Thursday, August 16, 2018

శ్రీ రాముని వ్యక్తిత్వం

రామ రావణ యుద్ధం ముగిసింది. రావణుని మరణ వార్తను విన్న మండోదరి రణక్షేత్రానికి పరుగు తీసింది. రావణుడు మరణించడం, మానవుడైన రాముడు గెలవడం ఆమె నమ్మలేని కఠోర సత్యం అది. ఆమె యక్షుని కూతురు. యక్షులు సహజంగా బలిష్టులు. దానికి తోడు తన భర్త ముల్లోకాలను గెలిచిన వాడు. 
అల్పులైన మానవులు గెలవడం ఎలా సంభవం. సత్యమైనా జీర్ణయించుకునే మానసిక స్థైర్యం లేని స్థితి ఆమెది.

మండోదరి విడి పోయిన కొప్పు ముడితో సరైన వస్త్రధారణ లేక శోకాతురయై పరుగు పరుగున వస్తుంది. మనసులో రాముని మీద కోపం... రాముని నిందించాలనే ఆత్రుత.  రాముడిని ఇదివరకు తాను చూడలేదు. అతని వ్యక్తిత్వం పరిచయం లేదు. అతనిపై ఆక్రోశంతో కూడిన కోపం మాత్రం ఉంది. ఆవేదనతో కూడిన ఉక్రోషం ఉంది. రాముడు కూడా ఇదివరకు ఆమెను చూడలేదు. 

రావణ వధ జరిగింది. ఉభయ సైన్యాలు యుద్ధం చాలించి యుధ్ధ భూమిలో నిలుచున్నాయి. రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా పడుతున్నది. 
దూరం నుండి వస్తున్న మండోదరి యొక్క నీడ కూడా దూరం నుండి కనిపించిందతనికి. 
ఎవరో తెలియదు కాని నీడను చూస్తే ఆ ఆకారం స్త్రీ మూర్తిదని అతని కర్ధమైంది. దగ్గరగా వచ్చే ఆ స్త్రీ మూర్తి నీడ తన నీడను తగలకుండా దిగ్గున లేచి ప్రక్కకు తప్పుకున్నాడు.

ఆ సన్నివేశాన్ని చూచిన మండోదరి అంతటి దుఃఖ సమయంలో కూడా అతని స్ఫురణను గమనించింది. అతని వ్యక్తిత్వ విలువలు ఎంత గొప్పవో గ్రహించింది. తన నీడ కూడా పరాయి స్త్రీ పయి పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది. కాబట్టే రాముని పై తనకున్న క్రోధం ఆమెలో మాయ మయింది. 

యుధ్దంలో శత్రువును జయించామా లేదా అన్నది కాదు ప్రశ్న. జయం అపజయం శాశ్వతం కావు. విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వ వికాసం మాత్రమే. 
డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవన్నీ మత్తు నిచ్చేవే. వ్యక్తుల నుండి విడదీసేవే.
మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం అంటుంది రామాయణం. అలాంటి నాయక పాత్రకు ప్రతీక రాముడు.

అధమాః ధనమిచ్ఛంతి,
ధనం మానంచ మధ్యమాః
ఉత్తామాః మానమిచ్ఛంతి
మానోహి మహాతాం ధనం!

ధనం కోసం ఏమయినా చేసేందుకు వెనుకాడని వారు, ధనం మానం రెంటికై యత్నించే వారు, 
మానం కోసమే జీవించే వారు ఈ మూడు రకాలయిన వ్యక్తులు సమాజంలో మనకు కనిపిస్తారు. 
మొదటి రకం అధములు, రెండవ రకం మధ్యములు మూడవ రకం ఉత్తములు అంటున్నారు, సుభాషిత కర్త.

ఎలాగైనా గెలుపే పరమావధి అనుకోవడం Result oriented attitude కాగా 
ధర్మ బధ్దమైన రీతిలో విజయం పొందాలనుకోవడం Process oriented attitude.
గెలుపు ఇతరులపై సాధించేది కాగా విజయం అందరి భాగస్వామ్యంతో పొందేది.
గెలుపులో అసూయ ఉంటుంది, అభద్రత ఉంటుంది. విజయంలో శాంతి ఉంటుంది. సౌమనస్యత ఉంటుంది. 
ఇదే రామాయణం మనకు బోధించే నీతి.
పాలకుర్తి రామమూర్తి

Saturday, July 14, 2018

Innovative and steady wins the RACE

Innovative and steady wins the RACE

In Ramayana, Hanuman was assigned a task to search Sita. He has not seen Sita earlier nor does he know how she is to be identified. Still he went to Lanka. He was to cross the sea and subjected to encounter many hurdles on his way. All his efforts were in vain at one stage as he could not found Sita there. Still he was not discouraged. He evaluated total system he followed all the time and thought past practises are not sufficient. And wherever there is a flaw he rectified in his plan and intensified his search with full enthusiasm and clarity. At last, he could found her in Lanka successfully and come back. What all the qualities that have contributed to his success are summarised... He was confident that he could succeed (Confidence), He ignited his mind and observed every inch of Lanka (Keen observation), with full clarity of consequences he moved forward (thorough understanding), he moved as a small monkey (flawless planning), never he quit his trail (perseverance), alone he entered Lanka and fought with all evils (courage}, never felt it is not my job (dedication) and He fought with Rakshasas and entered the courtyard of Ravana and tried to convince Ravana to surrender Sita to Rama to avoid a war (Putting total efforts) all the above qualities have presented him the rarest success. One should not take rest till the work is completed.
PALAKURTHY RAMA MURTHY

Monday, June 11, 2018

జ్నానం నైపుణ్యం కలిస్తే విజయం

ఆత్మీయులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, సాహితీ బంధువులకు నమస్సులు.
శుభోదయం.
ఆద్యమౌ విశ్వ సంవ్యాప్తమౌ పూర్ణమౌ
శాశ్వత చైతన్య సత్య దీప్తి
సృజియింప బ్రహ్మమై చేతనన్ విష్ణువై
లయమందు శివమునై లలిత గతుల
పరమంబు నిత్యమ్ము భగవంతుడా శక్తి
పూర్ణావతారమై పుడమి వెలిసి
కదన రంగమునందు కర్తవ్య విముఖుడై
మొహంపు జలదిలో మునిగి యున్న
నరుని విధ్యుక్త ధర్మంబు గురుతు సేసి
గీత బోధించి కర్తవ్య రీతి దెలిపి
క్లైభ్య మతి వీడి ధర్మంబు రక్ష సేయ
యొజ్జయై నడిపె నరు నా యోగి వరుడు!
దివ్య విజ్ఞానమునకు ప్రతీక యగును
యోగి వర్యుండు కృష్ణుడీ యుర్వి మీద
దీప్త నైపుణ్యమునకు ప్రతీక యగును
అలఘు గాండీవ ధారియో అర్జునుండు!
సారధిగ దారి నడిపింప జ్ఞానదీప్తి
రథికుడై సాగె నైపుణ్య రమ్య భూతి
ఎచట జ్ఞానంబు నైపుణ్య మేక మగునొ
విజయ మచ్చట నిజమని విబుధు లంద్రు!
నమస్సులతో
భవదీయుడు
పాలకుర్తి రామమూర్తి

శ్రీ విళంబి నామ యుగాది శుభాకాంక్షలు.

ఆత్మీయ కుటుంబ సభ్యులు, మిత్రులు అందరికీ నమస్సులు.
శుభోదయం.
మంచైన చెడ్డైన మాన్యంబ టంచెంచు
సమరస చిత్తమ్ము జనుల కిడగ
అధికార మదమును ఆశ్రిత పక్షపా
తమ్మును అవినీతి దరికి రాని
అధికార యంత్రాంగ మమలిన నాయక
త్వమ్మును ఇమ్ముగా ప్రజల కిడగ
అత్యున్నతాదర్శ మాపూర్ణమై యొప్పు
విలువల భరితమౌ విద్య నిడగ
సకల జనులును శాంతియు సౌఖ్య సమితి
ఆర్థికాభ్యున్నతిని బొంది హర్ష మొదవ
స్వాగతింతుము రావమ్మ భద్రదాయి
ఓ "విళంబి" వత్సరమా శుభోదయమ్ము!
ధార్మిక వరులకు కర్షక
కార్మిక వర్గంబులకును గౌరవ యుతమౌ
నిర్మల జీవన గతులను
పేర్మిన్ యొసగంగ నిన్ను పిలిచెద భువికిన్!
కాల మాగదు; మనుజ సంకల్ప బలము
దైవ బలమును తోడుగా ధాత్రి యందు
విభవ ముప్పొంగు, స్వర్గ మావిష్కృతమగు
అట్టి సంకల్ప మిమ్ము ఈ ప్రజాళి కెల్ల!
కాలానుగుణ్య వర్షము
చాలంగా నిచ్చి రైతు సమితికి నెల్లన్
మేలుఘటింపు విలంబీ
వాలాయము చేయకుండ వాత్సల్యముతోన్!
అనువైన కాలమందున
అనువగు వాతావరణము లమరుచు క్షోణీ
జనములు ధార్మిక రతులై
మనగను దీవించ వమ్మ మాన్య విళంబీ!
పాలకుర్తి రామమూర్తి

బద్ధకం విజయానికి ప్రథమ శత్రువు

ఆపనీపని జేయ నర్హమౌ పని జేతు
ననుచు మాటలు జెప్పు చహరహమ్ము
యేపని సేయక యిప్పుడప్పు డనుచు
వాయిదా వేయు తత్వమ్ము మరియు
అహము ననాసక్తి యనుమాన మెవరైన
చేతురీ పని యను చిత్త వృత్తి
కలుగు టెన్నగ బధ్ధకమ్మందు రయ్యది
విజయాభిలాషను వితధి సేయు
దాత తలరాత తప్పింప తరమె మనకు
కలుగ యోగ మదృష్టమ్ము కలుగు భోగ
మనుచు యత్నింప డేపని యధము, డతని
బ్రతుకు వ్యర్థంబు, మెచ్చదు భావి తరము!
ఎదగంగ నారాట మెదనిండ మొలకెత్తు
పృథ్విని జీల్చుచు విత్తనములు
పట్టుదలను బూని పడిలేచు కెరటమ్ము
కసితోడ గెలువంగ కాంక్ష రగల
పరుగెత్తు నిరతమ్ము పరిణతి సాధించు
తపనతో చిఱుత యుత్సాహ ముబ్బ
పరహితమ్మును గోరి పరితపించుచు మేఘ
మంబరమ్మును వీడి యవని జేరు
కలిగె నడ్డంకులని చీమ గమన మాప
దెపుడు; జలధి జేరెడి నది యెప్పు డాగ
దలసి తేనంచు; గగన విహారి యైన
పక్షి తలపదు యెగురుట శిక్ష యనుచు!
విసుగున్ జెందవు పూవు పూవు దిరుగన్ భృంగమ్ములున్ దేనియల్
వెస సాధింపగ; గ్రద్ద దల్ప దెదలో విస్తారమౌ నాత్మ ప
క్ష సమూహంబులు ముక్కులన్ బెరుకుచో గల్గున్ గదా బాధయం
చు; సమస్యల్ వడి దాట లేమి జయమున్ సూత్రింప శక్యంబొకో!
అలఘు సంకల్ప బలము; విద్యా విభూతి;
స్వ ప్రయత్నమ్ము; సృజన; సజ్జనుల చెలిమి;
కలుగ దొలగును యెద బధ్ధకమ్ము! దాన
జయము, యశమును, కార్య సిధ్దియును కలదు!
Palakurthy Rama Murthy

శ్రమయేవ జయతే

ఉదయ భానుని ప్రథమాంశు యోగ మంది
పులకరించిన కోడి కూతలకు లేచి
తల్లి దండ్రుల గురువుల దలచి మ్రొక్కి
అరుగు పశుశాల చేర రైతన్న యొకడు!
కడుగు పశువుల, పశుశాల కసువు దీసి
గ్రాసమున్ నీరు పశు తతి కమర జేయు
వత్సముల విడ్చి గోవుల పాలు దీసి
పొలము జనబోవు కాడి కెద్దులను గట్టి!
వాని కనుకూలవతి గుణవతియు సతియు
ఎగ్గ జామున మేల్కొని యిల్లు జిమ్ము
ముంగిటన్ జల్లి కళ్ళాపి, ముగ్గులేసి
కవ్వ మాడించి దాలిలో గాచు పాలు!
అత్తమామలు పతి మెచ్చు నటుల వండి
ఇల్లు సవరించి చలది మూటెత్తి తలను
పసుల దోలుకు యింతి దా పయన మౌను
మ్రోయు చుండగ నందియల్ పొలము వైపు!
హలదారియై పతి అవని దున్నెడి వేళ
చాలులో సతి విత్తనాలు నాటు
పొలమందు మగడు దా మోట గొట్టెడు వేళ
సరి జేసి గట్లన్ని జలము పెట్టు
గుబురైన చేనిలో గొర్రు దోలగ భర్త
కలుపు దీయును కాంత అలుపు లేక
వరి మళ్లలో పతి వరినారు పంచంగ
మగువ నాటును నారును మళ్లలోన
పురుగు మందులు జల్లంగ, యెరువు లేయ,
పంట కోయంగ, మెద గట్ట, పడుగు పెట్ట,
బంతి దొక్కింప, పంట తూర్పార బట్ట
ఆలు అర్దాంగి యన వెంట నంటి యుండు!
అమల ప్రేమానురాగమ్ము లాత్మ నిండ
తల్లియై పొట్ట నింపును తనయ యౌచు
పోవు గారాలు ప్రియురాలి పోల్కి పతిని
ముద్దు మురిపాల దేలించు, ముద్దరాలు!
గంపల కెత్తు ధాన్యములు గాదెలు నింపగ ధాన్య లక్ష్మి దా
నింపుగ నాట్యమాడ తన యింటను, సంతతి బుధ్దిమంతులై
పంపు యొనర్పగా, పతియు బాసట నిల్వగ బాంధవాళి లో
బెంపు వహించె నర్ధి జన వేదన బాపుచు నన్ని వేళలన్!
కాలమ్ము యొకరీతి గడవ దన్నట్లుగా
వ్యవసాయ వృత్తి కోల్పడియె ప్రభను
కాలూనె భూమిపై కరవు రక్కసి యంత
చిన్న మబ్బును లేదు చినుకు లేదు
యెండి పోయెను కుంట లెండెను చెరువులు
పాతాళమున కేగె బావి జలము
నదుల నదమ్ముల నలుసాయె
నీరమ్ము
తల్లడిల్లిరి ప్రజల్ దాహ మనుచు
పసులు దినమేత కరవాయె పంట దగ్గె
వ్యయము పెరిగెను ఋణభార మధిక మయ్యె
అడవి అమ్ముచో కొను చోట నదియె కొరివి
పల్లె సీమల బ్రదుకు దుర్భరము లయ్యె!
కాల గమనంలో.....
అనురాగ మాప్యాయ తాత్మీయతలు తగ్గె
వ్యాపార బంధమ్ము లధిక మయ్యె
అడుగంటె విలువలు అరుదాయె విజ్ఞత
భద్రత కరవాయె బ్రతుకులందు
జనులలో సహనంబు సాహసమ్ములు తగ్గె
శక్తి సామర్ధ్యముల్ సన్న గిల్లె
మార్గంబు జూపించు మహనీయు లలతులై
రధికార మవినీతి నాశ్రయించె
ముక్కలైనను రెక్కలు దుక్కిదున్ని
చెమట చిందించి దినమంత శ్రమను జేసి
పొట్ట గడవని దుస్థితి పొందె రైతు
యోడలయ్యెను బండ్లు బండ్లోడ లయ్యె!
చితికి బోవంగ నార్థిక స్థితియు గతియు
అమ్మి పొలమును పశువుల నమ్మి రైతు
వదలి తనవారి నూరును వలస పోయె
పట్టణమునకు కూలియై పడతి గూడి!
ఎన్నడు నర్ధియై యొరుల నిమ్మని యించుక వేడ బోని రై
తన్నయ కూలికై పరుల దాపున జేరి కరంబు సాచె, నే
మన్నను మౌన మూనె, నభిమానము నావల బెట్టె, చిత్రమౌ
నెన్నగ దైవ లీలలు యదేమొ పరీక్షలు గల్గు మంచికే!
తనదు దైన్య స్థితిన్ దల్చి తల్ల డిల్లు
మగని కండయై ధైర్యమ్ము మగువ చెప్పు
కష్ట నష్టాలు సుఖము దుఃఖము లనంగ
జీవితమ్మున సహజముల్ జీవితేశ!
ఓటమి పాలు చెందితని యూరక గ్రుందెద వేల, ముందు ఆ
యోటమి కేమి కారణమొ యుక్త విచారము సేయగా వలెన్
పాటున కోర్వమిన్ భువి శుభంబులు గల్గునె, కాలి కొల్మిలో
వేటున కోర్చి నప్పుడె యభీష్ట విభూషణ మౌను హేమమున్!
మున్ను రంపపు కోతల నెన్నొ యోర్వ
ముగ్ధమోహన రూపయౌ ముదిత కురుల
దూరు సౌభాగ్య మందదే దువ్వెనయును
కష్ట జలధిని యీదక గలదె సుఖము!
గెలుపు కోటమి తొలిమెట్టు, గెలువ దలచు
యున్నతుల ముందు యోటమి యోడిపోవు
పట్టుదల యోర్మి ఆత్మ విశ్వాసములతొ
నరుగ ముందుకు యత్న కార్యము ఫలించు!
వ్యవసాయంబు వరిష్ఠ మందు రయినన్ ప్రాచీనమౌ సంప్రదా
య విధానంబులు మార్చుకో కునికి, విద్యా హీనతన్ యోజనా
వ్యవధిన్ గాంచమి, దూరదృష్టి గనమిన్, స్వాంతమ్ము వాంఛా ద్యుతిన్
వివృతిన్ జెందమి, నూత్న శాస్త్రగత సంవిత్ జ్ఞానమిన్ బొందమిన్!
అపజయమ్మును బొందితి మయ్య మున్ను
మొదటి అనుభవ సారమ్ము యెదను నిలిపి
తగు ప్రణాళిక రచియించి తడయ కుండ
గమ్యమున్ జేర యత్నింప గలుగు జయము!
స్పష్టమౌ లక్ష్యమ్ము, సంపూర్ణ యోజన,
రగిలెడి తపనయు శ్రధ్ద గలిగి
ఉద్యోగ సమితియు వ్యుత్పత్తి పరిణతి
క్రమ శిక్షణాయుత ప్రతిభ జూప
నాణ్యమై శుధ్ధమైన ముడి సరుకులును
మిగుల వనరుల సమీకరించి
వినియోగ దారుల విశ్వాసమును బొంది
వ్యయ నియంత్రణ పైన పట్టు గలిగి
అదుపు లోన భావోద్వేగ మమరి యుండ
కచ్చితత్వము విషయ సంగ్రహణ దీప్తి
త్వరగ నిర్ణయాల్ గొను శక్తి స్పష్టమైన
పలుకు తీరును గలిగిన కలుగు జయము!
ఆదిన్ ధైర్యమె నీకు ప్రేరణ, యసాధ్యంబెద్ధి లేదీ భువిన్
ప్రోదిన్ జేసిన చిన్ని చిన్ని జయముల్ పూర్ణత్వమున్ గూర్చు నీ
వేదీ జేయక బేలవై వగవ యింకే రీతి మేలౌ వృధా
గాదే యత్నము, నమ్ము నీవు నిను, సంకల్పమ్ము సిద్ధించురా!
అని వనిత చెప్పు పలుకులు
విని పతియును యోజ సేయ విజ్ఞత తోడన్
మనమున దృఢమై నిలిచెను
ఘనమగు లక్ష్యంబు, గెలువ కాంక్షయు పెరిగెన్!
అనితర సాధ్యమై వెలుగు నట్టి మహోన్నత లక్ష్య మొక్కటిన్
మనమున జేర్చి సాగె పతి మంత్రిణియై సతి వెంట నిల్వగా
తనదగు వైఖరిన్ పని విధానము, జ్ఞానము నైపుణీ గతుల్
మును తను మార్చుకో గలిగె, పొందెను తా విజయానుభూతులన్!
అస్తమించుట కాదు నాకపజయమ్ము
యెదురు నిల్చిన యవరోధ మెంత దైన
అధిగమించెద గెల్చెద ననెడి మాడ్కి
గానిపించెను తూర్పున కర్మసాక్షి!

Palakurthy Rama Murthy

ప్రబోధ" అంటే ఏమిటి?


బోధించడం అంటే మనకు తెలిసిన విషయాన్ని తెలియని వారికి తెలిసే విధంగా చెప్పడం.
మరి ప్రబోధించడం అంటే? .....
భారతంలో అరణ్యపర్వంలో ఋష్యశృంగుని తీసుకు రమ్మని వేశ్యలను పంపుతూ రోమపాదుడనే రాజు ఇలా అంటారు....
వేశ్యాంగనలన్ బిలువం బంచి "మీ నేర్చు విధంబుల ఋష్యశృంగున్ ప్రబోధించి యిట తోడ్కొని రండు" అంటాడు.
విభాండకుడు ఋష్యశృంగుని తండ్రి. అతడు లేని సమయంలో ఈ వేశ్యలు ఋష్యశృంగుని వద్దకు వెళ్లడం ఆడి పాడి అతనిని అలరించడం చివరగా అతనిని ఆలింగనం చేసుకోవడం జరుగుతుంది.
నిజానికి ఋష్యశృంగునికి అప్పటి వరకు ఆడ మగ మధ్య భేదం తెలియదు. కానీ ఆ చర్య తదుపరి అతనిలో ఒక శృంగార భావ వీచిక కదిలింది.
మానవ మస్తిష్కంలో లేదా మనస్సులో యెన్నో అరలు, పొరలు మరెన్నో దొంతరలు ఉంటాయి. నిజానికి శృంగార లాలసత వాసనా రూపంలో నిద్రాణమై సమస్త జీవకోటిలో అంతరంతరాలలో అణిగి యుంటుంది.
ప్రతిజీవిలో జన్యుపరంగా నిర్మితమై కొన్ని సహజాతాలూ (instincts), చోదనలూ(drives), అకృతేచ్ఛలూ(urges) ఉంటాయి.
అలాగే మనిషిలో కూడా ...
వాటినే వ్యక్తస్థితిలో మనవాళ్ళు .. 'ఆహారం నిద్ర, భయం, మైథునం అంటూ చెప్పారు. వీటిలో ఆహార నిద్రలకు వెలుపలి ఉద్దీపనలు అవసరంలేదు కాని ... అంత శ్చేతనలో సుప్తావస్థలో ఉన్న భయ మైథునాలు మాత్రం ... బాహ్యఉద్దీపనల వల్లనే 'ప్రబోధితమై',ప్రకాశితమౌతాయి.
వాటి వ్యక్తీకరణ విధం మాత్రం అవకాశాలనూ, వ్యక్తి సంస్కారాలనూ (విజ్ఞతను) బట్టి ఉంటుంది.
ఎంతటి తాపసి యైనా దీనికి అతీతుడు కాదు.
ఇక ఇక్కడ ఆడతనాన్ని కూడా అంతవరకు చూడని ముని కుమారునిలో కూడా ఆ వేశ్యల ఆటపాటలు కౌగిలింతలు అతనిలో శృంగార ప్రవృత్తిని జాగృతం చేసాయి. నిద్రాణమై ఉన్న వాంఛ మేల్కొనడం జరిగింది. దానికి ఉత్ప్రేరకంగా పనిచేశారు వేశ్యాంగనలు.
అలా నిద్రాణమై ఉన్న ప్రజ్ఞలను మేల్కొల్పడమే "ప్రబోధ" గా చెప్పుకోవాలి.
అంతశ్చేతనలో నిద్రావస్థలో ఉన్న "ప్రజ్ఞ" జాగృతం కావాలి అంటే దానికి ఆకర్షణ కావాలి.
ఇక్కడ వేశ్యల వేష భాషలు ఋష్యశృంగుడిని ఆకర్షించాయి. అయితే ఆ ఆకర్షణలో లౌకిక కాలుష్యం లేదు. ప్రకృతి సహజ మైన, నైసర్గికమైన, వర్ణనాతీత మైన ఒకానొక అలౌకిక అనుభూతి ఉంది.
ఋష్యశృంగుని కి బోధించడం చాలదు ..బోధిస్తే అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు .. అందుకే కవి ' ప్రబోధ ' శబ్దం ప్రయోగించాడు .. నిద్రాణమై ఉన్న భావాలు అంత త్వరగా ఉద్బుద్ధం కావుకదా ! అందుకే ఈ ప్రయోగం.
ఋష్యశృంగుని విషయం వదిలేస్తే.....
ప్రజ్ఞ జాగృతం కావడం అన్నప్పుడు అది ఉన్నత మైనదైనా అధమ మైనదైనా యేదైనా కావచ్చు. అది మన సంస్కారంపై, ప్రబోధ పరచిన గురువు లేదా మెంటార్ పై ఆధారపడి ఉంటుంది.
Ex. Desire is a proposal and thought is not a proposal. It is coming from the desire.
ఆక లేస్తుంది తినాలి అనేది ఒక proposal ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనేది ఆ ఆలోచనలో నుండి వస్తుంది. A thought coming out of proposal.
శరీరానికి, మనసుకి, ఆత్మకు మేలు చేసే ఆహారం తీసుకోవచ్చూ లేదా హాని కారకాన్ని తీసుకోవచ్చు. అది మన విజ్ఞత. విజ్ఞత సంస్కారంతో నిగ్గుతేలుతుంది.
ప్రబోధ వల్ల అంతశ్చేతనలో ఉన్న ప్రజ్ఞ జాగృతి మౌతుందే కానీ దానిని ఉపయోగించు కోవడం మన విజ్ఞతపైనే ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ప్రబోధను సరైన వారి వద్ద సరైన మార్గంలో పొందడం అత్యంత ప్రాధాన్యత మైన అంశం.
కృతజ్ఞతలతో..
పాలకుర్తి రామమూర్తి