ఉదయ భానుని ప్రథమాంశు యోగ మంది
పులకరించిన కోడి కూతలకు లేచి
తల్లి దండ్రుల గురువుల దలచి మ్రొక్కి
అరుగు పశుశాల చేర రైతన్న యొకడు!
కడుగు పశువుల, పశుశాల కసువు దీసి
గ్రాసమున్ నీరు పశు తతి కమర జేయు
వత్సముల విడ్చి గోవుల పాలు దీసి
పొలము జనబోవు కాడి కెద్దులను గట్టి!
వాని కనుకూలవతి గుణవతియు సతియు
ఎగ్గ జామున మేల్కొని యిల్లు జిమ్ము
ముంగిటన్ జల్లి కళ్ళాపి, ముగ్గులేసి
కవ్వ మాడించి దాలిలో గాచు పాలు!
అత్తమామలు పతి మెచ్చు నటుల వండి
ఇల్లు సవరించి చలది మూటెత్తి తలను
పసుల దోలుకు యింతి దా పయన మౌను
మ్రోయు చుండగ నందియల్ పొలము వైపు!
హలదారియై పతి అవని దున్నెడి వేళ
చాలులో సతి విత్తనాలు నాటు
పొలమందు మగడు దా మోట గొట్టెడు వేళ
సరి జేసి గట్లన్ని జలము పెట్టు
గుబురైన చేనిలో గొర్రు దోలగ భర్త
కలుపు దీయును కాంత అలుపు లేక
వరి మళ్లలో పతి వరినారు పంచంగ
మగువ నాటును నారును మళ్లలోన
పురుగు మందులు జల్లంగ, యెరువు లేయ,
పంట కోయంగ, మెద గట్ట, పడుగు పెట్ట,
బంతి దొక్కింప, పంట తూర్పార బట్ట
ఆలు అర్దాంగి యన వెంట నంటి యుండు!
అమల ప్రేమానురాగమ్ము లాత్మ నిండ
తల్లియై పొట్ట నింపును తనయ యౌచు
పోవు గారాలు ప్రియురాలి పోల్కి పతిని
ముద్దు మురిపాల దేలించు, ముద్దరాలు!
గంపల కెత్తు ధాన్యములు గాదెలు నింపగ ధాన్య లక్ష్మి దా
నింపుగ నాట్యమాడ తన యింటను, సంతతి బుధ్దిమంతులై
పంపు యొనర్పగా, పతియు బాసట నిల్వగ బాంధవాళి లో
బెంపు వహించె నర్ధి జన వేదన బాపుచు నన్ని వేళలన్!
కాలమ్ము యొకరీతి గడవ దన్నట్లుగా
వ్యవసాయ వృత్తి కోల్పడియె ప్రభను
కాలూనె భూమిపై కరవు రక్కసి యంత
చిన్న మబ్బును లేదు చినుకు లేదు
యెండి పోయెను కుంట లెండెను చెరువులు
పాతాళమున కేగె బావి జలము
నదుల నదమ్ముల నలుసాయె
నీరమ్ము
తల్లడిల్లిరి ప్రజల్ దాహ మనుచు
పసులు దినమేత కరవాయె పంట దగ్గె
వ్యయము పెరిగెను ఋణభార మధిక మయ్యె
అడవి అమ్ముచో కొను చోట నదియె కొరివి
పల్లె సీమల బ్రదుకు దుర్భరము లయ్యె!
కాల గమనంలో.....
అనురాగ మాప్యాయ తాత్మీయతలు తగ్గె
వ్యాపార బంధమ్ము లధిక మయ్యె
అడుగంటె విలువలు అరుదాయె విజ్ఞత
భద్రత కరవాయె బ్రతుకులందు
జనులలో సహనంబు సాహసమ్ములు తగ్గె
శక్తి సామర్ధ్యముల్ సన్న గిల్లె
మార్గంబు జూపించు మహనీయు లలతులై
రధికార మవినీతి నాశ్రయించె
ముక్కలైనను రెక్కలు దుక్కిదున్ని
చెమట చిందించి దినమంత శ్రమను జేసి
పొట్ట గడవని దుస్థితి పొందె రైతు
యోడలయ్యెను బండ్లు బండ్లోడ లయ్యె!
చితికి బోవంగ నార్థిక స్థితియు గతియు
అమ్మి పొలమును పశువుల నమ్మి రైతు
వదలి తనవారి నూరును వలస పోయె
పట్టణమునకు కూలియై పడతి గూడి!
ఎన్నడు నర్ధియై యొరుల నిమ్మని యించుక వేడ బోని రై
తన్నయ కూలికై పరుల దాపున జేరి కరంబు సాచె, నే
మన్నను మౌన మూనె, నభిమానము నావల బెట్టె, చిత్రమౌ
నెన్నగ దైవ లీలలు యదేమొ పరీక్షలు గల్గు మంచికే!
తనదు దైన్య స్థితిన్ దల్చి తల్ల డిల్లు
మగని కండయై ధైర్యమ్ము మగువ చెప్పు
కష్ట నష్టాలు సుఖము దుఃఖము లనంగ
జీవితమ్మున సహజముల్ జీవితేశ!
ఓటమి పాలు చెందితని యూరక గ్రుందెద వేల, ముందు ఆ
యోటమి కేమి కారణమొ యుక్త విచారము సేయగా వలెన్
పాటున కోర్వమిన్ భువి శుభంబులు గల్గునె, కాలి కొల్మిలో
వేటున కోర్చి నప్పుడె యభీష్ట విభూషణ మౌను హేమమున్!
మున్ను రంపపు కోతల నెన్నొ యోర్వ
ముగ్ధమోహన రూపయౌ ముదిత కురుల
దూరు సౌభాగ్య మందదే దువ్వెనయును
కష్ట జలధిని యీదక గలదె సుఖము!
గెలుపు కోటమి తొలిమెట్టు, గెలువ దలచు
యున్నతుల ముందు యోటమి యోడిపోవు
పట్టుదల యోర్మి ఆత్మ విశ్వాసములతొ
నరుగ ముందుకు యత్న కార్యము ఫలించు!
వ్యవసాయంబు వరిష్ఠ మందు రయినన్ ప్రాచీనమౌ సంప్రదా
య విధానంబులు మార్చుకో కునికి, విద్యా హీనతన్ యోజనా
వ్యవధిన్ గాంచమి, దూరదృష్టి గనమిన్, స్వాంతమ్ము వాంఛా ద్యుతిన్
వివృతిన్ జెందమి, నూత్న శాస్త్రగత సంవిత్ జ్ఞానమిన్ బొందమిన్!
అపజయమ్మును బొందితి మయ్య మున్ను
మొదటి అనుభవ సారమ్ము యెదను నిలిపి
తగు ప్రణాళిక రచియించి తడయ కుండ
గమ్యమున్ జేర యత్నింప గలుగు జయము!
స్పష్టమౌ లక్ష్యమ్ము, సంపూర్ణ యోజన,
రగిలెడి తపనయు శ్రధ్ద గలిగి
ఉద్యోగ సమితియు వ్యుత్పత్తి పరిణతి
క్రమ శిక్షణాయుత ప్రతిభ జూప
నాణ్యమై శుధ్ధమైన ముడి సరుకులును
మిగుల వనరుల సమీకరించి
వినియోగ దారుల విశ్వాసమును బొంది
వ్యయ నియంత్రణ పైన పట్టు గలిగి
అదుపు లోన భావోద్వేగ మమరి యుండ
కచ్చితత్వము విషయ సంగ్రహణ దీప్తి
త్వరగ నిర్ణయాల్ గొను శక్తి స్పష్టమైన
పలుకు తీరును గలిగిన కలుగు జయము!
ఆదిన్ ధైర్యమె నీకు ప్రేరణ, యసాధ్యంబెద్ధి లేదీ భువిన్
ప్రోదిన్ జేసిన చిన్ని చిన్ని జయముల్ పూర్ణత్వమున్ గూర్చు నీ
వేదీ జేయక బేలవై వగవ యింకే రీతి మేలౌ వృధా
గాదే యత్నము, నమ్ము నీవు నిను, సంకల్పమ్ము సిద్ధించురా!
అని వనిత చెప్పు పలుకులు
విని పతియును యోజ సేయ విజ్ఞత తోడన్
మనమున దృఢమై నిలిచెను
ఘనమగు లక్ష్యంబు, గెలువ కాంక్షయు పెరిగెన్!
అనితర సాధ్యమై వెలుగు నట్టి మహోన్నత లక్ష్య మొక్కటిన్
మనమున జేర్చి సాగె పతి మంత్రిణియై సతి వెంట నిల్వగా
తనదగు వైఖరిన్ పని విధానము, జ్ఞానము నైపుణీ గతుల్
మును తను మార్చుకో గలిగె, పొందెను తా విజయానుభూతులన్!
అస్తమించుట కాదు నాకపజయమ్ము
యెదురు నిల్చిన యవరోధ మెంత దైన
అధిగమించెద గెల్చెద ననెడి మాడ్కి
గానిపించెను తూర్పున కర్మసాక్షి!