Friday, October 28, 2016

రథ సారథి కర్తవ్యం (Responsibility of the Managing Director)

రథ సారథి కర్తవ్యం
(Responsibility of the Managing Director)
సారథి దక్షుడై, రథిక సారము, రథ్య బలంబు, నాయుధో
దారత, మానమున్, రణ విధంబు, నిమిత్త శుభాశుభత్వ ని
ర్ధారణ మున్, మదిం గని హితం బెఱిగించుట నీతి గాన నీ
వీరస మెత్తి నో బలికి తేనియు చెప్పుదు, సూత నందనా!
(శ్రీమదాంధ్ర మహాభారతము ..  కర్ణ పర్వము, ద్వితీయాశ్వాసము- ౫౨)

ఓ కర్ణా! నీ మనస్సు లో వీర రసం ఉప్పొంగడం చేత, ఉన్న యదార్ధ రీతిని చెప్పినా, నీవు చెవిని చేర్చడం లేదు. అయినా సారథిగా నా అవగాహనలో ఉన్న విషయం నీకు చెప్పడం నీతి కాబట్టి చెపుతున్నాను.... అంటూ శల్యుడు ఇలా చెపుతాడు.
రథికుని నైపుణ్యాన్ని, గుర్రాల యొక్క జవసత్వాలను, రథం లో ఉన్న ఆయుధ సంపత్తినీ, రథికుని యొక్క విలువలు మరియు సిద్ధాంతాలు, యుద్ధం ఎలా నడుస్తుంది, అంతే కాక ఎదురౌతున్న శకునాల ననుసరించే ఫలితాలు అన్నీ పరిశీలించి మంచి చెడ్డలు చెప్పడం ఉత్తమమైన దక్షుడైన సారథిగా నా కర్తవ్యం కాబట్టి చెపుతున్నాను, అంటాడు.
దీనిని ఈ నాటి మార్కెట్ కు అన్వయించుకుంటే.....
ఒక సంస్థ నిలదొక్కు కోవాలి... తన విజయం  చరిత్ర పుటల్లో నమోదు కావాలి... భావి తరాలకు ఆదర్శప్రాయం కావాలి అంటే ఆ సంస్థ సంపాదించుకో వలసిన, సమీకరించుకోవలసిన లక్షణాలను పరోక్షంగా తెలుపుతుందీ పద్యం.
సారథి దక్షుడై .... సారధి (Managing Director)... ఆ సంస్థను నడిపించే వ్యక్తి  దక్షుడై ఉండాలి, సంబంధిత రంగం లో నైపుణ్యాన్ని కలిగియుండాలి, అన్ని విభాగాల పై కనీస అవగాహన ఉండాలి... కార్య సాధకుడై ఉండాలి, త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగిన వాడై ఉండాలి, భయం పక్షపాతం లాంటి వాటికతీతుడై ఉండాలి, బృందం తో కలసి పని చేయ గలిగి ఉండాలి... బృందాన్ని నడిపించ గలిగి ఉండాలి. బుద్ధి తో ఆలోచించి అవసరమైన చోట తల్లి/తండ్రి (పేరెంట్) గా, పెద్దాయన (అడల్ట్)గా, చిన్న పిల్లవాడి (ఛైల్డ్) గా వ్యవహరిస్తూ ఒక్కొక్క మారు లాలించ గలగాలి ఒక్కొక్క మారు కఠినంగా వ్యవహరించ గలిగి ఉండాలి.
రథిక సారము.... రథికుడు (Chairman - Management) దూరదృష్టి, యోజనా పటిమ, ప్రతిభను గుర్తించగలిగిన వికాసం, దైర్యం, మనో నిగ్రహం, నైపుణ్యం, భావోద్వాగాలపై పట్టు, భావ వ్యక్తీకరణ నైపుణ్యం కలిగియుండాలి. విస్తృత పరిశీలనా శక్తి కలిగి యుండాలి. ఎదుటి వారి వ్యూహాలను పసిగట్ట గలగడం, తగిన రీతిలో వేగంగా స్ఫందించ గలిగిన ధీ పటిమ యుండాలి. ఆ యా రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడం.. దానికి తగిన రీతిలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోగలిగిన విధానం తెలిసి ఉండాలి. ఆ మార్పులను అంగీకరించే మానసిక చైతన్యం కలిగి ఉండాలి. అనుయాయులతో, వినియోగదారులతో సత్సంబంధాలను కలిగి యుండాలి. బృందాన్ని ఏర్పాటు చేయగలగడం, ఆ బృందం లోని సభ్యులందరూ ఒకే లక్ష్యం తో కలసి ఒకే ఆలోచనా విధానం తో పని చేసేందుకు అవసరమైన స్ఫూర్తిని నింపగలగడం, సమస్యలెదురైన వేళ వాటి నధిగమించేందుకు ప్రణాళికా బద్ధం గా ముందు చూపుతో వ్యవహరించ గలగడం, ప్రో ఆక్టివ్ గా యుండడం, హేతుబద్ధ ఆలోచనా పటిమ... తోటి వారిని గౌరవించే నైజం, ఎదుటి వారి సలహాలను సకారాత్మకంగా తీసుకునే లక్షణాలు ఉండాలి. ఆర్థిక, సామాజిక, మేధో బలం కలిగిన వాడై యుండడం వల్ల అతని సమర్థత గౌరవించబడి.. అనుయాయులు అతనిని నమ్మదగిన వ్యక్తిగా గుర్తిస్తారు... అనుసరిస్తారు... సహకరిస్తారు... అనుమోదిస్తారు.
రథ్య బలంబు.... రథ్య బలము (Men, Machinery & Morality) ఉత్తము లైన, ఆలోచనాపరులైన, సంస్కారవంతులైన, కష్టపడి పని చేయగలిగిన వారు, సంస్థ అభివృద్ధియే తమ అభివృద్ధిగా తలచే వారు ఉద్యోగులుగా... ప్రతిభ ఆధారం గా నియమింప బడాలి. అన్నివిభాగాలలో పరస్పరాధారిత స్ఫూర్తి తో పని చేయగలిగిన ఉద్యోగులు సంస్థకు వెన్నెముక లాంటివారు. సంబంధిత రంగం లో అవసరమైన శిక్షణ పొంది ఆ అనుభవం ప్రాతిపదికగా అంకిత భావం తో పనిచేసే ఉద్యోగులు సంస్థ ప్రగతిలో ముందుంటారు. అలాగే అధునాతన యంత్ర సామాగ్రి, అవసరమైన విడిభాగాలు అందుబాటులో ఉండడం వల్ల ఉత్పత్తి కుంటుపడదు.. ఉత్పత్తి ఉత్పాదకతలు పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తం గా వస్తున్న మార్పుల నాధారం చేసుకొని ఎప్పటి కప్పుడు యంత్ర సామాగ్రిని ఆధునీకరించుకోవడం వల్ల పరిశ్రమలో ముందుండడం సాధ్యపడుతుంది. క్రొత్త ఆవిష్కరణలు, క్రొత్త విధానాలు.. అమ్మకాలను పెంచుతాయి... ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తాయి... అమ్మకపు ఖర్చులను తగ్గిస్తాయి... వెరసి నికర ఆదాయం పెరుగుతుంది. విలువలు, సిద్ధాంతాల ఆధారంగా పనిచేయడం, పాలనా వ్యవహారాలలో పారదర్శకత వల్ల ఉద్యోగులు - సంస్థ మధ్య సంబంధాలు దృఢమౌతాయి. అదే విధానాన్ని సంస్థ సంస్కృతిగా కొనసాగించడం, క్లయింట్లు మరియు సప్లయర్స్ తో వ్యవహరించడం వల్ల వ్యాపార సంబంధాలు పటిష్ఠ మౌతాయి.
ఆయుధోదారత...  ఆయుధోదారత (Qualitative and Quantitative Resources & Instruments) వనరుల సమీకరణ సరిపోయేంతగా ఉండాలి. ఎక్కడ ఏ లోపం రాకూడదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన మేరకు నాణ్యమైన ముడిపదార్ధాలను సేకరించి పెట్టుకోవడం.. విడిభాగాలను సరఫరా చేసే సంస్థల తో అనుబంధాన్ని పెంచుకోవడం... అవసరమైన మేరకు సరఫరా ఒప్పందాలను కుదుర్చుకోవడం... వినియోగదారులతో సత్సంబంధాలను కలిగి యుండడం, స్నేహబంధాన్ని కొనసాగించడం లాంటివి మనలను ఉన్నత స్థానం లో నిలుపుతాయి.
మానమున్... మానము (Credibility) పరిశ్రమలో పరపతి పెంచుకోవాలి. ఏ ఇచ్చిపుచ్చుకునే లావాదేవీ వల్లనైనా వినియోగదారునికీ అమ్మకం దారుకూ ఇరువురికీ ఉపయోగపడే ఒప్పదం కుదరాలి అలాంటి ఒప్పదం కుదుర్చుకోవడం వల్ల ఇరువురి ప్రయోజనాలు సిద్ధిస్తాయి.  నీకు జయం నాకూ జయం (Win/Win Attitude) వైఖరి వల్ల ఇరువురూ లాభపడతారు... ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ ఒప్పదం కుదరక పోయినా వారి మధ్య బంధం చెడిపోదు.  సరైన సమయానికి మనం ఇవ్వవలసిన చోట బిల్లులు చెల్లించడం వల్ల సరఫరాదారు మనల్ని ఉత్తమ ఖాతాదారునిగా గుర్తిస్తాడు. మన పట్ల ఉదారం గా వ్యవహరించే అవకాశం ఉంది. న్యాయబద్ధం గా సరకుకు విలువ కట్టడం, సరైన నాణ్యత, సరైన కొలత, సరైన సమయానికి, సరైన ధరకు సరకు ను వినియోగదారునికి అందించడం వల్ల మన పరపతి పెరుగుతుంది. సరఫరాదారుడు, వినియోగ దారుడు... ఇరువురి నమ్మకం సంతృప్తి చూరగొన్న ఏ సంస్థ యైనా ఉన్నత శిఖరాల నధిరోహిస్తుంది.
రణ విధంబు... రణ విధానము (Planning, Organising, Processing, Review, Introspection,  Restucturing and Implimentation) ముందుగా ఏ పరిశ్రమను ఏర్పాటు చేయాలి, ఎక్కడ చేయాలి, దానికి ఏ యే వనరులు ఎంత మొత్తం లో అవసరమౌతాయి, ఆయా వనరుల నెలా సమీకరించుకోగలం, దానికి నైపుణ్యం గలిగిన ఉద్యోగులు లభిస్తారా, యంత్ర పరికరాలు ఎక్కడ లభిస్తాయి, ప్రభుత్వ అనుమతులు ఎలా వస్తాయి, ఈ విధానం లో పరిశ్రమ నెలకొల్పడానికి ఎంత సమయం పడుతుంది, ఎంతడబ్బు అవసరమౌతుంది, భాగస్వాములు లభిస్తారా, వినియోగ దారుల మార్కెట్ ఎలా ఉంది, మన పోటిదారుల వ్యాపారం ఎలా ఉంది, పరిశ్రమ స్థాపనలో మన బలాబలాలు ఏమిటి, మార్కెట్ ను ఎలా స్వాధీన పరచుకో గలం అనే అన్ని విషయాలపై సరైన అవగాహనతో కూడిన యోజనా ప్రణాళిక తయారు చేసుకోవాలి. మనకున్న అన్ని వనరులనూ సమీకరించుకోవాలి. ప్రతిభ ఆధారం గా అనుచరులకు బాధ్యతలప్పగించాలి. నిజాయతీ పరులను కీలక పదవులలో పెట్టి వారికి అర్హులైన శిక్షణ పొందిన సహాయకులను నియమించాలి. నాణ్యత గలిగిన యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి నిర్వహణా బాధ్యతను సంబంధించిన వారికి నిర్ణయాధికారాలతో సహా అప్పగించాలి. అవసరమైన సమయం లో ఏం జరుగుతుంది అనుకున్న ఫలితాలు వస్తున్న యా లేదా ఏ యే విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి.. ఎయే విభాగాలలో ఏయే సమస్యలున్నాయి... అనె విషయాన్ని సమగ్రంగా విశ్లేషించి వీలైనంత త్వరగా దానిని సరిచేయాలి. ఆత్మ పరిశీలన ద్వారా మన పని తీరును సరి చూచుకోవాలి. అవసరమైన చోట ఏయే మార్పులు చేర్పులు అవసరమో పరిశీలించి ఆయా మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల సంస్థ పని తీరు ఉత్తమం గా ఉంటుంది.
నిమిత్త శుభాశుభత్వ నిర్ధారణమున్.... (Ascertaining Good and Bad by Observing the Market trends) శకునాలు .... మార్కెట్లో కనిపించే సూచనల కనుగుణం గా ఏది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది దేని వల్ల నష్టపోతామో గ్రహించడం, ఏ నాణ్యతా ప్రమాణాలతో ఏ వస్తువు ఎక్కడ అమ్మగలమో.. ఎక్కడ మన ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో... వినియోగదారుల మనసు గెలిచేందుకు మన ఉత్పత్తుల ప్రమాణాలలో ఇంకా ఏ విధమైన మార్పులు చేయాలో...ఎక్కడ మన కవసర మైన ముడి సరకులు తక్కువ ధరకు దొరుకుతాయో... ప్రభుత్వ విర్ణయాలు మన ఉత్పత్తులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి... వాటి వల్ల ఉపయోగమా నష్టమా లాంటి వివిధాంశాలను ఎప్పటి కప్పుడు సర్వే చేయించడం... వల్ల అవసరమైన మార్పులు వేగం గా తీసుకు రావడం వీలవుతుంది. మార్కెట్ లో ముందుండాలి అంటే సమాచార వ్యవస్థ ను మెరుగుపరుచు కోవాలి. మన వినియోగదారుని ప్రలోభాలతో లొంగ తీసుకునే పోటీదారులను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మన సంస్థ లో లంచగొండి ఉద్యోగులు, స్వలాభం చూచుకునే భాగస్వాముల గూర్చిన సమగ్ర సమాచారం ఎప్పటి కప్పుడు మనకు చేరవేయ గలిగిన గూఢాచార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధానాలలో సూచనలు అందిన సమయానికి స్ఫందించని ఉత్పత్తిదారుడు నష్టపోతాడు.
హితం బెఱిగించుట (Advising & Mentoring) హితము చెప్పడం... అభ్యుదయ మార్గం లో సాగాలని కోరే ప్రతి సంస్థ లో సాంకేతిక, ఆర్థిక, వ్యాపార, న్యాయ సంబంధిత అంశాలపై సరైన సూచన లిచ్చేందుకు ఒక నిపుణుల సలహా మండలి ఉండాలి. ఆ సలహా మండలి స్వతంత్రం గా వ్యవహరిస్తూ అధినేతకు మాత్రమే జవాబు దారి కావాలి. అయా అంశాలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ... అన్ని సూచనలను పరిగణన లోకి తీసుకుంటూ సంస్థ ప్రగతికి ఏ విధానం మంచిదో ఆ సలహా మండలి తెలియచేయడం మంచిది. ఆ సూచనల నాదరించి అందులోని సాధ్యాసాధ్యాలను పరిగణలోనికి తీసుకొని అధినేత నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అధినేత పరిమితుల కారణంగా ఆ సూచనలు పాటించక పోయినా, విషయమెంతటి సున్నితమైనదైనా, నీచ మైనదైనా, అధినేతకు విన్నవించడం ఆ సలహా మండలి కర్తవ్యం. తమ దృష్టికి వచ్చిన సమాచారాన్ని శాస్త్రీయం గా విశ్లేషించి ఆ పరిశీలన సారాన్ని ఉపపత్తిగా చూపుతూ ఏ దారి మంచిదో యుక్తమైనదో దానిని అధినేత కు నివేదించడం వారి కర్తవ్యం. అయితే అందులో తమ స్వార్థపూరిత అభిప్రాయాలకు తావివ్వవద్దు. ఆ సలహా మండలికి ఉద్యోగులను నియమించే సమయం లోనే నిజాయతీ పరులను, నమ్మకస్తులను, అనుభవజ్ఞులను ఎన్నుకోవడం అధినేత విధి.

పాలకుర్తి రామమూర్తి

No comments: