Thursday, September 1, 2016

విజయ సాధనయే ఆత్మ సాధన

ప్రతి వ్యక్తీ జీవితంలో తాను విజయం సాధించాలనే కోరుకుంటాడు. ఓటమిని ఎవరూ కోరరు. కొందరు భౌతిక జీవితంలో విజయాన్ని కోరుకుంటారు మరి కొందరు ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని కావాలనుకుంటారు.
            నిజానికి ఈ రెండూ ఒకదానిని విడిచి మరొకటి సిద్ధించదు. భౌతిక ప్రగతి ఆధ్యాత్మిక సుగతికి దారి తీస్తుంది. భౌతిక ప్రగతి అనగానే డబ్బు కోణం నుండి చూడడం అలవాటయింది. అది సరికాదు. డబ్బు అనేది సాధించే లక్ష్యాన్ని వెన్నంటి ఉండే "బై ప్రోడక్ట్" మాత్రమే.
            డబ్బు సంపాదన మాత్రమే లక్ష్యం లేదా విజయం అనుకుంటే ఎంత సంపాదించా లనే ప్రశ్న వస్తుంది. సంపాదనకు పరిమితులు విధించుకోలేము. ఎందుకంటే ఇంత సంపాదిస్తే చాలు అని ఎవరూ అనుకోలేరు. ఒక పరిమితిని సాధించే వరకు అది "ఆశయం"గానే ఉండవచ్చు. కాని తరువాత ఆ ఆశయం "ఆశ"గా మారి మరింతగా సంపాదించాలనే అపరిమితత్త్వానికి విస్తరిస్తుంది. కాబట్టి విజయానికి కొలమానం డబ్బు మాత్రమే కాదు. డబ్బు కాకపోతే మరేంటి? అనే ప్రశ్న వేసుకుంటే....
                        అ)  తనను తాను తెలుసుకోవడం.
                        ఆ)  తనను తాను పునర్నిర్వచించుకోవడం,
                        ఇ)  తానున్న స్థాయిని పెంచుకోవడం,
                        ఈ) క్రొత్తదనాన్ని ఆవిష్కరించుకోవడం,
                        ఉ) క్రొత్తగా సంతరించుకోవడం,
                        ఊ) తన జీవితం నడచే కేంద్రాన్ని మార్చుకోవడం,
                        ఋ) గమన దశను దిశను ప్రభావవంతం చేసుకోవడం.
            ఇవి ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి.
            మరి ఈ పరంపరలో విజయ సాధన ఏ మార్గం వల్ల లభిస్తుంది అంటే ఇందుకు ఎన్నో మార్గాలను అన్వేషించుకోవచ్చు. ఏ మార్గం తమకు అనువైనదో , అనుకూలమైనదో, ప్రయోజనకారియో గుర్తించి ఆ మార్గంలో గమించడం మంచిది.  జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకుంటే వృద్ధి అభివృద్ధిగా మారుతుంది. అంటే జీవితం సమగ్రతను సాధిస్తుంది. ప్రకృతితో మమేకం కావడం జరుగుతుంది.
            దీనికి ప్రయత్నం కావాలి. అయాచితంగా ఏదీ తనంత తానుగా మన దరిచేరదు. మనలోని మాలిన్యాలు కరగిపోవాలి. చక్కనైన శీల నిర్మాణం జరగాలి. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తన పరిమితులను అతిక్రమించి అపరిమితమై వివిధముఖాలుగా విస్తరిస్తూ తనను తాను తెలుసుకునేందుకు దోహదపడాలి. ఆ "యెఱుక"  లేదా "ప్రజ్ఞ" సాధించడమే విజయ సాధన కు మూలమవుతుంది. ఈ ప్రక్రియలో తనను తాను అనుక్షణం పునర్నిర్వచించుకోవడం జరుగుతుంది. ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగడం, తన ఆలోచనలలో నూతనత్వాన్ని ఆవిష్కరించుకోవడం, క్రొత్తదనాన్ని సంతరించుకోవడం జరుగుతుంది.
            ఈ సాధనా పర్వంలో  ఆలోచనలు పరిణతి చెందుతాయి, ఆచరణలో ఉదాత్తత కనిపిస్తుంది, ఆత్మీయభావనలు చిగురిస్తాయి, అనుభూతులు పల్లవిస్తాయి, భావోద్వేగాలు ఉన్నత స్థాయిలో హృదయంతో సంగమిస్తాయి. ఆత్మవత్సర్వభూతానిఅన్నట్లుగా... మొత్తంగా సకల సృష్టితో ఏకీకృత భావన అలవడుతుంది. 
            ఆ విజయ సాధనయే ప్రతి వ్యక్తికీ లక్ష్యం కావాలి. ఈ విజయ సాధనలో ఉపకరించే ఉపకరణాలు కొన్నింటిని పరిశీలిస్తే....
                        1) మనసు పరిశుద్ధతను పొందాలి
                        2) చేసే పనిలో నాణ్యత పెరగాలి
                        3) విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి

            మనసు పరిశుద్ధతను పొందాలి:  అత్యంత చంచల మైనది ఈ  సృష్టిలో మనసు మాత్రమే. ఈ చంచలతకు అహంకారం తోడవడం వల్ల ఏ వ్యక్తి ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఎవరూ ఊహించలేరు.  అయితే ఈ అవలక్షణాలతో పాటుగా విచక్షణను వివేకాన్ని సంతరించుకున్న బుద్ధినీ ఇచ్చాడు, సృష్టికర్త. చలనమే లక్షణమైన మనస్సును నియంత్రించడమూ కుదరదు. కాకపోతే బుద్ధిని వినియోగించుకొని నిరంతర చలన శీలి యైన చిత్తాన్ని అవసరమైన లేదా మనకనుకూలమైన మార్గం వైపుకు మళ్ళించేందుకు ప్రయత్నించవచ్చు. సమభావన యొక్క స్వరూప స్వభావాలను ఫలితాలను అవగాహన చేసుకోవడం ద్వారా అహంకారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రయత్న పూర్వకంగా నైనా విచక్షణాయుతమైన బుద్ధిని ప్రచోదన చేయడం వల్ల జీవితం యొక్క పరమార్ధం సిద్ధిస్తుంది.
            బుద్ధి వికసన ద్వారా మనలో అప్రయత్నంగా ఈ క్రింది లక్షణాలు చోటు చేసు కుంటాయి......
            1) మనో మాలిన్యాన్ని కడిగివేసుకోవాలనే ఆలోచన తపనగా మారుతుంది
            2) ఇతరుల ఆలోచనా సరళిని పరిశీలించడం, ఎదుటివారి పరిధిలో ఆలోచించడం జరుగుతుంది
            3) ఇతరుల భావాలలోని అనుకూల ప్రతికూలాంశాలను మనలోని ఆంతరంగిక ఆలోచనలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన, ఉపయుక్తమైన, ప్రయోజనకరమైన వాటిని స్వీకరించడం జరుగుతుంది.
            4) బుద్ధి ప్రచోదన ద్వారా పొందిన వివేకం, వివేచన, విచక్షణలు మనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై నిబద్ధతతో కూడిన ఆలోచనా సరళిని అందించగా.... ఆ యా అంశాల స్వరూప స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా అర్ధం చేసుకునే అవగాహనాపూర్ణ విధానం నెలకొంటుంది.
            5)  తోటివారిని అర్ధం చేసుకోవడం, వారిలోని అనుకూలాంశాలను గ్రహించడం వల్ల సమాజం పట్ల నిబద్ధత పెరిగి మనలో "అణుకువ" నెలకొంటుంది.
            6) అనేక మార్గాలలో పయనించే మనస్సు ఏక మార్గ గామి కావడం వల్ల విషయాలను నిశితంగా పరిశీలించడం, లోతుగా అధ్యయనం చేయడం, స్పష్టంగా దర్శించడం అలవడుతుంది.
            7) నిశితంగా చూచే దృష్టి వల్ల తెలిసిన దానికన్నా తెలియనిది ఎక్కువ ఉన్నదనే "సత్యం" బోధపడుతుంది. దానితో పెరిగిన ఆసక్తి అన్వేషణగా మారుతుంది.
            8) తెలియని దాని రహస్యాలను శోధించే క్రమంలో విజ్ఞులను ఆశ్రయించడం వల్ల వినయ విధేయతలు పెరుగుతాయి.
            9)  పొడసూపిన వివేకం వల్ల ఆత్మ పరిశీలన... దాని వల్ల అంతర్గత దోషాలను తుడిచివేసుకోవడం జరుగుతుంది. తద్వారా "శీల" సంపదను పొందగలుగుతాము.
            10) కామన తగ్గిపోయి శోధన పెరుగుతుంది. చూచిన దానినెల్లా ధర్మాధర్మ వివక్ష లేకుండా స్వంతం చేసుకోవాలనే యావ "కామన లేదా కామం". ధర్మ బద్ధంగా తన అవసరాలను తీర్చుకోవడం లేదా నిర్వహించుకోవడం "శృంగారం". బ్రహ్మ చర్యము శృంగారంలోనూ అంతర్భాగమే. సంతానాపేక్షతో భార్యాభర్తలు సంగమించడమూ బ్రహ్మచర్యంగానే పరిగణిస్తారు. సంతానాన్ని పొందడం మన విధ్యుక్త ధర్మ కర్మలలో ఒక భాగమే.
            11) దృశ్యాన్ని చూచే మానసిక కోణమూ మారుతుంది.
            12) అప్రయత్నంగా ఏకాగ్రతా అలవడుతుంది.

