Saturday, September 10, 2016

శ్రీ కాళోజీ నారాయణ రావు గారికి అక్షర నీరాజనం

సంభవామి యుగే యుగే.... అన్నాడు గీతాచార్యుడు. చైతన్యం తమ సహజాతమైనా, జడత్వానికి ఆశ్రయమిచ్చిన జాతిలో స్పూర్తిని నింపి ఆ జాతి తేజాన్నినేల నాలుగు చెరగులా నింపేందుకు ప్రతి యుగం (కాలం) లో ఒక మహనీయుడు ఆవిర్భవిస్తూనే ఉన్నాడు. ఈ నాటి కాలంలో మన తెలుగు జాతిని చైతన్య పరచడానికి ఆవిర్భవించిన మహా మనీషి ... శ్రీ కాళోజీ గారు.
పోరుగడ్డ, ఉద్యమాలకు పుట్టినిల్లు యైన ఓరుగల్లు నానుకొని ఉన్న మడికొండ గ్రామంలో శ్రీ రంగారావు, శ్రీమతి రాంబాయి దంపతులకు 09-09-1914 లో జన్మించిన శ్రీ కాళోజీ 13-11-2002 లో తనువు చాలించారు. ఆయన బాల్యం అంతా మడికొండ గ్రామంలోనే గడిచిపోయింది. విద్యార్థి దశనుండే సంఘానికి తన జీవితాన్ని అంకితం చేసిన కాళోజీ జీవితంలోకి 1940లో శ్రీమతి రుక్మిణీ బాయి ప్రవేశించింది. శ్రీ కాళోజీ  సహధర్మ చారిణిగా తన పదమూడవ యేట అడుగు పెట్టిన ఆయన సతీమణి 2013 లో తాను మరణించేంత వరకు సామాన్య జీవితాన్నే గడిపింది. ఆనాటి శ్రీ రాముని నుండి ఈ నాటి కాళోజీ వరకు ప్రజా జీవితంతో మమేకమైన వ్యక్తులను ఎవరిని తీసుకున్నా వారి సహధర్మచారిణు లందరూ కష్టాలతో సహజీవనం చేసినవారే. అందులోనే వారానందాన్ని పొందారు. తమ జీవిత భాగస్వాములకు ప్రేరణ నందించారు. ఆ వరుసలోనే రుక్మిణీబాయిగారు కూడా తాను కష్టాలతో సహజీవనం చేస్తున్నా తన భర్త మార్గంలో అవరోధం కాకుండా ఆయనకు స్ఫూర్తి ప్రదాతగానే నిలిచారు.
తన పదునైదవ ఏటి నుండే సంఘజీవిగా తనకంటూ ఒక గమ్యాన్ని ఏర్పరచుకున్న కాళోజీ తన జీవితాంతం ఉద్యమస్పూర్తితో సమాజాభివృద్ధి కోసమే పనిచేసాడు. ఆర్య సమాజ్ పట్ల ఆకర్శితుడైన కాళోజీ, తన చిన్నతనం నుండే అందులో క్రియాశీలక పాత్ర పోషించాడు. ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా, ఉత్సాహం ఊపిరిగా, ధైర్యం ఆలంబనగా, సాహసమే సహచరులుగా “అక్షర” ఉద్యమాన్ని నడపడం వల్ల అతడు ప్రజాకవిగా ప్రజల గుండెలలో నిలిచిపోయాడు. లక్ష్యం ఉదాత్తమైనది కాబట్టి తన గమనం కూడా సమున్నతంగా ఉండాలనే భావనతో "కాలానికి అతీతంగా, లోకాన్ని ఆలోకన చేస్తూ, జీవితాన్ని నిబద్ధతతో నడిపాడు" (కా..లో..జీ..).  అందుకే ప్రజా జీవితాన్నే తన జీవితంగా మలుచుకున్న కాళోజీ తన మార్గంలో ఉద్యమించడానికి అవసరమైన రాజకీయం తనకు ప్రాణశక్తిగా... ఆ మార్గంలో సహకరించే ఊపిరులుగా కవితామార్గాన్ని ఎంచుకున్నాడు. అలాగని కవిత్వం తన అభిజాత్యాన్ని పెంచేదిగా ఉండ కూడదు.. కాబట్టే ఎన్నెన్నో ప్రసంగాలలో ఎన్నో కవితలను పచరించినా తానంటూ వాటికి అక్షర రూపాన్ని ఇవ్వలేదు. సహచరులు విని వాటికి అక్షరత్వాన్ని కలిగించడం వల్ల కొన్నైనా మిగిలాయి. రాశి కన్నా వాసి ముఖ్యం కదా. తన కన్నా ఆరు సంవత్సరాలు మాత్రమే పెద్దవాడయిన రామేశ్వర రావు గారు తన చిన్నతనం నుండి తన చివరి ఊపిరి వరకూ తన భౌతిక జీవన బాధ్యత తీసుకోవడం వల్ల సామాజిక కార్య క్రమాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించ గలిగాడు.
"ఉత్తిష్ఠత, జాగ్రత, ప్రాప్య వరాన్నిబోధత, క్షురస్య ధారా నిశితా దురత్యయాత్, దుర్గం పథస్తాత్ కవయో వదంతి" అంటూంది "కఠోపనిషత్తు". నీవెన్నుకున్నా మార్గం దుర్గమమైనది... కత్తి అంచుకన్నా వాడియైన దారి గుండా నీ ప్రయాణం సాగాలి. అత్యంత ప్రమాదకరమైన దారిలో ప్రయాణం సాగిస్తున్నప్పుడు అవసరమైన రీతిలో మానసికంగా సిద్ధంగా ఉండు. లే.. లేచి జాగరూకతతో స్థిరంగా నిలబడు. సన్నద్ధంగా ఉండు. ఏ క్షణాన నైనా అనివార్యమైన మృత్యువు నిన్ను కబళించే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణం చేయవలసిన పనిని ఉత్తర క్షణానికి వాయిదా వేయకు.. అవకాశం మేరకు అవసరమైన దానికన్నా ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించు. బుద్ధితో విచారించు. శక్తి సామర్థ్యాలకు ఎప్పటి కప్పుడు పదును పెట్టుకుంటూ ఉద్యమ స్పూర్తితో పరాక్రమించు... అంటూ ప్రబోధిస్తుంది, ఉపనిషత్తు. అదే స్పూర్తిని తన అణువణువులో నింపుకున్న కాళోజీ... చావు పుట్టుకలు మన చేతిలో లేని ఈ ప్రపంచానికి కొద్ది రోజులు అతిథిగా వచ్చానని విశ్వసించిన వాడు కాబట్టి ఏ నాడూ తన కంటూ ఆస్తిపాస్తులను కూడబెట్టుకోలేదు... సంపాదించుకోనూ లేదు. అక్షర బద్ధమైన ఆయన జీవితం అక్షరమైనది (నాశనం లేనటువంటిది) అందుకే "చెలము చెలమలలో ఊట నీరు ఊరినంత కాలం ఈ గడ్డపై నేను బ్రతికే ఉంటా"నంటాడాయన. సుదీర్ఘమైన తన జీవిత కాలంలో కాళోజీ జీవితంలో రాజీ పడిన సందర్భాలను ఎన్నడూ చూడలేము.
జయప్రకాశ్ నారాయణ మరణంపై స్పందిస్తూ “పుటుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది” అంటాడు.
భాషా ప్రయుక్తమైన సమైక్య రాష్ట్రం తో ఇరు ప్రాంతాలూ (ఆంధ్రా తెలంగాణాలు) అభివృద్ధి చెందుతాయని మొదట విశ్వసించిన కాళోజీ సమైక్య రాష్ట్రం ఆవిర్భవించిన మరు క్షణం నుండే ఒప్పందాలను ఉల్లంఘించడం చూసి రగిలి పోయాడు. అందుకే "నా" నుండి "మా" దాకానే నేనింకా రాలేదు... "మన" అనుకున్నప్పుడు కదా ముందుకు సాగేది, అని అంటాడాయన.
1932 లో కోస్తా జిల్లావాసి అయిన ముడుంబై రాఘవాచార్యులు "తెలంగాణలో ఆంధ్ర కవులు పూజ్యం" అంటే దానికి జవాబుగా శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 354 మంది తెలంగాణా కవులను వారి వారి వివరాలనూ కవిత్వాలనూ గోల్కొండ పత్రిక ద్వారా పరిచయం చేసాడు. అహంకారంతో కూడిన ప్రాంతీయ భాషాభిమానానికి ఆత్మాభిమానంతో ఇచ్చిన జవాబది. అదే స్వాభిమానం కాళోజీలోనూ కనిపిస్తుంది.
వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణా నాది. వేరైనా నాది వీర తెలంగాణే అనే అంతటి గుండె ధైర్యం కలిగిన మనిషి ఆయన. ప్రాంతేతరులు దోపిడి చేస్తే తీరందాకా తరిమి కొట్టండి. ప్రాంతం వాడే దోపిడి చేస్తే... ప్రాణంతో పాతర పెట్టండి.... అనే సాహసం, అంతటి నిజాయతీ కలిగిన వ్యక్తులకు కాక ఎంత మంది కుంటుంది.
ఎవని వాడుక భాషలో వాడు రాయాలె అంటాడాయన. అయితే అది ఎదుటి వారికి తెలుస్తదా? అంటే తెలుసుకునే సహృదయత వారికుండాలి. మనలో ఉండే బానిస మనస్తత్వం వల్ల మనమే మన భాషను తక్కువ చేసుకుంటున్నాము. ఆ బానిస భావన పోవాలి. అంతే కాదు.... భాష రెండు రకాలు... ఒకటి... బడి పలుకుల భాష రెండవది... పలుకు బడుల భాష. మనకిప్పుడు కావలసింది... పలుకు బడుల భాష, అంటారాయన. అందుకే... తెలంగాణ భాషలో రాయండి... తెలంగాణ భాషలో మాట్లాడండి... తెలంగాణ బతుకు బతకండి అంటూ నినదిస్తున్నాడాయన.
సమగ్రాంధ్ర స్వర్ణోత్సవ సంబరాలను నిరసిస్తూ.. తెలంగాణ "యాస" నెపుడూ యీసడించు భాషీయుల సుహృద్భావన యెంతని వర్ణించుట సిగ్గుచేటు, అంటారాయన.
కాళోజీ గారు ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడంలో... వారి సోదరుడు, ప్రముఖ ఉర్దూ కవి శ్రీ రామేశ్వర రావు గారి ప్రభావం ఎంతో ఉంది.
కవితా స్వరూపాన్ని ముందుగా కవి తానుగా దర్శించి పాఠకులకు సాక్షాత్కరింప చేసే క్రమంలో తనలో కలిగే నాలుగు అవస్థలను అధిగమించాల్సి ఉంటుందని పాశ్చాత్య విమర్శకులు చెపుతుంటారు. అవి 1) Preparation (ప్రయత్నం) 2) Incubation (ప్రరోచనం) 3) Illumination (ప్రకాశనం) 4) verification (పరిశీలనం)
సామాజిక అనుభవాలను అంతర్ దృష్టితో అవలోకించి, సమ బుద్ధితో పరిశీలించి, నిర్మలమైన భావనలో ఆత్మానుభూతిని పొంది దానిని అక్షర బద్ధం చేసే విధానం కవిత్వానికి సర్వకాలీనతను ప్రసాదిస్తుంది. మనం చెప్పే విషయంలో ఎదుటి వారిని ఆకట్టుకునేందుకు వస్తువు ప్రధానమైన పాత్రను పోషించినా చెప్పే విధానం దాని కన్నా ముందుంటుంది. దీనికి ప్రతిభా వ్యుత్పత్తులతో పాటుగా అభ్యసనం కావాలి. సాధారణంగా ప్రతి వ్యక్తిలో రెండు శక్తులు ఉంటాయి ఒకటి పురుష శక్తి కాగా రెండవది స్త్రీ శక్తి. పురుష శక్తి ప్రతిభకు నిదర్శనం కాగా స్త్రీ శక్తి వ్యుత్పత్తికి ప్రతీక. ఒకటి సృజనాత్మతకు చోటిస్తే రెండవది అంగీకృతికి ఆధరువవుతుంది. ఈ రెండూ సమపాళ్ళలో ఉన్నప్పుడే ఆ కవిత సర్వకాలీనమై నిలుస్తుంది. నిరంతర అభ్యసన దీనికి మెరుగులు దిద్దుతుంది.
అయితే... అందులో బాస ఎంత ముఖ్యమో యాసా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. సామాన్యుని జీవితాలను అసమాన్యంగా తీర్చిదిద్దాలనే తపన ఉన్న కవి వ్రాసే కవిత ఆ సామాన్యుడు పలికే యాసలోనే ఉండాలి... వాడు పలికే బాసలోనే ఉండాలి. సామాన్యుల వ్యధను ప్రతిబింబించే బాస వారి యాసలో ఉన్నప్పుడే అది లక్ష్యించిన లక్ష్యాన్ని చేరుకుంటుంది.
ఒకసారి కరువు బంధనాలలో తెలంగాణ అల్లల్లాడిన వేళ "తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు కాని ఏ మూల చూసినా లెమెన్ జ్యూస్ లు, సోడాలు కనిపిస్తున్నాయని" కాళోజీ కవిత్వం రాసాడు. అది ఈ నాడూ మనకు కనిపిస్తూనే ఉంది. లెమెన్ స్యూస్ లు, సోడాల స్థానాన్ని మత్తుపానీయాలు, కూల్ డ్రింక్ లు ఆక్రమించాయి.
ఎనుబదెనిమిది సంవత్సరాల జీవన మహాప్రస్థానంలో ఆయన కలం జార్చిన జ్ఞాన వాహినులెన్నో... అధిగమించిన సోఫానాలు మరెన్నో.
ఎనిమిది సంపుటాలుగా సంపుటీకరింపబడిన "నా గొడవ" ఆయన ఆత్మ కథగా మనలకు ప్రబోధన అవుతుంది. అణా కథలు, పార్ధివ వ్యయం, కాళోజీ కథలు లాంటివి ఆయన ప్రతిభకు దర్పణాలుగా నిలువగా... బ్రెయిన్ ఫోర్డ్ వ్రాసిన రెబెల్ ఇండియా కు భారత దేశ యాత్ర పేరుతో చేసిన అనువాదం, ఖలీల్ జీబ్రా రాసిన ది ప్రాఫిట్ కు జీవన గీతాలు పేరుతో చేసిన అనువాదం పలువురు విమర్శకుల మన్నన లందుకోవడం జరిగింది. ఈ రచనకు 1968 లో ఉత్తమ అనువాద అవార్డ్ ప్రకటింపబడింది.
అలాగే... ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యునిగా. ఆంధ్ర ప్రదేశ్ సారస్వత పరిషత్ సభ్యునిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా, గ్లోజరీ కమిటీ సభ్యునిగా (1957-61) సేవ లందించిన కాళోజీని కాకతీయ విశ్వ విద్యాలయం 1992 లో గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది.
ఆంధ్రపదేశ్ శాసన మండలి సభ్యునిగా (1958నుండి1960 వరకు) ఉపాధ్యాయుల ప్రతినిధిగా సేవలందించా రాయన. ఆయన సాహిత్య సామాజిక రంగాలలో అందించిన సేవలకు గౌరవంగా గుర్తింపుగా ఆయనను భారత ప్రభుత్వం 1992లో "పద్మవిభూషణ్" బిరుదుతో సన్మానించడం జరిగింది. ముక్కు సూటిగా వ్యవహరిస్తూ సన్మానాలకు దూరంగా ఉండే ఆయన నైజం తెలిసిన నాటి ప్రధాన మంత్రి శ్రీ పి.వి. నర్సింహారావుగారు, ఆ పురస్కారానికి ఆయన ఒప్పుకుంటారో లేదో ముందుగా తెలుసుకోమని సూచించారంటే ఆయన వ్యవహరించే వ్యవహార సరళి ఎలాంటిదో తెలుస్తుంది.
ఆనాటి నిజాము పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఫలితంగా నిజాం ప్రభుత్వంచే బంధీ కాబడ్డాడు. అలాగే స్వతంత్ర పోరాటం లో ఎన్నో మార్లు చెరసాలలకు పంపబడడం, అక్కడా తోటి ఖైదీలతో కూడి ఉద్యమించడం జరిగింది.
ఆయన జీవన విధానమే సిద్ధంతాల ప్రాతిపదికన ఏర్పడింది. విలువల కన్నా సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఎక్కువ. సిద్ధాంతాలు మనలోని అంకిత భావన నుండి వెలుగు చూసేవి కాగా విలువలు సమాజాంతర్గతమైనవి.  సమత్వము, సమైక్యత, కలుపుకుపోయే తత్త్వము, నిబద్ధత లాంటి లక్షణాలు తన నొక ఉత్తమ వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టాయి. అయితే తన కిష్టం లేకపోయినా క్రమశిక్షణ పేరుతో ఏదో ఒక పార్టీ చెప్పినట్లుగా నడుచుకోవడం అతనికి గిట్టని విషయం. కాబట్టే అతను రాజకీయవాది యైనా ఏ పార్టీలో నిలదొక్కుకోలేక పోయాడు. కాకపోతే ఉద్యమ కారునిగా ప్రజల పక్షాన నిరంతరం పోరాడాడు. మానవ హక్కుల కై ఆయన చేసిన పోరాటం అతనిని తార్కొండే కమిటీ సభ్యునిగా చేసింది.
స్వతహాగా తెలుగులోనే కాక మరాఠీ, ఇంగ్లీశ్, ఉర్దూ భాషలలో ప్రావీణ్యాన్ని సాధించిన కాలోజీ న్యాయవాద పట్టాలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. విద్యతోనే ప్రశ్నించే తత్త్వం అలవడుతుందని నమ్మిన కాళోజీ 1930 లోనే గ్రంథాల యోద్యమం చేపట్టి ఊరూరా దాని ఆవశ్యకతను చాటాడు.
సత్యాగ్రహ ఉద్యమం, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల వందేమాతర ఉద్యమం, రజాకార్ల ఉద్యమం, 1969 తెలంణా ఉద్యమం లాంటి వాటిలో ఉత్సాహంగా తాను పాల్గొనడమే కాక ఎందరికో స్పూర్తినివ్వడం జరిగింది. నిజాం కారు మీద బాంబు విసరగలిగిన ధైర్యం ఆయనది. వరంగల్ కోటలో జాతీయ జెండా ఎగరవేసే ప్రయత్నం చేసినందుకు రజాకార్లు ఆయనకు నగర బహిష్కరణ శిక్షను వేసారు.
చివరకు తన పార్ధివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడం వల్ల ఎందరికో మార్గ దర్శకు డయ్యాడు.
ఉద్యమే నహి సిధ్యంతి కార్యాణి న మనోరథైః
నహిసుప్తస్య సింహస్య ప్రవిషంతి ముఖే మృగా! అన్నారు.
ఉద్యమించనిదే (ప్రయత్నించనిదే) ఏ కార్య సాఫల్యతా సిద్ధించదు. అడవిలో సింహమైనా తన ఆహార సముపార్జనలో ప్రయత్నించాల్సిందే.
అలాంటి ఉద్యమ స్ఫూర్తిని తన జీవన రీతిగా మలుచుకున్న శ్రీ కాళోజీ నారాయణ రావు గారి స్మరణ యువతకు సరైన దిశను, దశను ఇస్తుందని విశ్వసిస్తూ....
ఎదురుగా జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఉండే సాక్షీభూతుడిని కాదు... సాక్షాత్తూ మానవుని నేను... అంటూ కర్తవ్యం వైపు నడిచే ధీమంతుడు కాళీజీ గారికి నివాళులర్పిస్తూ...
కృతజ్ఞతా నమస్సులతో....

పాలకుర్తి రామమూర్తి


Friday, September 2, 2016

సాహిత్య మూలాలు-మూల్యాలు

వ్యక్తి జీవితాన్ని నాలుగు పార్శ్యాలలో చూడాలి. భౌతికం, మానసికం, భావోద్వేగ సంబంధం, ఆధ్యాత్మికం-వీటిని సమన్వయం చేసుకుంటూ సమగ్ర జీవన వికాసాన్ని పొందడంవల్ల సమాజంలో వ్యక్తి బాధ్యతను నిర్వహించిన వారవుతారు. సామాజిక ప్రయోజనం లక్ష్యంగా శాశ్వత సత్యాన్ని హితంగా చెబితే అది సాహిత్యం అవుతుంది. అందంగా చెబితే అది కవిత అవుతుంది.

సమాజానికి మార్గదర్శనం చేసే రచనలు దేశకాల పరిస్థితులను దృష్టిలో వుంచుకుని సమ సమాజ అభిరుచులు అనుభవాలు అవసరాలకనుగుణంగా సాగితే అవి కొంతకాలం నిలుస్తాయి. జాతీయత, భక్తి, కామన లాంటివి ఇతివృత్తాలుగా సాగిన రచనలలోని భావ వైవిధ్యం, భాషా సౌకుమార్యం, అనుభవపు లోతులు, ఉద్విగ్నత, ప్రాజ్ఞత, కథా కధన రీతులు, శిల్ప సౌందర్యం, అలంకారాది సోయగాలు ఎక్కువ మందితో చదివించి ఆనందాన్ని ఇచ్చినా...హేతుబద్ధత, దీక్షా దక్షతలు కొరవడిన వ్యూహాత్మకత సాధనా బలం మృగ్యమైన రచనలు సర్వజనీనం, సర్వకాలీనం కాజాలవు. సమాన భావకులైన కొందరా సాహిత్యానికి స్పందించి ఆదరించినా సామాన్యులా ఉద్యమ తీవ్రతకు లోనుగారు. ఒక జాతి లేదా దేశం అనుభవం ప్రపంచవ్యాప్తంగా ఒకేవిధంగా ఉండకపోవడమే దీనికి కారణం. ప్రాచీన సాహిత్యంలోని భాషా ప్రౌఢిమ, అన్వయంలో క్లిష్టత, ఛందో నియమాలు...వీటివల్ల ఆ సాహిత్యం ఈనాటి పాఠకులకు దూరం అవుతుందనే భావన ఎక్కువగా ఉంది. ఎక్కువమంది సామాన్య స్థాయి పాఠకులు గలిగిన ఈనాడు అలాంటి రచనలు చదవవలసిన అవసరం ఉందా...అనేది ముఖ్యమైన ప్రశ్న. అలాగే భావ వ్యక్తీకరణకు భాషా ఛందస్సులు అడ్డుపడకూడదు వైవిధ్య భావ వ్యక్తీకరణకు ఉపయుక్తమయ్యేది భాష కాగా లయ ప్రధానమైనది ఛందస్సు. భాష నవనవోనే్మష భావచైతన్యానుభూతినిస్తుంది...నూతనత్వాన్ని సమకూరుస్తుంది. నీవు జీవించు ఎదుటివారిని జీవింపనివ్వు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నీకు రావాల్సిన దానిని అనుభవించు. ఎదుటివారిని దోచుకోకు, తాడిత పీడిత జనానీకం, దుఃఖబాధితులైన జీవకోటి లేని ప్రపంచాన్ని ఆవిష్కరించే దిశలో ప్రయత్నించు. ఇలాంటివి సర్వకాలీన సర్వజనీనమైన సాహిత్యానికి మూలాలు...మూల్యాలు. రామాయణంలో...పరదార ధనాదులను కామించి నశించిన వాలి, రావణ పాత్రలు హింసాప్రవృత్తితో నశించిన ఖరదూషణాదుల పాత్రలు, రాచరికపు అహంకారాన్ని ధిక్కరించి దేశాన్ని విడిచిపెట్టిన విభీషణుడి పాత్ర భావ వ్యక్తీకరణ నైపుణ్యం కార్యసాధనా లక్షణాలు కలిగిన హనుమంతుని పాత్ర సర్వకాలీనమై నిలుస్తాయి. ప్రహ్లాద చరిత్రలో రాచరికపు అహంభావంతో లోక కంటకుడైన పాలకుని ధిక్కరించిన ప్రహ్లాద పాత్రను చూస్తే ఈనాడు అన్యాయాన్ని ఎదిరిస్తున్న ఉద్యమ నాయకుల పాత్రలకు ప్రతీక అనిపిస్తుంది.
భారతంలో ధర్మానికి ప్రతీకయైన ధర్మరాజు కనుసన్నలలో అర్ధ కామాలను సాధించుకున్న భీమార్జునులు కనిపిస్తారు. ఎన్ని హంగులు వ్యూహ రచనలు చేసుకున్నా అధర్మాన్ని ఆశ్రయించిన కౌరవాళి ఓటమి పాలవడం సర్వకాలీనాంశం అవుతుంది. అవమార్గంలో నడిచే భర్తకు హితాన్ని ప్రవచించే తార, మండోదరి పాత్రలు, సహనానికి క్షమకు ప్రతీకలైన కుంతి. సమర్ధతకు ప్రతీకయైన ద్రౌపది లాంటి స్ర్తి పాత్రలు మనల్ని ఆలోచింప చేస్తాయి. సమభావన నశించిన మానవీయ విలువలు మసిబారి కులహంకారం కుబుసం విడిచినవేళ గళం విప్పిన జాషువా, స్ర్తి సమాజాన్ని బానిసలకన్నా హీనంగా చూస్తున్న సమాజంలో గురజాడ, కందుకూరి, లాంటివారి సాహిత్యం, జాత్యాహంకారాన్ని ఎదిరించిన గాంధీ, తాడిత పీడిత వర్గాల పక్క నిలిచి రచనలు సలిపిన శ్రీశ్రీ రచనలు, మూల్యాలు.. .మూలాలు, ధర్మ రక్షణ దీక్ష, సమ సమాజ స్థాపనా తపన, సమభావనా సౌజన్యతలు ఆయా పరిమితులలో లక్ష్య సాధనకై శ్రమించే జీవుని వేదనను ప్రతిబింబిస్తాయి. ఏది ఎలా ఉన్నా ఎన్నివాదాలు వినిపించినా సాహిత్యానికి మూలం ‘రసము’ జీవుని అంతరంగ వేదన రస వాహినిగా మారి అనుభూతిని ప్రసాదిస్తే ఆ అనుభూతి ఆర్తిగా తపనగా మారి అనుభవాన్నిస్తుంది. ఆ అనుభవం అక్షర రూపాన్ని సంతరించుకుంటే అది సాహిత్యమవుతుంది. మూల్యాలు లేని సాహిత్య మూలాలు చెదిరిపోతాయి. మూలాలు సరిగా లేని సాహిత్య మూల్యాలు తరిగిపోతాయి. అందుకే మానవీయ విలువల అనుభూతులు అనుభవాలు సంతరించుకున్న సాస్తియ రీతులకై తపిద్దాం.

Thursday, September 1, 2016

సంస్థ ఆశయాల కనుగుణంగా ఉద్యోగుల సామర్ధ్యాన్ని గుర్తించి నియోగించుకోవడం సంస్థ అభివృద్ధి చెందుతుంది.

సంస్థ అయినా , అది చిన్నదా పెద్దదా అన్న సంగతి వదిలేస్తే, దానికంటూ ఒక దార్శనికత ఉంటుంది. ఇంత కాలానికి సంస్థ స్థాయిలో ఉండాలి లేదా ఉంటుంది అనే పక్కా ప్రణాళికా బద్ధమైన దృష్టి ఉంటుంది. సంస్థకైనా ప్రాధమిక లక్ష్యం ఆర్ధికంగా లాభాలను ఆర్జించడం మరియు బహుముఖాలుగా విస్తరించి రంగంలో తన ప్రత్యేకతను చాటుకోవడం.
            సంస్థ ఉత్పత్తిని సాధించాలన్నా నాలుగు ప్రాధమిక అవసరాలు ప్రముఖంగా నిలుస్తాయి. ఒకటి... భూమి (Land)   రెండవది శ్రామిక శక్తి (Labour)  మూడవది నిధుల సమీకరణ (Capital) నాలుగవది నిర్వహణ (Organisation). నాలుగు అంశాలను వనరులుగా చెప్పుకుంటే వీటికి మూలం తనలోని తపనతో కూడిన వైఖరి.
            తన వద్ద భూమి ఉంది. తనకున్న పలుకుబడి మరియు తపనను చూసి తనను నమ్మిన వారు పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి, కావలసిన ధన సమీకరణ జరుగుతుంది. రెండూ తన ప్రతిభతో నడుస్తావి. కాని రెంటితో ఉత్పత్తి జరగదు. ముఖ్యంగా కావలసిన మానవ వనరులు కావాలి. అందులో నైపుణ్యం కూడిన శ్రామిక శక్తి , నైపుణ్యం అవసరం లేని శ్రామిక శక్తి రెండూ కావాలిదీనికి తోడూ వీటన్నింటినీ ఏకత్రాటిపై సమర్ధవంతంగా నడిపించ గలిగిన నిర్వహణా సామర్ధ్యం ప్రధానమైనది.
            నిర్వహణా సామర్ధ్యంలో... సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలపై దార్శనికత ఉంటుంది. నైపుణ్యాలకు సంబంధించిన సమగ్ర ఆలోచనా విధానం ఉంటుంది. అంటే ఏయే విభాగాలలో ఎలాంటి నైపుణ్యాలు అవసరం.. ఆ నైపుణ్యం ఎవరిలో ఉంది... వారి నైపుణ్యాన్ని సంస్థ ప్రయోజనాలకు ఎలా వినియోగించుకోవాలి... ఎవరిలో ఏ ఉత్సాహం ఉంది.. వారికి ఏ రంగంలో శిక్షణ అవసరం.. వారి నైపుణ్యాలను సంస్థ అట్టిపెట్టుకునేందుకు ఎలా వ్యవహరించాలి.. లాంటి విషయాలపై లోతైన అవగాహన ఉంటుంది. నిరంతరం వనరుల సమీకరణకు సంబంధించిన వ్యూహం ఉంటుంది. సాంకేతికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికా బద్ధ వైఖరి ఉంటుంది. వీటన్నింటికి ప్రాణ సదృశమైన కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఇందులో ఏది లోపించినా సంస్థ ఆశయాలు ఫలించవు. ఉదాహరణకు... దూరదృష్టిలేని సంస్థలో స్ఫష్టత ఉండదు సరికదా తత్తరపాటు లేదా తడబాటు ఉంటుంది. నైపుణ్యాలు లోపించిన సంస్థ ఒత్తిడికి గురవుతుంది... ఆశయాల మేరకు పని జరగదు. ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాన్ని సాధిస్తూ వెనుకబడిపోతుంది. వనరుల సమీకరణ సరిగా లేకుంటే అనుకున్న విధంగా సమయానికి పనులు పూర్తికాక ఆశాభంగానికి గురికావడం జరుగుతుంది. కార్యాచరణ ప్రణాళిక లేకపోతే ఎక్కడ నుండి ఆరంభించాలో ఎక్కడ ముగించాలో తెలియని అయోమయ స్థితి దాపురిస్తుంది.
