Friday, August 15, 2025

 

            కురుక్షేత్ర యుద్ధంలో బంధు మిత్రులు, స్నేహితులు మరణించాక "కొంతకాలం మడుగులో దాగి, అనుకూల సమయంలో ఎక్కడికైనా పోయి, ఏదో విధంగా నా పగ తీర్చుకుంటాను".. అని సంజయుని ద్వారా ధృతరాష్ట్రునికి సందేశాన్ని పంపి దుర్యోధనుడు ఒంటరిగా ద్వైపాయనం అనే మడుగులో జల స్తంభన విద్యతో దాగుకొని ఉంటాడు. ఆ సమయంలో కొందరు వేగులవారి వల్ల దుర్యోధనుడు దాక్కొన్న మడుగును చేరి పాండవులు అతనిని సూటిపోటి మాటలతో హింసిస్తూ.. ఆ మడుగులో నుండి బయటకు రప్పించే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో తిరుపతి వేంకట కవులు వ్రాసిన పద్యం..

 

చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్ల రీ

కచ్చకు మూలకందమగు కర్ణుడు, మామయు చచ్చిరీ గతిన్

పచ్చని కొంప మాపితివి బాపురె, కారవ నాథ! నీ సగం

బిచ్చెద జీవితేఛ్చ గల దేని బయల్పడు మయ్య గ్రక్కునన్!

 

            సమూలంగా కౌరవ బలం నాశనమయింది. పగలు ప్రతీకారాలు ఎంతటి నాశనానికి దారితీస్తాయో జగత్తుకు అవగతమయింది.

            అలా దాగిన దుర్యోధనుని వెలికి రప్పించడ మెలాగా అని ఆలోచిస్తున్న సమయంలో కృష్ణుడు ధర్మరాజుతో.. మాయతో జయించాలని భావించే వారిని మోసంతోనే జయించాలే కాని మరో మార్గం కనిపించదు. శత్రుశేషం, ఋణశేషం మిగలడం అపాయకరం కాబట్టి అభిమాన ధనుడైన దుర్యోధనుని ఎలాగైనా సూటిపోటి మాటలతో వెలుపలికి రప్పించి సంహరించడమే ఉత్తమం.. కాబట్టి దయా దాక్షిణ్యాలని, సోదరుడని భావించక ఆ విధానానికి ఉపక్రమించమని చెపుతాడు. ఆ సందర్భంలో ధర్మరాజు..

            దుర్యోధనా.. లోకంలో ఇలాంటి నీచమైన స్థితి వీరులకే దగదు.. అందునా అభిమానవంతుడవైన నీకు అసలు తగదు... నీ తోబుట్టువులు చచ్చారు, కుమారులూ చచ్చారు.. నీకునై యుద్ధం చేసిన రాజులు అందరూ చచ్చారు.. ఇంత కక్షలకూ కార్పణ్యాలకూ మూలమైన కర్ణుడూ.. శకునీ చచ్చారు. ఇందరు యోధులూ, సైనికులు చచ్చేందుకు మూలమైన నీవు మాత్రం బ్రతికి సాధించేది ఏమి ఉన్నది? పచ్చగా ఉన్న కౌరవవంశం అనే కొంపలో జ్యోతిని ఆర్పివేసావు. ఇంకా రాజ్యేఛ్ఛ నీకు ఉన్నట్లయితే రాజ్యంలో సగ భాగం ఇస్తాను.. త్వరగా రా.. వచ్చి ఏలుకో.. అంటాడు.

            అంతేకాదు, నిన్ను శూరునివి అంటారు కదా.. కొలనులో దాక్కోవడం శూరకర్మమా, వీర ధర్మమా, రణనీతియా.. సాధారణమైన రాజులే ఇలా యుద్ధం నుండి పారిపోయి దాక్కోరే.. అలాంటిది నీవు.. కురువంశంలో జన్మించి.. కీర్తినీ, గొప్పదనాన్ని కాదని వైరులు నవ్వే విధంగా కొలనులో దాక్కుంటావా.. ఇంత మందిని రణభూమికి బలిచేసి నీ ప్రాణాలను మాత్రం కాపాడుకోవడం క్షాత్ర ధర్మమా? దుర్యోధనా యుద్ధంలో మమ్ములను జయిస్తే.. ఈ సమస్త భూమండలాన్నీ పాలించుకోవచ్చు.. అలా కాక యుద్ధంలో మరణిస్తే స్వర్గభూమిలో సౌఖ్యాలను అనుభవించవచ్చు. అలాకాక.. మడుగులో దాక్కొనడం అవమానం కాదా..

            ఇలా ఎన్నో విధాలుగా నిష్ఠూరంగా ఎద్దేవా చేస్తూ పలికిన ధర్మరాజుతో దుర్యోధనుడు మడుగులో నుండే బదులు చెపుతాడు.. ముఖ్యంగా తనవారితో కూడి సౌఖ్యాలను అనుభవించడమే ఉచితం కాని ఇలా ఒంటరినై అనుభవించడం సమంజసమూ కాదు.. అంటూ.. చివరగా...

ఓడి వచ్చినాడ యుద్ధతి నాకేల?

యుడుకు మాని నీవ యుర్వి నేలు

గుఱ్ఱములును నేనుగులును లేని బయలు నీ

తలనె కొట్టుకొనుము ధర్మ తనయ!

అంటాడు.

            సంఘర్షణ ఎప్పుడూ అనర్ధానికే దారి తీస్తుంది. దుర్యోధనుడు పదకొండక్షోహిణుల సైన్యాన్ని సమకూర్చుకున్నాడు.. భీష్మద్రోణ కర్ణ కృపాశ్వత్థామ, బాహ్లిక సోమదత్త భూరిశ్రవసుడు ఆదిగా గలిగిన అతిరథ మహారథ శ్రేష్ఠులను యుద్ధావనికి నడిపించాడు. పాండవ పక్షంలోనూ ఏడక్షోహిణుల సైన్యం సమకూరింది.. ఇంత సైన్యం యుద్ధార్ధులై సమరాంగణంలో నిలిచిన వేళ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారనే సమస్యను ప్రక్కన పెడితే.. కొందరు ఆ పక్షంలో కొందరీ పక్షంలో మరణించడం అనివార్యమే కదా.. అందులో తన తమ్ములూ ఉండవచ్చు.. కుమారులూ ఉండవచ్చు, స్నేహితులూ ఉండవచ్చు..

            కొద్ది సంయమనత, చిన్న త్యాగభావన, మరికొంత ఔదార్యం మనసులో నిలిస్తే.. యుద్ధం అనివార్యమౌతుందా? సూత పుత్రుడైన కర్ణునికి అంగరాజ్యాన్నే ఇచ్చాడు కదా.. ఆ పాటి సౌహార్ద్రత పాండవులపై చూపితే ఇంతటి దారుణ మారణ కాండ జరిగియుండదు కదా? ఈ రాజ్య కాంక్ష ఎందుకు? శాశ్వతంగా ఎవరైనా ఇప్పటి దాకా ఉన్నారా? ఇక ముందు ఉంటారా?

            ఎవరికోసం ఎవరు చావాలి? ఎందుకు చావాలి? భూమి కొరకు రాజులు యుద్ధాలు చేస్తున్నారు.. అందులో అమాయకులు మరణిస్తున్నారు. కౌరవులు గెలిస్తే.. లేదా పాండవులు గెలిస్తే.. మరణించిన వారికి వచ్చే ప్రయోజనం ఏమిటి? రాజులు సపరివారంగా వినోదయాత్రకు వెడలినట్లు యుద్ధావనికి వెళ్ళి పీనుగులై యమపురికి పోవడం.. అమూల్యములైన ఎన్నో వనరులు ధ్వంసమవడం యుద్ధం వల్ల జరిగే నష్టం.. దానిని ఆనాడూ గుర్తించలేదు.. ఈనాటి పాలకులూ గుర్తించడం లేదు.. పాలక వర్గమైనా వ్యాపార వర్గమైనా పరస్పరాధారితమైతే అమిత ప్రయోజనాలను పొందగలరనే సత్యం తెలిసీ స్వార్థ ప్రయోజనాలకై, ఆధిపత్యాన్ని సాధించాలనే అధికార లాలసతతో పరస్పర హననం జరుపుకోవడం గర్హణీయమే.

            సగం ప్రపంచాన్ని జయించాననే అహంభావంతో ఉన్న అలగ్జాండర్ తాను మరణించిన సమయంలో కాఫిన్ లో నుండి తన చేతులు పైకి వచ్చేట్లుగా పెట్టమని వీలునామా వ్రాసుకున్నాడట. ఇంత భూమినీ జయించినా.. నేను రిక్త హస్తాలతోనే వెళ్ళిపోతున్నాననే సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకే ఆ విధంగా వ్రాసాడట.

            చిన్న మాట పట్టింపులు.. రక్త సంబంధీకుల మధ్య పెద్ద కాలం పలకరింపులను దూరం చేస్తున్నాయి. కొద్ది పాటి అధికారం.. తనవారి నుండి దూరం చేస్తున్నది. ఇది అవసరమా.. ఇప్పుడు ఈ భూమిపై ఉన్న ఏ వ్యక్తీ .. గత రెండు వందల సంవత్సరాల క్రితం లేడు కదా.. అలాగే మరో రెండు వందల సంవత్సరాల పిమ్మట ఇప్పుడున్న ఎవరైనా ఉంటారా? అనంతమైన కాలంలో నాలుగు వందల సంవత్సరాలు చాలా చాలా చిన్న సమయం.. ఎందుకు వచ్చామో తెలియక.. ఎందుకు పోతున్నామో ఎఱుగక.. రాకపోకలు మాత్రమే లక్ష్యంగా జననమరణ చక్ర బంధంలో మ్రగ్గిపోవడం అవసరమా? ఆలోచించాలి.

            రమేశ్ అడిగిన ప్రశ్న చిన్నదే కావచ్చు కాని అందరూ సమాధానాన్ని ఆలోచించుకో వలసిన అవసరం మాత్రం ఉన్నది.

            రమేశ్ ఇప్పటికే వ్యాఖ్య విషయాంతరమయింది.. ఇక్కడికి ఆపేస్తున్నాను..

పాలకుర్తి రామమూర్తి

 

అర్హత, సాధన, విచక్షణలే జీవితాన్ని ఉన్నతీకరిస్తాయి

 

            విద్యార్జనకు గాని, ఉన్నత బాధ్యతా నిర్వహణకు గాని అర్హతాపరీక్షలో ఉత్తీర్ణులయిన వారినే అనుమోదించడం భారతీయ సంప్రదాయంలో అనాదిగా అనుసరిస్తున్న విధానం. మహాభారతంలో ఉత్తమ యోధునిగా, ధర్మవేత్తగా పేరుబడిసిన అర్జునుడు ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని వాటిలో ఉత్తీర్ణుడై అనేక అస్త్రశస్త్రాలను సాధించడమే కాక ఎన్నో అతిమానుష కృత్యాలను నిర్వహించాడు. యోగసాధనలో పురోగతి సాధించి సూర్యునితో సమానమైన తేజస్సంపన్నునిగా పేర్కొనబడ్డాడు. క్రియాశీలిగా, మహత్తర కార్యాలను సాధించాడు. నీతి నియమాల చట్రంలో జీవించి మహాత్మునిగా కీర్తిని పొందాడు. బాధ్యతాయుతంగా ధర్మబద్ధ కార్యక్రమాలను నిర్వహించి తన దీక్షాదక్షతలను ప్రదర్శించాడు.

            విద్యార్జనను వ్రతంగా, నిష్ఠగా, ఉత్సాహంగా పూర్తిచేసి గురువైన ద్రోణాచార్యుల మన్ననలను పొందాడు. ఆ సందర్భంలో ద్రోణుడు ఒకసారి నదిలో స్నానం చేసే సమయంలో అతనిని ఒక మొసలి పట్టుకున్నది. దాని బారి నుండి తప్పుకునే నైపుణ్యం కలిగిన వాడే అయినా ద్రోణుడు శిష్యులకు పరీక్షను పెట్టాలని నిశ్ఛయించుకొని "ఈ మొసలి నుండి నన్ను రక్షించండి" అని శిష్యులను కోరాడు. మొసలి పైకి కనిపించడం లేదు. దానిని కొడితే గురువుగారి కాలికీ దెబ్బతాకవచ్చు.. గురువుకు బాధ కలుగకుండా మొసలిని కొట్టడం అసాధ్యం అని అందరూ వెనుకకు ఒదిగిపోయారు.. కాని అర్జునుడు సన్నద్ధమై ముందుకు వచ్చాడు.. దానికి కారణం.. అర్జునుడు నేను కొట్టగలనని త్రికరణశుద్ధిగా భావించడమూ.. దానికి తగ్గ మానసిక ధైర్యమూ, సాహసమూ, నిర్భయత్వమూ, సాధించాలనే తపన, గురువుపై అచంచలమైన భక్తి, తాను నేర్చిన విద్యపై ఉన్న విశ్వాసములే కారణలుగా చెప్పుకోవాలి. మొసలిని కొట్టాడు. అలా అర్హతను సాధించి గురువు నుండి పలు దివ్యాస్త్రాలను సాధించాడు. అస్త్ర గురువైన ద్రోణాచార్యులు పెట్టిన పలు అర్హతా పరీక్షలలో విచక్షణాబుద్ధి, యోగసాధన, బల పరాక్రమాలను ప్రదర్శించి ఉత్తీర్ణుడైన అర్జునునికి, తన కుమారుడైన అశ్వత్థామకు కూడా ఇవ్వని మహత్తర అస్త్రాలను ద్రోణుడు ఇచ్చాడు.

            పరాక్రమమే కాదు మానవతా పూర్ణుడైన అర్జునునిలో కరుణా స్వభావమూ కనిపిస్తుంది. ఒకసారి పాండవులు ఒక నదిలో స్నానానికి ఉద్యుక్తులైన సమయంలో అంగారపర్ణుడు అనే గంధర్వుడు ఆ నది తనదని అడ్డగిస్తాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో అంగారపర్ణుని ఓడించి అతనికి ప్రాణభిక్షను పెట్టడంతో పాటుగా, మిత్రునిగా స్వీకరించి అతనికి దివ్యాస్త్రాలను ఉపదేశిస్తాడు. ప్రతిగా అతని నుండి చాక్షుషీ విద్యను గ్రహించి మిత్ర ధర్మాన్ని నిలబెడతాడు. ఆ అంగారపర్ణుడే పేరు మార్చుకొని చిత్రరథునిగా ప్రసిద్ధిని పొందాడు.

            ధర్మరాజు భీమార్జునులను రెండు నేత్రాలుగానూ కృష్ణుడిని మనసుగానూ పేర్కొనడం సభాపర్వంలో కనిపిస్తుంది. భీమార్జును లిరువురూ కన్నులే అయినా పలు సందర్భాలలో భీమునిలో ఆవేశమూ, అర్జునునిలో ఆలోచనాపూర్వకమైన స్థిర చిత్తమూ కనిపిస్తాయి. నాయకునిలో ఉండవలసిన మానసిక సమతుల్యతను అర్జునుడు పలు సందర్భాలలో ప్రదర్శించడమూ భారతంలో కనిపిస్తుంది.

            అరణ్యపర్వంలో వేదవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చి పాండవుల అరణ్య, అజ్ఞాతవాసాల పిమ్మట జరగబోయే పరిణామాలను వివరిస్తూ.. కౌరవుల పోషణలో ఉండడం మూలంగా భీష్మద్రోణులు కౌరవుల పక్షాననే యుద్ధం చేస్తారని.. కర్ణ భీష్మద్రోణులనే కాక ఆ పక్షంలో నిలిచిన పలువురిని ఎదుర్కునేందుకు ప్రస్తుతం పాండవుల వద్దనున్న అస్త్రసంపద సరిపోదని అందువల్ల ఇంద్రాది దేవతలను ప్రసన్నం చేసుకొని అస్త్రశస్త్రాలను సంపాదించాలని సూచిస్తాడు. దానికి అనుగుణంగా "ప్రతిస్మృతి" అనే విద్యను ధర్మజునికి ఉపదేశించి దానిని అర్జునునికి ఉపదేశించమని.. దాని ద్వారా దేవతలను దర్శించడం సులువవుతుందనీ, మహేశ్వరుని గూర్చి అర్జునుడు తపించి ప్రసన్నుని చేసుకోవాలని చెపుతాడు. వ్యాసుని ఆదేశానుసారం.. ధర్మరాజు కూడా "ధృతి నియమవ్రతుడునూ, దీక్షితుడు"నైన అర్జునునికి "ప్రతిస్మృతి" విద్యను ఉపదేశించి, తపోయోగ బలంబున ఇంద్రుడిని ప్రసన్నుడిని చేసుకోవలసిందిగా గురుతర బాధ్యతను అప్పగిస్తాడు. ఆ విద్యను అర్జునునికి ఉపదేశించడంలో ధర్మరాజు లక్ష్యం శత్రువులను జయించడమే. దాని ఫలితంగా అర్జునునిలో తదనుగుణమైన విజయకాంక్షాపూర్ణమైన దృఢదీక్ష ఏర్పడుతుంది. యోగసాధనను, తపస్సును చేసి ఇంద్రాది దేవతలను ప్రసన్నం చేసుకొని అర్జునుడు అజేయమైన అస్త్రశస్త్రాలను వరంగా పొందుతాడు. ఎప్పుడైనా విద్యకు రెండువైపులా పదనుంటుంది. దానిని ఏ లక్ష్యంతో సాధిస్తే దానికి అనుగుణమైన ఫలితాన్ని ఇస్తుంది. వ్యాసుల వద్ద ఉన్న సమయంలో ఆ విద్య యుద్ధ సంబంధిత ఫలితాలను కోరలేదు. ధర్మరాజు, అర్జునుల వద్ద మాత్రం దానినే ఫలితంగా కోరింది, దానినే సాధించింది.

            ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వేదవ్యాసుడు ప్రతిస్మృతి విద్యను అర్జునునికే నేరుగా ఉపదేశించక ధర్మరాజుకు ఇచ్చి అర్జునునికి చెప్పమనడంలో ఔచిత్యం ఏమిటి? ధర్మరాజు అర్జునునికి అన్నగానే కాక పాలకుడు కూడా. వచ్చిన వాడు ధర్మం తెలిసిన కృష్ణద్వైపాయనుడు. రాజ్యన్ని పాలించే అధికారిక విధానం, నియమాల పరిమితులు ఉంటాయి (Protocall). దాని ప్రకారం పై నుండి క్రిందికి ఆదేశాలు వెళ్ళడమే ఉచితమైనది.  ఉదాహరణగా గంగాదేవి ఆకాశం నుండి భూమిపైకి రాకుండా శంకరుని జటాజూటం నుండి దిగింది. ఆ క్రమాన్నే పాటించాడని భావించవచ్చు.

            అర్జునుడు తపోభూమిలో తపోనిష్ఠలో ఉన్నా గాండీవాన్ని ధరించి ఉండడం గమనించిన .. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయుధాలను విసర్జించి తపస్సు చేయాలని ప్రబోధించినా అర్జునుడు గాండీవాన్ని విడనాడలేదు. యోధుడు లేదా శస్త్రజీవి తన ఆయుధాన్ని మరణంలో తప్ప విడవకూడదు. ఈనాడూ ఉన్నత సైనికాధికారులు కూడా తమ ఆయుధాన్ని తామే ధరించి తిరుగుతారే కాని ఇతరులకు ఇవ్వరు. చేసిన తపోసాధన ఫలితంగా, ప్రతిస్మృతి విద్యవల్ల ఇంద్రుడు ప్రత్యక్షమై అర్జునుని ప్రలోభపెడుతూ.. పుణ్యలోకాలను అమరత్వాన్ని ఇస్తానన్నా వాటిని కాదని దివ్యాస్త్రాలను మాత్రమే కోరడం లక్ష్యంపట్ల అతని ఏకాగ్ర దృష్టికి అద్దంపడుతుంది. అది అర్జునుని నిబద్ధతకు, కార్య సాధనలోని నియమ పాలనా విశేషానికీ ప్రతీకగా నిలుస్తుంది. ఇంద్రుడు పెట్టిన ఈ పరీక్షలోనూ అర్జునుడు నెగ్గి తన దీక్షను ప్రకటించాడు.

            శివుని గూర్చి తపించే సమయంలో కూడా శివుడు అర్జునుడిని పరీక్షించే క్రమంలో  అర్జునుని అమ్ములపొదిలో బాణాలను మాయం చేసినా భయపడక గాండీవాన్నే ఆయుధంగా చేసుకొని అతనిని ఎదిరించాడు. అది అతని క్షాత్రనిష్ఠకు, విద్యాగ్రహణ దీక్షకు, సవాలు లెదురైన వేళ చూపాల్సిన ధైర్యసాహసాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. తద్వారా పరమశివుని పరీక్షలోనూ నెగ్గి ఆతనిని ప్రసన్నం చేసుకొని పాశుపతంతో సహా పలు దివ్యాస్త్రాలను ప్రయోగ ఉపసంహారాలతో సహా వరంగా పొందాడు. అస్త్రప్రయోగంలో మూడు ముఖ్యమైన అంచెలు లేదా క్రమాలు ఉంటాయి. మంత్ర సహితంగా వింటికి బాణాన్ని సంధానించడం, లక్ష్యాన్ని గురిచూసి ఏకాగ్రతతో విడవడం, అవసరమైన వేళ దానిని ఉపసంహరించడం.. బాణాన్ని సంధానించడం, విడవడం నైపుణ్యంగా పరిగణింపబడతాయి.. కాగా ఉపసంహారం విలుకాని నైతిక, ఆధ్యాత్మిక సాధనపై ఆధారపడి ఉంటుంది. దివ్యాస్త్రాలు ఒక్కొక్కసారి ఎదుటివారినే కాక ప్రయోగించిన వారికీ అపకారం చేయవచ్చు. దానికి ప్రత్యుపకృతి చేయదగిన వనరులను, శక్తిసామర్ధ్యాలనూ సమకూర్చుకున్నాకే అస్త్రాలను ఉపయోగించడం వివేకం కలిగిన వారి లక్షణం.

            అలా శివుని అనుగ్రహంతో దివ్యాస్త్రాలను సాధించిన పిమ్మట ఇంద్రుడూ, ఇంద్రునితో పాటుగా దిక్పలకులూ అస్త్రశస్త్రాలను అనుగ్రహిస్తారు. ఇంద్రుడు తన సారథి మాతలితో రథాన్ని పంపి అర్జునుని పిలిపించుకొని అర్ధ సింహాసనంపై ఆసీనుని చేస్తాడు, అమరావతిలో ఆతిథ్యం ఇస్తాడు. ఆ క్రమంలో ఊర్వశి అర్జునుని పొందుకోరి వస్తుంది. అది అపరాధమని, తానామెను తల్లి భావనతో చూస్తున్నానని, ఆమెతో సంగమించడం అధర్మమని తిరస్కరిస్తాడు. దానికి ఊర్వశి అమరావతి భోగనగరమని అక్కడ వావివరసలు ఉండవని.. అక్కడి ఆచారాలు పాటించాలని చెపుతుంది. నిజానికి ఎక్కడికి వెళితే అక్కడి సంస్కృతిని గౌరవించడం ధర్మమే కాని మన విలువలను తాకట్టుపెట్టి అక్కడి సంస్కృతిని పాటించడం సమంజసం కాదు. ఎక్కడ కాదని చెప్పాలో అక్కడ కాదని చెప్పడానికి మనోనిబ్బరత కావాలి.. ధైర్యం కావాలి. ఆ ధైర్య సాహసాలను, మనోనిబ్బరతను ప్రదర్శించి మరొక పరీక్షను నెగ్గాడు, అర్జునుడు. ఊర్వశి ఎన్ని విధాలుగా చెప్పినా తన మార్గాన్ని విడనాడని అర్జునుని ఆమె కోపంతో నపుంసకునిగా శపిస్తుంది. ఆ విషయం విన్న ఇంద్రుడు వచ్చి అర్జునుని నిష్ఠను మెచ్చి ఊర్వశి శాపాన్ని ఒక సంవత్సరానికి పరిమితం చేస్తూ.. అదీ పాండవుల అజ్ఞాత వాస సమయంలో అర్జునుడు అనుభవించేట్లుగా వరాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాక అమరావతిలో అక్కడి గంధర్వాది దేవతల ప్రసాదంగా నాట్యగాన శాస్త్రాలను అనతికాలంలో అభ్యసించి తిరిగి భూలోకానికి వెళతాడు, అర్జునుడు.

            ఒక ఉదాత్త లక్ష్యాన్ని నిర్ణయించుకున్న సమయంలో ఎంతో నిబ్బరంగా వ్యవహరించ వలసి ఉంటుంది. ప్రజ్ఞాపాటవాలను అసందర్భంగా వినియోగించినా, ప్రలోభాలకు లోబడి నిష్ఠను, విలువలను విడనాడినా పతనావస్థకు చేరుకుంటారు. అచంచలమైన ఆత్మవిశ్వాసానికి, నిరంతర ప్రయత్నానికి, ఏకాగ్ర చిత్తానికి ప్రతీకగా నిలవగలిగిన వ్యక్తులే భౌతిక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు. అయితే సాధించిన శక్తిసామర్ధ్యాలను ఎక్కడ వినియోగించాలో, ఎక్కడ వినియోగించ కూడదో స్పష్టంగా తెలియాలి. అందుకే అర్జునుడు పదునెనిమిది రోజుల యుద్ధంలో.. సైంధవుని తలను అతని తండ్రి చేతిలో పడవేసే అసాధారణమైన కార్యంలో తప్ప ఏనాడూ పాశుపతాన్ని సాధారణ శత్రు సంహారానికై వినియోగించలేదు. ఆ నిబద్ధత, నిబ్బరత లేని అశ్వత్థామాదులు బ్రహ్మశిరోనామకాస్త్రంతో సహా పలు దివ్యాస్త్రాలను అసందర్భంగా వినియోగించడం కనిపిస్తుంది.

            విచక్షణా జ్ఞానంతో కూడిన అర్హతలే వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరిస్తాయి. ప్రగతిని సుగతినీ అనుగ్రహిస్తాయి.. కీర్తి ప్రతిష్టలను పెంచుతాయి.

పాలకుర్తి రామమూర్తి

 

 

 

ఘనతర శోక వేగమునఁ గన్నుల నీళలు నించి, యా సుయో

ధను నవినీతియున్ బిదప ధర్మ తనూజుఁడు సంధి గోరి ప

ల్కిన తగవుం గడంగి యనికిం దలకొన్న నిజోద్యమంబుఁ దోఁ

చిన విధిఁ దిట్టుచున్ వినుతి సేయుచు రోయుచు నుండె నయ్యెడన్!

(మహాభారతం - భీష్మపర్వం - తిక్కన - 3- 156)

 

            అర్జునుని కుమారుడు ఇరావంతుని అలంబసుడు అనే రాక్షసుడు కురుక్షేత్రంలో చంపివేస్తాడు. ఆ విషయాన్ని భీముడు అర్జునునికి చెప్పగా విన్న అర్జునుడు.. పుత్రశోకం భావావేశం పెల్లుబ్బగా.. అధికమైన దుఃఖంతో కన్నుల నీరు ఒలకగా.. ముందుగా దుర్యోధనుడు చేసిన అవినీతిని, అన్యాయాన్ని, తదుపరి ధర్మరాజు ఉదారంగా అయిదూళ్ళిచ్చినా సంధి జరుగుతుందని చెప్పి యుద్ధాన్ని నివారించడానికి చ్సిన ప్రయత్నాన్ని, ఆ పిదప తగుదునమ్మా అని అసహ్యకరమైన యుద్ధానికి సన్నద్ధమైన తన ఉద్యమాన్ని వరసగా జ్ఞాపకం చేసుకొని విధిని తిట్టాడు, ధర్మరాజు న్యాయాన్ని, ధర్మాన్ని ప్రశంసించాడు.. ఆపై తన మూలంగా ఇరు పక్షాలలో జరిగిన మారణకాండను తలచుకొని తనను తాను ఏవగించుకున్నాడు..

            కుమారుడు మరణించాడనగానే.. యుద్ధంలో వీరమరణం సహజమే అయినా పుత్రప్రేమ వల్ల ఘనమైన శోకం కలగడం సహజం.. కలిగింది. భావోద్వేగంతో కన్నులలో నీళ్ళు తిరిగాయి. కారణం ఏమిటి.. ఆలోచన మొదలయింది. యుద్దం విశాలమయింది. ఎవరు ఎవరిని రక్షించాలన్నా అవకాశం కలగవచ్చు.. కలగక పోవచ్చు. తనకు ముందు తెలిస్తే కాపాడుకునే అవకాశం ఉండేది.. భీమాదులకూ ఆ అవకాశం లేకుండా పోయింది. ఆ సమయంలో.. క్రమాలంకారంలో చెప్పిన పద్యంలో మానవ మానసిక వైచిత్రాన్ని... వివిధ సందర్భాలలో వ్యక్తులు స్పందించే భావోద్వేగాల పరిణామాలను ప్రకటించాడు, తిక్కనగారు. ఈ పద్యంలో తిక్కన ధిషణా దీప్తిని గుర్తించాల్సిన అవసరం ఉన్నది.

            ఈ మహా యుద్ధానికి మూల కారణం దుర్యోధనుని దురాశ, ఈర్ష్యాసూయలు, అధికార దాహం, పాండవులపై అకారణ ద్వేషం. ఎన్నో అవమానాలకు గురిచేశాడు.. చంపాలని మాయోపాయాలు చేశాడు.. పాండవ పత్నిని నిండు సభలో పెద్దలు పిన్నలు చూస్తుండగా అవమానించాడు. ఘోషయాత్రలోనూ, ఉత్తర గోగ్రహణంలోనూ తన కుటిలత్వాన్ని చాటుకున్నాడు. న్యాయంగా రావలసిన రాజ్య భాగాన్ని అడిగితే సంజయుని చేత మీకు రాజ్యభాగాన్ని ఇవ్వము.. అడవులలో భిక్షాటన చేయండని చెప్పి పంపాడు.. ఇన్ని అవమానాలే కాక 18 అక్షోహిణుల సైన్యం యుద్ధావనిలో పోరాడేందుకు కారణమయ్యాడు.. ఈ విచక్షణారహిత దుర్నీతిని ప్రదర్శించిన దుర్యోధనుడే ఇంత మంది మరణాలకు కారణమని దుర్యోధనుని పట్ల అసహ్యభావాన్ని చూపాడు..

            యుద్ధం అనర్ధానికి హేతువనే సత్యాన్ని తెలుసుకున్న వాడు కాబట్టే ఆది నుండీ సంధి ప్రయత్నాలతో యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తూ.. తమ ఆవేశ కావేశాలను అణిచి వేస్తున్న ధర్మరాజును తామంతా తప్పుగా అర్థంచేసుకున్నారు. అది అతని చేతకాని తనమని, క్షాత్రధర్మం కాదని భావించారు. కాని మానవతా మూర్తియై శాంతితో, అహింసతో కార్యాన్ని సాధించాలని భావించిన ధర్మజుని ప్రయత్నం నెరవేరితే పెద్దలు, పిన్నలు అంతా సురక్షితంగా ఉండేవారు కదా.. అంటూ ధర్మరాజు సంధి వచనాలను, ఆతని వైఖరినీ ప్రశంసించాడు..

            యుద్ధారంభంలో.. తాను ఇరుపక్షాలలో ఉన్న తనవారిని సంహరించి "తినజాలను నెత్తుటి కూడు మాధవా" అంటూ విశాదాన్ని పొందిన సందర్భాన్ని, దానికి కృష్ణ పరమాత్మ బోధించిన గీతా రహస్యాన్ని అవగాహన చేసుకొని యుద్ధానికి సన్నద్ధమైన వైఖరినీ... తత్ఫలితంగా సంభవిస్తున్న మారణకాండనూ చూస్తూ.. తనపై తనకే ఏహ్యభావన కలుగగా బాధపడ్డాడు.

            తిక్కన గారు మూడు భావాలను సమర్ధవంతంగా ఒక్క పద్యంలో ఇమిడ్చి.. రసపోషణ చేసాడు. మానవ మానసిక స్థితులను విశ్లేషణ పూర్వకంగా అవగతం చేశాడు.

            ఆయుధం యుద్ధాన్నే కోరుతుంది. యుద్ధం ఎప్పుడూ.. మారణకాండనే సృష్టిస్తుంది. దానికి తన పర భేదం ఉండదు. పంచుకోవడంలో ఆనందం ఉంటుంది. పగలు ప్రతీకారాల వల్ల మానవ హననమే జరుగుతుంది. ఆ సత్యం ఆనాటి నుండి నేటివరకూ పాలకులకు అవగతమౌతున్నా ఎవరూ తమ అహంకార మమకారాలకు దూరంగా జరగడంలేదు. అధికార దర్పం ప్రదర్శించే అహంభావం తోటివారిని నీచభావనతోచూస్తుంది. వికాసం చెంద వలసిన శాస్త్రసాంకేతిక ప్రగతి, పరిణతి.. మానవ మారణ హవనానికి ఋత్విజులను పంపుతున్నది. చాలా కాలం క్రితం జరిపిన ఒక సర్వే అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 30000 మందికి పైగా శాస్త్రజ్ఞులు అత్యంత అధునాతన మారణాయుధాలను సృష్టించే ప్రయత్నంలో రోజులు 15 నుండి 18 గంటల పాటు శ్రమిస్తున్నారట. శాస్త్రజ్ఞులు మహర్షుల స్థాయి సాధిస్తే.. వారి పరిశోధనలను ఎక్కడ ఆపాలో తెలుసుకోగలుగుతారు.

            నిజానికి యుద్ధరంగంలో అడుగు పెట్టాక ఎవరు ప్రాణాలతో బయటపడతారు.. ఎవరు శారీరకంగా వైకల్యం పొందుతారు.. ఎవరు మరణిస్తారు.. అనేది నిర్ధారించడం అసాధ్యం. గొప్ప వీరుడూ మరణించవచ్చు.. సాధారణ సైనికులు బ్రకతనూ వచ్చు. జయాపజయాలనూ ముందుగా నిర్ధారించడమే సాధ్యపడదు. ఎవరికోసం యుద్ధం చేస్తున్నారో ఆ నాయకుడే మరణిస్తే..  విజయం అంది వచ్చినా ఉపయోగం ఏమిటి? ఒకవేళ విజయం లభించినా .. కుమారులు, సోదరులూ, అయిన వారు అందరూ మరణించాక ఆ విజయాన్ని ఎవరు ఆహ్వానించాలి, ఆమోదించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి? విశాదాన్ని మిగిల్చే యుద్ధం వల్ల ప్రయోజనం ఏమిటి? రాజ్యాన్ని సాధించినా అది నిరర్ధక విజయమైతే ప్రయోజనమేమిటి? మరణించిన వారి త్యాగానికి చెల్లించే మూల్యమెంత?

            ఆయుధ వ్యాపారంతో ఆర్థికంగా ప్రయోజనాలు పొందాలనుకునే అగ్రరాజ్యాలుగా తమను తాము భావిస్తున్న దేశాధినేతలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దేనికోసం దేనిని వదులుకోవాలో తెలియని అహంకార మదాంధుల వల్ల జరిగే నష్టానికి బాధ్యత వహించేది ఎవరు?

             బెంజ్ కారు లాంటిది.. భారతదేశం.. చెత్తను తీసుకుపోయే ట్రక్కులాంటిది పాకిస్థాన్.. ట్రక్కు కారును ఢీకొడితే.. ట్రక్కుకు వచ్చే నష్టం ఏమీలేదు అన్నాడు, పాకిస్థాన్ సైనిక ఫీల్డ్ మార్షల్.. ఆసిమ్ మునీర్. దుర్యోధనుడు.. ఆసిమ్ మునీర్ లాంటి వాడే.. వాని అవినీతిని సైరించడమూ భావ్యం కాదు.. అలాగని ఎదిరించి పోట్లాడితే వానికి పోయేది ఏమీలేదు. వైఖరి, ప్రవర్తన, ప్రయత్నం, ప్రతిచర్యలు.. ఇవన్నీ ధర్మస్థాపనకు అనుకూలంగా లేనినాడు.. పొందిన విజయమూ నిష్ప్రయోజనమౌతుంది.

            ఇలా ఆలోచించిన కొద్దీ యుద్ధం వల్ల కలిగే కష్టనష్టాలు అవగతమౌతాయి.. అయితే అధర్మం జరుగుతున్న సమయంలో.. బలహీనులు పీడనకు గురౌతున్న సమయంలో.. అరాచకం రాజ్యమేలుతున్న సమయంలో సమర్ధుడైన వాడు ఉపేక్షించడమూ సమంజసమూ కాదు. ప్రతి ఫలితమూ త్యాగాన్ని కోరుతుంది..

            ఇక్కడ కూడా అర్జునుని విశాదాన్ని చూచి కృష్ణ పరమాత్మ చిన్నగా నవ్వాడట.. ఆ నవ్వులోని ఆంతర్యాన్ని గ్రహించిన అర్జునుడు.. శోకభావనను విడిచిపెట్టి కర్తవ్యోన్ముఖుడయ్యాడు.

పాలకుర్తి రామమూర్తి

 

ఆత్మీయులైన సాహితీ మిత్రులకు నమస్సులు..

 

చంచత్తుంగ తురంగ సత్వరగతి స్ఫారీ భవత్కేతనో

దంచద్దీప్తులు ప్రజ్వరిల్ల నతి సాంద్రంబై శరశ్రేణికా

సంచారంబు నితాంత ఘోరముగ నాచార్యున్ వడిన్ దాఁకె న

ప్పాంచాల క్షితిపాల నందనుఁడు శుంభద్వీర్య సంరంభుడై!

(ద్రోణపర్వము - 1-150)

            పాంచాల రాజపుత్రుడైన దృష్టద్యుమ్నుడు ప్రకాశించే వీర్యవంతుడై, అమితమైన సంరంభంతో ద్రోణుడిపై యుద్ధానికి వెళ్ళాడట.. అది ఎలా ఉన్నదో చెపుతున్నారు, తిక్కనగారు. చలిస్తూ ఉన్నటువంటి ఎత్తైన గుర్రముల యొక్క తీవ్రమైన, వేగవంతమైన నడకచేత.. స్ఫారీభవత్.. అధికంగా జనించిన లేదా వేగంగా కదల్చబడిన కేతనము యొక్క.. ఉదంచత్.. గొప్పనైన దీప్తులు లేదా ప్రకాశం అతి సాంద్రంబై  లేదా దట్టమై యొప్పగా.. శరముల శ్రేణి లేదా బాణముల వరస ఎడతెగకుండా వస్తూ ఘోరమైన విధంగా కనిపించగా  దృష్టద్యుమ్నుడు ఆచార్యుడైన ద్రోణుడిని ఎదుర్కొన్నాడు, అంటున్నాడు, తిక్కనగారు.

            వీర రసాన్ని ప్రకాశింప చేస్తున్న ఈ పద్యం తిక్కనగారి భాషా పాండిత్యానికి, కవితా చాతురికీ ఉదాత్తమైన ప్రతీకగా నిలుస్తుంది.

            భీష్ముడు యుద్ధంలో పడిన పిమ్మట కౌరవసైన్యానికి ద్రోణుడిని సర్వసైన్యాధిపతిగా నిర్ణయించాడు, దుర్యోధనుడు. ఆ సందర్భంలో దుర్యోధనునికి ద్రోణుడు ధర్మరాజును పట్టి ఇస్తానని మాట ఇస్తాడు. ఆ ప్రయత్నంలో ద్రోణుడు దివ్యాస్త్రములచేత పాండవ సైన్యంపై చెలరేగి  ఉద్ధతిని చూపడం,  పాండవ సైన్యం అంతా కకావికలై పోవడం గమనించిన ధర్మరాజు దృష్టద్యుమ్నుని, అర్జునుని పిలిచి ద్రోణుడిని ఎదుర్కొనేందుకు నియమిస్తాడు. ఆ సందర్భంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుడిపై దండెత్తిన సమయంలో తిక్కనగారు వ్రాసిన పద్యం వారు ప్రదర్శించిన సమున్నత వస్తు కళకూ, భావకళకూ, రచనాకళకూ దర్పణంగా నిలుస్తుంది.

            దృష్టద్యుమ్నుడు అంతటి వీర రసోల్లాస మూర్తియై ద్రోణుడిపై యుద్ధానికి వెళ్ళేందుకు కారణాలు పరిశీలిస్తే..

1. యువకుడై ఉత్సాహంతో ఉండడం

2. తాను ద్రోణుడిని సంహరించేందుకే జన్మించాననే నమ్మకం..

3. తన సోదరి ద్రౌపదికి కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అవరోధంగా కౌరవసైన్యాన్ని కాపాడుతున్న ద్రోణుడిపై కోపం

4. ద్రుపదుని ద్రోణుడు అవమానించిన విధానం తన మనసులో నాటుకు పోవడం

5. ధర్మపరాయణులైన పాండవులను అధర్మంగా జూదంలో ఓడించి రాజ్యాన్ని అపహరించిన కౌరవులను సమర్ధిస్తున్న వారిపై ప్రతీకారేఛ్ఛ

6. తాను పాండవ సైన్యానికి సర్వసైన్యాధిపతిగా తన బలాన్ని కాపాడుకోవలసిన కర్తవ్య పరాయణత

            వీటన్నింటికీ మూలం.. దృపదుడు.. ద్రోణాచార్యుల పుట్టుకలోనే ఉన్నదని భావించవచ్చు. శుక్రాచార్యుల అంశతో జనించిన వాడు.. ద్రోణుడు కాగా వాయువు అంశతో జనించిన వాడు, ద్రుపదుడు. అందుకే వారి వారి ప్రవృత్తులూ వారి జననాన్ని బట్టి వెలుగు చూచాయి. బాల్య స్నేహితుడు, ఆదరిస్తాడనే నమ్మకంతో రెండు ఆవులను యాచించిన ద్రోణుడి నొకనాడు ద్రుపదుడు అవమానించాడు. నిజానికది అమానుషం.. ఒక చక్రవర్తి రెండు ఆవులను చిన్ననాటి స్నేహితునికి ఇవ్వడం... కష్టమా అంటే కాదు.. పోనీ ఇవ్వనని పంపవచ్చు కాని అంతరాలను అడ్డంపెట్టి అవమానించాడు.. ద్రోణుడైనా బ్రాహ్మణునిగా దానిని మరచిపోవచ్చు. కాని శుక్రాచార్యుల అంశ కారణంగా ద్రోణుడా అవమానాన్ని మరవడమే కాదు ప్రతీకారేఛ్ఛతో  రగిలిపోయాడు. శుక్రాచార్యుని రాక్షసాంశ భీభత్సానే కోరింది. అంతశ్చేతనలో ఆసురీ ప్రవృత్తిని జాగృతం చేసింది. అనువుకాని చోట శమించినా భీష్ముని ప్రాపకంలో కౌరవ పాండవులకు గురువుగా అస్త్రవిద్యను నేర్పి గురుదక్షిణగా ద్రుపదుని పట్టి తెమ్మని శిష్యులను నియోగించాడు. పట్టితెచ్చిన ద్రుపదుని చూడగానే "బ్రాహ్మణస్య క్షణం కోపం" అన్న నానుడికి భిన్నంగా శూలాల వంటి మాటలతో ద్రోణుడు ద్రుపదుని అవమానించాడు.. ద్రుపదుడు అనే గాలి సోకగానే ద్రోణుడనే అగ్ని ప్రజ్వరిల్లింది.. ఫలితంగా ద్రుపదుడు కూడా ద్రోణుడిని సంహరించ గలిగిన కుమారుడు కావాలని తపించాడు. అవమాన జనిత క్రోధానల జ్వలితుడైన ద్రుపదుని మనసులో ద్రోణుడిని సాధించాలనే భావన కారణంగా  హవనాగ్ని గుండంలో దృష్టద్యుమ్నుడనే కుమారుడు ఉదయించాడు. దానితో సహజంగానే ద్రుష్టద్యుమ్నునిలో రౌద్రభావన ఉంటుంది. దానికి పైన పేర్కొన్న కారణాలు తోడై వీరరసోత్తుంగ తరంగ మూర్తియై ద్రోణుడిని తాకాడు.

            ఇంకొక కారణమూ కనిపిస్తుంది. తాను సేనానాయకునిగా ఉన్న సమయంలో తన పక్షంలోని నాయకుని ఎదుటి పక్షంలోని వారు పట్టుకుంటే తన పరాక్రమానికి అవమానకరమూ.. తనకు అపకీర్తి. కాబట్టి ఆ ఆటోపాన్ని చూపుతూ ముందుకు సాగాడు, దృష్టద్యుమ్నుడు. అంతేకాదు అది ఇరువురు సేనానాయకులు పరస్పరం తాకే మహత్తర సన్నివేషం. అందుకే అలాంటి పద్యం వెలుగు చూచింది అనుకోవచ్చు.

            ఇక్కడ మరొక విషయాన్నీ గుర్తించాలి.. ఒకవేళ ద్రుపదుడు తన ప్రవర్తనకు పశ్చాత్తాపాన్నిచెంది ద్రోణుడిని క్షమించమని ఉంటే ద్రోణుడిలో అంతటి తీవ్రమైన అవమాన ప్రతీకారేఛ్ఛ ఉండేది కాదేమో కాని.. ద్రుపదునిలో తన పరాభవం క్రోధానికి బీజం వేయడమే ఇంతటి యుద్ధానికి కారణమయిందని భావించవచ్చు.

            ఇన్ని భావాలను చూపేందుకే తిక్కనగారు సమాసఘటితమైన పద్యాన్ని రచించారు. ముఖ్యంగా "పాంచాల క్షితి పాల నందనుడు" అనడం వల్ల పూర్వ కథ అంతా సూచన ప్రాయంగా స్పురించడం లక్ష్యంగా పై భావాలనన్నింటినీ పలికించాడని భావించాలి.

            ద్రోణుడిలో ఇంతటి భయంకరమైన ఆసురీభావనలు ఉన్నా.. సౌజన్యానికీ కొదువలేదు. తనకు మారకునిగా జన్మించిన దృష్టద్యుమ్నునికి అస్త్రవిద్యను నేర్పినదీ ద్రోణుడే కావడం విశేషం.

పాలకుర్తి రామమూర్తి

 

 

ఆత్మీయులకు నమస్సులు

 

            ద్రోణుడు మూడవనాటి యుద్ధంలో పద్మవ్యూహాన్ని పన్నాడు. పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికేగి ఆపదలు క్రమ్ముకున్న వేళ దానినుండి బయటకు వచ్చే విధానం తెలిసింది పాండవ సైన్యంలో కృష్ణార్జునులకు మాత్రమే. లోనికి వెళ్ళడమే కాని ఆపదలు చుట్టుముట్టిన వేళ బయటకు రావడం తెలియని వాడు అభిమన్యుడు. అర్జునుడు లేని సమయంలో ధర్మరాజును పట్టుకునే వ్యూహంతో ద్రోణుడు ముందుగా సంశప్తకులను ప్రేరేపించి అర్జునుని యుద్ధభూమికి దూరంగా తొలగచేసాడు. దానితో పాండవులు ముఖ్యంగా ధర్మరాజు, అయితే యుద్ధభూమి నుండి తొలగిపోవాలి లేదా అందులో చిక్కుపడాలి. ఆ సమయంలో పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే కాని బయటకు వచ్చే విధానం తెలియని అభిమన్యుడు  సాహసించి అందులో ప్రవేశించాడు.. అతని వెంటే పాండవ సైన్యమూ ప్రవేశించడం పాండవుల వ్యూహం కాని పాండవులు ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం సైంధవుడు అడ్డుపడడంతో నెరవేరలేదు.. కారణం ఏమిటి?

            పద్మవ్యూహమే విచిత్రమైనది. ఎప్పటి కప్పుడు అది మూసుకుపోతూ ఉంటుంది. దానిలోనికి ప్రవేశించేందుకు కాని ఆపదలు చుట్టుముట్టిన సమయంలో వెలుపలికి రావడానికి కానీ పరిమిత ద్వారాలే ఉంటాయి. దానిని సమగ్రంగా తెలియకుండా లోనికి వెళ్లడం ప్రమాదకరమే. అయినా ఓడారనే అపకీర్తికన్నా ప్రయత్నించి అందులో విఫలం కావడమే ఉన్నతమనే భావనతో అభిమన్యుడు దానిని చించి లోనికి వెళ్ళాడు. అయితే అతను లోనికి వెళ్ళగానే ప్రణాళ్లిక ప్రకారం అది తిరిగి మూసుకు పోయింది. అందులోకి వెళ్ళాలంటే పాండవులకు దానిని భేదించే నైపుణ్యం లేదు దానికి తోడుగా సైంధవునికి శివుడు ఇచ్చిన వరమూ ఉపకరించింది. లోపల అభిమన్యుడు ఎంతటి నష్టాన్ని కలిగించినా ద్రోణుడు బయటి నుండి అభిమన్యునికి సహాయం అందకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సైన్య నష్టం జరిగినా పాండవులు అభిమన్యుని లాంటి యోధుని కోల్పోవక తప్పలేదు.

            అభిమన్యుని పరాక్రమం వల్ల తన ముఖ్య యోధులను కాపాడుకోవడంలోనే ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం వచ్చిన ద్రోణుడికి ధర్మరాజును పట్టుకునే అవకాశం చిక్కలేదు. తిరిగిపోలేని పరిస్థితి తెలిసిన అభిమన్యుడూ తనకు వీలైనంత మందిని సంహరించి వీరస్వర్గాన్ని అలంకరించక తప్పలేదు.

            దీని వల్ల మనమేం నేర్చుకోగలం?

1. ఏ పని చేయాలన్నా సరైన వ్యూహాన్ని లొసగులు లేకుండా రచించుకోవడం, దానిని పటిష్టంగా అమలు పరచడం అవసరం

2. ఎవరు ఏ పనికి సమర్ధులో గుర్తించి వారికి అర్హత ప్రాతిపదికగా ఆయా పనులను అప్పగించడం

3. తన సాహసం ప్రాణాంతకమని తెలిసినా చివరవరకూ పోరాడి ప్రయత్నించడం. అందులో ప్రాణాలు పోయినా ఎదుటివారికి ఎక్కువ నష్టం కలిగించడం

4. ఓడిపోకుండా ఉండేందుకు కాదు గెలిచేందుకు పోరాడాలనే దృఢమైన సంకల్పాన్ని కలిగియుండడం

5. ఎంత పటిష్టమైన వ్యూహాన్ని రచించినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకొని దానిని పటిష్టంగా అమలు చేసినా అపజయం ఎదురుకావచ్చు.. అయినా దానిని ఉద్యమ స్పూర్తితో ఆస్వాదించాలే కాని వెనుదిరిగి చూచుకొని బాధపడడం అసమంజసం.. అవివేకము

6. ప్రాధాన్యతా క్రమాన్ని ఎప్పటికప్పుడు అవసరానుగుణంగా మార్చుకోవడం అవసరం.. ద్రోణుని ప్రాధాన్యత ధర్మరాజును పట్టుకోవడం.. కాని అది అభిమన్యుని వధగా మార్పుచెందింది

7. యుద్ధం ఆరంభం వరకే ధర్మాధర్మాల చర్చ.. ఒకసారి ఆరంభమయ్యాక అది గెలుపే పరమావధిగా సాగుతుంది

8. దేని కోసం దేనిని వదులుకోవాలో తెలియడమే విజ్ఞత

పాలకుర్తి రామమూర్తి

 

 

 

అహంకారం పరిమితులను దాటితే అనర్ధమే..

 

 

            ఆద్యమూ, అనంతమూ, సర్వవ్యాపితమైన ఆదిశక్తి తనలాంటి మరికొన్నింటిని పొందాలని సంకల్పించిందట. ఆ సంకల్పంలో ఒకస్థితి నుండి మరొకస్థితికి పరివర్తన చెందే క్రమంలో మహత్తు, అహంకారం, పంచభూతాలు ఆవిష్కృతమయ్యాయి. మహత్తు తన స్వస్వరూపాన్ని, స్వభావాన్ని గుర్తించలేని అజ్ఞానానికి ప్రతీకగా మారింది. అహంకారం "నేను" అనే ఉనికికి లేదా భావనకు చిరునామాగా నిలిచింది. పంచభూతాదులు పదార్ధంగా ఏర్పడి ఆకృతికి దర్పణాలుగా నిలిచాయి. "రయించ ప్రాణంచేతి, రయించ చంద్రమా, ఆదిత్యోహవై ప్రాణాః" అంటుంది ప్రశ్నోపనిషత్తు. చంద్రుడు పదార్ధానికి, ఆదిత్యుడు శక్తికి ప్రతీకలుగా చెపుతారు. శక్తి పదార్ధంగా ఆకృతి తీసుకొని జగత్తుగా, సృష్టిగా ఆవిష్కృతమయింది. దానితో సృష్టికి ఆరంభంలో పదార్ధము శక్తి ఆవిషృతమయ్యాయని తెలుస్తుంది. అనంతమైన శక్తి ఒకచోట ఆకృతి తీసుకుంటే అది పదార్ధంగా రూపుదిద్దికుంటుంది.. అదే పదార్ధంలో నుండి శక్తి తొలగిపోతే అది నిర్జీవమై పంచభూతాలలో కలసిపోతుంది.

            "నేను" అనంతమైన చైతన్యాన్ని అనే స్ఫురణకు దూరమైన వేళ వ్యక్తిలో అస్తిత్వానికి ప్రతీకగా నిలవాల్సిన అహంకారం  అహంభావంగా ప్రకటితమౌతుంది. అస్తిత్వానికి పరిమితమైన  అహంకారం ఆదరణీయమై ఆత్మవిశ్వాసానికి, ధైర్యసాహసాలకు, కార్యావిష్కరణకు ప్రేరణనిస్తుంది. కాని మోతాదును మించితే దానివల్ల ప్రమాదం వచ్చిపడుతుంది. రావణుడు వేదవేదాంగాలను నేర్చాడు. తత్త్వశాస్త్రాలను అభ్యసించాడు. జ్ఞాననిధియై ప్రకాశించాడు. బయట ప్రపంచాన్నీ, అంతశ్చేతనలోని జగత్తునూ దర్శించగలిగాడు. తనపర భేదంలేని మనోభావనలో సకల జీవరాసులలో జీవచైతన్యాన్ని దర్శించగలిగాడు. సకల జీవ సౌభ్రాతృత్వాన్ని, సమస్త జీవ కల్యాణాన్ని కాంక్షించే స్థితికి ఎదిగాడు. అప్పుడు అంతకన్నా మించినది ఏదో సాధించాలనే తపనలో బ్రహ్మను ఉద్దేశించి గొప్ప తపస్సు చేసాడు.. బ్రహ్మ వరాలను కోరుకొమ్మనగానే తాను సాధించిన తత్త్వాన్ని విస్మరించి.. భౌతిక జగత్తు శాశ్వతమనే భ్రమలో అజ్ఞానమయమైన వరాలను కోరాడు, వాటినే పొందాడు. ఇప్పుడతనిలో శ్రేష్ఠమైన జ్ఞానజీవితంపై అహంభావమనే ముసుగులు క్రమ్మి ఆధిక్యతా భావనలను తట్టిలేపాయి. భౌతిక జీవితంలో ప్రతి గెలుపూ అతనిలోని అహంభావాన్ని మరింతగా పెంచింది. భగవత్తత్త్వంపై తనకున్న అవగాహన, సాధించిన దివ్యత్వం, విజ్ఞానం వీటి ప్రకాశాదులు.. కన్నుమిన్నూ కానని అహంభావ రాహుగ్రస్తమై.. అహంభావ ప్రకటను నిలయాలయ్యాయి. ప్రపంచాన్ని చుట్టివస్తూ పాలకులందరినీ యుద్ధానికి ఆహ్వానించడం, వారిని ఓడించడం లేదా సంహరించడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. నచ్చిన స్త్రీలను చెరబట్టాడు. బంధుత్వాన్నీ విస్మరించి విచ్చలవిడిగా ప్రవర్తించాడు.

            ఆ క్రమంలో మానవులను, వానరులను తృణప్రాయంగా భావించి చేసిన దండయాత్రలలో దక్కిన విజయాలు ప్రేరణగా.. పెల్లుబికిన అహంభావనతో కార్తవీర్యార్జునుని యుద్ధానికి ఆహ్వానించి ఓడి బంధీగా చెరసాలలో మ్రగ్గాడు. తదుపరి రావణుని తాత పులస్త్యుడు కార్తవీర్యుని యాచించి రావణుని బంధవిముక్తుడిని చేయడం దానితో రావణుడు అతనితో స్నేహం చేస్తాడు. అంతతో ఆగక వానర రాజైన వాలి తూర్పు సముద్రంలో సంధ్యావందనం ఆచరిస్తున్న సమయంలో వెనుక నుండి వెళ్ళి అతనిని ఎత్తి సముద్రంలో పడవేయాలని భావించాడు. ఆ ప్రయత్నాన్ని కనిపెట్టిన వాలి అప్రమత్తుడై రావణుని చంకలో ఇరికించుకొని నాలుగు సముద్రాలలో ముంచి తన రాజ్యమైన కిష్కింధకు తీసుకువచ్చాడు. తదుపరి వాలితో స్నేహం చేశాడు.

            పై రెండు ఉదాహరణలూ.. ఎంత జ్ఞానియైనా అమితమైన అహంభావం కనులను క్రమ్మి అంధకారాన్ని ప్రసాదిస్తే ఎదుటివారి బలాబలాలను గుర్తించలేక పతనావస్థకు చేరుకుంటాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇహపరాలను సాధించాలనుకునే వ్యక్తి అహంబావాన్ని వదిలివేయాలి. ప్రజ్ఞ జాగృతమైతే జీవిత పరమార్ధం బోధపడుతుంది. సమతాదృష్టి అలవడితే వికసన విస్తరణగా.. వ్యాప్తంగా పరిణామం చెందుతుంది. అలాకాని నాడు ఎంతటి విజ్ఞానియైనా ఇహపరాలకు దూరమౌతాడు. వ్యక్తి జీవితంలో అంగబలం, అర్థబలం, అధికారమదం అహంభావానికి ఆజ్యంపోస్తే.. ఫలితంగా పతనావస్థ పలకరిస్తుంది.. అందుకే ఆదరంగా పలకరించే అహంబావ మమకారాలను పరిమితం చేసుకొని జీవితాలను ఉన్నతీకరించుకోవడం ఆదరణీయం.

పాలకుర్తి రామమూర్తి

           

 

గురువు యొక్క ప్రాముఖ్యత

 

ఏకమేవాక్షరం యస్తు గురుః శిష్యం ప్రబోధయేత్

వృథివ్యాం నాస్తి తద్రవ్యం యద్దత్వా చాఽనృణీ భవేత్!

(చాణక్య నీతి - 15- 2)

            గురువు ఒక్క అక్షరం నేర్పినప్పటికీ, ఈ భూమి మీద ఆ గురువు ఋణాన్నుండి విముక్తి కలిగేందుకు ఇవ్వగలిగిన విలువైన వస్తువు ఏదీ లేదు, అంటారు ఆచార్య చాణక్య. ఈ శ్లోకం ద్వారా ఆచార్య చాణక్య గురువు పట్ల శిష్యులకు ఉండాల్సిన కృతజ్ఞతా భావనను, గౌరవ ప్రతిపత్తులను తెలియ జేస్తున్నాడు. ఒక్క అక్షరం కూడా వ్యక్తి జీవితంలో పెను మార్పులకు నాంది పలుకుతుంది. ఆ అక్షర స్వరూపాన్ని స్వభావాన్ని తెలియచేసేవాడు గురువు. సాధకులను తరింపచేసే ఒక్క అక్షరం.. ఓంకారము కూడా.

            గురువు వ్యక్తికాదు. గురువు ఒక శక్తి. అఖండామైన మండలాకారంలో అంతటా వ్యాపించిన గురువు అర్హతను అనుసరించి  ఉన్న స్థితినుండి ఉన్నతస్థితికి మార్గాన్ని చూపుతాడు. శిష్యుడు సాధన ద్వారా ఆ మార్గంలో తాను నిశ్చయించుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి. గురువు సజీవుడైనా కాకపోయినా శిష్యుని ఉన్నతికి సహాయకారియై నిలుస్తాడు. తరించగలిగిఅన విద్యను ప్రకాశితం చేస్తాడు. స్పురింప చేస్తాడు. అందుకే గురువు ఆరాధనీయుడు. అక్షరం అంటే నాశనం లేనిది. అదిుగురమ్మల మూలపుటమ్మ పదం మాత్రమే. అక్కడి నుండే వచ్చాము.. అక్కడికి వెళ్ళడమే మానవ జీవన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో సాగే ప్రయాణంలో ఎదురుగా అంతా చీకటియే.. ఆ చీకటియే అజ్ఞానం.. దానిని అధిగమింప చేసే ఒక్క అక్షరమైనా అక్ష్యమై జన్మసార్ధకత్వానికి మార్గం సుగమం చేస్తుంది.

            ఆ మార్గాన్ని చూపే గురువును ఆరాధించడం ఆ పరమేశ్వరిని ఆరాధించడమే. గురుపౌర్ణిమ సందర్భంగా గురు పరంపరను స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ.. ముందుకు సాగడమే కర్తవ్యం.

            కృతజ్ఞతా పూర్వక నమస్సులు..

పాలకుర్తి రామమూర్తి

 

మృత్యుస్పర్శ

 

            శీలాన్ని, జ్ఞానాన్ని పెంచి పోషించేది విద్య. ఉపనిషత్తులు విద్యను జీవితంపట్ల స్పష్టమైన దృక్పథంగా చెపుతున్నాయి. చిత్తశుద్ధి, సంకల్పబలాన్ని పెంచుకోవడం, ఉదాత్తమైన భావనలను జాగృతం చేసుకోవడం లక్ష్యంగా గురుశిష్యులు పరస్పరం విశ్వాసంతో సహకరించుకొని చేపట్టే ఉద్యమమే విద్యాభ్యాసం. విద్యాభ్యాసం.. గ్రహింపుశక్తిని పెంచి, మనసును నిర్మలంగా, ప్రశాంతపరుస్తూ జ్ఞానార్జనకు సన్నద్ధం చేసే ప్రక్రియకు తొలిమెట్టు. జీర్ణమైన ఆహారం ఎలాగైతే పుష్టినిస్తుందో.. అలాగే ఆకళింపు చేసుకోగలిగిన విద్య వికాసానికి, అభ్యుదయానికి ఉపకరిస్తుంది. అలాంటి విద్యాభ్యాసానికి గురువు స్పూర్తినిస్తాడు, శిష్యుడు స్పూర్తిని పొందుతాడు. ఒక దీపంతో మరొకదీపాన్ని వెలిగించిన విధంగా గురువు శిష్యునిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.. గురుశిష్యులు జ్ఞానవ్యాప్తిలో ఉపకరణాలుగా ప్రపంచానికా వెలుగులు పంచుతారు.

            కఠోపనిషత్తులో వాజశ్రవసుడు (ఉద్ధాలకుడు) అనే ముని విశ్వజిద్యాగం చేస్తాడు. అందులో తనకున్న సర్వస్వాన్ని దానం చేస్తున్న సమయంలో.. తానూ తండ్రి సంపదలో భాగమని భావించిన అతని కుమారుడు నచికేతుడు.. నన్నెవరికి ఇస్తావని పదేపదే అడగుతాడు. దానికి తండ్రి విసుగుతో "మృత్యువు"కు ఇస్తానంటాడు.

            మృత్యువు అంటే సాధారణంగా మరణం అనుకుంటాము. కాని మృత్యువు అంటే గురువు లేదా ఆచార్యుడు. "ఆచార్యో మృత్యుః" అంటుంది, అధర్వవేదం. అజ్ఞాన భరితమైన భౌతిక శరీరాన్ని దగ్ధం చేసి, జ్ఞాన శరీరాన్ని ప్రసాదించేవాడు, ఆచార్యుడు. అతడే మృత్యువు. సాధకుడు, అజ్ఞాన శరీరాన్ని విడిచి జ్ఞాన శరీరాన్ని ధరించే సంధి సమయంలో సాధకునికి మృత్యుస్పర్శ కలుగుతుంది. అది తెలిసి గాని తెలియక గాని కలగవచ్చు.

            తండ్రి మాటను అనుసరించి నచికేతుడు యముని ఇంటికి వెళతాడు. యముడిని యోగాచార్యునిగా భావించవచ్చు. అప్పుడు యముడు ఇంటిలో లేకపోవడంవల్ల అక్కడ మూడు రాత్రులు ఉపవసించిన నచికేతునికి యముడు  వచ్చాక మూడు వరాలను ఇస్తానంటాడు. దానికి నచికేతుడు, తండ్రికి తనపై ప్రేమాభిమానాలు కలగాలని, మొదటివరంగానూ, స్వర్గానికి తీసుకువెళ్ళే అగ్నిని గూర్చిన విద్యను రెండవ వరంగానూ కోరగా యముడు అనుగ్రహిస్తూ.. ఇకపై ఆ ఆగ్నిని నచికేతాగ్నిగా వ్యవహరిస్తారని చెపుతాడు.

            సత్యాన్వేషణ లక్ష్యంగా, నచికేతుడు మనిషి మరణం తదుపరి ఏమి జరుగుతుంది, ఆత్మ ఏమవుతుందో తెలుపమని మూడవవరంగా కోరుతాడు. దానికి యముడు.. పిన్నవాడివి గంభీరమైన గహనమైన తత్త్వాన్ని కాక మరొకవరం కోరుకొమ్మంటాడు. అయితే పరిపక్వ మనస్కుడు, సూక్ష్మగ్రాహి, దృఢచిత్తుడునైన నచికేతుడు.. జ్ఞానాఢ్యుడైన ఆచార్యుడు ఎదురుగా ఉన్నప్పుడు అల్పవిషయాలను అడగడం సమంజసం కాదంటూ.. ఆత్మస్వరూప స్వభావాలను మాత్రమే బోధింపవలసిందిగా ప్రార్థిస్తాడు. యముడు ప్రలోభాల రూపంలో నచికేతుడిని ఎన్నో విధాలుగా పరీక్షించి.. మానవుడి అంతరంగ మర్మాన్ని తెలుసుకోవడంలో నచికేతుని  శ్రద్ధను, జిజ్ఞాసను గుర్తించి.. చివరగా, నిత్యశుద్ధము, నిత్యబోధము, నిత్యముక్తము, అత్యంత రహస్యమూ, అత్యున్నతమూ నైన పరతత్త్వ జ్ఞానాన్ని బోధిస్తాడు. ముఖ్యంగా ప్రేయోమార్గాన్ని శ్రేయోమార్గాన్ని వివరించి అందులో శ్రేయోమార్గం శాశ్వతమైన బ్రహ్మానందాన్ని అనుగ్రహిస్తుందని చెపుతాడు.. జీవుడు శాశ్వతుడనీ, పదార్ధరూపమైన శరీరం పతనమయ్యాక ప్రాణశక్తి సహాయంతో మరొక శరీరంగా పరివర్తన చెందుతాడంటాడు.       

            శ్రద్ధ అంటే అస్తిత్వంపై, ఆత్మబలంపై అపారమైన నమ్మకం.. సత్యంపట్ల, ధర్మంపట్ల సడలని విశ్వాసం. సాధారణంగా ఇంద్రియాకర్షణ శక్తి మానవులను సత్యధర్మాల నుండి తప్పుకునేందుకు ప్రేరణనిస్తుంది. ఇంద్రియాల ఔద్ధత్యాన్ని శమింపచేస్తేనే ఆత్మబలం ఉద్దీపనమౌతుంది.

            జిజ్ఞాస అంటే క్రొత్త విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక, అమితమైన అసక్తి, క్రొత్తదానితో సమన్వయం చేసుకునే ఉత్సాహం, సృజనాత్మకత.. ఆ దారిలో అన్వేషణ, అభ్యాసం, అభివృద్ధి. శద్ధా జిజ్ఞాసలు శాస్త్రీయ ఆవిష్కరణలకు ప్రతీకలుగా నిలుస్తాయి.

            భౌతిక ఆధ్యాత్మిక జీవితాలకు ప్రగతిని సుగతిని చూపుతూ.. ప్రేయస్సును, శ్రేయస్సును సమన్వయం చేసుకునే ప్రక్రియలో అశాశ్వతమైన అజ్ఞాన శరీరాన్ని దగ్ధం చేసి శాశ్వతమైన జ్ఞాన శరీరాన్ని అనుగ్రహించే మృత్యుస్పర్శను అవగతం చేయిస్తున్నది, కఠోపనిషత్తు.

పాలకుర్తి రామమూర్తి