Monday, November 14, 2016

భగీరథుడు ఆ శంకరుని సంస్తుతించడం

ఓం శ్రీ సరస్వతై నమః

కీ.శే. శ్రీ వారణాసి వీరనారాయణ శర్మ గారి ఆనతి మరియు శ్రీ ELN శివప్రసాద్, శ్రీ  గట్టు వినోద్ రావు  తదితర మిత్రుల ప్రేరణతో 2002 సంవత్సరంలో "గంగావతరణం" పేర ఒక పద్య కావ్యాన్ని వ్రాయడం జరిగింది. ఆ కావ్యంలో భగీరథుని తపోదీక్షకు మెచ్చిన శంకరుడు ప్రత్యక్షం కావడం, భగీరథుడు ఆ శంకరుని సంస్తుతించడం ఒక సన్నివేశం. కార్తీక మాస సోమవారం సందర్భంగా ఆ సన్నివేశాన్ని ఆత్మీయులయిన మిత్రులతో పంచుకుందామనే సంకల్పంతో ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

తల జటాజూటమ్ము నెలవంక దానిపై
ఫాల మధ్యమ్మున వహ్ని రేఖ
కంఠాన గరళమ్ము కరిచర్మ మెదపైన
మిన్నాగు భూషలు మేన బూది
అమల హస్తంబుల డమరు త్రిశూలమ్ము
మొలపైన పులితోలు పుర్రె చేత
వాహనమ్ముగ నంది పార్వతి సామేన
ముందు వెన్కల యందు భూత గణము

విమల పంచాక్షరీ మంత్ర విభవ దీప్తి
ప్రథిత ఓంకార నాదంపు ప్రాభవమ్ము
అమర గణములు తోడురా హరుడు ఘనుడు
ఆ భగీరథు ముందు ప్రత్యక్ష మయ్యె!                                             1

అక్షులందు గ్రమ్మ నానంద భాష్పముల్
గళము గద్గదంబు గాగ, భక్తి
వేద విదితు వేద వేదాంత వర్ణితు
సంస్తుతించె హరుని, సాంబశివుని!                                                 2

ఆకార భావంబు లాది మధ్యాంతముల్
కర్మలు గుణములు కలిమి లేక
అగణితంబు ననంతమై యఖండంబునై
సృష్టి స్థితి లయాది సిరులు లేక
సకల దిగ్వ్యాప్త మై శక్తి సంపూర్ణమై
విజ్ఞాన సారమై విద్య లేక
మాటల వర్ణింప మనసులో భావింప
సంకల్పమున్ జేయు శక్తి లేక

సర్వ సర్వం సహా చక్ర సమితి గూర్చి
అందు విహరించు బ్రహ్మ మానంద మనెడి
పరమ సత్యంబు భ్రాంతిగా; భ్రాంతి సత్య
మనుచు మిధ్యా ప్రపంచమ్ము నందు సతము!                              3

ఐహికంబులు మెచ్చుచు; నవ్యయంబు
బ్రహ్మ మౌదాని కాకార భావ నామ
గుణము లాదిగా భ్రాంతుల గూర్చి, అదియె
దైవమని నమ్ముచజ్ఞతాంధ్యమ్ము లలుమ!                                     4

సారోదంచిత శూన్య తత్త్వ మెదలో సాధింపగా రామి,
ద్దారిన్ వీడి తపింప జూచెద మహాత్మా! యూహ లెందాక నే
సారింపన్ గలవాడ నట్టి మహిమా సారంబు నీ మూర్తిగా
తీరై దోచె, శివా, భవా యనుచు కీర్తింతున్ సదా ఈశ్వరా!              5         

శూన్యంబే భవదీయ తత్త్వము, సుధీ స్రోతస్సు నైర్మల్యమై
యన్యంబొల్లక సత్య శోధన రతిన్ ధ్యానంబె యోగంబు నా,
మాన్యాధ్వంబున చిత్త విభ్రమ గతిన్ మళ్ళించు తత్త్వజ్ఞులే
ధన్యుల్; సూక్ష్మ మఖండమై వెలుగు ఆత్మజ్యోతి దర్శించుటన్! 6

తలమే! సూక్ష్మ మనంతమైన భగవత్తత్త్వంబు భావింప న
య్యలఘు ప్రోత్థిత సత్య దీప్తి గను యోగాభ్యాస నిష్ఠా ద్యుతిన్
విలసద్దివ్య వికాస హీనతను తద్విస్పూర్తి బొందంగ, ని
ర్మల చిచ్ఛక్తికి భావ రూప గుణ కర్మల్ వేర కల్పించెదన్!              7

శివమున్ శంకర మవ్యయంబగు మహా చిచ్ఛక్తి శూన్యంబులో
నవిభాజ్యంబయి యొప్పు! తద్విమల సత్యానంద తాదాత్మ భా
వ విశుద్ధ స్థితి నిత్య నిర్మల పర బ్రహ్మ ప్రభూతార్ధమై
భవిక శ్రీ విభవంబు నేలు, సకల వ్యాప్తాచ్ఛ చైతన్యమై!                  8

వర చిన్మాత్ర యనంగ నిర్మల పరబ్రహ్మాచ్ఛ తత్త్వార్థమున్
పరిపూర్ణంబు, ననంత మాద్యము, పరివ్యాప్తంబు, శుద్ధంబు, సు
స్థిర సౌభాగ్య శుభ ప్రదంబునగు ఆ శ్రీ దీప్త కల్యాణి యౌ
పర విద్యా నిధి సర్వమంగళ సదా వర్ధిల్ల నర్ధాంగియై!                   9

విఘ్న నాధుండు పుత్రుడై వెలుగు చుండ
ప్రకృతి శక్తులు భూతాళి వశము గాగ
దివ్య సంభూతి విలసిల్లు దేవ దేవ
భావ దారిద్రమూనె నిన్ ప్రస్తుతింప!                                               10

అభవా!  గౌరియె ఆశ్రయించె నిను మాయా భావమై; భూతముల్
శుభమౌ నీ విభవంబు నందినవి; దిక్ స్తోమంబు త్వత్తేజ సం
ప్రభలన్ కాంతుల నీనె! యుష్మ దమల వ్యాసక్తి విశ్వంబులో
సుభగేచ్ఛాక్రియ( సృష్ఠియున్, స్థితి, లయ జ్యోత్స్నా ద్యుతిన్ వ్యాప్తిలెన్! 11

పలుకన్ జాలను శుద్ధ తత్త్వ మెద సంభావింపగా లేమి, ని
ర్మల చిచ్ఛక్తికి నామ రూప గుణ సంభారమ్ములన్ గూర్చి సూ
క్తుల వర్ణింపను చిత్త మోపదయినన్, ద్యోతించు నాయూహ కా
వల నిన్నెంచగ లేమి గొల్చెద మనోభావంబె నీ రూపుగా!              12

అమలంబౌ భవదీయ యూహ యెదలో నాధ్యాత్మికాభోగ దా
హము దీర్చెన్ క్షణకాల మా యెఱుక మాయాజాల విభ్రాంతమై
అమితా సక్తిని గోరు నైహికము, లార్యస్వాంత విభ్రాజితా;
తమమున్ గోరెడి చిత్త మోర్చునె మహత్ జ్ఞాన ప్రభాదీప్తులన్!                  13

ఏ శక్తి చిచ్ఛక్తి నేలంగ జాలునో
ఆ శక్తి నీవుగా నాత్మ దలుతు
నే శక్తి ఈ సృష్ఠి కిడును కల్యాణమ్ము
లా శక్తి నీవుగా నాత్మ దలుతు
నే శక్తి యజ్ఞాన హేయత్వమును బాపు
నా శక్తి నీవుగా నాత్మ దలుతు
నే శక్తి దివ్యాచ్ఛ ధీ శక్తి సమకూర్చు
నా శక్తి నీవుగా నాత్మ దలుతు

శక్తి యెయ్యది నను దేర్ప జాలు నదియ
నీదు తత్త్వ భావ స్వరూపాదు లనుచు
అహరహమ్మును తపియింతు నమిత భక్తి
గొలది నిను గాంచి, శంకరా; గొలుచు వేడ్క!                                                            14

చేతో మోదము గాగ గాంచితి నినున్ శ్రీ పార్వతీ యుక్తుగా
భూతేశా! జననంబు ధన్యమయె; నా మోహంబు బాసెన్; శివా
ప్రీతిన్ గూర్చర, శంకరా; భవహరా, విశ్వేశ యంచార్తితో
చేతుల్ మోడ్చి భగీరథుండు బలుకన్ శ్రీ కంఠుడున్ ప్రీతుడై!                15


పాలకుర్తి రామమూర్తి

No comments: