Friday, October 28, 2016

దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః......

ఓం శ్రీ సరస్వత్యైనమః

దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః
స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా! (దుర్గా సప్తశతి)
భావము:
హే దుర్గా మాతా! నిన్ను స్మరించిన మాత్రముననే అశేష ప్రాణి కోటి భయాలను మూలాలతో కూడా హరిస్తావు. ఎవరైతే నిన్ను నిరంతరం స్మరిస్తూ, తమ హృదయాలలో అత్యధిక భక్తితో ధారణ చేస్తారో, నిశ్చలంగా నిలుపుకుంటారో అలాంటి వారికి శుభాభ్యుదయాలను అశేషంగా అనుగ్రహిస్తావు. స్వస్వరూపాన్ని గ్రహించకుండా మానవులను అడ్డుకునే దారిద్ర్యము, దుఃఖము, భయములనబడే మాయావరణాలను దూరం చేసేందుకు నీకన్నా అన్యులు ఎవరున్నారు తల్లీ! ఎల్ల వేళలయందు దయాభరిత చిత్తంతో సకల సహాయసంపత్తి నందచేసేందుకు అవసరమైన సర్వ ఉపకరణాలను అందుబాటులో ఉంచుకొని సిద్ధంగా ఉండే హే దుర్గా మాతా నీకు నమస్కారములు.

వ్యాఖ్య:
దుర్గముడు అనే రాక్షసుడిని జయించడం చేత పరాత్పరికి దుర్గ అనే పేరు వచ్చింది. ఏదైతే గమింపరానిదో దానిని దుర్గమము అంటాము. ప్రతివ్యక్తి తనకు తెలిసి కాని తెలియక కాని ఏదో ఒకటి సాధిస్తాడు. అది మనకు సాధ్యమయింది అనుకుంటాము. చాలామంది అక్కడితో సంతృప్తి చెందుతారు. మనశక్తి యుక్తులను కొద్దిగా విస్తరించగలిగితే మరింత ఉన్నత ఫలితాలను సాధిస్తాము. దానిని మన సామర్ధ్యము (Capability) అంటాము. ఆ సామర్ధ్యము కొన్ని పరిమితులలో విస్తరిస్తుంది కాని అపరిమితంగా విస్తరించుకోగలిగిన శక్తిసామర్ధ్యాలు ప్రతి వ్యక్తియందు నిక్షిప్తమైయున్నాయి. దానిని potentiality అంటాము. దుర్గమమైన లక్ష్యాలను సాధించేందుకు మనలోని అపరిమిత శక్తి సామర్ధ్యాలను (potentiality) గుర్తించి వినియోగించుకోవలసి ఉంటుంది. దుర్గముడు అనే రాక్షసుడిని ప్రతీకగా చెపుతూ మనలో అంతర్నిహితంగా ఉన్న అపరిమిత శక్తి సామర్ధ్యాలను (potentiality) గుర్తించి వినియోగించుకోవలసిన ఆవశ్యకతను ఈ నామం ద్వారా ప్రబోధ చేస్తున్నారు.
"ఉత్తిష్ఠత, జాగృత, ప్రాప్యవరాన్నిబోధత; క్షురస్యధారా నిశితాదురత్యయాత్, దుర్గం పథస్తాత్ కవయోవదంతి" అంటుంది, కఠోపనిషత్.  నీ లక్ష్యం దుర్గమమైనది. పదునైన కత్తి అంచు కన్నా నిశితమైనది నీవు గమించవలసిన దారి. "సాధ్యమూ" "సాధన"లు సులువైనవి కావు. అలాంటి లక్ష్యాన్ని సాధించాలి అంటే దృఢమైన సంకల్పం కావాలి. అందువల్ల (ఉత్తిష్ఠత) ప్రకాశవంతంగా లేచి నిలబడు, ప్రభావ వంతంగా లేచి నిలబడు, స్థిరత్వాన్ని సాధించు. జాగృత... మేలుకో... అంటే... నిద్ర లేవడం కాదు. మనసు జాగృతం కావాలి. ఈ జగత్తులో (జాయతే గచ్చతే జగత్) మనం ఎవరమూ శాశ్వతం కాదు. ఏ క్షణమైనా మనమీ జగత్తు నుండి వెళ్ళవలసి రావచ్చు కాబట్టి ఈ నాడు చేయవలసిన ఏ పనినైనా క్షణం కూడా వాయదా వేయవద్దు. ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా ధైర్యాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా సాహసంతో నీ గమ్యం వైపు గమించ గలిగిన జాగృతి కావాలి. చరిత్రలో ఎన్నో జీవరాసులు పుడుతూ గతిస్తూ ఉంటాయి. (ఈ జగత్తులో చావుపుట్టుకలు సహజం కనుక) అలా కాక కొద్ది మంది మాత్రమే తమ జీవన ప్రయోజనం (Purpose) ఏమిటి? దానిని ఏ విధంగా సాధించాలి? సాధించే క్రమంలో మన ప్రతిభావ్యుత్పత్తులను (Performance) నిరంతరం మెరుగు పరుచుకోవడం ఎలా? అని ఆలోచిస్తారు; ఆ వైపు శ్రమిస్తారు. ఎంతటి దుర్లభమైన, దుర్గమమైన లక్ష్యాన్నయినా సాధిస్తారు, ఛేదిస్తారు. అలాంటివారే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.ఆ సాధనాక్రమంలో అవసరమైన జ్ఞానాది వనరులను సమకూర్చుకునేందుకై విజ్ఞులు, జ్ఞానులు, పరోపకారపరాయణులైన నిర్మలాత్ములైన మహానుభావులను ఆశ్రయించాలని కఠోపనిషత్తు ప్రబోధిస్తుంది.
ఇక్కడ "దుర్గముడ"నే రాక్షసుడిని ప్రతీకగా చెపుతూ అలాంటి దుర్గమమైన లక్ష్యాన్ని జయించడం లేదా సాధించడం ప్రతి వ్యక్తి కర్తవ్యంగా ప్రేరణ నందిస్తున్నారు.
విజయాన్ని సాధించిన వారి గాథలు ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తాయి. అందుకే ఆ మహాజననిని స్మరించేందుకు మనకా తల్లియొక్క విజయాన్ని (success) చూపుతున్నారు. క్రొత్తదనాన్ని ఆవిష్కరించాలనే మనలోని అంతర్గత తపన తపస్సుగా మారితే ఇతః పూర్వం ఒకరు చూపించిన విజయ సాధనా మార్గం మనకు దారి చూపుతుంది. ఆ మార్గాన్ని ఆశ్రయించి, ఆ మార్గం ఆలంబనగా మనదంటూ క్రొంగొత్త మార్గాలను ఆవిష్కరించడం వల్ల పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాము. అయితే, చేయగలమా లేదా, సాధించగలమా లేదా, ఇది మనకు సాధ్యమా అనే ప్రశ్నలు మనలో ఉత్పన్నమయి మనలను వెనుకకు లాగే అవకాశం ఉంది. విజయ సాధకులు చూపించిన వారి మార్గం అలాంటి భయాలను హరిస్తుంది.
ఈ నాడు సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారం ఏదైనా ఒకదానిని ఒకరు సాధించారు అంటే దానిని ఎవరైనా సాధించ గలరు. దుర్గాదేవి కూడా మనకు ఆ ప్రబోధనే ఇస్తుంది. మీరంతా దుర్గమము అనుకునే దానిని నేను సాధించాను కాబట్టి మీరూ సాధించ గలరు. ఆ వైపు మీ సర్వ శక్తులను ఒడ్డి ప్రయత్నించండి. నేను అశక్తుడిని, సాధించలేననే మానసిక వైకల్యాన్ని విడిచి పెట్టండి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట (భగవద్గీత) అంటూ ప్రేరణ నిస్తుంది. సంకల్పం గట్టిదైతే మీ కెదురేమీ ఉండదు. నన్ను నమ్మి ముందుకు సాగితే మీ భయాలను నేను హరిస్తాను, అంటూ అభయం ఇస్తుంది.
అనుమానం పెనుభూతం అంటారు. మనసులో చిన్నమెత్తు అనుమానం పొడసూపినా అపజయాన్ని చవిచూడవలసి వస్తుంది. ప్రయత్నంలో అపజయాలు సహజం. కాని వాటికి భయపడి వెనుకడుగు వేస్తే ఎన్నడూ విజయసాధకులం కాలేము. Faith Power Works Wonders. నమ్మకం అసాధ్యాలనూ సుసాధ్యాలుగా మారుస్తుంది. మీ లక్ష్యం, గమ్యం, గమనం స్పష్టంగా మీ హృదయాలలో ముద్రించుకోండి. నిశ్చలమైన మనస్సుతో ఆ వైపు ఆలోచించండి, దృఢమైన మనస్సుతో అడుగులు వేయండి. సకల శుభములు, అభ్యుదయములు మీ వెంట నడుస్తాయి. శుభాభ్యుదయ ఫలితాలను గూర్చిన ఆలోచనలను మానేయండి. సూర్యునికి అభిముఖంగా మీరు నడచినంత కాలం మీ నీడ మీ వెంటనే వస్తుంది. ఆ నీడయే మీ శుభములు, అభ్యుదయములు. అలా కాక దాని పిరిది దెసలో మీరు నడిస్తే గమ్యం మారుతుంది, గమనం మారిపోతుంది. ఈ స్మృతిని సదాసర్వ కాలముల యందు మీ భావనలో నింపుకొని ముందడుగు వేసే వారికి ఆ దుర్గా దేవి ప్రసన్నురాలవుతుంది.
దారిద్ర్యం, దుఃఖం, భయం ఈ మూడూ మాయా రూపంలో మానవులను క్రమ్మి వారి మానసిక స్థైర్యాన్ని క్రుంగదీస్తాయి. ప్రశాంతత దెబ్బతింటుంది. సత్యాన్ని దర్శించనీయవు. దారిద్ర్యం... అది భావ దారిద్ర్యం కావచ్చు, భాషా దారిద్ర్యం కావచ్చు, అర్థిక దారిద్ర్యం కావచ్చు, మనోదారిద్ర్యం కావచ్చు. ఇలా ఏదైనా మీ అభ్యుదయానికి అడ్డంకిగా గుర్తించండి. దుఃఖానికి మూలం ఆశావ్యామోహాలు. అవి అశాశ్వతాలుగా గుర్తించ గలిగితే దుఃఖాన్ని అధిగమించగలుగుతాము. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమించడం వల్ల కలిగే విభ్రమ వల్ల భయం కలుగుతుంది. కాబట్టి మీ ఇచ్ఛాశక్తిని బలోపేతం చేసుకోండి. ఇఛ్ఛాశక్తి బలమైనదైతే, తత్సాధన కవసరమైన జ్ఞానశక్తిని పొందడం సులువవుతుంది. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. నిద్రాణంగా మీ హృదాకాశంలో ఉన్న చైతన్యానికి చేతన నివ్వండి. నమ్మకాన్ని పెంచుకోండి. ఫలితాన్ని నాకు వదిలేయండి, అంటూ ప్రబోధిస్తూ అభయమిస్తుంది, దుర్గా దేవి. అందుకే ఆమెను దారిద్ర్య దుఃఖ భయహారిణిగా చెపుతూ, ఆ యత్నంలో సఫలత కావాలంటే నీవు కాక మాకు అన్యులు మరెవరమ్మా (కా+త్వత్+అన్యా) అంటుంది, సప్తశతీ శ్లోకం.
మతి మతీవ -- అత్యంత భక్తి శ్రద్ధలతో; స్మృతా -- స్మరించడం వలన; చిత్తా -- హృదయం కలిగిన దానా; దదాసి -- ఇస్తావు లేదా అన్నీ సమకూరేలా చేస్తావు; దేనిని స్మరించడం వలన అంటే దుర్గను అంటే దుర్గమము అని మనం అనుకుంటున్న లక్ష్యాన్ని--- ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఎప్పుడైతే మన మనస్సులో అంకిత భావనతో (Dedication), సాధించాలనే స్థిర నిర్ణయంతో లేదా నిశ్చయంతో కూడిన పట్టుదలతో (perseverance or strong determination), భక్తి శ్రద్ధలతో (Devotion) లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధన యందే పదేపదే  మనసును ఏకాగ్రం చేస్తామో (చిత్తం ఒకచోట నిలవదు కాబట్టి పదేపదే చెదురుతున్న మనసును లక్ష్యం వైపు తీసుకొని రావాలి) అప్పుడు ఆ లక్ష్యం అంతర్మనస్సులో బలమైన ముద్రగా ఏర్పడుతుంది. దానిని ఎంతగా బలోపేతం చేస్తే అంతగా బలపడుతూ మనలను లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళుతుంది. దానినే ఆంగ్లంలో  PRAYER (Periodical Repetition of Affirmations Yielding Excellent Results)అంటాం.
ఒకసారి భయం మనలను వీడితే లేదా భయాన్ని మనం జయిస్తే మన మనస్సులలో ఉండే కశ్మలత చెదిరిపోతుంది. దానితో మనలో గందరగోళ (confusion)స్థితి పోయి స్థిరత లేదా స్పష్టత (Clarity) వస్తుంది. ఆ స్పష్టత ఒక దశను దిశను (Direction) చూపుతుంది. సాధనా మార్గంలో కావలసిన వనరులు మనకు సమకూరేలా చేస్తుంది.
అందుకే, మానసిక ధైర్యానికి కావలసిన ప్రేరణ నిచ్చే శక్తిగా, దానికి అవసరమైన సకల ఉపకరణాలను అందించే తల్లిగా దుర్గను ఆరాధిస్తాము.  
విశిష్టమైన జ్ఞానానికి అధినాయకిగా సరస్వతీదేవిని, సమస్త సంపదలకు మారుపేరుగా లక్ష్మీ దేవిని, సౌభాగ్యానికి, భావోద్వేగాలకు, అనుబంధాలకు ప్రతీకగా దుర్గాదేవిని ఆరాధించడం జరుగుతుంది. అంతేకాదు, దుర్గము అనగా కోట. కోట రక్షణ నిస్తుంది. ఆ రక్షణలో హాయిగా, ప్రశాంతంగా జీవిస్తాము. రక్షణ నివ్వాలి అంటే శక్తి కావాలి అందుకే ఆ శక్తికి ప్రతీకగా కూడా దుర్గాదేవిని చెప్పుకుంటాము. అందుకే దుర్గ అంటే రక్షణ నిచ్చే తల్లిగా చెప్పుకుంటాము.
ఈ మూడు మూర్తులకు మూలంగా ఆదిశక్తిని ఆరాధిస్తుంటాము. అలాంటి ఆ ఆదిపరాశక్తికి నమస్సులతో.......
పాలకుర్తి రామమూర్తి


No comments: