Friday, August 15, 2025

 

ఆత్మీయ సాహితీ మిత్రవరులకు నమస్సులు..

 

ప్రయత్నశీలతయే విజయం

 

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజింతు రురు విఘ్నాయత్తులై మధ్యముల్

ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై

ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమా ప్రజ్ఞానిధుల్ గావునన్ !

            అన్నారు ఏనుగు లక్ష్మణ కవి. లక్ష్మణకవి వ్యక్తులను మూడు రకాలుగా గుర్తించారు. విఘ్నాలు కలుగుతాయని ముందే ఊహించి భయంచేత ఆ పనినే చేయరట కొందరు.. కొందరు ఆరంభిస్తారు కాని ఏ విధమైన అడ్డంకులు ఎదురైనా దానిని అక్కడితో ఆపేస్తారట. మరికొందరు మాత్రం ఏ పనిని ఆరంభించినా ఆ పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడకుండా ధైర్యంతో, ఉత్సాహంతో చివరకంట లక్ష్యం కోసం శ్రమిస్తారట. వారినే కార్య సాధకులుగా చెపుతారాయన.

            ప్రజ్ఞ అంతర్గత చైతన్యం. అది సుషుప్త్యావస్థలో ఉంటే.. వ్యక్తిలో వికసన ఉండదు. అది జాగృతమైన వేళ అసాధ్యాలు సుసాధ్యమౌతాయి. ప్రజ్ఞ ఏ వ్యక్తిలో ఎంతమేరకు ఉంటుంది. ప్రజ్ఞ అందరిలో సమంగానే ఉంటుంది.. అయితే ఎవరిలో ధైర్యం ఉత్సాహం పాలు ఎక్కువ ఉంటాయో వారు ప్రజ్ఞను ఎక్కువగా ఉపయోగించుకో గలుగుతారు. అందుకే వారిని ప్రజ్ఞానిధులు అంటాడు, లక్ష్మణకవి. అలాంటివారి నిఘంటువులో అసాధ్యమనే పదం ఉండదు.. ప్రయత్నమే వారికి తెలిసిన పదం. ఒక మార్గంలో అపజయం ఎదురైతే మరొక మార్గంలో ప్రయత్నించడం.. చివరగా సాధించడమే వారికి తెలిసిన విద్య.

            సాధారణంగా ఏ పనినైనా ఆరంభించి సాకారం కాకపోతే ఆ కారణాన్ని ఎవరిపైనో నెట్టివేయాలనే భావన చాలామందిలో కనిపిస్తుంది. వ్యక్తులపై నెపాన్ని రుద్దకపోయినా.. కనీసం ప్రారబ్ధకర్మల ఫలితంగా నేను అపజయం పాలయ్యానని చెప్పుకుంటారు. వారికి కార్య సాఫల్యత కన్నా సానుభూతి కావాలి. దానికి ఉపపత్తిగా "భాస్కరా" శతకంలో మారన చెప్పిన "ఎంతగా ఆశపడినా అల్పమతియైన నక్కకు ఏనుగు కుంభస్థలము మీది మాంసము దొరకదుగదా... అదే సింహము అనుకుంటే లభిస్తుంది" అన్న ఉపమానాన్ని ఉదహరిస్తారు.

            పైపైన చూస్తే ఇది ఒకవిధంగా అదృష్టాన్ని ఉన్నతంగా చెప్పడం వల్ల యువత కొద్దిగా నిరాశపడే విధంగా కనిపిస్తుంది. కాని అంతర్లీనంగా మారన చెప్పిన చక్కని సూక్తిని విస్మరిస్తున్నారు చాలామంది.

            జీవిత ప్రయోజనాన్ని గుర్తించకపోవడం, నిర్దిష్టమైన లక్ష్యం లేకపోవడం, పట్టుదల లేమి, అవగాహనా రాహిత్యం, ప్రయత్నహీనత, బలమైన సంకల్పం లేకపోవడం, ఆచరణాత్మక జ్ఞానాన్ని ఆర్జించకపోవడం, క్రియాశీలత లోపించడం, తనలో నిక్షిప్తమైన ప్రజ్ఞాపాటవాలను గుర్తించక పోవడం, కాలానుగుణంగా వస్తున్న ఆధునిక శాస్త్రసాంకేతిక విజ్ఞానాన్ని ఆహ్వానించలేక పోవడం, అన్వయించుకోలేక పోవడం, "మార్పు"కనుగుణంగా మారకపోవడం... ఇవన్నీ వ్యక్తిని నిర్వీర్యతకు, నిష్క్రియాపరతకు గురిచేసే అంశాలే. వీటినే అల్పత్వాలుగా చెప్పుకోవాలి. ఈ స్థితిలో ఏ వ్యక్తికీ పరిణతి రాదు... విజయం సిద్ధించదు. అలాంటి వ్యక్తికి పరులపై ఆధారపడడం, పరులను మోసగించి ఆనాటికి పబ్బం గడుపుకోవడం లక్షణాలుగా... ఏదో విధంగా బ్రతకడం అలవాటుగా మారుతుంది. నక్కకు ఈ లక్షణాలు అన్నీ ఉండడమే కాక... పరులపై ఆధారపడి బ్రతికే బానిస జీవన విధానం లక్షణమైంది.

            అదే సింహం... తనకు తానుగా వేటాడి భుజిస్తుంది, మరొక జంతువుకు భుక్తినిస్తుందే కాని ఎవరో అయాచితంగా ఇచ్చే భోజనానికి ఆశపడదు. నిరంతర ప్రయత్నం దాని లక్షణం. తాను సాధించగలననే నమ్మకం ఉండడం వల్ల దాచుకోవడం.. దోచుకోవడం దానికి లేదు. తన అవసరానికి మించి ఆశపడదు. ఉన్నతమైన లక్ష్యం ఏర్పరుచుకుంటుందే కాని... చిన్న చిన్న విజయాలతో సంతృప్తి చెందదు. ఒక విజయాన్ని మరొక విజయానికి ప్రేరణగా స్వీకరిస్తుందే కాని.. అదే అంతిమమని విశ్రాంతిని కోరుకోదు.

            జీవిత ప్రయోజనాన్ని గుర్తించిన యే వ్యక్తియైనా సమున్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటాడు. దానిని సాధించే క్రమంలో  అడ్డంకులు ఎదురైనా దానిని విడిచిపెట్టడు.. అపజయాలలో తాను ప్రేరణను పొందుతాడు.. అనుచరులను, అనుయాయులను భాగస్వాములను చేసుకుంటాడు. వారు నిరుత్సాహపడినా వారికి అవసరమైన ప్రేరణ నిస్తాడు. ఎన్ని కఠినమైన పరీక్షలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమై నిలుస్తాడు. తాను ఉదాత్తమైన నాయకత్వ లక్షణాలను సంతరించుకుంటాడు.  ఆ లక్షణాలను ప్రదర్శిస్తాడు. అనుచరులలో నాయకత్వ లక్షణాలను నింపుతూ స్పూర్తినిస్తాడు.. రెండవ స్థాయి నాయకులను తయారుచేస్తాడు. సాధించిన ఫలితాన్ని పంచుకుంటాడు, పెంచుకుంటాడు.. పదుగురి శ్రేయస్సుకై వినియోగిస్తాడు.

            మానవులు ఎప్పుడూ ప్రయత్నశీలురై ఉంటే దైవ సహాయం లభిస్తుంది. భూమిని దున్ని, విత్తనాలు విత్తి, కలుపుతీసి, నీరు పెట్టిన రైతుకు దైవ సహాయం అందుతుందే కాని అంతా భగవంతుడే చూచుకుంటాడని కూర్చుంటే ఫలితం లభించదు. అదృష్టం కృషిచేసిన వాని వెంటనే ఉంటుంది కాని చిత్తశుద్ధితో పనిచేయని వాని వెంట ఉంటుందను కోవడం అవివేకం.. ప్రయత్నశీలత పరివర్తనకు దారిచూపుతుంది.

            రెండు పొటేళ్ళు పోట్లాడుకున్న సమయంలో బలహీనమైనది వెనుకకు తగ్గుతుంది, అంటుంది యోగవాసిష్ఠం. అలాగే మానవ ప్రయత్నం, ప్రారబ్ధకర్మ ఫలితం.. పోట్లాడుకున్న సమయంలో ఏది బలీయమైనదో అదే గెలుస్తుంది. కాబట్టి ప్రారబ్దమంటూ, ప్రయత్నాన్ని విడిచిపెట్టడం అవివేకం.. అప్రశస్తం.

            అర్హత ప్రాతిపదికగా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడం... ఆవైపు సర్వశక్తియుక్తులను ఒడ్డి ప్రయత్నించడం అవసరం... ఆ ప్రయత్నశీలతయే సింహలక్షణము.. అదే అదృష్టం... ఆ ప్రయత్నశీలతకు దూరమవడమే అల్పత్వం.. నక్క లక్షణం. నక్క అర్హతను పెంచుకోవడం వల్ల సింహసదృశమౌతుంది...

            విఘ్నాలు కలుగుతాయని ఆరంభింపక పోవడానికి కారణం.. అవిద్య లేదా విద్య లేకపోవడం. విద్యనే జ్ఞానం అందాము. అయితే విద్య లేదా జ్ఞానం.. వీటిని నేనిక్కడ తాత్వికంగా చెప్పడంలేదు. లౌకిక వస్తు, విషయ పరివర్తన మూలకారణమే జ్ఞానం... జ్ఞానం, నైపుణ్యం రెండూ కలిగిన వ్యక్తి అహంకారాన్ని వదిలివేస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కార్యాన్ని సాధిస్తాడు. To do RIGHT THING is Knowledge.... and To do the THINGS RIGHT is SKILL.. Efficiency (ప్రతిభ-- దానినే జ్ఞానం అందాము) is defined as the ability to accomplish something with the least amount of wasted time, money, and effort or competency in performance. Effectiveness (ప్రభావశీలత.. దానినే నైపుణ్యం అందాము) is defined as the degree to which something is successful in producing a desired result; success. పరివర్తన... Transformation... మార్పు... Change..

            అందరికీ నమస్సులతో...

పాలకుర్తి రామమూర్తి

 

స్వీయ అవగాహన..

 

క్షత్రియుఁ డోడునే? తగదు కౌరవ రాజ, యొకండ నేఁ బృథా

పుత్రులలోనఁ బిన్న; నినుఁ బోరికిఁ బిల్వగ, మాని నాఁగ ని

ద్ధాత్రిఁ బ్రసిద్ధి కెక్కి బల దర్ప సమగ్రుఁడవైన నీవు నీ

మిత్రులుఁ గూడ నిట్లయిన మెత్తురె? వత్తురె కొల్వ భూభుజుల్!

(విరాటపర్వం - తిక్కన - 5- 203)

 

            వ్యక్తి ఒక కార్యాన్ని సంకల్పించిన సమయంలో తనా కార్యాన్ని సాధించగలడా.. అవకాశాలు, అవరోధాలు ఎలా ఉన్నాయి. తన బలాబలాలు ఎలాంటివి.. ఎదుటి వారి బలాబలాలు ఎంత.. కార్య సాధనలో లాభనష్టాలు ఎలా ఉంటాయి.. వీటి గూర్చిన ఖచ్చితమైన అంచనాలతో ముందుకు సాగాలి. అయితే కొన్ని మార్లు ఆ అవకాశం ఉండకపొవచ్చు. మన ప్రమేయం లేకుండానే మనమా కార్యంలో భాగస్వామ్యులం కావాల్సిన అవసరం రావచ్చు.

            స్వీయ-అవగాహన అనగా మన నమ్మకాలు, ఆలోచనలు, భావనలు, భావోద్వేగాలు మరియు ప్రవర్తనలను సరిగా అంచనా వేసుకొని, అర్థం చేసుకునే సామర్థ్యం. ఇది మనం తీసుకునే సంక్లిష్ట నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, ఇతరులతో మన సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకునే విధానానికి ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాక, స్వీయ అవగాహన అంటే.. మనపై ఇతరుల ప్రభావం ఎంత? మనలను ఇతరులు ఎలా ప్రభావితం చేస్తారో అవగాహన చేసుకునే సామర్ధ్యం కూడా.  అందులో వ్యక్తి బలాలు, బలహీనతలు, విలువలు ప్రతిబింబిస్తాయి. అలాగే ఇతరులు మనలను ఎలా అంచనా వేస్తారు, గుర్తిస్తారో అంచనా వేసుకునే భావనా ఉంటుంది. ముఖ్యంగా, స్వీయ అవగాహన మనలను గూర్చి మనం లోతుగా తెలుసుకోవడమే కాక  మన అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంగా భావించవచ్చు.

            ముఖ్యంగా వ్యక్తిగత అభ్యున్నతికి స్వీయ అవగాహన ప్రామాణికమైన కొలమానంగా నిలుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచి.. మరింత ఉన్నత బాధ్యతను భుజానికి ఎత్తుకునేందుకు ప్రేరణగా నిలుస్తుంది.

            మహాభారతంలో విరాటపర్వంలో ఉత్తర గోగ్రహణ సన్నివేశంలో అర్జునుడు ఒక్కడే కౌరవ సైన్యాన్ని ఎదిరించి గెలిచిన సన్నివేశం కనిపిస్తుంది. ఆ సందర్భంలో అర్జునునికి తనపై తనకున్న స్వీయ అవగాహన.. పరోక్షంగా కనిపిస్తూనే.. ఎదుటివారిని అధిక్షేపించే విధానమూ కనిపిస్తుంది.

            ఓ కౌరవ రాజా! దుర్యోధనా! నీవు క్షత్రియుడవు.. అందునా మాన ధనుడవు. యుద్ధానికి వచ్చిన వేళ క్షత్రియుడు ఎక్కడైనా ఓడి పారిపోతాడా? ఇటు వైపు నేనా ఒక్కడిని.. అందునా కుంతీ పుత్రులలోన కూడా చిన్నవాడిని.. మరి నీవో.. అపార సేనా వాహినితో అతిరథులైన విత్రులతో యుద్ధానికి సన్నద్ధుడవై వచ్చిన వాడివి. బలం దర్పం సమగ్రంగా కలిగిన వాడిననే అభిమానం కలిగిన వాడివి.. నా కన్నా పెద్దవాడివి.. యుద్ధానికి పిలుస్తుంటే.. కాదని తగుదునమ్మాయని పారిపోవడం గౌరవప్రదమా.. రేపు నీ మిత్రులు, సామంతులైన రాజులు వచ్చి నిన్ను సభాంగణంలో సేవించడానికి వస్తారా.. గౌరవిస్తారా? ఆలోచించమని.. ఎద్దేవా చేస్తూ.. దుర్యోధనుని అధిక్షేపిస్తున్నాడు, అర్జునుడు.

            విరాటపర్వంలో ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుని పరాక్రమానికి తట్టుకోలేని కౌరవసైన్యం.. భీష్మద్రోణకర్ణాది యోధులతో సహా యుద్ధభూమిని విడిచి పారిపోవడం, వారి వెంటబడి తరుముతూ అర్జునుడు దుర్యోధనుని పరిహసించడం కనిపిస్తుంది.

            మిత్రులు.. అనడంలో అధిక్షేపం ఉన్నది. కర్ణుడు అర్జునునికి సరిజోదుగా భావించిన దుర్యోధనుడు పాండవులతో కయ్యానికి ఉపక్రమించాడు. కాని తన ప్రాణానికన్నా మిన్నగా భావించిన కర్ణుడు ఘోషయాత్ర సందర్భంలో తనను విడిచి పారిపోవడం.. ఈ యుద్ధంలోనూ పారిపోవడాన్ని అన్యాపదేశంగా చెపుతున్నాడు, అర్జునుడు. కష్టకాలంలో మిత్రుడిని విడిచి తన మానాన తాను పారిపోవడం మిత్రధర్మం కాదు. ఆ మాత్రం తెలియని కర్ణుని నమ్మి అపార బలపరాక్రమాలు కలిగిన మాతో కయ్యానికి కాలు దువ్వడం అవివేకమనే వ్యంగ్యమూ ఉన్నది.

            క్షత్రియుడు శస్త్రజీవి. ప్రజలకు రక్షణనివ్వడం అతని కర్తవ్యం. ఆపత్తులు సంభవించిన సమయంలో ప్రాణాలకు తెగించి ఉద్యమించాలి. ఆ కర్తవ్య నిర్వహణా దీక్షలో విజయమో వీరస్వర్గమో క్షత్రియుని ఉచితమౌతుంది కాని వెన్ను చూపి పారిపోవడం క్షాత్ర లక్షణం కాదు.. కానేరదు. మానం ప్రాణానికన్నా మిన్న యని భావించే క్షాత్రం.. పారిపోవడానికి ఒప్పుకోదు. అందునా.. మాన ధనుడనని చెప్పుకుంటున్న నీ వంటి వారు పారిపోయి అపకీర్తి పాలవడం కౌరవ యశస్సును మంటగలపడం కాదా.. అనే అధిక్షేపణ కనిపిస్తుంది.

            ఓడునే.. అంటే.. భయపడునా అని భావన. భయం అపజయానికి తొలి మెట్టు. భయం ఆలోచనను మ్రింగివేస్తుంది. అవకాశాలను గుర్తింపనీయదు. భయం వల్ల హేయమైన సందిగ్ధత, దాని వల్ల అనుమాన మేఘాలు క్రమ్ముకొని కర్తవ్యాన్ని విస్మరించేందుకు పురికొల్పుతాయి.

            తగదు కౌరవరాజా! కౌరవ వంశం ఉదాత్తమైన పరాక్రమానికి పేరుపొందినది. నీవు పారిపోయి దానికి అపకీర్తి మచ్చను అంటించడం తగదు. వంశ ప్రతిష్ఠను దిగజార్చే పనులు చేయడం ఉత్తమ వంశ సంజాతులకు తగదు. అది అసమంజసం కూడా.. మంచి పనులు చేసిన వ్యక్తి బ్రతికి యున్నప్పుడు పొందేది యశస్సు. మరణానంతరం పొందేది కీర్తి.. తరతరాలుగా అతని గూర్చి, అతని వంశం గూర్చి చెప్పుకునేది ప్రతిష్ఠ.

            ఒకండను నేను పృథా పుత్రులలోన పిన్న.. దుర్యోధనా.. నేను నీకన్నా చిన్నవాడిని.. నీవు అపార సైన్య సంపత్తితో,, సర్వ సన్నద్ధుడవై యోధానుయోధులతో కూడి ప్రణాళికాబద్ధంగా వచ్చావు. అయినా నీ ప్రణాళికా రచనా సామర్ద్యం పటాపంచలైంది. అంచనాలను వ్యూహాలను సరిగా అమలు చేయలేని అసమర్ధత నీలో కనిపిస్తున్నది. ఇంత సైన్యంతో వచ్చావంటేనే నీ కుటిల నీతి అవగతమౌతున్నది. విలువలకు తిలోదకాలిచ్చి, విరాటుని సంపదను హరించాలనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు? దండయాత్ర చేయడం ధర్మబద్ధమే అనుకున్నా.. యుద్ధంలో ఒక్కని జయించలేక పారిపోవడం ఏ విధమైన క్షాత్రధర్మం. ఒక్కడిని, చిన్నవాడిని, సన్నద్ధుడనై లేని వాడిని, అనుకోకుండా యుద్ధానికి వచ్చిన నన్నే ఎదుర్కొనలేని నీవు.. రేపు మా సోదరు లందరమూ సకల సైన్యాలతో.. సన్నద్ధులమై వచ్చిన  వేళ ఎలా నిగ్రహించుకోగలవు. అంతేకాదు, ఒకండ.. అనడంలో.. నేను ఒక్కడినే వీరుడిని.. మీరంతా భీరులు, అసమర్ధులు అనే వ్యంగ్యమూ ఉన్నది.

            మాని నాఁగ నిద్ధాత్రి ప్రసిద్ధి కెక్కి.. అభిమాన ధనుడనని నీకు నీవిచ్చుకున్న బిరుదుతో ప్రసిద్ధమైన నీవు.. యుద్ధాన్ని మాని.. ప్రాణభయంతో పారిపోవడం.. హవ్వ.. ఎంతటి.. అపఖ్యాతి.. బలమూ దర్పమూ కలిగిన వాడిననే అహంకారం ఇకపై ఎవరిపై చూపుతావు.. నీవు నీ మిత్రులు కూడా ఇలా యుద్ధరంగం నుండి పారిపోవడం వల్ల ప్రపంచానికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నావు. ఇప్పటివరకూ ప్రజలు నీ బలదర్పాలను గుర్తించి గౌరవిస్తున్నారు. ఇలా పారిపోయి వారికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నావనే అధిక్షేపం కనిపిస్తున్నది.

            క్షాత్రం చూపని క్షత్రియుడు జీవఛ్ఛవం లాంటివాడు. నేను నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను.. అయినా నా ఆహ్వానాన్ని పెడచెవిని పెట్టి వెళ్ళిపోవడం అభిమాన ధనునికి తగునా?

            ఎవరిని నమ్మావో వారంతా నీకన్నా ముందుగా యుద్ధభూమిని విడిచి పారిపోయారు.. సోదరా.. ఇక ఎవరిని నమ్మి ఇకపై రానున్న మహాహవానికి తెరలేపుతావో తేల్చుకో అనే వ్యంగ్యమూ కనిపిస్తుంది.

            స్వీయ అంచనాలు, అవగహనలు, ఎదుటివారి బలాబలాలను గుర్తించి సరైన వ్యూహాలు రచించుకోలేని అసమర్ధత అపజయానికి తొలిమెట్టుగా భావించాలి.

పాలకుర్తి రామమూర్తి

Thursday, December 19, 2019

విజయ సాధనా మార్గంలో ప్రాథమిక మైన అతి ముఖ్యమైన ఏడు (7) అంశాలు



ఫలిస్యతీతి విశ్వాసః  సిద్ధేః ప్రథమ లక్షణం
ద్వితీయః శ్రద్ధయా యుక్తః, తృతీయం గురు పూజనం
చతుర్ధశ్చా~ స్మతా భావః పంచమేంద్రియ నిగ్రహం
షష్ఠించ ప్రమితాహారః సప్తమం నైవ విద్యతే!
(ఈ శ్లోకం ఎక్కడో లభించింది. ఎక్కడిదో, ఎవరు వ్రాసారో తెలియదు)
జీవితంలో విజయ సాధన అనేది సాధారణంగా ఏడు అంశాలపై ఆధార పడి ఉంటుంది. అందులో మొదటిది, "ఫలస్యతీతి విశ్వాసః".... నా యత్నం ఫలిస్తుంది అనే నమ్మకం, మొదటి అంశం. తనపై తనకు సాధించగలననే అచంచలమైన విశ్వాసం ఉన్న ఏ వ్యక్తి యైనా తప్పని సరిగా విజయ సాధకుడౌతాడు. దృఢమైన, నిశ్చయమైన నిర్దారణ విశ్వాసానికి ఊతమిస్తుంది. 
అయితే ఈ దృఢమైన, నిశ్చయమైన నిర్దారణ అంటే ఏమిటి? నేనొక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. దాని పర్యవసానాలను, అనుకూల ప్రతిబంధకాలను సంపూర్ణంగా అధ్యయనం చేసాక, ఏ పరిస్థితులలో నైనా దానిని సాధించాలనే నిర్ణయానికి వచ్చాను. నా మార్గం దుర్గమ మైనదని నన్ను నా మిత్రులు కావచ్చు శత్రులు కావచ్చు నన్ను వారించే ప్రయత్నం చేయవచ్చు. సమాజం హర్షించ వచ్చు లేదా దూషించ వచ్చు. కాని నేను వారి మాటలను పట్టించుకోను. నా సంపద అమితంగా వృద్ధి కావచ్చు లేదా మొత్తంగా హరించుకు పోవచ్చు, నా ప్రయత్నంలో మరణమే సంభవించ వచ్చు అయినా నేను బాధపడను నా ప్రయత్నాన్ని చివరి వరకూ కొనసాగిస్తాను, అనే పట్టుదలతో కూడిన ఒక నమ్మకం. అదే దృఢమైన, నిశ్చయమైన నిర్దారణ విశ్వాసం. ఇదే విజయ సాధనలో మొదటి అంశం.
రెండవ అంశం, శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రత్ + ధ = శ్రద్ధ. "శ్రత్" అనగా గుర్తించదగిన సత్య సంధత యొక్క స్థితి లేదా నిష్ఠతో కూడిన సత్య సంధత "ధ" అనగా దాని వైపు (సత్య సంధత వైపు) మన ఉద్యమం (ప్రయత్నం). ఆదర్శవంతమైన ఒక లక్ష్యాన్ని సాధించేందుకు సత్య మార్గంలో మాత్రమే ప్రయత్నించడాన్ని ఒక విధంగా శ్రద్ధగా చెప్పుకోవచ్చు.
మూడవ అంశం, గురు పూజనం. భక్తి శ్రద్ధలతో గురువును ఆరాధించడం. గురువు ఎప్పుడూ ఒక వ్యక్తి కాదు, సమష్టి. తానుగా సాధన చేసి సాధించి తాను గమించిన మార్గాన్ని శిష్య సంఘానికి ఉపదేశిస్తూ... ఎవరికి వారు తమదంటూ ఒక లక్ష్యాన్ని, మార్గాన్ని ఎన్నుకునేందుకు ఉత్ప్రేరకంగా నిలిచేవాడు, గురువు. నా మార్గమే అంతిమ మైనది, అది తప్ప వేరు లేదు అని చెపితే అతడు గురువు కాలేడు. అయితే గమ్యాన్ని ఏర్పరచుకున్న శిష్యుని మార్గంలో ఎదురయ్యే అవరోధాలను తొలగించ గలిగిన విజ్ఞత గురువుకు ఉండాలి. తాను సేకరించిన దత్తాంశాలను హేతువు ద్వారా పరిపుష్టం చేసి, ఒక సిద్ధాంతాన్ని లేదా మార్గాన్ని ఏర్పరచ గలిగిన వాడు గురువవుతాడు కాని ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకోని దాని చుట్టూ అవసరానుగుణంగా హేతువును లేదా ఉపపత్తిని నిర్మించ జూచే వాడు ఎప్పుడూ గురువు కాలేడు. అలాంటి సద్గురువును ఆశ్రయించి సమర్పణా భావంతో అనుసరించడం మూడవ అంశంగా చెప్పబడుతుంది.
నాలుగవ అంశం, అస్మతా భావః. అనగా మానసిక సమతుల్యత. గమ్యాన్ని చేర్చాల్సిన గమనంలో మానావమానాలు, అవరోధాలు, అవకాశాలు సహజమైనవి. భావోద్వాగాలకు బానిసయైన వారెవరూ తమ ప్రయాణాన్ని కొనసాగించలేరు. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రయాణం ఎప్పుడూ సపలం కాలేదు. కాబట్టి మానసిక సమతుల్యత విజయ సాధనలో అత్యంత ప్రముఖమైన అంశం
అయిదవ అంశం, ఇంద్రియ నిగ్రహణం. అపజయానికి దోహదపడేది ఇంద్రియాల బలహీనతయే. అమృతమూ, కల్ప వృక్షాది అన్ని ఐశ్వర్యాదులూ తన వద్ద ఉన్నా ఇంద్రుడు చంచల మనస్వయై, భయం నీడలో, వ్యగ్రమనస్కుడై ఉంటాడు. దానికి కారణం "ఆశ". ఆశయం లేని ఆశ వల్ల చాంచల్యత, చపలత ఆవరిస్తాయి. "బలవానింద్రియోగ్రామః విధ్వాంస మపికర్ష్యతి" అంటారు. అలాంటి బలవత్తరమైన ఇంద్రియాలను, ధ్యానం, ఉపాసన లాంటి నైమిత్తిక మార్గాలలో మచ్చిక చేసుకొని ఇంద్రియాలకు బానిస కాకుండా నిలవడం ముఖ్యమైన అంశంగా చెప్పబడుతుంది.
ఆరవ అంశం, ప్రమితాహారః ఆహార విహారాదులలో పరిమితులను పాటించడం. ప్రాణం నిలవాలి అంటే తపనిసరిగా ఆహారం తీసుకోవాలి. కాని అదే ఆహారం పరిమితులను దాటితే.... విషమవుతుంది. అందుకనే శరీర పోషణకు అవసరమైన ఆహారాన్ని సమయ పాలన చేస్తూ తీసుకోవడం విజయ సాధనలో మ్రాధమిక అంశంగా చెప్పబడింది. సాధారణంగా తీసుకొన గలిగే మొత్తంలో ఒక వంతు నీరు రెండు భాగాలు ఘన పదార్ధంగా తీసుకొని ఒక భాగాన్ని వాయు (గాలి) సంచారానికి వదలి వేయాలని చెపుతారు. అలా పరిమిత ఆహారం వల్ల భౌతిక శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చక్కగా ఉండి సాధనలో సహకరిస్తాయని విజ్ఞుల ప్రబోధ.
చివరిది, ఏడవ అంశం, సప్తమం నైవ విద్యతే అంటారు. పైన మనం చర్చించిన ఆరు అంశాలు కాక మరేమీ లేవు అంటుంది పై శ్లోకం. అంటే పై నియమాలను త్రికరణ శుద్ధిగా పాటించిన నాడు విజయ ద్వారం మనకై తెరిచి ఉంటుంది.
ఇలా ముఖ్యమైన ఏడు అంశాలను ఒక శ్లోకం ద్వారా మానవ కోటి విజయ సాధనా మార్గంలో ఉపకరిస్తాయని చెప్పిన మహనీయునికి (ఎవరో తెలియక పోవడం వల్ల) నమస్సులర్పిస్తూ....