ఏ సంస్థ అయినా , అది చిన్నదా పెద్దదా అన్న సంగతి వదిలేస్తే, దానికంటూ ఒక దార్శనికత ఉంటుంది. ఇంత కాలానికి ఈ సంస్థ ఈ స్థాయిలో ఉండాలి లేదా ఉంటుంది అనే పక్కా ప్రణాళికా బద్ధమైన దృష్టి ఉంటుంది. ఏ సంస్థకైనా ప్రాధమిక లక్ష్యం ఆర్ధికంగా లాభాలను ఆర్జించడం మరియు బహుముఖాలుగా విస్తరించి ఆ రంగంలో తన ప్రత్యేకతను చాటుకోవడం.
ఏ సంస్థ ఉత్పత్తిని సాధించాలన్నా నాలుగు ప్రాధమిక అవసరాలు ప్రముఖంగా నిలుస్తాయి. ఒకటి... భూమి (Land) రెండవది శ్రామిక శక్తి (Labour) మూడవది నిధుల సమీకరణ (Capital) నాలుగవది నిర్వహణ (Organisation). ఈ నాలుగు అంశాలను వనరులుగా చెప్పుకుంటే వీటికి మూలం తనలోని తపనతో కూడిన వైఖరి.
తన వద్ద భూమి ఉంది. తనకున్న పలుకుబడి మరియు తపనను చూసి తనను నమ్మిన వారు పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి, కావలసిన ధన సమీకరణ జరుగుతుంది. ఈ రెండూ తన ప్రతిభతో నడుస్తావి. కాని ఈ రెంటితో ఉత్పత్తి జరగదు. ముఖ్యంగా కావలసిన మానవ వనరులు కావాలి. అందులో నైపుణ్యం కూడిన శ్రామిక శక్తి , నైపుణ్యం అవసరం లేని శ్రామిక శక్తి ఈ రెండూ కావాలి. దీనికి తోడూ వీటన్నింటినీ ఏకత్రాటిపై సమర్ధవంతంగా నడిపించ గలిగిన నిర్వహణా సామర్ధ్యం ప్రధానమైనది.
నిర్వహణా సామర్ధ్యంలో... సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలపై దార్శనికత ఉంటుంది. నైపుణ్యాలకు సంబంధించిన సమగ్ర ఆలోచనా విధానం ఉంటుంది. అంటే ఏయే విభాగాలలో
ఎలాంటి నైపుణ్యాలు అవసరం.. ఆ నైపుణ్యం ఎవరిలో ఉంది... వారి నైపుణ్యాన్ని సంస్థ
ప్రయోజనాలకు ఎలా వినియోగించుకోవాలి... ఎవరిలో ఏ ఉత్సాహం ఉంది.. వారికి ఏ రంగంలో
శిక్షణ అవసరం.. వారి నైపుణ్యాలను సంస్థ అట్టిపెట్టుకునేందుకు ఎలా వ్యవహరించాలి..
లాంటి విషయాలపై లోతైన అవగాహన ఉంటుంది. నిరంతరం వనరుల సమీకరణకు సంబంధించిన వ్యూహం ఉంటుంది. సాంకేతికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికా బద్ధ వైఖరి ఉంటుంది. వీటన్నింటికి ప్రాణ సదృశమైన కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఇందులో ఏది లోపించినా సంస్థ ఆశయాలు ఫలించవు. ఉదాహరణకు... దూరదృష్టిలేని సంస్థలో స్ఫష్టత ఉండదు సరికదా తత్తరపాటు లేదా తడబాటు ఉంటుంది. నైపుణ్యాలు లోపించిన సంస్థ ఒత్తిడికి గురవుతుంది... ఆశయాల మేరకు పని జరగదు. ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాన్ని సాధిస్తూ వెనుకబడిపోతుంది. వనరుల సమీకరణ సరిగా లేకుంటే అనుకున్న విధంగా సమయానికి పనులు పూర్తికాక ఆశాభంగానికి గురికావడం జరుగుతుంది. కార్యాచరణ ప్రణాళిక లేకపోతే ఎక్కడ నుండి ఆరంభించాలో ఎక్కడ ముగించాలో తెలియని అయోమయ స్థితి దాపురిస్తుంది.
సంస్థ మౌలిక లక్ష్యాలైన విస్తరణ, ఆర్ధిక పరిపుష్టి ఈ రెండింటిని
సాధించాలంటే... ముఖ్యమైన రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. మొదటిది ఉత్పాదనా సామర్ధ్యం పెంచడం కాగా రెండవది ఆ ఉత్పత్తిని అవసరమైన వినియోగదారునికి అందించడం ద్వారా
మార్కెట్ పెంచుకోవడం.
నిరంతరం ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న శాస్త్రసాంకేతిక ప్రగతిని పరిశీలిస్తూ, ఆ సాంకేతిక విధానాలను తమ సంస్థకు అన్వయించుకుంటూ, తమ విధానాలను అవసరమైన మేరకు మార్చుకుంటూ, నాణ్యమైన ఉత్పత్తి ఉత్పాదకతలను సాధించేందుకు తమకున్న మానవ వనరులను సన్నద్ధం చేస్తూ, యాంత్రిక వనరులను ఆధునీకరించుకుంటూ పోటీ ప్రపంచంలో తమ ప్రత్యేకతను సాధించడం ఉత్పత్తికి సంబంధించిన నిర్వహణా సామర్ధ్యాన్ని సూచిస్తుంది.
అలాగే నిరంతరం కొనుగోలుదారుతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకుంటూ ఆ కొనుగోలుదారు సంతృప్తి మేరకు నాణ్యమైన సరకులను సరసమైన ధరలకు అందిస్తూ ఉత్పత్తి అమ్మకాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడంతో పాటుగా సంస్థపై కొనుగోలుదారుకు నమ్మకాన్ని పెంచడం అమ్మకాలకు సంబంధించిన నిర్వహణా సామర్ధ్యాన్ని సూచిస్తుంది.
సంస్థ మనుగడకు, వికాసానికి ఈ రెండూ అవసరమైనవే.
సరైన పని సరైన విధానంలో సమయానికి జరిగిపోవాలంటే ఆ పనిని నిర్వహించేందుకు
సరైన వ్యక్తులను ఎంచుకొని నియోగించాలి. పనిలో ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందమే ప్రేరణగా
నిరంతరం క్రొత్తదనాన్ని అన్వేషించే ఉద్యోగులనే సంస్థకు నిజమైన ఆస్తులుగా
పరిగణించాలి. నిజానికి అలాంటి ఉద్యోగుల వల్లనే సంస్థ ఉత్పాదనా సామర్ధ్యం
పెరుగుతుంది. మార్పునంగీకరిస్తూ, మార్పును ఆహ్వానిస్తూ
దానితో మమేకమయ్యే నైపుణ్యం కలిగిన వ్యక్తుల సమూహాన్ని ఎన్నిక చేసుకోవడం, వారినందరినీ సంస్థ ఆశయాల కనుగుణంగా ఒక్క త్రాటిపై నడిపిస్తూ సత్ఫలితాలు
సాధించ గలగడమే నిర్వహణా సామర్ధ్యం. నిజానికి వ్యాపార రంగంలో పోటీ తత్త్వం
పెరిగిపోయి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నాలుగు డబ్బులెక్కువ ఇస్తూ ఆకర్శించే
దుస్సంస్కృతికి తెరలేచిన నేపథ్యంలో ఉద్యోగులూ అలాంటి వారి దగ్గరకు వలసలు గట్టే
ఈనాడు నిజాయితీ కలిగి మన రహస్యాలను దాస్తూ సంస్థ ప్రగతికి అంకితభావంతో పని చేసే
ఉద్యోగులను నియమించుకోవడం కష్టమైన పనే.
అయినా సంస్థలో ఉద్యోగులను నియమించుకునే అధికారం కలిగిన, బాధ్యత తెలిసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ వలసలను కొంతమేరకు
అరికట్టడం సాధ్యమే.
ఈ క్రమంలో రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి ఎలాంటి
ఉద్యోగులను తీసుకోవాలి? రెండవది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇక్కడ
గమనించాల్సింది... ఉద్యోగులు నైపుణ్యం కలిగిన వారైనా లేనివారైనా నిబద్ధతతో పని
చేయాలి అంటే వారికి ప్రేరణకావాలి. అది జీతభత్యాల రూపంలో ఉండవచ్చు, ఆదరణ రూపంలో ఉండవచ్చు, హెచ్చు బాధ్యతల
నప్పగించడం వల్ల రావచ్చు, పని చేసే పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం బాగుండడం వల్ల కావచ్చు, ఉద్యోగ
భద్రత వల్ల కావచ్చు... ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ప్రేరణ పొందవచ్చు. వారిని
గుర్తించి వారికి ఆ రూపంలో భద్రత లభిస్తుందనే సంకేతాలు పంపగలిగితే వారి వలసలు
అరికట్టడమే కాక వారి సేవలు సంస్థ పురోగతికి ఉపయుక్తమయ్యే రీతిలో పొందవచ్చు.
జీత భత్యాలు సరిపోవని భావించినా, సంస్థలో తన నైపుణ్యానికి సామర్ధ్యానికీ తగిన ఆదరణ లేదా
గుర్తింపు లేదని ఉద్యోగి భావించినా, తన ప్రతిభా
వ్యుత్పత్తులకు ఇది సముచితమైన వేదిక కాదని భావించినా, తనను
కాదని తనకన్నా తక్కువ అనుభవం, అర్హతలు కలిగిన తన తరువాతి
ఉద్యోగికి పై పదవీ బాధ్యతలు అప్పగించి నప్పుడు కూడా అవకాశం వచ్చిన ఉద్యోగి సంస్థను
విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే, చుట్టూ ఉండే పరిసరాలు
పని వాతావరణం తన వృత్తిగౌరవానికి లేదా ఆత్మ గౌరవానికి
భంగం కలిగించే విధంగా ఉన్నా ఉద్యోగిలో పెరిగే అసంతృప్తి సంస్థను విడిచేందుకు
కారణమవుతుంది. తప్పదని వేరే గత్యంతరం లేక ఆ సంస్థలోనే పనిచేసినా వారి సంపూర్ణమైన
శక్తిసామర్ధ్యాలను వారు పనిలో వినియోగించరు. వారిలో లోపించిన ఉత్సాహం నీరసాన్ని
నింపడం వల్ల పనిలో ఏకాగ్రత తగ్గి నాణ్యత తగ్గుతుంది. డబ్బు రూపంలో అందే
ప్రోత్సాహకాలు కొంతమేరకే ప్రేరణ నందించగలుగుతాయి. సమస్యలను సవాలుగా
స్వీకరించి ఆ సవాలును అధిగమించే విధానంలో
పొందే ఆనందం దానికి యాజమాన్యం నుండి అందే సహాయ సహకారాలే ఉద్యోగిలో సంతృప్తితో
కూడిన ప్రేరణగా నిలుస్తాయి. ఈ విధానంలో ఉద్యోగి క్రొత్తదనాన్ని
ఆస్వాదిస్తాడు. పరిమితులలో బంధించబడిన తన
శక్తిసామర్ధ్యాలను విముక్తం చేసుకుంటూ
అన్వేషణా మార్గంలో అనంతంగా వికాసం చెందినప్పుడు తనలో కలిగే ఉల్లాసంతో కూడిన
ప్రేరణకు సాటి చేయ గల ప్రేరణ మరే విధంగానూ ఉద్యోగి పొందలేడు.
నిబంధనల రూపంలో
లేదా పరిమితుల రూపంలో ఒక ఉద్యోగి చైతన్యాన్ని సమర్ధతను అణచివేస్తే ఆ ఉద్యోగిలో
పెల్లుబికే అసహనం సంస్థను విడిచి వెళ్ళేందుకు దారితీయవచ్చు. ఉత్సాహం సాహసం కలిగిన
బుద్ధిమంతుడైన ఉద్యోగికి సంవత్సరాల తరబడి ఎదుగుబొదుగు లేని ఒకే పనిని అప్పగిస్తే
అది ఆ ఉద్యోగి పని సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.
శక్తిసామర్ధ్యాలు తగ్గిన ఉద్యోగి సంస్థకు భారంగా తయారవుతాడు.
జీతభత్యాలు తన పని విధానానికి మరీ ఎక్కువగా లభిస్తే పనిపై
ఆసక్తి పెరుగుతుందనే వాదన సరికాదు. అలాగని తక్కువగా ఇస్తే ఆ ఉద్యోగి ఆర్థిక
ఇబ్బందులతో జీవితంలో నిలదొక్కుకోలేక పనిపై
శ్రద్ధ పెట్టలేడు. కాబట్టి ఉద్యోగి జీవన ప్రమాణాలను
దృష్టిలో పెట్టుకొని తన సామర్ధ్యాన్ని గుర్తిస్తూ తగిన జీతభత్యాలతో గౌరవిస్తే ఆ
ఉద్యోగి ప్రేరణను పొంది సంస్థ పురోగతికై శ్రమిస్తాడు. నిజానికి ఎక్కువ మందికి
ప్రేరణ నిచ్చేది పనిలో తాము పొందే ఆనందం మాత్రమే. ఆ ఆనందం వారి సామర్ధ్యాన్ని
గుర్తించడం, ఆ సామర్ధ్యానికి తగిన బాధ్యతను
అప్పగించడం, వారిఎదుగుదలకు కావలసిన వసతులు కల్పించడం,
వారు వారి ప్రతిభాపాటవాలను ప్రదర్శించి సాధించిన ఫలితాలను
అభినందించడం వల్ల మాత్రమే ఏ వ్యక్తి కైన నిజమైన ప్రేరణ లభిస్తుంది.
అన్నింటి కన్నా ఎక్కువ ప్రేరణ నేను నీ
వెనుకనే ఉన్నాను అనే భరోసాను ఇచ్చినప్పుడే కలుగుతుంది.
ఉద్యోగులను ఎన్నుకునే విధానంలో మూసలో
పోసినట్లుగా ఒకే విధానం పాటిస్తే ఫలితం
సామాన్యంగానే ఉంటుంది. అలాకాక, పై
అంశాలను ఆలంబనగా చేసుకొని ఒక్కొక్క అభ్యర్ధి సామర్ధ్యాలను ప్రాతిపదికగా వారిని
ఎన్నుకొని బాధ్యతలను అప్పగించే విధానంలోనే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని
నమ్ముతున్నాను.
Palakurthy Rama MUrthy
No comments:
Post a Comment