Friday, September 6, 2019

శ్రీ గణపతి దండకము


ఓం శ్రీ సరస్వత్త్యై నమః

శ్రీ గణపతి దండకము

          శ్రీ శాంకరీ శంకర స్వాంత సంకల్ప సంజాత! విజ్ఞాన మూర్తీ! నమో యజ్ఞ రూపా! నమో అగ్ర పూజ్యా! నమో దేవతా చక్రవర్తీ! నమో విశ్వ సంవ్యాపితా యంచు భక్తుల్ సదా నిన్ను ధ్యానించి పూజింప, నవ్వారికిన్ కామితార్ధంబులన్  గూర్తు వంచున్ బుధుల్ చెప్పగావిందు; జ్ఞానాధ్వ మందున్ నినున్ ప్రీతి దర్శించి, యోగీంద్రులీ భూమిపై నైహిక భ్రాంతులై మ్రగ్గు మా బోంట్లకున్ నిన్ను చూపింప రూపింపగా నొక్క మూర్తిన్; గజాస్యంబు లంబోదరంబున్ మహా నాగ బంధంబు కల్పింప తత్తత్త్వ మాత్మన్ విచారింప.... నీ దీర్ఘ కర్ణంబు లశ్రాంతమున్ దీన విజ్ఞాపనల్ నెమ్మితో వించు తద్బాధలన్ బాప; నీ చిన్ని కన్నుల్ సదా సత్య సంశోధనా శీలముల్ గాగ; నోంకార దివ్య స్వరూపంబుగా నీదు తొండంబు భాసించు; త్యాగంబు సూచించు నీ భగ్న దంతంబు; నీ బొజ్జ ముల్లోకముల్ లోన భద్రంబుగా నుండె నంచున్ యెరింగింప, నీ నాగ బంధంబు తా నైకమత్యంబె సంఘంబుకున్ శక్తి యంచున్ నిరూపింప, నీదౌ మహాకాయమున్ మోయు నా మూశికం బాత్మ చైతన్య రూపంబు దెల్పున్ గదా, విఘ్న నాధా! "గ"కారంబు బుద్ధిన్ ప్రసాదింప, మోక్షంబు నిచ్చున్ "ణ" కారంబు; నీ వెంట నీ త్రోవలో వచ్చు భక్తాళి కిన్ మార్గ మేప్రొద్దు నిశ్కంటకంబౌ గతిన్ జూపు నీ యేన్గు రూపంబు! నీ తత్త్వ మీ రీతిగా దెల్సి, దేవా! మహత్ జ్ఞాను లేప్రొద్దు నీ కీర్తనల్ చేయగా; నల్ప చేతస్కుడన్ నిన్ను వాకృచ్చ నేనెంత వాడన్! దయా శీలివై బ్రోవరా! దేవ నీ తత్త్వమున్ చిత్త మందెంచ లేకుండ నజ్ఞాని నై బంధు మిత్రాది వర్గంబులన్ బిల్చి ఆడంబరం బొప్ప శ్రద్ధా విహీనుండనై, పూజలన్ చేయుచున్, భౌతికాహారముల్ నీకు నైవేద్యముల్ జేసి మాప్రీతిగా మేము విందారగింపంగ నూహించుచున్, సర్వదా నైహికంబుల్ వెసన్ వేడుచున్, మాయలో మ్రగ్గి మిధ్యా ప్రపంచంబె సత్యంబుగా దల్చు దుర్బుద్ధి చాలింక, దేహాభిమానంబు షడ్వర్గపున్ నిక్కు  మానన్ భవన్ మూర్తిపై నిల్చు బుద్ధిన్ ప్రసాదింపరా తండ్రి!  నిన్ నాదు చిత్తంబులోనన్ ప్రతిష్టింతు, నాత్మన్ నివేదింతు, సద్భక్తి నీ ధ్యానమున్ చేతు, సత్యమీవే యికన్ నాకు దిక్కంచు నీ పాద పద్మంబులన్ జేరితిన్, బుద్ధి సిద్ధి స్వరూపాధినాధా! భవత్సంతతై వర్ధిలున్ సౌఖ్యమానంద యోగమ్ములంచున్ బుధుల్ మున్ను వర్ణింపగా విందు, నా దారిలో జేరు భాగ్యంబు నర్ధింతు; దుర్వార సంసార తామిస్రమున్ బాపు విజ్ఞాన దీపంబు చేతంబులో దీపిలన్ జేయరా బ్రహ్మ తత్త్వాను సంధాయకా! దేవ, విఘ్నేశ! చిద్రూప! కారుణ్య మూర్తీ! భవచ్చింతనానంద సంజాత కౌతూహలంబొప్పగా వ్రాసి తీ దండకంబున్, భవత్పాద యుగ్మంబులన్ జేర్తు నో సచ్చితానంద రూపా! కృపన్ దీని స్వీకారమున్ జేసి సత్య స్వరూపంబు సంగ్రాహ్యమౌ చిత్త చైతన్యమున్ చేతనజ్యోతి వెల్గింపరా యంచు హస్తాబ్జముల్ మోడ్చి ప్రార్ధింతు నోనిత్య నైర్మల్య మూర్తీ! నమస్తే  నమస్తే నమస్తే నమః!

పాలకుర్తి రామమూర్తి

No comments: