Sunday, May 24, 2015

మహాభారతాన్ని ఎలా చూడాలి?
ప్రతి వ్యవస్థలో కొన్ని ఉన్నత లక్షణాలు మరికొన్ని లోపాలు ఉంటాయి. ఏ సిద్ధాంతమైనా సమకాలీన అవసరాల కనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. అందుకని అది సర్వకాలీనం కానవసరం లేదు. తత్కాలావసరాల కనుగుణంగా మార్పుచెందుతుంది. కాబట్టి ఏ సిద్ధాంతమైనా అన్ని కాలాలలో సమగ్రతను, పరిపూర్ణతను సంతరించు కుంటుందనుకోవడం అత్యాశయే. ఏ వ్యక్తీ అందరికీ ఆమోదయోగ్యుడు కాలేడు. అలాగే ఏ రచనలోనైనా కొంత మంచి ఉంటుంది.. చెడూ ఉండవచ్చు. ఇవి మనం చూసే దృష్టిని బట్టి ఉంటాయి.
          అయితే... ధర్మ ప్రబోధ లక్ష్యంగా చెప్పబడిన గ్రంథాలలో ఎక్కువగా ప్రతీకాత్మకమైన గాథలు ఉంటాయి. ఉదాహరణకు... గంగావతరణ, క్షీర సాగర మథనం, గజేంద్రమోక్షణ లాంటివి. వీటి లక్ష్యం వేరు. వీటిని భౌతిక దృష్టితో చూడలేము... అలా చూస్తే అర్థంకావు కూడా. మనకర్థం కాలేదని వాటిని తప్పుగా ప్రచారం చేయడం న్యాయం కాదు. అలాగని ఒక కాలాని కనుగుణమైన కొన్ని ఆచారాలను కొన్ని వందల సంవత్సరాల తదుపరి అలాగే నడిపించాలను కోవడం పొరపాటే అవుతుంది.
          వర్ణ వ్యవస్థలో ఆయుధం పట్టి జీవనాన్ని సాగించిన వారు క్షత్రియులుగా సూచింప బడ్డారు. దేశావసరాలు, దేశరక్షణల కొరకు ఒకనాడు అన్ని వర్ణాలవారూ ఆయుధాలను పట్టారు. వారి రాజ్యాన్ని కాపాడుకున్నారు. అయితే రాను రాను వర్ణ వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుల వల్ల అది కుల వ్యవస్థగా రూపాంతరం చెంది పుట్టుకతో క్షత్రియులైనవారే దేశరక్షణకు పూనుకోవడం జరిగింది. దాని వల్ల సమర్థత ఉన్నా అన్య వర్ణాలవారు దేశరక్షణకు  పూనుకోకపోవడం, అసమర్థులు ఇష్టమున్నా లేకపోయినా అదేవృత్తిలో ఉండడం వల్ల అన్య జాతీయుల, దేశీయుల దండయాత్రలలో దేశాన్ని కాపాడుకోవడం కష్టసాధ్యమైంది. (Ancient India by V.D. Mahajan)
          ఇది ఎలా ఉన్నా... ఏ కాలంలోని రచనలలోనైనా మంచి ఉంటే... అది సమ సమాజానికి పనికి వస్తుందనుకుంటే దానిని వాడుకోవడం ఉత్తమం. మహాభారతంలో ఈ కాలానికి అవసరంలేని కొన్ని సన్నివేశాలు ఉండొచ్చు. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ, బహుభార్యాత్వం, వేశ్యావృత్తి లాంటివి. అంత మాత్రాన అందులో ఉన్న కొన్ని మంచి అంశాలు కూడా పనికి రావనుకోవడం సమంజసం కాదు. వాటిని అధ్యయనం చేయవచ్చు. ముఖ్యంగా యాజమాన్య నిర్వహణ, ప్రజలు - పాలకుల మధ్య ఉండాల్సిన అనుబంధాలు, పన్నుల విధానం, అన్న దమ్ముల అనుబంధాలు లాంటివి అధ్యయనం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏ రంగంలోనైనా పరిస్థితులన్నీ అన్ని కాలాలలో ఒకే రకంగా ఉండవు. ఏ పరిస్థితిని బట్టి ఆ విధంగా వ్యవహరించ వలసి ఉంటుంది.. అది నిజం. కాని పాతను అధ్యయనం చేయడం వల్ల క్రొత్తకు మార్గం సుగమం అవుతుంది. పాత రచన ఎంత కాలం మార్గ దర్శన చేస్తుందనేది ఆ రచయిత దూరదృష్టిపై, సాధనా బలంపై ఆధారపడి ఉంటుంది. వేల సంవత్సరాల తదుపరి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని రచన చేసిన రచయిత ఋషిగా వ్యవహరించ బడతాడు. అందుకే వేదవ్యాసుడు ఋషిగా హారతు లందుకుంటున్నాడు. (కొందరు గౌరవించక పోయినా నష్టం లేదు)
          అలాగే యూరప్ అనుభవాలతో ప్రేరణ పొందిన మార్క్స్ తన మేనిఫెస్టోలో కొన్ని సూచనలూ చేశాడు. శాస్త్రీయంగా కమ్యునిజం వచ్చి తీరుతుందనీ, అది తప్ప మరో మార్గం, మోక్షం లేదని ఆయన అభిప్రాయ పడ్డాడు. నిజానికి ఒక మనిషికి త్రికాలజ్ఞత ఉంటేనే లేదా ఉందని నమ్మితేనే మార్క్స్ సిద్ధాంతాలను మనం నమ్మగలం. “సామాజిక చైతన్యం తప్ప మరొక రకపు చైతన్యం మానవులకు ఉండదు. చైతన్యం భాష ద్వారా ఆచరణలోకి వస్తుంది. చైతన్యం, భాష ఈ రెండూ ఇతరులతో ఉండే అవసరాల ద్వారా వస్తాయి. అవి ఉత్పత్తి సంబంధాలతోపాటు వికసిస్తాయి...” ఇలా సాగిపోయే మార్క్స్ చెప్పిన విషయాలను వివరంగా చర్చ చేయవచ్చు... కాని ఇదంతా సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి. అలాగని ఇదంతా చెత్త అందామా? అదీ తప్పే. మొత్తంగా స్వీకరించదగిందా అంటే కాదు. తన పరిధిలో తన అనుభవాల రాపిడిలో, తన హృదయ స్పందన ప్రతిస్ఫందనల కనుగుణంగా; వాటి ఆధారంగా ఈ మానవ సమాజం ఇలా ఉంటే అందరికీ భూతల స్వర్గంగా ఉంటుందని మార్క్స్ భావించాడు... ఆశించాడు. (మార్క్సిజం మేధావులకు మత్తు మందు-- పిరాట్ల వెంకటేశ్వర రావు)
          సాదనా బలంతో సాధించిన శక్తులను సరైన మార్గంలో వినియోగించుకోలేక ఎదురైన ప్రలోభాలకు తలొగ్గి ఎందరో మహానుభావులు భ్రష్ట యోగులుగా మిగిలి పోయారు. బహుశా మార్క్స్ కూడా ఆ యోగుల జాబితాలో ఒక భ్రష్ట యోగిగా మారాడేమో.
            భారత దేశంలో మహాభారతాని కున్న ఆదరణ మార్క్స్ వాదానికి లేకపోవడానికి కారణాలెన్నున్నా... వారి సాధనా బలం అత్యంత ముఖ్యమైనదని నా వరకు నేను  నమ్ముతున్నాను.
మహాభారతంపై వస్తున్న చర్చల నేపథ్యంలో ఆ గ్రంథంలో ఉన్న సామాజికాంశాలు ఈ నాటి సమాజానికి ఎంత వరకు పనికి వస్తాయి అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే మార్క్స్ సిద్ధాంతం. అత్యంత వేగంగా మారుతున్న  ప్రపంచ వ్యాపార సంబంధాలు, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మన జీవితాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏ జాతి చరిత్రలోనైనా ఆ సామాజిక, మానవాభ్యుదయానికి సూచింపబడిన సూచనలు సర్వజనీనం కావచ్చు లేదా కాకపోవచ్చు. ఆ జాతి సాంస్కృతిక నేపథ్యంలో వాటి ఆదరణ వెలుగు చూస్తుంది. LPG (లిబరలైజేషన్, ఫ్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) వల్ల ప్రపంచమంతా కూడా ఈ నాడు ఒక కుగ్రామంగా మారిపోతున్నది. నిన్నటి దాకా సత్ఫలితాలనిచ్చిన ఆలోచనలు, సిద్ధాంతాలే ఈ నాడు పనికిరానివవుతున్నాయి. ఉత్పత్తి, ఉత్పాదక రంగాలలో, ఉపాధి రంగాలలో వస్తున్న అనూహ్యమైన మార్పులు ప్రస్తుతమున్న అన్ని సిద్ధాంతాలను అధిగమించి క్రొత్త మార్గాలను చూడమంటున్నాయి.
ఈ నేపథ్యంలో మహాభారతంలోని సామాజిక, యాజమాన్య సంబంధితాంశాలను ఒకసారి పరిశీలించి ఈ కాలంలోని అవసరాలకు వాటిని ఎంత వరకు ప్రాతిపదికగా తీసుకోవచ్చునో ఆలోచిద్దాం. ముందే చెప్పుకున్నట్లుగా ఈ పద్ధతే సమగ్రమైనది, ఈ పద్ధతితోనే ఉత్తమ ఫలితాలు రాబట్టగలం అనుకోవడం పొరపాటే కాదు, అత్యాశా అవుతుంది.

మహాభారతం నాయకుడెలా ఉండాలని చెపుతుంది?
మహాభారతంలో రాజుగా చెప్పబడిన వాడిని ఇక్కడ మనం నాయకునిగా చెప్పుకుంటున్నాము. రాజ్యాన్ని ఒక సంస్థగా, ప్రజలు ఆ సంస్థ ఉద్యోగులుగా చెప్పుకుందాం. ఆ రాజ్య సామంతులు, ఆ రాజ్యంతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు, ఆ రాజ్యంతో వ్యాపార సంబంధాలు కలిగిన వారు ఆ సంస్థ వినియోగ దారులుగా చెపుకుందాం. అలాగే ఆ రాజ్యానికి శత్రువులు ఆ సంస్థకు పోటీదారులుగా చెప్పుకుందాం. ఈ క్రమంలో ఏ నాయకుడైనా నవ్యతా, నాణ్యతలను సంతరించుకుంటూ పోటీదారుల ఊహాలకందని విధంగా తన సంస్థను విజయపు టంచులపై నిలిపి, తనను నమ్మిన వారికి సంతోషాన్ని కలిగించాలి అంటే ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేయాలి. అసలు నాయకుడు ఎలా ఉండాలి. ఎలాంటి లక్షణాలను సంతరించుకోవాలి అనే అంశాలను మహాభారతం నేపథ్యంలో పరిశీలిద్దాం.
          నిజమైన నాయకుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించాలి. ఇక్కడ ఆదిలో ధర్మం అంతంలో మోక్షం చెప్పబడ్డాయి. ఈ రెంటి మధ్య అర్థ కామాలు ఉన్నాయి. అంటే "ధర్మ మార్గంలో అర్థ కామాలను సాధించి మోక్షమనే లక్ష్యాన్ని" చేరుకోవాలని ఈ క్రమం సూచిస్తుంది. అంతే కాదు ఏ కారణం చేతనైనా అర్థ కామాలు నష్ట పోవడం జరిగినా ధర్మానువర్తికి శ్రేయస్సు దూరం కాదు. అయితే దీనిని సాధించాలి అంటే ముందుగా నాయకుడు తన శత్రువులను గెలవాలి. శత్రువులను గెలవడం అంటే తన లక్ష్యం నుండి తన దారిని మళ్ళించే తన ఇంద్రియాలపై సంపూర్ణంగా నిగ్రహణ కలిగి యుండడం. తనపై తనకు నిగ్రహణ కలిగిన నాయకుడు పరులపై పట్టు సాధించ గలుగుతాడు. అందుకే తనను తాను ముందుగా జయించాలి. అలాంటి నాయకుడే శుభాలను పొందగలుగుతాడు.
          ఒక సంస్థ నాయకునికి ఆ సంస్థ ఉద్యోగులు శరీరము కాగా ఉద్యోగులకు నాయకుడు ఆత్మలాంటి వాడు. అందుకే ప్రజా సంరక్షణ రాజుకు, రాజును సమర్ధిస్తూ నిలపడం ప్రజలకు విధ్యుక్త ధర్మాలుగా చెపుతుంది మహాభారతం. అంతే కాదు, ఏ సంస్థలోని నాయకుని విజయంలో నైనా బ్రాహ్మ్యం, క్షాత్రం సమాన భాగస్వాములుగా నిలుస్తాయి. వ్యూహ రచన, సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, సరైన యోజనాసరళి, నిజాయతీతో కూడిన మంత్రాంగం, నిర్దుష్ట లక్ష్య నిర్దేశన లాంటి లక్షణాలను “బ్రాహ్మ్యం” గా చెప్పుకుంటాము. అలాగే ఉత్సాహం, సాహసం, ధైర్యం, శక్తిసామర్ధ్యాలు, పరాక్రమం (ప్రయత్నం), నైపుణ్యం లాంటి లక్షణాలను “క్షాత్రంగా” చెప్పుకుంటాం. ఎక్కడైతే బ్రాహ్మ్యం క్షాత్రం రెండూ సమంగా ఉద్యమిస్తాయో తప్పక అక్కడ విజయం ఉంటుంది.
          క్షాత్రానికి బ్రాహ్మ్యం మంత్రిగా ఉంటుంది. బ్రాహ్మ్యం... బ్రాహ్మణత్వానికి చిహ్నం. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన పురోహితుడు మంత్రాంగం చెపుతాడు. అతనికి ఉండాల్సిన లక్షణాలను కొన్నింటిని భారతం ఈ క్రింది విధంగా చెపుతుంది. అతడు....
౧) అధ్యయన అధ్యాపకాలలో నిష్ణాతుడై ఉండాలి
౨) దయ, న్యాయం కలగలిపి చక్కని తీర్పు చెప్పగలిగిన సునిశిత బుద్ధి, మేధస్సు కలిగి ఉండాలి.
౩) ఆరోగ్యవంతుడై, యువకుడై ఉండాలి
౪) చిత్తశుద్ధి కలిగిన వాడై ఉండాలి. ఎవరిలోనైతే చిత్త శుద్ధి లోపిస్తుందో అతడు నీచ స్థితికి దిగజారుతాడు.
(ఈ రోజు IAS లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల నుండి, చాలా కంపనీలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎన్నిక కాబడే అభ్యర్ధుల నుండి ఇలాంటి లక్షణాలనే ఆశించడం మనం చూడవచ్చు)
          ఇలాంటి ఉత్తమ లక్షణాలను సంతరించుకున్న వ్యక్తిని సలహాదారుగా లేదా మంత్రిగా కలిగిన నాయకుడు తన సంస్థను తప్పక విజయ పథంలో నడిపిస్తాడు. అంతే కాదు, నాయకుడు తన ఉద్యోగులను ఎప్పుడు శిక్షించాలో ఎలా శిక్షించాలో ఎప్పుడు అభినందించాలో ఎంతవరకు అభినందించాలో తెలిసి ప్రవర్తిస్తాడు. సరైన సలహాదారు ఇచ్చే సలహాలను పాటించే నాయకుడు... ప్రజలు(తన ఉద్యోగులు) మంచిని చేస్తే గుర్తిస్తాడు. అలాగే వారు చేసే తప్పులను పరిశీలిస్తాడు. భావోద్వేగాలకు దూరంగా, అరిషడ్వర్గాలను (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను) దరి చేరనీయకుండా జాగ్రత్త పడతాడు. లంచాలకూ, దొంగతనానికి ఏ నాడూ పాల్పడడు. ఆత్మస్తుతికీ పరనిందకూ దూరంగా ఉంటాడు. తాత్కాలిక ప్రయోజనాలకు కాక పదికాలాల పాటు నిలిచే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత నిస్తాడు. విధ్యుక్త ధర్మాలను నియమబద్ధంగా నిర్వహిస్తాడు. నిగర్వి, కుత్సితుడు కాని వాడు, పర స్త్రీ వ్యామోహం లేనివాడు, క్రోధం లేని వాడు (కోపం వేరు క్రోధం వేరు. కోపం తాత్కాలికంగా వెలువడే భావ స్పందన కాగా క్రోధం అంతరంగంలో జ్వలించే పగ ద్వేషంతో వెలువడే విషం) సామంతుల(వినియోగదారుల)  అవసరాలను తమ స్వార్థంకోసం వాడుకుంటూ పీడించే గుణం లేనివాడుగా ఉంటాడు. అలాంటి వారి నాయకత్వంలో ఉద్యోగులూ సుఖిస్తారు.
          ఒక రాజు ఉండేవాడు.. అతని వద్ద సమర్ధుడైన మంత్రి  ఒకడుండేవాడు. ప్రజలందరితో సఖ్యతగా ఉంటూ వారి అవసరాలకు స్ఫందిస్తూ వారికి తలలో నాలుకలా మెదిలే మంత్రి గారంటే ప్రజలందరికీ గౌరవం. అతని గౌరవ ప్రతిష్ఠలను చూసి రాజుగారే ఈర్ష్య పడేవాడు. ఒకనాడు మంత్రిని పిలిచి .. ఈనాటి నుండి ప్రజలను శిక్షించే బాధ్యత నీకప్పగిస్తున్నాను.. వారిని అభిందించడం సన్మానించడం నేను చూస్తానని చెప్పాడు. అందువల్ల జరగబోయే పరిణామాలను వివరించబోయే మంత్రిని వారిస్తూ “ఇది నా ఆజ్ఞ” ఎదురు చెప్పకుండా అమలు చేయండి అన్నాడు.
రాజుగారు దయాపూర్ణుడై కనిపించిన వారికందరికీ బహుమానాలు ఇవ్వడం ఆరంభించాడు. మొదట్లో అందరికీ ఈ పద్ధతి బాగానే ఉండేది. కాని రాను రాను వారికి ఇది మ్రింగుడు పడలేదు. పనిచేసినా చేయకపోయినా ప్రజలందరికీ ఒకేరకమైన గుర్తింపు. ఉచితానుచితాలు మరచి పేరుకోసమై అందరికీ సన్మానాలు చేయడంవల్ల ప్రజలలో పనిచేసే శ్రద్ధ తగ్గిపోయింది. విజ్ఞానులనూ అజ్ఞానులనూ ఒకే గాట కట్టడంతో ప్రాజ్ఞులకు గుర్తింపు లేకపోవడం వల్ల ప్రజలలో సోమరితనం ఆవహించి సృజనాత్మకత దెబ్బతిన్నది. తన స్థాయిని మరచి అందరితో అన్ని వేళలలో కలవకూడని ప్రదేశాలలో కలవడం వల్ల ప్రజలకు రాజుపై భయభక్తులు నశించి రాజును గౌరవించడం మానేసారు.
దీనికి ప్రతిగా మంత్రి ఎవరిని ఎంతవరకు శిక్షించాలో న్యాయబద్ధంగా శిక్షిస్తూ వచ్చాడు. దీనితో ప్రజలకు మంత్రిపై భయభక్తులతో కూడిన గౌరవం ఇనుమడించింది. కాలం గడిచే కొద్దీ రాజుకీ పరిస్థితి అర్థం అయింది. ఆలోచించాడు. మంత్రిని పిలిచి నేటి నుండి మన బాధ్యతలను మార్చుకుందాము. నేను శిక్షిస్తాను నీవు వారికి అభినందనలు సన్మానాలు అందించమని  చెప్పాడు. రాజాజ్ఞ కాబట్టి మంత్రి సరేనన్నాడు. రాజు గారు లోగా ఎలా ప్రజలను విచక్షణ లేకుండా గౌరవాభినందనలు అందించాడో అలాగే చిన్న చిన్న తప్పిదాలకూ వారిని శిక్షించడం ఆరంభించాడు. ప్రజలలో రాజుపై అసంతృప్తి ఆరంభమయింది. అది రాజుపై తిరుగుబాటు చేసేంత వరకు వెళ్ళింది. మంత్రి తన విచక్షణ ననుసరించి వర్తించడంతో ప్రజలు అతనికి గౌరవాదరణలు ఇవ్వడంతో పాటుగా రాజును తప్పించి ఆ స్థానం లో సమర్ధుడైన మంత్రిని కూర్చోబెట్టాలనే నిశ్చయానికి వచ్చారు.
గూఢాచారుల ద్వారా జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న మంత్రి, రాణీ సహాయంతో రాజు దగ్గర ఈ విషయాన్ని చర్చించాడు. రాజు కూడా పరిస్థితి తీవ్రతను గుర్తించి ఏ మార్గంలో వెళితే పరిస్థితిని అదుపు చేయవచ్చునో  సలహానిమ్మని మంత్రిని అడిగాడు. దానికి మంత్రి; పరిస్థితి చక్కదిద్దేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గూర్చి మరియు శిక్షలు సన్మానాలు ఎలా ఉండాలో ఈ విధంగా చెప్పాడు....
౧) నాయకుడు విచక్షణ లేకుండా శిక్షలు అమలు చేస్తే ప్రజలు భయభ్రాంతులౌతారు.
౨) నాయకుడు అందరి పట్ల దయాభావంతో ఎవరినీ శిక్షించకుండా వదిలేస్తే అతని పట్ల భయ భక్తులు పోతాయి
౩) నాయకుడు అవసరానికి మించి అభినందించినా, సన్మానాలు చేసినా ప్రజలకు అలుసై పోతాడు
౪) నాయకుడు ఎవరినీ ఏ విషయంలోనూ అభినందించకపోతే అతనిని ప్రజలు ఇష్టపడరు
౫) నాయకుడు ఎప్పటికి ఎవరికి ఎంత అవసరమో అంతగా అభినందించడమూ... శిక్షించడమూ చేస్తే.. అతనిని జనులు గౌరవిస్తారు.
౬) నాయకుడు తన భావోద్వేగాల పరిధిలో ఎవరిని శిక్షించినా అభినందించినా అది వారి కోపానికి కారణమౌతుంది
౭) నాయకుని శిక్షలు లేదా అభినందనలు వారిలో సమూలమైన మార్పులు తెచ్చేవిగా ఉంటే సమాజానికి మేలు చేస్తావి
          నాయకుడు, సమర్థులైన తన అనుచరులలో అర్హులైన వారిని గుర్తించి అయా రంగాలలో అర్హత ప్రాతిపదికగా వారికి బాధ్యతలను, అధికారాలను అప్పగించి, వారి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమీక్ష చేస్తూ అవసరానికి తగిన సూచనలతో వారి వెన్నంటి యుండి న్యాయ్యబద్ధంగా, శాస్త్ర సమ్మతంగా ప్రవర్తించడం వల్ల రాజ్య ప్రజలు సంతోషంగా ఉంటారు. సరైన సమయంలో అవసరమైన న్యాయబద్ధమైన శిక్షలు తమ తప్పును తెలుసుకునేందుకు ఉపకరిస్తాయి. సరైన సమయంలో అవసరమైన పొగడ్తలు ఉన్నతమైన శక్తి్సామర్ధ్యాలను ప్రదర్శించేందుకు ఉపకరిస్తాయి. ఇవే నాయకుడిని సమున్నత స్థానంలో నిలుపుతాయి.
ఈ సూచనలతో రాజు తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్నాడు. (Offerings-3 by Sri G. Narayana)
సంస్థలో నాయకుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మవద్దు. ఏ సంస్థలోనైనా నాయకుడు అన్ని విభాగాలను సరిగా పర్యవేక్షించాలి. కాబట్టి అందరినీ నమ్మినట్లుగానే ఉండాలి కాని అందరిపై ఒక కన్ను వేసి ఉంచాలి.
నమ్మమి మృత్యువు; పెద్దయు
నమ్ముట యపమృత్యువగుట; నరపతి నమ్మీ
నమ్మక పని గొనునది, ని
త్యమ్మును సూక్ష్మ మతి దాను నరయగ వలయున్!
 (భారతం - శాంతిపర్వం)
నిజానికి నాయకుడు ఎవరినీ నమ్మొద్దు. మరి ఎవరినీ నమ్మకపోతే అన్ని పనులను తాను చేసుకోలేడు. అలాగని నమ్మనట్లు కనిపించవద్దు. నమ్మీనమ్మని తీరుగా సూక్ష్మ బుద్ధితో ప్రవర్తిస్తూ ఉద్యోగులతో పనులు తీసుకోవాలి. తన చుట్టూ ఉండే అందరిపై (చివరకు తన సోదరులు మరియు సంతానంతో సహా) నిఘా పెట్టి రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
అంతేకాదు, రాజ్యాంగానికి ఉండే సప్తాంగాలను రక్షించుకోవడం నాయకుని కర్తవ్యం. స్వామ్యమాత్య జనపద కోశ సైన్య మిత్ర దుర్గములను సప్తాంగాలంటారు. (స్వామి -తాను; అమాత్య - మంత్రి మండలి; జనపద - ప్రజలు; కోశ - ధనాగారము; సైన్య - చతురంగ బలాలు; మిత్రులు - స్నేహితులు; దుర్గములు -కోటలు) తాను ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. తాను లేకపోతే ఇవి ఏవీ ఉపయుక్తంకావు. కాబట్టి తనను తాను ముందుగా రక్షించుకోవడం అవసరం. ఇక ప్రజలకు కావలసిన అన్ని అవసరాలు తీర్చేందుకు కావలసిన వ్యవస్థలను ఏర్పాటుచేయడం వాటిని సరిగా పనిచేయించడం లోటుపాటులను ఎప్పటి కప్పుడు సరి చేయడం తప్పని సరి. వాటిని పర్యవేక్షించేందుకు సమర్థులైన మంత్రి వర్గ సభ్యుల అవసరం ఉంటుంది. సరైన వారిని ఎన్నుకోవడం వారిని రక్షించుకోవడం నాయకుని విధి. (ఈ కాలంలో ఒక సంస్థను వీడి మరొక సంస్థలోకి నిపుణులు వలసపోవడం జరుగుతుంది. దానివల్ల ఒకవైపు శిక్షణ తీసుకున్న నిపుణుడైన ఉద్యోగి వెళ్ళిపోతాడు. రెండవ వైపు మరొక ఉద్యోగికి శిక్షణ నివ్వాల్సి ఉంటుంది) ఇక ప్రజల భాగస్వామ్యం సరిగా లేకపోతే ఏ నాయకుడూ సంస్థను నడపలేడు. అసంతృప్తులైన ప్రజల (ఉద్యోగుల) కోపానికి గురైన సంస్థ నాణ్యతకు, నవ్యతకు, సృజనాత్మతకు దూరమవుతుంది. దానితో సంస్థ ఉనికియే ప్రశ్నార్ధక మౌతుంది. సంస్థ లేకపోతే ఉద్యోగులకు ఉపాధి కరవవుతుంది. కాబట్టి రాజు (నాయకుడు)  ఉద్యోగులు (ప్రజలు) ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకుంటూ పరస్పరాధారిత పద్ధతిలో నడవడం వల్ల రాజ్యం (సంస్థ) సుభిక్షంగా ఉంటుంది. కోశ - ధనాగారము నిండుగా ఉన్నప్పుడే ఏ సంస్థయైనా, వ్యక్తియైనా ప్రగతిపథంలో పయనిస్తాడు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు (ఉద్యోగులకు) ప్రయోజనకారిగా చేయవచ్చు. సంస్థకు ఉద్యోగులకు మధ్య బంధాన్ని పెంచవచ్చు. సైన్యం పటుత్వంతో... అత్యాధునిక శిక్షణతో నైపుణ్యం పెంచుకున్నప్పుడే రాజ్యానికి (సంస్ఠకు) రక్షణ. అత్యాధునిక ఆయుధ సంపత్తితో, సమర్థవంతమైన యోధులతో పరిపుష్టమైన దండు ప్రజలకు భద్రతనిస్తుంది. చక్కని ఆత్మీయులైన మిత్రులు ఎంత ఎక్కువ మంది ఉంటే అన్ని సంబంధాలు పెరుగుతాయి. పెరిగిన సంబంధాలు మనల్ని ముందుకు తీసుకు వెళతాయి. చివరగా కోట గోడలు రక్షణ నిస్తాయి. అది రాజ్యానికైనా సంస్థకైనా.
ఏ సంస్థ యైనా అభివృద్ధి పథంలో నడవాలి అంటే నాయకుడు ముందు చూపుతో పటిష్టమైన చర్యలు చేపట్టాలి... అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. అందులో ముఖ్యంగా....
1) కోటగోడలు ఎప్పటి కప్పుడు బాగుచేయిస్తూ ఉండాలి. దాని వల్ల రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. దొంగతనాలు అరికట్టబడతాయి. ఒకే ద్వారం ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగుల, బయటి వ్యక్తుల రాకపోకలను నియంత్రించడం సులువవుతుంది.
2) గడ్డి, ఖాణము, కొల్పు, కట్టియలు, నేయి మరియు నూనెల యొక్క నిల్వలను సమృద్ధిగా ఉంచుకోవాలి.
          గడ్డి - పశుగ్రాసము. దాని ద్వారానే పాడి పంటల అభివృద్ధి కాబట్టి సంవత్సరం పొడుగునా అవసరమైన గడ్డిని నిల్వచేసుకోవడం ద్వారా పాడిపంటల పంపిణీకి ఆటంకం ఉండదు.
          ఖాణము - గుర్రాలకు పెట్టే ఉలవల లాంటివి... ఇప్పుడు వాటిని పెట్రోలియం ఉత్పత్తుల క్రింద చెప్పుకుంటే సరిపోతుంది. సరకు రవాణా, మనుషుల రవాణాకే కాక యుద్ధ సమయంలో ఉపకరించేందుకు ఒకప్పుడు గుర్రాలను ఎక్కువగా వినియోగించడం జరిగేది కాబట్టి ఆ గుర్రాలకు కావలసిన మేత ఉలవలు కాబట్టి వాటిని ఉదహరించినా నేటి యాంత్రిక యుగంలో పెట్రో ఉత్పత్తులను ఎక్కువగా సేకరించుకోవడం ఉపయుక్తమౌతుంది. కనీసం ఒక సంవత్సర కాలానికి సరిపోయే పెట్రో నిలువలు ఉన్న దేశంలో వాటి ధరలలో కనిపించే హెచ్చుతగ్గులు అంతగా ప్రభావాన్ని చూపవని ఆర్థిక శాస్త్రవేత్తలు చెపుతారు. 
          కొల్పు - మానవులు ఉపయోగించే వరిధాన్యం లాంటివి. దూరదృష్టితో వీటి నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉంచగలిగితే ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారు.
          కట్టియలు - మా చిన్నతనంలో ఎండాకాలంలో ఎండిన వంట చెరుకును సమీకరించి సంవత్సరమంతా ముఖ్యంగా వర్షాకాలంలో వాడుకునేందుకు ఉపయోగించేవారము. ఫాక్టరీలలో వాడే వంటచెరుకు కు ప్రత్యామ్నాయం గా ఈనాడు ఫ్యూయిల్ ను మనం వాడుతున్నాము. ధరలు తక్కువగా ఉన్న సమయంలో దానిని సేకరించి ఉంచుకోవడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాక ఉత్పత్తీ నిరాటంకంగా సాగిపోతుంది.
          నేయి నూనెలు - మనం ఉపయోగించే నూనె పదార్ధాల నిలవలు సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉంది.
3) కూపములు - బావులు, తటాకాలు (చెరువులు) -- జలాశయాలు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా నీటి ఎద్దడిని నివారించడం సాధ్యపడుతుంది. నీరు పుష్కళంగా ఉంటే పంటలు పండుతాయి. పరిశ్రమల స్థాపనకు వీలవుతుంది. పౌరుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.
4) ఔషధములు - ఆరోగ్యాన్ని కాపాడే మందులు. అవసరమైన ఔషధాలు నిరంతరం అందుబాటులో ఉండాలి. సేవాభావంతో పనిచేసే వైద్యులు, వారికి సహాయపడే సహాయక సిబ్బంది, వారికి అవసరమైన వనరులు నిరంతరం అందుబాటులో ఉంచాలి. క్షణాలపై రోగిని వైద్యాలయానికి తీసుకొని వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి అవసరమైన వనరులను అందించాలి.
5) ఆయుధములు: రక్షణలో ప్రముఖ భూమిక పోషించేవి ఆయుధాలు. మనమెంత ధైర్యసాహస వంతులమైనా శత్రువు చేతిలో ఆధునిక ఆయుధం ఉంటే ఓడిపోక తప్పదు. నాణ్యత, నవ్యతలు ప్రాతిపదికగా ఆయుధ సమ్పత్తిని పెంచుకుంటూ ఉపయోగంలో లేని లేదా కాలం చెల్లిన వాటి స్థానంలో ఆధునిక సామాగ్రిని సమకూర్చుకుంటూ, సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇప్పిస్తూ ఉండే నాయకుడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాడు.
6) ఆభీల యంత్రాలు - పెద్ద పెద్ద యంత్రాలు. ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి ఉంటుందో అక్కడే యంత్రాలు అవసరమౌతాయి. పెద్ద యంత్రాలు పారిశ్రామిక అభివృద్ధికి చిహ్నాలు. అవసరానికి మించిన సామర్ధ్యంతో పనిచేసే యంత్ర సామాగ్రిని, విడిభాగాలను అందుబాటులో ఉంచాలి. వాటిని ఉపయోగించే సిబ్బందికి తగిన శిక్షణ నిప్పించాలి. నియమిత కాలాలలో వాటికి మరమ్మత్తులు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాక అవసరానుగుణంగా ఆ యంత్రాలను ఆధునీకరించుకోవడం తప్పనిసరి.
ఈ వ్యవస్థల అన్నింటిలో మానవ వనరులు అత్యంత ప్రధానమైనవి. ఏ రంగంలో నిమామకాలు చేపట్టినా... మచ్చలేనట్టి వారు, ధైర్యం, శౌర్యం, సాహసం లాంటి గుణాలు కలిగిన వారిని, ప్రతిభావంతులను, ఆప్తులను నియమించుకోవడం ఉత్తమం.
          ఇలా అన్ని రంగాలను పరిపుష్టి చేయగలిగితే, ధీమంతులు, ప్రజ్ఞాపూర్ణులు, సమర్ధులైన అధికారులు, సలహాదారులు తమ తమ కర్తవ్యాలను చిత్తశుద్ధితో చేసుకుంటూ పోతారు... అప్పుడు... నాయకుడు లేదా రాజు అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది.


No comments: