Wednesday, November 16, 2016

గంగావతరణము (2012 లో నేను వ్రాసిన శ్రీ సీతారామాయణము పద్య కావ్యము, బాలకాండ నుండి)

గంగావతరణము
(2012 లో నేను వ్రాసిన శ్రీ సీతారామాయణము పద్య కావ్యము, బాలకాండ నుండి)

వేద మంత్రాలతో సంస్తుతింపగ ఋషులు
మంగళారతులిచ్చి దివిజభామలు గొలువ
అప్సరసలాడగా సురగణము పాడగా
కల్యాణమూర్తియై కదిలింది సురగంగ

సుడులుగా కెరటాలు పడిలేచి ఘూర్ణిల్ల
నురగలై తరగలై దిక్తతులు నిండగా
గలగలా నవ్వింది బిరబిరా పారింది
మందహాసమ్ముతో నర్తనలు చేసింది

యెదనహంకారమ్ము వక్రమార్గము పట్ట
భ్రాంతమౌ చిత్తమ్ము చిత్రగతి సాగంగ
మాత్సర్య ముప్పొంగ భీమరూపము దాల్చి
అట్టహాసమ్ముతో గర్జనలు చేసింది

అభయ ముద్రను వీడి శాంతమ్ము నెడబాసి
క్రౌర్యమ్ము మదినిండ రాక్షసత్వము బూని
చండాట్టహాసోరు ఝంఝానిలోద్ధూత
మేఘమై కదిలింది పరవళ్ళు త్రొక్కింది

ఉత్సాహముప్పొంగ ఉద్వేగమున లేచి
ఔద్ధత్యమును జూప ఆర్భాటమున సాగి
గర్వమ్ము తలకెక్క ఉగ్రమూర్తిగ మారి
ఆటోపమున నిల్చి తకధిమ్ములాడింది

మేఘ పంక్తుల పైన ఉరిమింది ఉరికింది
నగరాజి దాకింది నుగ్గుగా జేసింది
వృక్ష సంతతి నెల్ల పెకిలించి వేసింది
సూర్య చంద్రుల కాంతి నలతిగా చేసింది

ఆకాశమును మ్రింగి దిక్కులన్నిట నిండి
ప్రళయ భాంకృత బృహద్భీషణ ధ్వనులతో
భూనభోంతరమెల్ల వెరగంది జూడంగ
గమ్యంబు లేకుండ సాగింది భువిపైకి

ఉన్మాదియౌ గంగ ఉరవడిని యోర్వక
పశుపతీ శరణంచు ప్రార్థింపగా జగతి
భవహరుడు శివకరుడు స్మరహరుడు శంకరుడు
భక్తపాలకు డిచ్చె జగతి కభయమ్ము

భీమ రూపమ్ముతో భీషణ ధ్వనులతో
సురగంగ దిగురూపు జూచి శంకరుడు
చిద్విలాసమ్ముగా చిఱునవ్వుతో విసిరె
చిన్నిజట, అందులో ఒదిగిపోయెను గంగ!


పాలకుర్తి రామమూర్తి

ముఖ పుస్తక మిత్రులు ఒకరు "శివకరుడు" విశ్లేషించండి అంటే...
 శివుడు ఆనందమయుడు. నిష్కాముడై కైలాసశిఖరాన తపస్సు చేస్తున్నాడు. అతనికి "ఆకలి" లేదు. తనకే కాదు.. తన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఆకలి లేదు. ఆకలి అంటే... మనమనుకునే శారీరకమైనదే కాదు...  కోరిక లేదా కామము ఏదైనా అది ఆకలే. ఆకలి లేక పోవడము చేత సృష్టి అంతా స్తంభించి పోయింది. "భవము" అంటే పుట్టుక. ఆకలి ఉంటేనే భవము సాధ్యపడుతుంది. భవాన్ని హరించాడు కాబట్టే తన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా సృష్టి ఆగిపోయి అంతా "శివ" మయము అయింది. అతడూ "భవహరుడు" అయ్యాడు.  అప్పుడు పార్వతీదేవి... అతనిని ప్రార్థించింది.. తపస్సును విడిచి లోకపాలనను చేపట్టమంది. దానికి మన్మధుడు సహాయకారి అయ్యాడు. అయితే శివుని ఆగ్రహానికి అతడు భస్మమయ్యాడు. దానితో శివుడు "స్మరహరుడు" అయ్యాడు. అయితే పార్వతీదేవి ప్రార్థనతో "శాంతించిన" ఈశ్వరుని పార్వతి "శంకరుని"గా మార్చి తాను అన్నపూర్ణగా మారి కాశీకి తీసుకువచ్చిందని చెపుతారు. ఇదే వరస భవహరుడు... శివకరుడు.. స్మరహరుడు శంకరునిగా మారడంజరిగింది. ఈ భావనతోనే ఆ వాక్యాలువ్రాయడం జరిగింది. మీ సూచనలు మరేమయినా ఉంటే సంతోషంగా స్వీకరిస్తాను.
దీనికి  అనుబందంగా...
"శివము" అంటే ఆనందము. "శం" ఆంటే మంగళము. శంకరుడు మంగళాన్ని ఇచ్చేవాడు అలాగే శివకరుడు ఆనందాన్ని ఇచ్చేవాడు. అయితే ఆనందం అంటే ఏమిటి? అనేది ప్రశ్న. తైత్తిరీయోపనిషదత్ లో బ్రహ్మానందవల్లి అని ఉంది. దానిలో ఎనిమిదవ అనువాకంలో "సైసా౨౨నన్దస్య మీమాగ్ం సా భవతి" (ఆనందాన్ని గురించిన విచారణ చేయబడింది). ఉత్తమ ఆశయములు, దృఢమైన సంకల్పబలము, శారీరకంగా బలిష్ఠుడు, నిరంతర ఆధ్యయనశీలి, యౌవన వంతుడు అయిన వ్యక్తులను ఈ చర్చ చేయడానికి ఈ ఆధ్యాయంలో ఉపనిషత్ ఆహ్వానిస్తుంది. పైన ఉదహరించిన లక్షణాలు అన్నీ కలిగిన వ్యక్తి ఒకడున్నాడు, అతడు ఈ పృథ్వీ మండలాన్ని మొత్తంగా పాలిస్తున్నాడు. అన్ని రకాలయిన భోగభాగ్యాలు ఏ మూల నున్నా అవన్నీ అతని అధీనంలో ఉన్నాయి అనుకుందాము. కష్టం అనేది అతని జీవితంలో లేదు. అప్పుడు అతనికి కలిగే "ఆనందం" అంతా కలిపితే అది మనుష్యుల యొక్క ఒక్క ఆనందంతో సమానం అంటుంది, ఉపనిషత్. దీనికి వంద రెట్లు మనుష్య గంధర్వులకు ఒక ఆనందం; దానికి వంద రెట్లు దేవ గంధర్వులకు ఒక ఆనందం, దానికి వంద రెట్లు పితురులకు ఒక ఆనందం; దానికి వంద రెట్లు అజానజులకు ఒక ఆనందం; దానికి వంద రెట్లు కర్మ దేవతలకు ఒక ఆనందం; దీనికి వంద రెట్లు ఇంద్రునికి ఒక ఆనందం; దీనికి వంద రెట్లు ఒక బృహస్పతికి ఒక ఆనందం; దీనికి వంద రెట్లు ప్రజాపరికి ఒక ఆనందం; దీనికి వంద రెట్లు హిరణ్యగర్భునికి ఒక ఆనందంతో సమానమని చెపుతుంది, ఉపనిషత్. అయితే కామరహితుడైన బ్రహ్మ వేత్తకూ ఈ ఆనందం కలుగుతుంది, అంటుంది ఈ ఉపనిషత్.
హిరణ్య గర్భుడు, వ్యష్టి మరియు సమష్టి రూపుడు. ఇతడే జగద్వాపుడు. ఇతనినే సూత్రాత్మ అని కూడా అంటాము. ఇక్కడ జాగ్రత్తగా అర్థంచేసుకుంటే మన అవగాహనలో ఉన్న ప్రాపంచిక ఆనందాలు అన్నీ సమష్టి తత్త్వంలో ఒకభాగమే. ఈ సమష్టి తత్త్వమే శివుడు.
కామరహితంగా, ఉపాసనా మార్గంలో లేదా సాధనమార్గంలో పురోగమించే సాధకుడు ఒక్కొక్క మజిలీని దాటుకుంటూ సమష్టి తత్త్వాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఆ బ్రహ్మానందాన్ని అనుభవైకవేద్యం చేసుకోగలుగుతాడు. అయితే సాధకుని సాధనలో ముందుకు నడిపించే ఛోదక శక్తి సంకల్ప బలం. ఆధ్యాత్మిక ధర్మాన్ని అనుసరించి సాధకుడు తన సాధనా బలిమికి తగిన రీతిగా ఆరోహణా దీప్తిని పొందుతాడు. ముందుకు పోతాడు. అలా ముందుకు నడిచేందుకు సహకరించే శక్తియే... శివము. ఉదాహరణకు... కర్రకు మండే శక్తి ఉంటుంది. మండుతుంది కాని అదే ఇనుమును మనమెంత వేడి చేసినా ద్రవరూపాన్ని పొందుతుందే కాని మండదు. అది వాటి వాటి సహజ లక్షణాలు. అలాగే మానవునికి సాధనా పటిమతో ముందుకు సాగే సహజ లక్షణము ఉంది. అలాగే "శివము" నకు ఆనందాన్ని ప్రసాదించే లక్షణము ఉంది.

Monday, November 14, 2016

భగీరథుడు ఆ శంకరుని సంస్తుతించడం

ఓం శ్రీ సరస్వతై నమః

కీ.శే. శ్రీ వారణాసి వీరనారాయణ శర్మ గారి ఆనతి మరియు శ్రీ ELN శివప్రసాద్, శ్రీ  గట్టు వినోద్ రావు  తదితర మిత్రుల ప్రేరణతో 2002 సంవత్సరంలో "గంగావతరణం" పేర ఒక పద్య కావ్యాన్ని వ్రాయడం జరిగింది. ఆ కావ్యంలో భగీరథుని తపోదీక్షకు మెచ్చిన శంకరుడు ప్రత్యక్షం కావడం, భగీరథుడు ఆ శంకరుని సంస్తుతించడం ఒక సన్నివేశం. కార్తీక మాస సోమవారం సందర్భంగా ఆ సన్నివేశాన్ని ఆత్మీయులయిన మిత్రులతో పంచుకుందామనే సంకల్పంతో ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

తల జటాజూటమ్ము నెలవంక దానిపై
ఫాల మధ్యమ్మున వహ్ని రేఖ
కంఠాన గరళమ్ము కరిచర్మ మెదపైన
మిన్నాగు భూషలు మేన బూది
అమల హస్తంబుల డమరు త్రిశూలమ్ము
మొలపైన పులితోలు పుర్రె చేత
వాహనమ్ముగ నంది పార్వతి సామేన
ముందు వెన్కల యందు భూత గణము

విమల పంచాక్షరీ మంత్ర విభవ దీప్తి
ప్రథిత ఓంకార నాదంపు ప్రాభవమ్ము
అమర గణములు తోడురా హరుడు ఘనుడు
ఆ భగీరథు ముందు ప్రత్యక్ష మయ్యె!                                             1

అక్షులందు గ్రమ్మ నానంద భాష్పముల్
గళము గద్గదంబు గాగ, భక్తి
వేద విదితు వేద వేదాంత వర్ణితు
సంస్తుతించె హరుని, సాంబశివుని!                                                 2

ఆకార భావంబు లాది మధ్యాంతముల్
కర్మలు గుణములు కలిమి లేక
అగణితంబు ననంతమై యఖండంబునై
సృష్టి స్థితి లయాది సిరులు లేక
సకల దిగ్వ్యాప్త మై శక్తి సంపూర్ణమై
విజ్ఞాన సారమై విద్య లేక
మాటల వర్ణింప మనసులో భావింప
సంకల్పమున్ జేయు శక్తి లేక

సర్వ సర్వం సహా చక్ర సమితి గూర్చి
అందు విహరించు బ్రహ్మ మానంద మనెడి
పరమ సత్యంబు భ్రాంతిగా; భ్రాంతి సత్య
మనుచు మిధ్యా ప్రపంచమ్ము నందు సతము!                              3

ఐహికంబులు మెచ్చుచు; నవ్యయంబు
బ్రహ్మ మౌదాని కాకార భావ నామ
గుణము లాదిగా భ్రాంతుల గూర్చి, అదియె
దైవమని నమ్ముచజ్ఞతాంధ్యమ్ము లలుమ!                                     4

సారోదంచిత శూన్య తత్త్వ మెదలో సాధింపగా రామి, న
ద్దారిన్ వీడి తపింప జూచెద మహాత్మా! యూహ లెందాక నే
సారింపన్ గలవాడ నట్టి మహిమా సారంబు నీ మూర్తిగా
తీరై దోచె, శివా, భవా యనుచు కీర్తింతున్ సదా ఈశ్వరా!              5         

శూన్యంబే భవదీయ తత్త్వము, సుధీ స్రోతస్సు నైర్మల్యమై
యన్యంబొల్లక సత్య శోధన రతిన్ ధ్యానంబె యోగంబు నా,
మాన్యాధ్వంబున చిత్త విభ్రమ గతిన్ మళ్ళించు తత్త్వజ్ఞులే
ధన్యుల్; సూక్ష్మ మఖండమై వెలుగు ఆత్మజ్యోతి దర్శించుటన్! 6

తలమే! సూక్ష్మ మనంతమైన భగవత్తత్త్వంబు భావింప న
య్యలఘు ప్రోత్థిత సత్య దీప్తి గను యోగాభ్యాస నిష్ఠా ద్యుతిన్
విలసద్దివ్య వికాస హీనతను తద్విస్పూర్తి బొందంగ, ని
ర్మల చిచ్ఛక్తికి భావ రూప గుణ కర్మల్ వేర కల్పించెదన్!              7

శివమున్ శంకర మవ్యయంబగు మహా చిచ్ఛక్తి శూన్యంబులో
నవిభాజ్యంబయి యొప్పు! తద్విమల సత్యానంద తాదాత్మ భా
వ విశుద్ధ స్థితి నిత్య నిర్మల పర బ్రహ్మ ప్రభూతార్ధమై
భవిక శ్రీ విభవంబు నేలు, సకల వ్యాప్తాచ్ఛ చైతన్యమై!                  8

వర చిన్మాత్ర యనంగ నిర్మల పరబ్రహ్మాచ్ఛ తత్త్వార్థమున్
పరిపూర్ణంబు, ననంత మాద్యము, పరివ్యాప్తంబు, శుద్ధంబు, సు
స్థిర సౌభాగ్య శుభ ప్రదంబునగు ఆ శ్రీ దీప్త కల్యాణి యౌ
పర విద్యా నిధి సర్వమంగళ సదా వర్ధిల్ల నర్ధాంగియై!                   9

విఘ్న నాధుండు పుత్రుడై వెలుగు చుండ
ప్రకృతి శక్తులు భూతాళి వశము గాగ
దివ్య సంభూతి విలసిల్లు దేవ దేవ
భావ దారిద్రమూనె నిన్ ప్రస్తుతింప!                                               10

అభవా!  గౌరియె ఆశ్రయించె నిను మాయా భావమై; భూతముల్
శుభమౌ నీ విభవంబు నందినవి; దిక్ స్తోమంబు త్వత్తేజ సం
ప్రభలన్ కాంతుల నీనె! యుష్మ దమల వ్యాసక్తి విశ్వంబులో
సుభగేచ్ఛాక్రియ( సృష్ఠియున్, స్థితి, లయ జ్యోత్స్నా ద్యుతిన్ వ్యాప్తిలెన్! 11

పలుకన్ జాలను శుద్ధ తత్త్వ మెద సంభావింపగా లేమి, ని
ర్మల చిచ్ఛక్తికి నామ రూప గుణ సంభారమ్ములన్ గూర్చి సూ
క్తుల వర్ణింపను చిత్త మోపదయినన్, ద్యోతించు నాయూహ కా
వల నిన్నెంచగ లేమి గొల్చెద మనోభావంబె నీ రూపుగా!              12

అమలంబౌ భవదీయ యూహ యెదలో నాధ్యాత్మికాభోగ దా
హము దీర్చెన్ క్షణకాల మా యెఱుక మాయాజాల విభ్రాంతమై
అమితా సక్తిని గోరు నైహికము, లార్యస్వాంత విభ్రాజితా;
తమమున్ గోరెడి చిత్త మోర్చునె మహత్ జ్ఞాన ప్రభాదీప్తులన్!                  13

ఏ శక్తి చిచ్ఛక్తి నేలంగ జాలునో
ఆ శక్తి నీవుగా నాత్మ దలుతు
నే శక్తి ఈ సృష్ఠి కిడును కల్యాణమ్ము
లా శక్తి నీవుగా నాత్మ దలుతు
నే శక్తి యజ్ఞాన హేయత్వమును బాపు
నా శక్తి నీవుగా నాత్మ దలుతు
నే శక్తి దివ్యాచ్ఛ ధీ శక్తి సమకూర్చు
నా శక్తి నీవుగా నాత్మ దలుతు

శక్తి యెయ్యది నను దేర్ప జాలు నదియ
నీదు తత్త్వ భావ స్వరూపాదు లనుచు
అహరహమ్మును తపియింతు నమిత భక్తి
గొలది నిను గాంచి, శంకరా; గొలుచు వేడ్క!                                                            14

చేతో మోదము గాగ గాంచితి నినున్ శ్రీ పార్వతీ యుక్తుగా
భూతేశా! జననంబు ధన్యమయె; నా మోహంబు బాసెన్; శివా
ప్రీతిన్ గూర్చర, శంకరా; భవహరా, విశ్వేశ యంచార్తితో
చేతుల్ మోడ్చి భగీరథుండు బలుకన్ శ్రీ కంఠుడున్ ప్రీతుడై!                15


పాలకుర్తి రామమూర్తి

Friday, October 28, 2016

రథ సారథి కర్తవ్యం (Responsibility of the Managing Director)

రథ సారథి కర్తవ్యం
(Responsibility of the Managing Director)
సారథి దక్షుడై, రథిక సారము, రథ్య బలంబు, నాయుధో
దారత, మానమున్, రణ విధంబు, నిమిత్త శుభాశుభత్వ ని
ర్ధారణ మున్, మదిం గని హితం బెఱిగించుట నీతి గాన నీ
వీరస మెత్తి నో బలికి తేనియు చెప్పుదు, సూత నందనా!
(శ్రీమదాంధ్ర మహాభారతము ..  కర్ణ పర్వము, ద్వితీయాశ్వాసము- ౫౨)

ఓ కర్ణా! నీ మనస్సు లో వీర రసం ఉప్పొంగడం చేత, ఉన్న యదార్ధ రీతిని చెప్పినా, నీవు చెవిని చేర్చడం లేదు. అయినా సారథిగా నా అవగాహనలో ఉన్న విషయం నీకు చెప్పడం నీతి కాబట్టి చెపుతున్నాను.... అంటూ శల్యుడు ఇలా చెపుతాడు.
రథికుని నైపుణ్యాన్ని, గుర్రాల యొక్క జవసత్వాలను, రథం లో ఉన్న ఆయుధ సంపత్తినీ, రథికుని యొక్క విలువలు మరియు సిద్ధాంతాలు, యుద్ధం ఎలా నడుస్తుంది, అంతే కాక ఎదురౌతున్న శకునాల ననుసరించే ఫలితాలు అన్నీ పరిశీలించి మంచి చెడ్డలు చెప్పడం ఉత్తమమైన దక్షుడైన సారథిగా నా కర్తవ్యం కాబట్టి చెపుతున్నాను, అంటాడు.
దీనిని ఈ నాటి మార్కెట్ కు అన్వయించుకుంటే.....
ఒక సంస్థ నిలదొక్కు కోవాలి... తన విజయం  చరిత్ర పుటల్లో నమోదు కావాలి... భావి తరాలకు ఆదర్శప్రాయం కావాలి అంటే ఆ సంస్థ సంపాదించుకో వలసిన, సమీకరించుకోవలసిన లక్షణాలను పరోక్షంగా తెలుపుతుందీ పద్యం.
సారథి దక్షుడై .... సారధి (Managing Director)... ఆ సంస్థను నడిపించే వ్యక్తి  దక్షుడై ఉండాలి, సంబంధిత రంగం లో నైపుణ్యాన్ని కలిగియుండాలి, అన్ని విభాగాల పై కనీస అవగాహన ఉండాలి... కార్య సాధకుడై ఉండాలి, త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగిన వాడై ఉండాలి, భయం పక్షపాతం లాంటి వాటికతీతుడై ఉండాలి, బృందం తో కలసి పని చేయ గలిగి ఉండాలి... బృందాన్ని నడిపించ గలిగి ఉండాలి. బుద్ధి తో ఆలోచించి అవసరమైన చోట తల్లి/తండ్రి (పేరెంట్) గా, పెద్దాయన (అడల్ట్)గా, చిన్న పిల్లవాడి (ఛైల్డ్) గా వ్యవహరిస్తూ ఒక్కొక్క మారు లాలించ గలగాలి ఒక్కొక్క మారు కఠినంగా వ్యవహరించ గలిగి ఉండాలి.
రథిక సారము.... రథికుడు (Chairman - Management) దూరదృష్టి, యోజనా పటిమ, ప్రతిభను గుర్తించగలిగిన వికాసం, దైర్యం, మనో నిగ్రహం, నైపుణ్యం, భావోద్వాగాలపై పట్టు, భావ వ్యక్తీకరణ నైపుణ్యం కలిగియుండాలి. విస్తృత పరిశీలనా శక్తి కలిగి యుండాలి. ఎదుటి వారి వ్యూహాలను పసిగట్ట గలగడం, తగిన రీతిలో వేగంగా స్ఫందించ గలిగిన ధీ పటిమ యుండాలి. ఆ యా రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడం.. దానికి తగిన రీతిలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోగలిగిన విధానం తెలిసి ఉండాలి. ఆ మార్పులను అంగీకరించే మానసిక చైతన్యం కలిగి ఉండాలి. అనుయాయులతో, వినియోగదారులతో సత్సంబంధాలను కలిగి యుండాలి. బృందాన్ని ఏర్పాటు చేయగలగడం, ఆ బృందం లోని సభ్యులందరూ ఒకే లక్ష్యం తో కలసి ఒకే ఆలోచనా విధానం తో పని చేసేందుకు అవసరమైన స్ఫూర్తిని నింపగలగడం, సమస్యలెదురైన వేళ వాటి నధిగమించేందుకు ప్రణాళికా బద్ధం గా ముందు చూపుతో వ్యవహరించ గలగడం, ప్రో ఆక్టివ్ గా యుండడం, హేతుబద్ధ ఆలోచనా పటిమ... తోటి వారిని గౌరవించే నైజం, ఎదుటి వారి సలహాలను సకారాత్మకంగా తీసుకునే లక్షణాలు ఉండాలి. ఆర్థిక, సామాజిక, మేధో బలం కలిగిన వాడై యుండడం వల్ల అతని సమర్థత గౌరవించబడి.. అనుయాయులు అతనిని నమ్మదగిన వ్యక్తిగా గుర్తిస్తారు... అనుసరిస్తారు... సహకరిస్తారు... అనుమోదిస్తారు.
రథ్య బలంబు.... రథ్య బలము (Men, Machinery & Morality) ఉత్తము లైన, ఆలోచనాపరులైన, సంస్కారవంతులైన, కష్టపడి పని చేయగలిగిన వారు, సంస్థ అభివృద్ధియే తమ అభివృద్ధిగా తలచే వారు ఉద్యోగులుగా... ప్రతిభ ఆధారం గా నియమింప బడాలి. అన్నివిభాగాలలో పరస్పరాధారిత స్ఫూర్తి తో పని చేయగలిగిన ఉద్యోగులు సంస్థకు వెన్నెముక లాంటివారు. సంబంధిత రంగం లో అవసరమైన శిక్షణ పొంది ఆ అనుభవం ప్రాతిపదికగా అంకిత భావం తో పనిచేసే ఉద్యోగులు సంస్థ ప్రగతిలో ముందుంటారు. అలాగే అధునాతన యంత్ర సామాగ్రి, అవసరమైన విడిభాగాలు అందుబాటులో ఉండడం వల్ల ఉత్పత్తి కుంటుపడదు.. ఉత్పత్తి ఉత్పాదకతలు పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తం గా వస్తున్న మార్పుల నాధారం చేసుకొని ఎప్పటి కప్పుడు యంత్ర సామాగ్రిని ఆధునీకరించుకోవడం వల్ల పరిశ్రమలో ముందుండడం సాధ్యపడుతుంది. క్రొత్త ఆవిష్కరణలు, క్రొత్త విధానాలు.. అమ్మకాలను పెంచుతాయి... ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తాయి... అమ్మకపు ఖర్చులను తగ్గిస్తాయి... వెరసి నికర ఆదాయం పెరుగుతుంది. విలువలు, సిద్ధాంతాల ఆధారంగా పనిచేయడం, పాలనా వ్యవహారాలలో పారదర్శకత వల్ల ఉద్యోగులు - సంస్థ మధ్య సంబంధాలు దృఢమౌతాయి. అదే విధానాన్ని సంస్థ సంస్కృతిగా కొనసాగించడం, క్లయింట్లు మరియు సప్లయర్స్ తో వ్యవహరించడం వల్ల వ్యాపార సంబంధాలు పటిష్ఠ మౌతాయి.
ఆయుధోదారత...  ఆయుధోదారత (Qualitative and Quantitative Resources & Instruments) వనరుల సమీకరణ సరిపోయేంతగా ఉండాలి. ఎక్కడ ఏ లోపం రాకూడదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన మేరకు నాణ్యమైన ముడిపదార్ధాలను సేకరించి పెట్టుకోవడం.. విడిభాగాలను సరఫరా చేసే సంస్థల తో అనుబంధాన్ని పెంచుకోవడం... అవసరమైన మేరకు సరఫరా ఒప్పందాలను కుదుర్చుకోవడం... వినియోగదారులతో సత్సంబంధాలను కలిగి యుండడం, స్నేహబంధాన్ని కొనసాగించడం లాంటివి మనలను ఉన్నత స్థానం లో నిలుపుతాయి.
మానమున్... మానము (Credibility) పరిశ్రమలో పరపతి పెంచుకోవాలి. ఏ ఇచ్చిపుచ్చుకునే లావాదేవీ వల్లనైనా వినియోగదారునికీ అమ్మకం దారుకూ ఇరువురికీ ఉపయోగపడే ఒప్పదం కుదరాలి అలాంటి ఒప్పదం కుదుర్చుకోవడం వల్ల ఇరువురి ప్రయోజనాలు సిద్ధిస్తాయి.  నీకు జయం నాకూ జయం (Win/Win Attitude) వైఖరి వల్ల ఇరువురూ లాభపడతారు... ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ ఒప్పదం కుదరక పోయినా వారి మధ్య బంధం చెడిపోదు.  సరైన సమయానికి మనం ఇవ్వవలసిన చోట బిల్లులు చెల్లించడం వల్ల సరఫరాదారు మనల్ని ఉత్తమ ఖాతాదారునిగా గుర్తిస్తాడు. మన పట్ల ఉదారం గా వ్యవహరించే అవకాశం ఉంది. న్యాయబద్ధం గా సరకుకు విలువ కట్టడం, సరైన నాణ్యత, సరైన కొలత, సరైన సమయానికి, సరైన ధరకు సరకు ను వినియోగదారునికి అందించడం వల్ల మన పరపతి పెరుగుతుంది. సరఫరాదారుడు, వినియోగ దారుడు... ఇరువురి నమ్మకం సంతృప్తి చూరగొన్న ఏ సంస్థ యైనా ఉన్నత శిఖరాల నధిరోహిస్తుంది.
రణ విధంబు... రణ విధానము (Planning, Organising, Processing, Review, Introspection,  Restucturing and Implimentation) ముందుగా ఏ పరిశ్రమను ఏర్పాటు చేయాలి, ఎక్కడ చేయాలి, దానికి ఏ యే వనరులు ఎంత మొత్తం లో అవసరమౌతాయి, ఆయా వనరుల నెలా సమీకరించుకోగలం, దానికి నైపుణ్యం గలిగిన ఉద్యోగులు లభిస్తారా, యంత్ర పరికరాలు ఎక్కడ లభిస్తాయి, ప్రభుత్వ అనుమతులు ఎలా వస్తాయి, ఈ విధానం లో పరిశ్రమ నెలకొల్పడానికి ఎంత సమయం పడుతుంది, ఎంతడబ్బు అవసరమౌతుంది, భాగస్వాములు లభిస్తారా, వినియోగ దారుల మార్కెట్ ఎలా ఉంది, మన పోటిదారుల వ్యాపారం ఎలా ఉంది, పరిశ్రమ స్థాపనలో మన బలాబలాలు ఏమిటి, మార్కెట్ ను ఎలా స్వాధీన పరచుకో గలం అనే అన్ని విషయాలపై సరైన అవగాహనతో కూడిన యోజనా ప్రణాళిక తయారు చేసుకోవాలి. మనకున్న అన్ని వనరులనూ సమీకరించుకోవాలి. ప్రతిభ ఆధారం గా అనుచరులకు బాధ్యతలప్పగించాలి. నిజాయతీ పరులను కీలక పదవులలో పెట్టి వారికి అర్హులైన శిక్షణ పొందిన సహాయకులను నియమించాలి. నాణ్యత గలిగిన యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి నిర్వహణా బాధ్యతను సంబంధించిన వారికి నిర్ణయాధికారాలతో సహా అప్పగించాలి. అవసరమైన సమయం లో ఏం జరుగుతుంది అనుకున్న ఫలితాలు వస్తున్న యా లేదా ఏ యే విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి.. ఎయే విభాగాలలో ఏయే సమస్యలున్నాయి... అనె విషయాన్ని సమగ్రంగా విశ్లేషించి వీలైనంత త్వరగా దానిని సరిచేయాలి. ఆత్మ పరిశీలన ద్వారా మన పని తీరును సరి చూచుకోవాలి. అవసరమైన చోట ఏయే మార్పులు చేర్పులు అవసరమో పరిశీలించి ఆయా మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల సంస్థ పని తీరు ఉత్తమం గా ఉంటుంది.
నిమిత్త శుభాశుభత్వ నిర్ధారణమున్.... (Ascertaining Good and Bad by Observing the Market trends) శకునాలు .... మార్కెట్లో కనిపించే సూచనల కనుగుణం గా ఏది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది దేని వల్ల నష్టపోతామో గ్రహించడం, ఏ నాణ్యతా ప్రమాణాలతో ఏ వస్తువు ఎక్కడ అమ్మగలమో.. ఎక్కడ మన ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో... వినియోగదారుల మనసు గెలిచేందుకు మన ఉత్పత్తుల ప్రమాణాలలో ఇంకా ఏ విధమైన మార్పులు చేయాలో...ఎక్కడ మన కవసర మైన ముడి సరకులు తక్కువ ధరకు దొరుకుతాయో... ప్రభుత్వ విర్ణయాలు మన ఉత్పత్తులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి... వాటి వల్ల ఉపయోగమా నష్టమా లాంటి వివిధాంశాలను ఎప్పటి కప్పుడు సర్వే చేయించడం... వల్ల అవసరమైన మార్పులు వేగం గా తీసుకు రావడం వీలవుతుంది. మార్కెట్ లో ముందుండాలి అంటే సమాచార వ్యవస్థ ను మెరుగుపరుచు కోవాలి. మన వినియోగదారుని ప్రలోభాలతో లొంగ తీసుకునే పోటీదారులను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మన సంస్థ లో లంచగొండి ఉద్యోగులు, స్వలాభం చూచుకునే భాగస్వాముల గూర్చిన సమగ్ర సమాచారం ఎప్పటి కప్పుడు మనకు చేరవేయ గలిగిన గూఢాచార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధానాలలో సూచనలు అందిన సమయానికి స్ఫందించని ఉత్పత్తిదారుడు నష్టపోతాడు.
హితం బెఱిగించుట (Advising & Mentoring) హితము చెప్పడం... అభ్యుదయ మార్గం లో సాగాలని కోరే ప్రతి సంస్థ లో సాంకేతిక, ఆర్థిక, వ్యాపార, న్యాయ సంబంధిత అంశాలపై సరైన సూచన లిచ్చేందుకు ఒక నిపుణుల సలహా మండలి ఉండాలి. ఆ సలహా మండలి స్వతంత్రం గా వ్యవహరిస్తూ అధినేతకు మాత్రమే జవాబు దారి కావాలి. అయా అంశాలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ... అన్ని సూచనలను పరిగణన లోకి తీసుకుంటూ సంస్థ ప్రగతికి ఏ విధానం మంచిదో ఆ సలహా మండలి తెలియచేయడం మంచిది. ఆ సూచనల నాదరించి అందులోని సాధ్యాసాధ్యాలను పరిగణలోనికి తీసుకొని అధినేత నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అధినేత పరిమితుల కారణంగా ఆ సూచనలు పాటించక పోయినా, విషయమెంతటి సున్నితమైనదైనా, నీచ మైనదైనా, అధినేతకు విన్నవించడం ఆ సలహా మండలి కర్తవ్యం. తమ దృష్టికి వచ్చిన సమాచారాన్ని శాస్త్రీయం గా విశ్లేషించి ఆ పరిశీలన సారాన్ని ఉపపత్తిగా చూపుతూ ఏ దారి మంచిదో యుక్తమైనదో దానిని అధినేత కు నివేదించడం వారి కర్తవ్యం. అయితే అందులో తమ స్వార్థపూరిత అభిప్రాయాలకు తావివ్వవద్దు. ఆ సలహా మండలికి ఉద్యోగులను నియమించే సమయం లోనే నిజాయతీ పరులను, నమ్మకస్తులను, అనుభవజ్ఞులను ఎన్నుకోవడం అధినేత విధి.

పాలకుర్తి రామమూర్తి

దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః......

ఓం శ్రీ సరస్వత్యైనమః

దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః
స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా! (దుర్గా సప్తశతి)
భావము:
హే దుర్గా మాతా! నిన్ను స్మరించిన మాత్రముననే అశేష ప్రాణి కోటి భయాలను మూలాలతో కూడా హరిస్తావు. ఎవరైతే నిన్ను నిరంతరం స్మరిస్తూ, తమ హృదయాలలో అత్యధిక భక్తితో ధారణ చేస్తారో, నిశ్చలంగా నిలుపుకుంటారో అలాంటి వారికి శుభాభ్యుదయాలను అశేషంగా అనుగ్రహిస్తావు. స్వస్వరూపాన్ని గ్రహించకుండా మానవులను అడ్డుకునే దారిద్ర్యము, దుఃఖము, భయములనబడే మాయావరణాలను దూరం చేసేందుకు నీకన్నా అన్యులు ఎవరున్నారు తల్లీ! ఎల్ల వేళలయందు దయాభరిత చిత్తంతో సకల సహాయసంపత్తి నందచేసేందుకు అవసరమైన సర్వ ఉపకరణాలను అందుబాటులో ఉంచుకొని సిద్ధంగా ఉండే హే దుర్గా మాతా నీకు నమస్కారములు.

వ్యాఖ్య:
దుర్గముడు అనే రాక్షసుడిని జయించడం చేత పరాత్పరికి దుర్గ అనే పేరు వచ్చింది. ఏదైతే గమింపరానిదో దానిని దుర్గమము అంటాము. ప్రతివ్యక్తి తనకు తెలిసి కాని తెలియక కాని ఏదో ఒకటి సాధిస్తాడు. అది మనకు సాధ్యమయింది అనుకుంటాము. చాలామంది అక్కడితో సంతృప్తి చెందుతారు. మనశక్తి యుక్తులను కొద్దిగా విస్తరించగలిగితే మరింత ఉన్నత ఫలితాలను సాధిస్తాము. దానిని మన సామర్ధ్యము (Capability) అంటాము. ఆ సామర్ధ్యము కొన్ని పరిమితులలో విస్తరిస్తుంది కాని అపరిమితంగా విస్తరించుకోగలిగిన శక్తిసామర్ధ్యాలు ప్రతి వ్యక్తియందు నిక్షిప్తమైయున్నాయి. దానిని potentiality అంటాము. దుర్గమమైన లక్ష్యాలను సాధించేందుకు మనలోని అపరిమిత శక్తి సామర్ధ్యాలను (potentiality) గుర్తించి వినియోగించుకోవలసి ఉంటుంది. దుర్గముడు అనే రాక్షసుడిని ప్రతీకగా చెపుతూ మనలో అంతర్నిహితంగా ఉన్న అపరిమిత శక్తి సామర్ధ్యాలను (potentiality) గుర్తించి వినియోగించుకోవలసిన ఆవశ్యకతను ఈ నామం ద్వారా ప్రబోధ చేస్తున్నారు.
"ఉత్తిష్ఠత, జాగృత, ప్రాప్యవరాన్నిబోధత; క్షురస్యధారా నిశితాదురత్యయాత్, దుర్గం పథస్తాత్ కవయోవదంతి" అంటుంది, కఠోపనిషత్.  నీ లక్ష్యం దుర్గమమైనది. పదునైన కత్తి అంచు కన్నా నిశితమైనది నీవు గమించవలసిన దారి. "సాధ్యమూ" "సాధన"లు సులువైనవి కావు. అలాంటి లక్ష్యాన్ని సాధించాలి అంటే దృఢమైన సంకల్పం కావాలి. అందువల్ల (ఉత్తిష్ఠత) ప్రకాశవంతంగా లేచి నిలబడు, ప్రభావ వంతంగా లేచి నిలబడు, స్థిరత్వాన్ని సాధించు. జాగృత... మేలుకో... అంటే... నిద్ర లేవడం కాదు. మనసు జాగృతం కావాలి. ఈ జగత్తులో (జాయతే గచ్చతే జగత్) మనం ఎవరమూ శాశ్వతం కాదు. ఏ క్షణమైనా మనమీ జగత్తు నుండి వెళ్ళవలసి రావచ్చు కాబట్టి ఈ నాడు చేయవలసిన ఏ పనినైనా క్షణం కూడా వాయదా వేయవద్దు. ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా ధైర్యాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా సాహసంతో నీ గమ్యం వైపు గమించ గలిగిన జాగృతి కావాలి. చరిత్రలో ఎన్నో జీవరాసులు పుడుతూ గతిస్తూ ఉంటాయి. (ఈ జగత్తులో చావుపుట్టుకలు సహజం కనుక) అలా కాక కొద్ది మంది మాత్రమే తమ జీవన ప్రయోజనం (Purpose) ఏమిటి? దానిని ఏ విధంగా సాధించాలి? సాధించే క్రమంలో మన ప్రతిభావ్యుత్పత్తులను (Performance) నిరంతరం మెరుగు పరుచుకోవడం ఎలా? అని ఆలోచిస్తారు; ఆ వైపు శ్రమిస్తారు. ఎంతటి దుర్లభమైన, దుర్గమమైన లక్ష్యాన్నయినా సాధిస్తారు, ఛేదిస్తారు. అలాంటివారే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.ఆ సాధనాక్రమంలో అవసరమైన జ్ఞానాది వనరులను సమకూర్చుకునేందుకై విజ్ఞులు, జ్ఞానులు, పరోపకారపరాయణులైన నిర్మలాత్ములైన మహానుభావులను ఆశ్రయించాలని కఠోపనిషత్తు ప్రబోధిస్తుంది.
ఇక్కడ "దుర్గముడ"నే రాక్షసుడిని ప్రతీకగా చెపుతూ అలాంటి దుర్గమమైన లక్ష్యాన్ని జయించడం లేదా సాధించడం ప్రతి వ్యక్తి కర్తవ్యంగా ప్రేరణ నందిస్తున్నారు.
విజయాన్ని సాధించిన వారి గాథలు ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తాయి. అందుకే ఆ మహాజననిని స్మరించేందుకు మనకా తల్లియొక్క విజయాన్ని (success) చూపుతున్నారు. క్రొత్తదనాన్ని ఆవిష్కరించాలనే మనలోని అంతర్గత తపన తపస్సుగా మారితే ఇతః పూర్వం ఒకరు చూపించిన విజయ సాధనా మార్గం మనకు దారి చూపుతుంది. ఆ మార్గాన్ని ఆశ్రయించి, ఆ మార్గం ఆలంబనగా మనదంటూ క్రొంగొత్త మార్గాలను ఆవిష్కరించడం వల్ల పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాము. అయితే, చేయగలమా లేదా, సాధించగలమా లేదా, ఇది మనకు సాధ్యమా అనే ప్రశ్నలు మనలో ఉత్పన్నమయి మనలను వెనుకకు లాగే అవకాశం ఉంది. విజయ సాధకులు చూపించిన వారి మార్గం అలాంటి భయాలను హరిస్తుంది.
ఈ నాడు సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారం ఏదైనా ఒకదానిని ఒకరు సాధించారు అంటే దానిని ఎవరైనా సాధించ గలరు. దుర్గాదేవి కూడా మనకు ఆ ప్రబోధనే ఇస్తుంది. మీరంతా దుర్గమము అనుకునే దానిని నేను సాధించాను కాబట్టి మీరూ సాధించ గలరు. ఆ వైపు మీ సర్వ శక్తులను ఒడ్డి ప్రయత్నించండి. నేను అశక్తుడిని, సాధించలేననే మానసిక వైకల్యాన్ని విడిచి పెట్టండి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట (భగవద్గీత) అంటూ ప్రేరణ నిస్తుంది. సంకల్పం గట్టిదైతే మీ కెదురేమీ ఉండదు. నన్ను నమ్మి ముందుకు సాగితే మీ భయాలను నేను హరిస్తాను, అంటూ అభయం ఇస్తుంది.
అనుమానం పెనుభూతం అంటారు. మనసులో చిన్నమెత్తు అనుమానం పొడసూపినా అపజయాన్ని చవిచూడవలసి వస్తుంది. ప్రయత్నంలో అపజయాలు సహజం. కాని వాటికి భయపడి వెనుకడుగు వేస్తే ఎన్నడూ విజయసాధకులం కాలేము. Faith Power Works Wonders. నమ్మకం అసాధ్యాలనూ సుసాధ్యాలుగా మారుస్తుంది. మీ లక్ష్యం, గమ్యం, గమనం స్పష్టంగా మీ హృదయాలలో ముద్రించుకోండి. నిశ్చలమైన మనస్సుతో ఆ వైపు ఆలోచించండి, దృఢమైన మనస్సుతో అడుగులు వేయండి. సకల శుభములు, అభ్యుదయములు మీ వెంట నడుస్తాయి. శుభాభ్యుదయ ఫలితాలను గూర్చిన ఆలోచనలను మానేయండి. సూర్యునికి అభిముఖంగా మీరు నడచినంత కాలం మీ నీడ మీ వెంటనే వస్తుంది. ఆ నీడయే మీ శుభములు, అభ్యుదయములు. అలా కాక దాని పిరిది దెసలో మీరు నడిస్తే గమ్యం మారుతుంది, గమనం మారిపోతుంది. ఈ స్మృతిని సదాసర్వ కాలముల యందు మీ భావనలో నింపుకొని ముందడుగు వేసే వారికి ఆ దుర్గా దేవి ప్రసన్నురాలవుతుంది.
దారిద్ర్యం, దుఃఖం, భయం ఈ మూడూ మాయా రూపంలో మానవులను క్రమ్మి వారి మానసిక స్థైర్యాన్ని క్రుంగదీస్తాయి. ప్రశాంతత దెబ్బతింటుంది. సత్యాన్ని దర్శించనీయవు. దారిద్ర్యం... అది భావ దారిద్ర్యం కావచ్చు, భాషా దారిద్ర్యం కావచ్చు, అర్థిక దారిద్ర్యం కావచ్చు, మనోదారిద్ర్యం కావచ్చు. ఇలా ఏదైనా మీ అభ్యుదయానికి అడ్డంకిగా గుర్తించండి. దుఃఖానికి మూలం ఆశావ్యామోహాలు. అవి అశాశ్వతాలుగా గుర్తించ గలిగితే దుఃఖాన్ని అధిగమించగలుగుతాము. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమించడం వల్ల కలిగే విభ్రమ వల్ల భయం కలుగుతుంది. కాబట్టి మీ ఇచ్ఛాశక్తిని బలోపేతం చేసుకోండి. ఇఛ్ఛాశక్తి బలమైనదైతే, తత్సాధన కవసరమైన జ్ఞానశక్తిని పొందడం సులువవుతుంది. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. నిద్రాణంగా మీ హృదాకాశంలో ఉన్న చైతన్యానికి చేతన నివ్వండి. నమ్మకాన్ని పెంచుకోండి. ఫలితాన్ని నాకు వదిలేయండి, అంటూ ప్రబోధిస్తూ అభయమిస్తుంది, దుర్గా దేవి. అందుకే ఆమెను దారిద్ర్య దుఃఖ భయహారిణిగా చెపుతూ, ఆ యత్నంలో సఫలత కావాలంటే నీవు కాక మాకు అన్యులు మరెవరమ్మా (కా+త్వత్+అన్యా) అంటుంది, సప్తశతీ శ్లోకం.
మతి మతీవ -- అత్యంత భక్తి శ్రద్ధలతో; స్మృతా -- స్మరించడం వలన; చిత్తా -- హృదయం కలిగిన దానా; దదాసి -- ఇస్తావు లేదా అన్నీ సమకూరేలా చేస్తావు; దేనిని స్మరించడం వలన అంటే దుర్గను అంటే దుర్గమము అని మనం అనుకుంటున్న లక్ష్యాన్ని--- ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఎప్పుడైతే మన మనస్సులో అంకిత భావనతో (Dedication), సాధించాలనే స్థిర నిర్ణయంతో లేదా నిశ్చయంతో కూడిన పట్టుదలతో (perseverance or strong determination), భక్తి శ్రద్ధలతో (Devotion) లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధన యందే పదేపదే  మనసును ఏకాగ్రం చేస్తామో (చిత్తం ఒకచోట నిలవదు కాబట్టి పదేపదే చెదురుతున్న మనసును లక్ష్యం వైపు తీసుకొని రావాలి) అప్పుడు ఆ లక్ష్యం అంతర్మనస్సులో బలమైన ముద్రగా ఏర్పడుతుంది. దానిని ఎంతగా బలోపేతం చేస్తే అంతగా బలపడుతూ మనలను లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళుతుంది. దానినే ఆంగ్లంలో  PRAYER (Periodical Repetition of Affirmations Yielding Excellent Results)అంటాం.
ఒకసారి భయం మనలను వీడితే లేదా భయాన్ని మనం జయిస్తే మన మనస్సులలో ఉండే కశ్మలత చెదిరిపోతుంది. దానితో మనలో గందరగోళ (confusion)స్థితి పోయి స్థిరత లేదా స్పష్టత (Clarity) వస్తుంది. ఆ స్పష్టత ఒక దశను దిశను (Direction) చూపుతుంది. సాధనా మార్గంలో కావలసిన వనరులు మనకు సమకూరేలా చేస్తుంది.
అందుకే, మానసిక ధైర్యానికి కావలసిన ప్రేరణ నిచ్చే శక్తిగా, దానికి అవసరమైన సకల ఉపకరణాలను అందించే తల్లిగా దుర్గను ఆరాధిస్తాము.  
విశిష్టమైన జ్ఞానానికి అధినాయకిగా సరస్వతీదేవిని, సమస్త సంపదలకు మారుపేరుగా లక్ష్మీ దేవిని, సౌభాగ్యానికి, భావోద్వేగాలకు, అనుబంధాలకు ప్రతీకగా దుర్గాదేవిని ఆరాధించడం జరుగుతుంది. అంతేకాదు, దుర్గము అనగా కోట. కోట రక్షణ నిస్తుంది. ఆ రక్షణలో హాయిగా, ప్రశాంతంగా జీవిస్తాము. రక్షణ నివ్వాలి అంటే శక్తి కావాలి అందుకే ఆ శక్తికి ప్రతీకగా కూడా దుర్గాదేవిని చెప్పుకుంటాము. అందుకే దుర్గ అంటే రక్షణ నిచ్చే తల్లిగా చెప్పుకుంటాము.
ఈ మూడు మూర్తులకు మూలంగా ఆదిశక్తిని ఆరాధిస్తుంటాము. అలాంటి ఆ ఆదిపరాశక్తికి నమస్సులతో.......
పాలకుర్తి రామమూర్తి