            ఈ ప్రక్రియ వల్ల మనో చిత్త అహంకార బుద్ధులు ఏకోన్ముఖమై ఒకే లక్ష్యం వైపు నడవడం వల్ల అంతర్గతంగా కప్పివేసిన "మాయా" యవనికలు తొలగిపోయి వ్యక్తిలో శీల నిర్మాణం జరుగుతుంది. శీల నిర్మాణం జరగడం వల్ల ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించే "సాధు స్వభావం" అలవడుతుంది.
            ఇదే అంతశ్చేతనలో బోధన లేదా ప్రబోధగా మారి నిరంతరం మార్గం తప్పకుండా హెచ్చరిస్తూ సరైన మార్గంలో ముందుకు నడిపిస్తుంది.

            చేసే పనిలో నాణ్యత పెరగాలి: Man is not a Human Being but a Becoming అంటారు ఓషో.  Being ఎప్పుడూ Static కాగా Becoming ఎప్పుడూ Dynamic. స్థబ్దత మనిషి లక్షణం కాదు కాబట్టి జీవితాOతం మనిషి ఏదో ఒక పనిని చేస్తూనే ఉండాలి. అయితే మనిషి బుద్ధి జీవి కూడా కాబట్టి ఏ పని చేయ దగినది, ఏ పని చేయ గూడనిది అనే విషయంపై స్పష్టమైన అవగాహన కలిగి సంపూర్ణమైన చైతన్యంతో పనిచేయడం వల్ల మానవ జీవితం సాఫల్యత చెందుతుంది.
            పనిచేయడం వల్ల ఏమొస్తుంది?