            సంస్థ మౌలిక లక్ష్యాలైన విస్తరణ, ఆర్ధిక పరిపుష్టి ఈ రెండింటిని సాధించాలంటే... ముఖ్యమైన రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. మొదటిది ఉత్పాదనా సామర్ధ్యం పెంచడం కాగా రెండవది ఉత్పత్తిని అవసరమైన వినియోగదారునికి అందించడం ద్వారా మార్కెట్ పెంచుకోవడం.
            నిరంతరం ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న శాస్త్రసాంకేతిక ప్రగతిని పరిశీలిస్తూ,   సాంకేతిక విధానాలను తమ సంస్థకు అన్వయించుకుంటూ, తమ విధానాలను అవసరమైన మేరకు మార్చుకుంటూ, నాణ్యమైన ఉత్పత్తి ఉత్పాదకతలను సాధించేందుకు తమకున్న మానవ వనరులను సన్నద్ధం చేస్తూ, యాంత్రిక వనరులను ఆధునీకరించుకుంటూ పోటీ ప్రపంచంలో తమ ప్రత్యేకతను సాధించడం  ఉత్పత్తికి సంబంధించిన నిర్వహణా సామర్ధ్యాన్ని సూచిస్తుంది.
            అలాగే నిరంతరం కొనుగోలుదారుతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకుంటూ కొనుగోలుదారు సంతృప్తి మేరకు నాణ్యమైన సరకులను సరసమైన ధరలకు అందిస్తూ ఉత్పత్తి అమ్మకాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడంతో పాటుగా సంస్థపై కొనుగోలుదారుకు నమ్మకాన్ని పెంచడం అమ్మకాలకు సంబంధించిన నిర్వహణా సామర్ధ్యాన్ని సూచిస్తుంది.
            సంస్థ మనుగడకు, వికాసానికి రెండూ అవసరమైనవే.
            సరైన పని సరైన విధానంలో సమయానికి జరిగిపోవాలంటే ఆ పనిని నిర్వహించేందుకు సరైన వ్యక్తులను ఎంచుకొని నియోగించాలి. పనిలో ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందమే ప్రేరణగా నిరంతరం క్రొత్తదనాన్ని అన్వేషించే ఉద్యోగులనే సంస్థకు నిజమైన ఆస్తులుగా పరిగణించాలి. నిజానికి అలాంటి ఉద్యోగుల వల్లనే సంస్థ ఉత్పాదనా సామర్ధ్యం పెరుగుతుంది. మార్పునంగీకరిస్తూ, మార్పును ఆహ్వానిస్తూ దానితో మమేకమయ్యే నైపుణ్యం కలిగిన వ్యక్తుల సమూహాన్ని ఎన్నిక చేసుకోవడం, వారినందరినీ సంస్థ ఆశయాల కనుగుణంగా ఒక్క త్రాటిపై నడిపిస్తూ సత్ఫలితాలు సాధించ గలగడమే నిర్వహణా సామర్ధ్యం. నిజానికి వ్యాపార రంగంలో పోటీ తత్త్వం పెరిగిపోయి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నాలుగు డబ్బులెక్కువ ఇస్తూ ఆకర్శించే దుస్సంస్కృతికి తెరలేచిన నేపథ్యంలో ఉద్యోగులూ అలాంటి వారి దగ్గరకు వలసలు గట్టే ఈనాడు నిజాయితీ కలిగి మన రహస్యాలను దాస్తూ సంస్థ ప్రగతికి అంకితభావంతో పని చేసే ఉద్యోగులను నియమించుకోవడం కష్టమైన పనే.  అయినా సంస్థలో ఉద్యోగులను నియమించుకునే అధికారం కలిగిన, బాధ్యత తెలిసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ వలసలను కొంతమేరకు అరికట్టడం సాధ్యమే.
            ఈ క్రమంలో రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి ఎలాంటి ఉద్యోగులను తీసుకోవాలి? రెండవది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇక్కడ గమనించాల్సింది... ఉద్యోగులు నైపుణ్యం కలిగిన వారైనా లేనివారైనా నిబద్ధతతో పని చేయాలి అంటే వారికి ప్రేరణకావాలి. అది జీతభత్యాల రూపంలో ఉండవచ్చు, ఆదరణ రూపంలో ఉండవచ్చు, హెచ్చు బాధ్యతల నప్పగించడం వల్ల రావచ్చు, పని చేసే పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం బాగుండడం వల్ల కావచ్చు, ఉద్యోగ భద్రత వల్ల కావచ్చు... ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ప్రేరణ పొందవచ్చు. వారిని గుర్తించి వారికి ఆ రూపంలో భద్రత లభిస్తుందనే సంకేతాలు పంపగలిగితే వారి వలసలు అరికట్టడమే కాక వారి సేవలు సంస్థ పురోగతికి ఉపయుక్తమయ్యే రీతిలో పొందవచ్చు.
            జీత భత్యాలు సరిపోవని భావించినా, సంస్థలో తన నైపుణ్యానికి సామర్ధ్యానికీ తగిన ఆదరణ లేదా గుర్తింపు లేదని ఉద్యోగి భావించినా, తన ప్రతిభా వ్యుత్పత్తులకు ఇది సముచితమైన వేదిక కాదని భావించినా, తనను కాదని తనకన్నా తక్కువ అనుభవం, అర్హతలు కలిగిన తన తరువాతి ఉద్యోగికి పై పదవీ బాధ్యతలు అప్పగించి నప్పుడు కూడా అవకాశం వచ్చిన ఉద్యోగి సంస్థను విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే, చుట్టూ ఉండే పరిసరాలు పని వాతావరణం తన వృత్తిగౌరవానికి లేదా ఆత్మ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నా ఉద్యోగిలో పెరిగే అసంతృప్తి సంస్థను విడిచేందుకు కారణమవుతుంది. తప్పదని వేరే గత్యంతరం లేక ఆ సంస్థలోనే పనిచేసినా వారి సంపూర్ణమైన శక్తిసామర్ధ్యాలను వారు పనిలో వినియోగించరు. వారిలో లోపించిన ఉత్సాహం నీరసాన్ని నింపడం వల్ల పనిలో ఏకాగ్రత తగ్గి నాణ్యత తగ్గుతుంది. డబ్బు రూపంలో అందే ప్రోత్సాహకాలు కొంతమేరకే ప్రేరణ నందించగలుగుతాయి. సమస్యలను సవాలుగా స్వీకరించి  ఆ సవాలును అధిగమించే విధానంలో పొందే ఆనందం దానికి యాజమాన్యం నుండి అందే సహాయ సహకారాలే ఉద్యోగిలో సంతృప్తితో కూడిన ప్రేరణగా నిలుస్తాయి. ఈ విధానంలో ఉద్యోగి క్రొత్తదనాన్ని ఆస్వాదిస్తాడు.  పరిమితులలో బంధించబడిన తన శక్తిసామర్ధ్యాలను  విముక్తం చేసుకుంటూ అన్వేషణా మార్గంలో అనంతంగా వికాసం చెందినప్పుడు తనలో కలిగే ఉల్లాసంతో కూడిన ప్రేరణకు సాటి చేయ గల ప్రేరణ మరే విధంగానూ ఉద్యోగి పొందలేడు.
             నిబంధనల రూపంలో లేదా పరిమితుల రూపంలో ఒక ఉద్యోగి చైతన్యాన్ని సమర్ధతను అణచివేస్తే ఆ ఉద్యోగిలో పెల్లుబికే అసహనం సంస్థను విడిచి వెళ్ళేందుకు దారితీయవచ్చు. ఉత్సాహం సాహసం కలిగిన బుద్ధిమంతుడైన ఉద్యోగికి సంవత్సరాల తరబడి ఎదుగుబొదుగు లేని ఒకే పనిని అప్పగిస్తే అది ఆ ఉద్యోగి పని సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. శక్తిసామర్ధ్యాలు తగ్గిన ఉద్యోగి సంస్థకు భారంగా తయారవుతాడు. 
            జీతభత్యాలు తన పని విధానానికి మరీ ఎక్కువగా లభిస్తే పనిపై ఆసక్తి పెరుగుతుందనే వాదన సరికాదు. అలాగని తక్కువగా ఇస్తే ఆ ఉద్యోగి ఆర్థిక ఇబ్బందులతో జీవితంలో నిలదొక్కుకోలేక  పనిపై శ్రద్ధ పెట్టలేడు. కాబట్టి ఉద్యోగి జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తన సామర్ధ్యాన్ని గుర్తిస్తూ తగిన జీతభత్యాలతో గౌరవిస్తే ఆ ఉద్యోగి ప్రేరణను పొంది సంస్థ పురోగతికై శ్రమిస్తాడు. నిజానికి ఎక్కువ మందికి ప్రేరణ నిచ్చేది పనిలో తాము పొందే ఆనందం మాత్రమే. ఆ ఆనందం వారి సామర్ధ్యాన్ని గుర్తించడం, ఆ సామర్ధ్యానికి తగిన బాధ్యతను అప్పగించడం, వారిఎదుగుదలకు కావలసిన వసతులు కల్పించడం, వారు వారి ప్రతిభాపాటవాలను ప్రదర్శించి సాధించిన ఫలితాలను అభినందించడం వల్ల మాత్రమే ఏ వ్యక్తి కైన నిజమైన ప్రేరణ లభిస్తుంది.
            అన్నింటి కన్నా ఎక్కువ ప్రేరణ నేను నీ వెనుకనే ఉన్నాను అనే భరోసాను ఇచ్చినప్పుడే కలుగుతుంది.

            ఉద్యోగులను ఎన్నుకునే విధానంలో మూసలో పోసినట్లుగా ఒకే  విధానం పాటిస్తే ఫలితం సామాన్యంగానే ఉంటుంది. అలాకాక, పై అంశాలను ఆలంబనగా చేసుకొని ఒక్కొక్క అభ్యర్ధి సామర్ధ్యాలను ప్రాతిపదికగా వారిని ఎన్నుకొని బాధ్యతలను అప్పగించే విధానంలోనే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని నమ్ముతున్నాను. 

Palakurthy Rama MUrthy