంతానం యొక్క బాగోగులు చూస్తూ వారిని ఉత్తమ పౌరులుగా సమాజానికి అందించడం ఉత్తర సృష్టిగా తెలుసుకోవాలి.
            ఈ విశ్వం అంతా శాశ్వతమైనదే. ఏదైతే శాశ్వతమైనదో అది నిర్దుష్టంగా, సమగ్రంగా, సంపూర్ణంగా ఉంటుందంటాడు, గ్రీకు తత్త్వ వేత్త అరిస్టాటిల్. (Aristotle says that the Universe had existed forever. Something eternal is more perfect than something created).
దీని వల్ల ఈ విశ్వం అంతా భగవంతుని ప్రకటన (Manifestation) మాత్రమే కాని భగవంతుని సృష్టి (Creation) కాదు అనేది అర్ధం అవుతుంది. వ్యక్తావ్యక్తమందంతటా వ్యాపించి ఉన్నది భగవంతుని అంశ మాత్రమే. అలాకాక ఒకవేళ భగవంతుడు ఎక్కడో ఉండి విశ్వాన్ని సృజించి ఉంటే, భగవంతుడు వేరు, సృష్టి వేరుగా ఉండేది. అప్పుడు అనంతత్వానికి భిన్నంగా లేదా అతీతంగా మరొకటి ఉంటే అది అనంతం కాదు కాబట్టి, భగవంతుని అనంతత్త్వం తప్పవుతుంది. ఆ కారణం చేతనే ఆదికి ఆదిగా ఉన్నటువంటి శక్తియే విశ్వంగా అవతరించింది, విస్తరించింది, మూల ప్రకృతిలో లయమైంది మరలా ప్రకటింప బడింది అని నిరూపితమౌతుంది.
రాకపోకల (జగత్తు -- జాయతే గచ్ఛతే ఇతి జగత్) ఆంతర్యాన్ని అర్ధం చేసుకునే క్రమాన్ని వీలైనంత సుబోధకంగా చెప్పే ప్రయత్నం చేసిందీ ఉపనిషత్తు.
ఆ ఉపనిషత్తు అంతర్యాన్ని ఆవిష్కరించేందుకు చేసిన చిన్ని ప్రయత్నమే మీ చేతిలో ఉన్న పుస్తకం. ఇది పాఠకుల సందేహాలను తీరుస్తూ సుబోధకంగా ఉంటుందని ఆశిస్తున్నాను. నాప్రయత్నం సఫలమై చదవగానే విషయం అర్ధమవుతే అది ఆ ఉపనిషత్తు యొక్క గొప్పదనం. అలాకాక ఏ కారణం చేతనైనా పాఠకునికి విషయం అవగతం కాక సందేహాలను మిగిలిస్తే అది నా అసమర్ధతగానే భావిస్తాను. రచయిత లేదా వ్యాఖ్యాత సమన్వయతా లోపం పాఠకులలో గందరగోళం సృష్టించకూడదు. అలాంటి అసమగ్రత కనిపిస్తే దయచేసి సహృదయతతో మరొక్కమారు చదవండి.
నిర్దుష్టత ఆహ్వానించ దగింది. లోపాలు సరిదిద్దుకోవలసినవి. విషయాన్ని వ్యాఖ్యానించే సమయంలో, విశ్లేషణ చేసే సమయంలో ఇచ్చే ఉదాహరణలు విషయాన్ని స్ఫష్టపరచేందుకు ఉద్దేశించినవి మాత్రమే. వాటిని అంతకు మించి వ్యాఖ్యానించడం సరిగాదని మనవి.
అదీతి (Extensive Reading) బోధ (Understanding) అవగతం (Application) ప్రచారం (Preaching) ఇవి సాహిత్యం ప్రయాణించే మార్గాలు. ప్రాచీన భారతీయ ఋషులు తాము దర్శించిన సాహిత్యాన్ని ఈ మార్గాలగుండా వడగట్టి సారాన్ని అందించారు. దానిని మరింత సులభతరం చేసే సంకల్పంతో చేసిన ప్రయత్నం ఇది. ఆస్వాదించండి. మీ అంచనాలను అధిగమిస్తుందని నమ్ముతూ....

భవదీయుడు

పాలకుర్తి రామమూర్తి

ఓం శ్రీ సరస్వత్యై నమః

మాండుక్యోపనిషత్తు

"ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ" అంటుంది, వేదం.  ఆ శ్రుతి వాక్యాన్ని ఆలంబనగా చేసుకొని "ఓం ఇత్యేతదక్షర మిదగుం సర్వం" అంటూ ఆరంభమౌతుంది, ఈ ఉపనిషత్తు.
మండూక మహర్షి  ద్వారా దర్శింపబడిన ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రాలున్నాయి. ఆకారంలో చిన్న ఉపనిషత్తే  అయినా  శాశ్వత సత్యాన్ని ఆవిష్కరించే క్రమంలో చేసిన ప్రయత్నం మాత్రం అపారమయినది. తాను ప్రతిపాదించిన సిద్ధాంత పరంగా ఈ ఉపనిషత్తు విశిష్టతను సంతరించుకున్నది. తాత్త్వికంగా విస్తృతమైన విషయాన్ని పరిమిత పదాలతో చర్చించేందుకు చేసిన ప్రయత్నం కావడం వల్ల, సాంకేతిక పదాల వాడకం ఎక్కువగా ఉండడం వల్ల ఇందులోని అంతరార్ధం గ్రహించడంలో క్లిష్టత ఏర్పడుతుంది. శ్రీ ఆది శంకరుల పరమ గురువు శ్రీ గౌడపాదుల వారు దీనికి రెండు వందల పదునాలుగు కారికలు వ్రాయగా శ్రీశంకరులు ఇందులోని పన్నెండు మంత్రాలకూ మరియు గౌడపాదుల కారికలకూ విఫులమైన వ్యాఖ్యలు వ్రాసి ఉపనిషత్తు ప్రతిపాదించిన సిద్ధాంతానికి ఉపపత్తిని అందించారు. దానితో జిజ్ఞాసువులకు ఈ ఉపనిషత్తును అర్థం చేసుకోవడం కాస్తంతా సులభతరమైంది. కారికలు అంటే వ్యాఖ్యానాలు అని అర్థం.  తాత్త్విక గ్రంథాలలో గౌడపాదుల వారి ఈ  కారికను కూడా ఉత్తమ గ్రంథంగా పరిగణిస్తారు.
ప్రకృతిలో ఏర్పడిన ప్రకంపనల శబ్దరూపం ఓంకారమని చెపుతారు. అందుకే విశ్వానికి ప్రతీకగా ఓంకారాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ ఓంకారమే కాల త్రయాలలో విస్తరించింది దానికి అతీతంగా కూడా నిలుస్తుంది. (భూత భవిష్యత్ వర్తమానాలు కాల త్రయాలు) అంటే ఈ మూడు కాలాలలో ఉన్నది అంతా ఓంకారమే. అంతేకాదు, ఈ మూడు కాలాలకు అతీతంగా ఏదైనా ఉంటే అది కూడా ఓంకారం కాకుండా మరొకటి అయ్యే అవకాశం లేదు.
            శబ్దం భావాన్ని తెలుపుతుంది లేదా ప్రకటిస్తుంది. భావం శబ్దం ద్వారా ప్రకటిత మౌతుంది. ఈ రెండూ పరస్పరాధారితాలు. (Word represents the concept and the concept is known by the word. Both are interrelated).  భావం విశ్వం కాగా శబ్దం ఓంకారం. ఇక్కడ శబ్దం భావానికి ప్రతీక కాబట్టి విశ్వం యొక్క ప్రతీకగా ఓంకారం చెప్పబడుతుంది. భావాన్ని అర్థం చేసుకోవాలి అంటే శబ్దాన్ని ఆశ్రయించాలి. అలాగే విశ్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే శబ్ద స్వరూపమైన ఓంకారాన్ని ఆశ్రయించాలి. "అ,, మ" అనే మూడక్షరాల కలయికయే ఓంకారం. నిజానికి ఈ మూడు అక్షరాలే ప్రపంచంలోని అన్ని శబ్దాలకూ ఆధారభూతమైనవిగా చెపుతారు. ఒక కలర్ టీవీలో ఉండే పిక్చర్ ట్యూబ్ లో ప్రాధమికంగా ఉండేవి మూడు రంగులు మాత్రమే. ఆ మూడు రంగులే వివిధ సంయోగముల చేత (permutations & combinations) అనంతమైన రంగులుగా ఎలాగైతే భాసిస్తాయో అలాగే ఈ మూడు అక్షరాలు అనంతమైన భాషాపదాలలో ప్రతిబింబిస్తాయి.
ప్రణవోపాసన అంటే ఓంకారాన్ని ఉచ్ఛరించి సాధన చేయడమే యోగ సాధనా మార్గంగా చెపుతూ, ఆ సాధన ద్వారా ముక్తిని సాధించడ మెలాగో ఈ ఉపనిషత్తు ప్రతి పాదించింది. రహస్య సాంకేతిక పదాలతో కూడిన మంత్రాక్షరాలను కలిగి యుండడం వల్ల ఇది గురు శిష్య పరంపరగా పఠించడం ద్వారా మాత్రమే ఆ సంప్రదాయ రహస్యాలను అర్ధం చేసుకోగలమే కాని తదితరంగా కష్టసాధ్యమని పెద్దలు చెపుతారు. విజ్ఞానం (Knowledge) గురువు ద్వారా శిష్యునికి చేరుతుంది. ఒక Presence (ఆత్మ) నుండి మరొక Presence కు ప్రవహిస్తుంది.  పవిత్ర భావనతో గురువు నుండి గ్రహించిన ఆ విజ్ఞానం యొక్క యదార్ధ స్థితిని అవగాహన చేసుకొని, సృజనాత్మకంగా ఆచరణ యోగ్యమైన రీతిలో అన్వయించుకొని వికసన పొందడం ప్రజ్ఞ  (Wisdom) గా చెప్పబడుతుంది.             విజ్ఞానం బుద్ధి యొక్క చురుకు దనంతో గ్రహించవలసింది. గురువు చెపుతాడు, నేర్చుకునేందుకు కావలసిన ప్రేరణ నిస్తాడు. కాని దానిలోని అంతరార్ధాన్ని గ్రహించడానికి శిష్యునిలో బుద్ధి ప్రచోదన కావాలి. (Igniting the intellect) ఎప్పుడైతే బుద్ధి ప్రచోదన పొందుతుందో అప్పుడు గ్రహణలో స్పష్టత వస్తుంది.  స్పష్టత వల్ల నిర్మలత, స్వచ్ఛత ఆవిష్కరింప బడుతుంది. దాని వల్ల పెరిగిన అవగాహన ఆ విజ్ఞాన పరిధి విస్తరణకు ఉపయుక్త మౌతుంది. అదే సృజన శీలతకు తొలిమెట్టుగా నిలుస్తుంది.
            విజ్ఞానం యొక్క పరాకాష్ట దానిని అన్వయించుకొనడంలో ఉంటుంది. అత్యున్నత  మైన విజ్ఞానం, వివేచనగా లేదా ప్రజ్ఞగా (Wisdom) చెప్పబడుతుంది. విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవడం, సరిగా అవగాహన చేసుకోవడం, ఉన్నది ఉన్నట్లుగా దర్శించడం ప్రజ్ఞ యొక్క సారంగా చెప్పుకుంటాము.
అయినా, సమస్త సృష్టికి, అనంత శక్తికీ, భగవచ్ఛైతన్యానికి ప్రతీకగా సూచింప బడిన ప్రణవము యొక్క విశిష్టతను తెలియచేస్తున్నదీ ఉపనిషత్తు కాబట్టి కష్టమైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది.  దృశ్య జగత్తు, అదృశ్య జగత్తు అంతా బ్రహ్మమే. జాయతే గచ్ఛతే జగత్ అంటారు. అంటే ఏదైతే వస్తుందో మరియు పోతుందో దానిని జగత్తు అంటారు. వచ్చేది ఎక్కడి నుండి వస్తుంది; పోయేది ఎక్కడికి పోతుంది? ఇవి ఆలోచించాల్సిన ప్రశ్నలు. ఈ జగత్తు దృశ్యమాన మైనదైనా లేదా దృశ్యమానం కానిదైనా అంతా ఆ భగవంతుడనబడే అనంత శక్తి యొక్క ప్రకటనయే కాబట్టి  రాక, పోక లనేవి సాపేక్షాలే కాని సత్యాలు కావు. జగత్తు చూడబడేది కాగా  ద్రష్ట (చూచేవాడు లేదా సాక్షీభూతుడు) భగవంతుడు. దానినే "ఆత్మ" అంటున్నాము.
జీవాత్మ మనలో ఉండే ఆత్మ చైతన్యం. పరాత్మ ఇతరులలో ఉండే ఆత్మ చైతన్యం. పరమాత్మ ఈ రెంటికీ అభేదాన్ని పాటించడం. అన్నీ చైతన్య వికాసాలూ ఒకే దానికి అను సంధానమైనవనే యదార్ధాన్ని, సత్యాన్ని గుర్తించడం.
దృశ్యమాన జగత్తులోనూ, అదృశ్యమాన జగత్తులోనూ ఉండేది ఈ ఆత్మయే. ఈ ఆత్మ లేదా పరతత్త్వం లేదా అంతర్గత చైతన్యం (Consciousness)…పేరేదైనా, ఇది నాలుగు అవస్థలుగా ప్రకటితమౌతుంది. జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ మరియు తురీయా వస్థలుగా వీటిని గుర్తిస్తారు. ఈ నాలుగు స్థితులనూ నాలుగు పాదాలు అన్నారు. కాని వాటిని నాలుగు పాదాలుగా కాక శ్రీ శంకరులు ఒక నాణం లోని నాలుగు పావులుగా  చెప్పారు. అలా చెప్పడంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా పాదాలు అంటే కాళ్ళుగా తీసుకుంటాము. దానితో సమన్వయం కుదరదు. అందుకే, నాలుగు పావులుగా  చెప్పారు.  మొదటి పావు రెండవ దానిలో; రెండవది మూడవ పావులో లీనమవడం తదుపరి ఈ మూడూ నాలుగవ దానిలో లీనమవడం జరుగుతుంది. దీనితో నాలుగవది పరిపూర్ణ మవుతుంది. మొదటి మూడూ వ్యష్టిగా ఉండగా నాలుగవది సమష్టిగా సమగ్రతనూ మరియు విలక్షణత్వాన్ని సంతరించుకుంటుంది. ఎందుకు ఈ నాలుగవది సమగ్రంగా ఉండాలి? అంటే అదే జ్ఞేయ విషయం అనగా తెలుసుకోవలసిన విషయం లేదా తెలుసుకోదగిన విషయం కాబట్టి. నాలుగవది జ్ఞేయం సరే మరి మిగిలిన మూడూ ఏమిటి? ఈ మూడూ నాలుగవ దానిని తెలుసుకునేందుకు ఉపకరించే లేదా దారి చూపే ఉపకరణాలు లేదా నిమిత్తాలు మాత్రమే.
            నాలుగు అవస్థలలో జాగ్రదావస్థ ప్రథమమైనది లేదా మొదటి పాదం అంటారు. "వైశ్వానరః ప్రథమ పాదః" అంటుంది ఉపనిషత్తు. వైశ్వానరుడు (విశ్వ+నరుడు) మొదటి పాదం. "జాగరిత స్థానో" జాగ్రదావస్థ సంచార స్థానంగా కలవాడు వైశ్వానరుడు. ఇతడు "బహిః  ప్రజ్ఞ" బహిర్ముఖమైన ప్రజ్ఞ లేదా చేతన కలవాడు లేదా బాహ్య విషయాలను మాత్రమే గ్రహించ గలిగిన వాడు. ఈ విశ్వనరుడు లేదా వైశ్వానరుడు ఈ విశ్వంలోని సమస్త జీవుల యొక్క స్థూల శరీర ధార్మిక స్థితికి లేదా వ్యాపారాలకు ప్రతినిధి. అంటే సాధారణంగా మెలుకువగా యున్న వేళ సమస్త జనులు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనకు ఈ వైశ్వానరుడు ప్రతినిధి. ఇంకా ఈ వైశ్వానరుని లక్షణాలను చెపుతూ... "సప్తాంగ ఏకోనవింశతి ముఖః" అంటుంది, ఉపనిషత్తు. సప్తాంగ... ఏడు అంగాలు లేదా అవయవాలు, ఏకోనవిశతి ముఖః... పందొమ్మిది నోళ్ళు కలిగిన వాడు ఈ విశ్వనరుడు, అంటుంది.  తల, కన్ను, ముక్కు లేదా శ్వాస, శరీరం, మూత్రస్థానం, కాళ్ళు, నోరు ఈ ఏడింటినీ సప్తాంగాలుగా వ్యవహరించింది. ఇంకా ఆకాశాన్ని తలగా, సూర్యుడిని కన్నులుగా, గాలిని శ్వాసగా, శూన్యాన్ని శరీరంగా, నీటిని మూత్ర స్థానంగా, భూమిని కాళ్ళుగా మరియు అగ్నిని నోరుగా ప్రస్తావిస్తూ వీటిని సప్తాంగాలుగా చెప్పడం జరిగింది.
            అలాగే అయిదు జ్ఞానేంద్రియాలు (చర్మము, కన్నులు, చెవులు, ముక్కు, నాలుక), అయిదు కర్మేంద్రియాలు (నోరు, చేతులు, పాదములు, జననేంద్రియము మరియు గుదము (పాయుః)), పంచప్రాణాలు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు సమాన), అంతఃకరణ చతుష్టయం (మనస్సు, చిత్తం, బుద్ధి మరియు అహంకారం) మొత్తం పందొమ్మిది; వీని ద్వారా మాత్రమే బాహ్య జగత్తు అనుభవంలోకి వస్తుంది, అనుభూతి నిస్తుంది కాబట్టి ఇవి నోళ్ళుగా చెప్పబడ్డాయి. 
            స్థూల దృష్టిలో వైశ్వానరుడు అంటే వ్యష్టిగా లేదా వ్యక్తిగతంగా, విరాట్ అంటే సమష్టిగా లేదా జీవకోటి అంతా కలిపి చెపుతాము. ఇక్కడ వైశ్వానరుడు అని చెప్పడం వల్ల జీవాత్మగా చెపుతూనే ఈ జీవాత్మకూ పరమాత్మ లేదా విశ్వాత్మకు భేదం లేదనే విషయాన్ని పరోక్షంగా సూచించడం జరుగుతుంది. జాగ్రదావస్థలో విశ్వనరుడు , తనకు సహజ అనుభవమైన; ఇంద్రియ గ్రాహ్యమైన (Perceptible) వాస్తవిక (వస్తు సంబంధమైన) ప్రపంచాన్ని మాత్రమే అనుభవించ గలుగుతున్నాడు. ఇంద్రియ గోచరం కానిదానిని (Non perceivable) గ్రహించడం ఈ అవస్థలో సాధ్యపడదు. ఈ అనుభవాన్ని పొందే క్రమంలో పైన పేర్కొన్న పందొమ్మిది నోళ్ళు (జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం) సహకారాన్నందిస్తాయి.
            వ్యష్టినీ సమష్టినీ వేరు వేరుగా చూపినా ఉపనిషత్తు అంతరంగం మాత్రం ప్రతి వ్యక్తి స్వార్ధపరతను వీడి సమష్టి తత్త్వాన్ని అలవరచు కోవాలని మాత్రమే. సమష్టి ఎదుగుదలయే వ్యక్తిగత ఎదుగుదలకు పునాది అవుతుందని, మానసిక పరిధిని విస్తృతపరచుకోవాలని ప్రబోధిస్తుంది, ఈ ఉపనిషత్తు. జాగ్రదావస్థ పరిధి విస్తరించడం వల్ల "జాగ్రతి" కలుగుతుంది. ప్రాపంచికంగా ఆలోచిస్తే "జాగ్రత" అంటే Presence of Mind, కాగా దాని కతీతంగా ఆలోచిస్తే "జాగ్రత" అంటే Higher ability of Awareness లేదా  మెలుకువ స్థితి నుండి యెఱుక స్థితిని పొందడమే. అంటే Presence of Mind స్థాయి నుండి Higher ability of Awareness స్థితికి చేరడం.
            ఈ యెఱుక స్థితిని పొందడం వల్ల వ్యక్తిలోని సహజమైన సామర్థ్యం, దీనినే Instinct అంటాం, వెలుగు చూస్తుంది. దానితో  ఏ విషయాన్నైనా తత్క్షణమే అర్థం చేసుకునే లేదా తెలుసుకునే సామర్ధ్యం కలుగుతుంది. దీనినే Intuition అంటాం.  దీని వల్ల మనకున్న సామర్ధ్యాన్ని లేదా మనం సాధించిన నైపుణ్యాలను నిత్య జీవితంలో ప్రతిక్షేపించ గలిగిన మేధస్సు ప్రచోదన పొందుతుంది, దీనినే Intelligence అంటాం.  మనలో యెఱుక స్థితిలో వికసితమైన ఈ విధానం వల్ల దార్శనికత (Insight) వెలుగు చూడడమే కాక తదనుగుణమైన ప్రేరణ (Inspiration & Motivation) కలుగుతుంది. (Inspiration is at thought level & Motivation is in action level) వైశ్వానరుడు లేదా వ్యక్తి సాధారణ జాగ్రదావస్థ నుండి జాగ్రత మవడం వల్ల అతనిలో Alertness పెరుగుతుంది. అంటే రాబోయే ప్రమాదాలను, అవరోధాలను లేదా పరిణామాలను చాలా త్వరగా ముందుగానే గుర్తించడం, తదనుగుణమైన రీతిలో స్పందించ గలిగిన వికసన లేదా క్రియా సాధన శీలత పెరుగుతుంది.  తద్వారా తానే స్థితిలో ఉన్నా మెలుకువ స్థితి లో ఉండగలుగుతాడు. దీనినే Awaken state అంటాం. దీని తదుపరి, గ్రహణ శక్తి పెరుగుతుంది. చాలా చిన్న శబ్దాలను సైతం గ్రహించగలిగిన సున్నితత్త్వము, తక్కువ కాంతిలో పరుచుకునే నీడలను, అతి తక్కువ వేగంతొ వీచే గాలి కదిలికలను సైతం గ్రహించ గలిగిన గ్రహణ సంబంధిత సున్నితత్వాన్ని సంతరించుకో గలుగుతాము. పరిసరాలలో ఉండే జీవకోటి యొక్క కదలికలను పసిగట్టగలిగిన చైతన్యం కలుగుతుంది. పరిసరాలలో జరిగే అతి చిన్న మార్పుకూ  అప్రమత్తతతో స్ఫందించ గలుగుతాము. దీనినే "జాగ్రత" లేదా Higher ability of Awareness అంటున్నాము.
            సాధారణంగా మన ఆలోచనలు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే నాలుగు ఉపాధులనుండి వెలుగు చూస్తాయి. సాధారణంగా ఎక్కువ మందిలో ఆలోచనలు దాని ననుసరించిన మాటలు లేదా క్రియలు వైఖరి ద్వారా బయటకొస్తాయి. బయటకొచ్చిన పిమ్మట దాని ప్రతిస్పందనల ననుసరించి ఆ ఆలోచనా విధానాన్ని అంచనా వేస్తాము ఫలితాలూ అలాగే ఉంటాయి. సాధారణంగా మనకన్నా చిన్న వారి ముందు లేదా మన అధికారం ఉన్నచోట అనాలోచితంగా వ్యవహరిస్తాము. ఇక్కడ మాట ననుసరించి ఆలోచన వస్తుంది. ఇది వైఖరి వ్యవస్థ వల్ల జరుగుతుంది. మన కన్నా కొద్దిగా పెద్దవారి ముందు లేదా మన పై అధికారి ముందు లేదా మనకు ఎదుటివారితో అవసరం ఉన్న సమయంలో కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుతాము. ఇక్కడ వచ్చిన ఆలోచనలను వడగడుతూ మాట్లాడుతాము. అంటే మాటల స్థాయిలో వచ్చే ఆలోచనలను వడగట్టి మాట్లాడుతాము. ఇది మధ్యమ ఉపాధి ద్వారా వెలుగు చూచే ప్రక్రియ. ఇక ఆలోచనా ప్రదానంగా మాట్లాడడం చాలా పెద్దవారి వద్ద జరుగుతుంది. ముఖ్యంగా పై స్థాయిలో ఉండే అధికారులు, గురువులు; అలాంటి వ్యక్తుల వద్ద ఈ రీతిగా గురుభావనతో వ్యవహరిస్తాము. వచ్చిన ప్రతి ఆలోచన యొక్క ప్రతిబింబాన్ని దర్శిస్తాము. దాని పరిణామాలు అంచనా వేసుకుంటాము. ప్రతి అక్షరం మదిలో ప్రతిబింబిస్తుంది దాని పరిణామం అవగతమౌతుంది. తదనుగుణమైన మాటలు మాత్రమే పలుకుతాము. ఇది పశ్యంతి ఉపాధి ద్వారా వెలుగు చూచే విధానం. ఇక పరా ఉపాధిలో ఆలోచనాస్థాయిలోనే దానిని దర్శించడం జరుగుతుంది. ఆలోచన వచ్చాక దానిని వ్యక్తీకరించడం కాక ఏ ఆలోచన చేయాలో ఏది చేయకూడదో స్పష్టంగా తెలుస్తుంది.
            ఈ "జాగ్రత" లేదా Higher ability of Awareness స్థితిలో "పరా" స్థాయిలో మన చైతన్యానికి చేతన కలుగుతుంది. ఈ స్థితిలో మన ఉద్దేశ్యం (Intention) మన సామర్ధ్యం (Competency) పరిణతి చెందుతాయి. ఉద్దేశ్యం ఎప్పుడైతే పరా స్థితిలో వెలుగు చూస్తుందో  లేదా పరా స్థితిలో దర్శనమిస్తుందో అప్పుడు కలిగిన "జాగ్రత" వల్ల ప్రకృతిలోని ప్రతి విషయం అవగతమౌతుంది. చుట్టూ ఉండే పరిసరాలకూ, కనిపించని జగత్తుకూ మధ్యన ఉండే సంబంధం కూడా అవగతమౌతుంది. ఇది అక్షరాల రూపంలో పుస్తకస్తమైన విజ్ఞానంగా కాక అంతర్గత చైతన్యానికి అనుభవాన్ని కలిగించడం వల్ల అనుభూతిగా అంతశ్ఛేతనలో పదిలమౌతుంది. (Spirit of the rule is more important than the letter of the rule) ఉద్దేశ్యం స్థాయిలో దీనిని అవగాహన చేసుకోవడమే "సహజజ్ఞానం" లేదా Super-Consciousness. ఈ స్థాయిలో తోటి జీవులతో మానసికంగా, హృదయగతంగా, ఆలోచనా గతంగా మరియు ఆత్మగతంగా ఒక అనుబంధం ఏర్పడుతుంది. అదే నిజమైన "జాగ్రత" లేదా Higher ability of Awareness.
            ఆత్మకు నాలుగు పాదాలు అనుకున్నాం. అందులో మొదటిది వైశ్వానరుడు కాగా రెండవది తైజసుడు. తైజసుడు అంటే తేజోవంతుడు అని అర్థం. ఇతనికి సంచారస్థానం స్వప్నలోకం లేదా స్వప్నావస్థ. "అంతః ప్రజ్ఞః" అంటుంది ఉపనిషత్తు. ప్రజ్ఞ అంతర్గత మైనది అంటే అంతరంగంలో చరించేవాడు లేదా ఇతని చేతన (కదలిక) మనస్సులో ఉంటుంది. అంటే మానసికమైన స్థితి ఇది. "ప్రవివిక్తభుక్" అంటుంది ఉపనిషత్తు. ప్రవివిక్తభుక్ అంటే మానసిక విషయాలను అనుభవించేవాడు అని అర్థం. అంతర్ముఖమైన చేతన కలవాడు కాబట్టి కలలో తాను చూచే విషయాలను గ్రహించగలడు. ఇతనికి కూడా ఏడు అవయవాలు మరియు పందొమ్మిది నోళ్ళు ఉన్నాయి. వైశ్వానరుడు స్థూల విషయాలను అనుభవించగా తైజసుడు సూక్ష్మ విషయాలను అనుభవిస్తాడు. జాగ్రదవస్థలో జీవి చేసే ప్రతి పనీ లేక బలీయమైన ఆలోచన ఒక సంస్కారంగా మనసులో ముద్ర పడుతుంది. ప్రతి ముద్రా స్మృతిలో నిలిచిపోతుంది. ప్రతిస్మృతి సూక్ష్మ విషయంగా పరిణామం చెంది అనుభవాన్ని కోరుతుంది.
            మనం మెలుకువతో ఉన్నప్పుడు మన శరీరం, మనసు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాదులన్నీ పనిచేస్తూ అనుభూతులను అనుభవాలను ఆస్వాదిస్తుంటాయి. కాని మనం నిద్రించినప్పుడు ఒక్క మనస్సు తప్ప మిగతావన్నీ విశ్రాంతి తీసుకుంటుంటాయి. స్వప్నావస్థలో శరీర అంగాలన్నీ విశ్రమించినా మనస్సు ఆ అంగాల పనులను నిర్వహిస్తుంటుంది. స్వప్నంలో చూడగలదు, వినగలదు ఆలోచించగలదు, బాధ పడుతుంది, సంతోషాన్ని అనుభవిస్తుంది... ఇలా అన్ని కార్యక్రమాలనూ మనస్సే నిర్వహించడం జరుగుతుంది.
            నిజానికి మన శరీరం పని చేయాలి అంటే మెదడు ప్రతిక్షణం ఆ పనికి సంబంధించిన సూచనలు సంబంధిత విభాగానికి పంపాల్సి ఉంటుంది. నిద్రావస్థలో శరీరానికి పంపబడిన సూచనలు మెదడు విశదీకరించడం జరుగుతుంది. ఆ విశదీకరణ కలల రూపంలో వెలుగు చూస్తుంది. అంతేకాదు, మనలో తీరని కోరికలు, ఆశలు, ఆశయాలు అన్నింటికీ కలలు ప్రతినిధులుగా వ్యవహరిస్తుంటాయి. దీనికి తోడుగా మెలుకువ స్థితిలో ప్రోదిచేయబడిన  సమాచారాన్ని మనసు విశ్లేషిస్తూ ఉండడం కూడా స్వప్నావస్థలో జరుగుతుంది. ముఖ్యంగా స్వప్నావస్థ మనలోని సహజ జ్ఞానానికి ప్రత్యేకమైన దశ. ఈ దశలో మనసు వర్తమానాన్ని అనుభవిస్తుంటుంది. గతాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది అలాగే భవిష్యత్తుకు ఆయత్తమౌతుంది.
            ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. స్వప్నావస్థలో కలిగే ఏ అనుభవమైనా అది బయటినుండి రాదు. మనసులో నిక్షిప్తమైన విషయాలు మాత్రమే స్వప్నానుభవాన్ని ఇస్తాయి. అవి ఈ జన్మవీ కావచ్చు లేదా గత జన్మల అనుభవాలూ కావచ్చు.
            ఇక మూడవ పాదం "ప్రాజ్ఞః" అంటుంది ఉపనిషత్తు. ప్రాజ్ఞః అంటే ప్రాజ్ఞుడు. పండితుడు లేదా సమర్ధుడు ప్రాజ్ఞుడు అంటుంది, శబ్దరత్నాకరము. బుద్ధి యొక్క చురుకుదనాన్ని ప్రజ్ఞగా చెపుతారు. దానిని సాధించిన వాడు ప్రాజ్ఞుడు. సుషుప్తి సంచార స్థానంగా ఉండేవాడు "ప్రాజ్ఞః". వివేచన (Discern) ప్రజ్ఞకు దర్పణం లాంటిది. మెలుకువ స్థితిలో మనసు శరీరము పనిచేయడం వల్ల వ్యగ్రత ఉంటుంది. అలాగే స్వప్నావస్థలో శరీరం విశ్రాంతి తీసుకున్నా మనసు పనిచేస్తుంటుంది. కాని సుషుప్తిలో అంటే గాఢనిద్రలో అన్నీ విశ్రమిస్తాయి. ఏ అనుభవమూ కలగదు. అలాగని తనలో ఏ అనుభవమూ నశించదు. అవసరమైనవీ, కోరదగినవీ, ఆశలుగా మిగిలిపోయినవీ, ఆశయాలుగా నిలిచినవీ ఇవేవీ ఈ సుషుప్తిలో తనను కదిలించవు. ఆనందమే పరమావధిగా గాఢ నిద్రలో రమిస్తాడు. యోగనిద్ర వలె, ధ్యానస్థితివలె ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. పంచేద్రియ జ్ఞాన పరిధి అస్పష్టతను సంతరించు కుంటుంది. అయితే ఇందులో కలిగే గాఢనిద్ర తమోగుణ ప్రధానమైనది. అందువల్ల, సాత్విక గుణ సంజనితమైన ఆనందానికన్నా ఇది భిన్నంగా ఉంటుంది. సాత్విక గుణ సంజనితమైతే తప్ప  ఆనందవల్లిలో తెలుపబడిన "ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్" అన్న ఇంద్రియాతీత స్థితి లభింపదు. తమోగుణ సంభవిత సుషుప్తి కూడా ఇంద్రియాలకు అతీతంగా ఉండదు. చేతోముఖః అంటుంది ఉపనిషత్తు. చేతనకు లేదా విషయ గ్రహణానికీ ద్వారమైనవాడు, చేతోముఖుడు. ద్వారము అంటే ఇంటిలోనికి వెళ్ళేందుకు అనుమతించే తలుపు లేదా Gate లాంటిది. గేట్ మనలను దాని గుండా పయనించేందుకు అనుమతిస్తుంది.  ఈ ప్రాజ్ఞుడు, ఆత్మతత్వ విజ్ఞానానికి మరియు బాహ్య అంతర ప్రవృత్తులకు లేదా జాగ్రత స్వప్న అవస్థలకు ద్వారం లాంటివాడు. ఈ స్థితిలో జీవుడు జాగ్రదావస్థలో ఆచరించిన కర్మలవల్ల, ఆలోచనలవల్ల మనసుపై పడిన ముద్రలు మరియు స్వప్నావస్థలో మనసు ప్రోదిచేసుకున్న ముద్రలు అన్నీ సుషుప్తి అవస్థలో అంతశ్ఛేతనలో కలసిపోతాయి లేదా కరగి పోతాయి.
            జాగ్రత్, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థలలో జీవగత ఏడు అవయవాలు, పందొమ్మిది నోళ్ళు నిద్రావస్థలో ఉన్నా "ఆత్మ" జాగ్రతమయే ఉంటుంది. జాగ్రదావస్థలో తెలుసుకునే వాడు, తెలుసుకోదగినది స్పష్టంగా ఉండడం వల్ల; స్థూల అనుభవాలను అనుభవిస్తూ ఉంటుంది.  స్వప్నావస్థలో మనస్సు తనలోకాన్ని తానే నిర్మించుకొనడం వల్ల; తానే జ్ఞాతగా (తెలుసుకునేవాడు) జ్ఞేయంగా (తెలుసుకునేది) ఉండడం వల్ల; సూక్ష్మ అనుభవాలను అనుభవిస్తూ ఉంటుంది. సుషుప్త్యావస్థలో జ్ఞాత స్పష్టంగా ఉండి జ్ఞేయం అస్పష్టతను సంతరించుకోవడం వల్ల ఆనందానుభవాలనూ అనుభవిస్తూ ఉంటుంది.
            మరొక్క విషయాన్ని ఇక్కడ చర్చించుకోవాలి. మనం స్వప్నావస్థలో కలలు కంటాం. ఆ కలలలో కలిగే అనుభవాలన్నింటినీ అనుభవిస్తాము. సంతోషాన్ని, బాధను, దుఃఖాన్ని, భయాలనూ ఇలా ఏది కలిగినా ఆ అనుభూతులను అనుభవిస్తాము. కలలో కలిగే ఆ అనుభవాలు అసత్యమైనవిగా అనుకోము. కలనుండి మెలుకువ వస్తే ఆ అనుభవాలను ఆస్వాదించలేము. అలాగే గాఢనిద్రలో ఆనందాన్నీ అనుభవిస్తాము. సుషుప్తి నుండి నిద్రావస్థలో చేరితే ఆ గాఢ నిద్రలో కలిగిన ఆనందానుభూతి లయమౌతుంది. సత్యం కానటువంటి అనుభవాలు స్వప్నావస్థలో, సుషుప్త్యావస్థలో కలిగినా వాటి యదార్ధ జ్ఞానాన్ని ఆయా  అవస్థలలో గ్రహించలేము. ఎప్పుడైతే జాగ్రదావస్థకు చేరుకుంటామో అప్పుడు మాత్రమే ఆ జ్ఞానానుభవాన్ని ఆస్వాదించగలుగుతాము.
ఇప్పుడు ఒక ప్రశ్న. ఈ అనుభవాలను అనుభవిస్తున్నది ఎవరు? జాగ్రదావస్థలో ఆ అనుభవాలను గుర్తుచేసుకునే వైశ్వానరుడా? స్వప్నావస్థలో అనుభవించే  తేజసుడా? లేక సుషుప్త్యావస్థలో అనుభూతిచెందే ప్రాజ్ఞుడా? నిజానికి ఈ ముగ్గురూ కాదు. మరి ఎవరు? ఈ మూడు ఎవరిలోనైతే లయమౌతాయో ఆ జీవుడే అనుభవిస్తున్నాడు. జీవాత్మ అనుభవిస్తుంటాడు, పరమాత్మ సాక్షీభూతుడుగా ఉంటాడు. భౌతిక జీవనంలో కలిగే అనుభవాలు మనసులో నాటుకు పోవడం ద్వారా స్వప్నాలుగా మారుతాయి. ఈ స్వాప్నిక అనుభూతులు గాఢ నిద్రలో ఉండవనేందుకు లేదు. ఎందుకు? మనసు ఉంటుంది, మనసులో ఉండే ముద్రలూ అలాగే ఉంటాయి కాబట్టి. మరి అలాంటప్పుడు ఎందుకు అనుభవించము? అంటే ఆ అనుభూతులు ప్రచ్ఛన్నంగా లేదా అంతర్లీనంగా ఉండడం వల్ల అనుభవానికి అందవు.
            నిజానికి జాగ్రత్ స్వప్న సుషుప్తి ఈ మూడు దశలూ జీవాత్మకు సంబంధించినవి. వీటిలో సంచరించేది వరుసగా వైశ్వానరుడూ, తేజసుడు, ప్రాజ్ఞుడు అనుకున్నాం. ఇది జీవాత్మకు సంబంధించినదైతే మరి పరమాత్మకు సంబంధించినవేవి? (మనం సాధారణంగా అర్ధం చేసుకునేందుకు; జీవాత్మ భౌతిక వ్యాపారంగా, పరమాత్మ లేదా "బ్రహ్మణ్" ఆధ్యాత్మిక వ్యాపారంగా చూద్దాం) ఈ మూడు అవస్థలను "బ్రహ్మణ్" పరంగా "విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర" పదాలతో వ్యక్తీకరిస్తారు లేదా గుర్తిస్తారు. అలాగే జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు తురీయావస్థలో లీనమైన విధంగానే విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర అవస్థలు లేదా పాదాలు లేదా దశలు బ్రహ్మణ్ లో లయమౌతాయి. అందువల్ల అనంత చైతన్యమైన బ్రహ్మ పదార్ధం ఏదైతే ఉన్నదో అది మాత్రమే ప్రకాశిస్తుంది. దీనిని అక్షరాలతో కాక అనుభూతితో అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అద్వైత సిద్ధి లభిస్తుంది.
            ఇక నాలుగవదీ, చివరిదీ అయిన తురీయావస్థను గూర్చి చెపుతుందీ ఉపనిషత్తు. జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు మూడూ ఒకదానిలో ఒకటి లయమయి నాక ఏర్పడినదే నాలుగవ అవస్థ. ఒక వృత్తాన్ని నాలుగు భాగాలు చేయాలి అంటే నాలుగు వృత్తాలనూ కత్తిరించాల్సిన అవసరం లేదు. పెద్ద వృత్తంలో నుండి మూడు వృత్తాలను కత్తిరించేస్తే అది నాలుగు భాగాలుగా కనిపిస్తుంది. ఇప్పుడు కత్తిరించిన మూడు భాగాలను ఒక దానిలో ఒకటి అమరిస్తే అది ఒకటిగా మారిపోతుంది. మూడు అవస్థలను ముందు విడివిడిగా గుర్తించాము. ఇప్పుడు ఆ మూడింటినీ ఒకదానిలో మరియొకటి లయం చేసాము. అప్పుడు అది ఒకటిగానే భాసిస్తుంది. అదే తురీయావస్థ.
            "న అంతః ప్రజ్ఞం" అంతరమైన చేతన కాదు; "నబహిః ప్రజ్ఞం" బాహిరమైన ప్రజ్ఞ కాదు; "న ఉభయతః ప్రజ్ఞం" ఈ రెండూ అయిన చేతనకాదు; "న ప్రజ్ఞాన ఘనం" ఘనీభవించిన చేతనా కాదు; "న ప్రజ్ఞం" సమష్టి చేతనా కాదు; "న అప్రజ్ఞం" అచేతనమూ కాదు; "అదృష్టం" కనిపించనిదీ; "అవ్యవహార్యం" ఫలానా దానితో దీనికి ఈ సంబంధం ఉంది అని సంబంధాలను ఏర్పరచలేనిది; ’అగ్రాహ్యం" మనసుతో గ్రహించ లేనిది; "అలక్షణం" ఏ లక్షణములూ లేనిది; "అచింత్యం" ఊహించలేనిది; "అవ్యపదేశ్యం" దీని హద్దులు ఇవి అని నిర్దేశింపలేనిది; "ఏకాత్మ ప్రత్యయసారం" అన్ని అవస్థలలో అవిచ్ఛిన్నమై లేదా ఎడతెగకుండా లేదా అనుస్యూతమై ఉన్నటువంటి ఒకే ఆత్మతత్త్వపు సారం; "ప్రపంచోపశమం" మూడు అవస్థలు అనే మూడు ప్రపంచాలు తనలో లయం చేసుకొని వాటిని ఉపశమింపచేసేదీ; "శాంతం" ప్రశాంతమైనదీ; "శివం" ఆనంద మయమైనదీ: "అద్వైతం" తనకు భిన్నమైనది మరొకటి లేనిదీ ఏదైతే ఉన్నదో అదే నాలుగవది లేదా తురీయమని వివేకవంతులైన ఋషులు భావిస్తారు. అదే "ఆత్మా". "సః" అతడినే; "విజ్ఞేయః" తెలుసుకోవలసినవాడు. అన్నింటినీ "ఇది కాదు" "అది కాదు" అంటున్నప్పుడు మరి ఏది ఔను? దానిని తెలుసుకోవడం ఎలా? ఆన్ని అవస్థలలో ఒక పూలదండలో దారం లాగా అనుస్యూతంగా ఉన్న ఆత్మ తత్వసారం అవగతం చేసుకుంటే "ఔననేది" ఏదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగని ఆ ఆత్మ తత్వసారం తురీయావస్థగా చెప్పలేము. అందుకే ఔనని కాని కాదని కాని రెండవ ప్రత్యామ్నాయమేదీ లేకుండా ఏదైతే విశ్వవిశ్వాంతరాలలో ఏకోన్ముఖమై భాసిస్తుందో అదే పరమాత్మ అన్నారు. దానినే సకల వ్యాపితమూ, సర్వ శక్తి సమన్వితమూ, సకలజ్ఞాన సమోపేతమూ (Omnipresent, Omnipotent and Omniscient) అయిన బ్రహ్మంగా చెపుతారు.
            ఆరంభంలోనే "ఓం ఇత్యేతదక్షర మిదగుం సర్వం" అంటూ ఆరంబించిందీ ఉపనిషత్తు. ఓంకారమే విశ్వాత్మకు ప్రతీక అంటుంది. ఓంకారం శబ్దం విశ్వాత్మకు ప్రతీకగా చెప్పినప్పుడు ఆయా అవస్థలనూ దీనికి సమన్వయం చేయాలి. ఓంకారంలో "అ, , మ" లనేవి మూడు భాగలు. అలాగే జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలకు వైశ్వానర, తేజస, ప్రాజ్ఞులు మూడూ పాదాలుగా చెప్పబడ్డారు. అందుకే వారిని వరుసగా అ కార ఉ కార మ కారాలకు అన్వయిస్తుంది ఈ ఉపనిషత్తు.  అ కారం ఆది వర్ణం. భాషలో పలికే మొదటి అక్షరం. నోరు తెరవగానే మొదటగా వచ్చే శబ్దం అ కారమే. నోరు తెరవకుండా ఏ శబ్దాన్నీ పలకలేము కాబట్టీ అ కారం అన్ని పదాలలో అంతర్గతంగా ఉంటుంది కాబట్టి కారాన్ని జాగ్రదవస్థకు అన్వయం చేసిందీ ఉపనిషత్తు. అందువల్ల వైశ్వానరుడు అంతటా వ్యాపించి ఉన్నాడంటుంది. అంతేకాక ఏ అవస్థలో కలిగిన అనుభవాన్నైనా తెలుసుకోవడం జాగ్రదావస్థలోనే సాధ్యపడుతుంది కాబట్టి దీనిని ముందుగా కారానికి అన్వయించింది.
            ఇక జాగ్రదావస్థకు, సుషుప్తికి మధ్యన ఉన్నది స్వప్నావస్థ. అలాగే అ కార, మ కారాలకు మధ్యన ఉన్నది కారం. కాబట్టి స్వప్నావస్థలో సంచరించే తేజసునికి కారంతో సమన్వయం చేశారు. మరొక్క ఉదాహరణను కూడా చెపుతున్నారిక్కడ. స్వప్నంలో కనిపించేదంతా ఒక భావానికి సంబంధించినదే కాని యదార్ధం కాదు. స్వాప్నికమైన ప్రపంచం ఎలాగైతే సత్యం కాదో అలాగే మాయావృతమైన ఈ జగత్తు కూడా అభాస మాత్రమే అనే విషయాన్ని అవగతం చేయడం వల్ల తేజసుని యొక్క శ్రేష్ఠత జిజ్ఞాసువులకు అవగాహనలోకి తెచ్చింది.
            చివరగా సుషుప్తి సంచార స్థానంగా కలిగినవాడు ప్రాజ్ఞుడు కారంతో అన్వయించబడ్డాడు. ఓంకారాన్ని ఉచ్చరించే సమయంలో కారం కారంలో లయమౌతుంది. తదుపరి ఆ రెండూ మకారంలో లయమౌతాయి. కనీసం అలా వినిపిస్తుంది. మళ్ళీ ఆ "మ" కారం నుండే కారం, “ కారం వెలుగు చూస్తుంది. ఎలాగైతే "అ"కార, "ఉ"కారాలు వెలుగుచూసేందుకు "మ" కారం ఉపాధి అవుతుందో, అలాగే సుషుప్తిలో లయమైన జాగ్రత్ స్వప్నావస్థలు మళ్ళీ సుషుప్తినుండే వెలుగు చూస్తాయి. ఈ విషయం చెపుతూ ఉపనిషత్తు ఒక చక్కని ఉదాహరణ నిస్తుంది. కొలత పాత్ర తనలో ధాన్యాన్ని నింపుకుంటుంది. ఆ ధాన్యాన్ని వేరే చోట పోస్తుంది, మళ్ళీ నింపుకుంటుంది... మళ్ళీ పోసేస్తుంది. అలాగే మూడవ అవస్థయైన సుషుప్తి మరియు ఓంకారం లోని మ కారమూ తమలో మిగతా రెంటినీ లయం చేసుకుంటాయి మళ్ళీ అందులో లయమైన రెండూ అందులోనుండే వెలుగు చూస్తాయి.
            అలాగే మరొక ఉదాహరణ; పూవు పిందలో కలుస్తుంది. పింద కాయలో కలుస్తుంది. కాయ పండులో కలుస్తుంది. పండు విత్తనంగా మారుతుంది.
జాగ్రదావస్థ స్వప్నావస్థలో ఈ రెండూ సుషుప్తిలో కలుస్తాయి. మళ్ళీ సుషుప్తినుండి జాగ్రత్తు స్వప్నం ఆవిష్కృతమౌతాయి
            అన్నింటికీ తురీయావస్థ ఉన్నట్లుగానే ఓంకారానికీ తురీయావస్థ ఉన్నది. అదే శబ్దాతీతమైన ఓంకారం. ఈ ఓంకారమే ఆత్మ. ఆ ఆత్మను తెలుసుకున్న వారే పరమాత్మను చేరుకుంటారంటున్నది, ఈ ఉపనిషత్తు.
            వైవిధ్య భరితమైన ప్రకృతి యావత్తూ ఒక క్రమ పద్ధతిలో కూర్చబడింది. అనంతమైన పదార్ధం (Matter), జీవకోటి (Living creatures) అన్నీ ఒకే చోట సహజీవనం చేస్తూ ఉన్నా తమ తమ ప్రత్యేకతలను నిలుపుకోగలుగుతున్నాయి. అలా ఉండడం మూలాననే ఈ సృష్టిలో సమగ్రత ఉంది, సంయమనత ఉంది. దీనికి ఆధారభూతమైన దేమిటి? ఒక పూలదండలో వివిధరకాలైన పూలను గ్రుచ్చాము. మనం వాటి రంగులు, వాసనలు, అందాలు చూస్తాం, ముగ్ధులమౌతాం. అందులో ఏది ఉత్తమమైనది అంటే ఏ పూల సౌకుమార్యం ఆ పూలకే. ఒకదానిని మించి మరొకటి మనోహరంగా కనిపిస్తున్నాఅలాంటి పూవులన్నీ కలవడం మూలాననే ఆ దండ యొక్క అందం ద్విగుణీకృతమైంది. ఆ దండ అందం యొక్క సారం లేదా ప్రాముఖ్యతను నిలిపేది; అన్నింటినీ నియమ బద్ధంగా, పద్ధతి ప్రకారంగా దేని తరువాత ఏది ఉండాలో, ఎలా కలిపి ఉండడం వల్ల అందం ఇనుమడిస్తుందో ఆ క్రమంలో కూర్చిన పరిజ్ఞానానిది మరియు ఆలంబనమైన దారానిదే. మనం ప్రత్యక్షంగా కనిపించే ఆ దండయొక్క అందాన్ని చూస్తామే కాని దానికి ఆలంబనమైన దారాన్ని పట్టించుకోము. ఇక్కడ ప్రతి పూవూ దారాన్ని ఆలంబనగా చేసుకొని దండ ఆకృతిగా పరిణామం చెందింది. దానివల్ల ఆ పూవుల విలువ పెరిగింది. దీనినే Value addition అంటాం. అలాగే ప్రకృతిలో కనిపించేది కనిపించనిది అన్నీ కూడా పరమాత్మచేత సూత్రీకరింపబడ్డవే. అన్నీ కలవడం వల్ల ప్రకృతి సమగ్రతను పొందింది లేదా ప్రకృతి సమగ్రతను సాధించేందుకు అన్నింటినీ క్రమ పద్ధతిలో జోడించింది.
            ఈ మాండుక్యోపనిషత్తు పరిణామంలో చిన్నదే అయినా ప్రతిపాదించిన విషయం గహనమైనది, లోతైనది. దీనిని అర్ధం చేసుకోవడంలోని క్లిషతను తొలగించే ప్రయత్నంలో భాగంగా శ్రీ గౌడపాదులు దీనికి అనుబంధంగా ఒక కారికను చెప్పారు. కారిక అంటే వ్యాఖ్య. ఇందులో నాలుగు ప్రకరణాలు ఉన్నాయి. మొదటిది ఆగమ ప్రకరణం, రెండవది వైతథ్య ప్రకరణం, మూడవది అద్వైత ప్రకరణం చివరగా నాలుగవది అలాత శాంతి ప్రకరణం. ఈ నాలుగు ప్రకరణాలు ఆలంబనగా చేసుకొని ప్రణవోపాసన ద్వారా తురీయ అవస్థను చేరుకునే విధానాన్ని చెప్పారు, శ్రీ గౌడపాదులు. ఈ కారికలలో సూచింప బడిన విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
            మొదటగా... ఆగమ ప్రకరణము. ఇది పూర్తిగా ఉపనిషత్తు ప్రతిపాదించిన విషయంపైనే ఆధారపడి అందులోని అంశాలను విస్తరించి చెప్పింది. జాగ్రదవస్థలో ఉన్న వ్యక్తి సమాజంలో తనకున్న స్థితిని బట్టి ఒక స్థాయిలో ఉన్నాడనుకుందాం. ఆ అవస్థలో అతను నిర్వహించే పనులు, దాని వల్ల వచ్చే ఫలితాలు అతను అనుభవిస్తుంటాడు. కాని ఆ అనుభవాలన్నీ అతడు నిద్రించిన సమయంలో ఏమవుతున్నాయిఆ అనుభవాలు అన్నీ మనసులో నిక్షిప్తమవడం వల్ల స్వప్నంలో దర్శనమిస్తున్నాయి.  కర్త అంటే జాగ్రదవస్థలో అనుభవాలను పొందిన వ్యక్తి, స్వప్నంలో ఆ అనుభవాలను పొందు తున్నాడా? అంటే లేదనే చెప్పాలి.
ఉదాహరణకు జాగ్రదవస్థలో అతనికి వ్యాపారంలో ఒక లక్ష రూపాయలు లాభం వచ్చింది. సంతోషించాడు. బాంకులో ఆ డబ్బు చేరింది. వేరొక సమయంలొ ఒక లక్ష నష్టం వచ్చింది. తన ఖాతా నుండి ఆ డబ్బు పోయింది. లాభాన్ని పొందినప్పుడు సంతోషించాడు అలాగే నష్టపోయినప్పుడు బాధపడ్డాడు. ఇక్కడ లాభనష్టాలు సాపేక్షమే కాని అనుభవం సత్యమే. ఇదే అనుభవం స్వప్నంలో కలిగితే అతడు ఆ అవస్థలో సంతోషపడడమో బాధపడడమో చేస్తాడు కాని స్వప్నావస్థ నుండి జాగ్రదావస్థకు రాగానే ఆ అనుభవాన్ని పొందడు. ఎందుకంటే, ఆ లాభ నష్టాల ప్రభావం తన బాంకు ఖాతాపై లేదు. జాగ్రతావస్థలో కర్తగా అనుభవాన్ని పొందిన వ్యక్తి స్వప్నావస్థలో ఆ అనుభవాన్నే పొందినా అది యదార్ధం కాదని తెలుసు కుంటున్నాడు. అంటే స్వప్నంలో కలిగిన అనుభవం తనది కాదనేది తేటతెల్లమవుతుంది. తనది కాకపోతే మరి ఎవరిది? అంటే జాగ్రదవస్థలోని వ్యక్తి స్వప్నావస్థలో మాయమవుతున్నాడు. స్వప్నావస్థలో మరొక వ్యక్తి ఆ అనుభవాన్నిపొందుతున్నాడు.
అలాగే గాఢనిద్రలో లేదా సుషుప్తిలో స్వప్నావస్థలో పొందిన అనుభవం కూడా కనిపించదు. గాఢనిద్రలో ఏ అనుభవం ఉండదనుకోవద్దు. ఆ అవస్థ నుండి మేల్కొనిన వెంటనే ఆ గాఢనిద్రలో కలిగిన ప్రశాంతతను అనుభవిస్తున్నాడు. కాని ఆ అనుభవాన్ని పొందేది జాగ్రదవస్థలో అనుభవాన్ని పొందిన వాడు కాదు, స్వప్నావస్థలో అనుభవాన్ని పొందిన వాడూ కాదు. అంటే ఏ అవస్థలో అనుభవాన్ని పొందే వాడయినా ఆ అవస్థకే పరిమితం కాని మరో అవస్థలో ఆ అనుభవాన్ని పొందడు.  కాబట్టి అతనిని "అనిత్యుడు" అన్నారు. నిత్యము అంటే శాశ్వతము, ఎప్పుడూ ఉండేది. శాశ్వతం కానివాడు అనిత్యుడు. ఆ అనిత్యుడైన కర్తను "అహం" అని వ్యవహరిస్తుంది, ఉపనిషత్తు.
ఇంద్రియాల (Senses) అనుభవం వల్ల జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం వల్ల గుర్తు చేసుకుంటాము. మన ఇంద్రియాల (Senses) ద్వారా పొందిన అనుభవాలు ఒక మనో చిత్రంగా రూపుదాల్చి మెదడులో ని క్షిప్తమౌ తాయి. అలా మెదడులో పొందుపరచబడిన సమాచారమే జ్ఞాపకం. పరిశీలన (Observation), గ్రాహ్యత (Perception), అవగాహన చేసుకోవడం (Comprehension), లయం చేసుకోవడం లేదా జీర్ణం చేసుకోవడం (Absorption), మెదడులో నిక్షిప్తం చేసుకోవడం (Retention), పునస్సమీక్షించుకోవడం ద్వారా సమాచారాన్ని బలోపేతం చేసుకోవడం (Rejuvenation), అవసరానికి ఉపయోగించుకోవడం (Utilisation) ఈ ఏడు అలవాట్ల వల్ల జ్ఞాపకం చేసుకున్న సమాచారం నిరంతరం గుర్తుండడమే కాక అవసరానికి ఉపయోగించుకోగలుగుతాము.
గాఢ నిద్రలో కూడా చైతన్యం ఉంది. అయితే జాగ్రత్ అవస్థలో, స్వప్నావస్థలో ఉండే కర్త గాఢ నిద్రలోని చైతన్యంలో లయమవుతున్నాడు. మరలా మెలుకువ రాగానే కర్త మరియు అహం ఈ రెండూ ఆవిష్కృత మౌతున్నాయి. అందుకే సుషుప్తిలో సంచరించే వాడు ఈశ్వరుడు అన్నారు. ఆ ఈశ్వర చైతన్యమే విరాట్ స్వరూపంగా, హిరణ్యగర్భ స్వరూపంగా జాగ్రత్ స్వప్నావస్థలలో అనుభవాల నిస్తుంది. అయితే, అన్నిఅవస్థలలో సాక్షీభూతుడుగా ఉంటూ మూడు అవస్థలలో నిత్యుడై నిలిచేవాడు ఎవరు? మూడు అవస్థలకూ సాక్షీభూతుడుగా నిలుస్తూ, జీవుని అనుభవాలకు అతీతంగా వ్యవహరించే వాడొకడున్నాడు. అతనినే  "ఆత్మ" అంటూ చెపుతూంది ఉపనిషత్తు.
            మరొక ముఖ్య విషయం ఏమిటంటే... తురీయమనేది గుర్తింపుకోసం నాలుగవ అవస్థగా చెప్పినా నిజానికి అది ఏ అవస్థ కాదు.  
            రెండవది వైతథ్య ప్రకరణం. ద్వంద్వ రూపమైన జగత్తు లేదు ఉన్నది ఒకటే కాబట్టి జగత్తు అనేది మిథ్య అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈ ప్రకరణం కాబట్టి దీనిని వైతథ్య ప్రకరణం అన్నారు. వితథము అంటే అసత్యము. అసత్యానికి సంబంధించినది కాబట్టి వైతథ్యము.
స్వప్నావస్థలో కనిపించేదంతా ఒక భావన మాత్రమే. అంతర్లీనంగా మనసులో నిక్షిప్తమైన ఆలోచనలు తీవ్రమైనప్పుడు కలల రూపంలో బహిర్గతమౌతాయి. నిద్రలో శారీరక భాగాలన్నీ విశ్రాంతిగా ఉన్న సమయంలో మనసు మాత్రమే జాగ్రతమై ఉండడం, అందులో తీవ్రమైన కోరికల ప్రకంపనలు తొందరించడం వల్ల కలలు కనడం జరుగుతుంది. కలలో కనిపించింది అంతా యదార్థం కాదు, ఒక భావనామయమైనది మాత్రమే అనేది అందరూ ఒప్పుకునేదే. ఎలాగైతే భావనామయ ప్రపంచంలో స్వప్నావస్థ ఉంటుందో అలాగే జాగ్రదావస్థ కూడా ఒక భావన మాత్రమే అంటే చాలామంది ఒప్పుకోరు. ఎందుకని అంటే జాగ్రత్తగా రెంటినీ పోల్చి చూచేందుకు కావలసిన ఓపిక లేకపోవడం వల్ల. శరీరంలో చర్య ప్రతిచర్యలు ఎలా జరుగుతాయి? కన్నులు చూస్తాయి. నరాల ద్వారా ఆ విషయాన్ని మెదడుకు చేరవేస్తాయి. మెదడు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానుసారంగా ఆయా శరీరభాగాలు పనిచేస్తాయి. ఇది శాస్త్రీయమైన అంశమే. అప్రస్తుతమే అయినా ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం.
            బాహ్యంగా ఒక సంఘటన జరిగింది. ఉదాహరణకు మనం రోడ్డుపై వెళుతున్నాము. ఐస్ క్రీం షాపు కనిపించింది. తినాలనిపించింది. వెళ్ళాము తినేసాము. ఇది మామూలు క్రియగానే (ఆక్టివిటి) కనిపిస్తుంది. ఇందులో జరిగే మెకానిజం ఏంటో చూద్దాం.  ఐస్ క్రీం షాపు కనిపించడం అనేది బాహ్య ప్రపంచంలో జరిగే ఒక సంఘటన. ఇది మొదటి క్రియగా చెప్పుకుందాం. కనులు చూసాయి, నాలుకకు ఐస్ క్రీం తినాలనిపించింది. ఇది రెండవ ఆక్టివిటి. శరీరంలో దానికి సబంధించిన నోరూరడం లాంటి మార్పులు కలిగాయి.  ఇది మూడవ ఆక్టివిటి. శరీరం మనసుతో సంప్రదించింది. ఇది నాలుగవ ఆక్టివిటి. మనసు ఒక నిర్ణయం తీసుకుంది. ఇది అయిదవ ఆక్టివిటి. తదనుగుణమైన సందేశం శరీరానికి చేరవేయబడింది. ఇది ఆరవ ఆక్టివిటి. ఆ సూచనకనుగుణమైన మార్పులు శరీరంలో వచ్చాయి. ఇది ఏడవ ఆక్టివిటి. శరీరం బాహ్య ప్రపంచంతో సంప్రదించింది. ఇది ఎనిమిదవ ఆక్టివిటి. ఐస్ క్రీం తినడం జరిగింది. ఇది తొమ్మిదవ ఆక్టివిటి. ఇందులో రెండు, మూడు, నాలుగు ఆక్టివిటీలు జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి కాగా ఆరు, ఏడు, ఎనిమిదివ ఆక్టివిటీలు కర్మేంద్రియాలకు సంబంధించినవి. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని పంపిస్తాయి, కర్మేంద్రియాలు కార్యాన్ని నిర్వహిస్తాయి. మనసు నిర్ణయాలను తీసుకుంటుంది.
            ఇక్కడ మనం గమనింపవలసిన అంశం ఏమిటంటే.... బాహ్యంగా మనకు కనిపించే వస్తువుల ప్రభావం అనుభూతులుగా మనసులో నిలిచిపోతుంది. అయితే అది వస్తువులుగానే ఉండాల్సిన అవసరంలేదు. మనం  దాన్ని చూడాల్సిన అవసరమూ లేదు. రోడ్డుపై వెళుతుంటాం. ఎవరి ఇంటిలోనో జిలేబీ చేస్తున్నారు ఆ వాసన ముక్కులు గ్రహించాయి. ఆ భావన కూడా మనసుకు చేరుతుంది. ఆ భావనకు సంబంధించిన రూపం, లోగా మనకు పరిచయమైనదైతే, మనసులో ఆవిష్కృత మౌతుంది. పరిచయం లేనిదైనా... దానికి ఒక ఊహా చిత్రం మనసులో తయారవుతుంది.
            ఇప్పుడొక విషయాన్ని ఆలోచిద్దాం. కలలో బాహ్య వస్తువు యొక్క భావనలు లేకున్నా మనం ఆ అనుభూతులు అనుభవించినప్పుడు, జాగ్రదవస్థలో అలా ఎందుకు జరగదు లేదా జరగకూడదు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే... మనం చూస్తున్న వస్తువు మన కన్నా భిన్నమైనది అనే అనుభూతి ఈ రెండు అవస్థలకూ సమానమే. జాగ్రదావస్థలో మనం చూసే వస్తువులు మనకే కాక ఇతరులకూ కనిపిస్తాయి. అయితే మనం చూసే విధంగానే ఎదుటి వారు చూస్తారా లేదా మనకు కనిపించినట్లుగానే ఎదుటివారికి అవి కనిపిస్తాయా అంటే ఔనూ అని ఖచ్చితంగా చెప్పలేము. కనిపించకపోవచ్చు కూడా. ఎందుకంటే ఒక్కొక్కరు ఆ వస్తువును గుర్తుపెట్టుకునేందుకు వారి వారి మనోఫలకాలపై ఒక్కొక్క విధంగా చిత్రించు కుంటారు. అలాగే మనం ఏదో కలను కంటాం. ఆ కలలో ఎందరినో చూస్తాం. ఎందరో ఒకరి నొకరు ఆ కలలో చూచుకుంటారు. అప్పుడు కలలో వ్యక్తులు లేదా వస్తువులు కలలో మనకు కనిపించినట్లుగానే కలలో ఉన్న ఇతర వ్యక్తులకు కనిపిస్తాయా అంటే కనిపించవనే సమాధానం. కాని మనం ఆ వస్తువులు కాని మనుషులు కాని మనకు కనిపించినట్లుగానే ఇతరులకూ కనిపిస్తాయని అనుకుంటాము. అలా అనుకోకపోతే ఆ వస్తువులతో కాని వ్యక్తులతో కాని సంబంధం పెట్టుకోలేము. అది కలలోనైనా సరే.
            ఇక కాలానికి సంబంధించిన చర్చ…
            కాంతి యొక్క వేగము సుస్థిరంగా ఉంటుంది మరియు ఏదో అదృశ్య శక్తి కాంతి యొక్క వేగాన్ని నిశ్చల స్థితిలో ఉంచుతుంది అంటాడు ఆల్బర్ట్ ఐన్ స్టీన్. ఆ అదృశ్య శక్తినే శూన్యం అంటున్నాడు, ఐన్ స్టీన్. (The speed of the light is constant and some force which is not known is making the speed of light constant. The unknown factor which is causing to make the speed of the light constant is Space) ఆ అదృశ్య శక్తినే మనం భగవంతుడు అంటున్నాము, ఆత్మ అంటున్నాము లేదా పరమాత్మ అంటున్నాము.
            శూన్యంలో వేగంగా ప్రయాణించే కొద్దీ కాల గమనం లేదా వేగం మందగిస్తుంది లేదా తగ్గిపోతుంది. ఏ సాంకేతిక విజ్ఞానం ద్వారా నైనా ఒకవేళ మనం కాంతివేగంతో పయనించ గలిగితే అక్కడ కాలం పూర్తిగా ఆగిపోతుంది. అలాగే కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించ గలిగితే గతించిన కాలంలోనికి కూడా వెళ్ళవచ్చునంటాడు, ఐన్ స్టీన్.
ఉదాహరణకు... మనం ఒక బస్సులో ప్రయాణిస్తున్నాము. ఆ బస్సు వేగం గంటకు 70 కి. మీ. అనుకుందాం. అలాగే మన ప్రక్కనే మరొక బస్సు వెళుతుంది. ఆ బస్సువేగం కూడా గంటకు 70 కీ.మీ. అనుకుందాం. ఇప్పుడు మనం వెళుతున్న బస్సులో నుండి ప్రక్క బస్సును చూస్తే ఆ బస్సు ఆగిపోయినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఏం నిరూపితమవుతుంది అంటే....  కాలంతో సమంగా మనం ప్రయాణించ గలిగితే కాలం ఆగిపోతుంది. 
స్వప్నంలో జరిగే అనుభవాలు కొద్ది కాలానికే పరిమితం కాగా జాగ్రదావస్థలో జరిగేవి చాలా కాలం ఉంటాయనేది ఒక ఆలోచన. నిజానికి అది సత్య దూరం మాత్రమే. ఎందుకని? జాగ్రత్ స్వప్న అవస్థలలోని కాలమానాలలో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాలతో పోల్చి చూస్తే... స్వప్నావస్థలోని కాలమానం ప్రకారం స్వప్నావస్థలోని విషయాలూ దీర్ఘకాలం ఉన్నట్లే. ఈ రెంటి కాలమానాలు ఒకటి కావు కాబట్టి నిజానికి రెంటినీ ఒకే కాలమాన కొలతలతో పోల్చడం సమంజసమూ కాదు. జాగ్రదావస్థ కాలమానం ప్రకారం స్వప్నావస్థ కాలాన్ని కొలిస్తే స్వప్నావస్థ కాలం నిలవదు కాబట్టి అది మిథ్య అనిపిస్తుంది. అలాగే స్వప్నావస్థ కాలమానం ప్రకారం జాగ్రదావస్థ కాలాన్ని కొలిస్తే జాగ్రదావస్థ కాలం నిలవదు కాబట్టి అది మిథ్య అనిపిస్తుంది. అంటే ఒకదానితో మరొకటి కొలిస్తే ఒక అవస్థ మిథ్యగా తేలుతుంది.
            ఈ ఆలోచన లేదా ఈ హేతు బద్ధ తార్కిక విధానం కాలానికి మాత్రమే పరిమితమా? దేశనిమిత్తాలకు అన్వయమౌతుందా? అంటే... ఔననే సమాధానం. ఎలాగో పరిశీలిద్దాం. కలలో మనం చూచే ప్రదేశాలు, వాటి మధ్య దూరాలు, కార్య కారణ సంబంధాలు... ఇవేవీ జాగ్రదావస్థలో మనం చూచే ప్రదేశాలు, వాటి మధ్య దూరాలు, కార్య కారణ సంబంధాలతో సరిపోలవు. అంటే ఏ అవస్థలో కలిగే అనుభవాలు ఆ అవస్థకు మాత్రమే పరిమితం. ఎందుకు? అంటే ఏ అవస్థలకవే స్వతంత్రాలు కాబట్టి. ఒక అవస్థలో కలిగే అనుభవాలు నిజమని మనం నమ్మితే రెండవ అవస్థలో కలిగే అనుభవాలు కూడా నిజమనే నమ్మాలి. అంతేకాదు, ఉదాహరణకు, జాగ్రదావస్థలో కలిగే అనుభవం మనకు న్యాయం అనిపించ వచ్చు. అదే అనుభవం స్వప్నావస్థలో అన్యాయమూ అనిపించవచ్చు. అలాగే అనుభవాలు కూడా. ఒక అవస్థ అనుభవాలు మరొక అవస్థలో అన్యాయంగా తోచవచ్చు. అంటే ఒక అవస్థలో కలిగే అనుభూతి మరొక అవస్థలో అభాసగా మారుతుంది. వైరుధ్యం ఉన్నదగ్గర ఒకదాని నొకటి ఖండించుకోవడం జరుగుతుంది.
            మరొక ఆలోచన... జాగ్రదావస్థలో ఉన్నప్పుడు ఈ దృశ్యమాన ప్రపంచం అంతా ప్రతీక్షణం ఒక్కటిగానే ఉంటుంది. కాని స్వప్నావస్థనుండి మేల్కొన్న ప్రతి సారీ వేరువేరుగా దర్శనమిస్తుంది. అంటే ఒకసారి కనిపించిన ప్రపంచం మరొక సారి కనిపించదు. అప్పుడు ఈ రెంటి అవస్థల మధ్యన పోలిక ఎలా? అంటే జాగ్రదావస్థలో ఉండే వ్యక్తి తన "జీవిత కాలం"లో హైదరాబాద్, ఢిల్లీ, అమెరికా, రష్యా లాంటి ప్రదేశాల నెలాగైతే చూస్తాడో, అలాగే స్వప్నావస్థలో ఉండే వ్యక్తి ఆ తన "స్వప్నకాలం"లో ఆ స్వప్న ప్రపంచంలో కనిపించే వివిధ ప్రదేశాలలో విహరిస్తుంటాడు. జాగ్రదావస్థలో ఎలాగైతే భౌతిక ప్రదేశాలను దర్శిస్తాడో అలాగే స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని దర్శిస్తాడు. భౌతిక జీవనం ఎలా సాగుతుందో స్వాప్నిక జీవనం కూడా అలాగే సాగుతుంది. ఒకదానికొకటి పోలిక లేదు. ఎలాగైతే భారతదేశంలో నివసించే పరమ నైష్ఠికుడైన ఒక హిందువు జీవనాన్ని, అమెరికాలో నివసించే పరమ నైష్టికుడైన ఒక క్రిస్టియన్ జీవనయానంతో పోల్చలేమో అలాగే జాగ్రత, స్వాప్నిక జీవితాలలోని అనుభవాలనూ పోల్చలేము. మనం ఒక సామెతను విన్నాం, కలలో కనిపించే మంచినీళ్ళతో దాహం తీరదని. కాని జాగ్రత్తగా ఆలోచిస్తే జాగ్రదావస్థలోని నీరు కూడా స్వాప్నికావస్థలోని దాహాన్ని తీర్చదు కదా. అంటే ఏ అవస్థలో దాహం వేస్తే ఆ అవస్థలోని నీటితోనే దాహాన్ని తీర్చుకోవాలే కాని మరొక దానితో తీర్చుకునే అవకాశం లేదనేది స్ఫష్టమవుతుంది.
            దేని ఆరంభాన్ని, అంతాన్ని కనుగొనలేమో దాని మధ్యను కూడా తెలుసుకోలేము. ఆది అంతం తెలుస్తేనే మధ్య అనేది విదితమౌతుంది. కాబట్టి ఆది అంతాలను నిర్ణయించలేని ఈ జీవనయాత్రలో కనిపించే జాగ్రత్ స్వప్నాలు (అనంత జీవన యాత్రలో భాగాలే కాబట్టి) కూడా "సత్యం" అనుకోలేము కాబట్టి వాటిని మిథ్యగానే భావించాల్సి ఉంటుంది. మరి దృశ్యమానమైన ఈ జగత్తునేమనాలి? అంటే ఇది ఒక ఊహ మాత్రమే. ఊహనే అయితే ఎవరూహిస్తున్నారు? అన్నిటా ఒక్కటిగానే నిండి యుండి వివిధ రూపాలలో కనిపించే ఆకృతులుగా ఏ పరమాత్మ అయితే ప్రకాశిస్తున్నాడో ఆ పరమాత్మయే "ఆత్మ" రూపంలో ఈ విశ్వాన్ని ఊహించు కుంటున్నది. అనుభూతులను పంచుకుంటున్నది. తానే ద్రష్టగా (చూచేవానిగా) సాక్షీభూతంగా నిలుస్తున్నది, అనుభవాలనూ పొందుతున్నది. అన్నీ తానే అయి మరొకటి లేక ఈ ప్రపంచంగా ప్రకాశిస్తున్నది.
            అఖండమూ, అనంతమూ, అవ్యయమూ, పరీవ్యాప్తమూ అయిన  భగవంతుడు లేదా పరమాత్మ చైతన్యం అంతటా ఉన్నప్పుడు, మనమూ ఆ పరమాత్మ స్వరూపమే అయినప్పుడు లేదా అందులో అంతర్భాగమై నప్పుడు దానిని మనం ఎందుకు గుర్తించడం లేదు.  ఏదైనా తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించిన విజ్ఞానం అవసరం. "విజ్ఞానం బ్రహ్మేతివ్యజనాత్" అంటుంది భృగువల్లి. విజ్ఞానమే బ్రహ్మమని చెప్పి ఆగలేదా భృగువల్లి. "ఆనందో బ్రహ్మేతివ్యజనాత్" అని అంది. అంటే విజ్ఞానం కన్నా ఉన్నతమైనది మరొకటి ఉన్నదంటున్నది. అయితే దానిని తెలుసుకోవాలన్నా విజ్ఞానమే కావాలి. దానికి బుద్ధి ప్రాతిపదిక అవుతుంది. బుద్ధి ప్రచోదన పొందితేనే విషయం అవగాహన కొస్తుంది. బుద్ధి ప్రచోదన పొందనంత వరకు సత్యాన్ని గుర్తించలేక మనోప్రేరితమై కారణాన్ని మాత్రమే వెదుకుతూ కూర్చుంటాము. దానినే "అజ్ఞానం" అంటాము. నిజానికి అజ్ఞానం అంటూ వేరే ఏమీలేదు. ఎలాగైతే వెలుగు లేకపోవడమే చీకటి అంటున్నామో అలాగే బుద్ధి విజ్ఞానాన్ని గ్రహించ లేకపోవడమే అజ్ఞానం. ఎందుకని బుద్ది విజ్ఞానాన్ని గ్రహించ లేకపోతున్నది? అంటే చెప్పలేము. ఈ చెప్పలేని స్థితినే తాత్వికులు "మాయా" అంటున్నారు.
            అక్షరబద్ధమైన లేదా పుస్తకస్తమైన జ్ఞానం మార్గం చూపుతుందేమో కాని సమగ్రతను ఇవ్వదు. గురుశిష్య పరంపరలో సంశయాలను నివారించుకుంటూ, సమర్ధుడైన మార్గ దర్శకుని పర్యవేక్షణలో చేసే సాధనలో బుద్ధి ప్రచోదన పొందినప్పుడు మాత్రమే అనుభూతి ప్రధానమైన అనుభవం మనదౌతుంది.  సాధకుడు ఆనందానుభవాన్ని పొందగలుగుతాడు.
            మూడవ ప్రకరణం పేరు "అద్వైత ప్రకరణం". నిజానికి ఈ మొత్తం ఉపనిషత్తు మరియు గౌడపాదులవారి కారిక అంతా కూడా అద్వైతాన్నే చెపుతూ వస్తుంది. ఈ ప్రకరణంలో దానిని మరింత విఫులంగా చెప్పడం జరిగింది. ఏదైనా నిరూపణ చేయాలి అంటే దానికి బలమైన ఉపపత్తి కావాలి. ఉపపత్తికి ప్రమాణాలు నాలుగు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము మరియు అనుభవము.
            ఇక్కడ అందరికీ పరిచితమైన ఒక ఉదాహరణను ఇస్తున్నారు గౌడపాదులవారు. ఆకాశం వివిధ రూపాలుగా, భాగాలుగా కనిపిస్తుంది. (సూర్యాది గ్రహములచే అంతటను ప్రకాశించునది ఆకాశము అంటుంది, విద్యార్ధి కల్పతరువు. భూమి ఉపరితలంపై వాతావరణంతో సహా ఆవరించి ఉన్న శూన్యం అంతా ఆకాశం అనబడుతుంది) నిజానికి ఆకాశానికి రూపాలు, భాగాలు ఉన్నాయా? అంటే లేవు. కాని ఆకాశంలో పరచుకున్న మేఘాల మూలంగా అన్ని కనిపిస్తున్నాయి. అలాగని నిర్మలమైన ఆకాశంలో ఎన్ని రూపాలు, భాగాలు కనిపించినా ఆ ఆకాశం ఏమైనా మార్పులకు లోనౌతుందా? అంటే లేదు. ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలను బట్టి, సంచరించే మేఘాలను బట్టి వాటికి ఎన్ని పేర్లు పెట్టినా ఇన్ని రూపాలు, భాగాలు ఉన్నందు వల్ల ఆకాశాన్ని ఆకాశం అనకుండా మరేదైనా పేరుతో పిలుస్తున్నామా? లేదే. అలాగే పరమాత్మ జీవులలో ఆత్మ రూపంలో ప్రకాశిస్తూ ఎన్ని విభాగాలుగా, రూపాలుగా విభాగింపబడినా, వివిధ నామాలతో పిలవబడినా ఆ పరమాత్మ పరమాత్మయే. దానికి దీనికి మధ్య భేదం లేదు. ఇవన్నీ దృశ్యాలు మరియు దృష్టలు మాత్రమే. ఒకే దృశ్యం ముక్కలైనప్పుడు ద్రష్టకు వివిధ రూపాలలో కనిపిస్తుంది. ఆ రూపాలను లెక్కకు మిక్కిలిగా ఉన్న ద్రష్టలు చూచినా, చూచే ద్రష్ట ఒక్కడే దృశ్యం ఒక్కటే.
            మరొక ఉదాహరణ: పరిమితమైన ఆకృతిగల కుండలో ఒక ఆకాశం ఉంది. అలాగే పైన అపరిమితమైన ఆకాశం ఉంది. రెంటి మధ్య భేదం ఏమైనా ఉందా? నిజానికి ఏమాత్రం భేదం ఉండదు. పరిమితమైన కుండలో కనిపించే ఆకాశం జీవాత్మ కాగా అపరిమితాకాశం పరమాత్మగా చెప్పుకుంటాము. అలాగే పరిమితమైన కుండలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా, అన్నింటిలో కనిపించే ఆకాశం అపరిమితమైన ఆకాశానికి భిన్నంగా ఉండదు.             సముద్రంలోని నీటిని ఒక కుండలో నింపామనుకోండి. ఆ కుండలోని నీరు సముద్రంలోని నీటికి భిన్నంగా ఉండదు కదా. అలాగే ఎన్ని కుండలలో ఆ సముద్రంలోని నీటిని నింపినా అన్నింటిలో ఆ సముద్రంలోని నీరే ఉంటుంది కాని క్రొత్తది అక్కడ ఉద్భవించదు లేదా జనించదు.
            అంతేకాదు, ఒక కుండలో మురికి ఉందనుకోండి. ఆ కుండలోని మురికి మిగిలిన కుండలలోని నీటిలో కనిపిస్తుందా? అంటే కనిపించదు కదా. దేనికదే ప్రత్యేకం. అలాగే కుండల అన్నింటిలో మురికి ఉన్నా ఆ మురికి సముద్రంలో కనిపిస్తుందా? కనిపించదు. ఎలాగైతే ఒక కుండలోని మురికి మరొక కుండలో కనిపించదో అలాగే ఒక జీవుని కష్టసుఖాలు మరొక జీవునికి అంటవు. అలాగే ఈ కష్టసుఖాలు సముద్రాన్నీ చేరవు.
            కుండలో ఉండే ఆకాశం యొక్క నామ రూపాది విభాగాలు అపరిమిత ఆకాశాన్ని ఎలాగైతే చేరవో లేదా అంటవో... అలాగే జీవుని వేదనలూ ఆత్మను బాధించవు. అంతేకాదు, కుండలో ఉన్న ఆకాశం అపరిమిత ఆకాశం నుండి జనించింది అనలేము. ఎందుకని? ఆకాశం అంతటా ఉన్నది. కుండలో కూడా ఉన్నది. అంతేకాని అపరిమితాకాశం నుండి కుండలో ఉన్న ఆకాశం జనించ లేదు.
            వాతావరణం కలుషితమై నప్పుడు, మేఘావృతమైన ఆకాశం మురికిగా కనిపించినంత మాత్రాన అది ఆకాశానికి అంటిన మురికి కాదు. అలాగే ఆత్మకూ ఏ మురికి అంటదు.
అనంతమైన వృత్తంలో నుండి అనంతమైన వృత్తాలు వెలుగు చూచినా, అన్నీ ఆ అనంతమైన వృత్త స్వయం ప్రకటనలు మాత్రమే. అనంతమైన వృత్తం పరమాత్మ అనుకుంటే అందులో ఆ పరమాత్మ స్వయం ప్రకటనగా ఆవిర్భవమైన ఈ సకల చరాచర జగత్తూ పరమాత్మకు భిన్నమైనది కాదని, ఆ పరమాత్మకు ఎదురుగా రెండవది మరెక్కడా ఉండదనేది నిరూపితమౌతుంది.
            ఇది సృష్టికి ముందు ఉండేది, సృష్టిలో ఉన్నది, సృష్టి లయమైన పిమ్మటా ఉంటుంది. అంటే జాగ్రదావస్థలో ఉండేది, స్వప్నావస్థలో ఉన్నది, సుషుప్తిలో లయమైనా అక్కడా ఉన్నది. సుషుప్తిలో ఉన్నది కాబట్టే చర్విత చర్వణంగా మరలా జాగ్రత్ స్వప్నావస్థలుగా ఆవిర్భవిస్తుంది.
            ఇదివరకు ఈ సృష్టిలో అస్థిత్వమే లేని వస్తువు జన్మించ వలసిన అవసరం కాని ఇప్పటికే అస్థిత్వం ఉన్న వస్తువు మళ్ళీ జన్మించ వలసిన అవసరం కాని లేదనేది హేతువాదం. తనకన్నా భిన్నమైన దానిని ఊహించేది మనస్సు.  ఊహ సత్యాని కన్నా ఉన్నతంగా కనిపిస్తుంది. కాని ఎప్పుడైతే యదార్ధం అవగతమౌతుందో అప్పుడు ఊహ యొక్క ఉనికి సత్యంలో లయమౌతుంది. అంటే మనస్సు ఆత్మలో లయమౌతుంది. దానినే ఆత్మ సాక్షాత్కారం అంటాం. అక్కడ రెండవది కనిపించదు.
అత్మకు జననమరణాలు లేవనే సత్యాన్ని ప్రతిపాదిస్తూ, దానికి భిన్నమైనది మరొకటి లేదనే వాదనను నిరూపిస్తూ చెప్పిన ప్రకరణం కాబట్టి దీనిని అద్వైత ప్రకరణం చెప్పారు.
            ఇక నాలుగవదీ చివరిదీ అలాత శాంత ప్రకరణం. అలాతము అంటే కట్టె లేదా కొఱివి. ఇది అద్వైత సాక్షాత్కారాన్ని సూచించే బౌద్ధ తాత్విక సాంకేతిక పదంగా చెపుతారు. నాస్తిక సిద్ధాంతాలనూ, బౌద్ధులు చెప్పే సిద్ధాంతాన్ని, శూన్యవాదులు చెప్పే సిద్ధాంతాన్ని, ద్వైతవాదులు చెప్పే సిద్ధాంతాన్ని ఖండిస్తూ అద్వైతం యొక్క ఉన్నతత్త్వాన్ని సవివరంగా తెలిపారు, గౌడపాదుల వారీ ప్రకరణంలో.
            మనమెవరమైనా, ఎంత గొప్పవారమైనా, ఎంత మేధోవంతుల మైనా మన ఆలోచనలకు పరిధులు లేదా పరిమితులు ఏర్పరచుకొని ఆ ఆలోచనా స్థాయిలోనే తిరుగుతూ ఉన్నంత కాలం ఆ పరిధి వెనకాల ఉన్న ప్రపంచాన్ని చూడలేము. ఆ పరిధి ఎంత విశాలమైనాదైనా  ఆ పరిమితులకు లోబడని బాహ్య ప్రపంచం ఆ పరిధి కన్నా విస్తృతమైనది . మరి తెలిసీ పరిధుల నెందుకని ఏర్పరుచు కుంటాము? దానికీ కారణాలు ఉంటాయి. ఒకటి మనకు తెలిసినదే సమగ్రమూ, సంపూర్ణమని తలచడం, మనమేర్పరుచుకున్న పరిధి కతీతంగా ఆలోచించే దూరదృష్టి మనకు లేకపోవచ్చు. పరిధి దాటి అర్ధం చేసుకునే విజ్ఞానం లేకపోవచ్చు. ముందుకు ఎలా సాగాలి అనేదానిపై స్పష్టత లేకపోవచ్చు.
            ఒక అజ్ఞాని తనకు తెలిసిందే సమగ్రమని తలుస్తూ అందులోనే ప్రపంచాన్ని నిర్వచిస్తాడు. ఒక శాస్త్రవేత్త తన శాస్త్రీయకోణం నుండి ప్రపంచాన్ని చూస్తూ నిర్వచిస్తాడు. ఒక తాత్వికుడు తన దృష్టికోణం నుండి ప్రపంచాన్ని నిర్వచిస్తాడు. ఒక యోగి, ఒక మతం వారు, ఒక నాస్తికుడు, ఒక హేతువాది... ఇలా ఒక్కొకరు తమ తమ విజ్ఞానాన్ని ఆధారం చేసుకొని తమ ఆలోచనల కనుగుణంగా ప్రపంచాన్ని చూస్తారు, నిర్వచిస్తారు. కాని ఏ పరిధులకూ అందని సత్యాన్ని నిర్వచించాలి అంటే అన్ని పరిధులనూ అతిక్రమించి విషయాన్ని దర్శించాల్సి ఉంటుంది. దీనికి విశాల మనస్సు కావాలి. ఇతరుల కోణం నుండి విషయాన్ని అర్ధంచేసుకొని ఆలోచించే మానసిక విస్తృతి కావాలి. సత్యాన్వేషణా శీలత కావాలి.  కాని చిత్రమేమంటే, ఎవరైనా తమ తమ పరిధులలోనే చూస్తూ ఇతరుల ఆలోచనలను ఖండించేందుకే ఎక్కువ సమయాన్ని కెటాయిస్తారు. అంతేకాదు, తమ వాదనలను సమర్ధించు కునేందుకు అవసరమైన దానికన్నా అధికమైన ఉపపత్తిని సమకూర్చుకునేందుకు శ్రమిస్తారు. నిజానికి ఈ సమయం సత్యాన్వేషణకు కెటాయిస్తే ఉపయుక్తమౌతుంది.
            అంతటా వ్యాపించినది, సర్వశక్తి సమన్వితమూ, సకల విజ్ఞాన సమోపేతమూ, సమగ్రమూ, సంపూర్ణమూ అయిన భగవంతుడనే సత్యం యొక్క ప్రతిబింబమే ఈ సకల చరాచర సృష్టి. దీనితో పోల్చి చెప్పేందుకు రెండవది లేదు. అనంతము అని సత్యాన్ని నిర్వచిస్తే దానికి ప్రతిగా దేనిని చెప్పినా మొదటిదాని అనంతత్వము అభాసగా మారుతుంది లేదా తప్పవుతుంది. బింబ ప్రతిబింబాలుగా ప్రకటితమయ్యే సత్యం యొక్క యదార్ధ స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం వల్ల మాత్రమే అద్వైత భావాన్ని అవగాహన చేసుకోగలము.
            అసంఖ్యాకమైన అద్దాలతో నిండి ఉన్న ఒక గది ఉంది. దానిలోనికి మనం వెళితే... అక్కడి అద్దాలలో మన ప్రతిబింబాలు అసంఖ్యాకంగా ప్రతిబింబిస్తాయి, దర్శనమిస్తాయి. మనం ప్రదర్శించిన హావభావాలను ప్రదర్శిస్తాయి. ఇప్పుడు ఆలోచిస్తే అద్దాలలో కనిపించే మన ప్రతిబింబాలన్నీ యదార్ధమైనవా? శాశ్వతమైనవా? అంటే కాదనే సమాధానం. కాదని ఎలా అనడం. వాటికీ స్వరూప, స్వభావాలున్నాయి, జీవం ఉన్నట్లుగానే క్రియలు చేస్తున్నాయి. మరొక్క విషయాన్నీ ఆలోచించాలి. ఆ ప్రతిబింబాలలో ఏదైనా స్వయంగా సుఖదుఃఖాలకు బంధీ అవుతుందా? లేదు కదా.  అంటే.. ఇవన్నీ కూడా ఆ అద్దం ముందు "మనం" ఉన్నంతవరకే. "మనం" అనే బింబం ప్రక్కకు జరిగితే ఆ ప్రతిబింబాలన్నీ కనుమరుగవుతాయి. కనుమరుగవడ మంటే ఏమిటి? కనుమరుగయ్యాక ఎక్కడికి పోతాయి? అంటేమనంలోనే లయమవుతాయి. ప్రతిబింబాలన్నీ "బింబం" లోనే లయమవు తున్నాయి కాబట్టే మళ్ళీ బింబంగా ఉన్న "మనం" గదిలోకి వెళితే ప్రతిబింబాలన్నీ ప్రతిబింబిస్తునాయి లేదా ఆ అద్దాలలో దర్శనమిస్తున్నాయి. నిజానికి బింబం కాని ప్రతిబింబాలు కాని దేనికీ బంధీలు కారు. అన్నింటికీ అతీతమైన వారే.
            ఈ సత్యాన్నే ప్రవచిస్తున్నదీ ఉపనిషత్తు. బింబం పరమాత్మయే. అంతే కాదు, అద్దంలో దాని ప్రకటన వల్ల కనిపించే ప్రతిబింబాలూ పరమాత్మయే. దానిని దేవుడన్నా, భగవంతుడన్నా, ఆత్మ అన్నా, శక్తి అన్నా ఉన్నది ఒక్కటే. (మతాలు దేవుడంటాయి, తాత్వికులు ఆత్మ అంటారు, హేతువాదులు శక్తి అంటారు, అందుకే దానిని దేవాత్మశక్తిగా చెప్తారు)  సకల చరాచర సృష్టి ఆ బింబం యొక్క స్వయం ప్రకటన మాత్రమే. 