1)         పని చేయడం వల్ల పని సంస్కృతి అలవాటవుతుంది
2)         అంతశ్చేతన జాగృతమౌతుంది
3)         పనిని చేసే క్రమంలో అంతరంగంలో చెలరేగే ఆలోచనలలో నుండి అవసరమైన వాటిని విడదీసి వాటిపై దృష్టి పెట్టడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది
4)         పనిలో నైపుణ్యం పెరుగుతుంది
5)         సంతృప్తిని, ఆనందాన్ని పొందగలుగుతాము
6)         నిబద్ధతతో పని చేయడం వల్ల బాధ్యతలు తెలుసుకో గలుగుతాము
7)         బుద్ధి కుశలత పెరిగి సమాజోపయోగ ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది
8)         ఉత్పత్తి, ఉత్పాదకతలు గణనీయంగా పెరుగుతాయి
9)         నాణ్యతా ప్రమాణాలు పనిలో అంతర్భాగమౌతాయి
10)      లోతైన అవగాహన పెరగడం వల్ల దార్శనికత అలవడుతుంది
11)      కర్తవ్య నిర్వహణలో స్వీయ నియంత్రణ అలవడుతుంది
12)      ఏ పనిని ఎక్కడ ఎలా ఆరంభించాలి, ఎక్కడ ఎలా ముగించాలి; ఆ పనిని నిర్వహించడంలోని సానుకూలాంశాలు ఏమిటి? వాటి నెలా ఉపయోగించుకోవాలి? ఎదురయ్యే అవాంతరాలు లేదా అవరోధాలు ఏమిటి? వాటి నధిగమించడం ఎలాగా? ఇలాంటి అనేకాంశాలపై స్పష్టత వస్తుంది.
13)      ఆ కార్య నిర్వహణ కవసరమైన సాంకేతిక అవగాహన పెరుగుతుంది. విజ్ఞానాన్ని ఆధునీకరించుకునే మార్గాలను అన్వేషిస్తాము.
14)      చేసే పని ఆనందాన్నిస్తుంది కాబట్టి దానిపై అంకిత భావం పెరుగుతుంది
15)      మనం చేసే పని వల్ల మనకూ, మనపై ఆధారపడిన వారికీ, సమాజానికీ ప్రయోజనం కలుగుతున్న సమయంలో మన మనస్సులలో కలిగే నిర్మలత, ఆనందం అభ్యుదయ మార్గంలో పయనిస్తుంది. తద్వారా భావనలో, స్పందనలో, భాషణలో పవిత్రత వెలుగు చూస్తుంది.
16)      నిర్మలతను, శాంతతను పొందిన మనస్సు సమర్పణా బుద్ధితో, బాధ్యతాయుతంగా చేస్తున్న పనిలో అనిర్వచనీయమైన ఆనందాన్ని; ఆ ఆనందానికీ అతీతమైన స్థితిని పొందగలుగుతాము. ఆ తాదాత్మ్య స్థితిలో చేసే ప్రతిపనీ భగవదర్పితంగా చేస్తూ సమాజానికి ఉపయుక్తమయ్యే రీతిలో శ్రమించడం వల్ల ఆత్మాశ్రిత "స్వార్ధపరత" నిష్క్రమిస్తుంది.
            ఈ ప్రక్రియ లో నిన్నటి మీద ఈరోజు మనం పనిలో చూపే ఉత్తమమైన లేదా మెరుగైన ప్రావీణ్యత లేదా నైపుణ్యం వల్ల పనిలో నాణ్యత పెరగడమే కాక త్వరగా పూర్తవుతుంది. దానితో సమయం ఆదా అవుతుంది. నాణ్యతా ప్రమాణాలతో పని చేయడం, సకాలంలో పూర్తిచేయడం ద్వారా పని సంస్కృతి మనకొక అలవాటుగా మారి పోతుంది. ఆ అలవాటు అనతికాలంలోనే ప్రవర్తనగా మారుతుంది.
            పనిని ఆరంభించిన సమయంలో "యెఱుక"తో చేస్తాము లేదా తెలిసి చేస్తాము. కాని నిరంతర సాధనద్వారా పని చేయడమనేది మనలో "సహజజ్ఞానం" గా మారిపోతుంది. చేపట్టిన పనిని నాణ్యతా ప్రమాణాలతో, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో, సునాయాసంగా, చైతన్యంతోనే కాక ఏ స్థితిలో ఉన్నా నిర్వహించ గలుగుతాము. దానితో మనపై మనకు ఏర్పడే  చేయగలనే ఆత్మ విశ్వాసం అనంత శక్తిని ప్రసాదిస్తుంది. ఆ శక్తి ప్రేరణ మరింత భారమైన క్లిష్టతరమైన కార్యాన్నైనా సునాయాసంగా నిర్వహించేందుకు కావలసిన ప్రేరణాపూర్వక శక్తిసామర్ధ్యాలను ప్రసాదిస్తుంది. అంతేకాదు నిరంతర చైతన్యమూర్తులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది.
            "షడ్భాగంతు మనుష్యాణాం సప్తమం దైవ చింతనం" అన్నారు పెద్దలు.  మనిషి ప్రయత్నశీలిగా మారి నిరంతరం ఉద్యమస్పూర్తితో ముందుకుసాగితే విజయపథంలో నడవ గలుగుతాడు. దైవమూ సహకరిస్తుంది. ఆ ప్రయత్నమే అతనికి "సాధన"గా మారుతుంది.

            విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి :  పూర్ణ మదః, పూర్ణ మిదం, పూర్ణాత్పూర్ణ ముదచ్యతే; పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటున్నాయి ఉపనిషత్తులు. అనంతమైన చైతన్యం నుండి  ప్రకటితమైన సకల జీవకోటీ పరిపూర్ణమైనదే. ఆ చైతన్యాంశ గలిగి అందులో అంతర్భాగమైనట్టి మనమూ పరిపూర్ణులమే. ఇంతటి విశాల విశ్వం ఆ అనంతం నుండి వెలువడినా ఆ మిగిలినదీ అనంతమైనదే పరిపూర్ణమైనదే. సనాతన తత్త్వం ప్రకారం ఈ విశాల విశ్వం అంతా భగవత్సృష్టి కాదు. భగవంతుని ప్రకటన (Manifestation) మాత్రమే.
            పరిపూర్ణత వైపు సాగే పయనంలో విజయ సాధన చిన్న మజిలీ మాత్రమే కాగా. అంతిమంగా సాధించాల్సిన "సాధ్యం" లేదా లక్ష్యంమన పుట్టుకకు మూలాలను అన్వేషించడమూ ఆ మూలాలలో లయించడం. ఆ సత్యాన్వేషణలో సాగే ఆగని ప్రయాణంలో అనంతమైన మజిలీలు ఎన్నో.
            అయితే మనలోనే అంతర్భాగమైన పరిపూర్ణత్వాన్నిఎందుకని గుర్తించడం లేదు? నిజానికి నేను నాది అనే మాయా చీకటులు గ్రమ్మడం వల్లనే ఆ సత్యాన్ని గుర్తించ లేక పోతున్నాము. సాధనాబలంతో విచక్షణను మేల్కొలిపి అంతశ్చేతనలోని ప్రజ్ఞను దర్శించిన దార్శనికులైన మహానుభావులు ఆ చైతన్యం యొక్క స్వభావ స్వరూపాదులను తమ తమ "దర్శన" మేరకు జిజ్ఞాసువులకు బోధపరచే ప్రయత్నం చేసారు.            నేనుఎక్కడ నుండి వచ్చాను, ఎక్కడికి వెళతాను? ఈ ప్రయాణంలో నేను పొందేది  ఏమిటి, విడిచి పెట్టేది ఏమిటి? ఈ విషయాలపై అవగాహన ఏర్పడితే మాయా చీకటి తెరలు విడిపోయి స్వస్వరూపాదుల దర్శన మౌతుంది.
            అందుకై మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటి?.....

