Friday, October 28, 2016

తపోభంగము /"ఉదయశ్రీ"/జంధ్యాల పాపయ్య శాస్త్రి

స్వర్ణదీ స్వర్ణ కంజ కింజల్కములకు
పసిమి దిద్దెడి గిరికన్య పాణితలము
పట్టుకొని వీడగాలేడు భవుడు; మేను
పులకరింపగ వలపులు తొలకరింప!

ముద్దు లొలికెడి పగడాల మోవిమీద
తళుకు చిఱునవ్వు ముత్యాలు తద్గుణింప
"స్వామి! యేమిది? " యనుచు లజ్జా వినమ్ర
ముఖి యయి యొకింత వారించె ముగుద మునిని!

తపోభంగము /"ఉదయశ్రీ"/జంధ్యాల పాపయ్య శాస్త్రి
పై పద్యాలు రెండు చదువుతుంటే మీకేమి అనిపిస్తుందో చెప్పండి.

భవుడు శివుడు (ఆనందమయుడు) కాలేడు. భవము ఎప్పుడూ సంతోషాన్ని వెదుకుతూ, ఆ ఎండమావుల వెనుక పరుగులు తీస్తూ ఉంది. అభవుడు ఎప్పుడైతే భవుడయ్యాడో గిరి కన్య పాణి తలమే కాదు పాదయుగాన్నీ పట్టుకుంటాడు... విడిచి యుండనూ లేడు. మనము మెచ్చింది ఎప్పుడూ మన కంటికి అందంగా కనిపిస్తుంటుంది... సంతోషాన్ని (ఆనందాన్ని కాదు) ఇస్తుంది. గిరి కన్య కఠినురాలే. ఎందుకంటే తన తండ్రి గిరి కాబట్టి. ఆమె మనసు కూడా కఠినమైనదైనా ఆమె స్వర్ణదీ సంగమంతో పునీతమైన దగుటచే తనకుప్రియమైన భవుని సాన్నిహిత్యంచే కలిగిన వలపుల చేత పులకరింతలు ఏర్పడి అవే అన్యోన్య పలకరి0తలుగా మారిపోవడం జరుగుతుంది.
ప్రకృతిలో రెండు శక్తులు ఉంటాయి. అవే స్త్రీ, పురుష శక్తులు. మనందరిలో కూడా ఆడ మగ అనే భేదం లేకుండా ఉంటాయి అవి. పురుష శక్తి సృజనాత్మకతకు ప్రతీక కాగా స్త్రీ శక్తి అనుభూతికి, అంగీకృతికి ప్రతీకలుగా చెపుతారు. సృజనాత్మకతకు తొందరపాటు ఉంటుంది. ఆవేశం ఉంటుంది. కోరిక ఉంటుంది. ఆవిష్కరణ జరగాలనే తపన ఉంటుంది. స్త్రీ శక్తిలో ఆలోచన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, అనుభూతి ఉంటుంది. శాశ్వతత్త్వానికి దగ్గరగా వెళ్ళాలనే సంయమనత తో కూడిన భావనలుంటాయి. నిజానికి ఈ రెండూ ప్రతి వ్యక్తిలో (ఆడ మగ భేదం లేకుండా) సమపాళ్ళలో ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏ ఒక్కటి పాళ్ళు తప్పినా జీవితం ఆంధోళనాభరితమౌతుంది.
అందుకే ఆమె "యేమిది? " యనుచు లజ్జా వినమ్ర ముఖి యయి యొకింత వారించడం" జరిగింది. అలాగని ఆమె అక్కడినుండి వెళ్లదు. ఎందుకంటే... ఆ అనుభవం ఆమెకూ ఇష్టమే. ఆ తన్మయతను ఆమెకూడా కోరుకుంటుంది.
శృంగారాన్ని ఆవిష్కరించడం కవి యొక్క సమర్ధతపై ఆధారపడియుంటుంది. కామాన్ని చూపడం వేరు శృంగారాన్ని చూపడం వేరు. ఈ రెంటి మధ్య భేదాన్ని తెలియని కవులు వ్రాసే వ్రాతలలో అశ్లీలత చోతుచేసుకొని జుగుప్సను కలిగిస్తుంది.
ఇక జీవునిని బంధించే మాయా బంధనాల వల్ల మనస్సు కఠినమౌతుంది. అందులో "అభవాన్ని" దర్శించడం కష్టసాధ్యం. అందుకే "భవం" నుండి "అభవ" స్థితికి చేరాల్సిన అవసరము ఉంటుంది. అదే సంతోషాన్నుండి ఆనందామృతాన్ని పొందే విధానం.
మరొక్క విషయం. శివుడు.. ఆనందమయుడు. ఆయన కామాన్ని దహించి వేసాడు. కామం అంటే కోరిక. కోరికలు నిశ్శేషంగా దహింప బడ్డాక ఆయనకు ఏ "ఆకలి" లేదు. ఆకలి అంటే అది కడుపుకు ఏదైనా తినేందుకు ప్రేరణ నిచ్చేదే కాదు. కోరికలేవైనా అవి ఆకలి గానే పరిగణించాలి. కామం లేదు కాబట్టి వెండికొండపై తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆనందమయుడై సర్వాన్నీ మరచి అంతర్ముఖుడైన శివునికి ఆకలి లేదు కాని ప్రపంచం సంగతేమిటి? అందుకే అమ్మవారు ఆయన నిష్టను భగ్నం చేయడం జరుగుతుంది. ఆమె అంటుంది.... నీకు కోరికలు లేవు ఆకలి లేదు కాని ఈ ప్రపంచం (పంచభూతాత్మకమైనది) ఆకలితో ఆవరింపబడి ఉంది. సృష్టి జరగాలి అంటే వారి కామం తీరాలి... వారి ఆకలి తీరాలి. కాబట్టి నీ తపో నిష్టను విడిచిపెట్టే కొండను దిగిరమ్మని తాను అన్నపూర్ణగా మారి శివుడిని "శంకరుని" చేసి కాశీలో నిలుపుతుంది.
ఇకపోతే, మనబోటి మామూలు వ్యక్తులు తత్త్వాన్ని అర్థంచేసుకోలేరు కాబట్టి వాటిని గాధల రూపంలో పరిచయం చేసారు. కాలక్రమేణా కవులు వారి వారి కాల్పనిక శక్తిని అనుసరించి చిలువలు పలువలు కల్పించి మామూలు సాంసారిక సుఖాలు కోరుకునే కుటుంబీకుని స్థాయిలో దేవతలను నిలబెట్టారు.
నేను ఇలా స్ఫందించవచ్చునో లేదో తెలియదు. కాని నా స్పందనలో లొసగులు ఉంటే సహృదయులైన సాహితీ మిత్రులు సవరిస్తారనే నమ్మకంతో ఈ నాలుగు మాటలు పంచుకుంటున్నాను.

కృతజ్ఞతా క్షమాపణలతో.... పాలకుర్తి రామమూర్తి

No comments: