Friday, September 6, 2019

శ్రీ గణపతి దండకము


ఓం శ్రీ సరస్వత్త్యై నమః

శ్రీ గణపతి దండకము

          శ్రీ శాంకరీ శంకర స్వాంత సంకల్ప సంజాత! విజ్ఞాన మూర్తీ! నమో యజ్ఞ రూపా! నమో అగ్ర పూజ్యా! నమో దేవతా చక్రవర్తీ! నమో విశ్వ సంవ్యాపితా యంచు భక్తుల్ సదా నిన్ను ధ్యానించి పూజింప, నవ్వారికిన్ కామితార్ధంబులన్  గూర్తు వంచున్ బుధుల్ చెప్పగావిందు; జ్ఞానాధ్వ మందున్ నినున్ ప్రీతి దర్శించి, యోగీంద్రులీ భూమిపై నైహిక భ్రాంతులై మ్రగ్గు మా బోంట్లకున్ నిన్ను చూపింప రూపింపగా నొక్క మూర్తిన్; గజాస్యంబు లంబోదరంబున్ మహా నాగ బంధంబు కల్పింప తత్తత్త్వ మాత్మన్ విచారింప.... నీ దీర్ఘ కర్ణంబు లశ్రాంతమున్ దీన విజ్ఞాపనల్ నెమ్మితో వించు తద్బాధలన్ బాప; నీ చిన్ని కన్నుల్ సదా సత్య సంశోధనా శీలముల్ గాగ; నోంకార దివ్య స్వరూపంబుగా నీదు తొండంబు భాసించు; త్యాగంబు సూచించు నీ భగ్న దంతంబు; నీ బొజ్జ ముల్లోకముల్ లోన భద్రంబుగా నుండె నంచున్ యెరింగింప, నీ నాగ బంధంబు తా నైకమత్యంబె సంఘంబుకున్ శక్తి యంచున్ నిరూపింప, నీదౌ మహాకాయమున్ మోయు నా మూశికం బాత్మ చైతన్య రూపంబు దెల్పున్ గదా, విఘ్న నాధా! "గ"కారంబు బుద్ధిన్ ప్రసాదింప, మోక్షంబు నిచ్చున్ "ణ" కారంబు; నీ వెంట నీ త్రోవలో వచ్చు భక్తాళి కిన్ మార్గ మేప్రొద్దు నిశ్కంటకంబౌ గతిన్ జూపు నీ యేన్గు రూపంబు! నీ తత్త్వ మీ రీతిగా దెల్సి, దేవా! మహత్ జ్ఞాను లేప్రొద్దు నీ కీర్తనల్ చేయగా; నల్ప చేతస్కుడన్ నిన్ను వాకృచ్చ నేనెంత వాడన్! దయా శీలివై బ్రోవరా! దేవ నీ తత్త్వమున్ చిత్త మందెంచ లేకుండ నజ్ఞాని నై బంధు మిత్రాది వర్గంబులన్ బిల్చి ఆడంబరం బొప్ప శ్రద్ధా విహీనుండనై, పూజలన్ చేయుచున్, భౌతికాహారముల్ నీకు నైవేద్యముల్ జేసి మాప్రీతిగా మేము విందారగింపంగ నూహించుచున్, సర్వదా నైహికంబుల్ వెసన్ వేడుచున్, మాయలో మ్రగ్గి మిధ్యా ప్రపంచంబె సత్యంబుగా దల్చు దుర్బుద్ధి చాలింక, దేహాభిమానంబు షడ్వర్గపున్ నిక్కు  మానన్ భవన్ మూర్తిపై నిల్చు బుద్ధిన్ ప్రసాదింపరా తండ్రి!  నిన్ నాదు చిత్తంబులోనన్ ప్రతిష్టింతు, నాత్మన్ నివేదింతు, సద్భక్తి నీ ధ్యానమున్ చేతు, సత్యమీవే యికన్ నాకు దిక్కంచు నీ పాద పద్మంబులన్ జేరితిన్, బుద్ధి సిద్ధి స్వరూపాధినాధా! భవత్సంతతై వర్ధిలున్ సౌఖ్యమానంద యోగమ్ములంచున్ బుధుల్ మున్ను వర్ణింపగా విందు, నా దారిలో జేరు భాగ్యంబు నర్ధింతు; దుర్వార సంసార తామిస్రమున్ బాపు విజ్ఞాన దీపంబు చేతంబులో దీపిలన్ జేయరా బ్రహ్మ తత్త్వాను సంధాయకా! దేవ, విఘ్నేశ! చిద్రూప! కారుణ్య మూర్తీ! భవచ్చింతనానంద సంజాత కౌతూహలంబొప్పగా వ్రాసి తీ దండకంబున్, భవత్పాద యుగ్మంబులన్ జేర్తు నో సచ్చితానంద రూపా! కృపన్ దీని స్వీకారమున్ జేసి సత్య స్వరూపంబు సంగ్రాహ్యమౌ చిత్త చైతన్యమున్ చేతనజ్యోతి వెల్గింపరా యంచు హస్తాబ్జముల్ మోడ్చి ప్రార్ధింతు నోనిత్య నైర్మల్య మూర్తీ! నమస్తే  నమస్తే నమస్తే నమః!

పాలకుర్తి రామమూర్తి

గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్)


గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్)

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః!
స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః! వ్యశేమ దేవహితం యదాయుః! 
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః!  స్వస్తి నః పూషా విశ్వవేదాః !
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః!  స్వస్తి నో బృహస్పతిర్దధాతు !

ఓం శాంతిః శాంతిః శాంతిః

ఓం నమస్తే గణపతయే  త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి!  త్వమేవ కేవలం కర్తాఽసి ! త్వమేవ కేవలం ధర్తాఽసి!  త్వమేవ కేవలం హర్తాఽసి!  త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి!  త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్!1
ఋతం వచ్మి  సత్యం వచ్మి  2 

అవ త్వం మామ్,  అవ వక్తారమ్,  అవ శ్రోతారమ్,  అవ దాతారమ్,  అవ ధాతారమ్, 
అవానూచానమవ శిష్యమ్,  అవ పశ్చాత్తాత్,  అవ పురస్తాత్,  అవోత్తరాత్తాత్,  అవ దక్షిణాత్తాత్, 
అవ చోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్,  సర్వతో మాం పాహి పాహి సమంతాత్!  3

త్వం వాఙ్మయస్త్వం చిన్మయః!  త్వమానందమయస్త్వం బ్రహ్మమయః!
త్వం సచ్చిదానందాఽద్వితీయోఽసి!  త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి!  త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి!  4

సర్వం జగదిదం త్వత్తో జాయతే!  సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి!  సర్వం జగదిదం త్వయి లయమేష్యతి!  సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి!  త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః  త్వం చత్వారి వాక్పదాని!  5

త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః!  త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!
త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్!  త్వం శక్తిత్రయాత్మకః!  త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!
త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్!  6

గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్!  అనుస్వారః పరతరః!  అర్ధేందులసితమ్!
తారేణ ఋద్ధమ్!  ఏతత్తవ మనుస్వరూపమ్!  గకారః పూర్వరూపమ్  అకారో మధ్యమరూపమ్  అనుస్వారశ్చాంత్యరూపమ్!  బిందురుత్తరరూపమ్!  నాదః సంధానమ్!  సంహితా సంధిః!
సైషా గణేశవిద్యా!  గణక ఋషిః!  నిచృద్గాయత్రీచ్ఛందః!  శ్రీ మహాగణపతిర్దేవతా  ఓం గం గణపతయే నమః!7

ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నో దంతిః ప్రచోదయాత్  8

ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్
రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!
రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ 
రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!
భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ 
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!
ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః  9

నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేఽస్తు
లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః  10

ఏతదథర్వశీర్షం యోఽధీతే  స బ్రహ్మభూయాయ కల్పతే
స సర్వవిఘ్నైర్న బాధ్యతే  స సర్వతః సుఖమేధతే
స పంచమహాపాపాత్ ప్రముచ్యతే !

సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి
ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి 
సాయం ప్రాతః ప్రయుంజానోఽపాపో భవతి 
సర్వత్రాధీయానోపవిఘ్నో భవతి! ధర్మార్థకామమోక్షం చ విందతి

ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయమ్ 
యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి 
సహస్రావర్తనాద్యం యం కామమధీతే  తం తమనేన సాధయేత్  11

అనేన గణపతిమభిషించతి  స వాగ్మీ భవతి  చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి  ఇత్యథర్వణవాక్యమ్  బ్రహ్మాద్యాచరణం విద్యాన్నబిభేతి కదాచనేతి  12

యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి 
యో లాజైర్యజతి స యశోవాన్ భవతి  స మేధావాన్ భవతి 
యో మోదకసహస్రేణ యజతి స వాంఛితఫలమవాప్నోతి
యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే  13

అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి 
సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా స సిద్ధమంత్రో భవతి 
మహావిఘ్నాత్ ప్రముచ్యతే  మహాదోషాత్ ప్రముచ్యతే  మహాపాపాత్ ప్రముచ్యతే 
మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే  స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి 

య ఏవం వేద  ఇత్యుపనిషత్  14

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః  భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః  స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః  వ్యశేమ దేవహితం యదాయుః  స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః  స్వస్తి నః పూషా విశ్వవేదాః  స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః  స్వస్తి నో బృహస్పతిర్దధాతు!

ఓం శాంతిః శాంతిః శాంతిః

హరిః ఓం! లం! గణపతి బీజం.
నమస్తే గణపతయే... ఓ గణములకు పతియైన వాడా! - నమః తే... నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను.
త్వమేవ - నీవు మాత్రమే ప్రత్యక్షంగా, "తత్" .. అది ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యములు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైనదో "అది" నీవు (త్వం) అయి ఉన్నావు (అసి).
త్వమేవ కేవలం కర్తాసి... అన్నింటికీ నీవే కర్తవు, నీవే ధరించే వానివి (ధర్త) నీవే లయం చేసుకునే వానివి (హర్త).  నీవు మాత్రమే సర్వమూ,  బ్రహ్మమూ అయి ఉన్నావు కదా (ఖల్విదం) ఋతం-- ఇతః పూర్వం ఋజువు చేయబడిన వాడివి నీవే, సత్యానివీ నీవే. అవ (కాపాడు) మామ్ -- నన్ను, వక్తారం ... ప్రవచించే వక్తను, శ్రోతారమ్... జాగ్రత్తగా వినే శ్రోతలను, దాతారమ్ ... దానం చేసే దాతలను, ధాతారమ్.... బ్రహ్మాదులను, అనూచానంగా శేషించిన దానిని కాపాడు. అవ శిష్యమ్... శిష్యులను కాపాడు. అర్హత ప్రాతిపదికగా విజ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఆ గురువును భక్తి పూర్వకంగా భావిస్తూ, అతనిచ్చిన అభిగమ్యమైన (పొందదగిన) విజ్ఞానాన్ని పవిత్రంగా, జిజ్ఞాసతో, అభిలాషతో అధ్యయనం చేసే వాడు శిష్యుడు. ఇరువురికీ సామాన్యంగా ఉండవలసిన లక్షణం "అర్హత".
జగత్తును ఆవరించిన ఈ ఆరు దిక్కులను (పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ, అధో దిశలు) కాపాడు. సర్వతో మాం పాహి.... ఈ ఆరు దిక్కులచే చక్కగా చుట్టబడిన (సమంతాత్) సర్వమును కాపాడు.
త్వం వాజ్ఞ్మయః .. నీవే సకల వాక్సంబంధిత శక్తివి, నీవే (చిత్ మయః) జ్ఞాన మూర్తివి, నీవే ఆనంద మయునివి, నీవే పరబ్రహ్మము. నీవే సత్ చిత్ ఆనందమవు. శాశ్వతమైన వానివి నీవే, నీకన్న రెండవది లేదు. ప్రత్యక్షంగా పర బ్రహ్మమవు నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి. (పంచేంద్రియాలచే తెలుసుకునేది లేదా గ్రహించేది జ్ఞానం కాగా వీటికి అతీతంగా పొదగలిగినది విజ్ఞానం. భౌతికంగా విజ్ఞానం అంటే... ఆచరించి దాని మంచి చెడ్డలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది విజ్ఞానం.)
ఈ సకల చరాచర జగత్తు నీనుండే ఉద్భవించినది. ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది. ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేదీ నీలోనే. ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది (త్వయి ప్రత్యేతి) నిన్నే పొందుతుంది. నీవే భూమివి, నీరు, వాయువు, అగ్నివి, ఆకాశానివి. పరా పశ్యంతి మధ్యమా వైఖరి గా పేర్కొనబడే వాక్కు యొక్క నాలుగు పాదాలు నీవే.
త్రిగుణాలకు (సత్వ రజస్ తమో) నీవు అతీతునివి, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికీ అతీతునివి. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి. నీవే కుండలినీ శక్తిగా నిత్యమూ మూలాధార చక్రంలో స్థితమైన (ఉండే) శక్తివి.  నీవే మూడు శక్తులకు (ఇఛ్ఛా జ్ఞాన క్రియా శక్తులు) అతీతమైన వానివి.
నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే.  త్రిమూర్తులు,  ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో భాసిల్లే వానివి నీవే. ముల్లోకములలో (భూః, భువః సువః) నీవే, ముల్లోకములూ నీవే అయిన వాడివి.
"గం" అనేది గణపతి బీజం. దానిని ఉఛ్చరించే పద్దతి చెపుతున్నారిక్కడ. "గ్" ను ముందుగా ఉఛ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు ఆది అయిన "అ"కారాన్ని ఉఛ్చరించాలి. తదుపరి అనుస్వరాన్ని ఉఛ్చరించాలి. ఇది "గం" అవుతుంది. అదే గణపతి బీజం. (దీని సాధనచేత ఆ స్వామి గోచరమౌతాడు).
అర్ధేందులసితం... అక్షరములు ధ్వనులకు సంకేతాలు. ధ్వని నాద భరితము. బిందువు తదుపరి వచ్చే నాదాన్ని "అర్ధేందు" అనే సంకేతంతో సూచించారు. ఆ నాదంతో ప్రకాశించే వాడు.
తారేణ రుద్ధం... తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము. రుద్ధము పరివేష్టితుడు. ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు.
ఇది అతని యొక్క మంత్ర రూపము.
(ఇక పోతే సామాన్యార్థంలో చెప్పుకుంటే....శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే (అష్టమినాటి చంద్రుని) ప్రకాశించే వాడు. తారకలచే (నక్షత్రములు) పరివేష్ఠితుడు, అని చెప్పు కోవచ్చు... కాని ఇది సంప్రదాయము కాదు.)
గం బీజం సాధన చేసే సమయంలో... "గ్" కారం పూర్వ రూపం, "అ" కారం మధ్యమ రూపం,  అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు (౦) ఉత్తర రూపంగా ఉంటుంది. దీనిని పలికి నప్పుడు వచ్చే నాదమే సంధానము. దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి.
ఇది మొత్తంగా (సైషా.. స ఏషా...) గణేశుని విద్య. దీనికి ఋషి గణక ఋషి. అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు, గణకుడు అనే ఋషి. దీని ఛందస్సు నిచృద్ ఛందం. అధిష్టాన దేవత గణపతి.
ఓం గణపతయే నమః ఏక దంతాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్!
ఏకదంతుడు, నాలుగు చేతులలో.... పాశము, అంకుశము, దంతము, (ఇది ఏనుగు దంతం, త్యాగానికి సంబంధించినది. మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు) అభయ ముద్రను ధరించినవాడు, ఎలుక వాహనమును ధ్వజముగా కలిగిన వాడు, పెద్దనైన పొట్టను కలిగిన వాడు, చాటల లాంటి చెవులను కలిగిన వాడు, రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు, ఎర్రనైన సుగంధములను పులుముకున్న శరీరము కలిగిన వాడు, ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజితుడు, భక్త కోటిపై అమితమైన అనుకంప (దయ) కలిగిన వాడు, భగవంతుడైన వాడు, ఈ జగత్తుకు కారణమైన వాడు, అచ్యుతుడు (జారిపోని వాడు), సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు, ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు, ఎవరైతే ఉన్నాడో (గణపతి) వానిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్టునిగా చెప్పబడతారు.
హే వ్రాత పతి (సమూహమునకు భర్త) నీకు నమస్సులు. గణములకు పతియైన నీకు నమస్సులు, ప్రమథ గణములకు పతివైన నీకు నమస్సులు, లంబోదరుని వైన నీకు నమస్సులు, ఏకదంతుని వైన నీకు నమస్సులు (ఏక దంతము త్యాగానికి చిహ్నము) విఘ్నములను నశింప చేసే నీకు నమస్సులు, శివ సుత నీకు నమస్సులు (శివము అంటే మహదానందము.. దానికి పుత్రుడు అంటే ఆనంద మూర్తియే... పోతన గారు కూడా మహానందాంగనా డింభకుడు అని అంటారు. మహా ఆనందము అనే అంగనకు డింభకుడు) వరద మూర్తయే... అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరద మూర్తయే అన్నారిక్కడ. ఆ వరద మూర్తికి నమస్సులు.
ఇక చివరగా ఫల శ్రుతి....
ఈ అథర్వ శీర్షంను ఎవరైతే శ్రద్ధతో, చక్కగా అధ్యయనం చేస్తారో, వారు (స) బ్రహ్మ స్థానాన్ని పొందుతారు. వారు సర్వ విఘ్నములనుండి విముక్తుడవుతాడు, వారు సర్వత్రా సుఖములను పొందుతారు, వానికి పంచ మహా పాతకముల నుండి విముక్తి కలుగుతుంది.
సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. ప్రాతఃకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి. సాయం ప్రాతస్సులలో అనుష్ఠించిన వానికి పాపములు అంటుకొనవు. సర్వత్రా ఏ  కార్యములలో నైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు. అతడు ధర్మార్ధ కామ మోక్షములను పొందగలడు. ఇది అధర్వ శీర్షం.
దీనిని శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు. ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును సభక్తికంగా చేరిన వాడు. అశ్రద్ధ లేనివాడు, ఉపాసన యందు అనురక్తి కలిగిన వాడు. విషయంపైన భక్తిభావన కలిగిన వాడు. అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వగూడదని చెపుతుంది, ఈ సూక్తం. ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కూపంలొ పడిపోతాడని హెచ్చరిస్తుంది.
ఏ ఏ కోరికలతో నైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత (అనేన) ఆ కోరికలు సాధింపబడతాయి. ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడు.
భాద్రపద శుద్ధ చవితినాడు భోజనం చేయకుండా (చతుర్థ్యామనశ్నన్అన అశనము) ఎవరైతే జపిస్తారో, అతడు విద్వాంసుడౌతాడు. ఇది అథర్వణ వాక్యము.
దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు (నభిభేతి)
గణపతిని ... ఎవరైతే దూర్వారములచే అర్చిస్తారో అతడు అపర కుబేరుడౌతాడు. పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్కుడు అవుతాడు. మేధోవంతుడౌతాడు. మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆజ్యము (నేయి) సమిధలతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికీ సర్వమూ లభిస్తుంది.
ఎనిమిది మంది వేద విదులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతి నెవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు.
సూర్య గ్రహణ కాలంలో, మహానది (జీవనది) వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. వారికి మహా విఘ్నములు, మహా దోషములు, మహా పాపములు తొలగిపోతాయి. అతడు (స) అన్నీ తెలిసిన వాడవుతాడు... ఇది తెలుసుకోండి అంటుంది.. ఈ గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు.
ఓం శాంతిః శాంతిః శాంతిః
While summarising the Ganapathi Atharva Sheersham, it is to reiterate that the Ganapathi is the ULTIMATE and none to second him.
He is the source of all the pragmatic and non-pragmatic knowledge and he is Omnipotent, omnipresent and omniscient.
He is the Ultimate Truth, and he is only the ultimate source to eradicate all the sins and bestow the ultimate Moksha.
The Sage Ganaka has unveiled the Mantra of Ganapathi and describes that Lord Ganapathi is the para-Brahman i.e. Absolute Consciousness.
The Energy resides in the Muladhara in the form of a serpentine is invoked when the Ganapathi Atharva Sheersha is recited and the energy thus transformed can purify the Sadhaka and assure him the ultimate state i.e. Moksha.
There are certain systems that are to be followed when we perform the puja of lord Ganapathi.
Also, it is warned not to reveal the mantra with the persons who do not deserve and has no inclination towards the mantra.
Most of the time, the management of any business and the spiritual ideas are trusted to be parallel rivers unconnected with each other. But today most of the successful business leaders believe that both are not far off and can be clubbed together.
The role of Belief in any business is always very Critical. Unless the organisation, develop a good rapport and a relation with the customer /consumer, there would be a misalignment between the consumer and the business organisation.
There should be spiritual bonding between the consumer and marketing agency so that the mind of the consumer is extended. And when the mind is extended, one would be able to see more frameworks, understand the world better, take better decisions and feel happy in dealing with the organisation.

Just replace the terms organisation with GOD and consumer with Sadhaka. We can correlate the Idea of business with Sadhana. Both require TRUST and it should be the centre of operation. You are more aware that the TRUST is the seed and when we take care of it and give sufficient water, proper manure and remove the unnecessary plants in time around, it will grow and give the fruits that we expect.

PALAKURTHY RAMA MURTHY
H.No. 5-6-25, Teachers Colony,
BHONGIR – 508116
Cell. 9441666943 / 7674017833

Tuesday, July 30, 2019

విజ్ఞులూ ఆలోచించండి.....


నిన్న టివి 5 లో "బాపనోడు" అనేపాటపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. శ్రీయుతులు మరుమాముల వేంకటరమణ, కదిరి కృష్ణ, సుదర్శన్ మరియు ఆ పాట వ్రాసిన రాజేశ్, ద్రోణంరాజు రవి గారలు ఆ చర్చాకార్యక్రమంలో పాల్గొనడం చూచాము.  ఆ చర్చలో విషయంపై చర్చించాలనే భావన కన్నా అందరిలో ప్రస్ఫుటంగా కనిపించింది ఒక సమాజంపై లేదా ఒక కులంపై "అసహనం" మాత్రమే.

ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారని పదే పదే వక్తలు ఉటంకించడం జరిగింది. అంతా చదువుకున్న వారు. ముఖం నుండి మనుషులు ఎలా పుడతారనే శాస్త్రీయ ఆలోచన ఉండవద్దా.

మనువు ఈ దేశంలో మొట్టమొదటి పాలకుడు. తన పాలనా ప్రయోజనాల కనుగుణంగా ఆ నాడు జీవించిన ప్రజలను 4 వర్ణాలుగా విభజించాడు. అక్కడ నాస్తి పంచమః అన్న సూక్తిని ఎలా మరచిపోతారు. మను ధర్మశాస్త్రంలో ఎక్కడా కులాల ప్రసక్తిని చూడము.... మనువుచే లేదా దేమునిచే కులాలు సృష్టింపబడ లేదు. చేస్తున్న వృత్తిని బట్టి ఆ యా ప్రజలను అలా విభజించడం జరిగింది అనే జ్ఞానాన్ని విస్మరించడం, అసహనాన్ని ప్రదర్శించడం ఏ మేరకు సమాజానికి ఉపయుక్తమో విజ్ఞులు ఆలోచించాలి.
విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే సమగ్రంగా ఆ విషయాన్ని అధ్యయనం చేయాలి. అందులో కూడా Empathic గా చదవడం చాలా ముఖ్యం. అక్షరాలను బట్టి కాదు అందులోని భావాన్ని పట్టుకునే ప్రయత్నం జరగాలి. Not the letter of the LAW but the spirit of the LAW కావాలి. మనకు కావలసినంత మేరకే తీసుకొని ఎవరో చెప్పిన భావాన్ని (మూలం చదవకుండా) చర్చలలో అసహనంగా మాట్లాడడం సమంజసమూ కాదు.
మనుస్మృతి పిమ్మట ఎన్నో స్మృతులు గతించి ఈ నాడు ఆపస్తంబ సూత్రం నడుస్తుంది. చర్చిస్తే దానిని ఉటంకించాలి కాని మనువును ఉటంకించడం ఎలా సమంజసం.

సమాజమనే విరాట్ స్వరూపానికి బ్రాహ్మణులు ముఖంలాంటి వారు. తత్త్వాన్ని తెలుసుకునే వాడు, మూలాలను అన్వేషించే వాడు, అధ్యయన అధ్యాపనలలో నిమగ్నమైన వాడు బ్ర్రాహ్మణుడు. సమాజానికి రక్షణ కల్పించేవాడు క్షత్రియుడయ్యాడు. వ్యాపారాదులు, వ్యవసాయాదులు నిర్వహించే వారు వైశ్యులు అయ్యారు. ఈ పనులలో ప్రావీణ్యం లేని వారు తమ జీవనోపాథికి వివిధ వృత్తులను ఎన్నుకున్నారు. వారిని శూద్రులు అని సంబోధించారు. వీటికి పైన ఎవరినీ మనువు చెప్పలేదు. ఈ విభాగం సమాజ నిర్వహణ కోసం మాత్రమే అనేది ఎన్నో మార్లు ఎందరో చెప్పారు. కాని రెచ్చగొట్టి తమ ఆధిక్యతను చాటుకోవాలన్న కొద్దిమంది అహంభావం సమాజాన్ని ఇన్ని కులాలుగా విభజించే ప్రయత్నం చేస్తుంది. ఆంగ్లేయుల "విభజించి పాలించు" అనే రాజనీతి, ఈ నాటి ఓటు రాజకీయంలో పబ్బంగడుపుకునే రాజకీయ నేతల ప్రవృత్తి వెరసి ఈ కులాల కుంపటి నిరంతరం జ్వలిస్తూనే ఉంది.... ప్రజల మధ్య వైరుధ్యం పెంచుతూనే ఉన్నది. ముఖ్యంగా చదువుకున్న "సాక్షర" జాతి ఆ ఆలోచనలకు మరింత ఆజ్యం పోస్తూ సజీవంగా ఉంచుతున్నది.

ఆర్యులు వలస వచ్చారనే వాదం.... పురాణాలల్లో ఎక్కడా కనిపించదు. డా. అంబేడ్కర్ గారు కూడా తన "Who are shudraas' అనే పుస్తకంలో ఆ విషయాన్ని చర్చించి ఆ వాదన తప్పనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఆనాటి సమాజంలో ఆర్య శబ్దం గుణవాచకమే కాని జాతివాచకం కాదని ఆయన సప్రమాణంగా నిరూపించారు.
ప్రతి సమాజంలో మంచి ఉంటుంది చెడూ ఉంటుంది. వి.డి. మహాజన్ తన "Ancient India"అనే పుస్తకంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా మారిన వైనాన్ని చర్చించాడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుస్తక రూపంలో లేక ముఖతః మాత్రమే ప్రచారమైన విజ్ఞానం కొంత ప్రక్షిప్తమూ కావచ్చు, కొంత ఉపయోగంలో లేకపోవచ్చు. ఆచారవ్యవహారాదుల పేరుతో మూర్ఖత్వాన్ని ఆదరించవచ్చు.
ఒకనాటి సమాజంలో ఈ నాడు మనం దళితులుగా పిలవబడుతున్న "కులాలు" వివక్షకు గురయ్యాయన్నది కాదనలేని సత్యం. ఆవేశపరులూ ఆలోచనాపరులు అన్ని కాలాలలోనూ ఉంటారు. ఆవేశంతో విద్వేషం మరింతగా పెరుగుతుందే కాని చల్లారదు. శాంతి సహజీవనం కావాలి అంటే ఆలోచన కావాలి, సంయమనత కావాలి.
చాలా కొద్ది శాతం మాత్రమే ఉన్న బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకోవడం వల్ల లేదా ఒక కులాన్ని దూషించడం వల్ల సాధించే ప్రయోజనం శూన్యం అనేది విస్మరించకూడదు. ఆ టి.వి. వారి రేటింగ్ పెరగడమూ, మరింత మందిలో ఆ కులగజ్జి విస్తృతమవడమూ తప్ప అలాంటి చర్చల వల్ల ప్రయోజనమూ శూన్యమే.
అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆవేశపడడం జరగవచ్చు. అది తప్పని కాదు కాని ఆవేశాన్ని కొంత మేరకు తగ్గించుకొని శాస్త్రీయాంశాలు ప్రతిపాదిస్తే చూచే వారికి ఆలోచనను రేకెత్తించిన వారమవుతాము.
వ్యాపారం చేసేవారు ప్రతి దాన్నీ ఆ కోణం లోనే చూస్తారు. ప్రతి అంశాన్ని Market చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది కుహనామేధావుల ఆలోచనా సరళి సమాజాన్ని కుక్కలు చింపిన విస్తరి కానీయ వద్దన్నదే నా అభిప్రాయం.

ఎలాంటి భాషవల్ల సమాజం భ్రష్టుపడుతుందో, ఎలాంటి భాష వల్ల అందరం కలసి ఉండవచ్చో, ఆలోచించి రచయితలు, కవులు ఆ నిబద్ధత పాటిస్తే సమాజంలో శాంతి నిలుస్తుంది. కాకపోతే ప్రక్క వాణ్ణి అనుమానిస్తూ బ్రతికే దౌర్భాగ్యం దాపురిస్తుంది. ఈ నిబద్ధత పాటించడానికి చట్టాలూ అవసరం లేదు.

మరొక్క విషయంతో ముగిస్తాను. ఈ నాడు యువతలో కుల మత భేద భావనలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం కులాంతర, మతాంతర  వివాహాలు బ్రాహ్మలలోనే ఎక్కువగా జరుగుతున్నాయట. విజ్ఞులు ఆలోచించండి.....
పాలకుర్తి రామమూర్తి

Tuesday, June 11, 2019

కైక వరం కోరడంతో ఏర్పడిన పరిస్థితులు –
 ఆ నేపథ్యంలో రాముని స్పందన

శ్రీ రామ పట్టాభిషేకం నిర్ణయింపబడింది. తదనుగుణమైన ఏర్పాట్లు సాగిపోయాయి. కాలోచిత మర్యాదలను నిర్వహించి రాముడు, కైకేయీ సహితుడై ఉన్న తన తండ్రి దశరథుడిని సమ్ముఖానికి వచ్చాడు. అక్కడ విషణ్ణవదనుడై దుఃఖిస్తున్న తండ్రిని చూచి కైకేయిని కారణ మడిగాడు. అప్పుడు ఆమె రామునితో ఇలా అంటుంది.... 
రామా! గతంలో నీ తండ్రి ప్రతిజ్ఞాపూర్వకముగా నాకొక మాట ఇచ్చి, ఇప్పుడా మాటను తప్పే మార్గాన్ని అన్వేషిస్తున్నాడు. అది నీవు మాత్రమే నెరవేర్చ గలవు. సత్య పాలన మీ వంశానికి ఆలంబన కదా. మీ తండ్రి ఇప్పుడా సత్య పథాన్ని తప్పి చరించడం ధర్మమా? ఈ రాజ్యపాలకుడు ధర్మాధ్వగామియై చరించేందుకు నీవే బోధించాలి, సహకరించాలి. నీ తండ్రి, మన పాలకుడు నైన దశరథుని మనోగతాన్ని, అది నీకు సమ్మతమైనా అసమ్మతమైనా నీవు తప్పక ఆచరిస్తానని మాటయిస్తే, ఆయన శోకానికి కారణం ఏమిటో చెపుతాను, అంటుంది, కైకేయి.
(ఇది కైకేయి సంభాషణలోని చతురత. ముందు కాళ్ళకు బంధం వేసి తన మాట నెగ్గించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రయత్నం. దశరథుడు ఎలాగూ చెప్పే మానసిక స్థితిలో లేడు. రామునికి ఆ రాజ్యంలో ఉన్న ప్రజాదరణ తనకు తెలుసు. భరతుని పట్టాభిషేకం నిర్విఘ్నంగా జరగాలి అంటే రాముడు స్వచ్ఛందంగా అడవులకు వెళ్ళాలి. అందుకే ఈ బిగింపు వేస్తుంది కైక. మాట తప్పని రాముడి నైజం తనకు తెలుసు కాబట్టి ముందే మాట తీసుకుంటుంది)
 రాముని వద్ద ఆ మేరకు ప్రమాణం చేయించుకొని, కైకేయి; దేవాసుర సంగ్రామంలో దశరథుడు దేవతల పక్షాన యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో మూర్ఛిల్లడం, ఆ సమయంలో కైకేయి అతనిని రక్షించడం, దానితో సంతసించిన దశరథుడు ఆమెకు రెండు వరాలను ఇస్తానని వాగ్దానం చేయడం, ఆ వాగ్దానాని కనుగుణంగా ఆమె ఇప్పుడు ఆ వరాలను ప్రస్తావించి, మొదటగా రాముడు పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని, రెండవదిగా తన కుమారుడు భరతుడు అయోధ్యా పట్టణానికి ప్రభువుగా అభిషిక్తుడు కావాలని కోరడం, దానితో వ్యథ చెందిన రాజు, ఒకవైపు రామ వియోగాన్ని భరించలేక అలాగని ఇచ్చిన మాటను తప్పలేక, సందిగ్ధంలో కొట్టు మిట్టాడుతూ ఉన్న వైనాన్ని తెలుపుతుంది. 
దానికి రాముడు, అమ్మా! నీ కోరిక తప్పక నెరవేరుస్తానని మాట యిచ్చి, తన తల్లికి తన వనవాసాన్ని నివేదించి ఆమె అనుమతి పొంది వస్తానని చెప్పి, కైక అనుమతితో, కౌసల్యా మందిరానికి వెళ్ళి, కౌసల్యకు ఆ విషయాన్ని విన్నవిస్తాడు. సహజంగానే తల్లి కనుక ఆమె బేలగా దుఃఖపడడం జరుగుతుంది. ఆ సందర్భంగా లక్ష్మణుడు.... కౌసల్యను ఓదార్చుతూ తన మనస్సును ఈ విధంగా ఆవిష్కరిస్తాడు.

1)  కుటిలాత్మురాలైన ఒక స్త్రీ మూలంగా ధర్మ వర్తియైన రాముడు అడవులకు వెళ్ళడం సమంజసం కాదు
2) మాట యిచ్చిన తండ్రి విషయాసక్తుడు, కామ వికారాలకు లోనైన వాడు మరియు మతి చలించిన వృద్ధుడు. కామ మోహితుడైన దశరథుడు కైక ప్రేరణచే ఈ వరాల నెపంగా రాముని అడవులకు పంపడం అసమంజసం, అసంబద్ధం.
3) పెద్దవాడైన రామునికి రాజ్యార్హతను కాదని భరతునికి రాజ్యాన్ని కట్టబెట్టడం అన్యాయం. మన రాజు, అస్థిమితమైన బుద్ధియుతుడై, యుక్తాయుక్త వివేచనను విస్మరించి, దుర్బోధల వల్ల ప్రభావితుడైన వాడు కాబట్టి ఆ నిర్ణయం చెల్లదు. దానిని పాలించ వలసిన అవసరం రామునికి లేదు.
4) తల్లిదండ్రుల పట్లగాని, రాజ్య ప్రజల పట్లగాని ఏ విధమైన అపరాధం కాని, రాజ ద్రోహం కాని చేయని ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఒక నాగరికుని, అందునా కన్న కుమారుని, కారణం లేకుండా అడవికి పంపడం అధర్మం
5) ధర్మ బుద్ధి కలవాడిని, పరోక్షంలో కూడా ఎవ్వరూ తనను పల్లెత్తు అసంగతమైన మాటను అనని వానిని దండించిన రాజు అధర్మపరుడు కాబట్టి ఆ అధర్మ వర్తియైన పాలకుని ఆజ్ఞను పాలించాల్సిన అవసరం లేదు

అంటూ ఇంకా ఆవేషపూరితుడైన లక్ష్మణుడు, రామునితో ఇలా అంటాడు. ఓ రామా!

1) ఈ విషయం నగరంలో ఎవరికీ తెలియక ముందే.... రాజ్యాధికారాన్ని చేజిక్కించుకో. అందుకు నేను సహాయపడతాను
2) యుద్ధ సన్నాహివై నీవు, నీకు సహాయంగా నేను నిలిస్తే మనల్ని జయించగలిగిన వారెవ్వరూ లేరు
3) అవసరమైతే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యం చేద్దాం
4) భరతుని పక్షంలో నిలిచే వారందరినీ వధిద్దాము
5) కైక మాటలకు వత్తాసు పలికే మన తండ్రిపై మమకారాన్ని విడిచి పెడదాము. యుక్తాయుక్త విచక్షణా రహితుడై అధర్మ మార్గంలో పయనించే వాడు ఎంతటి వాడైనా వానిని శాసించాలని ధర్మం బోధిస్తున్నది. అతను గురువైనా తండ్రియైనా అతనిని బంధిద్దాము లేదా అవసరమైతే సంహరిద్దాము.
6) పరాక్రమ హీనుడు మాత్రమే దైవముపై ఆధారపడి క్రియా శూన్యుడై బ్రతుకుతాడు. స్వశక్తిపై ఆధారపడిన వాడు అవరోధాలను అధిగమించి (అవి దైవికమైనా) లక్ష్యాన్ని చేరే మార్గాన్ని అన్వేషిస్తాడు, సాధిస్తాడు, జీవిస్తాడు.
7) అంతెందుకు, భరతునికి రాజ్యం కట్టబెట్టాలనే దుస్సంకల్పంతో ఉన్న కైక మోహంలో మన తండ్రి కూడా అధర్మ వాదియై నీపై కుట్ర పన్ని ఉండవచ్చు. ఆ కుట్రను భగ్నం చేయడం మన హక్కును కాపాడుకోవడం క్షాత్ర ధర్మం కాదా?

ఇలా అనేక విధాల ఆవేషపడే లక్ష్మణుడిని ఓదార్చుతూ, రాముడంటాడూ.... మంచి మనసుతో మనమొక కార్యాన్ని సంకల్పిస్తాము. విధి  వశాత్తు అనుకోని పరిస్థితుల వల్ల దాని నిర్వహణలో అవాంతరం వస్తే దానికి కారణం మన తప్పిదం కాదు, అది విధి వ్రాత. ఆ వ్రాతను తప్పింపలేమనీ, పితృ వాక్య పరిపాలన ఔన్నత్యం సమున్నతమైనదనీ చెపుతూ, శాంతపరుస్తాడు రాముడు.

ఈ సన్నివేషాన్ని మన జీవితాలకు అన్వయించుకొని విశ్లేషణ చేసుకుంటే.... 

1) మనలో చాలా మందిమి లక్ష్మణుడి లాగానే ఆలోచిస్తాము.
2) ప్రతి సంఘటనకు అనుక్రియ ఉంటుంది అలాగే ప్రతిక్రియా ఉంటుంది.
3) ఇక్కడ లక్ష్మణుడి ఆలోచన ఆవేషపూరితంగా ఉండడం వల్ల "ప్రతిక్రియ" కై ఆలోచించాడు
4) రాముడు ధర్మ పథాన్ని ఆశ్రయించి యుండడంతో నిర్మల మనస్సుతో ధర్మ బద్ధంగా చేయవలసిన "అనుక్రియ"ను ఆలోచించాడు. ధర్మ చింతన వల్ల సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.
5) ధర్మాధర్మ విచక్షణ లేక నా ఆలోచనయే న్యాయం, అదే ధర్మం అన్న ఆవేషభరతమైన నిర్ణయాలు అంతర్గత కలహాలకు నాంది పలికితే, రక్తపాతం జరగడమే కాక, రాజ్య ప్రజల శాంతికి విఘాతం ఏర్పడుతుంది. సమాజంలో సంక్లిష్టత చోటుచేసుకుంటుంది.
6) నాయకుడు అధర్మ మార్గంలో నడిస్తే అది ఆచారమై ప్రజల చేత ఆచరింపబడుతుంది. అది అనాదరణీయం.
7) శక్తి కలిగి యుండడం కన్నా ఆ శక్తిని ఎప్పుడు ఎలా ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలియడం వల్ల ప్రయోజనం ఉండడమే కాదు, ఆ విజ్ఞత ప్రజా పాలనలో శాంతిని అందిస్తుంది.
8) ఏ పరిస్థితులలో కూడా ధార్మిక చింతనకు దూరం కాని మానసిక స్థితిని పొందిన వాడు కాబట్టే రాముడు ఆనాటి నుండి ఆదరణీయు డయ్యాడు. ఆయన మార్గం అనుసరణీయ మైంది.
9) నిత్య జీవితంలో మనకు కైక పాత్రలు, దశరథుని పాత్రలు, లక్ష్మణుడి పాత్రలూ అనేకం ఎదురవుతూనే ఉంటాయి. అంతేకాదు, మన ప్రయత్నాలలో అవరోధాలూ సహజంగానే కలుగుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొంటామో అదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.
10) అనుకున్నది అనుకున్న విధంగా జరిగితే ఆనందమే. విజయాన్ని నిర్వహించుకోవడం అందరికీ సాధ్యపడేదే కాని అపజయం ఎదురైతే దానిని ఎలా నిర్వహించుకుంటామనే దానిపై మన పరిణతి ఆధారపడి ఉంటుంది. అదే మనకు శాశ్వత విజయాన్ని, సంతృప్తిని, చరిత్రలో సుస్థిర మైన స్థానాన్ని సంపాదించి పెడుతుంది. దానికి ఉదాహరణయే రాముని పాత్ర.

వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలో ఈ సన్నివేషాన్ని చదివినప్పుడు నాకు కలిగిన భావాలను మీతో పంచుకునే ప్రయత్నం చేసాను. తప్పొప్పులు తెలిపి విజ్ఞులు సహకరించి దీనిని మరింత ఉన్నతంగా మలిచేందుకు సహకరిస్తారని ఆశిస్తూ.... సహృదయులను అభ్యర్ధిస్తున్నాను.

నమస్సులతో…..
పాలకుర్తి రామమూర్తి

కైక వరం కోరడంతో ఏర్పడిన పరిస్థితులు –
 ఆ నేపథ్యంలో రాముని స్పందన

శ్రీ రామ పట్టాభిషేకం నిర్ణయింపబడింది. తదనుగుణమైన ఏర్పాట్లు సాగిపోయాయి. కాలోచిత మర్యాదలను నిర్వహించి రాముడు, కైకేయీ సహితుడై ఉన్న తన తండ్రి దశరథుడిని సమ్ముఖానికి వచ్చాడు. అక్కడ విషణ్ణవదనుడై దుఃఖిస్తున్న తండ్రిని చూచి కైకేయిని కారణ మడిగాడు. అప్పుడు ఆమె రామునితో ఇలా అంటుంది.... 
రామా! గతంలో నీ తండ్రి ప్రతిజ్ఞాపూర్వకముగా నాకొక మాట ఇచ్చి, ఇప్పుడా మాటను తప్పే మార్గాన్ని అన్వేషిస్తున్నాడు. అది నీవు మాత్రమే నెరవేర్చ గలవు. సత్య పాలన మీ వంశానికి ఆలంబన కదా. మీ తండ్రి ఇప్పుడా సత్య పథాన్ని తప్పి చరించడం ధర్మమా? ఈ రాజ్యపాలకుడు ధర్మాధ్వగామియై చరించేందుకు నీవే బోధించాలి, సహకరించాలి. నీ తండ్రి, మన పాలకుడు నైన దశరథుని మనోగతాన్ని, అది నీకు సమ్మతమైనా అసమ్మతమైనా నీవు తప్పక ఆచరిస్తానని మాటయిస్తే, ఆయన శోకానికి కారణం ఏమిటో చెపుతాను, అంటుంది, కైకేయి.
(ఇది కైకేయి సంభాషణలోని చతురత. ముందు కాళ్ళకు బంధం వేసి తన మాట నెగ్గించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రయత్నం. దశరథుడు ఎలాగూ చెప్పే మానసిక స్థితిలో లేడు. రామునికి ఆ రాజ్యంలో ఉన్న ప్రజాదరణ తనకు తెలుసు. భరతుని పట్టాభిషేకం నిర్విఘ్నంగా జరగాలి అంటే రాముడు స్వచ్ఛందంగా అడవులకు వెళ్ళాలి. అందుకే ఈ బిగింపు వేస్తుంది కైక. మాట తప్పని రాముడి నైజం తనకు తెలుసు కాబట్టి ముందే మాట తీసుకుంటుంది)
 రాముని వద్ద ఆ మేరకు ప్రమాణం చేయించుకొని, కైకేయి; దేవాసుర సంగ్రామంలో దశరథుడు దేవతల పక్షాన యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో మూర్ఛిల్లడం, ఆ సమయంలో కైకేయి అతనిని రక్షించడం, దానితో సంతసించిన దశరథుడు ఆమెకు రెండు వరాలను ఇస్తానని వాగ్దానం చేయడం, ఆ వాగ్దానాని కనుగుణంగా ఆమె ఇప్పుడు ఆ వరాలను ప్రస్తావించి, మొదటగా రాముడు పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని, రెండవదిగా తన కుమారుడు భరతుడు అయోధ్యా పట్టణానికి ప్రభువుగా అభిషిక్తుడు కావాలని కోరడం, దానితో వ్యథ చెందిన రాజు, ఒకవైపు రామ వియోగాన్ని భరించలేక అలాగని ఇచ్చిన మాటను తప్పలేక, సందిగ్ధంలో కొట్టు మిట్టాడుతూ ఉన్న వైనాన్ని తెలుపుతుంది. 
దానికి రాముడు, అమ్మా! నీ కోరిక తప్పక నెరవేరుస్తానని మాట యిచ్చి, తన తల్లికి తన వనవాసాన్ని నివేదించి ఆమె అనుమతి పొంది వస్తానని చెప్పి, కైక అనుమతితో, కౌసల్యా మందిరానికి వెళ్ళి, కౌసల్యకు ఆ విషయాన్ని విన్నవిస్తాడు. సహజంగానే తల్లి కనుక ఆమె బేలగా దుఃఖపడడం జరుగుతుంది. ఆ సందర్భంగా లక్ష్మణుడు.... కౌసల్యను ఓదార్చుతూ తన మనస్సును ఈ విధంగా ఆవిష్కరిస్తాడు.

1)  కుటిలాత్మురాలైన ఒక స్త్రీ మూలంగా ధర్మ వర్తియైన రాముడు అడవులకు వెళ్ళడం సమంజసం కాదు
2) మాట యిచ్చిన తండ్రి విషయాసక్తుడు, కామ వికారాలకు లోనైన వాడు మరియు మతి చలించిన వృద్ధుడు. కామ మోహితుడైన దశరథుడు కైక ప్రేరణచే ఈ వరాల నెపంగా రాముని అడవులకు పంపడం అసమంజసం, అసంబద్ధం.
3) పెద్దవాడైన రామునికి రాజ్యార్హతను కాదని భరతునికి రాజ్యాన్ని కట్టబెట్టడం అన్యాయం. మన రాజు, అస్థిమితమైన బుద్ధియుతుడై, యుక్తాయుక్త వివేచనను విస్మరించి, దుర్బోధల వల్ల ప్రభావితుడైన వాడు కాబట్టి ఆ నిర్ణయం చెల్లదు. దానిని పాలించ వలసిన అవసరం రామునికి లేదు.
4) తల్లిదండ్రుల పట్లగాని, రాజ్య ప్రజల పట్లగాని ఏ విధమైన అపరాధం కాని, రాజ ద్రోహం కాని చేయని ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఒక నాగరికుని, అందునా కన్న కుమారుని, కారణం లేకుండా అడవికి పంపడం అధర్మం
5) ధర్మ బుద్ధి కలవాడిని, పరోక్షంలో కూడా ఎవ్వరూ తనను పల్లెత్తు అసంగతమైన మాటను అనని వానిని దండించిన రాజు అధర్మపరుడు కాబట్టి ఆ అధర్మ వర్తియైన పాలకుని ఆజ్ఞను పాలించాల్సిన అవసరం లేదు

అంటూ ఇంకా ఆవేషపూరితుడైన లక్ష్మణుడు, రామునితో ఇలా అంటాడు. ఓ రామా!

1) ఈ విషయం నగరంలో ఎవరికీ తెలియక ముందే.... రాజ్యాధికారాన్ని చేజిక్కించుకో. అందుకు నేను సహాయపడతాను
2) యుద్ధ సన్నాహివై నీవు, నీకు సహాయంగా నేను నిలిస్తే మనల్ని జయించగలిగిన వారెవ్వరూ లేరు
3) అవసరమైతే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యం చేద్దాం
4) భరతుని పక్షంలో నిలిచే వారందరినీ వధిద్దాము
5) కైక మాటలకు వత్తాసు పలికే మన తండ్రిపై మమకారాన్ని విడిచి పెడదాము. యుక్తాయుక్త విచక్షణా రహితుడై అధర్మ మార్గంలో పయనించే వాడు ఎంతటి వాడైనా వానిని శాసించాలని ధర్మం బోధిస్తున్నది. అతను గురువైనా తండ్రియైనా అతనిని బంధిద్దాము లేదా అవసరమైతే సంహరిద్దాము.
6) పరాక్రమ హీనుడు మాత్రమే దైవముపై ఆధారపడి క్రియా శూన్యుడై బ్రతుకుతాడు. స్వశక్తిపై ఆధారపడిన వాడు అవరోధాలను అధిగమించి (అవి దైవికమైనా) లక్ష్యాన్ని చేరే మార్గాన్ని అన్వేషిస్తాడు, సాధిస్తాడు, జీవిస్తాడు.
7) అంతెందుకు, భరతునికి రాజ్యం కట్టబెట్టాలనే దుస్సంకల్పంతో ఉన్న కైక మోహంలో మన తండ్రి కూడా అధర్మ వాదియై నీపై కుట్ర పన్ని ఉండవచ్చు. ఆ కుట్రను భగ్నం చేయడం మన హక్కును కాపాడుకోవడం క్షాత్ర ధర్మం కాదా?

ఇలా అనేక విధాల ఆవేషపడే లక్ష్మణుడిని ఓదార్చుతూ, రాముడంటాడూ.... మంచి మనసుతో మనమొక కార్యాన్ని సంకల్పిస్తాము. విధి  వశాత్తు అనుకోని పరిస్థితుల వల్ల దాని నిర్వహణలో అవాంతరం వస్తే దానికి కారణం మన తప్పిదం కాదు, అది విధి వ్రాత. ఆ వ్రాతను తప్పింపలేమనీ, పితృ వాక్య పరిపాలన ఔన్నత్యం సమున్నతమైనదనీ చెపుతూ, శాంతపరుస్తాడు రాముడు.

ఈ సన్నివేషాన్ని మన జీవితాలకు అన్వయించుకొని విశ్లేషణ చేసుకుంటే.... 

1) మనలో చాలా మందిమి లక్ష్మణుడి లాగానే ఆలోచిస్తాము.
2) ప్రతి సంఘటనకు అనుక్రియ ఉంటుంది అలాగే ప్రతిక్రియా ఉంటుంది.
3) ఇక్కడ లక్ష్మణుడి ఆలోచన ఆవేషపూరితంగా ఉండడం వల్ల "ప్రతిక్రియ" కై ఆలోచించాడు
4) రాముడు ధర్మ పథాన్ని ఆశ్రయించి యుండడంతో నిర్మల మనస్సుతో ధర్మ బద్ధంగా చేయవలసిన "అనుక్రియ"ను ఆలోచించాడు. ధర్మ చింతన వల్ల సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.
5) ధర్మాధర్మ విచక్షణ లేక నా ఆలోచనయే న్యాయం, అదే ధర్మం అన్న ఆవేషభరతమైన నిర్ణయాలు అంతర్గత కలహాలకు నాంది పలికితే, రక్తపాతం జరగడమే కాక, రాజ్య ప్రజల శాంతికి విఘాతం ఏర్పడుతుంది. సమాజంలో సంక్లిష్టత చోటుచేసుకుంటుంది.
6) నాయకుడు అధర్మ మార్గంలో నడిస్తే అది ఆచారమై ప్రజల చేత ఆచరింపబడుతుంది. అది అనాదరణీయం.
7) శక్తి కలిగి యుండడం కన్నా ఆ శక్తిని ఎప్పుడు ఎలా ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలియడం వల్ల ప్రయోజనం ఉండడమే కాదు, ఆ విజ్ఞత ప్రజా పాలనలో శాంతిని అందిస్తుంది.
8) ఏ పరిస్థితులలో కూడా ధార్మిక చింతనకు దూరం కాని మానసిక స్థితిని పొందిన వాడు కాబట్టే రాముడు ఆనాటి నుండి ఆదరణీయు డయ్యాడు. ఆయన మార్గం అనుసరణీయ మైంది.
9) నిత్య జీవితంలో మనకు కైక పాత్రలు, దశరథుని పాత్రలు, లక్ష్మణుడి పాత్రలూ అనేకం ఎదురవుతూనే ఉంటాయి. అంతేకాదు, మన ప్రయత్నాలలో అవరోధాలూ సహజంగానే కలుగుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొంటామో అదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.
10) అనుకున్నది అనుకున్న విధంగా జరిగితే ఆనందమే. విజయాన్ని నిర్వహించుకోవడం అందరికీ సాధ్యపడేదే కాని అపజయం ఎదురైతే దానిని ఎలా నిర్వహించుకుంటామనే దానిపై మన పరిణతి ఆధారపడి ఉంటుంది. అదే మనకు శాశ్వత విజయాన్ని, సంతృప్తిని, చరిత్రలో సుస్థిర మైన స్థానాన్ని సంపాదించి పెడుతుంది. దానికి ఉదాహరణయే రాముని పాత్ర.

వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలో ఈ సన్నివేషాన్ని చదివినప్పుడు నాకు కలిగిన భావాలను మీతో పంచుకునే ప్రయత్నం చేసాను. తప్పొప్పులు తెలిపి విజ్ఞులు సహకరించి దీనిని మరింత ఉన్నతంగా మలిచేందుకు సహకరిస్తారని ఆశిస్తూ.... సహృదయులను అభ్యర్ధిస్తున్నాను.

నమస్సులతో…..
పాలకుర్తి రామమూర్తి

Monday, April 1, 2019

ఎన్నికల సంస్కరణలు

ఎన్నికల సంస్కరణలు - మార్పు అవసరం

ప్రాచీన భారత దేశంలో వంశపారంపర్యంగా రాచరిక వ్యవస్థ ఉన్నా, ఆ నాడు ప్రభుత్వం మంత్రులు, ప్రజాప్రతినిధుల సలహాలతో నిర్వహింపబడేది. అవసరమైన సమయాలలో ప్రజలు ప్రభువును ఎన్నుకోవడం కూడా జరిగేది. రాజు యొక్క అధికారానికి పరిధులు ఉండేవి. గ్రామ పెద్దలందరి సమావేశాలను "సభలు" అనేవారు. రాజ్య ప్రజలందరి సమావేశాలను "సమితి"లు అనేవారు. సభలు, సమితుల ద్వారా రాజరికపు అధికారానికి పగ్గాలు వేసేవారు. పాలనలో ప్రజల  కవసరమైన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచడం, అవసరమైన సమయంలో పాలకులను ఎన్నుకోవడం "సమితు"ల ప్రముఖ విధిగా చెప్పబడింది. ఉదాహరణకు దశరథుడు చక్రవర్తియైనా రాముడిని యువరాజును చేసేందుకు సమితిని ఆశ్రయించి దాని అనుమతి పొందవలసి వచ్చింది.
అదే క్రమంలో భారత దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ రూపు దిద్దుకుంది. ఎన్ని మార్పులు వచ్చినా ప్రజాతీర్పుతో పాలన జరగడం అనబడే మౌలిక ప్రజాస్వామ్య స్వరూపం మారలేదు.
ఈనాడు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పబడుతున్న భారత దేశంలో పరిపాలన స్వతంత్ర ప్రతిపత్తులు కలిగిన మూడు వ్యవస్థల ద్వారా సాగుతుంది. అవి పార్లమెంటరీ వ్యవస్థ, బ్యూరోక్రసీ (ఉద్యోగ స్వామ్య) వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు. అందులో మన ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 167 దేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా (Democratic) ప్రభుత్వాలను నడుపుతున్నాయి. అందులో ఎన్ని విధాలయిన ప్రజాస్వామ్య పద్ధతులున్నా అంతిమంగా ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయడం జరుగుతుంది.
“ప్రజలయొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు” ప్రభుత్వం అనేది, నిజానికి ప్రజాస్వామ్యానికి ఇవ్వబడ్డ నిర్వచనం. కాని ప్రజాస్వామ్య వ్యవస్థ సుప్రతిష్టితం కావాలంటే, లక్ష్యించిన విధంగా నడవాలంటే, ఆ దేశ ప్రజలు విద్యావంతులు కావాలి. విద్య అంటే అక్షరాలను నేర్వడం మాత్రమే కాదు. మంచి చెడ్డలను విచక్షణా యుతంగా బేరీజు వేయగలిగిన విజ్ఞత, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, తెగువ, విలువలతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించే వివేచన నివ్వగలిగినదే నిజమైన విద్య. ఆ విద్య ఈ నాడు కొరవడింది. సమాజంలో ఆ విద్య లేని నాడు ప్రజాస్వామ్యం “పశువుల యొక్క, పశువుల చేత, పశువుల కొరకు” అని చెపుతారు.
It is also opined that democracy without education is Hippocracy without limitations
భారత దేశంలో రాజకీయం ఒకప్పుడు ప్రజా సేవకు ప్రభావ వంతమైన సాధనంగా ఉపయోగపడింది. సమాజ శ్రేయస్సు లక్ష్యంగా పనిచేయాలని, విలువల ఆధారితంగా సమాజాన్ని నడపాలని, తమ నైతిక జీవన ప్రవర్తన ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే భావన ఉన్నవారు రాజకీయ నాయకులుగా ప్రజలను చైతన్య వంతులను చేసారు. తమ స్వంత ఆస్తిపాస్తులను సమాజానికి దానం చేసి సమాజ సేవలో తాము ధన్యులుగా చరిత్రలో మిగిలి పోయారు. ఇప్పుడా స్పూర్తి పదవీ కాంక్షగా, ధన సంపాదనకు మార్గంగా మారడం వల్ల ప్రజాస్వామ్య నిర్వచనం మార్చుకోవలసిన ప్రమాదం ఏర్పడింది.
డబ్బు రాజకీయాలను శాసించడం వల్ల, అది వ్యాపారంగా మారి లాభాపేక్ష పెరిగింది. ఎంత పెట్టుబడి పెడుతున్నాము అందులో ఎంత లాభం వస్తుంది.... ఈ అంచనాలే ఈ నాటి రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వార్ధపరులైన నాయకులు తమ సీటును గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా ఓటరును ప్రలోభ పెట్టేందుకు ఇచ్చే ఒక్క నోటు కోసమో, ఒక్క సారా బాటిల్ కోసమో, మరేవైనా నజరానాల కోసమో ఓటును అమ్ముకోవడం అంటే పాలిచ్చే ఆవును కసాయి వాడికి అమ్మినట్లుగా భావించాలి.
భారత దేశంలో 1952 నుండి 1962 వరకు ఎన్నికలు దాదాపుగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే నిర్వహింపబడడం, ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది. తదుపరి కాలంలో ముఖ్యంగా 1967 ఎన్నికల నుండి ఆరంభమయిన ప్రజాస్వామ్య విలువల పతనం ఈ నాటి వరకు దినదిన ప్రవర్ధమాన మౌతున్నది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, స్ఫూర్తికి తూట్లు పడడానికి పూర్వరంగం అనుకుంటే.... పతనావస్థ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఎన్నికలు రాజకీయ అవినీతికి మూలమైన విధానం ఈ నాడు మనం చూస్తున్నాము. దానికి కారణాలు అనేకం.. వాటిలో కొన్నింటిని చర్చించుకుంటే...
1) రాజకీయంలో నైతిక విలువలు లోపించడం, ఎలాగైనా ఎన్నికలందు గెలవాలనే ఒకే ఒక లక్ష్యంతో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రయత్నించడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలవుతున్నది.
2) మత కుల ప్రాతిపదికన వోటర్లను విభజించే ప్రయత్నాలు చేయడం, అవినీతి, నేర ప్రవృత్తి, మతం, కులం ప్రాతిపదికలుగా అభ్యర్ధులను బరిలో దింపడం,  ప్రతిభ ఆధారితంగా కాక అమితమైన డబ్బును వెచ్చించి ఓట్లను కొని సీటును గెలవ గలిగిన అభ్యర్ధులను ఎన్నికలలో నిలపడం ద్వారా ఎన్నికలందు లబ్దిపొందే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.
3) పలు విధాలుగా ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం, ప్రాంతీయ భావనలతో సహా, అవకాశం ఉన్న అన్ని మార్గాలలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, అన్ని రాజకీయ పార్టీలకు సర్వసాధారణమయింది.
4) రాజకీయం అవినీతిమయం కావడం, అవినీతి రాజకీయావతారమెత్తడం వల్ల నల్ల డబ్బుతో ఓట్లను కొనుక్కోవడం, పోలింగ్ బూత్ లను ఆక్రమించుకోవడం, కండబలంతో ఓటర్లను భయభ్రాంతులను చేసి ఎవరికి వారే తమ అభ్యర్ధికి ఓట్లు వేసుకోవడం సాధారణమయింది.
5) అధికారంలో ఉన్న వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుగా ఉపయోగించడం ఎక్కువగా కనిపిస్తుంది
6) స్వతంత్ర అభ్యర్ధులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్ వేసి గందరగోళాన్ని సృష్టించడం, ఒకే పేరుతో ఉన్న వారిని అభ్యర్ధులుగా నిలిపి ఓట్లు చీల్చే ప్రయత్నాలు చేయడం చూస్తున్నాము.
ఇలాంటి పలు కారణాల వల్ల ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పడడం జరుగుతుంది. నెమ్మదిగా ప్రజలను కూడా ఈ అవినీతి ప్రవృత్తికి అలవాటు చేస్తున్నారు. కుతర్కాలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ... తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్న నేతల మనుకునే వారు చేస్తున్న అకృత్యాలు పరమ నీచమైన స్థాయికి చేరాయని అనుకోవడం తప్పు కాదనేది నాభావన.
  నిజానికి ఈ అవినీతి విధానాన్ని గమనిస్తున్న విజ్ఞానులు,  సామాజిక స్పృహకలిగిన వారు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల దుర్మార్గం ప్రభావవంతంగా తన పని తాను చేసుకు పోతున్నది. చెడ్డ వారు చేసే చెడుకన్నా మంచి వారి ఉదాసీనత బహుళ ప్రమాదకరం. ఎప్పుడైతే ఎన్నికలు ఒక Free and Fair వాతావరణంలో నిర్వహింప బడతాయో అప్పుడు  అక్కడ ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబిస్తాయనే విషయం అందరికీ అవగాహనలో ఉన్నా, ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న రిగ్గింగ్ లాంటి వాటిని ధన ప్రవాహాన్ని నియంత్రించే విధంగా ప్రజలు స్పందించడం లేదు. అలాగే ప్రభుత్వమూ తన సంపూర్ణ అధికారాన్ని ప్రదర్శించడం లేదు.
చట్టం లోని లొసుగులు, కండబలం , ధనబలం, మందబలం కలిగిన నాయకత్వం సాగిస్తున్న అక్రమాల వల్ల, తప్పుడు విధానాల వల్ల ప్రజాస్వామ్యంలో ప్రతిబింబించాల్సిన  ప్రజల మనోభావాలు ప్రతిబింబించడం లేదు.
ఈ నేపథ్యంలో సామాజికస్పృహ కలిగిన కొందరు పెద్దలు, కొన్ని స్వఛ్చంద సంస్థలు సమాజంలో మార్పు కోరుతూ ఆ దిశలో ప్రయత్నాలు సాగించడం నిజానికి అభినందించాల్సిన విషయం. అలాంటి వారి ప్రయత్నం, కొద్ది శాతం ప్రజల ఆలోచనలలో నైనా ఏ కాస్త మార్పు తేగలిగినా అది ప్రజల నైతిక విజయం గానే భావించాలి.
ఈ ప్రయత్నం ద్వారా సమాజంలో మార్పు రావాలని అనుకుంటున్న నేపథ్యంలో ఆ మార్పు ఎలా ఉండాలి అనే చర్చ జరగాలి. దానికి సిద్ధపడే ముందు కొన్ని ప్రశ్నలు మనకు మనం వేసుకొని సమాధానాలు చెప్పుకుందాము.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యత ఏమిటి?
ప్రజాస్వామ్య మంటేనే... వయసురీత్యా అర్హత కలిగిన దేశ పౌరులు ఓటరుగా నామోదయి, తమ ఓటు ద్వారా, తమను పాలించ గలిగిన, విజ్ఞత గలిగిన, నాయకత్వ పటిమ గలిగిన నాయకులను ఎన్నుకోవడం హక్కుగా కలిగి ఉండడం. 18 సంవత్సరాలు నిండిన స్త్రీపురుషులు ఓటర్లుగా నమోదు చేసుకొని నిర్ణీత కాల వ్యవధిలో వివిధ సభలకు తమ ప్రతిని ధులను పంపడం జరుగుతుంది. అయితే ఏ ప్రతినిధి ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో ఆ ప్రతినిధి ఆయా సభలలో సభ్యుడుగా ఉండేందుకు దోహదపడేదే ఓటు కాబట్టి ఆ ఓటు హక్కు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
ఎన్నికలు ప్రస్థుతం ఎలా నడుస్తున్నాయి?
ప్రస్థుతం ఎన్నికలలో నిజాయతీ కన్నా ధనబలం మరియు ఇతర అవినీతి విధానాలే రాజ్యమేలుతున్నాయి,
ఈ పరిస్థితులు మారాలని మనం అనుకుంటున్నామా?
ఒక ప్రజాస్వామ్య వాదిగా దేశ భవిష్యత్ తరాలు బాగుపడాలనే సంకల్పంతో ఈ విధానం తప్పని సరిగా మారాలని కోరుకుంటున్నాము.
అసలు మార్పు అంటే ఏమిటి?
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం మార్పు. అధమ స్థితికి వెళ్ళడం కూడా మార్పే. కాని ఉన్నత స్థితిలో పరిణతి ఉంటుంది... అది పరివర్తన... ఆ పరివర్తన రావాలి.
మార్పును గూర్చిన మన అవగాహన ఏమిటి?
మార్పు అనేది ప్రకృతిలో ప్రాథమిక లక్షణం. ప్రకృతిలో మార్పు చెందనిది నిజానికి మార్పు ఒక్కటే. మనం మారక పోతే మార్పే మనలను మారుస్తుంది. అందుకని మనమూ పరిస్థితుల కనుగుణంగా ముందుగానే పరివర్తన చెందాల్సి ఉంటుంది.
మార్పు యొక్క  అవసరం ఏమిటి?
సమగ్రమైన మార్పు ద్వారా ఈ విశాల విశ్వంలో ఉన్న అన్నింటితో సామరస్య పూర్వకమైన సహ జీవనం చేయడం సాధ్యపడుతుంది.
ఒకవేళ మార్పు అనివార్యం అనుకుంటే... అందులో మన పాత్ర ఏమిటి?
ఏ సమాజంలో నైనా మార్పు అనివార్యం అనుకుంటున్నాము కాబట్టి అవగాహనా పూర్ణమైన మార్పును ఆహ్వానించడం వల్ల ఆ సమాజంలో మన పాత్ర ప్రాధమిక మౌతుంది. మనం పొందిన మార్పు ద్వారా కలిగిన పరివర్తనకు పరిణతి నిస్తుంది. అనుకరణ, అనుసరణ మానవ లక్షణం కాబట్టి సమాజం మనలను అనుకరిస్తుంది, అనుసరిస్తుంది. ఆ పరిణతి సమాజ వికసనకు దారితీస్తుంది. అయితే ఆ మార్పు అవసరానికి మారే  మార్పుగా కాక ఒక పరివర్తనగా రావాలి. అవసరానికి మారిన వారు మళ్ళీ అవసరాలు తీరగానే పాత అలవాట్లకు బానిసలౌతారు. నీతి నిజాయతీ విలువలతో కూడిన జీవితాన్ని గడిపే వారు మార్పును ఆహ్వానిస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తారు.
మార్పు మనలో కావాలన్నా, సమాజంలో రావాలన్నా ఏం కావాలి?
మారేందుకు మనలో ఒక తపన రావాలి. ఈ దేశం నాది. ఈ జాతి నాది. దీని కోసం శ్రమించడంలో నాకు నిజమైన ఆనందం ఉన్నదనే భావన మనస్సులలో నిలవాలి. త్యాగ భావన పెరగాలి. ముఖ్యంగా నేనూ నాది అనే భావన కాక మనము మనది అనే భావనతో హృదయం పల్లవించాలి.
మారేందుకు ఉన్న ప్రతిబంధకాలు ఏమిటి?
స్వార్ధ భావనలే మారుటకు ఉన్న ముఖ్యమైన ప్రతిబంధకాలు.
ఆ ప్రతిబంధకాలలో మన చేతులలో ఉన్నవి ఏమిటి? అలాగే మన నియంత్రణలో లేనివి ఏమిటి?
మనం మారడం మన చేతులలో ఉన్నది. ఇతరుల మార్పు మనచేతులలో లేనిది. అయితే మనం మారడం వల్ల మన మార్పు ఇతరుల జీవితాలకు ప్రేరణ నివ్వవచ్చు. మార్పు వల్ల వచ్చే ప్రయోజనాలను ప్రజలకు సోదాహరణంగా ప్రచారం చేయడం ద్వారా వారిని చైతన్యవంతులను చేయవచ్చు. విజ్ఞత లేకుండా ప్రలోభాలకు లొంగిపోయి ఓటును అమ్ముకోవడం వల్ల మనం కోల్పోతున్నదేమిటో ఎదుటి వారికి అర్థం అయ్యే విధంగా చెప్పడం వల్ల ప్రజలలో క్రమేపీ మార్పు వస్తుంది. అయితే దానికి కావలసింది... ఒకటి మనం నమ్మిన సిద్ధాంతంపై నమ్మకం. రెండు... ఆచరాణాత్మమైన ప్రబోధ, మూడు... ఎదుటి వారికి అర్థం అయ్యే భాషలో వారి వద్దకు వెళ్ళడం వారి సందేహాలను ఓర్పుతో, ఓపికతో తీర్చడం. దీని వల్ల ఆశించిన ప్రయోజనాలు తొందరలోనే సాధించే అవకాశం ఉంటుంది.
ఇవే సమగ్రమైన ప్రశ్నలు జవాబులు కాకపోవచ్చు కాని వీటి వల్ల కనీసం మార్పు యొక్క ప్రాథాన్యత అర్థం అవుతుంది.
ఇప్పుడు సమస్యను కొంత మేరకు అర్ధం చేసుకున్నాము కాబట్టి ఈ పరిస్థితులను చక్క దిద్దేందుకు మనమేం చేయాలి, ప్రభుత్వాలు ఏంచేయాలి, ప్ర్ర్రజా సంక్షేమం కోరే సంస్థల పాత్ర ఏమిటి అనే విషయాన్ని పరిశీలిద్దాము.
ముందుగా ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను పరిశీలిద్దాము....
చట్టబద్ధంగా ఎలక్షన్ కమీషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఓటర్లు నిర్భయంగా, స్వఛ్చందంగా, స్వేఛ్చగా ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమీషన్ బాధ్యత.
ధనబలం, నేరతత్వం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కులమత ప్రాంత భావనలు లాంటి ఎన్నో విధాలుగా విష పూరితమైన ఈ నాటి ఎన్నికల విధానంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించడం కమీషన్ కు కత్తి మీద సాము లాంటిదే. అయినా, ఎలక్షన్ కమీషన్ ఇప్పటి వరకు ఆర్ధిక వ్యయంపై నియంత్రణ, ఒక పార్టీ “బి” ఫారమ్ పై ఎన్నికైన అభ్యర్ధులు మరొక పార్టీకి మారడాన్ని నియంత్రించడం, పైడ్ న్యూస్ మరియు రాజకీయ అడ్వర్టైజ్ మెంట్లపై నియంత్రణ, ఒపీనియన్ పోల్స్ పై నియంత్రణ, నోటాను బాలెట్ పేపర్ లో చేర్చడం లాంటి ఎన్నోసంస్కరణలతో నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. చట్టాలు పటిష్టంగానే ఉన్నాయి. అయినా వాటిని అమలు చేసే వ్యక్తుల అలసత్వం అప్పుడప్పుడు అనుమానాలకు, విమర్శలకు తావిస్తుంది. వాటిని సరిదిద్దాల్సిన చర్యలు చేపట్టాలి.
అన్ని స్థాయిలలో యంత్రాంగాన్ని సన్నద్ధ పరచాలి. బాధ్యతలు అప్పగించడంలో సమర్ధతను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇక్కడ సీనియారిటీ కన్నా సమర్ధతయే ప్రథానమైన అర్హతగా పరిగణించాలి.
అధికారాలు లేకుండా కీలక బాధ్యతలను నిర్వహించడం అంటే ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపడమే అవుతుంది. కాబట్టి సమర్ధవంతంగా కార్యక్రమాలను నిర్వహించగలిగిన వ్యక్తులను ఎన్నిక చేసుకొని వారికి ఆ బాధ్యతల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే విధంగా అవసరమైన శిక్షణ నిచ్చి బాధ్యతల నప్పగించాలి.
కీలక బాధ్యతలను అప్పగించే సమయంలో అవసరమైన నిధులు, అధికారాలు వారికి కల్పించాలి. అదే సమయంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి ఆరోపణలు వస్తే విచారించి వీలైనంత త్వరగా వారికి తగిన శిక్షలు వేయాలి.
ఎన్నికల అధికార యంత్రాంగంలో ఉదాసీన భావాన్ని తొలగించాలి. ఎప్పటికప్పుడు తనను తాను ఉన్నతీకరించుకునే విధంగా ప్రేరణ నివ్వడం వల్ల ఆ అధికారి సన్నద్ధమై ఉంటాడు. దానికి అవసరమైన చర్యలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం సమర్ధవంతంగా అమలు చేయడం చాలా ముఖ్యం.
స్వఛ్చంద ప్రజా వేదికల ద్వారా ఎన్నికల సంస్కరణలను ప్రచారం చేయడం, వాటిపై అర్ధవంతమైన చర్చలు జరపడం, ఆ చర్చల సారాంశాన్ని విశ్లేషించి ప్రజోపయోగం అనుకున్న, అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని సంస్కరించడం ద్వారా ప్రజలకు సరైన అవగాహన కల్పించ వచ్చు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల ప్రజలలో ఎన్నికల కమీషన్ పై విశ్వాసం కలుగుతుంది.
సరైన పనిని, సరైన విధానంలో, సరైన సమయానికి, సమర్ధవంతంగా నిర్వహించడం కమీషన్ ప్రాథమిక కర్తవ్యం. ఆ విధానంలో అవకాశం ఉన్న అన్ని విభాగాలలో Information technology సహకారాన్ని అవసరమైన విధంగా తీసుకోవడం వల్ల…..
పనులు సులువవుతాయి.
పారదర్శకతను పెంచుకోవచ్చు.
ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవచ్చు,
ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎన్నికల నిర్వహణ సులువవడమే కాక ప్రజల ఆమోదాన్ని కూడా పొందుతుంది.
నిజానికి ఎన్నికల సంస్కరణలు ఒక్క ఓటు వేయడంలో రావలసిన మార్పులే కాక
ఓట్లను లెక్కించడం,
ఓటు హక్కు కల్పించడంలో అర్హతను గుర్తించడం,
నియోజక వర్గాల ఎల్లలను నిర్ణయించడం,
ఎన్నికల యంత్రంగానికి మరియు ఓటరుకు రక్షణ కల్పించడం,
ఓటు వేసిన పెట్టెలకు భద్రత కల్పించడం,
కావలసిన ఆర్ధిక వనరులను సమీకరించుకోవడం,
ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రచారం చేయడం,
ఓటింగ్ సామాగ్రిని, పెట్టెలను నమూనాలు చేయడం,
అభ్యర్ధులకు వారి ఏజంట్ లకు అవసరమైన గుర్తింపు లిచ్చి ఎన్నికలు సజావుగా జరిగేందుకు తోడ్పాటు నందించే విధంగా చూడడం లాంటి పలు అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.
ప్రజా సంస్థలు, ప్రజలు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములై ప్రజాస్వామ్య వ్యవస్థ స్పూర్తిని సజీవంగా నిలపాల్సి ఉంది. ప్రజా సంస్థలు ఎన్నికలలో పార్టీలు, ఎన్నికల యంత్రాంగం అక్రమాలకు పాలుపడకుండా నిఘా పెట్టడం చేయాలి. ఎప్పటి కప్పుడు ఆయా పార్టీలు పెట్టే ఖర్చులపై నిఘాపెడుతూ అవసరమైన చోట ఎన్నికల కమీషన్ కు సహకరించాలి. తప్పుడు విధానాలలో అభ్యర్ధులు ఓటర్లను భయభ్రాంతులను చేసినా, డబ్బు, సారాయి లాంటివి పంపిణీ చేసే ప్రయత్నాలు చేసినా వాటిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలి. సంఘటితంగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా అవసరమైన చోట పోలీసు సహకారం తీసుకోవడం, ఎన్నికల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం చేయవచ్చు.
ధార్మిక జీవనం గడిపేందుకు ఎంతటి నిబద్ధత అవసరమో లౌకిక జీవితంలో ధర్మాన్ని ఆచరించడం, అక్రమ పద్ధతులను విడనాడడం అంతే అవసరం. భగవంతుడిని చేరాలంటే కావలసింది భయం కాదు. అలాగే కర్మాచరణలో కావలసింది కూడా నిర్భయత. అధర్మాన్ని ఎదిర్చే మానసిక సన్నద్ధత లేని పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా పరిణతి నీయవు. జాతికి రాజ్యాంగం ఒక భగవద్గీతతో సమానం. ప్రజా క్షేత్రంలో నిబద్ధతతో ఆచరించే ప్రతి కర్మాచరణ ఆధ్యాత్మిక జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. భగవదారాధనకు ఎలాగైతే సన్నద్ధమౌతామో అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణకు సన్నద్ధం కావడం మన జీవితాన్ని ఉన్నతీకరిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
నాకీ వేదికను పంచుకునే అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ కృతజ్ఞతులు తెలుపుకుంటూ... సెలవు.... నమస్సులు.
పాలకుర్తి రామమూర్తి