            మన చుట్టూ ఉండే వాతావరణం నుండి అవసరమైన, అనవసరమైన విషయాలనూ గ్రహిస్తుంటాము. దానిని దత్తాంశము (Data) అంటాం. ఆ దత్తాంశాన్ని క్రమపద్ధతిలో పెడితే అది సమాచారము (Information) అవుతుంది. ఆ సమాచారాన్ని సమగ్రంగా అర్ధం చేసుకుంటే అది విజ్ఞానంగా (Knowledge) మారుతుంది. ఆ విజ్ఞానాన్ని పరిస్థితులకు, ప్రపంచానికీ అన్వయించుకొని ఫలితాలను ఆస్వాదిస్తే ఒక అవగాహన (Understanding) ఏర్పడుతుంది. ఆ అవగాహన వల్ల సాక్షాత్కారం (Realisation) కలుగుతుంది.
ఉదాహరణకు, మనం ఒక వస్తువును పై నుండి విడిచి పెడితే అది క్రింద పడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం లేదా అవగాహన చేసుకోవడం లేదా తెలుసుకోవడం (Understanding) అంటాం. ఏ వస్తువునైనా ఏ ప్రదేశంలోనైనా ఎవరు విడిచిపెట్టినా అది క్రింద పడుతుందనే అవగాహనను పెంచుకోవడం లేదా కలిగి యుండడం "సాక్షాత్కారం" (Realisation) అంటాం. ఈ ధర్మం దేశకాలమాన పరిస్థితులకు, వ్యక్తులకు అతీతంగా ప్రకటిత మౌతుంది.
            ఒక విషయాన్ని భయం వల్ల కాని, ప్రలోభాల వల్ల కాని గుర్తించడం, ఆచరించడం పర ధర్మంగా చెప్పబడుతుంది. మన సహజ జ్ఞానం ఆధారంగా సహజ స్వీకృతి నేపథ్యంలో ఆచరించడం స్వధర్మంగా చెప్పబడుతుంది. స్వధర్మాచరణ వల్ల మృత్యువు ఎదురైనా మంచిదే కాని పరధర్మాచరణ కూడదని గీతాచార్యుడు చెప్పాడు. ఎవరో చెప్పారని చేయడం వల్ల సాపేక్షిక విశ్వాసాన్ని (Relative Confidence i.e. Comparing with others) పొందగలము. అదీ వారి మీద ఉండే గౌరవం వల్ల మాత్రమే. సాక్షాత్కారం కలగాలి అంటే సంపూర్ణమైన ఆత్మ విశ్వాసం కావాలి. (Absolute Confidence i.e. we realise our capacities and potentials and compare with our perfection and move towards it) ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు విగ్రహారాధనతో సహా అన్ని ఉపాసనలూ ఆచరించాల్సిందే. ఒకసారి ఆత్మ సాక్షాత్కారమవుతే అన్ని బంధనాలలో నుండి విముక్తమౌతాము కాబట్టి ఈ ఉపాసనలతో పని లేకుండా నిరంతర బ్రహ్మ జ్ఞానంతో అనంతమైన ఆనందాన్ని (సమాధి స్థితిలో లభించే ఆనందంకాదు అంత కన్నా ఉన్నతమైనస్థితి) అనుభవిస్తూనే విధ్యుక్త ధర్మాన్ని ఆచరిస్తాము.
శుభం భూయాత్
ఉపసంహారము

            ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం వస్తుగత అస్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. ఆ వస్తుగత లక్ష్యంతో మనకు సంబంధం ఉంటుంది. ఇది ప్రాకృతిక సత్యం. ఆత్మ తత్వాన్ని, లేదా భగవత్తత్త్వాన్ని భావన చేయడం, దానిని పదాలతో, లక్ష్యాలతో, వస్తుగత అస్థిత్వంతో సాధించడం జరగని పని. ఏ బంధనలకూ చిక్కకుండా, ఏ పక్షపాత వైఖరీ లేకుండా సత్యాన్వేషణా శీలియై సాగితేనే ఈ ఉపనిషత్తును అర్ధం చేసుకోగలము.
            సత్వగుణం ఆశయాలను కలిగిస్తుంది. రజోగుణం ఆ ఆశయాలను ఆవిష్కరించే విధానంలో అవసరమైన ప్రణాళికలను అందిస్తుంది. తమోగణం ఆ ప్రణాళికలను అమలుపరచే క్రియాశీలత నిస్తుంది. భౌతిక విజయాన్ని సాధించాలన్నా, ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలన్నా ఈ మూడు గుణాలూ కావాలి. అయితే వీటివల్ల లభించే విజయం నేనే అనే అహంకారాన్ని ప్రసాదిస్తుంది. అహంకారం అంధత్వాన్ని ప్రసాదిస్తుంది. అంధత్వం వల్ల మార్గం గుర్తించలేము. మరి ఏదైనా సాధించాలి అంటే ఎలా? ఆశయం ఉండాలి, ప్రణాళికలూ కావాలి, ఆ ప్రణాళికలను అమలు చేసే కార్యశీలత కావాలి అంటాం కదా. అయితే ఆ ఆశయ సాధన త్రిగుణాతీతమై ఉండాలి అంటుంది భారతీయ సాహిత్యం. అంటే ఈ సత్వరజస్తమో గుణాల పరిమితులకు లోనుకాకుండా వ్యవహరించ గలిగిన మానసిక స్థితిని సాధించే దిశలో ప్రయత్నం సాగాలి.
            భగవంతుని లేదా పరమాత్మ యొక్క అంశ పదార్ధంగా, శక్తిగా శూన్యంలో ప్రకటితమౌతుంది. పదార్ధం శక్తి యొక్క కూర్పు లేదా ఎక్కువ మొత్తంలో శక్తి ఒక ఆకృతి తీసుకోవడం వల్ల ఆవిర్భవిస్తుంది. దీనిని ఒక అస్థిత్వం కలిగిన విభాగంగా (Unit) చూస్తాము. ఈ అస్థిత్వం కలిగిన విభాగానికి లేదా Unit కు క్రియాశీలత ఉంటుంది. శూన్యం సమతులన స్థితిలో (Equilibrium state) ఉంటుంది. శూన్యానికి ఏ విధమైన క్రియాశీలత (Activity) ఉండదు. శూన్యం ఒక Broadcasting agency or Transmitting agency మాత్రమే. అస్థిత్వం కలిగిన ప్రతి విభాగం  (Unit)మరియొక అస్థిత్వం కలిగిన విభాగంతో (Unit) ఏదో ఒక రకమైన సంబంధం కలిగి ఉంటుంది. ఆ సంబంధాన్ని గుర్తిస్తుంది ఆ సంబంధాన్ని నిర్వహిస్తుంది. ఇది ప్రాకృతిక న్యాయం. ఈ ప్రకృతి స్థూలంగా నాలుగు విభాగాలుగా కనిపిస్తుంది. పదార్ధానికి సంబంధించినది, ప్రాణానికి సంబంధించినది, జంతు సంతతికి సంబంధించినది మరియు మానవులకు సంబంధించినది. ఈ నాలుగూ ఒకదానిపై ఒకటి ఆధారపడినవే.
            పదార్ధానికి సంబంధించినవి.... నేల, రాళ్ళురప్పలు, నీరు లాంటివి. వీటికి అస్థిత్వం ఉంది కాని కదలలేవు, శ్వాస తీసుకోలేవు. సంయోగ (Composition) వియోగములు (Decomposition) ఉంటాయి.
            ప్రాణానికి సంబంధించినవి..... చెట్లు చేమలు. వీటికి  అస్థిత్వం ఉంది, శ్వాస తీసుకోగలవు కాని కదలలేవు. సంయోగ (Composition) వియోగములు (Decomposition) ఉంటాయి. పెరుగుదల ఉంటుంది.
            జంతు సంతతికి సంబంధించినవి...... వీటికి అస్థిత్వం ఉంది, శ్వాస తీసుకోగలవు, కదలగలవు. సంయోగ (Composition) వియోగములు (Decomposition) ఉంటాయి. పెరుగుదల ఉంటుంది. జీవించాలనే కోరికా ఉంటుంది.
            మానవులకు సంబంధించినది..... మానవజాతికి అస్థిత్వం ఉంది, శ్వాస తీసుకగలవు, కదలగలవు. సంయోగ (Composition) వియోగములు (Decomposition) ఉంటాయి. పెరుగుదల ఉంటుంది. జీవించాలనే కోరికా ఉంటుంది. దీనికి తోడుగా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. ఈ జిజ్ఞాస లేకపోతే పశువులతో సమానమౌతాము.
            సంయోగ (Composition) వియోగములు (Decomposition) ఒక దాని వెంట మరొకటి ఉంటుంది. జననం సంయోగం కాగా మరణం వియోగం. ఈ విశ్వంపై దృశ్యమానమై సృష్టింప బడినదంతా లయమౌతుంది లేదా అస్థిత్వాన్ని మార్చు కుంటుంది. లేదా  తన స్థితిని మార్చుకుంటుంది.
ప్రతి వస్తువుకూ రూపము, గుణము, స్వభావము మరియు ధర్మము అనే నాలుగు అంగాలుంటాయి. సాధారణంగా రూపము మరియు గుణముల యొక్క ప్రయోజనాన్ని గుర్తించము. స్వభావం యొక్క ప్రయోజనాన్ని గుర్తిస్తాము. అలాగే ధర్మానికి విరుద్ధంగా పనిచేయము.
            మన మనస్సు జాగ్రదావస్థలో చేతనాత్మకమైన (Conscious state) మనస్సుగా పనిచేస్తుంది. నిద్రావస్థలో సుప్తచేతనాత్మకమైన  (Subconscious state)  మనస్సుగా పనిచేస్తుంది. అలాగే సుషుప్తిలో అవ్యక్తచేతనాత్మకమైన (Unconscious state) మనస్సుగా పనిచేస్తుంది. చేతనాత్మకమైన మనస్సు కన్న సుప్తచేతనాత్మకమైన మనస్సు, దాని కన్నా అవ్యక్తచేతనాత్మకమైన మనస్సు శక్తివంతంగా, ప్రభావవంతంగా, ప్రకాశవంతంగా పనిచేస్తాయి.
            భగవంతుడనే సత్యం సాక్షాత్కారం కావాలి అంటే చేతనాత్మకమైన మనస్సు (Conscious Mind) సుప్తచేతనాత్మకమైన మనస్సులో ఆ సుప్తచేతనాత్మకమైన మనస్సు (Sub-Conscious Mind) అవ్యక్తచేతనాత్మకమైన మనస్సులో (Unconscious Mind) లయం కావాలి. అదే ఈశ్వరునిలో లయం కావడం. అప్పుడే మనం ఆత్మ స్వరూపులమనే అద్వైత భావన అవగతమౌతుంది, అనుభవమౌతుంది, అనుభూతినిస్తుంది, అచంచల అవ్యక్తానంద  తాదాత్మ్యతా స్థితిని పొందుతాము. సమస్త విశ్వంలో మనమే కనిపించడం, మనలో సమస్త విశ్వాన్ని చూడడము, అనుభవించడం జరుగుతుంది. అక్కడ తెలియ దగినది కాని తెలుసుకునేది కానీ ఏదీ ఉండదు. నిరుపమాన అవ్యయ స్థితిలో, తన్మయత్వంలో, ఏ వికారాలూ లేకుండా ఏక రూపమైన బ్రహ్మతత్వానుభవంలో మనసును లయం చేసుకొని శాశ్వతత్వాన్ని పొందుతాము.
            నా అవగాహన మేరకు ఈ ఉపనిషత్ సారానికి అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేసాను. ఈ క్రమంలో ఎన్నో మార్లు అసమర్ధత ప్రశ్నించినా దాని నోరు నొక్కి ప్రయత్నాన్ని కొనసాగించడం జరిగింది. దీనికి కారణం ఒక్కటే.... విజ్ఞులు ఇందులోని మంచిని గ్రహిస్తారని, ఇందులో అసంగతమైన దానిని పరిహరించడమే కాక అవసరమైన సూచనలతో ఆశీర్వదిస్తారనే నమ్మకమే. ప్రయత్నలోపం పరాజయం కన్నా నీచమైనది.
            మరొక్క విషయాన్ని చెప్పుకోవాలి. ఇందులో  ఆధునిక పదార్ధశాస్త్రాన్ని, సామాజిక శాస్త్రాన్ని, మానసిక శాస్త్రాన్ని అవసరాన్ని బట్టి వాడుకోవడం జరిగింది. వాటివల్ల ఆశించిన ప్రయోజనాలు రెండు. ఒకటి, కొన్ని వేల సంవత్సరాలక్రితమే భారతీయ ఋషులు సాధించిన వైజ్ఞానిక ప్రగతిని గుర్తుచేసుకోవడం కాగా రెండవది మరీ ఆధ్యాత్మిక పారిభాషిక పదాలను ఆధునిక తరానికి పరిచయం చేసేప్పుడు వారు అర్ధం చేసుకునేందుకు సులువుగా ఉంటుందని.
            మార్పు సహజమైన ప్రపంచంలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం క్షణక్షణమూ అధునాతనమౌతుంది. క్రొత్త విజ్ఞానాన్ని ఆదరించాలి, అన్వయించుకోవాలి. మౌలికమైన ధర్మానికి విఘాతం కలుగకుండా, ఆధునిక ఉదాహరణలతో హత్తుకునే విధంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుందనేది నా ప్రగాఢ విశ్వాసం.

నమస్సులతో

పాలకుర్తి రామమూర్తిమనసులో మాట

No comments: