Sunday, July 10, 2016

బమ్మెర పోతన
బమ్మెర పోతనార్య కవి భాగవతంబు వచించు వేళ తా
క్రమ్మిన కారు చీకటుల కాతురుడౌచు, నరాంకితమ్ముగా
అమ్మను అమ్మనంచు మహిమాన్విత సత్యము నాశ్రయించె; తా
నెమ్మది గ్రుంగ కుండగ, అనిశ్చిత భౌతిక భోగ సంపదల్
సొమ్ములు గిమ్ములొల్లకను చొక్కి శరీరము వాయకుండ, నే
సమ్మెట పోటులన్ బడక సద్గతి లక్ష్యము గాగ సాగి ధై
ర్యమ్మున దుక్కిదున్నికలితాంచిత సారము కుక్షి నింప లే
జెమ్మట ధారలీ భువిని జింది మనోహర కావ్య ధారలై
కమ్మని సాహితీ విమల కాంతులు నింపగ సద్రసజ్ఞ లో
కమ్మున; ధీ విలాస రుచి కంజజు రాణిని ఆశ్రయించి నా
డమ్మతి మాన్యు డుత్తము డహంకృతి దూరుడు పోతరాజు మా
ర్గమ్మును చూపినాడట హలమ్ము కలమ్మును వాడి; భోగ భా
గ్యమ్ములు యోగ భూతు లనయంబు ప్రియంబు నయంబు గూర్చు నా
యమ్మను నమ్మినన్ పలుకులమ్మను నమ్మిన యంచు ఆర్తితోన్!
పాలకుర్తి రామమూర్తి
అమ్మకు మ్రొక్కెదన్, పలుకు లమ్మకు మ్రొక్కెద;
అమ్మకు మ్రొక్కెదన్, పలుకు లమ్మకు మ్రొక్కెద; ఐదు నాల్గు మా
సమ్ములు మోసి గర్భమున, జన్మము నిచ్చి, ప్రసన్న మూర్తియై
రమ్మని జేర బిల్చుచు, శిరమ్ము నురమ్మున జేర్చి, స్పర్ష సౌ
ఖ్యమ్ముల దేర్చి, నిల్పి యొడి( నగ్గలమౌ యనుకంప నిండు చి
త్తమ్మున ముద్దు జేసి; అమృతత్త్వము ప్రేమయు క్షీర ధారలై
పమ్మగ స్తన్యమిచ్చి, మృదుభావ సుశబ్ద పరీమళమ్ము ప
ద్యమ్ముల పాటలన్ కథల నార్ద్ర వచస్సుల సౌరు జూప, శ్రా
వ్యమ్ముగ జోలబాడుచు; నిహమ్ము పరమ్మును జూపు విద్యలన్
గొమ్మని సుస్వరావళిని గూర్చి, తదీయ వికాస శోభ, పూ
ర్ణమ్ముగ పల్లవింపగ, సనాతన జీవన వైఖరుల్ సమా
జమ్మును వ్యక్తి బాధ్యతల సారము నా హృదయాంతరమ్ములం
దిమ్ముగ నిండ; నొజ్జయయి యెంతయు ప్రేమను బోధ జేయు మా
యమ్మకు మ్రొక్కెదన్; సతత మాత్మను జ్యోతిగ వెల్గునట్టి మా
యమ్మ; నవ ప్రఫుల్ల దరహాస మయూఖ వికాస మాలికా
సమ్మిళితాస్య దీప్తి, మనసా వచసా కరుణార్ద్ర పూర్ణ నే
త్రమ్ముల జాలువారెడు నిరంతర వత్సలతా ప్రవృత్తి, చే
తమ్మున నిత్య సత్య నిరత క్రమ ధర్మ పథాను రక్తి, వా
క్యమ్ముల సంస్కృతీ రుచి సమాశ్రిత భావ సుధామయోక్తి, యా
యమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గ పా
దమ్ముల భక్తి నిష్ఠల సతమ్మును గొల్చెడి చిత్త వృత్తి, శా
స్త్రమ్ముల సార మన్వయము సల్పి హితమ్ముగ జాతి అజ్ఞతాం
ధ్యమ్మును బాపు జ్ఞాన రతి, తాత్త్విక చింతన లేకమై ప్రపం
చమ్మున శాంతి దాంతి పృధు సారము నింపగ నుద్యమించు మా
యమ్మ పవిత్ర పాదముల కర్మిలి మ్రొక్కెద; పాలకుర్తి వం
శమ్మున విజ్ఞతామతి, ప్రశాంతు డుదీర్ణ మనస్వియున్, సుగీ
తమ్ముల సర్వమంగళ యుదాత్త పదాబ్జ సమర్చనారతుం
డమ్మహనీయ భావనలహర్నిశలంచిత భక్తి తత్త్వ రా
జ్యమ్ము పదమ్ము జూపగ నహమ్ము నిహమ్మును మాని నిష్ఠ ని
త్యమ్మును తచ్ఛరిత్రములు ధ్యానము చేయుచు తన్మయుండునౌ
యమ్ముని సన్నిభుండు చరితార్ధుడు నౌ నరసింహరాము చి
త్తమ్ము వికాస దీప్తిగను తాత్త్విక చేతన శక్తి యౌచు భ
ద్రమ్ముగ వంశ గౌరవము రాజిల జేసిన తల్లి మా సుభ
ద్రమ్మకు మ్రొక్కెదన్; స్వర సుధా మధు వాహిను లార్ణవంబులై
నెమ్మది పొంగగా; సతత నిశ్చల నిర్మల మూర్తి యైన దు
ర్గమ్మ సభన్ మహాజనుల ప్రక్క సమంచిత పీఠి నాత్మ తే
జమ్మును ధీ విలాసము లజేయములై రహి మించ శ్లాఘనీ
యమ్ములు సారవంతములు నైన పదమ్ముల ముచ్చటించు మా
యమ్మ సుభద్ర పాదయుగ మాత్మను నిల్పి నమస్కరించెదన్!
పాలకుర్తి రామమూర్తి
సామాజిక రుగ్మతల ప్రక్షాళనలో పద్య ప్రక్రియ పాత్ర
శ్రీ విభవోన్నతం బయిన సృష్టిలొ ధర్మము గాడి తప్పి దు
ర్భావ మెసంగి రుగ్మతల పాలయి నప్పుడు; సాహితీ ప్రియం
భావుకు లీ సమాజమును బాగొనరింపగ నాశ్రయించి రే
శ్రావణ మేఘ మాలికల సౌహృది మార్గము; నద్ది పద్యమే! ౧
సమ కాలీన సమాజ రుగ్మతల సంచారంబు రుద్ధంబుగా
సమతా దర్శ పథ ప్రయాణ మతులై; సాహిత్య వైద్యుల్ కవి
త్వ మహచ్ఛస్త్ర చికిత్స సేయు యజనం బందెన్న యే నాటికిన్
ప్రముఖ ప్రక్రియ యౌచు పద్య రచనా వైభోగ మేపారెడిన్! ౨
మానవత్వమ్మును మరచిన మతబోధ
లస్పృశ్యతా జాఢ్య మతిశయమ్ము
బాల్య వివాహలు వరకట్న మరణాలు
సహజీవనమున విశ్వాస లేమి
తర్కంబు హేతువు దార్శనికత లేని
కాలమ్ము చెల్లిన జ్ఞాన దీప్తి
కుటిలమై కుళ్ళిన కులమత కూటము
లపసవ్య రాజకీయ వ్యవస్థ
మూఢ నమ్మకాల మురుగు; మూఢాచార
కొలిమి లోన జనులు కూలిపోవ
జాగృతము జేసె చైతన్య మెద నూది
పద్య విద్య యొక్క పరిమళమ్ము ౩
క్షాత్ర తేజో దీప్తి సన్నగిల్లిన వేళ
"భారతామ్నాయ"మై వరలె భువిని
కర్తవ్య విముఖతా క్లైభ్యాంధ్య మెదనిండ
"గీత"యై జాతికి రీతి దెలిపె
గతి తప్పి చరియించు క్షితిపాలురకు నేర్పె
పాలనా కౌశల ప్రథిత విద్య
అన్యోన్యతా భావ మంతరించిన జాతి
కందించె నైకమత్యంపు విలువ
అహము నాశ్రయించి అసమర్ధ తవినీతి
జడలు విప్ప; యువత జడత బాపి
యుద్యమించ జేసె నుచితాధ్వ మందున
పద్య విద్య యొక్క పరిమళమ్ము! ౪
ఆదిన్ నన్నయ సోమనాథ కవితా వ్యాసక్తయై, పిమ్మటన్
వాదోడై సిరినాథ పోతనలకున్, భవ్య ప్రబంధ ప్రతి
ష్టాదేశంబయి, జాషువా కవి విలాసంబై, మహద్విశ్వ నా
థాదిత్యాచ్ఛ మయూఖమై, తెలుగు పద్యంబుర్వి శోభిల్లెడిన్! ౫
హితము నయంబు ప్రేమయును యిమ్ముగ నొప్పెడు అమ్మ మాటయై
సతము సమాజ సుస్థిరత శాంతియు నెక్కొన వేయి నాండ్లుగా
అతులిత దీక్ష బాధితుల నాదుకొనన్ శ్రమియించు సాహితీ
క్రతువున పూర్ణమై నిలుచు గమ్మని పద్యమె హృద్య మాద్యమౌ! ౬
పాలకుర్తి రామమూర్తి
ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక సామాజిక అవసరాల కనుగుణంగా వ్యాఖ్యానించుకున్నప్పుడే ఆ సాహిత్యానికి విలువ సమకూరుతుంది. ఆ దృష్టితోనే నేను చాలా పుస్తకాలను విశ్లేషణ చేసి ప్రచురణ చేయడం జరిగింది. గజేంద్రమోక్షణ గాథ, భగీరథ చరిత్ర, మనుచరిత్ర, క్షీరసాగర మధనం లాంతివే కాక భారత భాగవతాలలోని పద్యాలలో చాలా పద్యాలను ఆధునిక సామాజిక అవసరాల కనుగుణంగా వ్యాఖ్యానించడం జరిగింది. వివిధ పేర్లతో వాటిని ప్రచురించాను కూడా. భారతంలోని ఒక పద్యానికి చేసిన వ్యాఖ్య ఒక పుస్తకంగా దాదాపు ౧౪౦ పేజీలతో ప్రచురించాను. ఆ విధంగా చేసిన వ్యాఖ్యలలో ఒక పద్యాన్ని క్రింద ఇస్తున్నాను.
సారథి దక్షుడై, రథిక సారము, రథ్య బలంబు, నాయుధో
దారత, మానమున్, రణ విధంబు, నిమిత్త శుభాశుభత్వ ని
ర్ధారణ మున్, మదిం గని హితం బెఱిగించుట నీతి గాన నీ
వీరస మెత్తి నో బలికి తేనియు చెప్పుదు, సూత నందనా!
(శ్రీమదాంధ్ర మహాభారతము .. కర్ణ పర్వము, ద్వితీయాశ్వాసము- ౫౨)
ఓ కర్ణా! నీ మనస్సు లో వీర రసం ఉప్పొంగడం చేత, ఉన్న యదార్ధ రీతిని చెప్పినా, నీవు చెవిని చేర్చడం లేదు. అయినా సారథిగా నా అవగాహనలో ఉన్న విషయం నీకు చెప్పడం నీతి కాబట్టి చెపుతున్నాను.... అంటూ శల్యుడు ఇలా చెపుతాడు.
రథికుని నైపుణ్యాన్ని, గుర్రాల యొక్క జవసత్వాలను, రథం లో ఉన్న ఆయుధ సంపత్తినీ, రథికుని యొక్క విలువలు మరియు సిద్ధాంతాలు, యుద్ధం ఎలా నడుస్తుంది, అంతే కాక ఎదురౌతున్న శకునాల ననుసరించే ఫలితాలు అన్నీ పరిశీలించి మంచి చెడ్డలు చెప్పడం ఉత్తమమైన దక్షుడైన సారథిగా నా కర్తవ్యం కాబట్టి చెపుతున్నాను, అంటాడు.
దీనిని ఈ నాటి మార్కెట్ కు అన్వయించుకుంటే.....
ఒక సంస్థ నిలదొక్కు కోవాలి... తన విజయం చరిత్ర పుటల్లో నమోదు కావాలి... భావి తరాలకు ఆదర్శప్రాయం కావాలి అంటే ఆ సంస్థ సంపాదించుకో వలసిన, సమీకరించుకోవలసిన లక్షణాలను పరోక్షంగా తెలుపుతుందీ పద్యం.
సారథి దక్షుడై .... సారధి (Managing Director)... ఆ సంస్థను నడిపించే వ్యక్తి దక్షుడై ఉండాలి, సంబంధిత రంగం లో నైపుణ్యాన్ని కలిగియుండాలి, అన్ని విభాగాల పై కనీస అవగాహన ఉండాలి... కార్య సాధకుడై ఉండాలి, త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగిన వాడై ఉండాలి, భయం పక్షపాతం లాంటి వాటికతీతుడై ఉండాలి, బృందం తో కలసి పని చేయ గలిగి ఉండాలి... బృందాన్ని నడిపించ గలిగి ఉండాలి. బుద్ధి తో ఆలోచించి అవసరమైన చోట తల్లి/తండ్రి (పేరెంట్) గా, పెద్దాయన (అడల్ట్)గా, చిన్న పిల్లవాడి (ఛైల్డ్) గా వ్యవహరిస్తూ ఒక్కొక్క మారు లాలించ గలగాలి ఒక్కొక్క మారు కఠినంగా వ్యవహరించ గలిగి ఉండాలి.
రథిక సారము.... రథికుడు (Chairman - Management) దూరదృష్టి, యోజనా పటిమ, ప్రతిభను గుర్తించగలిగిన వికాసం, దైర్యం, మనో నిగ్రహం, నైపుణ్యం, భావోద్వాగాలపై పట్టు, భావ వ్యక్తీకరణ నైపుణ్యం కలిగియుండాలి. విస్తృత పరిశీలనా శక్తి కలిగి యుండాలి. ఎదుటి వారి వ్యూహాలను పసిగట్ట గలగడం, తగిన రీతిలో వేగంగా స్ఫందించ గలిగిన ధీ పటిమ యుండాలి. ఆ యా రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడం.. దానికి తగిన రీతిలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోగలిగిన విధానం తెలిసి ఉండాలి. ఆ మార్పులను అంగీకరించే మానసిక చైతన్యం కలిగి ఉండాలి. అనుయాయులతో, వినియోగదారులతో సత్సంబంధాలను కలిగి యుండాలి. బృందాన్ని ఏర్పాటు చేయగలగడం, ఆ బృందం లోని సభ్యులందరూ ఒకే లక్ష్యం తో కలసి ఒకే ఆలోచనా విధానం తో పని చేసేందుకు అవసరమైన స్ఫూర్తిని నింపగలగడం, సమస్యలెదురైన వేళ వాటి నధిగమించేందుకు ప్రణాళికా బద్ధం గా ముందు చూపుతో వ్యవహరించ గలగడం, ప్రో ఆక్టివ్ గా యుండడం, హేతుబద్ధ ఆలోచనా పటిమ... తోటి వారిని గౌరవించే నైజం, ఎదుటి వారి సలహాలను సకారాత్మకంగా తీసుకునే లక్షణాలు ఉండాలి. ఆర్థిక, సామాజిక, మేధో బలం కలిగిన వాడై యుండడం వల్ల అతని సమర్థత గౌరవించబడి.. అనుయాయులు అతనిని నమ్మదగిన వ్యక్తిగా గుర్తిస్తారు... అనుసరిస్తారు... సహకరిస్తారు... అనుమోదిస్తారు.
రథ్య బలంబు.... రథ్య బలము (Men, Machinery & Morality) ఉత్తము లైన, ఆలోచనాపరులైన, సంస్కారవంతులైన, కష్టపడి పని చేయగలిగిన వారు, సంస్థ అభివృద్ధియే తమ అభివృద్ధిగా తలచే వారు ఉద్యోగులుగా... ప్రతిభ ఆధారం గా నియమింప బడాలి. అన్నివిభాగాలలో పరస్పరాధారిత స్ఫూర్తి తో పని చేయగలిగిన ఉద్యోగులు సంస్థకు వెన్నెముక లాంటివారు. సంబంధిత రంగం లో అవసరమైన శిక్షణ పొంది ఆ అనుభవం ప్రాతిపదికగా అంకిత భావం తో పనిచేసే ఉద్యోగులు సంస్థ ప్రగతిలో ముందుంటారు. అలాగే అధునాతన యంత్ర సామాగ్రి, అవసరమైన విడిభాగాలు అందుబాటులో ఉండడం వల్ల ఉత్పత్తి కుంటుపడదు.. ఉత్పత్తి ఉత్పాదకతలు పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తం గా వస్తున్న మార్పుల నాధారం చేసుకొని ఎప్పటి కప్పుడు యంత్ర సామాగ్రిని ఆధునీకరించుకోవడం వల్ల పరిశ్రమలో ముందుండడం సాధ్యపడుతుంది. క్రొత్త ఆవిష్కరణలు, క్రొత్త విధానాలు.. అమ్మకాలను పెంచుతాయి... ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తాయి... అమ్మకపు ఖర్చులను తగ్గిస్తాయి... వెరసి నికర ఆదాయం పెరుగుతుంది. విలువలు, సిద్ధాంతాల ఆధారంగా పనిచేయడం, పాలనా వ్యవహారాలలో పారదర్శకత వల్ల ఉద్యోగులు - సంస్థ మధ్య సంబంధాలు దృఢమౌతాయి. అదే విధానాన్ని సంస్థ సంస్కృతిగా కొనసాగించడం, క్లయింట్లు మరియు సప్లయర్స్ తో వ్యవహరించడం వల్ల వ్యాపార సంబంధాలు పటిష్ఠ మౌతాయి.
ఆయుధోదారత... ఆయుధోదారత (Qualitative and Quantitative Resources & Instruments) వనరుల సమీకరణ సరిపోయేంతగా ఉండాలి. ఎక్కడ ఏ లోపం రాకూడదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన మేరకు నాణ్యమైన ముడిపదార్ధాలను సేకరించి పెట్టుకోవడం.. విడిభాగాలను సరఫరా చేసే సంస్థలతో అనుబంధన్ని పెంచుకోవడం... అవసరమైన మేరకు సరఫరా ఒప్పందాలను కుదుర్చు కోవడం... వినియోగదారులతో సత్సంబంధాలను కలిగి యుండడం, స్నేహబంధాన్ని కొనసాగించడం లాంటివి మనలను ఉన్నత స్థానం లో నిలుపుతాయి.
మానమున్... మానము (Credibility) పరిశ్రమలో పరపతి పెంచుకోవాలి. ఏ ఇచ్చిపుచ్చుకునే లావాదేవీ వల్లనైనా వినియోగదారునికీ అమ్మకం దారుకూ ఇరువురికీ ఉపయోగపడే ఒప్పదం కుదరాలి అలాంటి ఒప్పదం కుదుర్చుకోవడం వల్ల ఇరువురి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నీకు జయం నాకూ జయం (Win/Win Attitude) వైఖరి వల్ల ఇరువురూ లాభపడతారు... ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ ఒప్పదం కుదరక పోయినా వారి మధ్య బంధం చెడిపోదు. సరైన సమయానికి మనం ఇవ్వవలసిన చోట బిల్లులు చెల్లించడం వల్ల సరఫరాదారు మనల్ని ఉత్తమ ఖాతాదారునిగా గుర్తిస్తాడు. మన పట్ల ఉదారం గా వ్యవహరించే అవకాశం ఉంది. న్యాయబద్ధం గా సరకుకు విలువ కట్టడం, సరైన నాణ్యత, సరైన కొలత, సరైన సమయానికి, సరైన ధరకు సరకు ను వినియోగదారునికి అందించడం వల్ల మన పరపతి పెరుగుతుంది. సరఫరాదారుడు, వినియోగ దారుడు... ఇరువురి నమ్మకం సంతృప్తి చూరగొన్న ఏ సంస్థ యైనా ఉన్నత శిఖరాల నధిరోహిస్తుంది.
రణ విధంబు... రణ విధానము (Planning, Organising, Processing, Review, Introspection, Restucturing and Implimentation) ముందుగా ఏ పరిశ్రమను ఏర్పాటు చేయాలి, ఎక్కడ చేయాలి, దానికి ఏ యే వనరులు ఎంత మొత్తం లో అవసరమౌతాయి, ఆయా వనరుల నెలా సమీకరించుకోగలం, దానికి నైపుణ్యం గలిగిన ఉద్యోగులు లభిస్తారా, యంత్ర పరికరాలు ఎక్కడ లభిస్తాయి, ప్రభుత్వ అనుమతులు ఎలా వస్తాయి, ఈ విధానం లో పరిశ్రమ నెలకొల్పడానికి ఎంత సమయం పడుతుంది, ఎంతడబ్బు అవసరమౌతుంది, భాగస్వాములు లభిస్తారా, వినియోగ దారుల మార్కెట్ ఎలా ఉంది, మన పోటిదారుల వ్యాపారం ఎలా ఉంది, పరిశ్రమ స్థాపనలో మన బలాబలాలు ఏమిటి, మార్కెట్ ను ఎలా స్వాధీన పరచుకో గలం అనే అన్ని విశయాలపై సరైన అవగాహనతో కూడిన యోజనా ప్రణాళిక తయారు చేసుకోవాలి. మనకున్న అన్ని వనరులనూ సమీకరించుకోవాలి. ప్రతిభ ఆధారం గా అనుచరులకు బాధ్యతలప్పగించాలి. నిజాయతీ పరులను కీలక పదవులలో పెట్టి వారికి అర్హులైన శిక్షణ పొందిన సహాయకులను నియమించాలి. నాణ్యత గలిగిన యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి నిర్వహణా బాధ్యతను సంబంధించిన వారికి నిర్ణయాధికారాలతో సహా అప్పగించాలి. అవసరమైన సమయం లో ఏం జరుగుతుంది అనుకున్న ఫలితాలు వస్తున్న యా లేదా ఏ యే విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి.. ఎయే విభాగాలలో ఏయే సమస్యలున్నాయి... అనె విషయాన్ని సమగ్రంగా విశ్లేషించి వీలైనంత త్వరగా దానిని సరిచేయాలి. ఆత్మ పరిశీలన ద్వారా మన పని తీరును సరి చూచుకోవాలి. అవసరమైన చోట ఏయే మార్పులు చేర్పులు అవసరమో పరిశీలించి ఆయా మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల సంస్థ పని తీరు ఉత్తమం గా ఉంటుంది.
నిమిత్త శుభాశుభత్వ నిర్ధారణమున్.... ( Ascertaining Good and Bad by Observing the Markets) శకునాలు .... మార్కెట్లో కనిపించే సూచనల కనుగుణం గా ఏది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది దేని వల్ల నష్టపోతామో గ్రహించడం, ఏ నాణ్యతా ప్రమాణాలతో ఏ వస్తువు ఎక్కడ అమ్మగలమో.. ఎక్కడ మన ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో... వినియోగదారుల మనసు గెలిచేందుకు మన ఉత్పత్తుల ప్రమాణాలలో ఇంకా ఏ విధమైన మార్పులు చేయాలో...ఎక్కడ మన కవసర మైన ముడి సరకులు తక్కువ ధరకు దొరుకుతాయో... ప్రభుత్వ విర్ణయాలు మన ఉత్పత్తులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి... వాటి వల్ల ఉపయోగమా నష్టమా లాంటి వివిధాంశాలను ఎప్పటి కప్పుడు సర్వే చేయించడం... వల్ల అవసరమైన మార్పులు వేగం గా తీసుకు రావడం వీలవుతుంది. మార్కెట్ లో ముందుండాలి అంటే సమాచార వ్యవస్థ ను మెరుగుపరుచు కోవాలి. మన వినియోగదారుని ప్రలోభాలతో లొంగ తీసుకునే పోటీదారులను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మన సంస్థ లో లంచగొండి ఉద్యోగులు, స్వలాభం చూచుకునే భాగస్వాముల గూర్చిన సమగ్ర సమాచారం ఎప్పటి కప్పుడు మనకు చేరవేయ గలిగిన గూఢాచార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధానాలలో సూచనలు అందిన సమయానికి స్ఫందించని ఉత్పత్తిదారుడు నష్టపోతాడు.
హితం బెఱిగించుట (Advising & Mentoring) హితము చెప్పడం... అభ్యుదయ మార్గం లో సాగాలని కోరే ప్రతి సంస్థ లో సాంకేతిక, ఆర్థిక, వ్యాపార, న్యాయ సంబంధిత అంశాలపై సరైన సూచన లిచ్చేందుకు ఒక నిపుణుల సలహా మండలి ఉండాలి. ఆ సలహా మండలి స్వతంత్రం గా వ్యవహరిస్తూ అధినేతకు మాత్రమే జవాబు దారి కావాలి. అయా అంశాలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ... అన్ని సూచనలను పరిగణన లోకి తీసుకుంటూ సంస్థ ప్రగతికి ఏ విధానం మంచిదో ఆ సలహా మండలి తెలియచేయడం మంచిది. ఆ సూచనల నాదరించి అందులోని సాధ్యాసాధ్యాలను పరిగణలోనికి తీసుకొని అధినేత నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అధినేత పరిమితుల కారణంగా ఆ సూచనలు పాటించక పోయినా, విషయమెంతటి సున్నితమైనదైనా, నీచ మైనదైనా, అధినేతకు విన్నవించడం ఆ సలహా మండలి కర్తవ్యం. తమ దృష్టికి వచ్చిన సమాచారాన్ని శాస్త్రీయం గా విశ్లేషించి ఆ పరిశీలన సారాన్ని ఉపపత్తిగా చూపుతూ ఏ దారి మంచిదో యుక్తమైనదో దానిని అధినేత కు నివేదించడం వారి కర్తవ్యం. అయితే అందులో తమ స్వార్థపూరిత అభిప్రాయాలకు తావివ్వవద్దు. ఆ సలహా మండలికి ఉద్యోగులను నియమించే సమయం లోనే నిజాయతీ పరులను, నమ్మకస్తులను, అనుభవజ్ఞులను ఎన్నుకోవడం అధినేత విధి.
పాలకుర్తి రామమూర్తి
 పంచ రత్నాలు
శ్రీ రమణీయ భావనల సేవధియై చెలువారు సాహితీ
సారము సద్రసజ్ఞ తతి స్వాంతము లందు సుధార్ణవంబులై
బారగ జేయు సాధనము భాషయె; భాషకు తల్లి యైన ఆ
భారతి సాహితీ విబుధ వర్గము నేలుత గూర్చి వాగ్ఝరుల్!
కణము కణంబునన్ విమల కాంతులు నింపుచు ముజ్జగంబులన్
ప్రణవ మహత్వ రూపమయి వ్యాప్తిలి, యుత్తమ సాధకుండునై
అణిమ పురస్సరంబయిన అద్భుత సిద్ధులు ఆశ్రయింప గా
గణముల నేలు విఘ్నపతి కవ్వడి బ్రోచుత సాహితీ భువిన్!
శ్రీకరమైన చిత్తమున స్నిగ్ఢ మహోన్నత లక్ష్య దీప్తియున్,
ప్రాకట భావనా పటిమ, రాజిలు కోర్కెయు, యుత్సహంబు, చీ
కాకుల నోర్చు స్థైర్యమును, కష్ట సహిష్ణుత యేరి లోన యే
కాకృతి బొల్చు నా హనుమ డంచిత సంస్కృతి నిల్పు నీ భువిన్!
హరిహర పూర్ణ లక్షణము లంశయు నొక్కట నేక రూపమై
పురమున శోభితంబయిన పూన్కి వికాసము నంది, చిత్త వి
స్ఫురణము, త్యాగ భావనయు, శోధన, సాధన, బోధనాదులం
దరుగు మహత్వ తాత్త్వికుడు అంజని పుత్రు డనుగ్రహించెడిన్!
భక్తి వికాసమై బరగు వ్రాతల నాత్మ వికాస దీప్తియున్;
రక్తియు, సాధనా పటిమ, శ్రద్ధయు, శీలము, కార్య దీక్ష, లా
సక్తియు, స్థైర్య ధైర్యములు, జాగృతి వస్తువులైన చేతనా
సక్త కవిత్వ రూపమగు శారద యేలుత సాహితీ భువిన్!
పాలకుర్తి రామమూర్తి
శ్రీ రమణీయ భావనల సేవధియై చెలువారు సాహితీ
సారము సద్రసజ్ఞ తతి స్వాంతము లందు సుధార్ణవంబులై
బారగ జేయు సాధనము భాషయె; భాషకు తల్లి యైన ఆ
భారతి సాహితీ విబుధ వర్గము నేలుత గూర్చి వాగ్ఝరుల్!
కణము కణంబునన్ విమల కాంతులు నింపుచు ముజ్జగంబులన్
ప్రణవ మహత్వ రూపమయి వ్యాప్తిలి, యుత్తమ సాధకుండునై
అణిమ పురస్సరంబయిన అద్భుత సిద్ధులు ఆశ్రయింప గా
గణముల నేలు విఘ్నపతి కవ్వడి బ్రోచుత సాహితీ భువిన్!
శ్రీకరమైన చిత్తమున స్నిగ్ఢ మహోన్నత లక్ష్య దీప్తియున్,
ప్రాకట భావనా పటిమ, రాజిలు కోర్కెయు, యుత్సహంబు, చీ
కాకుల నోర్చు స్థైర్యమును, కష్ట సహిష్ణుత యేరి లోన యే
కాకృతి బొల్చు నా హనుమ డంచిత సంస్కృతి నిల్పు నీ భువిన్!
హరిహర పూర్ణ లక్షణము లంశయు నొక్కట నేక రూపమై
పురమున శోభితంబయిన పూన్కి వికాసము నంది, చిత్త వి
స్ఫురణము, త్యాగ భావనయు, శోధన, సాధన, బోధనాదులం
దరుగు మహత్వ తాత్త్వికుడు అంజని పుత్రు డనుగ్రహించెడిన్!
భక్తి వికాసమై బరగు వ్రాతల నాత్మ వికాస దీప్తియున్;
రక్తియు, సాధనా పటిమ, శ్రద్ధయు, శీలము, కార్య దీక్ష, లా
సక్తియు, స్థైర్య ధైర్యములు, జాగృతి వస్తువులైన చేతనా
సక్త కవిత్వ రూపమగు శారద యేలుత సాహితీ భువిన్!
పాలకుర్తి రామమూర్తి
శ్రీ ఆంజనేయ దండకం
శ్రీ అంజనీ పుత్ర, రుద్రాంశ సంజాత, హే వానరా కార, హే ఆంజనేయా! మహద్దివ్య సత్వా, కృపాపూర్ణ శుద్ధాంత రంగా, జగద్పూజ్య శీలా, మహాకాయ, వాతాత్మజా, భవ్య యోగాను సంధాయకా, దేవ భక్తార్తి తాపాప హారా! కపీశా! భవద్బాల్యమందొక్క నాడీవు ప్రాభాత వేళన్ మనోజ్ఞంబుగా తూర్పు దిక్కున్ విభాసింపగా జేయు చేతెంచు బాలార్కునిన్ గాంచి విభ్రాంతి పండంచు భావించి నోటన్ వడిన్ బెట్ట సూర్యండు లేకున్న లోకంబు లందెల్ల గ్రమ్మన్ తమిస్రంబు లారీతికిన్ భీతిచే లోక సందోహ మాహాకృతుల్ చేయుచున్ తల్లడిల్లంగ గోత్రారి యుద్ధామ వజ్రాయుధంబంపి, నిన్ మూర్చ లో మున్గగా జేయ నీ తండ్రి తానేగి నీ తోడ నెచ్చోటనో దాగె నంతన్ జగంబెల్ల నల్లడె గా వాయు సంచారముల్ లేక దానన్ విధాతృండు నీ తండ్రికిన్ ప్రీతి గూర్పంగ నీకున్ వరంబుల్ ప్రసాదించె పెక్కుల్ కదా ధీనిధీ! యింక బ్రహ్మాస్త్ర మొక్కడు దక్కంగ యే యస్త్ర శస్త్రంబులున్ నిన్ను బంధింపగాలేవటంచున్ వచించెన్ గదా! దివ్య యోగీశ! మున్ శ్రద్ధ తో నీవు నాదిత్యు సేవించి తద్దివ్య కారుణ్య సంలబ్ధ విజ్ఞానివై వేద వేదాంత శాస్త్రార్థ మీమాంసముల్ తత్త్వ తర్కాది విద్యా రహస్యంబులన్ నేర్చి వ్యాకర్ణ పాండిత్య విస్ఫూర్తి సంభాషితానేక నైపుణ్య పూర్ణ ప్రభావుండవై యొప్పు దేవా నమో వానరగ్రేసరా! సాధనా శీలివై వానరాకార మందొప్పు చాంచల్యతన్ దాటగా సాధనన్ జేసి దుర్వార మౌ యష్ట సిద్ధుల్ కడున్ వేడ్క సాధించి లోకంబుకున్ సాధనోత్సేక చేతస్కు లౌ వారికిన్ పర్మితుల్ లేవు సామర్థమే గీటు రాయంచు బోధించితే దేవ దేవా! జగన్నాయకా! చక్కనైనట్టి కార్యంబు లోనెంచి మేలైన మార్గంబు లో దాని సాధింపగా దల్చు వారిన్ వరించున్ గదాశోభనాధిక్య సందోహమంచున్ నిరూపించితే స్వామి! నీ దైన మార్గంబె లోకాళి కెల్లన్ బ్రశస్థంబు! తద్భూతి సాధింప నే జన్మయందే తపోనిష్ట యో ధ్యానమో యోగమో నోములో నీకు సాహాయ మై నిల్చె నయ్యా! గుణాతీత భావాత్మకా దేవ మాయల్ మహత్తత్త్వముల్ నీకు వశ్యంబు లై వర్ధిలున్ గాదొ లోకేశ! సంగీత సాహిత్య పాండిత్య మేపారు నీగాన మాధుర్య మందున్ శిలల్ నీరుగా మారు టాశ్చర్యమే దేవ! భావంబులోనన్ విచారింప నీ జన్మ మూలంబు రుద్రాంశ, నీకున్ బ్రసన్నుండునై బ్రహ్మ దేవుండె యొప్పారె! విష్ణుండు రామాకృతిన్ దాల్చి లక్ష్మీ సమేతుండునై త్వత్ హృదాకాశ వీధిన్ వసించెన్ గదా! సృష్టి నిర్మించి పాలించి సంహారమున్ జేయు దివ్యాచ్ఛ శక్తుల్ త్రి మూర్తుల్ త్రి మాతల్ త్రి వర్గంబులున్ నీకు వశ్యంబులై దృశ్య మానంబు లై యొప్పగా సర్వ సర్వం సహా చక్రమందెక్కడేనిన్ విచారింప గా నీ కసాధ్యంబు గన్గొందు మే! ఈశ, సర్వేశ సర్వాత్మకా! యోగ విద్యా రహస్య ప్రపూతాత్మకా! నీదు వాగ్నైపుణీ దీప్తి యేనాడు కీశౌఘ నేతన్ మహా సౌమ్యు సుగ్రీవు నిక్ష్వాకు వంశాంబుధీ సోము కున్ మిత్రు గా జేసి శ్రీ రాము బాహాపరీరంభ మందాత్మ సంయోగ మున్ బొంది ధన్యత్వమున్ గూర్చె నీకున్ గదా! భవ్య యోగీంద్ర సంసేవకా! నీదు సంభాషణా చాతురిన్ గాదొ సుగ్రీవు డానాడు కిష్కింధ కున్ రాజు గాగల్గె! శ్రీ రామ భూపాల పాద ద్వయీ లగ్న చిత్తాబ్జ! సీతా విపద్దూర! సౌమిత్రి జీవ ప్రదాతా! సముద్రమ్ము లంఘించి యా లంఖిణిన్ గూల్చి యా లంక గాలించి సీతా మహా సాధ్వి దర్శించి రామాంగుళీయంబు నందించి ఆ యమ్మ ప్రాణంబులన్ నిల్పి సీతమ్మ తో భక్తి సంభాషణన్ జేసి యాపై నశోకాటవిన్ ధ్వంసమున్ జేసి పోరాడు చో మత్త వేదండ మస్తిష్క విచ్చేదనా శీలియై దూకు సింగమ్ము భంగిన్ రణంబందు నక్షయ్యుడాదిన్ దశాస్యాత్మజాళిన్ బొరిన్ గొన్న యుష్మత్ ప్రతాపంబు నెన్నంగ నేనెంత! బ్రహ్మాస్త్ర బద్ధుండవై నాడు పౌలస్త్యు పేరోలగంబందు ధైర్యంబుతో నిల్చి యుద్వేగి యౌ వాని యుత్సాహమున్ బాపి తద్బంధు మిత్రాళి యున్ పౌర లోకంబు లౌరా యనన్ రావణున్ జీరి “యో రావణా సీత నీ లంకకున్ దెచ్చుటల్ దప్పు రాముండు భక్తాళికిన్ కొంగు బంగార మౌ గాన సీతన్ వెసన్ రాము కర్పించి శర్ణన్న నీ ప్రాణముల్ నిల్చు గాదేని నీ పుత్ర పౌత్రాదులున్ మిత్ర బందు క్షయంబౌను యుక్తంబు నౌ కార్యమున్ గాంచు” మంచున్ హితోక్తుల్ వచింపంగ నీ ధైర్య సంపత్తి వాగ్నైపుణిన్ మెచ్చి వేనోళ్ల శ్లాఘించి రవ్వీటి వారల్ మహావీర! గర్వాంధ్య మక్షిద్వయిన్ గప్ప గా పంక్తి కంఠుండు నీ తోకకున్ నిప్పు పెట్టించె దానన్ గదా లంక భస్మీ కృతంబయ్యె ! నాపైన సీతమ్మ చూడామణిన్ దెచ్చి యా సంద్రమున్ దాటి శ్రీ రాము కర్పించి యా స్వామి కిన్ యూరటన్ గూర్చి, సు స్నేహ వారాశివై ప్రాణ బంధుండవై యొప్పితే విజ్ఞతా మూర్తి! నీలావు నీవే యెరుంగంగ లేవన్న సత్యంబు గాదందు! సంస్కార చైతన్య సత్త్వంబునై యొప్పు ఆనంద మే ప్రొద్దు నీ చేతమున్ నిండగా నైహికంబౌ క్రియా రూఢి సత్త్వంబు చూపింప నేలా వితర్కింపనంచున్ హృదాకాశ మందెల్లడన్ రామ రూపంబు భావంబు జీవంబు లో నింపి దివ్యత్వ మేపార ఆనంద కుల్యా తరంగాళిలో చిత్త మేకత్వమై తన్మయత్వంబు సాధింప "బ్రహ్మాస్మి" యన్ సూక్తికిన్ భాష్యమై నిల్చు దేవా! నమో భావ రూపా! నమో భవ్య చిత్తా! నినున్ దల్చినన్ చాలుగా శాకినీ ఢాకినీ గాలి దయ్యంబు లేడేడు లోకంబులన్ దాటి పారున్ గదా! మున్ను ఘోరాజిలో మేఘనాథ ప్రయుక్తాస్త్ర శస్త్రాహతిన్ మూర్చలో మ్రగ్గు సౌమిత్రి ప్రాణంబు కాపాడ సంజీవనీ పర్వతంబున్ వెసన్ దెచ్చి శ్రీ రాము దుఃఖార్తి బాపన్ భవద్వీర్య మే చాలె: సీతా మహాసాధ్వి నన్వేషణన్ జేసి యాదైత్యు భీతావహున్ జేసి కార్యంబు సాధించు నైపుణ్య మున్ జూడ నీ యాజమాన్య క్రియా రీతి నిర్వాహణా దీప్తి గన్పించు ! గంధర్వుడౌ తుంబురుండున్ మహా జ్ఞాని యౌ నారదుండున్ సభన్ గాన మాత్సర్య చేతస్కులై ఆధిపత్యమ్ము రూపింపగాలేమి నాధిక్యు డెవ్వాడొ మాలోన రూపింపు మంచున్ నినున్ జేర నీ గాన మాధుర్యమున్ జూపి అవ్వారి గర్వాంధ్యమున్ బాపి "ఆధిక్యమున్ జూపు కన్నన్ శుభం బైకమత్యంబు తో నుండి అన్యోన్య మైత్రిన్ విరాజిల్లుటల్ మేలు సౌహార్ద్ర చేతస్కులై శోభనోద్యోగ ముల్ పొందుటల్ పాడి యంచున్" హితంబొప్పగా బల్కి పంపించు నీ విజ్ఞతన్ దేవతా లోకమే నాడు కీర్తింప నేనెంత నిన్ గూర్చి వాచింపగా నేనెంత! నిన్ భక్త మందరమా భక్త చింతామణీ భక్త కల్ప ధ్రుమా యంచు కీర్తింప నూహింప నేలా జఢత్వంబు తల్లక్షణం బౌట నీ విశ్వ విశ్వాంత రాంతర్గతంబైన చైతన్య సంవ్యాప్త బ్రహ్నాండమున్నీవ ఆనంద భావ ప్రచేతమ్మువున్నీవ విజ్ఞానపుం జ్యోతి పుంజంబువున్ నీవ ప్రేమ ప్రవాహంబువున్ నీవ భక్తి ప్రచేతంబులో నిన్ను కీర్తించినన్ జాలు భౌతిక భ్రాంతులున్ బాయు నాధ్యాత్మికాభోగమబ్బున్ గదా! హే మనోనాయకా! అజ్ఞతా మౌఢ్య మాత్మన్ ప్రపూర్ణంబునై యుంట నంతర్గతంబైన మా శక్తి గుర్తింపగా లేక ఎవ్వారొ మమ్ముద్ధ రింపంగ వేవత్తురంచున్ వృధా జేతు మీ జీవితంబున్ సతంబట్లు గాకుండ నీ దైన మార్గంబు లో నాత్మ విజ్ఞానమున్ బొందు ప్రౌఢిన్ ప్రసాదించరా! యొజ్జవై మార్గమున్ జూపి మమ్మేలరా! దేవ యో శూర యో వీర యంచున్ నిన్ వేడు దాలింపరా, స్వామి, నీరోమ రోమంబునన్ రామ నామంబె నాదంబు గా ధ్వానముల్ జేయ సంచారముల్ జేయు నాధ్వానముల్ లోకమందెల్లడన్ భక్త లోకాగ్రణీ! యెంత కాలంబు శ్రీ రామ నామంబు లీ యుర్వి పైనన్ ధ్వనించున్ భవత్ సచ్చరిత్రంబు లందాక వెల్గొందు హే వానరాకార! ధీ దీప్తి వెల్గొంద నీపైన నేదండకం బొక్కటిన్ జేసితిన్ : ప్రేమ స్వీకారమున్ జేయరా నీ కృపాలోకమున్ జూపరా హే ప్రసన్నాంజనేయా! నమో దివ్య లోక ప్రదాతా నమో భవ్య యోగ ప్రదాతా నమో భావ సంచార శీలా నమస్తే నమస్తే నమస్తే నమః!
శుభం.