            1)         ఇతఃపూర్వం ఆ మార్గంలో ప్రయాణించి తమ అనుభవాలను "అక్షర"బద్ధం చేసిన దార్శనికుల అనుభవాలను అధ్యయనం చేయడం.... అవకాశం మేరకు వారి ప్రబోధలను ప్రత్యక్షంగా వినడం; ఇందువల్ల విషయంపై అవగాహన పెరుగుతుంది.
            2)         అనుమానాలు చిన్నవైనా, పెద్దవైనా, ఎలాంటివైనా నివృత్తి చేసుకోవడం: అనుమాన గ్రస్తమైన హృదయం విషయాన్ని ఎలా ఉన్నది అలా తీసుకోనివ్వదు. తన దృష్టి కోణంలో విషయాన్ని వడగట్టి మనస్సుకు అందిస్తుంది. ఇతఃపూర్వం ఏర్పరచుకున్న అభిప్రాయాల కనుగుణంగా తీసుకునే ఏ విషయమూ సత్యాన్ని ఆవిష్కరించనీయదు. అనుమాన నివృత్తి "సత్య స్థితి"ని  అవగాహన చేసుకునేందుకు ఉపకరిస్తుంది.
            3)         విషయాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న లేదా తెలిసిన బోధకుని ఆశ్రయించాలి
            4)         మనలో స్పష్టత ఉండాలి. ఏ విషయం తెలుసుకోవాలి.. ఆ విషయంలో మన అవగాహన ఎంత...  విషయంపై అవగాహన పెరిగాక దానిని ఎలా ఉపయోగించుకుంటాము. మొత్తంగా సాధించాక ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నాము.... ఇలాంటి విషయాలపై సమగ్రమైన అవగాహనతో కూడిన స్పష్టత ఉండాలి.
            5)         ఏ విషయాన్ని మథిస్తున్నామో ఆ విషయంపై సంపూర్ణమైన సమాచారం సేకరించగలగాలి, పట్టు సాధించాలి. ఏ విషయంపై నైనా సంపూర్ణ పారంగతుడు కావాలి అంటే దాదాపు 10,000 గంటల కాలం శ్రమించాలి అంటారు. అన్ని గంటల కాలం శ్రద్ధతో, ఆసక్తితో అనుక్షణం మేలైన పారంగత్వాన్ని సాధించడం వల్ల కలిగిన ప్రేరణ ముందుకు నడిపించడం వల్ల ఆ విషయంలో నిష్ణాతులం కాగలము. విషయం లోతులలో విహరించడం వల్ల మనదంటూ ఒక మార్గాన్ని సృష్టించుకో గలుగుతాము.
            6)         అలాగే నిలకడ లేని మనస్తత్త్వం వల్ల సాధించేదీ ఏమీలేదు. వేగము ఎంత అవసరమో విజయ సాధనలో నిలకడ అంతే అవసరము..
            7)         నూతన విధానాన్ని ఎప్పటికప్పుడు ఆలోచించాలి. భూతకాలంలోని అనుభవాలు ప్రాతిపదికగా భవిష్యత్తును దర్శించేందుకు వర్తమానంలో ప్రణాళికలు రచించుకోవాలి. భూతభవిష్యత్తులకు అతుక్కుపోయి వర్తమానాన్ని విస్మరిస్తే జీవితకాలం వ్యర్ధమైనట్లే.
            8)         అదీతి (అధ్యయనం చేయడం) బోధ (అర్ధం చేసుకోవడం) అవగతం (ఆచరించి ఫలితాలను బేరీజువేసుకోవడం) ఈ మూడు ప్రక్రియల వల్ల విషయం సంపూర్ణంగా అవగతమౌతుంది. అప్పుడు మనలో ప్రవహించే జ్ఞానప్రవాహం పదుగురికి ఉపయుక్తమయ్యే విధంగా ప్రవచనాల ద్వారా వ్రాతల ద్వారా ప్రచారం చేయడం వల్ల వర్తమాన, భావితరాల వారలకూ మార్గం చూపిన వారమౌతాము.

ఇలా తనను గూర్చి తాను చేసే శోధనను సాధన చేస్తూ బోధన చేయడం వల్ల ఆలోచనలలో ఉండే వ్యగ్రత పోయి నిర్మలత ఆవరిస్తుంది.

            అలాంటి వ్యక్తి తాను పునీతుడై అజాత శత్రువుగా మారిపోతాడు. సృష్టి సమస్తమూ తనలోనే ఉందని, ఈ సకల సృష్టిలో తానూ ఉన్నాననే "బోధకళ" వల్ల  చిత్త విభ్రాంతి శమించి తాను భగవత్తత్త్వానికి భిన్నుడను కాననే సత్యాన్ని గ్రహిస్తాడు. ఆ గ్రహణయే సిద్ధి పొందడంగా చెప్పుకుంటాము.

Palakurthy Rama Murthy 

No comments: