Sunday, May 24, 2015

ఇదండీ వ్యర్థభారతం....
రంగనాయకమ్మ గారి "ఇదండీ మహాభారతం" పై మనసులో మాట
ఈ మధ్య కాలంలో రంగనాయకమ్మ గారు "ఇదండీ మహాభారతం" అని ఒక పుస్తకం వ్రాసారు. మహాభారతం అంతా కూడా "మొగ్గా పువ్వూలేని, కాయా పండూ లేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్ధాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, కౄరత్వాల, అబద్ధాల, కట్టు కథల, పుక్కిటి పురాణాల పుట్ట!" అంటారావిడ. ఆమె వ్రాతలు చదివాక, ఆమె సంస్కారం అర్థమయ్యాక ఆమెను రంగనాయకమ్మ అని సంబోధించడం కూడా ఇష్టం లేదు కాని నాకు నా తలిదండ్రులు, గురువులు, సమాజం నేర్పిన సంస్కారం చేత, ఆమె వయసులో పెద్దదవడం వల్ల, ఆమె ఒక స్త్రీ అవడం వల్ల ఆమెను సగౌరవంగా “రంగనాయకమ్మ గారు” అని సంబోధించడం జరుగుతుంది.
భారత దేశాన్ని, భారత దేశ సంస్కృతినీ, సాహిత్యాన్నీ విమర్శించడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.. ముఖ్యంగా వారికి వారే తాము మేథావులమని అనుకునే వారికి.
          జూలై 2014 నుండి అక్టోబర్ 2014 వరకు గల నాలుగు నెలల కాలంలో గంగూలీ గారి 4 సంపుటాలలో 4872 పేజీల పుస్తకాన్ని, 15 వాల్యూములు గలిగిన తిరుమల తిరుపతి వారి ప్రచురణను (దాదాపు 9000 పేజీలు), 7 సంపుటాలలో 3327 పేజీలలో ఉన్న పురిపండ అప్పలస్వామి వారి మహాభారతాన్ని సంపూర్ణంగా చదివి అర్థం చేసుకొని వివిధ కోణాలలో విశ్లేషించుకొని.... ఆమె, భారతం అంతా కూడా "మొగ్గా పువ్వూలేని, కాయా పండూ లేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్ధాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, కౄరత్వాల, అబద్ధాల, కట్టు కథల, పుక్కిటి పురాణాల పుట్ట!" అని నిర్ధారించుకొని ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది. నాలుగు నెలల కాలంలో దాదాపు 17000 పేజీలు విశ్లేషణాత్మకంగా చదివి నోట్సు వ్రాసుకొని దాదాపు 488 పేజీల పుస్తకాన్ని తయారు చేసుకోవడం కోసం ఆమె ఎంత శ్రమ పడ్డారో... తన రచనను ఎంత నాణ్యంగా తీర్చి దిద్దారో”  తెలుస్తుంది... ఇంత చేస్తే అదంతా వ్యర్ధ భారతం గూర్చే. ఆమె వ్యాసునికి ఇచ్చిన సలహా ప్రకారం ఈ సమయాన్ని శ్రమను మరేదైనా పనిలో వ్యయించి ఉంటే ఆమెకే కాదు సమాజానికీ ఉపయుక్తంగా ఉండేది.
ఎందుకంటే... ఇలాంటి సూడో మేథావులు ఎన్ని పుస్తకాలు వ్రాసినా చదివే వారు చదవకా మానరు. ఎవరు విమర్శించినా, మెచ్చుకున్నా మహా భారతం మారదు. అందులో ఉన్నది వ్యర్ధం అనుకుంటూ విమర్శించడం కన్నా అందులో ఉన్న దానిలో ఏ మాత్రం మంచి ఉన్నా దానిని గ్రహించి మన జీవితంతో సమన్వయం చేసుకోవడం సకారాత్మక జీవనమౌతుంది.
కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాయబడ్డ ఒక పురాణ గాథను విమర్శ చేయడం అవసరమా కాదా అనేది కాదు ప్రశ్న. ఎందుకంటే... రామాయణ, భారత, భాగవతాదులు ఈ దేశ సంస్కృతిలో, చరిత్రలో అంతర్భాగాలు. వాటిని ఎవరో మెచ్చుకుంటే వాటి విలువ పెరుగదు... చెడుగా చూపినంత మాత్రాన వాటి విలువ తరగదు.. ఈమె వాటిని విమర్శ చేసిన మొదటి వ్యక్తి కాదు... చివరి వ్యక్తీ కాబోదు. కాబట్టి ఆమె విమర్శపై స్పందించ వలసిన అవసరం నిజానికి లేదు. కాని ఆమె లేవనెత్తిన కొన్ని విషయాలపై సామాన్య జనాలకు (ఆమె సూచించిన విధంగా) నకారాత్మక సందేహాలు మిగిలి పోవద్దనే దృష్టితో వ్రాస్తున్న విషయం ఇది. అంతేకాదు....   
తివిరి యిసుమున తైలంబు తీయ వచ్చు
తగిలి మృగతృష్ణలో నీరు త్రాగ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు
   చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు!          అన్నారు.
          రంధ్రాన్వేషణా చిత్తము కలిగిన వారు అన్నింటిలో చెడునే చూస్తారు. అంతేకాదు... అలాంటి వారు ఆ మార్గంలోనే తమకొక ఉన్నత స్థానం లభిస్తుందనే నమ్మకంతో, నిద్రను నటించే వారే కాని యదార్ధాన్ని గుర్తించే వారెన్నడూ కాలేరు. ఆ యా రచనలలోని మంచిని వివరించి చెప్పినా లేదా వారి రచనలలోని డొల్లను ఎత్తి చూపినా వారు మారేందుకు ఇష్ట పడరు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనే తత్త్వం కలవారికి ఏమి చెప్పినా వ్యర్థమే అయినా అవసరం అయిన వారికి ఉపయుక్త మౌతుందనే ఉద్దేశ్యంతో వ్రాస్తున్న అక్షరాలివి.
భావ రాగ తాళ యుతం ఇతి భారతం అన్నారు. ఆర్ఖియాలజీ డిపార్ట్ మెంట్ వారి నివేదికల ప్రకారం భారత దేశ సంస్కృతి, చరిత్ర క్రీ.పూ. 8275 నుండి అవిచ్ఛిన్నంగా ఈనాటికీ కొనసాగుతున్నది. అంటే దాదాపు  10000 సంవత్సరాల పైచిలుకు సంస్కృతి కలిగిన భారత దేశ చరిత్రలో ఈ మేధావులకు చెడు తప్ప మంచి కనిపించదు. ఎందరు విదేశీయులు ఎన్ని దండయాత్రలు చేసి ఎంత సాహిత్యాన్ని ధ్వంసం చేసినా ఈ దేశ సంస్కృతిని నాశనం చేయలేక పోయారు. కాకపోతే ఆ బాధ్యతను ఈ నాడు మన సూడో మేథావులే నెత్తి కెత్తుకొని ప్రయత్నిస్తున్నారు. పరాయి దేశాల సంస్కృతీ ప్రాభవాన్ని పొగుడుకుంటూ, పరాయి దేశాల వారికి మేధో బానిసత్వంతో జీవించడం వల్ల వారి జీవితాలు సార్ధకం అవుతాయేమో.
ఇక విషయానికి వస్తే... ఆమె విమర్శలలో భారత దేశ విజ్ఞానంలో శాస్త్రీయ దృష్టి లేదని చేసిన విమర్శ ముఖ్యమైనది. ఆ విమర్శ భావదాస్య మానసిక వైఖరి వల్ల పెంచుకున్న ఒక అంధ విశ్వాసం మాత్రమే  అనేందుకు ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. ఒకప్పుడు భారత దేశ విజ్ఞానం ప్రపంచం నలుమూలలా ఆదరించబడింది. శాస్త్రం, ఆప్త వాక్యం, ప్రత్యక్షం, అనుమానం అనే నాలుగు ప్రమాణాలు నాలుగు స్తంభాలుగా మీమాంసాదుల చేత సంస్కరించబడి తర్క బద్ధంగా నిరూపింపబడింది భారతీయ విజ్ఞానం. మనవారు తాము తెలుసుకున్న ప్రతి విషయాన్నీ చక్కగా వివరించడమే కాక వాటిని పుస్తకస్తం చేసారు కూడా. ఆ పుస్తకాలూ ఈ నాడు లభ్యమౌతున్నాయి కూడా. అర్థం చేసుకునే విధానం తెలియడం, అర్థంచేసుకునే కోణాన్ని ఆవిష్కరించు కోవడం ముఖ్యమైనది. మాథమెటిక్స్, ఆస్ట్రానమీ, మెటలర్జీ, హెల్త్ సైన్స్, మేనేజ్ మెంట్ సైన్స్ లాంటి శాస్త్రాలలో అపారమైన విజ్ఞానాన్ని సాధించింది ప్రాచీన భారతదేశం. అంత మాత్రాన ఈ నాడు మనం చూస్తున్న సైన్స్ అంతా లేదా విజ్ఞానం అంతా మన వేదాలలోనో సాహిత్యంలోనో ఉన్నాయనుకోవడం భ్రమ మాత్రమే. అలాగే ఏమీ లేవనుకోవడమూ తప్పే.
జర్మనీ దేశం 2002 సంవత్సరంలో దాదాపు 2850 భారత దేశ వస్తువులకు సంబంధించిన విజ్ఞానంపై పేటెంట్ హక్కులను తీసుకుంది. దాదాపు 4850 భారత దేశ వస్తువులకు సంబంధించిన  విజ్ఞానంపై అమెరికా మరియు అంతే మెత్తంపై బ్రిటిష్ దేశాలు పేటెంట్ హక్కులను తీసుకున్నాయి. మరొక్క విషయం ఏమిటంటే... క్రీ.పూ. 540 సంవత్సరంలో పైతాఘరస్  సూత్రీకరించిన సిద్ధాంతానికి ఎన్నో సంవత్సరాల ముందు క్రీ. పూ. 800 సంవత్సరంలో బోధాయణుడు అదే సిద్ధాంతాన్ని సూత్రీకరించడం... ఈ మధ్య కాలంలో ఆ సిద్ధాంతానికి “బోధాయనా పైతాఘరస్” సిద్ధాంతం అంటూ పేరు మార్చడం జరిగింది.
లగధుడు, ఆర్యభట్ట-1, వరాహమిశ్రుడు, భాస్కరాచార్య-1, బ్రహ్మ గుప్త, ఆర్యభట్ట-2, భాస్కరాచార్య-2, పరమేశ్వర లాంటి భారతీయ శాస్త్రజ్ఞులు ఖగోళ శాస్త్రానికి చేసిన సేవ అనంతమైనది, అమూల్యమైనది.
          క్రీ.పూ. 2500 సంవత్సరాలకు పూర్వమే రాగి గనులను కనుగొన్న ఘనత భారతీయులది. అంతే కాదు... క్రీ.పూ. నాలుగవ శతాబ్దంలో పురుశోత్తమునితో సంధి చేసుకున్న అలగ్జాండర్ కు పురుశోత్తముడు బహూకరించిన “ఉక్కు” ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. క్రీ.శ. 370-375 సంవత్సరాలలో ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో తయారు చేయబడిన ఉక్కు స్తంభము ప్రపంచంలో ఈ నాటికీ ఉత్తమ మైనదిగా ప్రఖ్యాతి చెందింది. (తదుపరి క్రీ.శ. 1050 లో దానిని డిల్లీకి పంపడం జరిగింది.)
          ఆమె భగవద్గీతలో "నీ కర్మ, నీ రాత, నీ విధి" అనే మాటలు తప్ప ఏమీ లేవని వ్రాసారు. భగవద్గీతను ఎన్నో జాతీయ అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు తమ మేనేజ్ మెంట్ కోర్సులలో పాఠ్యాంశాలుగా చేర్చడం జరిగింది. పాశ్చాత్య యాజమాన్య రీతులు రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండడం వల్ల ఉన్నత స్థాయి యాజమాన్యంలో పెరుగుతున్న ఒత్తిడి వారి నిర్వహణా సామర్ధ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. 1997లో జరిపిన ఒక సర్వే ప్రకారం... ఉన్నత ఫలితాల నందిస్తున్న 500 కంపనీల సగటు జీవిత కాలం 40-50 సంవత్సరాలుగా గుర్తించ బడింది.  1970 లో ఉన్నత ఫలితాల నందిస్తున్నకంపనీలుగా నమోదు కాబడిన 500 కంపనీలలో 1/3 కంపనీలు 1983 లోపు మూతబడడం జరిగింది. అంతేకాదు, ఉన్నత లక్ష్యాలతో ఆరంభించ బడిన కంపనీలలో దాదాపు 40% కంపనీలు 10 సంవత్సరాలలోపు మూతబడడం జరిగింది. దీనికి బిన్నంగా ప్రాసెస్ ఓరియంటెడ్ యాజమాన్య విధానాన్ని సూచిస్తున్న భగవద్గీత (కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన) ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
          ఆమె లేవ నెత్తిన ముఖ్యమైన మరొక అంశం... సతీ సహ గమనాలు: రామాయణంలో దశరధుడు చనిపోయాక ఆయన భార్యలు సహగమనం చేసినట్లు లేదు. అలాగే పాండురాజు చనిపోయాక కుంతి చేయలేదు. జరాసంధుడు చనిపోయాక వాని భార్య/భార్యలు సహగమనం చేసినట్లుగా కూడా లేదు. కీచకుడు , ద్రోణుడు, కర్ణుడు చనిపోయాక వారి భార్యలు సహగమనం చేసిన ఛాయలు కనిపించవు. కొందరు సహగమనం చేసినట్టు భారతంలో ఉంది. బలవంతంగా చావడం / చంపబడడం రెండూ తప్పే. తరువాతి కాలంలో ఆ ఆచారం పెడత్రోవ త్రొక్కి బలవంతంగా చితిపై వేసి కాల్చే విధానంగా రూపు దాల్చింది. ఆ ఆచారాన్ని సమర్ధించలేము.
ఆమె లేవ నెత్తిన ముఖ్యమైన మరొక అంశం... వర్ణ వ్యవస్థ / కుల వ్యవస్థ: ఒక నాటి సమాజంలో వ్యక్తుల మధ్య Divisiom of Labour (చేసే వృత్తులను బట్టి విభాగాలు) ఉండేది. మనువు చెప్పిన "వర్ణ" అనే పదానికి చెప్పిన తప్పుడు అర్థం వల్ల గందరగోళం అధికం అయింది. వర్ణ అనే పదాన్ని అనువదించేప్పుడు తరగతి లేదా అంతరం లేక దానికి సరిపోయే మరేదయినా పదాన్ని తీసుకోవాలి. మనువు వర్ణ మరియు జాతిల మధ్య అంతరాన్ని గుర్తించాడు. అతని కాలంలో అతడు 50 కులాలను (వృత్తి రీత్యా) గుర్తించినా నాలుగు వర్ణాలను మాత్రమే చెప్పాడు. ("బ్రాహ్మణ క్షత్రియోవైశ్యస్త్రయో వర్ణా ద్విజాతయః చతుర్ధ ఏక జాతిస్తు శూద్రో నాస్తితు పంచమః! అంటాడు మనువు)
          "చాతుర్వర్ణ్యాం మయా సృష్ట్యం గుణ కర్మ విభాగిషః" అంటుంది భగవద్గీత. చేసే పనిని బట్టి వ్యక్తులను విభాగించారని గీతోక్తి. "ఏక వర్ణ మిదం పూర్వం విశ్వ మాసీద్యుధిష్ఠరః కర్మ క్రియా విశేషేణ చాతుర్వర్ణ్యం ప్రతిష్ఠితం! అంటుంది మహాభారతం (అనుశాసనిక పర్వం)
          ఒకనాటి సమాజంలో వ్యక్తుల మధ్య వర్ణ విభేదా లుండేవే కాని సహ పంక్తి భోజనాలు వివాహ బంధాలు నిషేధింప బడలేదు. ఉదంకోపాఖ్యానంలో..  క్షత్రియుడైన పౌష్యుని ఇంట శూద్రుడైన వంటవాడు వండగా బ్రాహ్మణుడైన ఉదంకుడు భుజించాడు. అస్పృశ్యురాలయిన అరుంధతిని బ్రాహ్మణుడైన వసిష్టుడు వివాహ మాడాడు... క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. అంతే కాదు... "శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చేతి శూద్రతాం" అచార వ్యవహారాలను బట్టి ఒక బ్రాహ్మణుడు శూద్రుడు కావచ్చు... శూద్రుడూ బ్రాహ్మణుడు కావచ్చు.
          ఇలా ఆరంభంలో వ్యక్తుల మధ్య గుణ కర్మలను బట్టి విభేదాలు గుర్తింపబడినా.. రాను రాను అవి పుట్టుకతో అనుసంధానింపబడడం ఆరంభమయింది. వర్ణాలు కులాలుగా రూపుదిద్దుకొని వక్రగతులలో ఆవిష్కృతమై ఈ నాడు నాలుగు లేదా ఐదు వేల కులాలుగా మారిపోయి రాజకీయ పడగల నీడలో విషం కక్కడం దురదృష్ట పరిణామం. రాచరిక వ్యవస్థ బాధ్యతగా కాక అధికార లాలసతను ఆదరించడం అనే దురదృష్టకర పరిణామ ఛాయలు భారత కాలం నాటికే కనిపించడం ఆరంభమయింది. నిజానికి... "దూషకశ్చ, క్రియా శూన్యః, నికృష్టో దీర్ఘకోపినః చత్వారః కర్మ చండాలః జాతి చండాల ఉత్తమం" అన్నారు. (అందరూ ఆదరించే దానిలో నైనా ఏదో ఒక రంధ్రాన్వేషణ చేస్తూ పరుల ప్రతి క్రియను దూషిస్తూ ఉండేవారు, ఏ పనీ చేయని సోమరిపోతులు, అధమాధమమైన ఆలోచనలతో కాలాన్ని గడిపేవారు, ప్రతిదాన్నీ, ప్రతి వారినీ ద్వేషించే వారు... ఈ నాలుగు రకాల వారిని చండాలురుగా చెపుతూ... జాతి తో చండాలురు వీరికన్నా ఉత్తములు అంటారు)
          ఆమెలో కనిపించే బ్రాహ్మణ ద్వేషం అపారం: వ్యక్తుల ప్రవర్తన ఆ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. బ్రాహ్మణులైనంత మాత్రాన వారు మంచి చేసినా ద్వేషించాలా? ప్రతి వ్యక్తిలో నాలుగు రకాలయిన వ్యక్తిత్వాలు ఆవిష్కృతమౌతాయి. ప్రతి వ్యక్తీ మొదటగా కూడూ, గుడ్డ, నీడలకై పరితపిస్తాడు. వాటిని సంపాదించాక రేపటి గూర్చి ఆలోచిస్తాడు. తన సంపదను వృద్ఢి చేసుకునే మార్గాలు అన్వేషిస్తాడు. అలా ప్రోగైన ధనాన్ని రక్షించుకునేందుకై అధికారాన్ని ఆశ్రయిస్తాడు లేదా అధికారాన్ని చేపడతాడు. కొంత కాలం తరువాత అన్నీ తనకు అసంతృప్తినే మిగిలిస్తాయి. దానితో అన్నింటినీ త్యజించి అన్నింటికీ దూరంగా శాంతిని,  ఆనందాన్ని వెదుక్కుంటూ, వెళ్ళిపోతాడు. ఈ నాలుగు రకాల మానసిక స్థితులలో మొదటి స్థితి శూద్ర స్థితి, రెండవది వైశ్య స్థితి, మూడవది క్షత్రియ స్థితి, నాలుగవది బ్రాహ్మణ స్థితి. వ్యవసాయాదులు చేస్తూ శ్రమించే వారు మొదటి తరగతి వారే శూద్రులు. వ్యాపారంచేసి డబ్బు గడించే వారు రెండవ తరగతి వారే వైశ్యులు. రక్షణ వ్యవస్థను పరిరక్షిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించే వారు మూడవ తరగతి వారే క్షత్రియులు. అధ్యయన అధ్యాపకత్వాలను నిర్వహిస్తూ, క్రొత్తను ఆవిష్కరిస్తూ, విజ్ఞానాన్ని సృష్టిస్తూ, పరిరక్షిస్తూ, ప్రచారం చేస్తూ ఉండే వారు నాలుగవ తరగతి వారే బ్రాహ్మణులు. పై విభాగాలన్నీ జన్మతః కాక చేసే వృత్తిని బట్టి విభాగించ బడినవే.
          అంతేకాదు, సంపద సృష్టింపబడాలి అంటే... వస్తు ఉత్పత్తి కావాలి. ఆర్ధిక శాస్త్రవేత్తలు వస్తు ఉత్పత్తికి ముఖ్యమైనవిగా నాలుగు అవసరాలను చెపుతారు. అవి 1) Land 2) Labour 3) Capital 4) Oraganisation.  Land కు అధినేత క్షత్రియుడు, Labour కు అధినేత శ్రామికుడు లేదా శూద్రుడు 3) Capital కు అధినేత వైశ్యుడు 4) Oraganisation కు అధినేత నిర్మాణ నేత లేదా వ్యవస్థను నిర్మాణం చేసే వాడు అతడే బ్రాహ్మణుడు.
          ఒకరిపై ఒకరు ఆధారపడిన ఈ పరస్పరాధారిత వ్యవస్థ సంఘంలో విడదీయరానిది. మధ్య ప్రాచ్య యుగంలో అహంకారాశ్రితులైన అగ్రకులాల అభిజాత్యం వల్ల భ్రష్టుపడడం, ఆంగ్లేయుల పాలనలో రెచ్చగొట్ట బడడం... ఈ నాటి రాజకీయ విష సర్పం పడగలో వృద్ధిపొందడం జరుగుతుంది.
          శాపాలను వరాలను కూడా ఆమె ప్రస్తావించారు: మన అంతశ్చేతనలో ఇతరుల పట్ల ఉండే ప్రేమ అనే ఒక పార్శ్వాన్ని దూరం చేసి పరుషంగా మాట్లాడడం శాపం కాగా  ఆప్యాయతానురాగాలను పంచడం వరం ఇవ్వడం. మాటలే కదా అనుకోవడం మాటల ప్రభావాన్ని తెలుసుకోకపోవడమే. జపాన్ కు చెందిన డా!! మసారు ఎమోటో మానవుల ఆలోచనలు, మాటలు మరియు భావనల యొక్క ప్రభావాన్ని గుర్చి పరిశోధించాడు. వరసగా మూడు బీకరులలో ఒకే విధమైన నీటి నుంచి ఆ మూడింటికి మూడు రకాలయిన సూచనలు నెలరోజులు ఇచ్చాడు. ఆ పరిశోధనలలో... మొదటి బీకరులోని నీటిపై ప్రేమ చూపుతూ, ఆ నీటిని పొగుడుతూ ఉన్నాడు. రెండవ దానిని తిట్టడం చేసాడు కాగా మూడవ దానిని అసలు పట్టించుకోలేదు. నెల రోజుల తరువాత చూస్తే మొదటి బీకర్ లోని నీరు చక్కని తెల్లని క్రిస్టల్స్ గా రూపు దిద్దుకుంది. రెండవ దానిలోని నీరు ఊదారంగులో అడ్డదిడ్డంగా రూపుదిద్దుకుంది... ఇక మూడవ దానిలోని నీరు చెడు వాసనతో నల్లని రూపంతో ఉండిపోయింది.  
          మరొక ఉదాహరణ చూస్తే కుక్కలకు శిక్షణ నిచ్చే వ్యక్తి చెప్పిన మాటలను ఎంత భయంకరమైన కుక్క అయినా వింటుంది, ఆ సూచనలను పాటిస్తుంది. కాని అదే కుక్క తన యజమాని సూచనలను ఏ మాత్రం లక్ష్యపెట్టదు. కారణం కుక్కకు సూచనలను పంపే విధానం.. పంపే గొంతు, అక్షరాలను పలికే అంతరాలు, స్థిరత్వం లాంటివి.
          దీనిని బట్టి చూస్తే మాటల ప్రభావం ఏమిటో, ఆలోచనలు ఏ విధంగా పనిచేస్తయో, ప్రేమ లేదా ద్వేషాదుల వల్ల ఎలాంటి పరిణామాలుంటాయో తెలుస్తుంది. అంతెందుకు... అధికారంలో ఉన్న బాధ్యత గలిగిన వ్యక్తి ఇచ్చిన సూచనలు లేదా ఆదేశాలను క్రిందివారు ఎందుకు పాటిస్తారు? అది ఆ అధికారాన్ని పొందేందుకు ఆ వ్యక్తి చేసిన సాధన వల్ల. ఆ ఆదేశం లేదా సూచన మంచిదా చెడ్డదా అనేది దానికి అవసరం లేదు.
          ఆమె మరొక విమర్శ అన్నీ రాజులకు బ్రాహ్మణులకే గాని సామాన్య జనులకు ఉండవా అని; అవును అది సత్యం. భారత దేశానికి స్వతంత్రం రావడానికి వెనుక ఎందరో నాయకులు ఉన్నారు. ఆ నాయకుల వెనుక ఎందరో అనుచరులు ఉన్నారు. గాంధీ గారి లాంటి ముఖ్య నాయకులను తప్ప ఎంతమంది దేశంకోసం ప్రాణాలను కూడా త్యాగం చేసిన కార్యకర్తలను గూర్చి రచయితలు వ్రాస్తున్నారు. (కనీసం ఈ రచయిత యైనా వ్రాసిందా) అంతేకాదు, భారత రాజ్యాంగ నిర్మాత డా!! అంబేడ్కర్ గారి నేతృత్వంలో ఎందరో రాజ్యాంగ నిష్ణాతులు చేసిన కృషి ఫలితమే మన రాజ్యాంగం. తెర వెనుక పని చేసిన వారూ ఎక్కువే. అయితే వారెవరి పేర్లూ మనకు తెలియవు. తెలుసుకునే ప్రయత్నం చేసిన వారెందరు? అంతెందుకు రంగనాయకమ్మ గారు వ్రాసిన పుస్తకం ప్రచురణ అయింది కదా అందులో రఘురామయ్య, శారద గారలకు తప్ప ఎవరికి కృతజ్ఞతలు చెప్పారావిడ.
          అందుకే మంచి యైనా చెడ్డ యైనా ముఖ్యపాత్రలకే ఉంటుంది.
          దూరదృష్టి గురించి విమర్శ చేసారామె: అంతర్మనస్సు శక్తిని గూర్చిన అవగాహన ఉంటే తప్ప దూరదృష్టిని గూర్చి అర్థం చేసుకోలేము. నిజమైన ఆర్తితో అంతర్మనస్సుకు నివేదించుకుంటే అది మనకు కావలసిన విషయాన్ని ఎక్కడ ఉన్నా అందిస్తుందని మానసిక శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. ఆ శాస్త్రజ్ఞులు అవివేకులనుకుంటే వారి మాటలను గాలి మాటలనుకుంటే చెప్పగలిగింది ఏమీ లేదు. రష్యావారు ప్రచురించిన "101 స్టోరీస్ అబౌట్ కెమిస్ట్రీ" అనే పుస్తకంలో ఒక కథ ఉంది. అందులో "కెకులే" అనే శాస్త్రజ్ఞుడు "బెంజిన్" కు రూపం (Structure) ఇవ్వాలనుకున్నాడు. కాని అతనెంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాగా ఆలోచిస్తూ అలా పడుకున్నాడట. వెంటనే అతని ముందు ఒక పాము తన తోకను తన నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ తిరుగుతున్న వైనం కనిపించిందట. వెంటనే లేచి హెక్సాగన్ రూపంలో ఆరు బాండ్లను, లోపల మూడు బాండ్లను వేసాడట. ఒకనాడు ఋషులు యోగ సాధన ద్వారా ఈ శక్తిని పొందారు. సాధన చేస్తే ఎవరైనా ఈ శక్తులను పొందవచ్చని యోగ శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. సిక్త్ సెన్స్ పేరిట వస్తున్న కథనాలను ఈనాటి శాస్త్రజ్ఞులు పూర్తిగా కొట్టివేయడంలేదు కూడా. ఈ విషయం చెపితే కొట్టిపారేయడమే కాక ఎద్దేవా చేస్తారు. రష్యా వారో చైనా వారో చెపితే మాత్రం అవునని గంటాపథంగా చెపుతారు.
ఇది భారత దేశ విజ్ఞాన వారసత్వాన్ని విషదీకరించే పుస్తకం కాదు కాబట్టి ఎక్కువ విషయాలను ప్రస్తావించడం లేదు.
          మరొక విమర్శ... వర్ణనలు ఎక్కువగా ఉన్నాయని; సాహిత్యానికీ, సైన్స్ కు మధ్య భేదాన్ని అర్థం చేసుకోలేని వారు మాట్లాడే మాటలివి. రెండు పాళ్ళు  హైడ్రోజన్ ఒక పాలు ఆక్సిజన్ కలిస్తే నీరు తయారవుతుంది. ఇది సైన్స్. తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, అత్యధిక నాణ్యతా ప్రమాణాలతో వస్తువును తయారు చేయడానికి అవసరమైన విధానాన్ని సూచించేది సాంకేతికత. దీని వల్ల వస్తువు తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యతా ప్రమాణాలతో వినియోగదారునికి అందుతుంది. ఇది శాస్త్ర సాంకేతికతల వల్ల సాధ్యపడుతుంది. కాని సాహిత్యం దానిని ఎంత వివేకవంతంగా ఉపయోగించుకోవచ్చునో తెలుపుతుంది. ఆ సాహిత్యాన్ని ఎలా ఉపయోగించు కుంటామో అది మన విజ్ఞత. ఎందుకంటే "సాక్షర"త విలోమమైతే అది "రాక్షస"గా మారుతుంది. 
వర్ణన వ్యక్తి ఊహా శక్తికి నిదర్శనం. ఎంత బాగా ఊహించ గలిగితే అంత ఉన్నతంగా ఆలోచించ గలుగుతాడు. "ఊహ సత్యంబు కన్నను ఉన్నతంబు" అని నేను ఒక పుస్తకంలో వ్రాసాను. ఒక తల్లి తన బిడ్డకు (ఆడ మగ తేడా నేను చూపడం లేదు) గోరుముద్దలు తినిపిస్తూ.. చందమామ రావే అని పాడుతున్నప్పుడు లాజికల్ గా చందమామ వస్తాడా, చందమామ ఒక వ్యక్తి కాదు కదా ఒక ఉపగ్రహం.... లాంటి ఆలోచనలతో పాడుతూ గోరుముద్దలు తినిపించదు. బిడ్డపై ఉన్న ప్రేమ, ఆ బిడ్డ అన్నం తినాలనే ఆరాటం మాత్రమే ఆమెనలా పాడేందుకు పురికొల్పుతాయి. బిడ్డ పెరిగాక చందమామ తన వద్దకు రాకపోయినా తానా చందమామను చేరేందుకు అవసరమైన ప్రణాళికను రచించుకో గలుగుతాడు. అతని అంతర్మనస్సులో తల్లి పాడిన పాట ఒక సకారాత్మకమైన ప్రేరణాగీతంగా ముద్రితమై దానిని సాధించేందుకు కావలసిన ఇచ్చాశక్తిని సమ కూరుస్తుంది. ఈ విధమైన ఆలోచనా సరళి లేకుండా, ఏదో విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేస్తూ ఎవరో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి పుస్తకాలు ముద్రిస్తూ అవగాహన లేని వారిని రెచ్చగొట్టే రచనలు చేసే వారిని ఏమందాము.
          ఇంకొక విమర్శ... స్త్రీల శరీరాన్ని వర్ణిస్తున్నారని: దీన్ని అర్థం చేసుకోవాలి అంటే కామం, శృంగారాల మధ్య ఉండే భేదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.     
ఆడ మగ అనే భేదం లేకుండా ప్రతి వ్యక్తినీ సంతోషపరచేదీ, ఆనంద పరచేదీ హాస్య శృంగార రసాలు. ఈ రసాలు మనసును రంజింప చేయడమే కాక చేసే వృత్తిని నిబద్ధతతో నిర్వహించేందుకు ప్రేరణ నిస్తాయని, చేసే పనిలో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తాయని మానసిక శాస్త్రజ్ఞులు చెపుతారు. ఇందులో శృంగారం స"రస"మైనది. కామం కనిపించిన ప్రతిదీ తనకు కావాలనుకునేది. సామ, దాన, భేద, దండోపాయాలతో ఎలాగైనా ఎదుటి వారి ఇష్టానికి వ్యతిరేకంగానైనా కావాలనుకున్న దానిని సాధించుకునేది కామం కాగా శృంగారం ధర్మ మార్గంలో పరస్పరంగీకారంతో సాధించుకునేది. ఇది స్త్రీ పురుషుల సంబంధమే కానవసరం లేదు. రసానుభూతికి దూరంగా భౌతికాంగాలే పరమార్ధమనుకొని పశువుల భంగి సంసారం సాగించే వారికి ఎన్ని సంవత్సరాలుగా సాంసారిక జీవనం సాగిస్తున్నా, ఎంత సంతానం కలిగినా కామం, శృంగారాల మధ్య భేదం తెలియక పోవచ్చు.
          ఒక స్త్రీ తన తండ్రికి, భర్తకు, కుమారునికి వేరువేరు కోణాలలో కనిపిస్తుంది. ఆ స్త్రీ ఒక్కతే.... కాకపోతే చూచే దృష్టి వేరు. అలాగే కావ్యాలలో స్త్రీలను వర్ణించిన విధానం ఒక్కటే కాని ఆ కావ్యాన్ని చదివి అనుభూతి చెందే పాఠకుల దృష్టి వేరు వేరుగా ఉంటుంది. కొందరు ప్రాకృతిక వర్ణనగా చూస్తారు. కొందరా కవి ఊహాశక్తిని చూస్తారు. కొందరు తాత్త్వికతను చూస్తారు. కొందరా వర్ణనలలోని అక్షర రమ్యత నాదరిస్తారు. ఇలా ఎవరి కోణంలో వారు చూసినా వస్తువు మారదు.
          ఒక జంటకు అమ్మాయిని కనాలనే కోరిక ఉంటుంది. ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారు. జుట్టు లేదు... నొసలు చిన్నగా ఉంది... ఎత్తు పండ్లు... చప్పిడి ముక్కు... అతుక్కు పోయిన చెవులు... లావాటి పెదాలు... లొట్ట చెంపలు... మెల్ల కన్ను...కుదేలయిన మెడ... శరీరాని కతుక్కుపోయిన స్తనాలు... ఎత్తైన పొట్ట.. వెడల్పాటి నడుము... పొట్టి చేతులు.... ఒక కాలు పొడుగు మరొకటి పొట్టి.. తారు లాంటి శరీర రంగు... కాకిలాంటి కంఠస్వరం... ఇలాంటి అమ్మాయిని కనాలని కోరుకుంటారా. నల్లని పొడవైన జుట్టు, తీరైన కనుముక్కు తీరు, అందమైన ముఖం, మంచి మేని ఛాయ, స్త్రీత్వం ఉట్టిపడే స్తన సంపద.. తీరైన కాళ్ళు చేతులు, సన్నని నడుము, చక్కగా కోయిలలా పలికే గొంతు, హాయిగా మందగమనంతో నడయాడే అమ్మాయిని కనాలనుకుంటారా? చక్కని అమ్మాయి కావాలని  కోరుకునే తండ్రి దృష్టిలో కామం కనిపిస్తుందా? (కోరిక అనే అర్ధంలో కాదు) ఆశ పడడం... ఆ ఆశను ఆశయం గా మార్చుకొని దానిని సాధించుకునేందుకు పాటుపడడం వేరు.      
ఒక అమ్మాయికి పెళ్ళి చేస్తున్నారు. పెండ్లికూతురుగా చక్కగా అలంకరించారు. స్వతహాగా అందగత్తె... దానికి తోడు వృత్తి నైపుణ్యం కలిగిన బ్యుటీషియన్లు ఆమెను అలంకరించారు. చక్కగా రతీదేవిలా ఉందా అమ్మాయి. తదేకంగా కూతురుని చూస్తూ ఉన్న తండ్రికి వంగి నమస్కరిస్తున్న అమ్మాయిని కౌగలించుకొని ఆశీర్వదిస్తున్న తండ్రి మనస్సులో ఏ భావనలు కలుగుతాయి. తండ్రి అమ్మాయిని కాముక దృష్టితోనే చూస్తాడా (మగవాడేకదా) అంతే కాదు పెండ్లి మంటపంలో ఉన్న మగవాళ్ళందరూ ఆ అమ్మాయిని కాముక దృష్టితోనే చూస్తారా? ఒకరో ఇద్దరో అలాంటి దుర్బుద్ధి కలిగిన వారు ఉంటే ఉండవచ్చు. వారా దృష్టితో చూస్తారని అమ్మాయిని చక్కగా తయారు చేయకుండా ఉంటారా? వర్ణనలు కూడా అలాంటివే. కావ్యం సైన్స్ కాదు. ఎలా ఉన్నదో అలానే చెప్పేందుకు. కావ్యంలో ఊహ ఉంటుంది. పాఠకుడా ఊహాలో విహరిస్తూ తన్మయుడౌతాడు. అది స్త్రీలను అవమానించడానికో.. కామ దృష్టి తో చూడమని ప్రేరణ నివ్వడానికో కాదు.
          నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా? "జనసాహితి తో మా విబేధాలు"; తీగ లాగారు, డొంకంతా కదిలింది" అన్న పేరుతో ఆమె వ్రాసిన పుస్తకాన్ని స్వీట్ హోం పబ్లికేషన్స్, హైదరాబాద్ వారు ప్రచురించారు. ఒకప్పడు ఆమెకు మిత్రులైన కొందరికి, ఆమెకు మధ్య ఏర్పడిన వైరుధ్యాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు కరపత్రాలు పంచుకోవడం... బురద జల్లుకోవడం జరిగింది. అది వారి వారి ఆంతరంగిక వ్యవహారమే అయినా వారి వైరుధ్యాలు ప్రపంచానికి ప్రేరణ నిచ్చే అంశాలుగా ఆమె తలచారేమో... దానిని పుస్తకంగా ప్రచురించడం జరిగింది.
          ఈ పుస్తకం చదివాక ఆ పుస్తక ప్రయోజనం ఏమిటో అర్ధంకాలేదు. ఆమె దానిద్వారా సమాజానికి ఇవ్వదలచిన సందేశం ఏమిటో తెలియదు. వారివారి మధ్య ఉన్న వైరుధ్యాలు సామాన్య పాఠకుడు ఎనభై రూపాయలు పెట్టి కొని చదవాలా? దానివల్ల సామాన్య పాఠకునికి ఒరిగే ప్రయోజనమేమిటి?
ఎవరి వ్యక్తిగత జీవితాన్నీ విమర్శ చేయడం సబబు కాదు. కాని తాను భర్తను వదిలేసి మరొకరితో సహ జీవనం చేస్తున్న విధానం వల్ల పాఠకుడు ఏం నేర్చుకోవాలో అర్థం కాలేదు. ఆమె భారతంలోని పాత్రల వ్యక్తిత్వాలను విమర్శ చేసిన తీరు ఆమె వ్యక్తిగత జీవితం ఎలాంటిదో చెపుతుందని నమ్ముతున్నాను. 
ఆ పుస్తకంలో సాహిత్య విమర్శలో మార్క్సిస్టు దృక్పథం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నను ఆమె వెలయించి.... “ఏ పరిశీలకుడైనా ఒక రచయితని మార్క్సిస్టు దృక్పథంతో పరిశీలించ దలిస్తే, ఆ రచయిత గురించి ఈ రకం ప్రశ్నలు కొన్ని వేసుకోవాలి” అంటూ ఈ క్రింది అంశాలను ఉదహరించారు.
1) ఆ రచయిత ఏ దశలో, ఏ సామాజిక పరిస్థితుల్లో రచనలు చేశాడు?
2) ఆ రచయిత లేవనెత్తిన సమస్యలేమిటి?
3) సాహిత్య పరిస్థితులను బట్టి, సంఘ పరిస్థితులను బట్టి అతని రచనలకున్న చారిత్రక విలువ ఏమిటి? ఆ రచయిత తన రచనల్లో ఇతర రచయితల ద్వారా అంత వరకూ ఉండిన రచనల్లో విషయాలే తిరిగి చెప్పాడా? లేక సాహిత్యానికీ, సమాజానికీ క్రొత్తవైన విషయాలేమైనా చెప్పాడా?
4) ఆ రచయిత రచనల్లో వైరుధ్యాంశాలు వున్నాయా? ఉంటే అవి ఏమిటి? ఆ వైరుధ్యాలకు సమాజంలో మూలాలెక్కడ? సమాజ పరిస్థితుల్లో వుండిన వైరుధ్యాలు అతని రచనల్లో ఎలా ప్రతిబింబించాయి?
5) ఆ రచయిత ఏ వర్గ భావాలకు ప్రతినిధిగా వ్యవహరించాడు? అతని రచనలు ఏ గ్రూపు ప్రజల భావాలను ప్రతిబింబించాయి?
6) ఆ రచయిత వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం ఎటువంటివి? అతను తన కుటుంబ పరిస్థితులలో ఎలా మెలిగాడు? సమాజ పరిస్థితులలో ఎలా మెలిగాడు?
7) ఆ రచయిత చేసిన రచనలలో శ్రామిక ప్రజలు తిరస్కరించ వలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి? ఎందుకు వాటిని తిరస్కరించాలి? అలాగే రచయితలో స్వీకరించ వలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? వాటిని ఎందుకు స్వీకరించాలి?
          ఇన్ని రకాల ప్రశ్నల్ని దృష్టిలో పెట్టుకొని వాటికి సమాధానాలు చెప్పగలిగే విధంగా పరిశీలన జరిగితే, అది "మార్క్సిస్టు దృక్పథంతో చేసిన పరిశీలన" అవుతుంది, అంటారావిడ.
ఇప్పుడామె ప్రస్తావించిన కోణంనుండి ఈ రచనను చూద్దాం...
1) ఆ రచయిత ఏ దశలో, ఏ సామాజిక పరిస్థితుల్లో రచనలు చేశాడు?
          ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించిన ఆమె బహుభార్యాత్వం లాంటి కొన్ని విషయాలను గూర్చి ప్రస్తావించారు. ఒక సమాజంలో సమకాలీన అవసరాలను, పరిస్థితులను బట్టి కొన్ని ఆచారాలు నెలకొని ఉంటాయి. అవి మంచివా చెడ్డవా అనేది ఆనాటి అవసరాలను బట్టి ఉంటాయి. ఈ నాటి కాలంలో అవి తప్పుగా కనిపించవచ్చు... కాని.. ఈనాటి దృష్టితో ఆనాటి పరిస్థితులను విమర్శించడం సరైన విధానం కాదు. ఆనాటి పరిస్థితులను పునర్విచారం చేయడం లోపాలను సరి చేసుకొని మరొక సమాజాన్ని నిర్మించుకోవడం ప్రతి ఒక్క సమాజం చేయవలసిన చేయదగిన పని. భూతకాలం పనికి రాని చెక్కు లాంటిది. దాని వల్ల ఉపయోగం ఉండదు. భవిష్యత్తు అగమ్య గోచరం... ఎలా ఉంటుందో ఊహకందనిది... కాని వర్తమానం మనచేతులలో ఉండేది. దానిని మన అవసరాల కనుగుణంగా మలుచు కున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. భూతకాలంలోని తప్పిదాలు వర్తమానంలో దొర్లకుండా జాగ్రత్త పడడమే విజ్ఞత. అంతేకాని ఊరకే విషపూరితమైన విమర్శల వల్ల ప్రయోజనాలుండవు.
2) ఆ రచయిత లేవనెత్తిన సమస్యలేమిటి?
          ప్రజలలో ధార్మికత దెబ్బ తిన్న సమయంలో జరుగుతున్న, జరిగిన, జరగబోయే పరిణామాలను ప్రస్తావించారు వేద వ్యాసులవారు. విద్య లేని వారు అజ్ఞానంలో మ్రగ్గిపోతారు. అలాగే తెలిసీ తెలియని చదువు సగం సగం విజ్ఞానం వల్ల ప్రయోజనాల కన్నా చెడే ఎక్కువే. ఎక్కడ చదవాలి.. ఎవరి వద్ద చదవాలి? గురుకులానికి వెళ్ళి చదవాలి... యోగ్యుడైన గురువు వద్ద మాత్రమే చదవాలి. గురుశిష్యుల మధ్య ఎలాంటి సంబంధాలుండలి... గురువు శిష్యుడి సామర్ధ్యాన్ని పరీక్షించే సమయంలో ఎలా ప్రవర్తించాలి. ఏయే అధికారంలో ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తించాలి. ప్రజల పాలకుల మధ్య ఉండాల్సిన సంబంధాలెలాంటివి. సమర్ధుడైన వ్యక్తి నిర్వీర్యుడై కర్తవ్య విముఖుడైతే అతనికి ఎలాంటి ప్రేరణ నివ్వాలి. అన్నదమ్ముల మధ్య ఎలాంటి సంబంధాలుండాలి. ఒడుదొడుకుల మధ్య చిక్కుకున్న సంసారంలో భార్యా భర్తలు సమన్వయత సాధించడం ఎలా? ఇలాంటి ఎన్నో సమస్యలను లేవనెత్తి తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది మహాభారతం.
3) సాహిత్య పరిస్థితులను బట్టి, సంఘ పరిస్థితులను బట్టి అతని రచనలకున్న చారిత్రక విలువ ఏమిటి? ఆ రచయిత తన రచనల్లో ఇతర రచయితల ద్వారా అంత వరకూ ఉండిన రచనల్లో విషయాలే తిరిగి చెప్పాడా? లేక సాహిత్యానికీ, సమాజానికీ క్రొత్తవైన విషయాలేమైనా చెప్పాడా?
          సమ కాలీన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాహిత్యాన్ని ఆవిష్కరించి, సమగ్ర జీవన విధానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయబడింది భారతంలో. సర్వ కాలీనమూ, సర్వ జనీనమైన జీవన విలువలను గూర్చి ప్రస్తావించడం జరిగింది. అయితే మారుతున్న సామాజిక నేపథ్యంలో కొన్ని విలువలు మారవచ్చు.
4) ఆ రచయిత రచనల్లో వైరుధ్యాంశాలు వున్నాయా? ఉంటే అవి ఏమిటి? ఆ వైరుధ్యాలకు సమాజంలో మూలాలెక్కడ? సమాజ పరిస్థితుల్లో వుండిన వైరుధ్యాలు అతని రచనల్లో ఎలా ప్రతిబింబించాయి?
          ధర్మాధర్మాల మధ్య చర్చయే వైరుధ్యంగా కనిపిస్తుంది. ప్రపంచంలో స్థూలంగా చూస్తే సిద్ధాంతాలు విలువలూ ఒక్కటిగానే కనిపిస్తాయి. కాని ఆచరణలో రెంటి మధ్య అంతరం చాలా ఎక్కువ. పైపైన చూసి విలువల పరంగా తప్పు అనుకున్న విషయం సిద్ధాంత పరంగా ఒప్పు కావచ్చు.
5) ఆ రచయిత ఏ వర్గ భావాలకు ప్రతినిధిగా వ్యవహరించాడు? అతని రచనలు ఏ గ్రూపు ప్రజల భావాలను ప్రతిబింబించాయి?
          వ్యాస మహర్షి ఏ వర్గానికి ప్రతినిధిగా భారతాన్ని వ్రాయలేదు. అతనిది ధార్మికమైన దృష్టి. ఆ దృష్టితోనే కావ్యం నడిచింది. తనను తిట్టినా మెచ్చుకున్నా ఒకే విధంగా స్పందించాడు. సమత్వభావనకు ప్రతీకగా నిలిచాడు.
6) ఆ రచయిత వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం ఎటువంటివి? అతను తన కుటుంబ పరిస్థితులలో ఎలా మెలిగాడు? సమాజ పరిస్థితులలో ఎలా మెలిగాడు?
          నిరీహుడై, నిరామయ జీవితాన్ని గడిపాడు. తనకంటూ ఏమీ లేని విరాగి. ధర్మం గతి తప్పుతున్న వేళ తన పరిధిలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించి సంబంధించిన వారికి బోధ చేసాడు. విన్న వారు విజయులైనారు...
7) ఆ రచయిత చేసిన రచనలలో శ్రామిక ప్రజలు తిరస్కరించ వలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి? ఎందుకు వాటిని తిరస్కరించాలి? అలాగే రచయితలో స్వీకరించ వలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? వాటిని ఎందుకు స్వీకరించాలి?
          శ్రామిక ప్రజలు తిరస్కరించ వలసిన అంశాలకన్నా... పాశ్చాత్య భావదాస్య వల్లరిలో ఏ గమ్యం లేకుండా నకారాత్మకమైన రచనలతో సమాజంలో పేరు సంపాదించాలనుకునే రంధ్రాన్వేషకులకు తిరస్కరించ దగిన తప్పులు ఎన్నో కనిపించవచ్చు. ఈ నాడే కాదు ఏనాటికైనా పనికి వచ్చే మానవ జీవన విధానానికి సరిపోయే అంశాలు ఎన్నో ఉన్నాయా గ్రంథంలో. సర్వ కాలీన యాజమాన్య నిర్వహణకు సరిపోయే ఎన్నో సూచనలు చేయబడ్డాయా పుస్తకంలో. మారుతున్న సమాజాన్ని బట్టి ఏ సమాజంలోనైనా మార్పులు అవసరమవుతాయి. వాటిని అనుమోదించాలి, ఆహ్వానించాలి. పాతనుండి నేర్చుకుంటూ, వర్తమానంలో భవిష్యత్తును దర్శించమని చెపుతుంది ఆ గ్రంథం. ఈ నాటి సమాజానికి అవసరంలేని అంశాలను విసర్జించడం న్యాయమే. అలాగని ఆ పుస్తకంపై ద్వేషంతో అవసరమైన దానినీ ద్వేషిస్తామనడం ఉత్తమం కాదు.
ఇన్ని విషయాలపై అవగాహన గలిగి రచయితగా విమర్శకురాలిగా పేరుగాంచిన ఆమె "ఇదండీ మహాభారతం" అంటూ పరిశీలనాత్మకంగా రచించానని చెప్పుకున్న పుస్తకంలో ఏ విధమైన విధానాన్ని పాటించారో తెలియదు.
చివరగా వ్యాసుడెలాగైతే గొప్ప దార్శనికుడు కాడో (ఆమె దృష్టిలో) అలాగే మార్క్స్ కూడా. సమాజాన్ని ఒక కోణంలో దర్శించిన వానిగా ఆయనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తాం కాని ఆయనే సర్వస్వం అంటే ఒప్పుకోలేము.
మార్క్స్ "కాపిటల్" చదవకుండా ఈ ధరల్ని అర్థం చేసుకోవడం తేలిక కాదు అంటూ చివరగా చెప్పారు. దాన్ని అర్థం చేసుకోవడమనేది అంత లోతైన విషయమేమీ కాదనేది రోడ్డు ప్రక్కన మిర్చీ బడ్డీ పెట్టుకొని జీవనం సాగించే వ్యక్తికీ తెలుసది. అయితే ఈ నాటి గ్లోబలైజేషన్ విధానంలో వస్తువు విలువను రూపొందించాల్సిన విధానం భారతీయ సాహిత్యం ఎలా చెపుతుందో ఒకసారి చూద్దాం.
ఆర్థిక స్వావలంబనకు నాలుగు పార్శ్వాలుంటాయి. మొదటిది అమ్మకం ద్వారా మనం పొందిన డబ్బు.. దీనినే Price అంటాం. రెండవది ఆ వస్తువు తయారీకి మనం వ్యయించిన సొమ్ము... దీనినే Rate అంటాం. మూడవది ఆ వస్తు ఉత్పత్తికి మనం పెట్టిన శ్రమ.. దీనినే Value అంటాం. ఇక చివరిది.. మన ఖర్చులన్నీ పోను నికరంగా మనకు మిగిలే సొమ్ము... దీనినే Wealth అంటాం. ఇందులో ఎప్పుడు కూడా మొదటిది అంటే Price తగ్గించుకోవాలి. అప్పుడా వస్తువు అందరికీ అందుబాటులోకి వస్తుంది. అమ్మకాలు పెరుగుతాయి... Goodwill పెరుగుతుంది.. ప్రాచుర్యం పెరుగుతుంది. ఇక రెండవది అంటే Rate పెంచుకోవాలి. దీని వల్ల నాణ్యత పెరుగుతుంది. నాణ్యత వినియోగదారుని మన్ననలను పొందుతుంది. ప్రచారం పెరుగుతుంది. మూడవది అంటే Value అభివృద్ధి పరచాలి. దీని వల్ల నిరంతరం క్రొత్తదనం అన్వేషిస్తూ సాంకేతికతను అభివృద్ధి చేస్తాం. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో సమున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తిని సాధించే ప్రయత్నం చేస్తాం. దానితో ఉత్పాదకత పెరుగుతుంది. ఏ సంస్థలో నైనా ఈ ప్రక్రియ నిరంతరం  సాగిపోయినట్లయితే ఆ సంస్థ ఆర్థికంగా బలపడుతుంది. ఆర్థిక పునాదులు బలోపేతమైన సంస్థ ఉద్యోగుల అవసరాలను తీర్చగలుగుతుంది... సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతుంది. చుట్టూ ఉండే సమాజాన్ని ప్రగతి వైపు నడిపించ గలుగుతుంది. ఇక నాలుగవది.. Wealth ఆదాయం ఖర్చు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి యైనా లేదా సంస్థ యైనా సంతోషంగా ఉండగలుగుతుంది. నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. నలుగురుకి ఉపయుక్త మౌతుంది. సమాజంలో గుర్తింపు పొందుతుంది. కాని ఎప్పుడైతే ఆదాయం ఖర్చుకన్నా తక్కువైతే ఆ సంస్థ నిలవడమే ప్రశ్నార్థకమౌతుంది. ఉనికియే ప్రమాదంలో పడిన సంస్థ తన ఉద్యోగులకుగాని, ఖాతాదారులకుగాని ఏ విధంగా ఉపయోగపడదు. మిగులు సొమ్ము మన వద్ద ఎంత ఎక్కువగా ఉంటే అంత ధీమా….గౌరవం.
          ఈప్రక్రియలో మరో ముఖ్య కోణం ఏమిటంటే.. వ్యర్దాలను నియంత్రించడం... వ్యర్ధాలనెంత సమర్థవంతంగా నియంత్రణ చేసుకుంటే అంత అభివృద్ధి సంస్థలో కనిపిస్తుంది. ఎంత సమర్ధవంతుడైన యజమాని ఉన్నా, ఎంత చక్కని యోజనా ప్రణాళికలు వినియోగించినా...నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తి సాధింపబడినా సమర్థులైన ఉద్యోగులు ఎంత అంకితభావంతో శ్రమించినా... అమ్మకాలు ఎంతగా పెరిగినా వ్యర్థ నియంత్రణ లేని సంస్థ నష్టాలలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. నష్టాలతో ఎవరూ సంస్థను నడపలేరు. సంస్థ నిలవక పోతే ఉద్యోగులకు ఉపాధిపోతుంది. అందువల్ల పరస్పరాధారిత విధానంలోనే ప్రయోజనం ఉంటుంది.
ఎవరెంత చెప్పినా వక్ర దృష్టి మారనంత వరకు వారు మారరనేది యదార్ధం. అలాంటి వారి దృష్టిని  ఆకర్షించేవి ఏమిటో కూడా ఒక కవి చాటువుగా చెప్పిన పద్యంతో ముగింపు పలుకుతున్నాను.
ఎవ్వతె వీవు కాళ్ళు మొగ మెర్రన; హంసను, ఏడ నుందువో;
దవ్వున మానసంబునను, దాన విశేషము లేమి తెల్పుమా;
మవ్వగు కాంచనాబ్జములు మౌక్తికముల్ గల వందు; నత్తలో;
అవ్వి యెరుంగ నన్న హహహా యని నవ్వె బకంబు లన్నియున్!
ఒక హంస ఒకనాడు దారి తప్పి ఒక మడుగు చేరిందట. అక్కడ కొన్ని కొంగలు ఉన్నాయి. తమకు భిన్నంగా ఉన్న ఆ హంసను, దాని అందాన్ని, దాని సౌకుమార్యాన్నిచూచి ఈర్ష్య పడిన కొంగలు ఆ హంసను చుట్టుముట్టి అడిగాయట. "నీ వెవ్వరు నీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉన్నాయేమిటి? హంస చెప్పింది తాను హంసనని. ఎక్కడుంటావని కొంగల ప్రశ్న... చాలా దూరంగా మానస సరోవరంలో ఉంటానని హంస జవాబు. అయితే అక్కడి విశేషాలేంటి... కొంగల ప్రశ్న.. అక్కడ అందమైన కోమలమైన ముత్యాలు మరియు బంగారు పుష్పాలుంటాయని చెప్పింది, హంస. కొంగలకు అది అర్థం కాలేదేమో అందుకే అడిగాయట... మరి అక్కడ నత్తలుంటాయా? అని. అప్పుడు తెల్లబోయిన హంస అవి (నత్తలు) నాకు తెలియదు అన్నదట. దానికి ఆ కొంగలన్నీ హహహా అని నవ్వాయట". చిన్నప్పుడు ఎప్పుడో విన్న చాటువు పద్యం.... రంగనాయకమ్మ గారి పుస్తకం చదివాక గుర్తొచ్చింది.
          దాదాపు 5000 సంవత్సరాల క్రితం జరిగిన, వ్రాయ బడిన భారతాన్ని నిష్పాక్షిక దృష్టితో చదవండి... నిర్ణయం తీసుకోండి. మంచి ఉన్నదనిపిస్తే ఆస్వాదించండి.. ఆచరించండి.. చెడుగా కనిపిస్తే విడిచి పెట్టండి. మీకెలా కనిపిస్తే అలా ఆస్వాదించండి... అంతే కాని మీ అభిప్రాయాన్ని అందరిమీదా రుద్దే ప్రయత్నం చేయకండి. 
శుభం భూయాత్
పాలకుర్తి రామ మూర్తి

భువనగిరి
మహాభారతాన్ని ఎలా చూడాలి?
ప్రతి వ్యవస్థలో కొన్ని ఉన్నత లక్షణాలు మరికొన్ని లోపాలు ఉంటాయి. ఏ సిద్ధాంతమైనా సమకాలీన అవసరాల కనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. అందుకని అది సర్వకాలీనం కానవసరం లేదు. తత్కాలావసరాల కనుగుణంగా మార్పుచెందుతుంది. కాబట్టి ఏ సిద్ధాంతమైనా అన్ని కాలాలలో సమగ్రతను, పరిపూర్ణతను సంతరించు కుంటుందనుకోవడం అత్యాశయే. ఏ వ్యక్తీ అందరికీ ఆమోదయోగ్యుడు కాలేడు. అలాగే ఏ రచనలోనైనా కొంత మంచి ఉంటుంది.. చెడూ ఉండవచ్చు. ఇవి మనం చూసే దృష్టిని బట్టి ఉంటాయి.
          అయితే... ధర్మ ప్రబోధ లక్ష్యంగా చెప్పబడిన గ్రంథాలలో ఎక్కువగా ప్రతీకాత్మకమైన గాథలు ఉంటాయి. ఉదాహరణకు... గంగావతరణ, క్షీర సాగర మథనం, గజేంద్రమోక్షణ లాంటివి. వీటి లక్ష్యం వేరు. వీటిని భౌతిక దృష్టితో చూడలేము... అలా చూస్తే అర్థంకావు కూడా. మనకర్థం కాలేదని వాటిని తప్పుగా ప్రచారం చేయడం న్యాయం కాదు. అలాగని ఒక కాలాని కనుగుణమైన కొన్ని ఆచారాలను కొన్ని వందల సంవత్సరాల తదుపరి అలాగే నడిపించాలను కోవడం పొరపాటే అవుతుంది.
          వర్ణ వ్యవస్థలో ఆయుధం పట్టి జీవనాన్ని సాగించిన వారు క్షత్రియులుగా సూచింప బడ్డారు. దేశావసరాలు, దేశరక్షణల కొరకు ఒకనాడు అన్ని వర్ణాలవారూ ఆయుధాలను పట్టారు. వారి రాజ్యాన్ని కాపాడుకున్నారు. అయితే రాను రాను వర్ణ వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుల వల్ల అది కుల వ్యవస్థగా రూపాంతరం చెంది పుట్టుకతో క్షత్రియులైనవారే దేశరక్షణకు పూనుకోవడం జరిగింది. దాని వల్ల సమర్థత ఉన్నా అన్య వర్ణాలవారు దేశరక్షణకు  పూనుకోకపోవడం, అసమర్థులు ఇష్టమున్నా లేకపోయినా అదేవృత్తిలో ఉండడం వల్ల అన్య జాతీయుల, దేశీయుల దండయాత్రలలో దేశాన్ని కాపాడుకోవడం కష్టసాధ్యమైంది. (Ancient India by V.D. Mahajan)
          ఇది ఎలా ఉన్నా... ఏ కాలంలోని రచనలలోనైనా మంచి ఉంటే... అది సమ సమాజానికి పనికి వస్తుందనుకుంటే దానిని వాడుకోవడం ఉత్తమం. మహాభారతంలో ఈ కాలానికి అవసరంలేని కొన్ని సన్నివేశాలు ఉండొచ్చు. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ, బహుభార్యాత్వం, వేశ్యావృత్తి లాంటివి. అంత మాత్రాన అందులో ఉన్న కొన్ని మంచి అంశాలు కూడా పనికి రావనుకోవడం సమంజసం కాదు. వాటిని అధ్యయనం చేయవచ్చు. ముఖ్యంగా యాజమాన్య నిర్వహణ, ప్రజలు - పాలకుల మధ్య ఉండాల్సిన అనుబంధాలు, పన్నుల విధానం, అన్న దమ్ముల అనుబంధాలు లాంటివి అధ్యయనం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏ రంగంలోనైనా పరిస్థితులన్నీ అన్ని కాలాలలో ఒకే రకంగా ఉండవు. ఏ పరిస్థితిని బట్టి ఆ విధంగా వ్యవహరించ వలసి ఉంటుంది.. అది నిజం. కాని పాతను అధ్యయనం చేయడం వల్ల క్రొత్తకు మార్గం సుగమం అవుతుంది. పాత రచన ఎంత కాలం మార్గ దర్శన చేస్తుందనేది ఆ రచయిత దూరదృష్టిపై, సాధనా బలంపై ఆధారపడి ఉంటుంది. వేల సంవత్సరాల తదుపరి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని రచన చేసిన రచయిత ఋషిగా వ్యవహరించ బడతాడు. అందుకే వేదవ్యాసుడు ఋషిగా హారతు లందుకుంటున్నాడు. (కొందరు గౌరవించక పోయినా నష్టం లేదు)
          అలాగే యూరప్ అనుభవాలతో ప్రేరణ పొందిన మార్క్స్ తన మేనిఫెస్టోలో కొన్ని సూచనలూ చేశాడు. శాస్త్రీయంగా కమ్యునిజం వచ్చి తీరుతుందనీ, అది తప్ప మరో మార్గం, మోక్షం లేదని ఆయన అభిప్రాయ పడ్డాడు. నిజానికి ఒక మనిషికి త్రికాలజ్ఞత ఉంటేనే లేదా ఉందని నమ్మితేనే మార్క్స్ సిద్ధాంతాలను మనం నమ్మగలం. “సామాజిక చైతన్యం తప్ప మరొక రకపు చైతన్యం మానవులకు ఉండదు. చైతన్యం భాష ద్వారా ఆచరణలోకి వస్తుంది. చైతన్యం, భాష ఈ రెండూ ఇతరులతో ఉండే అవసరాల ద్వారా వస్తాయి. అవి ఉత్పత్తి సంబంధాలతోపాటు వికసిస్తాయి...” ఇలా సాగిపోయే మార్క్స్ చెప్పిన విషయాలను వివరంగా చర్చ చేయవచ్చు... కాని ఇదంతా సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి. అలాగని ఇదంతా చెత్త అందామా? అదీ తప్పే. మొత్తంగా స్వీకరించదగిందా అంటే కాదు. తన పరిధిలో తన అనుభవాల రాపిడిలో, తన హృదయ స్పందన ప్రతిస్ఫందనల కనుగుణంగా; వాటి ఆధారంగా ఈ మానవ సమాజం ఇలా ఉంటే అందరికీ భూతల స్వర్గంగా ఉంటుందని మార్క్స్ భావించాడు... ఆశించాడు. (మార్క్సిజం మేధావులకు మత్తు మందు-- పిరాట్ల వెంకటేశ్వర రావు)
          సాదనా బలంతో సాధించిన శక్తులను సరైన మార్గంలో వినియోగించుకోలేక ఎదురైన ప్రలోభాలకు తలొగ్గి ఎందరో మహానుభావులు భ్రష్ట యోగులుగా మిగిలి పోయారు. బహుశా మార్క్స్ కూడా ఆ యోగుల జాబితాలో ఒక భ్రష్ట యోగిగా మారాడేమో.
            భారత దేశంలో మహాభారతాని కున్న ఆదరణ మార్క్స్ వాదానికి లేకపోవడానికి కారణాలెన్నున్నా... వారి సాధనా బలం అత్యంత ముఖ్యమైనదని నా వరకు నేను  నమ్ముతున్నాను.
మహాభారతంపై వస్తున్న చర్చల నేపథ్యంలో ఆ గ్రంథంలో ఉన్న సామాజికాంశాలు ఈ నాటి సమాజానికి ఎంత వరకు పనికి వస్తాయి అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే మార్క్స్ సిద్ధాంతం. అత్యంత వేగంగా మారుతున్న  ప్రపంచ వ్యాపార సంబంధాలు, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మన జీవితాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏ జాతి చరిత్రలోనైనా ఆ సామాజిక, మానవాభ్యుదయానికి సూచింపబడిన సూచనలు సర్వజనీనం కావచ్చు లేదా కాకపోవచ్చు. ఆ జాతి సాంస్కృతిక నేపథ్యంలో వాటి ఆదరణ వెలుగు చూస్తుంది. LPG (లిబరలైజేషన్, ఫ్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) వల్ల ప్రపంచమంతా కూడా ఈ నాడు ఒక కుగ్రామంగా మారిపోతున్నది. నిన్నటి దాకా సత్ఫలితాలనిచ్చిన ఆలోచనలు, సిద్ధాంతాలే ఈ నాడు పనికిరానివవుతున్నాయి. ఉత్పత్తి, ఉత్పాదక రంగాలలో, ఉపాధి రంగాలలో వస్తున్న అనూహ్యమైన మార్పులు ప్రస్తుతమున్న అన్ని సిద్ధాంతాలను అధిగమించి క్రొత్త మార్గాలను చూడమంటున్నాయి.
ఈ నేపథ్యంలో మహాభారతంలోని సామాజిక, యాజమాన్య సంబంధితాంశాలను ఒకసారి పరిశీలించి ఈ కాలంలోని అవసరాలకు వాటిని ఎంత వరకు ప్రాతిపదికగా తీసుకోవచ్చునో ఆలోచిద్దాం. ముందే చెప్పుకున్నట్లుగా ఈ పద్ధతే సమగ్రమైనది, ఈ పద్ధతితోనే ఉత్తమ ఫలితాలు రాబట్టగలం అనుకోవడం పొరపాటే కాదు, అత్యాశా అవుతుంది.

మహాభారతం నాయకుడెలా ఉండాలని చెపుతుంది?
మహాభారతంలో రాజుగా చెప్పబడిన వాడిని ఇక్కడ మనం నాయకునిగా చెప్పుకుంటున్నాము. రాజ్యాన్ని ఒక సంస్థగా, ప్రజలు ఆ సంస్థ ఉద్యోగులుగా చెప్పుకుందాం. ఆ రాజ్య సామంతులు, ఆ రాజ్యంతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు, ఆ రాజ్యంతో వ్యాపార సంబంధాలు కలిగిన వారు ఆ సంస్థ వినియోగ దారులుగా చెపుకుందాం. అలాగే ఆ రాజ్యానికి శత్రువులు ఆ సంస్థకు పోటీదారులుగా చెప్పుకుందాం. ఈ క్రమంలో ఏ నాయకుడైనా నవ్యతా, నాణ్యతలను సంతరించుకుంటూ పోటీదారుల ఊహాలకందని విధంగా తన సంస్థను విజయపు టంచులపై నిలిపి, తనను నమ్మిన వారికి సంతోషాన్ని కలిగించాలి అంటే ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేయాలి. అసలు నాయకుడు ఎలా ఉండాలి. ఎలాంటి లక్షణాలను సంతరించుకోవాలి అనే అంశాలను మహాభారతం నేపథ్యంలో పరిశీలిద్దాం.
          నిజమైన నాయకుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించాలి. ఇక్కడ ఆదిలో ధర్మం అంతంలో మోక్షం చెప్పబడ్డాయి. ఈ రెంటి మధ్య అర్థ కామాలు ఉన్నాయి. అంటే "ధర్మ మార్గంలో అర్థ కామాలను సాధించి మోక్షమనే లక్ష్యాన్ని" చేరుకోవాలని ఈ క్రమం సూచిస్తుంది. అంతే కాదు ఏ కారణం చేతనైనా అర్థ కామాలు నష్ట పోవడం జరిగినా ధర్మానువర్తికి శ్రేయస్సు దూరం కాదు. అయితే దీనిని సాధించాలి అంటే ముందుగా నాయకుడు తన శత్రువులను గెలవాలి. శత్రువులను గెలవడం అంటే తన లక్ష్యం నుండి తన దారిని మళ్ళించే తన ఇంద్రియాలపై సంపూర్ణంగా నిగ్రహణ కలిగి యుండడం. తనపై తనకు నిగ్రహణ కలిగిన నాయకుడు పరులపై పట్టు సాధించ గలుగుతాడు. అందుకే తనను తాను ముందుగా జయించాలి. అలాంటి నాయకుడే శుభాలను పొందగలుగుతాడు.
          ఒక సంస్థ నాయకునికి ఆ సంస్థ ఉద్యోగులు శరీరము కాగా ఉద్యోగులకు నాయకుడు ఆత్మలాంటి వాడు. అందుకే ప్రజా సంరక్షణ రాజుకు, రాజును సమర్ధిస్తూ నిలపడం ప్రజలకు విధ్యుక్త ధర్మాలుగా చెపుతుంది మహాభారతం. అంతే కాదు, ఏ సంస్థలోని నాయకుని విజయంలో నైనా బ్రాహ్మ్యం, క్షాత్రం సమాన భాగస్వాములుగా నిలుస్తాయి. వ్యూహ రచన, సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, సరైన యోజనాసరళి, నిజాయతీతో కూడిన మంత్రాంగం, నిర్దుష్ట లక్ష్య నిర్దేశన లాంటి లక్షణాలను “బ్రాహ్మ్యం” గా చెప్పుకుంటాము. అలాగే ఉత్సాహం, సాహసం, ధైర్యం, శక్తిసామర్ధ్యాలు, పరాక్రమం (ప్రయత్నం), నైపుణ్యం లాంటి లక్షణాలను “క్షాత్రంగా” చెప్పుకుంటాం. ఎక్కడైతే బ్రాహ్మ్యం క్షాత్రం రెండూ సమంగా ఉద్యమిస్తాయో తప్పక అక్కడ విజయం ఉంటుంది.
          క్షాత్రానికి బ్రాహ్మ్యం మంత్రిగా ఉంటుంది. బ్రాహ్మ్యం... బ్రాహ్మణత్వానికి చిహ్నం. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన పురోహితుడు మంత్రాంగం చెపుతాడు. అతనికి ఉండాల్సిన లక్షణాలను కొన్నింటిని భారతం ఈ క్రింది విధంగా చెపుతుంది. అతడు....
౧) అధ్యయన అధ్యాపకాలలో నిష్ణాతుడై ఉండాలి
౨) దయ, న్యాయం కలగలిపి చక్కని తీర్పు చెప్పగలిగిన సునిశిత బుద్ధి, మేధస్సు కలిగి ఉండాలి.
౩) ఆరోగ్యవంతుడై, యువకుడై ఉండాలి
౪) చిత్తశుద్ధి కలిగిన వాడై ఉండాలి. ఎవరిలోనైతే చిత్త శుద్ధి లోపిస్తుందో అతడు నీచ స్థితికి దిగజారుతాడు.
(ఈ రోజు IAS లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల నుండి, చాలా కంపనీలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎన్నిక కాబడే అభ్యర్ధుల నుండి ఇలాంటి లక్షణాలనే ఆశించడం మనం చూడవచ్చు)
          ఇలాంటి ఉత్తమ లక్షణాలను సంతరించుకున్న వ్యక్తిని సలహాదారుగా లేదా మంత్రిగా కలిగిన నాయకుడు తన సంస్థను తప్పక విజయ పథంలో నడిపిస్తాడు. అంతే కాదు, నాయకుడు తన ఉద్యోగులను ఎప్పుడు శిక్షించాలో ఎలా శిక్షించాలో ఎప్పుడు అభినందించాలో ఎంతవరకు అభినందించాలో తెలిసి ప్రవర్తిస్తాడు. సరైన సలహాదారు ఇచ్చే సలహాలను పాటించే నాయకుడు... ప్రజలు(తన ఉద్యోగులు) మంచిని చేస్తే గుర్తిస్తాడు. అలాగే వారు చేసే తప్పులను పరిశీలిస్తాడు. భావోద్వేగాలకు దూరంగా, అరిషడ్వర్గాలను (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను) దరి చేరనీయకుండా జాగ్రత్త పడతాడు. లంచాలకూ, దొంగతనానికి ఏ నాడూ పాల్పడడు. ఆత్మస్తుతికీ పరనిందకూ దూరంగా ఉంటాడు. తాత్కాలిక ప్రయోజనాలకు కాక పదికాలాల పాటు నిలిచే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత నిస్తాడు. విధ్యుక్త ధర్మాలను నియమబద్ధంగా నిర్వహిస్తాడు. నిగర్వి, కుత్సితుడు కాని వాడు, పర స్త్రీ వ్యామోహం లేనివాడు, క్రోధం లేని వాడు (కోపం వేరు క్రోధం వేరు. కోపం తాత్కాలికంగా వెలువడే భావ స్పందన కాగా క్రోధం అంతరంగంలో జ్వలించే పగ ద్వేషంతో వెలువడే విషం) సామంతుల(వినియోగదారుల)  అవసరాలను తమ స్వార్థంకోసం వాడుకుంటూ పీడించే గుణం లేనివాడుగా ఉంటాడు. అలాంటి వారి నాయకత్వంలో ఉద్యోగులూ సుఖిస్తారు.
          ఒక రాజు ఉండేవాడు.. అతని వద్ద సమర్ధుడైన మంత్రి  ఒకడుండేవాడు. ప్రజలందరితో సఖ్యతగా ఉంటూ వారి అవసరాలకు స్ఫందిస్తూ వారికి తలలో నాలుకలా మెదిలే మంత్రి గారంటే ప్రజలందరికీ గౌరవం. అతని గౌరవ ప్రతిష్ఠలను చూసి రాజుగారే ఈర్ష్య పడేవాడు. ఒకనాడు మంత్రిని పిలిచి .. ఈనాటి నుండి ప్రజలను శిక్షించే బాధ్యత నీకప్పగిస్తున్నాను.. వారిని అభిందించడం సన్మానించడం నేను చూస్తానని చెప్పాడు. అందువల్ల జరగబోయే పరిణామాలను వివరించబోయే మంత్రిని వారిస్తూ “ఇది నా ఆజ్ఞ” ఎదురు చెప్పకుండా అమలు చేయండి అన్నాడు.
రాజుగారు దయాపూర్ణుడై కనిపించిన వారికందరికీ బహుమానాలు ఇవ్వడం ఆరంభించాడు. మొదట్లో అందరికీ ఈ పద్ధతి బాగానే ఉండేది. కాని రాను రాను వారికి ఇది మ్రింగుడు పడలేదు. పనిచేసినా చేయకపోయినా ప్రజలందరికీ ఒకేరకమైన గుర్తింపు. ఉచితానుచితాలు మరచి పేరుకోసమై అందరికీ సన్మానాలు చేయడంవల్ల ప్రజలలో పనిచేసే శ్రద్ధ తగ్గిపోయింది. విజ్ఞానులనూ అజ్ఞానులనూ ఒకే గాట కట్టడంతో ప్రాజ్ఞులకు గుర్తింపు లేకపోవడం వల్ల ప్రజలలో సోమరితనం ఆవహించి సృజనాత్మకత దెబ్బతిన్నది. తన స్థాయిని మరచి అందరితో అన్ని వేళలలో కలవకూడని ప్రదేశాలలో కలవడం వల్ల ప్రజలకు రాజుపై భయభక్తులు నశించి రాజును గౌరవించడం మానేసారు.
దీనికి ప్రతిగా మంత్రి ఎవరిని ఎంతవరకు శిక్షించాలో న్యాయబద్ధంగా శిక్షిస్తూ వచ్చాడు. దీనితో ప్రజలకు మంత్రిపై భయభక్తులతో కూడిన గౌరవం ఇనుమడించింది. కాలం గడిచే కొద్దీ రాజుకీ పరిస్థితి అర్థం అయింది. ఆలోచించాడు. మంత్రిని పిలిచి నేటి నుండి మన బాధ్యతలను మార్చుకుందాము. నేను శిక్షిస్తాను నీవు వారికి అభినందనలు సన్మానాలు అందించమని  చెప్పాడు. రాజాజ్ఞ కాబట్టి మంత్రి సరేనన్నాడు. రాజు గారు లోగా ఎలా ప్రజలను విచక్షణ లేకుండా గౌరవాభినందనలు అందించాడో అలాగే చిన్న చిన్న తప్పిదాలకూ వారిని శిక్షించడం ఆరంభించాడు. ప్రజలలో రాజుపై అసంతృప్తి ఆరంభమయింది. అది రాజుపై తిరుగుబాటు చేసేంత వరకు వెళ్ళింది. మంత్రి తన విచక్షణ ననుసరించి వర్తించడంతో ప్రజలు అతనికి గౌరవాదరణలు ఇవ్వడంతో పాటుగా రాజును తప్పించి ఆ స్థానం లో సమర్ధుడైన మంత్రిని కూర్చోబెట్టాలనే నిశ్చయానికి వచ్చారు.
గూఢాచారుల ద్వారా జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న మంత్రి, రాణీ సహాయంతో రాజు దగ్గర ఈ విషయాన్ని చర్చించాడు. రాజు కూడా పరిస్థితి తీవ్రతను గుర్తించి ఏ మార్గంలో వెళితే పరిస్థితిని అదుపు చేయవచ్చునో  సలహానిమ్మని మంత్రిని అడిగాడు. దానికి మంత్రి; పరిస్థితి చక్కదిద్దేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గూర్చి మరియు శిక్షలు సన్మానాలు ఎలా ఉండాలో ఈ విధంగా చెప్పాడు....
౧) నాయకుడు విచక్షణ లేకుండా శిక్షలు అమలు చేస్తే ప్రజలు భయభ్రాంతులౌతారు.
౨) నాయకుడు అందరి పట్ల దయాభావంతో ఎవరినీ శిక్షించకుండా వదిలేస్తే అతని పట్ల భయ భక్తులు పోతాయి
౩) నాయకుడు అవసరానికి మించి అభినందించినా, సన్మానాలు చేసినా ప్రజలకు అలుసై పోతాడు
౪) నాయకుడు ఎవరినీ ఏ విషయంలోనూ అభినందించకపోతే అతనిని ప్రజలు ఇష్టపడరు
౫) నాయకుడు ఎప్పటికి ఎవరికి ఎంత అవసరమో అంతగా అభినందించడమూ... శిక్షించడమూ చేస్తే.. అతనిని జనులు గౌరవిస్తారు.
౬) నాయకుడు తన భావోద్వేగాల పరిధిలో ఎవరిని శిక్షించినా అభినందించినా అది వారి కోపానికి కారణమౌతుంది
౭) నాయకుని శిక్షలు లేదా అభినందనలు వారిలో సమూలమైన మార్పులు తెచ్చేవిగా ఉంటే సమాజానికి మేలు చేస్తావి
          నాయకుడు, సమర్థులైన తన అనుచరులలో అర్హులైన వారిని గుర్తించి అయా రంగాలలో అర్హత ప్రాతిపదికగా వారికి బాధ్యతలను, అధికారాలను అప్పగించి, వారి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమీక్ష చేస్తూ అవసరానికి తగిన సూచనలతో వారి వెన్నంటి యుండి న్యాయ్యబద్ధంగా, శాస్త్ర సమ్మతంగా ప్రవర్తించడం వల్ల రాజ్య ప్రజలు సంతోషంగా ఉంటారు. సరైన సమయంలో అవసరమైన న్యాయబద్ధమైన శిక్షలు తమ తప్పును తెలుసుకునేందుకు ఉపకరిస్తాయి. సరైన సమయంలో అవసరమైన పొగడ్తలు ఉన్నతమైన శక్తి్సామర్ధ్యాలను ప్రదర్శించేందుకు ఉపకరిస్తాయి. ఇవే నాయకుడిని సమున్నత స్థానంలో నిలుపుతాయి.
ఈ సూచనలతో రాజు తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్నాడు. (Offerings-3 by Sri G. Narayana)
సంస్థలో నాయకుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మవద్దు. ఏ సంస్థలోనైనా నాయకుడు అన్ని విభాగాలను సరిగా పర్యవేక్షించాలి. కాబట్టి అందరినీ నమ్మినట్లుగానే ఉండాలి కాని అందరిపై ఒక కన్ను వేసి ఉంచాలి.
నమ్మమి మృత్యువు; పెద్దయు
నమ్ముట యపమృత్యువగుట; నరపతి నమ్మీ
నమ్మక పని గొనునది, ని
త్యమ్మును సూక్ష్మ మతి దాను నరయగ వలయున్!
 (భారతం - శాంతిపర్వం)
నిజానికి నాయకుడు ఎవరినీ నమ్మొద్దు. మరి ఎవరినీ నమ్మకపోతే అన్ని పనులను తాను చేసుకోలేడు. అలాగని నమ్మనట్లు కనిపించవద్దు. నమ్మీనమ్మని తీరుగా సూక్ష్మ బుద్ధితో ప్రవర్తిస్తూ ఉద్యోగులతో పనులు తీసుకోవాలి. తన చుట్టూ ఉండే అందరిపై (చివరకు తన సోదరులు మరియు సంతానంతో సహా) నిఘా పెట్టి రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
అంతేకాదు, రాజ్యాంగానికి ఉండే సప్తాంగాలను రక్షించుకోవడం నాయకుని కర్తవ్యం. స్వామ్యమాత్య జనపద కోశ సైన్య మిత్ర దుర్గములను సప్తాంగాలంటారు. (స్వామి -తాను; అమాత్య - మంత్రి మండలి; జనపద - ప్రజలు; కోశ - ధనాగారము; సైన్య - చతురంగ బలాలు; మిత్రులు - స్నేహితులు; దుర్గములు -కోటలు) తాను ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. తాను లేకపోతే ఇవి ఏవీ ఉపయుక్తంకావు. కాబట్టి తనను తాను ముందుగా రక్షించుకోవడం అవసరం. ఇక ప్రజలకు కావలసిన అన్ని అవసరాలు తీర్చేందుకు కావలసిన వ్యవస్థలను ఏర్పాటుచేయడం వాటిని సరిగా పనిచేయించడం లోటుపాటులను ఎప్పటి కప్పుడు సరి చేయడం తప్పని సరి. వాటిని పర్యవేక్షించేందుకు సమర్థులైన మంత్రి వర్గ సభ్యుల అవసరం ఉంటుంది. సరైన వారిని ఎన్నుకోవడం వారిని రక్షించుకోవడం నాయకుని విధి. (ఈ కాలంలో ఒక సంస్థను వీడి మరొక సంస్థలోకి నిపుణులు వలసపోవడం జరుగుతుంది. దానివల్ల ఒకవైపు శిక్షణ తీసుకున్న నిపుణుడైన ఉద్యోగి వెళ్ళిపోతాడు. రెండవ వైపు మరొక ఉద్యోగికి శిక్షణ నివ్వాల్సి ఉంటుంది) ఇక ప్రజల భాగస్వామ్యం సరిగా లేకపోతే ఏ నాయకుడూ సంస్థను నడపలేడు. అసంతృప్తులైన ప్రజల (ఉద్యోగుల) కోపానికి గురైన సంస్థ నాణ్యతకు, నవ్యతకు, సృజనాత్మతకు దూరమవుతుంది. దానితో సంస్థ ఉనికియే ప్రశ్నార్ధక మౌతుంది. సంస్థ లేకపోతే ఉద్యోగులకు ఉపాధి కరవవుతుంది. కాబట్టి రాజు (నాయకుడు)  ఉద్యోగులు (ప్రజలు) ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకుంటూ పరస్పరాధారిత పద్ధతిలో నడవడం వల్ల రాజ్యం (సంస్థ) సుభిక్షంగా ఉంటుంది. కోశ - ధనాగారము నిండుగా ఉన్నప్పుడే ఏ సంస్థయైనా, వ్యక్తియైనా ప్రగతిపథంలో పయనిస్తాడు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు (ఉద్యోగులకు) ప్రయోజనకారిగా చేయవచ్చు. సంస్థకు ఉద్యోగులకు మధ్య బంధాన్ని పెంచవచ్చు. సైన్యం పటుత్వంతో... అత్యాధునిక శిక్షణతో నైపుణ్యం పెంచుకున్నప్పుడే రాజ్యానికి (సంస్ఠకు) రక్షణ. అత్యాధునిక ఆయుధ సంపత్తితో, సమర్థవంతమైన యోధులతో పరిపుష్టమైన దండు ప్రజలకు భద్రతనిస్తుంది. చక్కని ఆత్మీయులైన మిత్రులు ఎంత ఎక్కువ మంది ఉంటే అన్ని సంబంధాలు పెరుగుతాయి. పెరిగిన సంబంధాలు మనల్ని ముందుకు తీసుకు వెళతాయి. చివరగా కోట గోడలు రక్షణ నిస్తాయి. అది రాజ్యానికైనా సంస్థకైనా.
ఏ సంస్థ యైనా అభివృద్ధి పథంలో నడవాలి అంటే నాయకుడు ముందు చూపుతో పటిష్టమైన చర్యలు చేపట్టాలి... అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. అందులో ముఖ్యంగా....
1) కోటగోడలు ఎప్పటి కప్పుడు బాగుచేయిస్తూ ఉండాలి. దాని వల్ల రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. దొంగతనాలు అరికట్టబడతాయి. ఒకే ద్వారం ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగుల, బయటి వ్యక్తుల రాకపోకలను నియంత్రించడం సులువవుతుంది.
2) గడ్డి, ఖాణము, కొల్పు, కట్టియలు, నేయి మరియు నూనెల యొక్క నిల్వలను సమృద్ధిగా ఉంచుకోవాలి.
          గడ్డి - పశుగ్రాసము. దాని ద్వారానే పాడి పంటల అభివృద్ధి కాబట్టి సంవత్సరం పొడుగునా అవసరమైన గడ్డిని నిల్వచేసుకోవడం ద్వారా పాడిపంటల పంపిణీకి ఆటంకం ఉండదు.
          ఖాణము - గుర్రాలకు పెట్టే ఉలవల లాంటివి... ఇప్పుడు వాటిని పెట్రోలియం ఉత్పత్తుల క్రింద చెప్పుకుంటే సరిపోతుంది. సరకు రవాణా, మనుషుల రవాణాకే కాక యుద్ధ సమయంలో ఉపకరించేందుకు ఒకప్పుడు గుర్రాలను ఎక్కువగా వినియోగించడం జరిగేది కాబట్టి ఆ గుర్రాలకు కావలసిన మేత ఉలవలు కాబట్టి వాటిని ఉదహరించినా నేటి యాంత్రిక యుగంలో పెట్రో ఉత్పత్తులను ఎక్కువగా సేకరించుకోవడం ఉపయుక్తమౌతుంది. కనీసం ఒక సంవత్సర కాలానికి సరిపోయే పెట్రో నిలువలు ఉన్న దేశంలో వాటి ధరలలో కనిపించే హెచ్చుతగ్గులు అంతగా ప్రభావాన్ని చూపవని ఆర్థిక శాస్త్రవేత్తలు చెపుతారు. 
          కొల్పు - మానవులు ఉపయోగించే వరిధాన్యం లాంటివి. దూరదృష్టితో వీటి నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉంచగలిగితే ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారు.
          కట్టియలు - మా చిన్నతనంలో ఎండాకాలంలో ఎండిన వంట చెరుకును సమీకరించి సంవత్సరమంతా ముఖ్యంగా వర్షాకాలంలో వాడుకునేందుకు ఉపయోగించేవారము. ఫాక్టరీలలో వాడే వంటచెరుకు కు ప్రత్యామ్నాయం గా ఈనాడు ఫ్యూయిల్ ను మనం వాడుతున్నాము. ధరలు తక్కువగా ఉన్న సమయంలో దానిని సేకరించి ఉంచుకోవడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాక ఉత్పత్తీ నిరాటంకంగా సాగిపోతుంది.
          నేయి నూనెలు - మనం ఉపయోగించే నూనె పదార్ధాల నిలవలు సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉంది.
3) కూపములు - బావులు, తటాకాలు (చెరువులు) -- జలాశయాలు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా నీటి ఎద్దడిని నివారించడం సాధ్యపడుతుంది. నీరు పుష్కళంగా ఉంటే పంటలు పండుతాయి. పరిశ్రమల స్థాపనకు వీలవుతుంది. పౌరుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.
4) ఔషధములు - ఆరోగ్యాన్ని కాపాడే మందులు. అవసరమైన ఔషధాలు నిరంతరం అందుబాటులో ఉండాలి. సేవాభావంతో పనిచేసే వైద్యులు, వారికి సహాయపడే సహాయక సిబ్బంది, వారికి అవసరమైన వనరులు నిరంతరం అందుబాటులో ఉంచాలి. క్షణాలపై రోగిని వైద్యాలయానికి తీసుకొని వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి అవసరమైన వనరులను అందించాలి.
5) ఆయుధములు: రక్షణలో ప్రముఖ భూమిక పోషించేవి ఆయుధాలు. మనమెంత ధైర్యసాహస వంతులమైనా శత్రువు చేతిలో ఆధునిక ఆయుధం ఉంటే ఓడిపోక తప్పదు. నాణ్యత, నవ్యతలు ప్రాతిపదికగా ఆయుధ సమ్పత్తిని పెంచుకుంటూ ఉపయోగంలో లేని లేదా కాలం చెల్లిన వాటి స్థానంలో ఆధునిక సామాగ్రిని సమకూర్చుకుంటూ, సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇప్పిస్తూ ఉండే నాయకుడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాడు.
6) ఆభీల యంత్రాలు - పెద్ద పెద్ద యంత్రాలు. ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి ఉంటుందో అక్కడే యంత్రాలు అవసరమౌతాయి. పెద్ద యంత్రాలు పారిశ్రామిక అభివృద్ధికి చిహ్నాలు. అవసరానికి మించిన సామర్ధ్యంతో పనిచేసే యంత్ర సామాగ్రిని, విడిభాగాలను అందుబాటులో ఉంచాలి. వాటిని ఉపయోగించే సిబ్బందికి తగిన శిక్షణ నిప్పించాలి. నియమిత కాలాలలో వాటికి మరమ్మత్తులు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాక అవసరానుగుణంగా ఆ యంత్రాలను ఆధునీకరించుకోవడం తప్పనిసరి.
ఈ వ్యవస్థల అన్నింటిలో మానవ వనరులు అత్యంత ప్రధానమైనవి. ఏ రంగంలో నిమామకాలు చేపట్టినా... మచ్చలేనట్టి వారు, ధైర్యం, శౌర్యం, సాహసం లాంటి గుణాలు కలిగిన వారిని, ప్రతిభావంతులను, ఆప్తులను నియమించుకోవడం ఉత్తమం.
          ఇలా అన్ని రంగాలను పరిపుష్టి చేయగలిగితే, ధీమంతులు, ప్రజ్ఞాపూర్ణులు, సమర్ధులైన అధికారులు, సలహాదారులు తమ తమ కర్తవ్యాలను చిత్తశుద్ధితో చేసుకుంటూ పోతారు... అప్పుడు... నాయకుడు లేదా రాజు అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది.


శంఖ - లిఖితులు
          పూర్వం శంఖ లిఖితులు అనే సోదరులు ఇరువురు ప్రక్కప్రక్కన ఆశ్రమాలు నిర్మించుకొని తపో సాధనలో ఉండేవారు. ఒకనాడు లిఖితుడు తన అన్న ఆశ్రమానికి వెళ్ళాడు. అన్నగారు ఇంట్లో లేరు. ఆశ్రమం ముందున్న తోటలో తిరుగుతూ ఆ తోటలో బాగా మ్రగ్గిన "ఆకర్శణీయ"మైన పండ్లను కోసుకొని తింటున్నాడు. ఇంతలో అన్న వచ్చాడు. తమ్ముడిని అడిగాడు "ఈ పండ్లు ఎక్కడివ"ని. తమ్ముడన్నాడు... ఇవి మీ తోటలోనివేనని. దానికి శంఖుడన్నాడు..."నీది కాని దానిని కామించావు. అనుమతి లేకుండా తీసుకున్నావు, అనుభవించావు" ఇది దొంగతనం క్రిందికి వస్తుంది. ఎదుటి వారెంత స్వంత వారయినా వారి అనుమతి లేకుండా వారి వస్తువులు వాడడం నేరమవుతుంది. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తంగా శిక్షను అనుభవించమన్నాడు. అన్ననా శిక్షను వేయమని తమ్ముడన్నాడు. శిక్ష వేసే అర్హత నాకు లేదు. అది రాజు యొక్క అధికార పరిధిలోకి వస్తుంది. కాబట్టి రాజును ఆశ్రయించమంటాడు. లిఖితుడు సుధాముడనే రాజును ఆశ్రయించడం... అతడు లిఖితుని చేతులు నరికించడం (దొంగతనాలకు విధించే శిక్షను) జరుగుతుంది. తదుపరి లిఖితుడు అన్న వద్దకు వెళ్ళడం.. శంఖుని సూచన మేరకు లిఖితుడు అక్కడే ఉన్న "బాహుదా" నదిలో స్నానం చేస్తాడు. ఆ నదిలో మునిగినంతలోనే మళ్ళీ లిఖితునికి పూర్వం ప్రకారంగా చేతులు వచ్చేస్తాయి.
          ఇది భారతంలోని ఒక కథ. ఇందులో మనం చూడాల్సిన, చూడ దగిన కోణం ఏమిటి?
          నిజానికి, ప్రతివ్యక్తిలో ఒక పెద్దాయన, ఒక తండ్రి, ఒక పిల్లవాడు (APC - Adult, Parent and Child) ఉంటారు. వివిధ సందర్భాలలో ప్రతి వ్యక్తీ ఈ మూడు మనస్తత్వాలతో ప్రవర్తిస్తుంటాడు. ఈ మూడింటికి మరొక్కటి జతచేస్తే... ఒక పిల్లవాడు, యౌవన వంతుడు, ప్రౌఢ వయస్కుడు, వృద్ధుడు ఇలా ఈ అవస్థలను చెప్పుకోవచ్చు.
౧) చిన్న పిల్లడు; పిల్లలలో అమాయకత్వం ఉంటుంది. ఉత్సాహం ఉంటుంది. ప్రతి విషయాన్నీ ఆశ్చర్యంతో చూస్తాడు... తనకు కావలసింది నిష్కల్మషంగా అడుగుతాడు. అడిగినది లభిస్తే ఆనందంలో మునిగి పోతాడు. ఆ అనుభూతిలో చక్కని అనుభవాన్ని పొందుతాడు. ఆ ఆనందంలో దైవత్వం ఉంటుంది.
౨) యువకుడు; యువకునిలో ఆవేశం, సాహసం ఉంటుంది. కామిస్తాడు. విలువ తెలియకుండా ప్రవర్తిస్తాడు. ఎక్కడెక్కడో సంతోషాన్ని వెదుక్కుంటూ తనలో ఉండే ఆనందానికి గుర్తించలేని మానసిక స్థితిలో చంచలత్వానికి ఆశ్రయమిస్తాడు. గమ్యంలేని నిరంతర యానంలో అనుభూతులకు, అనుభవాలకు దూరంగా ఉంటాడు.
౩) ప్రౌఢ వయస్కుడు; ఇతనిలో పరిణతి ఉంటుంది. అనుక్షణం ఉద్యమ స్పూర్తితో, బుద్ధితో ఆలోచిస్తూ, ధైర్యంగా ముందడుగు వేయగలిగిన విచక్షణ ఉంటుంది. నిత్య నవీన యోజనా ప్రణాళికా స్పూర్తితో తన శక్తి సామర్ధ్యాలకు పదను పెట్టుకుంటూ పరస్పరాధారిత సూత్రంతో తనకున్న దానిని పంచుకునేందుకు సిద్ధపడతాడు. అందరి అభిమానాన్ని చూరగొంటాడు. విజ్ఞతతో ప్రవర్తిస్తూ.. ప్రతి అనుభవాన్ని తన అభ్యుదయానికి సోఫానం చేసుకుంటాడు. బాలునిలో తన వార్ధక్యాన్ని చూస్తాడు. యువకునికి మార్గ దర్శన చేస్తాడు. పంచుకోవడంలో ఆనందాన్ని పొందుతాడు.
౪) వృద్ధుడు; తనదంటూ మిగుల్చుకోకుండా తనకున్నది ఆర్తుల కందిస్తాడు. విజ్ఞానం, ప్రజ్ఞ, అనుభవం ఏదైనా అర్హత ప్రాతిపదికగా.. కల్మషంలేని హృదయంతో అందిస్తాడు. ప్రతిగా ఏమీ ఆశించకుండా వివేకంతో, సమర్పణా భావంతో సమర్పిస్తూ ఆనందిస్తాడు. అర్పణచేస్తూ తన్మయుడౌతాడు, తాదాత్మ్యత చెందుతాడు.
ప్రతి వ్యక్తిలో ఏదో ఒక క్షణంలో ఈ నాలుగు అవస్థలు కనిపిస్తూనే ఉంటాయి.
1) తనకు కావలసింది అడిగి ఆనందంగా తీసుకునే సమయంలో బాల్యావస్థను చూస్తాం
2) తనకు కావాలనుకున్నది తానుగా సాధించుకున్న సమయంలో యౌవనాన్ని చూస్తాం
3) ఆలోచనాపూర్ణుడై వివేకంతో తనకున్నదానిని పంచుకునే సమయంలో ప్రౌఢత్వాన్ని చూస్తాం
4) మనఃస్పూర్తిగా సమర్పణ చేయడంలో వార్ధక్యాన్ని చూస్తాం
బాల్యావస్థను ఆశ్రయించాల్సిన లిఖితుడు యౌవనావస్థను ఆశ్రయించాడు. ఆలోచనా పూర్ణుడై పశ్చాత్తాపంతో ప్రౌఢత్వాన్ని పొందాడు. చివరగా దండనను పొందడంతో అహంకారాన్ని వదిలేసి వృద్ధుడయ్యాడు.
(With Thanks and apologies to Sri G. Narayana Guruji)
Palakurthy Rama Murthy






యక్ష ప్రశ్నలు
యక్షుడు ధర్మరాజును అడుగుతున్నాడు....
ఏమి కతమున భూదేవు డెసగు దేవ భావమున? నాతనికి సాధుభావ మెవ్వి
ధమున నగు? నసాధుత్వ మెద్దాన జెందు? మానుషుండగు నాతడే దాన? జెపుమ!
౧) దేని వల్ల భూదేవుడు (బ్రాహ్మణుడు) దివ్యత్వాన్ని సాధిస్తాడు?
౨) అతనికి నిర్మలత్వం ఎలా ఏర్పడుతుంది?
౩) అతను ఎలా మాలిన్యుడౌతాడు?
౪) దేని వల్ల బ్రాహ్మణుడు మర్త్యుడు అవుతాడు?
ధర్మ రాజు ఇలా చెపుతున్నాడు....
అనవుడు ధర్మజుండనియె; "అధ్యయనంబున దేవ భావముం"
గను నవనీ సుపర్వు; డధిక వ్రతశీలత సాధుభావమా"
తనికి; "విశిష్ట వృత్తి దిగద్రావి యసాధువ"నంగ నుండు; "శౌ
చ నియతి లేక మృత్యు భయ సంగతి" నాతడు మానుషుండగున్!
౧) దానికి ధర్మ రాజు ... వేదపఠన వల్ల విప్రుడు దివ్యుడౌతాడంటాడు. "విద్" అనే ధాతువు నుండి వచ్చింది వేదం అనే మాట. విద్ అంటే తెలుసుకొనుట. ఇది నిరంతరం జరిగే... జరగాల్సిన ప్రక్రియ. అధ్యయనాధ్యాపకాలు ఎంత ఎక్కువగా జరిగితే మేధస్సు అంత చురుకుగా పనిచేస్తుంది. మీమాంసతో (హేతువుతో సాధించే శాస్త్రము) ఆ మేధస్సు సరైన మార్గంలో పయనిస్తుంది... సరైన విధానంలో ఆలోచిస్తుంది. బ్రాహ్మణుడు విజ్ఞానానికి ప్రతీక... నిర్వహణకు అధికారి. అందువల్ల నిర్వహణ సలిపేవాడు ఎలా దివ్యాత్వాన్ని సాధిస్తాడు? అని యక్షుని ప్రశ్నలో అంతరార్థం. నిర్వహణ మేధస్సుకు సంబంధించినది. విషయ సేకరణ ఎక్కువగా జరగాలి. సంగ్రహించిన విషయాన్ని సరైన కోణంలో విశ్లేషణ చేసుకోవాలి. తాన ఆధ్వర్యంలో నడచే సంస్థలో విజ్ఞానం కావచ్చు, మానవ వనరులు కావచ్చు, వస్తు సంభారాలు కావచ్చు, యంత్ర సామాగ్రి కావచ్చు... ఏదైనా నివహణకు అవసరమైనవి - అవసరంలేనివి... ఇప్పుడు కాకపోయినా తదుపరియైనా అవసరం అయ్యేవి.. నిరర్ధకమైనవి... ఇలా గుర్తించడం వ్యర్ధాలను నియంత్రించడం, అవసరమనవాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం లోనే నిర్వహణాధికారి సామర్ధ్యం నిరూపితమౌతుంది. క్రొత్తను ఆవిష్కరించడం, మార్పును ఆహ్వానించడం, సమర్ధులైన అనుచరులను గుర్తించడంబాధ్యతలను పంచుకోవడం వల్ల తన సామర్ధ్యాన్ని ప్రకాశం చేసుకోగలుగుతాడు నిర్వహణాధికారి. క్రొత్తను అన్వేషించడం (Reasearch) ఉన్న దానిని అభివృద్ధిపరచడం(Development) వల్ల సంస్థ పురోగతి సాధ్యపడుతుంది. సంస్థను నమ్ముకున్న వారికి ప్రగతి సాధ్యపడుతుంది. ఆ సంస్థను నిర్వహించే నిర్వహణాధికారి దివ్యుడౌతాడు.
౨) నిర్మలత: నిష్ఠ వల్ల నిర్మలత్వం ఏర్పడుతుంది. నియమబద్ధమైన నిష్ఠ, క్రమశిక్షణాపూర్ణ జీవన విధానం వల్ల నిర్మలత వికసిస్తుంది. సోమరితనాన్ని విడిచిపెట్టడం, సత్య నిష్ఠ వల్ల మనసులో నెలకొన్న ధైర్యం.... తన మార్గంలో ఎదురయ్యే ఆటుపోటులను భరించగలిగే స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. దాని వల్ల ఎంత ఒత్తిడిలోనైనా సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతాడు. స్వార్థ ప్రయోజనాలకు దూరంగా కర్తవ్య నిష్ఠతో చరించే వ్యక్తి నిర్మలుడౌతాడు.
౩) మలినం ఎలా? స్వచ్ఛమైన శీలవంతుడై, స్వార్ధానికి దూరంగా సంస్థ ప్రయోజనాలను, జాతి ప్రయోజనాలను కాపాడేవాడు ఉత్తమ నిర్వహణాధికారి. అలాకాక శీలానికి విలువ నివ్వకుండా, అధర్మ వర్తనుడై, స్వార్థపరుడైన వ్యక్తి ఎంత సమర్థుడైనా, విద్యావంతుడైనా అతడు పాపవర్తనుడే అవుతాడు. అతని వర్తనలో మాలిన్యం కనిపిస్తుంది.
౪) మర్త్యుడెలా అవుతాడు? భయం వల్ల ఎంతటి వాడైనా మర్త్యుడవుతాడు. అంతశ్చేతనలో పొడసూపే భయం తన విజయంపై తనకే అనుమానాన్ని కలిగిస్తుంది. అనుమానం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఏకాగ్రత లేమి తన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దానితో ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి వల్ల సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోలేక పోవడం దాని వల్ల కార్య విఫలతా కలుగుతాయి. ఎవడైతే భయాన్ని ఆశ్రయిస్తాడో అతడు అపజయం పాలవుతాడు. అపజయం పొందడం వల్ల దివ్యుడైనా మర్త్యుడౌతాడు.

          ఎవరైతే మనో వాక్కాయ కర్మలతో శుచిత్వం పొందుతాడో అతడు దివ్యుడు. దానికి దూరమైన వాడు మర్త్యుడు.