Monday, June 11, 2018

బద్ధకం విజయానికి ప్రథమ శత్రువు

ఆపనీపని జేయ నర్హమౌ పని జేతు
ననుచు మాటలు జెప్పు చహరహమ్ము
యేపని సేయక యిప్పుడప్పు డనుచు
వాయిదా వేయు తత్వమ్ము మరియు
అహము ననాసక్తి యనుమాన మెవరైన
చేతురీ పని యను చిత్త వృత్తి
కలుగు టెన్నగ బధ్ధకమ్మందు రయ్యది
విజయాభిలాషను వితధి సేయు
దాత తలరాత తప్పింప తరమె మనకు
కలుగ యోగ మదృష్టమ్ము కలుగు భోగ
మనుచు యత్నింప డేపని యధము, డతని
బ్రతుకు వ్యర్థంబు, మెచ్చదు భావి తరము!
ఎదగంగ నారాట మెదనిండ మొలకెత్తు
పృథ్విని జీల్చుచు విత్తనములు
పట్టుదలను బూని పడిలేచు కెరటమ్ము
కసితోడ గెలువంగ కాంక్ష రగల
పరుగెత్తు నిరతమ్ము పరిణతి సాధించు
తపనతో చిఱుత యుత్సాహ ముబ్బ
పరహితమ్మును గోరి పరితపించుచు మేఘ
మంబరమ్మును వీడి యవని జేరు
కలిగె నడ్డంకులని చీమ గమన మాప
దెపుడు; జలధి జేరెడి నది యెప్పు డాగ
దలసి తేనంచు; గగన విహారి యైన
పక్షి తలపదు యెగురుట శిక్ష యనుచు!
విసుగున్ జెందవు పూవు పూవు దిరుగన్ భృంగమ్ములున్ దేనియల్
వెస సాధింపగ; గ్రద్ద దల్ప దెదలో విస్తారమౌ నాత్మ ప
క్ష సమూహంబులు ముక్కులన్ బెరుకుచో గల్గున్ గదా బాధయం
చు; సమస్యల్ వడి దాట లేమి జయమున్ సూత్రింప శక్యంబొకో!
అలఘు సంకల్ప బలము; విద్యా విభూతి;
స్వ ప్రయత్నమ్ము; సృజన; సజ్జనుల చెలిమి;
కలుగ దొలగును యెద బధ్ధకమ్ము! దాన
జయము, యశమును, కార్య సిధ్దియును కలదు!
Palakurthy Rama Murthy

No comments: