ఓం శ్రీ సరస్వత్యై నమః
అంతరంగ
నివేదన
ఈ ప్రశ్నోపనిషత్తు అధర్వ వేదంలోనిది.
ఈ ఉపనిషత్తు అంతా కూడా ప్రశ్న - సమాధానం రూపంలో ప్రస్తావించ బడింది కాబట్టి ఇది
ప్రశ్నోపనిషత్తు పేరుతో ప్రసిద్ధి చెందింది. ప్రశ్నోపనిషత్తు అనడంలో రెండు
భాగాలున్నాయి. మొదటిది... "ప్రశ్న". రెండవది "ఉపనిషత్".
ఉపనిషత్ అంటే వేదాంతము,
ధర్మము, ఏకాంతము అంటుంది శబ్ద రత్నాకరము.
గురుని సమీపమున బ్రహ్మ జ్ఞానమును లెస్సగా పొందబడిన దానిని ఉపనిషత్ గా చెపుతుంది,
విద్యార్థి కల్పతరువు. (ఉప-ని-సత్).
ఇక ప్రశ్న
అంటే "అడగడం" అంటుంది, శబ్ద
రత్నాకరం. అయితే, దేనిని అడగాలి? ప్రశ్నించే
లేదా ప్రశ్నించుకునే విధానం ఏమిటి? వీటి గురించి తెలియాలి
అంటే ప్రశ్నించడంలో మెలుకువలు తెలియాలి.
ముందుగా దేనిని ప్రశ్నిస్తున్నామో లేదా ప్రశ్నించాలో అవగాహన ఉండాలి. ఆ ప్రశ్న వల్ల తనకు గాని సమాజానికి గాని
ప్రయోజనం ఉందా? ఆ ప్రశ్న నిర్దేశిత ఫలితాన్ని సాధిస్తే
ప్రస్థుత సమాజం లేదా భవిష్యత్ సమాజం ఎలా ఉంటుంది, అనే దానిపై
సరైన అవగాహన ఉండాలి. అంటే ప్రశ్నించే వ్యక్తికి స్పష్టమైన దార్శనికత ఉండాలి.
తెలుసు
కోవాలనే కుతూహలానికి నాంది ప్రశ్న. ప్రశ్నలో జిజ్ఞాస ఉంటుంది. ఆరాటం ఉంటుంది.
ఆవేదన ఉంటుంది. తెలిసిన దానిని ఆధునీకరించుకోవాలి, అన్వయించు కోవాలనే తపన ఉంటుంది. అవరోధాలను అధిగమించేందుకు కావలసిన అన్వేషణ
ఉంటుంది. అవకాశాలను వినియోగించుకోవడంలో అవగాహన ఉంటుంది. ఏ మేరకు దేనిని ఎలా
ఉపయోగించుకోవాలి అనే విచక్షణ ఉంటుంది. ప్రశ్న అజ్ఞతాంధ్యం నుండి విజ్ఞాన ఉషస్సులను
దర్శించేందుకు ప్రేరణ నిస్తుంది.
ప్రశ్న ప్రశ్నను
తట్టిలేపుతుంది. విచక్షణకు అద్దంపడుతుంది. సృజనాత్మక శక్తిని జాగృతం చేస్తుంది.
విమర్శనా శక్తిని ప్రసాదిస్తుంది. సాంకేతికతను ఆధునీకరిస్తుంది. నిద్రాణమైన అనంత
శక్తికి చైతన్యాన్నిస్తుంది. బ్రతుకునుండి జీవితాన్ని ఆస్వాదిస్తూ ప్రభావవంతంగా, ప్రకాశవంతంగా సమన్వయ పూర్వకంగా అడుగు ముందుకు వేసేందుకు కావలసిన సర్వాంగీణ
వికాసాన్ని కలిగిస్తుంది.
పశు ప్రవృత్తితో
బ్రతుకునీడ్చే మనిషిలో "నేనెవ్వరు" అనే ప్రశ్న తన గురించి తెలుసుకోవాలనే
తపనకు బీజం వేసింది. ఆ శోధనయే ఆధ్యాత్మిక సాధనకు, మూల
ప్రకృతి అన్వేషణకు దారితీసింది.
చుట్టూ ఉన్న
జీవకోటితో తన సంబంధాలను ప్రశ్నించుకున్న విధానం సమాజ ఆవిష్కరణకు మూలమయింది.
ఉన్నతమైన జీవన వికాసం ఏమిటనే ప్రశ్న ఇతరుల అభివృద్ధియే నా ప్రగతి; త్యాగం వల్లనే సౌఖ్యం ఉంది అనే సత్యాన్ని ఆవిష్కరించింది.
ఉన్న స్థితి నుండి
ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆరాటంలో వెలువడ్డ ప్రశ్న శాస్త్ర సాంకేతిక ప్రగతికి
మార్గ దర్శన చేసింది. వైవిధ్య ఫలితాలను సాధించాలనే తపన సృజనశీలతకు, వివిధ కోణాలలో సమాజాన్ని దర్శిస్తూ.... క్రొత్త క్రొత్త ఆవిష్కరణలతో మానవ
జీవితాన్ని రసమయం చేసేందుకు, సుఖమయం చేసేందుకు
ఉపయుక్తమయింది.
సాంకేతిక ప్రగతికి
మూలం ప్రశ్న. జీవన వికాసానికి మూలమూ ప్రశ్నయే. వికసన దారిలో ప్రయాణించే ప్రశ్న
అభ్యుదయాన్ని అందిస్తుంది. స్వ+ఇచ్ఛ=
స్వేచ్ఛ. కాని "స్వ" లో స్వార్థంచేరితే, సామాజిక
శ్రేయఃకోణం లోపిస్తే అది విధ్వంసానికి దారితీయవచ్చు. ప్రశ్న వల్ల ఏదైనా "ధ్వంసం" అవడం
సంభవిస్తే ఆ ప్రశ్న సమంజసమైనది కాదు. సమాజ పురోగమనానికి మార్గం చూపితేనే... అది
జిజ్ఞాసతో కూడిన ప్రశ్న అవుతుంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను
కాపాడడానికి సంధించే ప్రశ్నయే ఉత్తమమైన ప్రశ్నగా గుర్తించాలి. ఏ పరిమితులలో
చిక్కుబడకుండా, ఏ సిద్ధాంతానికీ కట్టుబడకుండా సత్యాన్వేషణా
దీక్షతో పొందిన చైతన్య స్రవంతి గుండా వెలుగు చూచిన ప్రశ్న ప్రపంచ శాంతికి బీజం
వేస్తూ శాస్త్ర సాంకేతికాభ్యుదయానికి మార్గం చూపుతుంది.
పరిసరాలను
గమనించినప్పుడు మెదడు గ్రహించిన సమాచార స్రవంతి అంతరంతరాలలో ఒదిగిపోయి మనసులో ఒక
ఆలోచనగా రూపు దిద్దుకుంటుంది. ఆ ఆలోచన ఆచరణయోగ్యమా, కాదా
అనే "ప్రశ్న" వల్ల దానిపై ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పరిశీలనకు
దారితీస్తుంది. పరిశీలన జిజ్ఞాసను పెంచుతుంది. జిజ్ఞాస పరిశోధనవైపు నడిపిస్తుంది.
పరిశోధన వల్ల విజ్ఞానం పెరుగుతుంది. విజ్ఞానం వికసన నిస్తుంది. వికసన విచక్షణకు
దారి చూపుతుంది. వివేచన వల్ల లోతైన అవగాహన ఏర్పడుతుంది. అవగాహన ఆవిష్కరణకు బీజం
వేస్తుంది. ఆచరణాత్మకమైన ఆవిష్కరణ శాస్త్రానికి వేదిక అవుతుంది. అనుభవం వల్ల
సాధించిన శాస్త్రీయ ఫలితాలు సామాజిక ప్రగతికి దోహదపడితే సమాజాదరణను పొందుతాయి,
ఆ ఫలితాలకు ఆమోదం లభిస్తుంది. అలా కాని నాడు ఈ ఫలితాలన్నింటికీ
మూలమైన ప్రశ్న నిరాదరణకు నోచుకుంటుంది.
మానవ వికాసంలో
భాగస్వామిగా ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఛోదక శక్తిగా పనిచేసే ప్రశ్న పదునైన
కత్తి లాంటిది. ఆ కత్తి యొక్క ప్రయోజనం ఆ కత్తిని ఉపయోగించే వ్యక్తియొక్క
విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
చివరగా.... I keep six serving men
They
taught me all I knew
Their
names are:
"What"
and "Why"
"When"
and "How"
and
"where" and "Who" అంటాడు, Rudiard Klipping.
విషయాన్ని
తెలుసుకునే ప్రయత్నంలో "ఏమిటి, ఎందుకు,
ఎప్పుడు, ఎలా, ఎక్కడ
మరియు ఎవరు"; వీటి ప్రాముఖ్యతను అవగాహన చేసుకోవడం
అత్యంతావశ్యకం.
పాలకుర్తి రామమూర్తి
ఓం
శ్రీ సరస్వత్యై నమః
ప్రస్తావన
ఓం
భద్రం కర్ణే భిశ్శ్రుణుయామ దేవాః
భద్రంపశ్యే
మాక్షభిర్యజత్రాః
స్థిరైరంగైస్తుష్టువాగుం
సస్తనూభిర్వ్యశేమ
దేవహితం
యదాయుః
ఓ
శాంతిః శాంతిః శాంతిః
స్వస్తిన
ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తినః
పూషా విశ్వవేదాః
స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః
స్వస్తినో
బృహస్పతిర్దదాతు
ఓ
శాంతిః శాంతిః శాంతిః
ముండకోపనిషత్
లో ఆధ్యాత్మిక వికసనకు సంబంధించిన విజ్ఞానం ప్రబోధింప బడింది. దానికి
కొనసాగింపుగానే ప్రశ్నోపనిషత్తు ఆధ్యాత్మిక తత్త్వాన్ని సులభ గ్రాహ్యంచేసే
ప్రయత్నం చేస్తుంది. అందుకే దీనిని ముండకోపనిషత్తుకు అనుబంధంగా చెపుతారు.
ఓం
నమః పరమాత్మనే! హరిః ఓం అంటూ ఆరంభమౌతుంది ఈ ఉపనిషత్తు.
భరద్వాజుని
పుత్రుడు సుకేశుడు,
శిబి పుత్రుడు సత్యకాముడు, గర్గ వంశపు
సూర్యుని మనుమడు గార్గ్యుడు, అశ్వలుని కుమారుడు కౌసల్యుడు,
విదర్భ దేశానికి సంబంధించిన భార్గవుడు, కత్యుని
తనయుడు కాత్యాయన కబంధి... ఈ ఆరుగురూ బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో
సమర్ధుడైన గురువు నన్వేషిస్తూ, తమ సందేహాలను తీర్చగలిగిన
వాడు పిప్పల మహర్షి మాత్రమే నని విశ్వసించి సమిధలను తీసుకొని పిప్పలుని వద్దకు
వచ్చి తమకు ఆధ్యాత్మిక విజ్ఞానంలో కలిగిన సందేహాలను తీర్చ వలసిందిగా
ప్రార్ధిస్తారు.
వీరంతా
బ్రహ్మ నిష్టాపరులు. అంటే బ్రహ్మమే జీవిత
పరమార్థంగా కలవారు. ఇక్కడ బ్రహ్మం అంటే సగుణ బ్రహ్మం లేదా వేదం అని అర్థం. అలాగే
వీరు బ్రహ్మాన్వేషణా శీలురు. అంటే... జీవిత పరమార్థానికి మూలమైనది ఏదో ఆ నిర్గుణ
బ్రహ్మాన్ని అన్వేషిస్తూ ఆ తపనలో తపిస్తున్నవారు. ఉపాసనా విధులలో నిష్టకలవారే కాదు
అందులో నిష్ణాతులైన వారు. జపం చేస్తాం లేదా పూజ చేస్తాం. అందులో ఆరాధ్య దైవం వేరు
నేను వేరు అనే భావన ఉంటుంది. ఆరాధిస్తాం. అందులో ఏ దేవతా మూర్తి నైతే
ఆరాధిస్తున్నామో ఆ దేవతా రూపాన్ని పొందినట్లుగా భావిస్తాం. ఉపాసిస్తాం. అందులో
ఉపాస్య దైవానికి మనకు అభేదం పాటిస్తూ.. సకల చరాచర సృష్టిలో ఆ మూర్తిని చూడ
గలుగుతాము అలాగే సకల చరాచర సృష్టినీ ఆ మూర్తిలో చూడగలుగుతాము.
వీరు
గురువును దర్శించేందుకు వెళ్ళేప్పుడు సమిత్పాణులై వెళ్ళారు. గురువులను, పిల్లల,ను భగవంతుని ఆలయాన్ని దర్శించేందుకు వెళ్ళేప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళ కూడ
దంటారు. అయితే ఆ కాలంలో ఆశ్రమవాసంలో ఉండే ఆచార్యులు ప్రతినిత్యం యజ్ఞ యాగాదికాలలో
మునిగితేలే వారు కాబట్టి వారికి సమిధలు అత్యంత ప్రీతిపాత్ర మయ్యేవి. కాబట్టి వారు
సమిధలు తీసుకు వెళ్ళారు.
అప్పుడు
పిప్పలుడు వారితో ఇలా అంటాడు... సంవత్సరం పాటు శ్రద్ధావంతులై బ్రహ్మచర్య నిష్టతో
వ్రతం చేయండి. ఆ పిమ్మట ఏవైనా ప్రశ్నలు అడగండి నాకు తెలిసిన మేరకు మీకు తప్పక
చెపుతాను.
ఇక్కడ
కొన్ని విషయాలను గుర్తించాలి. వచ్చిన వారు అందరూ జిజ్ఞాసువులు, తపస్సంపన్నులు,
ఆశ్రమ జీవితాన్ని నియమంగా నిష్టగా గడిపిన వారే. వారి వారి ఆశ్రమాలలో
సహాధ్యాయులతో, గురువులతో జరిపే చర్చలలో సందేహాలను
తీర్చుకున్న వారే. పైగా వారి తండ్రులు అందరూ కూడా ఆశ్రమవాసంలో తపోనిష్ఠలో
జ్ఞానాన్ని ఆర్జించిన వారే. వారు జిజ్ఞాసువులైన వారి కుమారులకు జ్ఞానాన్ని అందించి
ఉంటారనేది నిస్సందేహాంశం. మరిప్పుడు క్రొత్తగా వారేం నేర్చుకోవాలి? వారి వారి తల్లిదండ్రులు వారి సందేహాలను తీర్చలేకపోయారా? విజ్ఞాన తృష్ణకు అంతం ఉండదు.
పాత ఆలోచనా
క్రమంలోనే ఆలోచిస్తూ పోతే క్రొత్తదనం
ఉండదు. వాటి ఫలితాలు భిన్నంగా
ఉండవు. క్రొత్త ఫలితాన్ని లేదా ఆలోచనను కోరుకుంటే క్రొత్త ఆలోచనా విధానాన్ని ఆహ్వానించాలి, అనుమోదించాలి.
ఆలోచనా పరిధిని విస్తృత పరచాలి. వివిధ కోణాలలో తమ విజ్ఞానాన్ని
ఆధునీకరించుకోవాలి. వారూ అదే చేసారు.
నేర్చుకోవాడానికి హద్దులు ఏర్పరస్తే ప్రగతికి నోచుకోము. కాబట్టి ఆ ఆరుగురూ మరింత
విస్తృతంగా తమ విజ్ఞానాన్ని మథించాలనే సంకల్పంతో దానికి సమర్ధుడైన పిప్పలుని
ఆశ్రయించారు.
విజ్ఞాన
విషయాలను లోతుగా,
విస్తృతంగా అధ్యయనం చేయాలంటే... మనలో శ్రద్ధ కావాలి. నేర్చుకోవడానికి అవసరమైనవి ముఖ్యంగా మూడు, శ్రద్ధ (Interest), ఉత్సాహం
(Enthusiasm), సన్నద్ధత (Readiness). ఈ
మూడూ వారిలో ఉన్నాయి. ఇవి క్షణికమా, శాశ్వతమా? శాశ్వతమైతే వారిలో అంకితభావం (Dedication), పట్టుదల
(Determination), ఆరని తపన (Drive) ఉంటుంది.
ఇవి ఉన్నాయా లేవా? పరీక్ష చేయాలి. పరీక్షించేందుకు పిప్పలుడు
సంవత్సర కాలాన్ని నిర్దేశించాడు.
విషయాన్ని
బోధించే వ్యక్తి సమర్ధుడై ఉండాలి. వచ్చిన జిజ్ఞాసువులలో శ్రద్ధ ఉంది. మరి గురువు
సమర్ధుడా?
సమర్ధతకు ప్రాతిపదిక ఏమిటి?
విషయంపై
స్పష్టమైన అవగాహన ఉండాలి. మనమెక్కడ ఉన్నాము, ఎక్కడ ఆరంభించాలి,
ఎక్కడకు చేరాలి, చేరాక మనమేంటి? తదుపరి ఏం చేయాలి? ఈ విషయాల పై సమగ్రమైన దార్శనికత
ఉండాలి. గమ్యం ఏమిటి? గమ్యాన్నిఎలా
చేరాలి లేదా ఎలా సాధించాలి అనే విషయంపై సంపూర్ణమైన కార్యాచరణ ప్రణాళిక తయారు
చేసుకోవాలి. ప్రణాళికా బద్ధమైన అంచనాలను, యదార్ధాన్ని
ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అవసరానుగుణమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి.
అంతేకాదు, ఎక్కడైనా మన అంచనాలు తారుమారవుతే దానికి
ప్రత్యామ్నాయ మార్గాలేంటనే విషయాన్ని ఆలోచించాలి. సాధనా మార్గంలో ఉన్న అవకాశాలు,
అవరోధాలు, వనరులు ఏమిటో “ఉన్నది ఉన్నట్లు”గా గ్రహించాలి. అవిశ్రాంతంగా
నైపుణ్యాన్ని పెంచుకుంటూ, అంకితభావనతో, నిబద్ధతతో, విసుగు పడకుండా, పట్టుదలతో
లక్ష్యంవైపు గమించడమే సమర్ధత. మన ప్రయత్నంలో అవరోధాలు ఎదురవవచ్చు, ప్రలోభాలు మన బలహీనతలపై ప్రభావాన్ని చూపవచ్చు. అయినా అన్నింటినీ అధిగమించి
ముందుకు సాగిపోయేందుకు ప్రేరణ నిచ్చేదే సమర్ధత. సమర్ధత జ్ఞాన మార్గంలో ప్రయాణాన్ని
సుగమం చేస్తుంది.
పరిసరాల
ప్రభావం వల్ల కొన్ని విషయాలు మన అవగాహనలో కొస్తాయి. వాటిని మనం దత్తాంశాలుగా
వ్యవహరిస్తాము. వాటికి ఏ విధమైన అర్ధం ఉండక పోవచ్చు. ఆ దత్తాంశాన్ని ఒక పద్ధతి
ప్రకారం,
క్రమపద్ధతిలో, సువ్యవస్థితంగా అమర్చుకుంటే అది
సమాచారమౌతుంది. ఆ సమాచారాన్ని విస్తృతంగా అధ్యయనం చేయడం, అర్ధం
చేసుకొనడం వల్ల అది జ్ఞానంగా రూపు దాల్చుతుంది. ఆ జ్ఞానాన్ని అభ్యసనలో పెట్టడం,
ఫలితాలను ప్రతిక్షేపించడం
వల్ల అది సాక్షాత్కారమౌతుంది. సాక్షాత్కారమైన జ్ఞానం స్పష్టత నిస్తుంది.
ఎవరిలోనైతే తాము సాధించిన జ్ఞానంపై స్పష్టత ఉంటుందో వారు సమర్ధులుగా చెప్పబడతారు.
సృష్టి ఎలా జరిగింది? సృష్టి
పూర్వం ఏమైనా ఉన్నాదా? ఉంటే ఉన్నది ఏది? అది ఎలా ఉన్నది? ఈ ప్రశ్నలకు జవాబులను ఎవరు చెప్పాలి?
దేవతలతో సహా అందరూ సృష్టి పిమ్మట జన్మించినవారే. సృష్టి పిమ్మట
జన్మించిన వారిలో ముందున్న దాన్ని దూసింది
ఎవరు, ఎలా చూస్తారు? చూడని దానిని
గూర్చి అవగాహన ఎలా? సృష్టి ఇలా జరిగింది, ఇదీ పరిణామ క్రమం అంటూ ఎవరైనా చెప్పినా వారు చెప్పిన విషయంలో సత్యం పాలు
ఎంత?
దాదాపు 1400
కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒకానొక విస్ఫోటనం
పిమ్మట సృష్టి జరిగిందని,
దాదాపుగా 195 నుండి 200 కోట్ల సంవత్సరాల క్రిందట భూమి ఏర్పడిందని,
లక్షల సంవత్సరాల క్రితమే జీవరాశి వెలుగు చూసిందనీ ఈనాటి
శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. దాదాపుగా ఇదే విషయాన్ని ఋషులు ప్రవచించారు. దానిని ఈ నాటి
శాస్త్రజ్ఞులూ ఒప్పుకున్నారు. అయితే ఆ ఋషులు ఎలా చెప్పగలిగారు?
ఋషులు తమలో కలిగిన జిజ్ఞాస ఫలితంగా
తపించి ఆ తపో నిష్టలో "దర్శించిన" దర్శనాలను శ్రుతి రూపంలో ప్రపంచానికి
పరిచయం చేసారు. తమ దర్శనంలో కాలాన్ని దర్శించి కాలంలో వెనుకకు వెళ్ళగలిగారు.
జరిగిన సృష్టినీ,
దానికి కారణాన్నీ, మూలాలను పరిశోధించి,
మీమాంసలచే శుద్ధపరచి ప్రపంచానికి విజ్ఞాన రూపంలో అందించారు.
సంస్కృతంలో ఋషులను "కవి" అనిపిలుస్తారు. క్రాంతిని దర్శించిన వాడు
"కవి". తమ దర్శనలో భూత కాలాన్ని దర్శించి భగవదనుభూతిని పొందారు, ఋషులు. ఆ అనుభూతిలో కవితాత్మకంగా పొంగారిన కవితా హృదయం భావనామయ సత్యాన్ని
అక్షర బద్ధమైన వేదంగా ఆవిష్కరించింది. ఆ వేదమే ఊపిరిగా భారతీయ సాహిత్యం, ముఖ్యంగా ఉపనిషత్తులు వెలువడ్డాయి.
భారతీయ
విజ్ఞానం;
అఖండము. అనంతము, పరీవ్యాప్తమైన ఈ సకల చరాచర
సృష్టి భగవంతుని యొక్క స్వయం ప్రకటనయే కాని ఎవరూ దీనిని సృష్టించ లేదని చెపుతుంది.
కాబట్టి సహజంగానే ప్రతివ్యక్తీ ఆనందమయుడు, విజ్ఞానమయుడు.
అందుకని ఈ విజ్ఞానాన్ని, ఆనందాన్ని సహజంగా స్వీకరించే విధానం
ప్రతి వ్యక్తిలో ఉండేదే. అయితే మనలో క్రమ్మిన మాయా ప్రభావంతో సహజత్వానికి దూరమై
సుప్తావస్థలో ఉన్న జ్ఞానాన్ని సమర్ధుడైన గురువు ద్వారా జాగ్రతం చేసుకోవడం
జరుగుతుంది. ఆ మార్గంలో పయనించే సమయంలో మనలో
ఇతఃపూర్వమే ప్రతిష్ఠితమైన కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు,
అవగాహనలు వెలుగు చూస్తుంటాయి. వాటిపై ఆధారపడి మనలో ఏర్పడిన కోరికలు,
ఆలోచనలు, ఆశలు మన సహజ స్వీకృతికి అవరోధాలుగా
మారుతాయి. అందుకే వీటి ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. వీటి ప్రభావం
తగ్గితే సహజ స్వీకృతి ద్వారా స్పష్టతతో కూడిన విజ్ఞానాన్ని ఆస్వాదించ గలుగుతాము. ఆ
విజ్ఞానమే ఆనందాన్ని ఇస్తుంది, ఆనందమే బ్రహ్మత్వాన్ని సిద్ధింప చేస్తుంది. అయితే దీనికి కావలసింది
విశ్వాసం, సహనం, పట్టుదల, అంకితభావం, కష్ట సహిష్ణుత. ఇవి ఒక గురువుకు
శిష్యునికి ఉండవలసిన అర్హతలు. వచ్చిన శిష్యులు గురువు సామర్ధ్యాన్ని తెలుసుకొనే
వచ్చారు. ఇప్పుడు గురువు వారి
అర్హతకు పరీక్ష పెట్టాడు. సంవత్సర కాలం శ్రద్ధతో బ్రహ్మ చర్య వ్రత దీక్షలో తపస్సు
నాచరిస్తూ ఉండమన్నాడు. తరువాత కూడా తనకు తెలిసిన మేరకు చెపుతానన్నాడు.
1)
శ్రత్+ధ = శ్రద్ధ. "శ్రత్" అంటే... సత్యసంధత యొక్క
అస్థిత్వాన్ని గుర్తించడం, "ధ" అంటే దానివైపు
పయనించడం లేదా దానిని ధరించడం. ఒక లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని ఏర్పరచుకుంటే...
సకలేంద్రియాలను ఆ లక్ష్యంవైపు ఉన్ముఖం కావించి (మళ్ళించి) నిబద్ధతతో ఆ వైపు
గమించడం, శ్రద్ధగా చెపుతారు.
2)
బ్రహ్మ చర్యం. మన సహజ స్వరూపమే బ్రహ్మత్వం. అజ్ఞానం, మాయ క్రమ్మడం మూలాన సహజత్వానికి దూరంగా గమిస్తున్న వ్యక్తి తన నావహించిన మాయా తెఱలను తొలగించుకొని
బ్రహ్మానందంలో చరించడం బ్రహ్మానందం.
ఈ
బ్రహ్మచర్యాన్ని నాలుగు రకాలుగా వ్యవహరిస్తారు. మొదటిది... గాయత్రి, రెండవది...
బ్రాహ్మి, మూడవది... ప్రాజాపత్యం, నాలుగవది...
బృహత్ ఇలా నాలుగు రకాలుగా బ్రహ్మచర్యం ఆచరింప బడుతుంది.
అ)
గాయత్రి: ఉపనయనానంతరం ఉప్పుకారాదులు లేని ఆహారాన్ని భుజిస్తూ మూడురాత్రులు మూడు
పగళ్ళూ నిష్టగా గాయత్రీ మహామంత్రాన్ని జప సాధన చేసే వారు గాయత్రి బ్రహ్మ చారులుగా
పిలవబడతారు.
ఆ)
బ్రాహ్మీ: వివాహమైనా వేదాధ్యయనాన్ని కొనసాగిస్తూ వేదాధ్యయనం పూర్తయ్యే వరకు
బ్రహ్మచర్యం పాటించే వారు బ్రాహ్మీ బ్రహ్మచారులుగా
పిలువబడతారు.
ఇ)
ప్రాజాపత్య: ఋతుకాలము నందు మాత్రమే భార్యతో సంగమిస్తూ పరస్త్రీ విముఖులైన వారు
ప్రాజాపత్య బ్రహ్మచారులుగా పిలువబడతారు.
ఈ)
బృహత్: మరణ పర్యంతం గురుకులవాసం చేస్తూ
బ్రహ్మ చర్యాన్ని పాటించేవాడు బృహత్ బ్రహ్మచారిగా పిలువబడుతాడు.
3)
తపస్సు: అనేకాగ్రమైన మనస్సును ఏకోన్ముఖం చేస్తూ, బహుముఖ వ్యాసంగులై
ప్రలోభాలకు గురిచేసే మనస్సును, ఇంద్రియాలను సమన్వయపరస్తూ,
అంతశ్చేతనలో కలిగే కల్లోలాలను శమింపచేస్తూ, అపరిమితమైన
అంతశ్శక్తిని జాగ్రతపరుస్తూ, నిర్దేశిత లక్ష్యంవైపు
సాగిపోవడమే తపస్సు.
క్రమశిక్షణాపూర్వకమైన
ఆశ్రమ వాతావరణం శ్రద్ధ,
బ్రహ్మచర్యం, తపస్సాధనలకు అనువుగా ఉంటుంది.
సంవత్సరకాలం నియమంగా ఉండడం వల్ల ఆ నియమ నిష్టలు "అలవాట్లు"గా
మారిపోతాయి. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడం, దంతధావనం,
స్నానాదికాలు ఎలా నిర్వహిస్తామో పై అలవాట్లుకూడా అసంకల్పితంగా నిర్వహించడానికి
మన మనస్సు, శరీరం అలవాటు పడిపోతాయి.
విషయాన్ని
తెలుసుకోవాలంటే గురువు వద్ద శ్రద్ధతో శిష్యరికం చేయాలి. బ్రహ్మచర్యం, తపోసాధన
వల్ల మనస్సు సుశిక్షితమై విషయాన్ని గ్రహించేందుకు సన్నద్ధమౌతుంది.
శ్రవణకళ, దర్శనకళ,
గ్రహణకళ ఈ మూడూ విద్యార్థికి ప్రాధమిక అవసరాలు. వినడంలో నేర్పు,
చూడడంలో నేర్పు, గ్రహించడం లో నేర్పు లేదా
నేర్చుకోవడంలో నేర్పు వీటిపై పట్టు సాధించాలి అంటే క్రమశిక్షణ తప్పనిసరి.
శ్రవణం
అంటే వినడం... వినడం 5 రకాలుగా ఉంటుంది. మొదటిది... ఎదుటివారు ఏం చెప్పినా
ఉపేక్షాభావంతో పట్టించుకోక పోవడం. దీని వల్ల ప్రయోజనం ఉండదు. రెండవది...
వింటున్నట్లు నటించడం. దీని వల్లా ఉపయోగం ఉండదు కాకపోతే ఎదుటి వారు వీడు వింటున్నాడని సంతోషపడతారు. మూడవది... అవసరమైన
వాటిని ఎన్నుకొని వినడం. దీనివల్ల కనీసం మన కిష్టమైనవైనా గ్రహించ గలుగుతాము. ఇక
నాలుగవది... ఏకాగ్రతతో వినడం. దీని వల్ల విషయాన్ని గ్రహించ గలుగుతాము. కాని
విస్తృత పరచలేము. అక్షరాలను, పదాలను మాత్రమే గ్రహిస్తామే కాని
అంతర్లీనమైన వారి భావాన్ని గ్రహించ గలగడం సాధ్యపడదు. ఇక్కడ మన అలవాటు ప్రకారం
అర్థం చెప్పుకుంటుంటాము. చివరగా అయిదవది... ఎదుటివారి ఆలోచనా సరళి ననుసరించి
వినడం. ఎదుటి వారు ఏ కోణంలో చెపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మన
ఆలోచనలను, భావోద్వేగాలను, క్రియాప్రతిక్రియలను
కూడా సమ్మిళితం చేస్తూ వింటాము. ఇందులో దేనినీ అణచివేసే ప్రయత్నం జరగదు. సహజంగా
గమనించడం వల్ల అంతర్యాన్ని వివిధకోణాలలో గ్రహించే వీలు కలుగుతుంది. దీనినే
శ్రద్ధగా శాంతంగా వినడం అంటాం.
అలాగే
దర్శించడం. చూడడం వేరు,
దర్శించడం వేరు. చూడడం బాహ్యానికి పరిమితం కాగా దర్శన అంతశ్చేతన జాగ్రతమవడం
వల్ల కలుగుతుంది.
ఇక
గ్రహించడం... వస్తువు ఒకటే ఉంటుంది కాని మనం చూచే విధానంలో వైవిద్యం కనిపిస్తుంది.
ఉదాహరణగా... The
woman without her man is nothing అనే వాక్యం తీసుకుందాం. దీనిని The
woman: without her, man is nothing గా గ్రహించవచ్చు లేదా The
woman, without her man, is nothing గా చెప్పుకోవచ్చు. వాక్యం
మారలేదు కాని భిన్నమైన అర్థాలు వచ్చాయి. ఎవరికి తోచిన రీతిలో వారు అర్థం
చేసుకుంటారు. అందుకే, ఎదుటి వారి ఆలోచనా విధానం ఏమిటో
గ్రహిస్తూ వారు చెప్పేది అర్థం చేసుకోవడం, గ్రహించడం,
నేర్చు కోవడం అవసరం.
అందుకే, పిప్పలుడు
విద్యార్థులై వచ్చిన వారికి పై అర్హతలు ఉన్నాయా అనే పరీక్ష పెట్టాడు. దానికి
సంవత్సర కాలాన్ని నిర్దేశించాడు. సంవత్సరకాలంలో వారి మానసిక భావోద్వేగ శక్తి
సామర్ధ్యాలను నిశితంగా పరీక్షించి సంతృప్తి చెందాక వారికి విజ్ఞానాన్ని అందించాడు.
ఇలా
సంవత్సరకాలం సుశిక్షితులైన ఆరుగురు పిప్పలుని చేరి వినయంతో ప్రశ్నించారు....
సంవత్సర వ్రతం తరువాత ప్రశ్నించమని పిప్పలుడు చెప్పాడు వారా వ్రతం నియమం ప్రకారం
ఆచరించారు. మరి వినయంతో ప్రశ్నించడం ఎందుకు? వినయం లేని విద్యకు విలువ
లేదు. అంతేకాదు, శ్రద్ధతో బ్రహ్మచర్యం, తపస్సులను సాధన చేసిన వారికి అదనంగా బహుమానంగా వినయశీలం అలవడుతుంది.
ఆవినయమే వారి విజయానికి ప్రథమ సోఫాన మౌతుంది.
మొదటి
ప్రశ్న
మొదటి
ప్రశ్న: కాత్యాయన కబంధిచే ప్రశ్నించబడింది.
"భగవాన్, కుతో
హ వా ఇమాః ప్రజాః ప్రజాయంతి ఇతి"? హే భగవాన్! ఈ సకల
చరాచర సృష్టి అంతా ఎక్కడి నుండి వచ్చింది?
ఇక్కడ
ఒక విషయం గమనించాలి. ఆనాటి నుండి ప్రతి జిజ్ఞాసువునూ తలచివేస్తున్న ప్రశ్నయే ఇది.
ఆది అంతంలేని కాలం యొక్క రహస్యం ఏమిటి? భగవంతుడేమిటి? ఎక్కడ ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలు దేశ విదేశ
తత్త్వవేత్తలను తొలచివేస్తూనే ఉన్నాయి.
ప్రశ్నించిన
వారు సామాన్యులేమీ కాదు. తత్త్వశోధనలో తపిస్తూ బ్రహ్మ తత్త్వాన్ని (Ultimate
Reality) తెలుసుకునే క్రమంలో పిప్పలుని చేరినవారే. మరి వారి
మార్గాన్ని తొలగి ఈ ప్రశ్నను వేయడంలో అంతరార్థం ఏమిటి?
పుస్తకస్తమైన
విజ్ఞానం కలిగి ఉండడం వేరు అనుభవపూర్వకంగా దానిని గ్రహించడం వేరు. పుస్తకస్తమైన
విజ్ఞానం దారి చూపుతుంది కాగా ఆచరించడం వల్ల కలిగిన అనుభవం అనుభూతి నిస్తుంది.
"కోవా" ఎంత బాగుంటుందో ఎంత చదివినా, ఎంతగా విన్నా దానిని
తిన్నప్పుడు కలిగే అనుభూతిని పొందలేము. అంతేకాదు, ఎప్పుడైనా
విషయాన్ని అవగాహన చేసుకోవాలంటే.. అక్షరాలను నేర్వాలి, క్రమ
క్రమంగా చదవాలి, దానిని బోధపరచుకోవాలి, తదుపరి దానిని ఆచరణలో పెట్టి ఫలితాలను స్వయంగా పరిశీలించాలి. అప్పుడే ఆ
విజ్ఞానం అవగతమౌతుంది.
అంతేకాదు...
ప్రతి వ్యక్తీ ముందుగా భౌతికమైన సంతోషాన్ని పొందాలనుకుంటాడు, అటువైపు
ప్రయత్నిస్తాడు. కొంతకాలానికి అందులో కనిపించే డొల్లతనం వల్ల తన లక్ష్యం భౌతిక సంతోషం (Pleasure)కాదని మరేదో ఉందని ఆ స్వర్గ సుఖాలను (Happiness) పొందాలని
తలుస్తాడు. కాని కొంతకాలానికి ఆ స్వర్గ సుఖాలు కూడా శాశ్వతం కాదని గుర్తిస్తూ
శాశ్వతానందం లేదా తాదాత్మ్య సిద్ధికై (Bliss) పరితపిస్తాడు. కాని అది కూడా
కొంతకాలానికి శాంతి నివ్వదు. తదుపరి తన
నిజస్వరూపం తెలుసుకునే యత్నంలో "యెఱుక"ను సాధించి తన్మయ స్థితికై (Ecstasy)
సాధన చేస్తాడు. ఇది క్రమ క్రమంగా జరగాల్సిన ప్రక్రియ. అక్షరస్తమైన
విజ్ఞానం వల్లనో లేదా చర్చల వల్లనో ఈ స్థితిని పొందలేము. ఆచరణలో మాత్రమే ఈ అనన్య
స్థితిని సాధించగలుగుతాము. కాబట్టే, సృష్టి రహస్యాన్ని
ప్రశ్నించడంతో ఆరంభించారు వారి ప్రశ్నలు.
కబంది ప్రశ్నకు
పిప్పలాదుడు ఇలా బదులిచ్చాడు... సృష్టికర్త సంతానం కోరినవాడై ధ్యానించాడు.
లక్ష్యంపై ఏకీకృతమై నిలిచిన మనస్సుతో తపస్సు చేసి "రయి(పదార్ధము) మరియు
ప్రాణము (శక్తి)" అనబడే ఒక జంటను సృష్టించాడు. ఈ రెండు పదాలు సాంకేతికమైనవిగా
వ్యవహరించ బడుతున్నాయి. వీటిని ఆంగ్లంలో సమానార్ధకాలుగా Matter
and Energy గా వ్యవహరిస్తారు. ఆ రెండూ "కలసి" లేదా ఈ
రెంటి సంయోగం వల్ల అనేక సంతతి కలుగుతుందని ఆయన భావించాడు. ఈ జంటనే మిథునం అంటారు.
అందులో ఒకటి Male energy కాగా రెండవది Female energy అంటారు. Male energy ది creative nature కాగా Female energy ది Accepting nature. ఒకటి భోక్త (predator)
లేదా అనుభవించే శక్తి, రెండవది భోజ్యం (prey)
లేదా అనుభవింపబడేది. చంద్రుడు పదార్ధానికి
మరియు ఆహారానికి ప్రతీక కాగా సూర్యుడు
అగ్నికి మరియు శక్తికి ప్రతీకగా ఈ ఉపనిషత్తు వివరిస్తుంది. అలాగే సకల చరాచర సృష్టి
అంతా కూడా మిథున రూపంగానే అర్థం చేసుకోవాలి.
ఆంగ్లంలో Pair గా వ్యవహరింపబడే సూర్యచంద్రులు, అహోరాత్రాలు, శుక్లపక్ష కృష్ణపక్షాలు, ఉత్తరదక్షిణాయనాలు, ప్రవృత్తి
నివృత్తులు, స్త్రీపురుషులు మిథునంగా చెపుతారు.
నిజానికి భగవంతుడు నిరీహుడే అంటే కోరికలు లేనివాడే. కాని యోగనిద్రలో
ఉన్న అతనికి తనలాంటి మరికొన్ని బ్రహ్మ పదార్ధాలను సృజించాలనే "కామన"
కలిగింది. కామన లేదా కోరిక లేదా ఇచ్ఛ మనసులో కలుగుతుంది అంటే ఆ బ్రహ్మ పదార్ధానికీ
మనస్సు ఉంది. ఆ మనస్సునె ప్రజాపతి అంటాము. సంకల్పం కలగడమే ఇచ్ఛాశక్తి. దాన్నే మనం
విస్ఫోటనం జరిగింది అంటున్నాము. మరి ఎలా సృజించాలి? అందుకే
ధ్యానం చేసాడు. ఆ ధ్యానంలో స్ఫురణ కలిగింది. అదే జ్ఞాన శక్తి. ఆ స్ఫురణను ఆచరణలో
పెట్టాడు. అదే క్రియా శక్తి. దానితో సృజన జరిగింది.
దీనిని
వ్యాఖ్యానిస్తూ, వేదం ప్రమాణంగా తీసుకున్న శ్రీ ఆది శంకరులు, రయి
అంటే అన్నం లేదా చంద్రుడు అన్నారు. అలాగే ప్రాణం అంటే అగ్ని లేదా భోక్తగా
చెప్పారు. నిజానికి అన్నం (ఆహారం) అంతా కూడా చంద్రుని వలన కలుగుతుంది. అలాగే భూమికి
అగ్నితత్త్వాన్ని తేజస్సును ఇచ్చే సూర్యుడే భోక్త. జీవుడు కూడా అన్నం మరియు ఊపిరి
అంటే ప్రాణంల ద్వారానే వర్ధిల్లుతాడు. నిజానికి మనం భుజించేది అంతా కూడా పదార్ధమే.
ప్రాణం అంటే అంతర్లీనంగా మనలను నడిపించే చైతన్యం లేదా యెఱుక లేదా జ్ఞానము. ప్రతిజీవి పదార్ధ జనితమే కాక అందులో ప్రాణం
ఉంటుంది. కాబట్టే పదార్ధము శక్తి ఈ రెంటి సమ్మిళితమే సకల చరాచర సృష్టి. అందుకనే
ప్రతిపదార్ధంలో కూడా శక్తి ఉంటుంది. అలాగే పదార్ధానికి పదార్ధానికి మధ్య శక్తికి
శక్తికి మధ్య శూన్యం ఉంటుంది. అలాగని శూన్యం శక్తితో పూరింప బడిందని కాని అలా
పూరింప బడలేదని కానీ చెప్పలేము. శూన్యంలో
శక్తి ఉన్నా అది నిశ్చల స్థితిలో (Inert)
ఉంటుంది. పదార్ధాలన్నీ శూన్యంలో ఉంటాయి.
అలాగే శూన్యంలో ఉండే ప్రతి పదార్ధం శక్తి పూరకంతో ఉంటుంది. కాబట్టి నిజానికి
ఆలోచిస్తే రయి ప్రాణాలతో పాటుగా ప్రజాపతి శూన్యాన్ని కూడా సృష్టించాడని
చెప్పుకోవచ్చు. మరొక్క విషయం... ప్రతి పదార్ధమూ శూన్యంలోని మరొక పదార్ధంతో
సంబంధాన్ని కలిగి ఉంటూనే తన ప్రత్యేకతను నిలుపు కుంటుంది.
దీనిని
నిశితంగా అర్థంచేసుకుంటే... ప్రజాపతి పదార్ధాన్ని, శక్తినే
కాక శూన్యాన్నీ సృజించాడని అర్ధం అవుతుంది. అలా శూన్యాన్ని సృజించకుంటే చంద్రుడు, సూర్యుడు, పదార్ధం ఇవన్ని ఎక్కడ ఉండేవి?
పదార్ధం, శూన్యం,
కాలము ఈ మూడింటి అస్థిత్వం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి.
జీవకోటి దీనినే ఆకృతులు అందాం ఇది లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. శూన్యం అనంతంగా
ఉంటుంది. కాలం నిరంతరం సాగిపోయేది. దీనికి ఎప్పుడూ వర్తమానం తప్ప భూత భవిష్యత్తులు
ఉండవు. భూత భవిష్యతులు మన ఊహలు లేదా కల్పితాలు లేక ఆలోచనలు మాత్రమే. ఆకృతులు పరిమితమైన ఆకారంలో ఉంటాయి. శూన్యం
అపరిమితమైనది. ఆకృతులకు క్రియాశీలత
ఉంటుంది. శూన్యం క్రియాశీలం కాదు.
శబ్ధం భావాన్ని వ్యక్తీకరిస్తుంది. భావం శబ్దం ద్వారా
తెలుసుకోబడుతుంది. పరస్పరాధారితలైన ఈ రెంటిలో ఒకటి లేకుండా మరొక దానికి ఉనికి
లేదు. అలాగే పదార్ధం లేకుండా ప్రాణానికి ఉనికి లేదు. అలాగే ప్రాణంలేని పదార్ధానికి
గుర్తింపు లేదు.
మనకు కనిపించే, కనిపించని సృష్టిలో స్థూలమైనవి సూక్ష్మమైనవి అణువులూ, మూలకాలు అవి మూర్తిమత్వం కలిగినవి కావచ్చు లేదా అమూర్తిమంతమైనవీ కావచ్చు అన్నీ
అనగా సాకారమైనవీ నిరాకారమైనవీ అన్నీ పదార్ధం ద్వారా మాత్రమే వ్యక్త మౌతున్నాయి. ఈ పదార్ధ శక్తులలో కనిపించే భేదం భావాత్మకమే కాని వస్తుగతం కాదని
చెపుతుంది ఈ ఉపనిషత్తు. పంచభూతాలలో భూమి, నీరు, అగ్ని ఈ మూడూ స్థూలాలు సాకరమైనవి. వాయువు, ఆకాశం ఈ
రెండూ సూక్ష్మాలు నిరాకారమైనవి. ఈ అయిదింటి మిశ్రమమే సకల సృష్టి.
ఉదాహరణకు…మనిషిని తీసుకుంటే, స్థూలమైన
శరీరం కనిపిస్తుంది కాని దాని చేతనకు (కదలికకు) ఆధారమైన ప్రాణం కనిపించదు.
కనిపించని ఆత్మ అనబడేది సూక్ష్మ మైనది. పరస్పరాధారితలైన ఈ రెండింటిలో ఏ ఒక్కటి
లేకున్నా మరొక దానికి ఉనికి లేదు.
వేద విజ్ఞానం
సూర్యుడిని చాలా ఉన్నతంగా చూపుతుంది. సూర్యుడు తన కిరణాలతో అన్ని దిక్కులను
ప్రకాశింపచేస్తున్నాడు. జీవులన్నింటికీ ప్రాణాన్నందిస్తున్నాడు. సూర్యరశ్మి వల్లనే
పంటలు పండడం, జీవులకు ఆహారం లభించడం జరుగుతుంది. జీవుల కడుపులో
జఠరాగ్ని రూపంలో "ఆకలి"ని కలిగించి పదార్ధ అస్థిత్వానికి మూలమౌతున్నాడు.
అందుకే సూర్యుడిని విశ్వరూపం (విశ్వమే రూపముగా కలిగినవాడు), హరిణం
(కిరణములు కలిగినవాడు), జాతవేదసం (సాక్షీభూతుడై అంతటా
ప్రసరిస్తాడు కాబట్టి సర్వమూ తెలిసిన వాడు), పరాయణం (సకల
ప్రాణులకు ఆధారమైనవాడు), జ్యోతి (కాంతివంతము), తపంతం (వేడిమి నిచ్చేవాడు), అని వివిధ నామాలతో
గుర్తిసుంటారు. అంతేకాదు, సుర్యుడే సమగ్రమైన విజ్ఞానానికి
ప్రతిరూపంగా చెపుతారు. ఎలాగైతే భౌతికమైన చీకట్లను తన కిరణాలతో తొలిగిస్తాడో అలాగే
అజ్ఞానమనే మానసిక అంధకారాన్ని జ్ఞానప్రకాశనతో తొలగిస్తాడు. అందరిలో సహజాతమైన
చైతన్యానికి(తెలివికి) చేతన (కదలిక)
నివ్వడం, పదార్ధానికి ప్రాణశక్తి నివ్వడం వల్ల సూర్యుడు సూర్య భగవానునిగా చెప్పబడుతున్నాడు. సర్వవ్యాపకత (Omnipresence)
సర్వశక్తి సంపన్నత (Omnipotent) సర్వజ్ఞత (Omniscient)
భగవంతుని లక్షణాలుగా చెపుతారు. అందుకే తాత్త్వికమైన పరిభాషలో
సూర్యుడిని పరాప్రకృతిగా, చంద్రుడిని అపరాప్రకృతిగా
వ్యవహరిస్తారు.
సూర్యచంద్రుల
గమనమే కాలము. సూర్యోదయమౌతుంది, సూర్యుడస్తమిస్తాడు,
చంద్రోదయమౌతుంది, చంద్రాస్తమయమౌతుంది. మరల
సూర్యోదయం చంద్రోదయం అలా జరిగిపోతుంది. అంటే గతంనుండి వర్తమానంద్వారా
భవిష్యత్తులోనికి పయనించడం జరుగుతుంది. ఇదే కాలము. గతంలో మనకొక అనుభవం కలుగుతుంది.
ఆ అనుభవం జ్ఞానాన్ని ఇచ్చింది. వర్తమానంలో ఆ జ్ఞానానికి సంబంధించిన స్మృతి ఉంది.
అలాగే భవిష్యత్తుకు సాగే క్రమంలో ఆ జ్ఞానం యొక్క స్మృతి ఆలోచనగా ఆసరా అవుతుంది.
అందుకే ఆలోచనయే కాలం; కాలమే ప్రజాపతి అంటారు. అప్పుడు కాలానికి అంతం ఉంటుందా? అంటే ఉండదనే జవాబు. అలాగే కాలానికి ఆగిపోవడం ఉంటుందా ? అంటే ఉండదనే జవాబు. అనంతమైన దానికి ఆది అంతంఉండదు అలాగే నిరంతరం సాగిపోయే
దానికి ఆగిపోవడం ఉండదు.
సూర్యుడు
మకరరాశిలోకి ప్రవేశించడం ఉత్తరాయనం, కర్కాటక
రాశిలోకి ప్రవేశించడం దక్షిణాయనంగా చెప్పుకుంటాము. ఈ రెండూ రెండు దారులంటుంది
ప్రశ్నోపనిషత్తు.
మనం ఆచరించే ప్రతిపని
"కర్మ"గా చెప్పబడుతుంది. అలాగే ప్రతి కర్మకూ ఒక ఫలితం ఉంటుంది. ఆ కర్మ
ఫలితాన్ని అనుభవించ వలసి ఉంటుంది. ఈ కర్మలు రెండు రకాలుగా చెప్పబడ్డాయి. ఒకటి
"ఇష్ట" రెండవది "పూర్తి".
అగ్నిహోత్రం, తపః, సత్యం, భూతానాంచానుపాలనం
ఆతిథ్యం, వైశ్వదేవశ్చ “ఇష్ట”మిత్యభిదీయతే!
అనునిత్యం ఆచరించ
వలసిన అగ్నికార్యాదులు, హోమాదికాలు,
సత్య దీక్ష, పశుపక్ష్యాదులను జీవకోటిని
దయతో చూడడం, అతిథిపూజ, వైశ్వదేవం..
లాంటి నిత్య నైమిత్తికాలు నిర్వహించడం, అలాగే పితృదేవతలకు
శ్రాద్ధాదులు ఆచరించడం "ఇష్ట" మని అంటారు. ఎప్పుడైతే వీటిని కామ్యకాలుగా
చేస్తామో లేదా ఏదో ఆశించి నిర్వహిస్తామో అప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించే క్రమంలో
చంద్రలోకంలో వసించవలసి ఉంటుంది.
వాపీకూప తటాకాది
దేవతాయతనానిచ
అన్నప్రదానమారామః “పూర్త”మత్యభిదీయతే!
బావులు చెరువులు
త్రవ్వించడం, దేవాలయాలు కట్టించడం, అన్నదానాలు
చేయడం, ఉద్యానవనాలు ఏర్పాటు చేయడంలాంటి ప్రజా సంక్షేమ
కార్యక్రమాలు నిర్వహించడం "పూర్తం" అని చెప్పబడుతుంది.
ఈ "ఇష్ట, పూర్త" కర్మల నాచరించడంలో నేను చేస్తున్నాననే "అహంభావం"
పొడ సూపితే
అలాంటివారు చంద్రలోకంలో వారి అనుభవాన్ని పొందుతారు. అలా చంద్ర లోకం వెళ్ళడం
"దక్షిణాయనం"గా పేర్కొంటుంది, ప్రశ్నోపనిషత్తు. ఆ
అనుభవ ఫలితం అయి పోయాక వారు తిరిగి మరల మరల జన్మలనెత్తడం జరుగుతుంది. భౌతిక
జీవనం పట్ల అనురక్తులైన వీరిని
"అవిద్వాంసులు"గా పరిగణిస్తారు. చంద్రుడు పదార్ధం కాబట్టి ఈ మార్గమూ
పదార్ధంగానే పరిగణింపబడుతుంది.
ఈ ఇష్టాపూర్తులకు
భిన్నంగా ఎవరైతే తపస్సూ, బ్రహ్మచర్యమూ, శ్రద్ధా,
జ్ఞానముల ద్వారా ఆత్మను అన్వేషిస్తారో వారు భౌతిక శరీరాన్ని
విడిచినాక సూర్యలోకం చేరుకుంటారు. దానినే "ఉత్తరాయనం"గా చెపుతారు. భౌతిక
జీవనం పట్ల అనురక్తిని వీడి సత్యాన్ని దర్శన చేస్తారు, ఆ
మార్గాన్ని అనుసరిస్తారు కాబట్టి వీరిని
"విద్వాంసులు"గా వ్యవహరిస్తారు. సకల శక్తులకు మూలమైన ఆ స్థానం పరమగమ్యం
కాబట్టి భయరహితులై శాశ్వతంగా అక్కడే ఉండిపోతారు.
ప్రాణం ఉన్నంత వరకు జీవులు కర్మానుసరణ
చేయాల్సిందే. అయితే ఆ కర్మలు కామన చేత చేసినవా లేక నిశ్కామ కర్మలా అన్నదే
విచారణీయం. కామన చేత ఆచరించిన కర్మలు అవి మంచివా చెడ్డవా అనే భేదంలేకుండా ఆయా
కోరికలననుసరించి ఫలితాన్ని ఇస్తావి. "క్షీణీ పుణ్యే మర్త్యలోకం
ప్రవిష్యతి" అన్నారు. మంచి పనుల ఫలితం అయిపోయాక ఎవరైనా మళ్ళీ జననమరణ
చక్రబంధనంలోకి విచ్చేయ వలసిందే.
ఎవరైతే అద్వైత
భావనతో స్వార్ధంలేని, కోరికలులేని మనస్సుతో సూర్యుని ఆరాధిస్తారో వారు
సూర్యలోకం చేరి క్రమంగా అక్కడనుండి జీవన్ముక్తులౌతారు లేదా బ్రహ్మత్వాన్ని
పొందుతారు.
సంవత్సరాన్ని
విఫులీకరిస్తూ పిప్పలాదుడు ఇలా చెపుతున్నాడు. కొందరు ఋషులు తమ తపో దీక్షలో
సూర్యుని దర్శించిన దాని ప్రకారం… ఆకాశం పైన సూర్యుడు
"అయిదు పాదాలు", "పన్నెండు రూపాలూ"
కలిగి ఉన్నాడు. తండ్రిలా ప్రజలకు వర్శాలనిస్తూ రక్షిస్తూ ఉంటాడంటారు. మరికొందరు తమ
దర్శనలో "ఏడు చక్రాలు" "ఆరుఆకులు" గల రథంపై ఉంటాడని చెపుతారు.
సూర్యకాంతి ద్వారా
ప్రాణం కలుగుతుంది, ఆహారపదార్ధాలు సృజింపబడుతాయి, ఆ
ఆహారమే జీవులను పోషిస్తుంది కాబట్టి సూర్యుడు తండ్రిగా చెపుతుందీ ఉపనిషత్తు.
కాలానికి కొలత దివారాత్రాలు. ఆ రేయిపవళ్ళు సూర్యుని ద్వారా ప్రకటితమౌతున్నాయి.
కనుక సూర్యుడు కాలంగా వ్యవహరింపబడుతున్నాడు.
అయిదుపాదాలు ఋతువులను చెపుతున్నాయి. హేమంతము, శిశిరము
కలిపి ఒకే ఋతువుగా చెపితే ఆరు రుతువులు అయిదుగా అన్వయ మౌతాయి. పన్నెండు రూపాలు
పన్నెండు మాసాలకు ప్రతీకలు కాగా ఆరు ఆకులు వ్యవహారంలో ఉన్న ఆరు ఋతువులు. ఏడు చక్రాలు సూర్యుని రథానికి
పూన్చిన ఏడు గుర్రాలుగా ప్రకటించారు.
మాసాన్ని
ప్రజాపతిగా చెపుతున్న ఉపనిషత్తు, సూర్యుని నడక ననుసరించి చంద్రునికి వృద్ధిక్షయాలు ఉన్నాయని తత్ఫలితంగా
ఒక మాసానికి రెండు పక్షాలు ఏర్పడతాయని చెపుతుంది. ఒకటి కృష్ణ పక్షం కాగా మరొకటి
శుక్లపక్షం. క్షయం కారణంగా కలిగే కృష్ణపక్షం పదార్ధంగా వృద్ధి ఫలితంగా కలిగే శుక్ల
పక్షం ప్రాణంగా చెపుతూ కొందరు సత్యకర్మలు శుక్లపక్షంలోనే నిర్వహిస్తారని మరికొందరు
రెంటినీ సమంగా చూడడం కారణంగా రెండుపక్షాలలోనూ సత్కర్మాచరణ చేస్తారని చెపుతుంది,
ఉపనిషత్తు.
అలాగే పగలు
ప్రాణానికి ప్రతీక కాబట్టి పగలు సంభోగం వల్ల ప్రాణశక్తి వృధా అవుతున్నదని, రాత్రి సంభోగం ఇంద్రియ నిగ్రహణతో సమానమని చెపుతుందీ ఉపనిషత్తు.
అన్నం అంటే ఆహారం
వల్ల రేతస్సు, రేతస్సువల్ల ప్రాణికోటి ఉద్భవిస్తుంది. కాబట్టి
అన్నమూ ప్రజాపతే అంటుందీ ఉపనిషత్తు. దీనిద్వారా ఒక నిశ్చితమైన భౌతిక శాస్త్ర
విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు, ఋషులు. ఒకటి, విస్ఫోటనం (సంకల్పం) వల్ల సృజనకు అంకురార్పణ జరిగింది. అఖండమూ అనంతంగా
సాగిపోయే కాలమే ప్రజాపతి. పదార్ధము, శక్తి సంయోగము చేతనే
సృష్టి జరుగుతుంది. జీవులకు ఆకలి వల్ల సృజన విస్తరణ జరుగుతుంది. ఆహారం సూర్య
రశ్మివల్ల కలుగుతుంది. ఆహరం వల్ల రేతస్సు, రేతస్సు వల్ల
ప్రాణిజాతం ఉద్భవిస్తుంది. కాలగమనాన్ననుసరించి మాసాదులు కలుగుతాయి. అలాగే నిష్కామ
కర్మల వల్ల సూర్యలోకం ప్రాప్తిస్తుంది అక్కడ నుండి క్రమంగా జీవన్ముక్తులౌతారు.
ఈ ప్రజాపత్య వ్రతం ఆచరించే వారికి సంతానంగా
పుత్రుడు, పుత్రిక జన్మిస్తారని పెద్దలు చెపుతారు.
రెండవ
ప్రశ్న
తదుపరి విదర్భ దేశీయుడైన భార్గవుడు
రెండవ ప్రశ్న వేసాడు. దేవా! ఈ ప్రాణులందరికీ ఎంతమంది దేవతలు ఆధారరూపంగా ఉంటారు? ఆ
ప్రభావం ఎలా ప్రకటితమౌతుంది. ఈ దేవతలలో శ్రేష్ఠులెవరు? అంటూ
రెండవ ప్రశ్నవేసాడు.
ఈ ప్రశ్నలో ముఖ్యమైనది
"దేవతలు" అనే పదం. వైదిక పరిభాషలో దేవతలు అంటే శక్తులు, అవయవాలు
లేదా ఇంద్రియాలు అనే అర్థం. ఇంద్రియాలు రెండు రకాలు. జ్ఞానేంద్రియాలు మరియు
కర్మేంద్రియాలు. కొన్ని సాంకేతిక పదాలను అర్థంచేసుకునే సమయంలో వాటి అంతరార్ధాన్ని
గ్రహించాలే కాని భౌతికార్ధానికి పరిమిత మవకూడదు.
ఈ ప్రశ్నకు మహర్షి ఇలా చెపుతున్నాడు:
"ఆకాశమే" ఆ దేవుడు.
మొదటి ప్రశ్నకు
జవాబుగా పదార్ధము శక్తిల సంయోగము వల్ల సృష్టి జరిగిందని పిప్పలాదుడు చెప్పాడు.
శరీరము పదార్ధము కాగా శక్తి ప్రాణం. ఈ ప్రాణం అంతర్లీనంగా ఉండి శరీరం యొక్క ఉనికికి
మూలాధారమౌతుంది. పంచభూతాల కలయికచే శరీరం ఏర్పడుతుంది. శరీరంలో అనేక భాగాలు పని
చేస్తుంటాయి. ఈ శరీరం శూన్యంలో ఆవిష్కరింపబడి ఉంటుంది. పదార్ధమైన శరీరంలో మనస్సు
ఉంది. ఈ శరీరమూ మరియు మనస్సు ఈ రెండూ ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అయితే ఒక
యంత్రంలో విడి భాగాలు ఎలాగైతే ఒకదానిపై ఒకటి ఆధారపడినా దేని కర్తవ్యాన్ని అవి
నిర్వహిస్తుంటాయో అలాగే శరీరంలో ప్రతి అంగమూ దేనికదే ప్రత్యేకమైనదే అయి వాటి వాటి
విధ్యుక్త ధర్మాన్ని అవి నిర్వహించినా
మనసు యొక్క సూచనల ప్రకారం ఒక దానిపై మరొకటి ఆధారపడి పనిచేస్తుంటాయి. ఉదాహరణకు
కన్ను చేసే పని నోరు చేయలేదు. అలాగే నోరు
చేసే పని కాలు చేయలేదు. అయినా కన్ను చూసిన దానిని నోరు చెపుతుంది, నోరు చెప్పిన చోటికి కాలు కదులుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న...
శరీరాన్ని ఆశ్రయించిన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు
దేని సామర్ధ్యం దానిదే అయినప్పుడు, వాటిని సమన్వయం చేసే
వ్యవస్థ ఏది? అన్నదే ప్రశ్న.
ఉపనిషత్తు ఇక్కడ
ఒక చిన్న కథను చెపుతుంది. ఒకప్పుడు, తామే గొప్ప
అని ఇంద్రియాలు అన్నీ ప్రాణంతో అన్నాయట. అప్పుడు ప్రాణం ఇంద్రియాలతో.... మీరా
భ్రాంతిలో ఉండకండి. మీకు స్వయం ప్రతిపత్తి లేదు. నన్ను నేనే
5 భాగాలుగా (ప్రాణ, అపాన. వ్యాన,
ఉదాన మరియు సమాన అనే పంచ వాయువులు)
విభజించుకొని ఈ శరీరానికి ఆధారమౌతున్నాను. ఈ శరీరాన్ని భరిస్తున్నాను, రక్షిస్తున్నాను, అన్నదట. ఆ మాటలను నచ్చని
ఇంద్రియాలు ప్రాణాన్ని అపహాస్యం చేసాయి. అభిమానపడిన ప్రాణం శరీరాన్ని విడిచి వెళ్ళడానికి ఉద్యుక్త మయిందట. ఎప్పుడైతే
ప్రాణం తన తేజస్సును ఉపసంహరించుకునేందుకై సిద్ధపడిందో మనసుతో సహా ఇంద్రియాల శక్తి
కూడా నిర్వీర్యమై పోయిందట. మళ్ళీ ఇంద్రియాలన్నీ ప్రాణాన్ని ప్రార్ధించడంతో ప్రాణం
స్థిరపడిందట. దానితో ఇంద్రియాలూ కుదుట బడ్డాయట. దానితో… తమ అస్థిత్వ మూలాన్ని అర్థం
చేసుకొన్న ఇంద్రియాలు ప్రాణాన్ని సంస్తుతించాయట. ప్రాణమే అగ్ని రూపంలో దహిస్తుంది,
సూర్య రూపంలో వెలుగునిస్తుంది, మేఘరూపంలో
వర్షాన్నిస్తుంది, ఇంద్రునిగా ప్రజలను పాలిస్తుంది లేదా
రక్షిస్తుంది. ఇవన్నీ శక్తి యొక్క రూపభేదాలు మాత్రమే. సత్ (రూపం ఉన్నది
Existing) అసత్ (రూపం లేనిది Non- existing) అంతా
కూడా ఆ ప్రాణరూపమే. సత్ అంటే స్థూలంగా దృశ్య మానమైనది కాగా అసత్ అంటే సూక్ష్మమైన అదృశ్యమానమైనది లేదా
కారణభూతమైనది. ఈ రెండూ శుద్ధ చైతన్య తత్త్వమైన పరమాత్మ లేదా ప్రజాపతి లేదా
బ్రహ్మన్ అనే భావనకు ఆధార భూతమైనవే. ఇవే "అమరత్వానికి" సాపేక్షంగా
చెప్పబడ్డాయి. ఎందుకంటే ఈ శుద్ధ చైతన్యం లేదా ప్రాణం అనేది శాశ్వతంగా ఉంటుంది.
శరీరం కొద్ది కాలానికే పరిమితమైనది. ఈ శరీరంతో వ్యక్తి చేసే పనులు లేదా కర్మలు
అనుభవించాల్సి ఉంటుంది. అవి మంచివా చెడ్డవా అనేది కాదు ప్రశ్న అనుభవిస్తున్నామా
లేదా అనేది మాత్రమే చర్చనీయాంశం.
ఒక బండి చక్రానికి
ఉండే ఆకులు ఇరుసుపై ఆధారపడినట్లే జగమంతా కూడా ప్రాణంపై ఆధారపడి ఉన్నదే. వేదాలు, వర్ణాలూ ఒకటేంటీ అన్నీ సమష్టి జీవశక్తితో అనుసంధానమై ఉన్నాయి. ఆ సమష్టి
జీవశక్తియే శుద్ధ చైతన్యం లేదా ప్రజాపతి. అపరిమితమైన జీవశక్తి పరిమిత రూపంలో
స్త్రీ గర్భం ద్వారా జనిస్తుంది. ఈ జీవ శక్తి యొక్క తేజస్సును ఇంద్రియాలే
పోషిస్తున్నాయి.
మనం చేసే ఏ మంచి
కార్యమైనా యజ్ఞంగానే భావించ బడుతుంది.
యజ్ఞంలో వ్రేల్చబడే హవిస్సును దేవతలకు అగ్నిరూపంలో ఈ తేజస్సే అందిస్తుంది. వాహనంగా
పనిచేస్తున్న ఈ శక్తినే "వహ్ని" అంటారు. సమష్టి శక్తి యైన ప్రాణం
ఒక్కొక్క కర్మాచరణలో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. పురుషునిలో రేతస్సుగా, స్త్రీ అండాశయం లో అండంగా, వివిధ అంగాలుగా, మనస్సు, బుద్ధి లాంటివిగా ఇలా పలు విధాలుగా తనను
తాను విభజించుకొని ప్రాణశక్తియే ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉన్నది. అంటే ఒకే
పరమాత్మ ప్రతి జీవిలోనూ పదార్ధంగా, జీవశక్తిగా ప్రకటిత
మౌతున్నాడు. అదే పరమాత్మ లేదా ప్రజాపతి లేదా ప్రాణం యొక్క దివ్యత్వం.
సర్వేంద్రియాలకు
అధిదేవతగా చెప్పబడే ఇంద్రుడవు నీవే. సకల సృష్టిని రక్షించే విష్ణువువు నీవే అలాగే
సకల ప్రాణులను లయం చేసుకునే రుద్రశక్తివీ నీవే. అంతేకాదు, అనునిత్యం ఆకాశంలో సంచరిస్తూ జ్యోతిని ప్రసాదించే సూర్యునివీ నీవే అంటూ
ప్రాణాన్ని ప్రస్తుతిస్తున్నాయి, ఇంద్రియాలు. సృజన
జరుగుతుంది, వ్యాప్తి చెందుతుంది, లయమౌతుంది.
ఇది సహజ ప్రక్రియ. ఈ మూడూ రూపాలలో ప్రకటిత మయ్యేది ఈ ప్రాణమే. అలాగే జగత్తును
వెలిగించేదీ, ఆహారాన్ని అందించేదీ ఈ ప్రాణ శక్తియే. అందుకే
దీనిని పరమాత్మ అన్నారు.
వర్షరూపంలో
వర్షిస్తే జగత్తంతా ఆహారం లభిస్తుందని సంతోషిస్తుంది. ఓ, ప్రాణమా! నీవు వ్రాత్యుడవు. వ్రాత్యులు అంటే సంస్కారము జరగని వారని అర్ధం.
సంస్కారాలు జరగనివి ఎవరికి? ఎవరికైతే తల్లి దండ్రులు,
రక్షకులు ఉండరో వారికి? ఆది అంతం లేని అనంత శక్తి, చావు
పుట్టుకలు లేని శాశ్వతమైనది, సర్వవ్యాప్తమైనది అయిన ఆది
శక్తికి మూలం ఎవరు? ఎవరు ఆ శక్తికి సంస్కారాన్నిస్తారు?
వ్రాత్య శబ్దం ప్రయోగించడం వల్ల ప్రాణమే మొట్టమొదటగా సృజింపబడిందని
చెప్పడం జరుగుతుంది.
జీవులు చేసే
యజ్ఞంలో ఇవ్వబడే హవిస్సును "ఏకర్షి" అనబడే అగ్ని రూపంలో భోక్తగా
భుజిస్తున్నావు. అలాగే వాయు రూపంలో తండ్రిగా మమ్మల్ని పాలిస్తున్నావు.
నిజానికి స్థూల
దృష్టిలో పదార్ధ రూపమైన శరీరాన్ని నడిపించేది దానికి ఆధార భూతమైనది సూక్ష్మ రూపంలో
ఉండే ప్రాణం మాత్రమే. ప్రాణం ఉంటే అంతా "శివమే" ప్రాణం లేకపోతే అంతా
"శవమే".
ఇది రెండవ ప్రశ్న.
మూడవ ప్రశ్న
ఇక మూడవ ప్రశ్నను కౌసల్యుడు అడిగాడు. దేవా! ఈ ప్రాణం ఎక్కడి నుండి
పుట్టింది? ఈ శరీరంలోకి ఎలా వచ్చింది? ఇది
తనను తాను ఐదు భాగలుగా విభజించుకొని ఈ శరీరంలో ఎలా ఉంటున్నది? దేని సహాయంతో అది నిష్క్రమిస్తుంది? అది ఎలా వెలుపలి
లోపలి ప్రపంచాలను భరిస్తుంది. (లోపలి ప్రపంచం అంటే ఇంద్రియాలు, మనస్సుగా చెపుతారు)
పిప్పలాదుడు
సంతోషంగా ఇలా అంటున్నాడు. ఓ కౌసల్యా! నీకు
బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస ఎక్కువగా ఉంది.
నీవడిగిన ప్రశ్నలు క్లిష్టతరమైనవి. సత్యాన్వేషణలో అమిత మైన కోరిక గలిగిన వారు
మాత్రమే ఈ ప్రశ్నలను సంధించగలరు. ఎందుకు? ఏదైతే
కనిపిస్తుందో అది ప్రత్యక్షప్రమాణం ద్వారా తెలుసుకో గలుగుతాము. కనిపించనిది లేదా
దృష్టి గోచరం కానిది ఎలా తెలుసుకోవడం? దానిని ఆప్త వాక్యం ద్వారా మాత్రమే అవగాహన చేసుకోవాలి. లేదా నిరూపణ
చేయగలిగిన ఊహ ద్వారా మాత్రమే ఊహించాలి. ఆప్త వాక్యం వేదం మాత్రమే. వేదాన్ని ఎంత
లోతుగా మథించ గలిగితే అంతటి విలువైన విజ్ఞాన
మణులను పొంద గలుగుతాము. నీ వడిగినది క్లిష్టమైన ప్రశ్నే అయినా, నా విజ్ఞానం అనుమతించిన మేరకు నీ ప్రశ్నకు సమాధానం చెపుతాను సావధానంగా
విను.
ఎప్పుడైతే
శిష్యుడు లేక జిజ్ఞాసువు లోతైన ప్రశ్న వేస్తాడో దానికి సమాధానం చెప్పడాని కన్నా
మించిన సంతోషం ఉత్తమ గురువుకు ఉండదు. అందుకే ... నీవు శ్రేష్ఠుడవు కాబట్టి
చెపుతున్నాను అంటూ పిప్పలాదుడు ఈ
విధంగా చెపుతున్నాడు.
ఆత్మ నుండి ప్రాణం
వస్తుంది. సూర్యుని కభిముఖంగా ఎవరైనా నిలుచుంటే అతని నీడ నేలపై పరచుకుంటుంది. ఆ
నీడ ఎలా ఏర్పడుతుంది? ఎవరు పరచారు? ఎవరైతే ఆ
సూర్యకాంతిలో నిలబడ్డారో వారిమూలంగా ఆ నీడ పరచుకుంది. అందుకని ఎవరైతే నీడ యొక్క
విస్తరణకు కారణమయ్యారో ఆ ఆకృతి "కారణము" అంటున్నాము. అలాగే విస్తరించిన
నీడను "పరిణామము" లేదా "ఫలితము" అంటాం. నీడ యొక్క విస్తరణ అనే
పరిణామము మనిషి వెలుతురులో నిలుచునే కారణం వల్ల ఏర్పడుతుంది. ఒకసారి సూర్యరశ్మి
గతించి పోయినా లేక మనిషి అక్కడి నుండి ప్రక్కకు జరిగినా ఆ నీడ ఉండదు. కాని
సూర్యుని కాంతిలో మనిషి ఉన్నంత సమయమూ ఆ నీడ ఉంటుంది. నిజానికి ఈ నీడనూ, మనిషినీ విడదీయడము సాధ్యపడుతుందా?
అంటే సాధ్యపడదు. ఎందుకు అంటే రెండింటి మధ్యా భేదం లేకపోవడమే
అనేదే జవాబు.
అలాగే పరమాత్మ అనే
ఆకృతికి మారురూపే ప్రాణం. దానినే పరమాత్మ యొక్క నీడ అంటున్నాము. ఎలాగైతే ఆకృతి
మరియు నీడలను విడదీయలేమో అలాగే బింబ ప్రతిబింబాలుగా ఉన్న పరమాత్మను ప్రాణాన్ని
విడదీయలేము. అలాగని ఇవి పరస్పరాధారితాలు కావు. ఎందుకంటే, ఎప్పుడైతే ఆకృతి మాయమవుతుందో నీడా మాయమవుతుందే కాని నీడ మాయమవుతే ఆకృతి
మాయమవదు. నీడ ఎప్పుడూ మనిషి ఆకృతిపై ఆధారపడినదే. ఈ ఉదాహరణలో మానవాకృతి సత్యమైనది.
నీడ అభాస. అలాగే పరమాత్మ సత్యమైనది జీవకోటి లేదా ప్రాణం అభాస మాత్రమే. ప్రాణమనేది
పరమాత్మ యొక్క ప్రతిబింబమే కాని తనకు ప్రత్యేకమైన అస్థిత్వం లేదు.
జీవుల శరీరంలో
ప్రతిబింబంగా పరమాత్మ చేరినా పరమాత్మ సాక్షీ భూతుడుగానే ఉంటాడు తప్ప ఆ శరీరానికి
సంబంధించిన మంచి చెడుల ప్రభావానికి లోనుకాడు.
మనస్సు యొక్క
చేష్టల ద్వారా లేదా వృత్తుల ద్వారా ఇది శరీరంలోకి ప్రవేషిస్తుంది. మన కోరికలు, ఆలోచనలు, ఆశలు వీటిని కల్పనలుగా చెప్పుకుంటాము. ఇవి
మనలో పాతుకుపోయిన పూర్వ నిశ్చితాభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తాయి. అలాగే మనలో
వెలుగు చూసే అజ్ఞానం యొక్క ప్రభావం కూడా వీటిపై ఉంటుంది.
అలాగే మనం పొందిన
జ్ఞానం యొక్క ప్రభావం కూడా వీటిపై ఉంటుంది. ప్రాకృతిక స్పందనల ద్వారా పొందిన
జ్ఞానం విజ్ఞుల బోధనల ద్వారా పరిణతమై విజ్ఞతగా మారడం, ఆ విజ్ఞత వివేచనగా వికసితమవడం, ఆ వికసన వల్ల
సత్యాన్ని గ్రహించడం, ఆ గ్రహణ స్పష్టత నీయడం జరుగుతుంది.
ఈ రెండింటి
ప్రభావానికి మనస్సు లోనౌతుంది. ఇందులో ఏది మంచిదో ఏది చెడ్డదో విచారణాంశం కాదు. ఏ
ప్రభావానికి మనస్సు లోనైందనేదే ముఖ్యం. దాని ననుసరించి మనస్సు ప్రవర్తిస్తుంది.
దాని కనువైన శరీరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అందులోకి ప్రవేశిస్తుంది.
మన కోరికలు, ఆలోచనలు, ఆశలు వీటి మధ్య ఎప్పుడైతే ఘర్షణాయుతమైన
వాతావరణం ఉంటుందో అక్కడ దుఃఖము, అశాంతి, అసంతృప్తి నెలకొంటుంది. దాని కనుగుణమైన వాతావరణంలో శరీరం నిర్మితమౌతుంది.
దీనికి భిన్నంగా ఉన్న చోట సుఖము, శాంతి, సంతోషాన్ని ఇచ్చే వాతావరణం తదనుగుణమైన శరీర నిర్మాణం జరుగుతుంది.
సంక్షిప్తంగా
చెప్పుకుంటే; కర్మానుగుణమైన శరీరాన్ని పొందడం జరుగుతుంది. కర్మ - ఫలితం
లేదా Cause and Effect సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రతిపాదించడం
జరిగింది.
ఒక చక్రవర్తి తన రాజ్యంలో వివిధ విభాగాలను
పాలించేందుకు అధికారులను నియమించినట్లుగా ముఖ్య ప్రాణం తనను తాను 5 భాగాలుగా
విభజించుకొని పాలనాధి కారాలను ఇస్తుంది. వాటినే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు
సమానాలుగా వ్యవహరిస్తారు. ఈ అయిదూ వేటికవే స్వతంత్రంగా పని చేస్తూ, ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ ముఖ్యప్రాణం యొక్క ఆదేశాల కనుగుణంగా పని చేస్తుంటాయి.
ఇక ఏ వాయువు ఎలా ఎక్కడ
పనిచేస్తుందో పరిశీలిస్తే....
ప్రాణ వాయువు
అనేది కన్ను, చెవి, ముక్కు మరియు నోరు
స్థానాలలో ఉంటుంది.
అపాన వాయువు
విసర్జన మరియు జననేంద్రియాలలో ఉంటుంది.
ఇక వ్యానం. హృదయంలో ఆత్మ సుప్రతిష్టితమై ఉంటుంది. ఈ హృదయంలో నూటాఒక్క
ముఖ్యమైన నాడులు ఉన్నాయి. ఈ నాడులను దమనులు సిరలుగా అర్ధం చేసుకోవాలి. అలాగే
ఒక్కొక్క నాడీ శాఖకు నూరేసి శాఖలు మరియు ప్రతి శాఖానాడికి మళ్ళీ డెభై రెండు వేల
ఉపశాఖలు ఉన్నాయి. వీటన్నింటిలో వ్యానం సంచరిస్తూ ఉంటుంది. అంటే సక్రమంగా శ్వాస
ప్రక్రియ జరుగుతూ సరైన రీతిలో రక్త ప్రసరణ జరిగే విధానానికి ఇంకా నాడీ వ్యవస్థ
యొక్క సరైన పనితీరుకు వ్యాన వాయువు బాధ్యత వహిస్తుంది.
సమానమనే వాయువు శరీర మద్య భాగంలో బొడ్డుకు దగ్గరగా ఉంటూ మనం తీసుకునే
ఆహారాన్ని జీర్ణం చేస్తూ అన్ని భాగాలకూ అవసరమైన శక్తిని అందిస్తుంది. నిజానికి
భారతీయ సంస్కృతిలో ఆహారాన్ని తీసుకోవడం ఒక పవిత్రమైన యజ్ఞంగా భావిస్తారు.
తీసుకునే ఆహారాన్ని ముందుగా భగవంతునికి
నివేదించి దానిని భగవత్ప్రసాదంగా స్వీకరిస్తారు. అందుకే ఆహుతి అనే పదాన్ని
వాడుతున్నది ఈ ఉపనిషత్తు. ఆహుతి ఇచ్చిన ఆహారాన్ని కడుపులో ఉండే జఠరాగ్ని
మండిస్తుంది. అందులో ఏడు జ్వాలలు కలుగుతాయి అంటుంది ఉపనిషత్తు. నోరు ద్వారా ఆహారం
ఆహుతులుగా అర్పించ బడుతుంది. ఆ ప్రక్రియకు రెండు చేతులూ, రెండు ముక్కు రంధ్రాలూ మరియు రెండు కన్నులు సహాయ పడతాయి. అందుకే వీటిని
"సప్తార్చిషో భవంతి" ఏడు జ్వాలలు కలుగుతాయని,
అన్నారు.
ఇక ఉదానమనే వాయువు; నిజానికి ఇది ప్రాణానికి అనుబంధంగా పనిచేస్తుంది. మానవులు ఈ భౌతిక ప్రపంచంలో చేసిన
కర్మ ఫలితాన్ని అనుసరించి ఏయే లోకాలకు అర్హత ఉంటుందో ఆయా లోకాలకు అంటే
పుణ్యలోకాలకు లేదా పాపలోకాలకు ఆత్మను సుశుమ్నా నాడిద్వారా పంపిస్తుంది, ఈ ఉదాన వాయువు. వెన్నుపామును అనుసరించి ఉండే ఈ నాడిని సుశుమ్నానాడిగా
పిలుస్తారు. పుణ్యపాప కర్మల ఫలితం సమానంగా ఉన్నప్పుడు ఆత్మను మానవ లోకాలకు
పంపుతుంది, ఈ ఉదాన వాయువు.
ఇలా శరీరం తన విధ్యుక్త కర్తవ్యాన్ని నిర్వహించేందుకు అనుకూలంగా ప్రాణ
శక్తి తనను తాను 5 విభాగాలుగా విభాగించుకుంటుంది.
సూర్యుడిని బాహిరమైన ప్రాణంగా చెప్పుకుంటాము. సూర్యుడు ఉదయిస్తాడు తన
కిరణాలతో జగత్తును వెలిగిస్తాడు. అదే సూర్యుని యొక్క వెలుగు మన కంటి చూపుగా బాహిర
ప్రపంచాన్ని దర్శించేందుకు అంతరంగంలో ఉపయోగ పడుతుంది.
అపాన వాయువు
అంతరంగంలో భూమ్యాకర్శణ శక్తిగా చెప్పుకుంటాము. ఈ శక్తి వల్లనే మనం నిటారుగా నిలవ
గలుగుతున్నాము. ఆ శక్తి అంతర్గతంగా మనలను నిలపక పోయినట్లయితే గాలిలో తేలిపోతూ ఉండే
వాళ్ళం. ఉదాహరణకు... అంతరిక్షంలోకి పంపబడ్డ మనుషుల విధంగా...
భూమికి ఆకాశానికి
మధ్య ఉండే వాతావరణంలో; పైన ఉండే అంతరంలో ప్రాణం మరియు క్రింది అంతరంలో
అపానం ఉంటాయి. మధ్యలో ఉండేదే "సమాన" వాయువు. అందుకే సూక్ష్మరూపంలో ఉండే
బాహ్యమైన వాతావరణాన్ని "సమానం" అన్నారు.
"యచ్చ
కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రుయతే౨పివా; అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య
నారాయణః స్థితః!" అంటుంది, నారాయణ సూక్తం. ఈ ప్రపంచం అంతటా కనిపించేది లేదా వినిపించేది
ఏదైనా, వాటన్నిటా లోపలా వెలుపలా పరివ్యాపించి నారాయణుడే
నెలకొని ఉన్నాడు. అనగా నారాయణుడే సర్వత్రా వ్యాపించి ఉన్నా డంటుంది, వేదం. ఒకే నాణానికి బొమ్మ బొరుసు విధంగా నారాయణుడూ ప్రజాపతి కనిపిస్తారు.
ఈ విధంగా
అంతరంగంలోనూ బయట విస్తరించి ఉన్నది నారాయణుడే లేదా ప్రజాపతియే. సూక్ష్మరూపంలో
అంతరంగంలో, స్థూలరూపంలో బాహ్యంగా ఆయనయే విస్తరించి ఉన్నాడు.
జీవులలో
అగ్నిరూపంలో శరీర ఊష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉండేది "ఉదాన వాయువు". ఉదానం
తన విధ్యుక్త ధర్మానికి దూరమైతే శరీర ఊష్ణోగ్రత క్రమేపీ తగ్గిపోతుంది. మాట
పడిపోతుంది. శారీరక అవయవాలు వాటి కర్తవ్యానికి దూరమౌతాయి. మనసు నిర్లిప్తమౌతుంది.
క్రమేపీ భౌతిక ఆకృతికి ముగింపు వస్తుంది. దాన్నే శవ స్థితిగా చెప్పుకుంటాము. ఇదే
మరణం. చనిపోయిన ఆత్మ పునర్జన్మకు సమాయత్త మౌతుంది. ఈ పునర్జన్మ అంటే ఏమిటి? ఎలా కలుగుతుంది?
శాశ్వతమైన ఆత్మ అశాశ్వతమైన ఈ శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని తీసు కోవడమే
పునర్జన్మ. ఉదరంలో
ఉండే అగ్నినే ఉదానం అంటున్నాము కదా. ఎప్పుడైతే
ఉదరంలో అగ్ని ఆరిపోతుందో లేదా ఉదానం సమసిపోతుందో అంటే జీవితంలో కామనతో కూడిన అగ్ని
జ్వలన ఆరిపోతుందో అప్పుడు మనిషి లేదా జీవుడు మరణిస్తాడు. అలా మరణించిన వ్యక్తి
పునర్జన్మను పొందుతాడు. పునర్జన్మను పొందుతాడు అంటే ఏ జన్మను పొందుతాడు అనే
అనుమానం ముందుగా వస్తుంది.
మనలో ప్రాణ, అపాన,
వ్యాన, ఉదాన, సమాన అనే
వాయువులు ఉంటాయని తెలుసుకున్నాము. వాటిలో ముఖ్యమైనది ప్రాణం. ఈ మరణ సమయంలో కడుపులో ఉండే ఉదాన వాయువు ప్రాణం
వద్దకు వెళుతుంది లేదా ప్రాణాన్ని ఆశ్రయిస్తుంది. అప్పుడు ప్రాణం అగ్నితో అంటే
ఉదానంతో కలసి "ఆత్మను" కోరిన చోటికి తీసుకు వెళుతుంది. అయితే... కోరిన
చోటికి అంటే స్వర్గలోకానికో లేక సూర్యలోకానికో లేదా పునర్జన్మలేని మరే లోకానికో
ఆత్మ కోరితే ప్రాణం తీసుకు వెళుతుందా? అనే అనుమానం రావచ్చు.
కాని మనం గ్రహించవలసిన ముఖ్య విషయం ఒకటుంది. మరణ సమయంలో మనలో కొన్ని కోరికలు
కలుగుతాయి. కోరికలు ఆలోచనల రూపు దాలుస్తాయి. ఎవరికి ఏ ఆలోచన బలీయంగా ఉంటుందో ఆ
ఆలోచనతో మమేకమై ఉదానం ప్రాణం వద్దకు వస్తుంది. ఆ ఆలోచన రావడానికి కారణం మనం చేసిన, చేస్తున్న కర్మ ఫలితం మాత్రమే. కర్మ ఫలితాన్ని అనుసరించి మన ఆలోచనలు,
ఆలోచనల ననుసరించి నడక ఉంటుంది. ఆ ఫలితాన్ననుసరించి ఎక్కడికి చేరాలో
ఆత్మ అక్కడకే చేర్చ బడుతుంది. ఆ ఆలోచనలు మంచివా చెడ్డవా అనే భేద భావన ఉండదు. కర్మ
ఫలితాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలను బట్టి మన గమ్యం
నిర్దారించ బడుతుంది, ఆత్మ అక్కడికే చేర్చబడుతుంది. అందుకే
జీవిత కాలంలో సదాలోచనలతో, సద్గోష్టిలో, సత్సాంగత్యంలో, మంచి పనులు చేస్తూ, నలుగురి కోసం జీవించాలని పెద్దలు చెపుతారు.
నిజానికి మన ప్రయాణం "పరా"
మార్గంలో సాగవచ్చు లేదా "అపరా" మార్గంలోనూ సాగవచ్చు. పరా మార్గం అంటే
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడం కాగా అపరా మార్గం అంటే అధమ స్థాయి
దిగజారడం. దీనికి మనస్సు మరియు బుద్ధి మాత్రమే బాధ్యత వహిస్తాయి. ఎందుకు? అంటే
మనసు చంచలత్వాన్ని ఆశ్రయిస్తుంది. ఆ చంచలత్వాన్నుండి మనసును స్థిరీకరించుకునేందుకు
సాధన చేయాలి. ఆ మార్గంలో బుద్ధి వివేచన నిస్తుంది. ఇది మంచి ఇది చెడ్డ అని విడమరచి
చెపుతుంది. చెడు అని తెలిసీ ఆ మార్గాన్నే వెళ్ళేవాడికి ఉన్నత స్థితిని సాధించడం
కాని పని.
నిజానికి తాత్త్వికంగా ఆలోచిస్తే...
ఆత్మ అనేది 5 కోశాలతో ఆవరింపబడి ఉంటుంది. వాటినే 1) అన్నమయ కోశము 2) ప్రాణమయ కోశము
3) మనోమయ కోశము 4) విజ్ఞానమయ కోశము 5) ఆనందమయ కోశము అంటారు. దేహమంతా కూడా అన్నమయ కోశము ద్వారా ఏర్పడుతుంది.
జీవ
- శక్తులచేత ప్రాణమయ కోశము ఏర్పడుతుంది. కాగా మనస్సు ద్వారా మనోమయ
కోశము ఏర్పడుతుంది. ఇక బుద్ధి లేదా విచక్షణ వల్ల విజ్ఞానమయ కోశము ఏర్పడుతుంది
చివరగా అజ్ఞానం వల్ల ఆనందమయ కోశము ఏర్పడుతుంది.
అయితే ఈ అయిదు కోశాలూ మళ్ళీ మూడు
శరీరాలుగా ఏర్పడుతున్నాయి. అవే స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా చెపుతారు. ఇందులో
అన్న మయ కోశం స్థూల శరీరంగా; ప్రాణమయ, మనోమయ,
విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరంగా; ఆనందమయ
కోశం కారణ శరీరంగా తత్త్వజ్ఞులు గుర్తిస్తారు.
జీవుడు జీవించినంత కాలం “ఆత్మ” కారణ శరీరంతో, కారణ శరీరం సూక్ష్మ శరీరంతో, సూక్ష్మ శరీరం స్థూల శరీరంతో
మమేకమై ఉండడం చేత ఆత్మ అనేది స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో ఉంటుందని భావిస్తాము, చెప్పుకుంటాము.
ఇప్పుడు మరణమంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే జవాబు చెప్పుకోవడం సులభమౌతుంది. స్థూల
శరీరం నుండి సూక్ష్మ కారణ శరీరాలు వేరుపడడమే మరణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో స్థూల
శరీరం కారణ శరీరం విడిపోగా సూక్ష్మ శరీరం ప్రాణమయ కోశం వద్దకు వస్తుంది. వచ్చే
సమయంలో ఏ భావన లేదా ఆలోచన తనలో ఉందో ఆ ఆలోచన లేదా భావనకు తగిన జన్మను పునర్జన్మగా
ఆత్మ పొందుతుంది.
ఇలా ప్రాణంయొక్క ఉత్పత్తినీ, ఆగమనాన్ని,
స్థానాన్ని, కర్తవ్యాన్ని, నిర్వహణను, విభుధత్వాన్ని,
తనను తాను ఐదు భాగాలుగా విభాగించుకునే విధానాన్ని, అంతః ప్రకృతినీ, పంచ కోశాలను,
మరణ రహస్యాన్నీ, పునర్జన్మ విధానాన్ని,
పునర్భవ రహిత ప్రజ్ఞను తెలుసుకోవడం వల్ల బుద్ధి సత్కర్మలవైపు,
నిష్కామ కర్మలవైపు మళ్ళించ బడుతుంది. విచక్షణాభరితమైన కర్మాచరణ వల్ల
"అమరత్వం" సిద్ధిస్తుంది.
ఎవరైతే ఈ జ్ఞానాన్ని
అవగాహన చేసుకుంటారో, అవగతం చేసుకుంటారో, వారు అజ్ఞానం వల్ల కలిగే సుఖదుఃఖ బంధనాలలో నుండి విముక్తమౌతారు.
నాలుగవ
ప్రశ్న
గర్గ్య వంశపు సూర్యుని మనుమడు
గార్గ్యుడు నాలుగవ ప్రశ్నను ఇలా అడిగాడు. హే
భగవాన్! మానవులలో నిద్రించే ఇంద్రియాలు ఏవి? మెలుకువతో
ఉండేవి ఏవి? కలలు కనేది ఎవరు? ఏది
సుఖాన్ని అనుభవిస్తుంది? ఇవన్నీ దేనిలో నెలకొని ఉంటాయి లేదా దేని పైన ఆధారపడి సుస్థితమై
ఉంటాయి?
గార్గ్యుని
ప్రశ్నలో 5 విభాగాలున్నాయి. ఈ అయిదూ తాత్వికమైన అంశాలతో ముడిపడినవే. పైకి
కనిపించినంత సులువైనవి కావీ ప్రశ్నలు. ఇవి లోతైనవి కాబట్టి కొద్దిగా లోతుగా
చర్చించాలి. ఆదిమధ్యాంత రహితమైన శాశ్వత సత్యం బ్రహ్మ తత్త్వం మాత్రమే.
బ్రహ్మజ్ఞానాన్ని అభిలషిస్తున్న జిజ్ఞాసువు సాధనా చతుష్టయాన్ని అర్థం చేసుకునే
ప్రయత్నం చేయాలి. సాధనా చతుష్టయం అంటే…. ముక్తి మార్గంలో పయనిస్తున్న సమయంలో ఆచరించ దగిన నాలుగు సాధనలను సాధనా
చతుష్టయం పేర్కొంటారు. జ్ఞాన మార్గంలో ముక్తి కావాలనుకుంటే అనుభవజ్ఞుడైన ఒక
గురువును ఆశ్రయించి అతని పర్యవేక్షణలో సాధనా చతుష్టయాన్ని అనుష్టించాలి. వివేచన లేదా
విచక్షణ (Discrimination); వైరాగ్యం (Dispassion); శట్సంపత్తులు (The six
fold qualities of perfection) మరియు ముముక్షత్వము (intense
longing for liberation) ఈ నాలుగింటినీ సాధనా చతుష్టయంగా చెపుతారు.
వీటిని క్రమశిక్షణతో సాధన చేస్తేనే గాని భగవత్తత్త్వాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొని
ఆ బాటలో నడవడం కుదరదని పెద్దలు చెపుతారు. సాధనా క్రమంలో ఎన్నో ప్రలోభాలు, అడ్డంకులు ఎదురవవచ్చు. ఆ ప్రలోభాలు, అడ్డంకుల
(Distracting factors) యొక్క ఆకర్షణకు లోను కాకుండా పట్టుదలతో
ముందుకు సాగినప్పుడే లక్ష్యాన్ని ఛేదించగలం. దానికి అండగా నిలిచేదే సాధనా చతుష్టయ సాధన.
ఆకలితో
ఆహారాన్నన్వేషిస్తూ నడుస్తూ ఉన్నాం. ఎదురుగా ఒక మామిడి చెట్టును చూసాం. ఆ చెట్టుకు
బాగా మగ్గిన మామిడి పండు వ్రేళ్ళాడుతూ ఉంది. పండును కోసుకొని తింటే ఆకలి తీరుతుందా
లేక ఆ చెట్టుకు ఉన్న ఆకులను లెక్కిస్తూ ఉంటే ఆకలి తీరుతుందా? ఎన్ని ఆకులను లెక్కిస్తూ కూర్చున్నా ఆకలి తీరదు. ఆకలి తీరాలి అంటే ఆ
పండును కోసుకొని తినాల్సిందే. అలాగే పుస్తకస్తమైన విజ్ఞానాన్ని ఎంతగా ఆర్జించినా
సాధన చేయకుండా ముక్తిని పొందలేము. అయితే సాధన చేయాలి అంటే ముందుగా వాటిని అర్థం
చేసుకోవాలి. ఇప్పుడా ప్రయత్నం చేద్దాం.
వివేచన లేదా
విచక్షణ: ఏది సత్యమో, ఏది అసత్యమో,
ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో గుర్తించడమే
వివేచన. మనసా వాచా కర్మణా సమర్పణా భావనతో మనల్ని మనం భగవదర్పణ చేసుకోవడం, సమాజ కల్యాణమే భగవదారాధనగా తలచడం, సేవా దృక్ఫథంతో
తోటి జీవులకు సేవలందించడం వలన మనలో మంచి చెడుల మధ్య భేదాన్ని గుర్తించగల మానసిక
స్థితి ఆవిష్కృత మౌతుంది. దానితో “ఉన్న స్థితి” నుండి “ఉన్నత స్థితి”కి
ఎదిగేందుకు అవసరమైన హృదయ కవాటాలు వాటంతట అవే తెరుచు కుంటాయి. ఈ క్రమంలో మార్పుకు లోను కాని శాశ్వత సత్యం ఒకవైపు, అశాశ్వత
మైన భౌతిక సుఖానికి సంబంధించిన ప్రలోభాలు మరొక వైపు మనసును ఆకర్షిస్తూ తమ వైపుకు
లాగుతున్న సమయంలో, శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకుంటూ ఆ
మార్గంలో జీవితాన్ని రసమయం చేసుకునేందుకు మనసును సన్నద్ధం చేసేదే విచక్షణ.
పుట్టుక,
మరణం; ఆకలి, దప్పులు;
సుఖము, దుఃఖము ఈ ఆరింటినీ సంసారమనే సముద్రంలో
ఉవ్వెత్తున లేచిపడే కెరటాలుగా వ్యవహరిస్తారు. ఇందులో పుట్టుక, మరణం ఈ రెండూ భౌతిక శరీరానికి సంబంధించినవి కాగా ఆకలి, దప్పులు ప్రాణశక్తికి అనుబంధ మైనవి. ఇక సంతోషము లేదా సుఖ్హము, దుఃఖము ఈ రెండూ మానసికమైనవి. కాగా ఈ వాసన లేవీ అంటనిది ఆత్మ.
వైరాగ్యం: ఏ పనిలో కూడా కాముకత లేకపోవడం వైరాగ్యంగా చెప్పుకుంటాము. ఫలితాన్ని
ఆశించకుండా నియతమైన కర్మాచరణయే వైరాగ్యం అంటుంది గీత. "కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన" అన్న భగవద్గీత సూక్తి ప్రకారం కర్మాచరణ యందే మనకు అధికార
మున్నది. సమత్వ దృష్టిని సాధించడం వైరాగ్యం వల్ల కలిగే ప్రయోజనం. అలాగని
నిష్క్రియాపరత వైరాగ్యంకాదు. నిష్క్రియాపరత దోషమంటున్నది భారతీయ సాహిత్యం. శ్మశాన
వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఎప్పుడూ నిజమైన వైరాగ్యాలు కావు.
కర్తవ్యాన్ని విస్మరించి, హిమాలయాలలోనో మరెక్కడో ముక్కు మూసుకొని
తపస్సు చేసుకునే వారి కంటే గృహస్థాశ్రమంలో ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణ చేస్తూ
జీవించే వాడే ఉత్తముడని చెపుతుంది భారతీయ తాత్వికత. ఇది నెమ్మదిగా అభ్యసన వల్ల
అలవడుతుంది.
షడ్సంపత్తులు: శమ, దమ,
ఉపరతి, తితిక్ష, శ్రద్ధ
మరియు సమాధానములు ఈ ఆరింటినీ షడ్సంపత్తులుగా చెపుతారు.
శమ -- కోరికలను, ఆలోచనలను, ఆశలను తగ్గించుకోవడం శమమని అంటారు.
క్రమక్రమంగా వాటిని నిర్మూలించుకోవడం అభ్యసన వల్ల వీలవుతుంది.
దమ -- ఇంద్రియ
నిగ్రహణను దమమని అంటారు. "బలవనింద్రియ గ్రామో విద్వాంస మపికర్షతి"
ఇంద్రియాకర్షణ చాలా బలీయమైనది. అది విద్వాంసులను సైతం ఆకర్షిస్తుంది. పతనావస్థకు
చేరుస్తుంది. కాబట్టి ఇంద్రియాల పట్ల జాగరూకతతో ఉండాలి అని చెపుతున్నారు.
ఉపరతి -- ఆసాంతంగా, సంపూర్ణంగా సంతృప్తి చెందిన మానసిక స్థితిని ఉపరతి అంటారు. ఇది వివేచన,
వైరాగ్యం, శమ, దమములను
అభ్యసించడం వల్ల, సాధన చేయడం వల్ల మనలో అయాచితంగా వెలుగు
చూస్తుంది.
తితిక్ష -- క్షమా
తత్త్వం. దీనినే ఓరిమి లేదా ఓర్పు అంటాం. సుఖ దుఃఖాలకు అతీతం.గా స్ఫందించే మనో
వృత్తిని తితిక్షగా వ్యవహరిస్తారు.
శ్రద్ధ -- సత్య
సంధత యొక్క అస్థిత్వాన్ని గుర్తించడం ఆవైపు పయనించడం శ్రద్ధగా చెప్పబడుతుంది. ఆ క్రమంలో
తనపై తనకు చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం; గురువుపై
అచంచల విశ్వాసం; సంకల్పించిన కార్యాన్ని నిర్వర్తించే
క్రమంలో ఎదురయ్యే ప్రలోభాలకు, అడ్డంకులకు తలొగ్గని ధీ శక్తి.
సడలిపోని నమ్మకంతో కూడిన అలుపెరుగని నిరంతర పోరాట పటిమ….
వీటన్నిటి సమ్మేళనమే శ్రద్ధ.
సమాధానం -- Fixing
the Mind or Focusing the Mind on a fixed Goal దీనినే సమాధానం
అంటారు. దీనినే A journey towards the heights of ecstasy గా
కూడా చెప్పుకోవచ్చు. ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరే
క్రమంలో అంగుళం కూడా ప్రక్కకు జరగని దృష్టిని కలిగి యుండడం వల్ల అసాధ్యాలను
సుసాధ్యాలుగా చేయ గలుగుతాము. ఇది శమ,
దమ, ఉపరతి, తితిక్షలపై
పట్టు సాధించడం ద్వారా సిద్ధిస్తుంది.
ముముక్షత్వం:
సత్యాన్ని అన్వేషిస్తూ, భగవతత్త్వాన్ని అవగాహన
చేసుకుంటూ భౌతిక విషయాలు అభాసగా నిశ్చయించుకొని నిత్య సత్య నిరతిశయ పథాన్ని కోరుతూ
ఈ జనన మరణ చక్ర బంధనాల నుండి విడిపోవాలన్న అపారమైన, అమితమైన,
బలీయమైన కోరిక ముముక్షత్వం. ఇది నాలుగు మార్గాలలో సిద్ధిస్తుంది.
మొదటిది.. శ్రవణం. అంటే వినడం (Listening); మననం (Reflecting);
నిధి ధ్యాసనం (Meditating); ఆత్మ సాక్షాత్కారం
(Direct Realisation)
శ్రవణం -- వినడం. ఏది
వినాలి. దేనినైతే తెలుసుకోవాలో, ఏది తెలుసుకోవడం ద్వారా సకల
కల్యాణాలు సిద్ధించగలవో దానినే వినాలి. అదే వేదం. ఈ వినడం 5
రకాలుగా ఉంటుంది. మొదటిది Ignoring Listening. అక్కడే ఉంటాం కాని పట్టించుకోము. ఇష్టం కాని అతిథి వస్తే ఎలా స్పందిస్తామో
అలా వింటాం; రెండవది... Pretending Listening వింటున్నట్లుగా నటిస్తాము కాని వినము; మూడవది Selective
Listening మన కవసరమైన వాటిని మాత్రమే వింటాం; నాలుగవది
Attentive Listening శ్రద్ధగా వింటాం, అర్థం
చేసుకుంటాం. ప్రతి అక్షరమూ మనసులో ముద్రిత మౌతుంది; ఇక
అయిదవది చివరిదీ Empathic Listening శ్రద్ధగా వింటూ, ఎదుటివారి దృష్టి కోణం నుండి విషయాన్ని గ్రహిస్తూ, పూర్వ
నిశ్చితాభిప్రాయాలకు తావు లేకుండా, “ఉన్నది ఉన్నట్లు”గా తీసుకోవడం. ఇక్కడ Attentive Listening లో
అక్షరాలకు మాత్రమే పరిమితమౌతాము. కాని Empathic Listening లో
ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది.
మననం -- వినడం
ద్వారా తెలుసుకున్న విషయాన్ని నిరంతరం మననం చేసుకోవడం ద్వారా క్రొత్త కోణాలను
ఆవిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది. సందేహాలు మనకు తెలియకుండానే నివృత్తమవుతాయి.
నిధి ధ్యాసనం --
సందేహ రహితమైన విజ్ఞానంపై ధ్యానం చేయడం ద్వారా అనంత మైన భగవచ్చైతన్యం మనసులో
ఆవిష్కృత మౌతుంది. అభ్యుదయ మార్గం అవగత మౌతుంది. అఖండమైన, అనంతమైన ఆనందం స్వంతమౌతుంది.
ఆత్మ సాక్షాత్కారం
-- సమాచారానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం విజ్ఞానంగా మనసులో ఆవిష్కృత మౌతుంది. ఆ
జ్ఞానం బోధ చేత పరిపుష్టమౌతుంది. దానిని అవగతం చేసుకోవడం ద్వారా స్పష్టత వస్తుంది.
స్ఫష్టత ఆత్మ సాక్షాత్కరానికి మార్గం చూపుతుంది.
ఈ విజ్ఞానాన్ని ఆకళింపు
చేసుకుంటే మాత్రమే తత్త్వాన్ని అర్ధం చేసుకోగలం. తాత్త్విక చింతనలో ఎప్పుడైనా
అక్షరాలతో మాత్రమే అంతర్యాన్ని గ్రహించలేము. వివిధ గ్రంథాలను సమన్వయం చేసుకున్నప్పుడే అపరిమితమైన భగవత్తత్త్వాన్ని
అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతాము. ఊహించడానికి కూడా రెండవది లేనటువంటి
సర్వవ్యాపకమూ, సర్వశక్తి సమన్వితమూ, సకల
జ్ఞానమయమూ అయిన శుద్ధ చైతన్య పరమాత్మ తత్త్వాన్ని "యెఱుక" లోకి
తెచ్చుకోవాలంటే, దర్శన చేయాలి. అంటే
పైన పేర్కొన్న విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకొనడం తప్పనిసరి.
ఇప్పుడు, గార్గ్యుని ప్రశ్నకు పిప్పలాదుడు ఇలా
జవాబిస్తున్నాడు. ఓ గార్గ్యా! సూర్యోదయం సమయంలో సూర్య కిరణాలు ఈ జగత్తంతటా వ్యాప్తి చెందు తున్నాయి. మరి ఆ కిరణాలు
సూర్యాస్తమయం సమయంలో ఎక్కడికి పోతున్నాయి? అంటే మళ్ళీ సూర్య
మండలంలోనే ఏక మవుతున్నాయి. తిరిగి ప్రభాత
కాలంలో ఆ కిరణాలే సంవ్యాప్తమయి జగత్తును వెలిగిస్తున్నాయి. అలాగే, ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాలకు అధిదేవత యైన మనస్సులో ఏకీభావాన్ని
పొందుతున్నాయి లేదా మనస్సులో ఏకమవుతున్నాయి. ఈ అవస్థనే నిద్రావస్థ అంటాము. ఈ
నిద్రావస్థలో ఇంద్రియాలన్నీ సుప్తావస్థలో ఉంటాయి కనుక దేన్నీ చూడలేము, మాట్లాడనూ లేము, విననూ లేము. అంతేకాదు, పంచేంద్రియ జ్ఞానం సమసిపోవడంతో ఏ విధమైన చేష్టలను చేయలేము. కదలిక కూడ లేని
నిరామయ స్థితిలో ఉంటాము. అలా శరీరం
నిద్రావస్థలో ఉన్న సమయంలో కూడా మెలుకుని ఉండేవి ఒక్క ప్రాణాగ్నులు మాత్రమే.
ఇంద్రియ సమూహం నిద్రావస్థలో ఉన్నా ప్రాణాలు పని చేస్తునే ఉంటాయి.
అపాన
వాయువు గార్హపత్యాగ్ని. వ్యాన వాయువు దక్షిణాగ్ని దీనినే అన్వాహార్య వచనాగ్ని అని
కూడా అంటారు. ప్రాణమే ఆహవనీయాగ్ని అంటాడు, పిప్పలుడు.
గృహస్థు ప్రతి నిత్యం అగ్నిని ఆరాధించాలి. ఆ కార్యాచరణలో మూడు అగ్నులు
ఉపయోగిస్తారు. ఒకటి దక్షిణాగ్ని, దీనిని వేదికకు
దక్షిణభాగంలో ఉంచుతారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.
రెండవది గార్హపత్యాగ్ని. ఇది వేదికపై ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. అన్ని
కార్యక్రమాలకు ఇందులోనుండి అగ్నిని తీసుకోవడం జరుగుతుంది. మూడవది ఆహవనీయాగ్ని. ఇది
దేవతలకు హోమాదికాలు నిర్వహించే సమయంలో ఉపయోగపడుతుంది.
వ్యానం... హృదయానికి దక్షిణంగా ఉన్న
నాడిలో పని చేస్తుంది కాబట్టి దక్షిణాగ్నితో పోల్చబడింది. అపానం నాడీ వ్యవస్థ అధోభాగంలో
అన్ని వేళలలో పనిచేస్తుంది కాబట్టి దీనిని గార్హపత్యాగ్నిగా గుర్తిస్తారు. ప్రాణం
అపానం నుండి కలుగుతుంది కాబట్టి దానిని ఆహవనీయాగ్నితో పోల్చారు.
మనిషిలోని ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలనబడే
రెండు ఆహుతులను శరీరమంతటా సమానంగా తీసుకు వెళుతుంది కాబట్టి సమాన వాయువును హోతగా
చెపుతున్నారు. మనస్సు యొక్క సూచనలు లేదా ఆజ్ఞల కనుగుణంగా ప్రతి క్రియా శరీరంలో
జరుగుతుంది కాబట్టి ఈ యజ్ఞానికి యజమాని మనస్సే. ప్రతినిత్యం
యజమానిని అంటే మనస్సును బ్రహ్మ తత్త్వ సంయోజనం చేసేది ఉదాన వాయువే కాబట్టి ఉదానమే
యజ్ఞఫలం అంటుందీ ఉపనిషత్తు.
బ్రహ్మము ఆనందమయము.
బ్రహ్మము అనేది అత్యున్నత స్థితి. ఆ స్థాయికి తీసుకు వెళ్ళేది అంటే అత్యున్నత ఆనంద
స్థితిని సమకూర్చేదిగా చెప్పుకోవాలి. అది "ఉదానం"గా చెపుతుందీ
ఉపనిషత్తు. అది ఎలా జరుగుతుంది?
సాధారణంగా జీవ
చైతన్యం మూడు అవస్థలలో పనిచేస్తుంది. జాగ్రదావస్థ, స్వప్నావస్థ
మరియు సుషుప్తావస్థగా వాటిని చెపుతారు. ఇవే కాక వీటికతీతంగా "సమాధి"గా
పిలువబడే తురీయావస్థ ఉంటుందంటారు, తత్త్వజ్ఞులు. జ్ఞాత
(తెలుసుకునే వాడు) జ్ఞానం (తెలుసుకునే సాధనం) ద్వారా జ్ఞేయాన్ని (తెలుసుకో దగిన
దానిని) తెలుసుకుంటాడు. పరమాత్మయే తెలుసుకోదగినది అదే జ్ఞేయం అత్యున్నత మైనది.
జిజ్ఞాసువే జ్ఞాత మరియు తెలుసుకునే సాధనమే జ్ఞానం.
జాగ్రదావస్థలో
భౌతిక విషయాలు అవగతమౌతాయి. నిత్య నైమిత్తిక కర్మాచరణ, భౌతిక విజయ సాధన, వ్యవహార శైలి, నిర్వహణా దక్షత లాంటి ప్రాపంచిక విషయాలు జాగ్రదావస్థలో జరిగే ప్రక్రియలు.
జాగ్రదావస్థలో మనలో
నెరవేరని కోరికలు, చెలరేగే ఆలోచనలు, వెలుగు చూచే
ఆశలు బలీయమై అనుభవాన్ని ఆకాంక్షిస్తూ మనసు పై సంస్కారంగా లేదా ముద్రలుగా
ఏర్పడుతాయి. ఈ సంస్కారాలే స్వప్నావస్థలో కలలుగా అనుభవాన్నిస్తాయి.
ఏ విషయ వాసనా
సంస్కారాదులకు లోను కాకుండానిరామయ స్థితిలో మనసు ఉండిపోవడం సుషుప్తావస్థ. జాగ్రదావస్థలో కలిగే అనుభూతులు కాని
స్వప్నావస్థలో కనిపించే కలలు కానీ సుషుప్తావస్థలో అనుభవంలోకి రావు. సంస్కార
రహితమైన మనస్సులో స్ఫష్ఠత కరవై అంతర్గత చైతన్యం అచేతనంగా మిగిలి పోతుంది. ఈ స్థితి
నిష్క్రియాపరతలో కలిగే జడత్వ స్థితి కాదు.
కాగా ఈ మూడు
స్థితుల కతీతంగా ఉండే అవస్థను "సమాధి" స్థితిగా చెప్పుకుంటాము. సాధకుడు జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలలో ఏ ఏ అవస్థలో ఉన్నా శుద్ధ
చైతన్య తత్త్వగత అనుభూతిని ఆనందాన్ని నిరంతరం పొందుతుంటాడు. ఫలితంపై ఆశలేకుండా
నిత్య క్రియా శీలియై సత్యాన్వేషణలో సాగిపోయే సాధకుడు అనంత చైతన్యాన్ని గుర్తిస్తూ
ఆ చైతన్యానికి అనుసంధానమవుతూ తాను నిర్వహించే ప్రతి పనిలో అపరిమితానందాన్ని
నిరంతరం పొందుతుంటాడు. ఇదే సమాధి స్థితి. ఈ స్థితిలో జడత్వం ఉండదు నిరంతర
చేతనత్వమే పరమావధిగా ఉంటుంది. ధ్యానంలో కలిగే ఈ స్థితికి చాలామంది బంధీలవుతారు.
కొందరే ఈ స్థితినీ దాటి అపరిమితమైన బ్రహ్మతత్త్వంలో లేదా పరమాత్మలో లీనం అవుతారని
చెపుతారు, వేదజ్ఞులు.
సంస్కారంగా
మనస్సుపై బలపడిన "ఆశ" ఆశయంగా మారడం వల్ల సుషుప్తిలో అస్పష్టంగా, తాత్కాలికంగా ఉన్న ఆనంద స్థితి "సమాధి"లో స్ఫష్టతనూ, శాశ్వతత్త్వాన్ని సంతరించుకొని జ్యోతిర్మయమై ఆనందానుభవాన్ని శాశ్వతం
చేసుకుంటుంది.
ఈ కారణాల వల్ల
"ఉదానం" యజమానిని అంటే "మనస్సు"ను బ్రహ్మం అంటే
నిరతిశయానందానికి లేదా శుద్ధ చైతన్యానికి దగ్గరగా తీసుకు వెళుతుంది లేదా
సాక్షాత్కార మౌతుంది అంటుందీ, ఉపనిషత్తు.
ఇంద్రియాలన్నీ నిద్రావస్థలోకి
జారుకున్న సమయంలో వాటి అధిదేవతయైన మనస్సు స్వప్నావస్థలో తనకంటూ ఒక వినూత్న
ప్రపంచాన్ని సృష్టించుకొని అనుభవాల నన్నింటినీ పొందుతుంది. అంటే జాగ్రదావస్థలో
తాను చూచినవన్నీ చూస్తుంది,
విన్నవన్నీ వింటుంది. అన్ని రకాలైన అనుభూతులనూ పొందుతుంది. వివిధ
దశలలో, స్థలాలలో తనకు కలిగిన అనుభవాలను మళ్ళీ మళ్ళీ నెమరు
వేసుకుంటూ అనుభవిస్తుంది. అలాగే తానెన్నడు
చూడని ప్రదేశాలను చూస్తుంది. విననిదాన్నీ వింటుంది. అనుభవాలనూ పొందుతుంది. ఈ
విచిత్రమైన, అద్భుతమైన కలల ప్రపంచంలో పొందే అనుభవాలకు కారణం
నిద్రావస్థలో ఇచ్ఛాశక్తి, తార్కిక శక్తి పనిచేయకపోవడమే. ఈ కలలకు భాష్యాలు ఎవరు ఎలా చెప్పినా ఒక్కటి
మాత్రం సత్యం. అంతశ్చేతనలో విషయాలపై పెరిగిన అనురక్తి మరియు దానిని నిజం
చేసుకోవాలనే తపన వల్ల మాత్రమే సుప్తచేతనాత్మకమైన మనస్సు భౌతికంగా పొందలేని
అనుభవాలను మానసికంగా అనుభవిస్తుంది.
జాగ్రదావస్థలో తాను ప్రత్యక్ష్యంగా అనుభవించేందుకు
అవకాశం లేని విషయాలను వినడం ద్వారా చదవడం ద్వారా వాటిని అనుభవించాలనే కోరిక కలగడం
ఆ కోరిక సంకల్పంగా మళ్ళీమళ్ళీ మననం కావడం వల్ల మనసులో బలోపేత మవుతుంది.
అంతశ్చేతనలో ఆ సంకల్పం రూపు దిద్దుకొనడం వల్ల ఆ విషయాలకు సంబంధించిన అనుభవాలను
పదేపదే కోరుకోవడం జరుగుతుంది. అలా కోరుకొనడం సూచనలుగా లేదా ముద్రలుగా
అంతర్మనస్సులో నాటుకుపోవడం జరుగుతుంది. తద్వారా ఆ అంతర్ మనస్సుపై
స్పందనలు కలుగుతాయి. ఆ స్పందనల కనుగుణంగా అంతశ్చేతనలో ఏర్పడిన భ్రాంతి స్వప్నంలో
దర్శనమిస్తుంది. అందులో వైభవమూ కనిపించవచ్చు, ప్రలోభాలూ ఎదురవవచ్చు,
అవమానాలూ కలగవచ్చు. కొన్నిమార్లు వాటిని అధిగమించిన అనుభూతి
మరికొన్ని మార్లు దానికి బద్ధమైన అనుభూతి కలగవచ్చు. ఎన్నో భావనలు, అనుభవాలు,
అనుభూతులు, శక్తులు, ప్రాకృతిక
సౌందర్యచిత్రణలు ఒకటేమిటి స్వప్నంలో మన సంకల్పానుసారం దేనినైనా దర్శించే అవకాశం
ఉంటుంది. క్రొత్త ఆలోచనలు, యోజనా ప్రణాళికలు, కల్పనలు, పరిశోధనలు, కళా
ప్రక్రియలు ఇలా ఒకటేమిటి ఏదైనా సాధించ గలగడం స్వప్న ప్రపంచంలో సాధ్యమే. భౌతిక
ప్రపంచంలో ఆ కలలను సాకారం చేసుకోవడమూ సాధ్యమే. కాకపోతే ఆ అంతర్గత శక్తులను అర్థం
చేసుకోవడం, ఆ వైపు నడవడం ముఖ్యం.
నిద్ర తమోగుణ ప్రభావం చేత కలుగుతుంది.
పూర్వ నిశ్చితాభిప్రాయాల కనుగుణంగా పెల్లుబ్బే కోరికలు, ఆలోచనలు,
ఆశలు అంతర్మనస్సులో ఆకృతి దాల్చి స్వప్న లోకంలో దర్శనమిస్తాయి.
ఇంద్రియాలు నిద్రావస్థలో ఉండి మనస్సు జాగ్రతమై యున్నప్పుడు ఆ మనస్సు తేజస్వంత
మవుతుంది. తేజస్సు లేదా కాంతి కారణంగా మానసిక తమస్సు హరింపబడుతుంది. తమస్సు
విడిపోవడం వల్ల మనస్సు స్వప్నావస్థలో ఉండదు. ఇంద్రియాలు నిద్రావస్థలో ఉండి మనస్సు
శక్తివంతమైతే లేదా కాంతి వంతమైతే ఆనందం అనుభూత మవుతుంది. అందుకే గాఢ నిద్రలో
లభించే అపరిమిత ఆనందం ప్రశాంతతను సమకూరుస్తుంది. నిద్రావస్థలో ఉన్న ఇంద్రియాల
యొక్క ఆకర్షణ లేమి చేత మనస్సు ప్రలోభాలకు లోను కాకపోవడమే దీనికి కారణం.
ఎలాగైతే సాయంత్రం కాగానే పక్షులన్నీ
తమతమ గూళ్ళు ఉన్న చెట్లవైపుకు పరుగులు దీస్తాయో అలాగే ఇంద్రియాలన్నీ కూడా మనసుతో
సహా జీవాత్మను చేరుకుంటాయి.
పంచభూతాత్మకమైనది
శరీరం. భూమి, నీరు, అగ్ని లేదా తేజస్సు,
వాయువు మరియు ఆకాశములను పంచభూతాలు అంటారు. అలాగే, పంచ తన్మాత్రలు అనగా శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధములు పంచతన్మాత్రలుగా చెప్పుతారు. పంచ భూతాలలో
సూక్ష్మ స్థితిలో (Subtle state) ఒక్కొక్క దానిలో కొన్ని
ముఖ్యమైన లక్షణాలు (Essential Characteristics ) ఉంటాయి.
వాటినే పంచ తన్మాత్రలుగా వ్యవహరిస్తారు.
పంచ భూతాల నుండి పంచతన్మాత్రలు
ఆవిష్కృతమౌతాయి. శూన్యంలో ముందుగా జనించింది ఆకాశము దాని నుండి వాయువు; వాయువు
నుండి అగ్ని; తేజస్సు నుండి నీరు; నీటి
నుండి భూమి జనించిందని భాగవతం చెపుతుంది. అందుకే ఆకాశానికి శబ్దము; వాయువునకు శబ్దము మరియు స్పర్శము; అగ్నికి శబ్దము.
స్పర్శము మరియు రూపము; నీటికి శబ్దము. స్పర్శము, రూపము మరియు రస స్వభావము; భూమికి శబ్దము. స్పర్శము,
రూపము, రసము మరియు గంధములు గుణములుగా
నిలుస్తాయి.
ఆకాశం నుండి శబ్దము జనించింది. శబ్దాన్ని
దేనినుండైతే గ్రహిస్తామో అది శ్రోతం అంటే చెవులు అంటున్నారు. వాయువు నుండి
జనించింది స్పర్శ. ఆ స్పర్శను తెలుసుకునే ఇంద్రియం చర్మం అంటున్నారు. తేజస్సు లేదా
అగ్ని నుండి జనించింది రూపం. ఆ రూపాన్ని చూసే ఇంద్రియాన్ని కన్నులు అంటున్నారు.
నీరు నుండి రసము ఆవిర్భవించింది. ఆ రసాన్ని గ్రహించే ఇంద్రియం జిహ్వ లేదా రసనము
లేదా నాలుక అంటున్నారు. భూమి నుండి జనించేది గంధము. ఆ గంధాన్ని ఆఘ్రాణించే
ఇంద్రియం ముక్కు అంటున్నారు.
చర్మము, కన్నులు, చెవులు, ముక్కు, నాలుక ఈ అయిదింటినీ జ్ఞానేంద్రియాలుగా
వ్యవహరిస్తారు. అలాగే నోరు, చేతులు, పాదములు,
జననేంద్రియము మరియు గుదము (పాయుః) ఈ అయిదింటినీ కర్మేంద్రియాలుగా వ్యవహరిస్తారు. పంచభూతాలు
మరియు వాటిచే నిర్వహించబడే కర్మలు; జ్ఞానేంద్రియాలు మరియు
వాటిచే నిర్వహించబడే కర్మలు; కర్మేంద్రియాలు మరియు వాటిచే
నిర్వహించబడే కర్మలు; మనస్సూ మరియు అది ఆలోచించే విషయాలు;
బుద్ధి మరియు అది తెలుసుకునే విషయాలు; అహంకారం
మరియు అది అహంకరించే విషయాలు; చిత్తము మరియు అది జ్ఞాపక
ముంచుకునే విషయాలు; కాంతి మరియు అది ప్రకాశింప చేసే విషయాలు;
ప్రాణము మరియు అది ధరించే విషయాలు; ఇవన్నీ
కూడా గాఢ నిద్రలో జీవాత్మయందు ప్రతిష్ఠితములై ఉంటాయంటుందీ, ఉపనిషత్తు.
గాఢ నిద్రలో ఉన్న సమయంలో జాగ్రదావస్థలో వ్యగ్రమై (తొందరపాటుతో) ఉండే
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాటివాటి విషయాలకు దూరంగా
ఉంటాయి. అలాగే, మనస్సు, బుద్ధి మరియు
చిత్తము కూడా వాటి వృత్తులను, చేష్టలను, తెలివిని విడనాడి ప్రశాంతంగా ఉంటాయి.
చివరకు అహంకారం కూడా గాఢ నిద్రలో ఉపశమిస్తుంది.
అవ్యక్తంగా పై
ప్రక్రియలన్నీ జీవునిలో ఉపశమించడం చేత జీవుడు "అవిద్యా కార్య కలాపాల"
చేత కప్పబడకుండా కేవలం "అవిద్య" చేత మాత్రమే కప్పబడి కారణ శరీరంలో
యుంటాడు. అవిద్య అంటే అజ్ఞానం. అవిద్యా కార్య కలాపలు అంటే అజ్ఞానం క్రమ్మడం చేత
చేసే అసంబద్ధమైన పనులు. ఇక్కడ అన్నీ ఉపశమించి జీవునిలో అవ్యక్తమై (ప్రకటింప బడక)
ఉండడం వల్ల వాటి కార్యకలాపాలు ఏమీ ఉండవు. కాని జీవుడు అజ్ఞానం చేత లేదా మాయా చేత
కప్పబడి ఉంటాడు కనుక జీవుడు అవిద్య చేత కప్పబడి ఉన్నాడంటుంది ఉపనిషత్తు. గాఢనిద్రలో
చేయవలసిన కార్య కలాపాలు ఏమీ లేకపోవడం వల్ల ప్రశాంతత పొందిన జీవుడు ఆత్మకు దగ్గరగా
ఉంటాడని చెపుతుంది. జాగ్రదావస్థలో కార్యక్రమాల నిర్వహణవలన ఆ ప్రశాంతతకు దూరమౌతాడని
భావన.
ఇక్కడ
గుర్తుపెట్టుకోవలసిన మరొక్క ముఖ్య విషయం ఏంటంటే... ఈ మూడు అవస్థలలో కూడా (జాగ్రత్, స్వప్న, సుషుప్తి) జీవాత్మ జాగ్రతమై ఉంటుంది.
వేదం భౌతిక శరీరాన్ని ఒక పట్టణంగా
వర్ణిస్తుంది. ఆ పట్టణంలోకి ప్రవేశించేందుకు నవ (9)ద్వారాలు ఉన్నాయంటుంది. ఆ నవ
ద్వారాలను రెండు కన్నులు,
రెండు చెవులు, ముక్కు ద్వారాలు రెండు, మల మూత్ర విసర్జనా ద్వారాలు రెండు మరియు నోరు; అని
చెపుతుంది.
మనలోని ముఖ్య ప్రాణము తనను తాను అయిదు
(5) విభాగాలుగా విభజించుకొని ఈ తొమ్మిది అంగాల కార్యనిర్వహణను
క్రమబద్ధీకరిస్తుంది. తనకు తానుగా "ప్రాణం" ముఖముపై నిలిచి శ్వాస
తీసుకోవడం,
వినడం, చూడడం లాంటి ప్రక్రియలను బాధ్యతగా
నియంత్రిస్తుంది. "సమానం"గా నాభివద్ద నిలిచి జీర్ణక్రియను
వ్యవస్థీకరించి శక్తిని శరీరంలోని అన్ని భాగాలకు క్రమపద్ధతిలో సరఫరా చేస్తుంది.
"అపానం"గా నాభికి దిగివ నిలిచి విసర్జనాదికాలను సజావుగా జరిగే విధంగా
చూస్తుంది. "వ్యానం" గా ఊర్ధ్వ ముఖంగా నడుస్తూ మరణ సమయంలో జీవుల
విముక్తికి సహకరిస్తుంది. ఈ ప్రక్రియలన్నీ
ముఖ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు విరామ రహితంగా, క్రమబద్ధంగా
జీవుడు శరీరంలో ఉన్నంత వరకూ జరగ వలసినదే. జీవుడు ఏ అవస్థలో (జాగ్రత్, స్వప్న, సుషుప్తులలో) ఉన్నా ప్రాణవాయువు సదా సర్వ
కాలం జాగ్రదావస్థలో ఉండి శరీరాన్ని నడిపిస్తుంది.
చివరగా, పిప్పలాదుడు అంటున్నాడు.... పంచ తన్మాత్రల కాధారమైన వాడు, అనగా చూచే వాడూ, వినేవాడు, స్పర్శననుభవించేవాడు,
వాసనలను గ్రహించేవాడు, రుచి చూచే వాడూ,
ఆలోచించేవాడూ, తెలుసుకునే వాడూ ఇలా అన్ని
ఉపాధులను నిర్వహించే వాడు ఒక్కడే. అతడే జీవాత్మ. అతనే పురుషుడు. అక్షరమైన అనగా వినాశనము
లేని ఆత్మ యందు సంప్రతిష్టితుడై ఉన్నాడు. అతడే పరమాత్మకు ప్రతిరూపమైన జీవాత్మగా
తెలుసుకోవాలి. అయితే పరమాత్మకు జీవాత్మకు మధ్య భేదం ఏమిటి? అనే
సందేహం రావచ్చు. శ్రీ ఆదిశంకరుల వారు చెప్పినట్లుగా జలాశయాలలో సూర్య బింబ
ప్రతిబింబాలకు సూర్యునికి ఉన్న సంబంధమే. అంటే మళ్ళీ వారిరువురూ వేరు వేరనే భావన
రావచ్చు. కాని అలా కాదు. నాలుగు గోడల మధ్య ఉండే పరిమితమైన శూన్యానికి లేదా
ఆకాశానికి మరియు అనంతమైన శూన్యానికి లేదా ఆకాశానికి ఉన్న సంబంధం ఎలాంటిదో జీవాత్మ
పరమాత్మల మధ్య సంబంధమూ అలాంటిదే. ఇక భేదమల్లా వ్యాప్తి చెందగలననే "స్మృతి"
"తెలివి" లేదా "యెఱుక" పరమాత్మకు ఉంటుంది జీవాత్మ దానిని
సాధించాలి. పరమాత్మ నుండే వచ్చినా “మాయా” ఆవరణం క్రమ్మడం చేత ఆ యెఱుకను కోల్పోతున్నాడు జీవాత్మ.
ఇంకా పిప్పలాదుడు
ఇలా చెపుతున్నాడు! అక్షరమైనది, శరీర రహితమైనది, నీడ లేనిది, రంగు లేనిది, స్వచ్ఛమైనది,
పరమోత్కృష్టమైనది ఏదో తెలుసుకుంటే ఆ అక్షర మైన పరమోన్నతమైన
తత్త్వాన్ని అవగాహన చేసుకోగలుగుతాము. అదే సర్వజ్ఞత్వము, అదే
సర్వమూ, అదే పరమ గమ్యము. మనస్సూ, ఇంద్రియాలు,
ప్రాణాలు అన్నీ దేనియందు ఉపశమించి ఉంటాయో ఆ తత్త్వాన్ని అర్థం
చేసుకోవడమే జీవుని కర్తవ్యం. దానిని సాధించ గలిగితే ఆ
సర్వజ్ఞునిలో ఐక్యం కాగలుగుతాము.
అయిదవ ప్రశ్న
అయిదవ ప్రశ్నను
శిబి తనయుడైన సత్యకాముడు అడుగుతున్నాడు. దేవా! మానవులలో మరణ పర్యంతమూ ఓంకారాన్ని
ధ్యానించిన వాడు ఏ లోకాన్ని పొంద గలుగుతాడు. దానికి పిప్పలాదుడు, ఓ సత్యకామా! నీ ప్రశ్న ప్రణవోపాసనకు సంబంధించినది. నిజానికి పరబ్రహ్మమూ
మరియు అపరబ్రహ్మమూ రెండూ ఓంకారమే కదా. ఈ విజ్ఞానాన్ని పొందిన జ్ఞాని తాను ఉపాసించే
లేదా ధ్యానించే విధానాన్ని అనుసరించి దానికి అనుబంధమైన లోకాన్ని పొందగలుగుతాడు,
అని చెపుతాడు.
అవ్యక్తమైన
సర్వాతీత శక్తిని పరబ్రహ్మము అంటున్నాము అలాగే వ్యక్తమైన రూపాన్ని జీవాత్మ లేదా
హిరణ్య గర్భుడు అంటున్నాము. అవ్యక్తమైనది నిర్గుణ బ్రహ్మము కాగా వ్యక్త మైనది సగుణ
బ్రహ్మము. వ్యక్తావ్యక్త బ్రహ్మములకు భేదము లేదని అద్వైతం చెపుతుంది.
ఓంకారంలో మూడు
మాత్రలున్నాయి. అవే "అ" కార "ఉ" కార "మ"కారాలు. ఈ
మూడు మాత్రలలో ఒక్క అక్షరాన్నే అంటే "అ"కారాన్నే ధ్యానించిన వ్యక్తి
దాని చేతనే సిద్ధి పొంది మరణానంతరం తిరిగి మానవ లోకానికే వస్తాడు. ఋక్కులు
(ఋగ్వేదానికి సంబంధించినవి) ఆ బాధ్యతను తీసుకుంటాయి. ఇక్కడ అతడు మళ్ళీ తపస్సు, శ్రద్ధా, బ్రహ్మచర్యాదులతో పునీతుడై మహిమాన్వితు
డౌతాడు.
ఓంకారంలోని మూడు
మాత్రలలో రెండు అక్షరాలను అంటే "అ"కార "ఉ" కారాలనే ధ్యానించిన
వ్యక్తి వాటి చేతనే సిద్ధి పొంది మనస్సులో ఐక్యమవుతాడు. అంటే సూక్ష్మ శరీరంలో
ఉంటాడు. అయితే అతడు మరణానంతరం చంద్రలోకానికి పోయి ఆ వైభవాన్ని అనుభవించి తిరిగి ఈ
లోకానికి యజుస్సుల (యజుర్వేదానికి సంబంధించినది) ద్వారా తీసుకు రాబడతాడు.
"చంద్రమా మనసా జాతా" అంటారు కాబట్టి మనస్సులో ఐక్యమైన పిమ్మట
చంద్రలోకానికి వెళుతుంది.
ఓంకారంలోని మూడు
మాత్రలలోని మూడు అక్షరాలతో అంటే "అ"కార "ఉ"కార "మ"
కారాలతో ఆ పరమ పురుషుని ధ్యానించిన వ్యక్తి వాటి చేతనే సిద్ధి పొంది తేజోవంతుడై
సూర్యునిలో ఐక్యమవుతాడు. పాము కుబుసాన్ని వదిలించుకున్నట్లుగా అతడు అన్ని పాపాలనూ
వదిలించుకొని హిరణ్యగర్భుని హృదయస్థుడైన పరమ పురుషుని దర్శిస్తాడు. సామగానాలు (సామ
వేదానికి సంబంధించినవి) అతడిని బ్రహ్మలోకానికి తీసుకు వెళుతాయి.
ఓంకారంలోని
మాత్రలు మూడూ అంటే "అ" కార "ఉ" కార "మ"కారాలు విడి
విడిగా ధ్యానించి నట్లయితే మరల మరల జన్మల నెత్తాల్సి ఉంటుంది. అర్థవంతంగా
ఎప్పుడైతే ఒకదానితో మరొక దానిని క్రమ పద్ధతిలో అనుసంధానించి ధ్యానిస్తామో అప్పుడు
శబ్దార్థాలు సరిగా కలవడం వల్ల సరైన ఫలితం
వస్తుంది. వీటిని బాహ్యాభ్యంతర మధ్య కర్మలలో అనగా జాగ్రత్, స్వప్న, సుషుప్తిలలో సరిగా ఉపయోగిస్తే అంటే సరిగా
ధ్యానిస్తే జీవుడు పరమ పథాన్ని చేరుకుంటాడు. అలా నిశ్చల, నిరుపమాన,
భయ రహిత స్థితికి చేరుకున్న జ్ఞానికి “కంపన”మనేది ఉండదు.
"ఓం"
ఇత్యేకాక్షరం బ్రహ్మ అంటుంది వేదం.
ఓంకారంలోని "అ" కార "ఉ" కార "మ"కారాల వల్లనే
మూడు వేదాలు, ముల్లోకాలు వెలువడ్డాయని చెపుతారు. "అ"
కారం నుండి "తత్ సవితుర్వరేణ్యం" వెలువడి ఋగ్వేదంగా విస్తరించిందనీ;
"ఉ" కారం నుండి "భర్గో దేవస్య ధీమహి" వెలువడి
యజుర్వేదమయిందని; "మ"కారం నుండి "ధియోయోనః
ప్రచోదయాత్" వెలువడి సామవేదంగా రూపొందిందనీ చెపుతారు. ఈ మూడు వేదాలలో ఋగ్వేదం
స్తుతిపరమైనది, యజుర్వేదం కర్మపరమూ లేదా క్రియాపరమైనది కాగా
సామవేదం జ్ఞానపరమైనదిగా వ్యవహరిస్తారు.
సాధనలో సాధకునికి
"ఋక్, యజుర్, సామా"లు ఉపకరణాలవుతున్నాయి.
ఋక్కుల ద్వారా మనుష్యలోకం, యజుస్సుల ద్వారా చంద్రలోక
ప్రాప్తిస్తుంది. సామముల ద్వారా సకలలోకాలకు అధినాయకమైన, శాంతమైన,
అక్షరమూ, అవ్యయమైన పరమలోకానికి చేరుతామని,
చెపుతున్నాడు.
శ్రీ శంకరుల
వ్యాఖ్యాన్ననుసరించి, ఓం కారాన్ని ధ్యానిస్తూ సాధన చేసే సాధకుడు కొన్ని
నియమాలు పాటించాలి. ధ్యానంలో సయమ పాలన, సాధించాలనే పట్టుదల,
ఉద్యమ స్పూర్తి, మృదు భాషిత్వము, సత్యవ్రత దీక్ష, అహింస, అపరిగ్రహ
శీలత, ఇంద్రియ నిగ్రహణ లాంటివి నిష్టగా పాటించాలి. మనుచరిత్ర
కారుడు చెప్పినట్లుగా "కుంభగత ప్రదీప కళికా శ్రీ" వోలె వ్యగ్రత లేకుండా,
నిశ్చలంగా, నిర్మలంగా మనస్సును పరమాత్మపై
నిలిపి ఓంకారాన్ని ఉపాసించాలి.
ఈ అయిదవ ప్రశ్నకు ముగింపుగా పిప్పలాదుడు, ఆధ్యాత్మిక పరిభాషలో వ్యక్తమైన అక్షరాల కన్నా అంతర్గత భావనలకే విలువ
ఎక్కువగా ఉంటుంది. అనంతమైన చైతన్యాన్ని వ్యక్తీకరించేందుకు పరిమితమైన భాష సరిపోదు.
Spirit of the Rule is more important than the letter of the Rule. భౌతిక జీవనంలో ప్రగతి కావాలన్నా, ఆధ్యాత్మిక జీవనంలో
సుగతి కావాలన్నా అమితమైన, అచంచల విశ్వాసము చాలా ముఖ్య భూమిక
పోషిస్తుంది. బలీయమైన సంకల్పంతో పాటుగా,
తనపై తనకు సాధించగలననే విశ్వాసం ఉండాలి. గురువు యొక్క సమర్ధతపై
విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసము లేని నాడు దేనినీ సాధించలేము. అయితే ఆ విశ్వాసము
సహజ స్వీకృతి ద్వారా ఏర్పడాలి, అంటాడు.
ఆరవ ప్రశ్న
ఆరవ ప్రశ్నను భరద్వాజుని పుత్రుడైన సుకేశుడు అడుగుతున్నాడు.
హే భగవాన్! కోసల
దేశాన్ని పాలించే హిరణ్యనాభుడనే రాజపుత్రుడు నా వద్దకు వచ్చి "నీకు పదహారు
కళలుగల పురుషుణ్ణీ గూర్చి తెలుసా? లేదా ఆత్మను గూర్చి
తెలియునా?" అని నన్ను ప్రశ్నించాడు. దానికి నేను
"నాకు తెలియదు" అన్నాను. ఒకవేళ తెలిస్తే జిజ్ఞాసువు అయిన నీకు ఎందుకు చెప్పను.
తెలియని విషయాన్ని తెలిసినట్లుగా అబద్ధాలాడిన వాడు "సమూలో వా ఏష
పరిశుష్యతి" అంటే సమూలంగా నశిస్తాడు. అందుకే నీకు తెలియదు కదా అని నేనేదో
కల్పించి చెప్పను’ అన్నాను. ఆ ప్రశ్ననే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి
నా సందేహాన్ని నివృత్తి చేయండి.
ఈ ప్రశ్నను
వ్యాఖ్యానిస్తూ ఒక లోక సామాన్య న్యాయాన్ని ప్రతిపాదిస్తున్నారు, శ్రీ శంకరులు. "అతో న్యాయతః ఉపసన్నాయ యోగ్యాయ జానతా విద్యా వక్తవ్యా
ఏవ, అనృతం చ న వక్తవ్యం సర్వాసు అవస్థాసు" అంటారు
శంకరులు. "తెలిస్తే యోగ్యుడైన వానికి అర్హత ప్రాతిపదికగా కాదనకుండా లోభ రహితంగా
విద్యను ప్రసాదించాలి. అనృతాన్ని అంటే అసత్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ
చెప్పరాదు" అంటారాయన.
పిప్పలాదుడంటాడు...
ఇక్కడే, ఈ శరీరంలోనే నెలకొని ఉన్న పురుషునికి అంటే ఆత్మకు
పదహారు కళలు ఉన్నాయి. ముందుగా 1) ప్రాణం, ఆ ప్రాణం నుండి 2) శ్రద్ధ; శ్రద్ధ
వల్లనే 3) ఆకాశం, 4) వాయువూ, 5)
అగ్నీ, 6) జలమూ, 7) భూమి,
8) ఇంద్రియాలు, 9) మనస్సు, 10) ఆహారమూ కలిగాయి. ఆహారం నుండి 11) పటుత్వము, (పటుత్వం వల్ల శక్తి, శక్తి వల్ల కర్మలు, మళ్ళీ ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి విభిన్న లోకాలు కలిగాయి) అంతేకాదు,
12) తపస్సు, 13) వేదాలు, 14) యజ్ఞాలు లేదా కర్మలు, 15) ప్రపంచాలు
లేదా
లోకాలు
16) నామాలు లేదా పేరులు ఆ పదహారు కళల పురుషుని
నుండే వచ్చాయి. ఎలాగైతే వివిధ అస్థిత్వాలు కలిగిన నదులు సముద్రంలో కలిసినాక తమతమ
అస్థిత్వాన్ని కోల్పోతాయో, అలాగే
ఇవన్నీ కూడా ఆత్మ నాశ్రయించిన వేళ తమతమ అస్థిత్వాలను కోల్పోతాయి. వివిధ రూపాలతో,
వివిధ నామాలతో పిలువబడే నదులు సముద్రంలో కలిసాక ఎలాగైతే సముద్రంగా
పిలువ బడుతాయో అలాగే ఈ పదహారు కళలు కూడా ఆత్మతో కలవగానే తమ అస్థిత్వం అదృశ్యం కాగా
పురుషునిగా లేదా ఆత్మగానే పిలువ బడుతాయి. అలాగే ఋషి మరొక ఉదాహరణ నిస్తున్నాడు...
రథ చక్రంయొక్క ఇరుసుపై ఆకులు ఆధారపడి నట్లుగా ఈ పదహారు కళలు కూడా పురుషుడు లేదా
ఆత్మపై ఆధారపడ్డాయి.
నిజానికి ప్రాణమే
వీటన్నిటికి అనగా మిగతా పదిహేను కళలకు మూలాధారం. అంతేకాదు, వీటన్నింటినీ కలిపి ఉంచే సూత్రం వంటిది కూడా ప్రాణమే. ఇక ఏది నిష్క్రమించడం
వల్ల మరణ సంభవిస్తుంది అంటే "ప్రాణం" నిష్క్రమించడం వల్ల అనే సమాధానం
వస్తుంది. ప్రాణం నిష్క్రమించడం వల్ల "ఆత్మ" ఈ దేహాన్ని విడిచి వెళ్ళక
తప్పని పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే ఆత్మకు "ఉపాధి" ప్రాణమే
కాబట్టి. ఉపాధి లేకుండా ఆత్మకు అస్థిత్వం లేదు.
అంతే కాదు, ఈ పదహారు కళలూ భగవంతుడు అనబడే అత్యున్నత తత్త్వానికి
అనుసంధాన మైనవే. అయినా భగవంతుడు, నిష్కళుడు లేదా ఏ కళలకు
చెందని వాడు.
ఇలా వివరించిన
పిప్పలాదుడు, తదుపరి ఇలా అంటున్నాడు. నేను ఇంతవరకే తెలుసు
కున్నాను. ఇంతకు మించి నాకు తెలిసినది ఏమీ లేదు. ఎవరైతే ఈ విజ్ఞానాన్ని అవగాహన
చేసుకుంటాడో, అతనికి మృత్యు భయం ఉండదు.
అప్పుడలా, ఆ ఆరుగురు పృచ్ఛకులు, శ్రద్ధగా పిప్పలాదుడు
చెప్పినది విన్నవారై, కృతజ్ఞతతో అతనిని అర్చించి "త్వం
న హః పితా యో౨ స్మాక మవిద్యాయాః పరం పారం తారయసి" తండ్రి లాగా మా అజ్ఞానాన్ని
హరించి వేసారు. మీకు కృతజ్ఞతా పూర్వక నమస్సులు అంటూ సాష్టాంగ నమస్కారములు సలిపి
సెలవు తీసుకొని వెళ్ళి పోతారు.
శుభం
ఉపసంహారము
ఉపనిషత్తులు
వేదానికి సారంలాంటివి. గురు ముఖఃతా అంతరార్ధాన్ని తెలుసుకోని ఏకాగ్రచిత్తంతో
ఆచరించాలి, అనుష్టించాలి. "బ్రహ్మం యేన చరతి ఇతి బ్రహ్మచర్యం" అన్నారు. బ్రహ్మ తత్త్వాన్ని శ్రద్ధగా అన్వేషణ
చేస్తూ తపించడం వల్ల మాత్రమే ఆ తత్త్వాన్ని అర్ధంచేసుకోగలము. అందుకే
ప్రశ్నోపనిషత్తు "తపసా బ్రహ్మ చర్యేణ శ్రద్ధయా" అంటూ ఒకటికి రెండు
మార్లు హెచ్చరించింది, శాసించింది.
చివరగా, ఒకసారి ప్రశ్నోపనిషత్తులో ప్రస్తావించ బడిన విషయాలను సింహావలోకనం
చేసుకుంటే..... ఒక సమాజంలో గురుశిష్య సంబంధం ఎలా ఉండేదో అర్ధం అవుతుంది.
నేర్చుకోవడం ఎలాగో అవగాహన చేసుకోవచ్చు. ప్రశ్నించడం ఎలాగో తెలుస్తుంది. ఈ
ప్రపంచంలో దేని విలువయైనా దాని ఉపయోగం
ప్రాతిపదికగా నిర్ణయింప బడుతుంది. సదుపయోగం, దురుపయోగం మరియు
నిరుపయోగం ఈ మూడింటిలో ప్రాజ్ఞత సదుపయోగాన్ని ఎన్నుకుంటుంది. నిరుపయోగం వల్ల నష్టం
లేదు లాభమూ లేదు కాని అనర్హుల చేతిలో ఎదైనా దురుపయోగం అవుతుంది. అందుకే
అర్హతలేకుండా ఎవరికీ ఏదీ ఇవ్వకూడదు ఇస్తే దురుపయోగం అయ్యే అవకాశం ఉంది.
నేర్చుకోవడంలో జిజ్ఞాసువుకు శ్రద్ధ చాలా అవసరం. వినయం అవసరం. పూర్వ
నిశ్చితాభిప్రాయాలను ప్రక్కన పెట్టి బోధకుడు చెప్పే విషయాలను అవగాహన చేసుకునే
ప్రయత్నం చేయాలి. అలాగే గురువుకు విషయంపై స్పష్టత అవసరం. మరొక్క విషయం... తనకు
తెలిస్తేనే తెలిసినంత వరకే చెప్పాలి. శిష్యుని స్థాయికి దిగి వచ్చి శిష్యుడు తన
స్థాయిని పెంచుకునేందుకు సహకరిస్తూ బోధచేయాలి.
ఈ ఉపనిషత్తులో
భౌతిక జగత్తు ఆవిర్భావం, పరిణామం, ఆత్మయొక్క స్థితి,
ఆధ్యాత్మిక జగత్తును అర్థంచేసుకునే విధానం తెలియ చేయబడింది.
సశాస్త్రీయ వివరణ వల్ల ఆనాటి ఋషుల దార్శనికత ప్రపంచ స్వరూప స్వభావాల పట్ల వారి అవగాహన
అర్థంచేసుకోవచ్చు.
ఫలశ్రుతిగా... ఈ
విజ్ఞానాన్ని తెలుసుకున్న వారికి మరణభయం ఉండదని, అంటాడాయన.
మరణ భయం ఉండదని అంటే వారికి మరణం లేదనికాదు. మరణం గురించిన అవగాహనను పెంచుకుంటారు.
మనలో భయం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే విషయం పట్ల సమగ్రమైన
అవగాహన ఉండదో అప్పుడే భయం మనలో చోటు చేసుకుంటుంది. జగత్తు (జాయతే గచ్ఛతే... జగత్)
ఏదైతే జనిస్తుందో అది నశిస్తుంది మరలా ఆవిర్భవిస్తుంది. ఇది ప్రకృతి దర్మం. ఎవరైతే జనన మరణ స్వరూపాలను స్వభావాలను
ప్రాకృతిక ధర్మాలను అర్ధం చేసుకుంటారో,
అవగాహన చేసుకుంటారో వారు ఆ భయానికి అతీతంగా వ్యవహరిస్తారు.
ఇదే సమగ్రమైనదా? అంటే కాదనేదే నా జవాబు.
అనంతమైన చైతన్యాన్ని (జ్ఞానాన్ని) అర్థం చేసుకునేందుకు పరిమితమైన పదాలు సహకరించవు.
అపరిమితత్త్వానికి హద్దులు నిర్ణయించడం అసాధ్యం, అవివేకం.
అభ్యుదయాధ్వం నిరంతర చేతనాశీలి. అందుకే పిప్పలాదుడు "నాకింత మాత్రమే తెలుసు"నని
అంటాడు.
నేను అవగాహన
చేసుకున్న మేరకు, నాకు తెలిసిన మేరకు సమాన మనస్కులతో పంచుకునేందుకు ఈ
ప్రశ్నోపనిషత్తును వ్యాఖ్యానించే సాహసం చేస్తున్నాను. అసమర్ధతతో కూడిన అవగాహనా
లోపం వల్ల సమన్వయం సరిగా లేకపోతే విజ్ఞుల విజ్ఞత దానిని సరిచేస్తుందనే నమ్మకంతో మీ
ముందుకు వస్తున్నాను.
అంతేకాదు, ప్రశ్నోపనిషత్తు లోని ఆరు ప్రశ్నలూ లోతైన అవగాహనతో
అర్ధం చేసుకోవాలి. సామాన్య శాస్తము
(సైన్స్), తత్త్వశాస్త్రము మరియు మానసిక శాస్త్రం కలబోసినది
ఈ ఉపనిషత్తు. ఇంకా వేదాలు మరియు వేదాంతాలు లేదా ఉపనిషత్తులు అన్నీ సాంకేతిక పదాలతో
చెప్పబడ్డాయి. కొన్ని వేల సంవత్సరాలు గతించిన ఈ నాడు ఆనాటి సాంకేతిక అర్థాలు
మారిపోయిన సమయంలో లేదా ఆ అర్ధాలను విస్మరించిన సమయంలో పదాలకు చెప్పే భౌతిక
అర్ధాలతో అంతరార్ధాన్ని వెదుక్కోవడం సాహసమే అవుతుంది. కాలక్రమంలో ఏ సాంకేతికత యైనా
అభివృద్ధి చెందే క్రమంలో పాతది వాడుకలో లేకపోవడం (Obsolete)
జరగవచ్చు. పాతదానికి క్రొత్త అర్ధాలను వెదికే సమయంలో తెలియక తప్పుడు అర్ధాలు
చెప్పుకోవచ్చు. భాషాంతరీకరణ వల్ల కూడా తప్పులు జరగవచ్చు. అలాంటి తప్పులు
తెలిసిగాని తెలియక గాని చేయడం జరిగితే ఆ పరమ పురుషుడు క్షమిస్తాడని బలంగా
విశ్వసిస్తూ....
పరమ ఋషులకు, తల్లిదండ్రులకు, గురువులకు నమస్కరిస్తూ... సెలవు.
పాలకుర్తి రామమూర్తి
ఓం శాంతిః శాంతిః శాంతిః
No comments:
Post a Comment