గంగావతరణము
(2012 లో నేను వ్రాసిన శ్రీ సీతారామాయణము పద్య కావ్యము, బాలకాండ నుండి)
వేద మంత్రాలతో సంస్తుతింపగ ఋషులు
మంగళారతులిచ్చి దివిజభామలు గొలువ
అప్సరసలాడగా సురగణము పాడగా
కల్యాణమూర్తియై కదిలింది సురగంగ
సుడులుగా కెరటాలు పడిలేచి ఘూర్ణిల్ల
నురగలై తరగలై దిక్తతులు నిండగా
గలగలా నవ్వింది బిరబిరా పారింది
మందహాసమ్ముతో నర్తనలు చేసింది
యెదనహంకారమ్ము వక్రమార్గము పట్ట
భ్రాంతమౌ చిత్తమ్ము చిత్రగతి సాగంగ
మాత్సర్య ముప్పొంగ భీమరూపము దాల్చి
అట్టహాసమ్ముతో గర్జనలు చేసింది
అభయ ముద్రను వీడి శాంతమ్ము నెడబాసి
క్రౌర్యమ్ము మదినిండ రాక్షసత్వము బూని
చండాట్టహాసోరు ఝంఝానిలోద్ధూత
మేఘమై కదిలింది పరవళ్ళు త్రొక్కింది
ఉత్సాహముప్పొంగ ఉద్వేగమున లేచి
ఔద్ధత్యమును జూప ఆర్భాటమున సాగి
గర్వమ్ము తలకెక్క ఉగ్రమూర్తిగ మారి
ఆటోపమున నిల్చి తకధిమ్ములాడింది
మేఘ పంక్తుల పైన ఉరిమింది ఉరికింది
నగరాజి దాకింది నుగ్గుగా జేసింది
వృక్ష సంతతి నెల్ల పెకిలించి వేసింది
సూర్య చంద్రుల కాంతి నలతిగా చేసింది
ఆకాశమును మ్రింగి దిక్కులన్నిట నిండి
ప్రళయ భాంకృత బృహద్భీషణ ధ్వనులతో
భూనభోంతరమెల్ల వెరగంది జూడంగ
గమ్యంబు లేకుండ సాగింది భువిపైకి
ఉన్మాదియౌ గంగ ఉరవడిని యోర్వక
పశుపతీ శరణంచు ప్రార్థింపగా జగతి
భవహరుడు శివకరుడు స్మరహరుడు శంకరుడు
భక్తపాలకు డిచ్చె జగతి కభయమ్ము
భీమ రూపమ్ముతో భీషణ ధ్వనులతో
సురగంగ దిగురూపు జూచి శంకరుడు
చిద్విలాసమ్ముగా చిఱునవ్వుతో విసిరె
చిన్నిజట, అందులో ఒదిగిపోయెను గంగ!
పాలకుర్తి రామమూర్తి
ముఖ పుస్తక మిత్రులు ఒకరు
"శివకరుడు" విశ్లేషించండి అంటే...
శివుడు ఆనందమయుడు. నిష్కాముడై కైలాసశిఖరాన తపస్సు
చేస్తున్నాడు. అతనికి "ఆకలి" లేదు. తనకే కాదు.. తన చుట్టూ ఉన్న వాతావరణంలో
కూడా ఆకలి లేదు. ఆకలి అంటే... మనమనుకునే శారీరకమైనదే కాదు... కోరిక లేదా కామము ఏదైనా అది ఆకలే. ఆకలి లేక పోవడము
చేత సృష్టి అంతా స్తంభించి పోయింది. "భవము" అంటే పుట్టుక. ఆకలి ఉంటేనే భవము
సాధ్యపడుతుంది. భవాన్ని హరించాడు కాబట్టే తన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా సృష్టి ఆగిపోయి
అంతా "శివ" మయము అయింది. అతడూ "భవహరుడు" అయ్యాడు. అప్పుడు పార్వతీదేవి... అతనిని ప్రార్థించింది..
తపస్సును విడిచి లోకపాలనను చేపట్టమంది. దానికి మన్మధుడు సహాయకారి అయ్యాడు. అయితే శివుని
ఆగ్రహానికి అతడు భస్మమయ్యాడు. దానితో శివుడు "స్మరహరుడు" అయ్యాడు. అయితే
పార్వతీదేవి ప్రార్థనతో "శాంతించిన" ఈశ్వరుని పార్వతి "శంకరుని"గా
మార్చి తాను అన్నపూర్ణగా మారి కాశీకి తీసుకువచ్చిందని చెపుతారు. ఇదే వరస భవహరుడు...
శివకరుడు.. స్మరహరుడు శంకరునిగా మారడంజరిగింది. ఈ భావనతోనే ఆ వాక్యాలువ్రాయడం జరిగింది.
మీ సూచనలు మరేమయినా ఉంటే సంతోషంగా స్వీకరిస్తాను.
దీనికి అనుబందంగా...
"శివము" అంటే
ఆనందము. "శం" ఆంటే మంగళము. శంకరుడు మంగళాన్ని ఇచ్చేవాడు అలాగే శివకరుడు ఆనందాన్ని
ఇచ్చేవాడు. అయితే ఆనందం అంటే ఏమిటి? అనేది ప్రశ్న.
తైత్తిరీయోపనిషదత్ లో బ్రహ్మానందవల్లి అని ఉంది. దానిలో ఎనిమిదవ అనువాకంలో "సైసా౨౨నన్దస్య
మీమాగ్ం సా భవతి" (ఆనందాన్ని గురించిన విచారణ చేయబడింది). ఉత్తమ ఆశయములు,
దృఢమైన సంకల్పబలము, శారీరకంగా బలిష్ఠుడు,
నిరంతర ఆధ్యయనశీలి, యౌవన వంతుడు అయిన వ్యక్తులను
ఈ చర్చ చేయడానికి ఈ ఆధ్యాయంలో ఉపనిషత్ ఆహ్వానిస్తుంది. పైన ఉదహరించిన లక్షణాలు అన్నీ
కలిగిన వ్యక్తి ఒకడున్నాడు, అతడు ఈ పృథ్వీ మండలాన్ని మొత్తంగా
పాలిస్తున్నాడు. అన్ని రకాలయిన భోగభాగ్యాలు ఏ మూల నున్నా అవన్నీ అతని అధీనంలో ఉన్నాయి
అనుకుందాము. కష్టం అనేది అతని జీవితంలో లేదు. అప్పుడు అతనికి కలిగే "ఆనందం"
అంతా కలిపితే అది మనుష్యుల యొక్క ఒక్క ఆనందంతో సమానం అంటుంది, ఉపనిషత్. దీనికి వంద రెట్లు మనుష్య గంధర్వులకు ఒక ఆనందం; దానికి వంద రెట్లు దేవ గంధర్వులకు ఒక ఆనందం, దానికి వంద
రెట్లు పితురులకు ఒక ఆనందం; దానికి వంద రెట్లు అజానజులకు ఒక ఆనందం;
దానికి వంద రెట్లు కర్మ దేవతలకు ఒక ఆనందం; దీనికి
వంద రెట్లు ఇంద్రునికి ఒక ఆనందం; దీనికి వంద రెట్లు ఒక బృహస్పతికి
ఒక ఆనందం; దీనికి వంద రెట్లు ప్రజాపరికి ఒక ఆనందం; దీనికి వంద రెట్లు హిరణ్యగర్భునికి ఒక ఆనందంతో సమానమని చెపుతుంది, ఉపనిషత్. అయితే కామరహితుడైన బ్రహ్మ వేత్తకూ ఈ ఆనందం కలుగుతుంది, అంటుంది ఈ ఉపనిషత్.
హిరణ్య గర్భుడు, వ్యష్టి మరియు సమష్టి రూపుడు. ఇతడే జగద్వాపుడు. ఇతనినే సూత్రాత్మ అని కూడా
అంటాము. ఇక్కడ జాగ్రత్తగా అర్థంచేసుకుంటే మన అవగాహనలో ఉన్న ప్రాపంచిక ఆనందాలు అన్నీ
సమష్టి తత్త్వంలో ఒకభాగమే. ఈ సమష్టి తత్త్వమే శివుడు.
కామరహితంగా, ఉపాసనా మార్గంలో లేదా సాధనమార్గంలో పురోగమించే సాధకుడు ఒక్కొక్క మజిలీని దాటుకుంటూ
సమష్టి తత్త్వాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఆ బ్రహ్మానందాన్ని అనుభవైకవేద్యం చేసుకోగలుగుతాడు.
అయితే సాధకుని సాధనలో ముందుకు నడిపించే ఛోదక శక్తి సంకల్ప బలం. ఆధ్యాత్మిక ధర్మాన్ని
అనుసరించి సాధకుడు తన సాధనా బలిమికి తగిన రీతిగా ఆరోహణా దీప్తిని పొందుతాడు. ముందుకు
పోతాడు. అలా ముందుకు నడిచేందుకు సహకరించే శక్తియే... శివము. ఉదాహరణకు... కర్రకు మండే
శక్తి ఉంటుంది. మండుతుంది కాని అదే ఇనుమును మనమెంత వేడి చేసినా ద్రవరూపాన్ని పొందుతుందే
కాని మండదు. అది వాటి వాటి సహజ లక్షణాలు. అలాగే మానవునికి సాధనా పటిమతో ముందుకు సాగే
సహజ లక్షణము ఉంది. అలాగే "శివము" నకు ఆనందాన్ని ప్రసాదించే లక్షణము ఉంది.
No comments:
Post a Comment