Thursday, September 1, 2016

అన్వేషణ -- ఆవిష్కరణ

అన్వేషణ --  ఆవిష్కరణలు ప్రతి మనిషికీ సహజ లక్షణాలు. అయితే, దేనినన్వేషించాలి, దేనిని ఆవిష్కరించాలి అనేది ఆ వ్యక్తి యొక్క అభిరుచి, అవసరం, అవకాశం, అంతర్గత జ్వలన, తపనలపై ఆధారపడి ఉంటుంది.
            దార్శనికుడైన గురువు లేదా మార్గదర్శి అడుగుజాడలలో అతిశయించిన కోరిక, బుద్ధి వికసనతో, సకల జీవకోటీ శ్రేయస్సును పొందాలనే సంకల్పంతో అన్వేషణ జరిగితే సత్య పథం ఆవిష్కృతమౌతుంది. ఈ ప్రయాణంలో ఒక గురువు లేదా మార్గ దర్శకుని అవసరం రావచ్చు.
            అయితే, మార్గ దర్శకుడు లేదా గురువు దర్శింపజేసేది పరిమితమైనదే. ఎందుకంటే అపరిమితత్త్వంలో గురువు దర్శించిందీ పరిమితమైనదే కాబట్టీ. అయినా, ఆ పరిమితమైన దానిని ఆధారం చేసుకొని తన దీక్షా దక్షతలతో అపరిమితత్త్వాన్ని ఆస్వాదించేందుకు సాగే ప్రయత్నమే "అన్వేషణ".
            ప్రతి అన్వేషణా సరైన మార్గంలో సాగుతుందనీ, ఆశించిన ఫలితాన్ని ఇస్తుందనీ చెప్పలేము. ఒక్కొక్కసారి ఆ మార్గం తప్పుదారి కావచ్చు. కంటకావృతమూ కావచ్చు. అగమ్య గోచరం కావచ్చు. ఆ మార్గం మన సంకల్పాన్ని బలహీనపరచే అవకాశమూ లేకపోలేదు.  అప్పుడే బుద్ధి ప్రచోదన పొందాలి. ఇతరుల అన్వేషణ మనకు ప్రేరణ నివ్వవచ్చు. మార్గం చూపవచ్చు. కాని గమించాల్సింది మనమే. ఆ దారిలో ఎదురయ్యే కష్టనష్టాలను భరించాల్సిందీ మనమే. కాబట్టి అవగాహన పెంచుకుంటూ, అవాంతరాలను అధిగమించే విధానానికి రూప కల్పన చేసుకుంటూ మనదంటూ ఒక మార్గాన్ని ఏర్పరుచుకొని సాగిపోవడం సమంజసం.
            ఈ క్రమంలో మార్గం తప్పడం జరగవచ్చు. అయితే, ఎప్పుడైతే మార్గం తప్పామని నిశ్చయంగా తెలుస్తుందో అప్పుడు అవసరమైతే మళ్ళీ తప్పనిసరిగా ఆరంభంనుండి మన యాత్రను ప్రారంభించాల్సిందే. అంతం లేని గమ్యంవైపు సాగే క్రమంలో ఎక్కడి నుండి ఆరంభించామనే దాని కన్నా ఎంతటి సంకల్ప బలంతో మళ్ళీ ఆరంభించామనేదే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
            పరిపూర్ణత నుండి పరిపూర్ణత వైపు సాగే ప్రయాణానికి లక్ష్యం లేదా యోగం(పొందదగినది) ఆనందానికి అతీతమైన స్థితిని అన్వేషణ చేయడం మాత్రమే. అన్వేషణా జిజ్ఞాసలకు ఏ వ్యక్తీ ఆద్యుడూ కాదు, చివరివాడూ కాదు. ఎందరో మహానుభావులు తమ అన్వేషణలో ఆవిష్కరించిన సత్య మార్గంలో దారి పొడుగునా "అక్షర" బద్ధమైన సూచికలు ఏర్పరచారు.  ఛాయమాత్రంగా కొన్ని, బలమైన ముద్రలుగా కొన్ని, స్పష్టమైనవి కొన్ని, అస్పష్టమైనవి కొన్ని.. ఇలా ఎన్నొ ఎన్నెన్నో గుర్తులు భావి తరాల వారి కోసమని ఏర్పరస్తూ వారి అన్వేషణ సాగిపోయింది. అయితే అవి వారు, వారి  ఆంతరంగిక జిజ్ఞాస అన్వేషణలలో ఏర్పరచుకున్న దీపికలు మాత్రమే. అందువల్ల ఆ ఆవిష్కరణలు మనకుపయుక్తం కావచ్చు కాకపోవచ్చుకూడా. ఎందుకంటేఅవి పూర్తిగా వారివారి దార్శనిక శక్తి సామర్థ్యాలపై ఆధారపడి వారి ప్రయోజనాలను లక్ష్యించి ఆవిష్కరించుకున్నవి మాత్రమే కాబట్టి. అయితే ఆ దీపికలు మన యానంలో ప్రయోజనం కలిగించేవి అయితే తప్పక ఆదరించుకోవలసిందే. అజ్ఞాతాన్ని జ్ఞాతం చేయాలనే తపనలో సాగే అన్వేషణలో ఏ పరిష్కార మార్గాన్నీ పనికిరానిదిగా లేదా వ్యర్ధమైనదిగా తలచవద్దు.
            మనిషిలోని మెదడు ఇంద్రియాల ఆధీనంలో తాను దర్శించ వలసిన లక్ష్యాన్నిచూపిస్తుంది. హృదయం అతీంద్రియ దార్శనిక ప్రజ్ఞతో అత్యున్నత జీవన విధి వికాసాన్ని "సాధ్యం"గా చూపుతుంది. మెదడు చూపే లక్ష్యాన్ని హృదయ సంజ్వలిత విధితో సంయోగం చెందించిన  సమయంలో గమ్యం సుగమమౌతుంది. ఈ రెంటినీ విడివిడిగా సాధించడం లక్ష్యంగా సాగే యానం నిర్దిష్ట ప్రయోజనాన్ని ఇవ్వదు. పరిమిత మొత్తంలో అంతర్గత శక్తిసామర్ధ్యాల వినియోగాన్ని దర్శింపచేసేది లక్ష్యం కాగా మనలోని అనంత శక్తిసామర్ధ్యాలను అనంతంగా వినియోగించుకునేందుకు ప్రేరణ నిచ్చేది జీవన విధి వికాసం. ఆ అన్వేషణలో ఒక్కొక్కమారు పరిష్కారమార్గం అస్పష్టంగా గోచరించవచ్చు.  ఆ అస్పష్టతా పరిష్కార మార్గాన్ని ఆసరాగా చేసుకొని వికసిత బుద్ధిని మరింతగా ప్రచోదన చేస్తూ ప్రజ్ఞను జాగృతం చేస్తే అస్పష్టత లోని స్పష్టతను ఆవిష్కరణ చేయడం సాధ్యపడుతుంది. దర్శన అస్పష్టమైన సమయంలో మనసులో ఆందోళన చెలరేగవచ్చు. ఆ ఆందోళనను అధిగమించ గలిగితే ఆత్మీయ సంకల్పం బలోపేతమౌతుంది.  సాధకుడు తన అన్వేషణలో దర్శించిన దానిలో అస్పష్టత ఉన్నా అది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపాన్ని సంతరించుకుంటూ దర్శనమిస్తుంటే కలిగే ప్రేరణ అన్వేషణకు ప్రతిబంధకం కాదు, కారాదు. ఆ అస్పష్టత వల్ల ఎదురయ్యే ప్రలోభాలను అధిగమించేందుకు మార్గదర్శకులు ఇతఃపూర్వం ఏర్పరచిన "అక్షర" బద్ధ సూచికలు, ఛాయామాత్ర పరిష్కారాలు ఉపయుక్తమౌతాయి. సంకల్పం బలోపేతమై, సాధన తీవ్రతరమైతే ఆ సాధనలో ఆవిష్కృత అంతశ్చేతనా ప్రకాశం ముందుకు దారి జూపుతుంది. ఆ మార్గంలో ఇంతకు ముందు పయనించి ముందడుగు వేసిన  ఎందరో మహానుభావుల ప్రేరణాపూర్వక ప్రేషిత ధ్వని తరంగాలు ప్రబోధకాలుగా ముందడుగు వేసేందుకు దోహదపడతాయి.
            ఈ క్రమంలో, నిరంతర ప్రయత్నం మాత్రమే అస్పష్టతనుండి స్పష్టతను సాధించే లక్ష్యసాధనా ప్రయత్నాన్ని సులువు చేస్తుంది. అంతేకాదు... ప్రాకృతిక శక్తుల సహాయ సహకారాలు తప్పక లభిస్తాయి. అవగాహనాపూర్ణ అన్వేషణ అభ్యుదయ పరంపరగా ఆవిష్కృత మౌతుంది.
            లక్ష్యం లేదా గమ్యం అనంతమైనది. ఏ సందర్భంలో స్పష్టత సాధించామో, ఏ విషయంలో స్పష్టత కనిపించిందో, ఏ దార్శనికత వల్ల అంతశ్ఛేతనలోని అయోమయ స్థితి దూర మయిందో ఆ నిర్దిష్ట అంశాన్ని మరింత లోతుగా అన్వేషించడం వల్ల విషయంపై అవగాహన పెరిగి, దృశ్యాన్ని మరింత దగ్గరగా చూడగలుగుతాము. ఆ స్పష్టత అంతశ్ఛేతన నుండి జారిపోకుండా, నిశ్చలంగా ఆత్మలో శక్తి వంతం చేసుకోవడం, ముందుకు సాగడం కన్నా ప్రధానమైనది. ఎన్నో అవరోధాలు, ప్రలోభాలు, చంచలతలు, బలహీనతలు, బంధనాలు అంతరంగాన్ని కప్పివేస్తూ దృశ్యాన్ని కనుమరుగు చేసే అవకాశం ఉంది. అందుకే నిరంతరం ఆత్మప్రకాశాన్ని ప్రవృద్ధి చేయడం వల్ల, జాగృతం చేయడం వల్ల, చైతన్యం పొందడం వల్లదృశ్యాన్ని దర్శనం నుండి జారిపోకుండా కాపాడుకోగలుగుతాము.
            గమ్యం అగమ్యమైనది. పదునైన కత్తి అంచు కన్నా పదునైన మార్గంలో దుర్గమమైన గమ్యంవైపు పయనించే క్రమంలో మనస్సును అదుపు చేసుకోవడానికి దృఢ నిశ్చయంతో కూడిన ప్రయత్నం కావాలి. నిరంతర సాధనా దీప్తి వల్ల మాత్రమే లక్ష్యాన్ని చూడగలుగుతాము. చంచల స్వభావం కలిగిన మనస్సును మాలిమి చేసుకోవడం వల్ల మాత్రమే అది మనమాట వింటుంది. బలవంతంగా మనస్సును లొంగ తీసుకోవడం అసంభవం. మాలిమి చేసుకున్న మనస్సు మన కనుసన్నలలో సంచరించే ఆత్మ బంధువుగా మారిపోతుంది. సంతత సాధనా పటిమ వల్ల ఆ నైపుణ్యాన్ని సాధించగలుగుతాము.
            ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి ప్రచోదన, శక్తి మరియు పరాక్రమాలు అనుంగు సహచరులుగా ఉద్యమించే వ్యక్తిలో ప్రశాంత గంభీర చైతన్యం వెల్లి విరుస్తుంది. స్వేచ్ఛాపూర్ణ హృదయంతో నిరంతరానంద స్వాప్నికునిగా విజయపథంలో విహరించగలుగుతాము.
            ఎప్పుడైతే ఆనందానికి అతీతమైన తాత్త్విక శోభలో అంతశ్చేతన "యెఱుక" ను పొందుతుందో అప్పుడు తన లక్ష్యం, తన విధి పరిపూర్ణతవైపు దృష్టిని సారించ గలుగుతుంది. ఆ సాధన వల్ల తన "జన్మ స్థానం" ఆదికినాది యైన ఆ "పరిపూర్ణ"మే అనే సత్యాన్ని గుర్తించ గలుగుతాము. ఆ గుర్తింపు హృదయాకాశాన్ని అనంతమైన ప్రకాశంతో నింప్తుతుంది. ఆ వెలుగుకు తనకు మధ్య ఉన్న లేదా ఉన్నదనుకుంటున్న తెరలు తొలిగిపోయి అభేదమయిన సత్యం "బోధ"పడుతుంది. తనతోపాటుగా ఉన్న విశ్వ విశ్వాంతరాలను తనలో దర్శించుకోగలుగుతాము.
            అనంతంగా సాగే తన అన్వేషణకు ఒక నిర్దిష్ట కేంద్రం ఉండదు కనుక తన అన్వేషణ ఎక్కడికి చేరిందనేది కాకుండా తన "ఉనికి"కి మూలమేమిటో, అమృతత్త్వమేమిటో అవగతం అవడం జరుగుతుంది, తద్వారా తన కర్తవ్యం ఏమిటో బోధపడుతుంది. ఆ కర్తవ్య నిర్వహణలో .. అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు లేదా రెండింటి సమన్వయం కావచ్చు.. ఏది ఏమయినా అందులో తాదాత్మ్య భావనను పొందడం జరుగుతుంది. ఈ స్థితిలో అంతటా తన రూపమే కనిపించడం కారణంగా తాను పొందిన అభేదభావన వల్ల ఇతరుల కష్టసుఖాలు తనవిగా భావించే వికసన సాధకునిలో ఆవిష్కృతమౌతుంది. సేవాభావన తనలో ఆవిష్కృతమౌతుంది. జీవకోటిని సేవించడం లోనే పరమాత్మ సేవన ఉందనే సత్యాన్ని కనుగొన్నాక ఆ సేవాభావంలో కావలసిన "అర్హత"ను పొంది అనంతంలో తానూ అనంతునిగా మారిపోతాడు.

            ఈ అన్వేషణ భౌతిక జీవితానికి అన్వయించుకుంటే ప్రగతి పథంలో విజయాన్ని పొందవచ్చు. ఆధ్యాత్మిక జీవనానికి అన్వయించుకుంటే సుగతి మార్గంలో అనంతత్త్వాన్ని సాధించవచ్చు.

Palakurthy Rama Murthy 

No comments: