Wednesday, May 24, 2017

ఏది ఆచరణ యోగ్యం?

దృష్టి పూతం న్యసేత్ పాదం, వస్త్రపూతం జలం పివేత్,
శాస్త్ర పూతం వదేద్ వాక్యం, మనః పూతం సమాచరేత్!
                                                                        చాణక్య నీతి -- 10-2

            ముందుకు అడుగు వేసేప్పుడు బాగా పరికించి చూసి మరీ అడుగు వేయాలి. నీరు త్రాగేప్పుడు బట్టతో బాగా వడగట్టి శుభ్రమైన నీటినే త్రాగాలి. మాట్లేడేప్పుడు బాగా ఆలోచించి శాస్త్ర సమ్మతమైన విధానంలోనే మాట్లాడాలి. కార్యాచరణలో మనసు చెప్పిన విధంగా మనసుకు నచ్చిన విధంగానే పనులు శ్రద్ధతో ఏకాగ్రతతో ఆచరించాలి, అంటాడు, చాణక్యుడు. 
            వ్యక్తి జీవితం సార్ధకత సాధించాలి అంటే జీవితంలో ఏదైనా సాధించాలి. నిస్సారమైన బ్రతుకుతో ప్రయోజనమేమీ లేదు. ఏ కార్యమైన నిర్వహించాలి అంటే ముందు బాగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే సమగ్రమైన కార్య స్వరూపం అవగతమైతే అవసరమైన ప్రణాళికలు రచించుకోవచ్చు. చాలా సులువైన పని..... నానుండి కాదని విడిచిపెట్టడం. కాని దానిని తుది దాకా నిర్వహించు కోవడంలోనే వ్యక్తి యొక్క మానసిక బలం, చైతన్యం నిరూపిత మౌతుంది. కాబట్టి కార్య రంగంలోకి అడుగు వేయాలి అంటే ఆ కార్య స్వరూప స్వభావాలపై స్పష్టత రావాలి. అందుకే ముందువెనుకలు ఆలోచించి... ఆ కార్య నిర్వహణలో తుది ఫలితం ఏమిటో దర్శించిన పిమ్మటనే ముందడుగు వేయమంటున్నాడు ఆచార్య చాణక్యుడు. కలలు కనండి ఆ కలలు సాకారమయ్యేందుకు కృషి చేయండి, అన్నారు,  మాజీ రాష్ట్రపతి, డా. ఏ.పి.జే అబ్దుల్ కలాంగారు. నిజానికి కలలు కనడం ఆగిపోతే జీవితమే ఆగిపోయినట్లుగా పరిగణించాలి. సాధించగలననే నమ్మకంతో, ఆశతో అణువణువూ ఆ తపనలో దహించుకు పోతూ నిద్రపోనీయని స్థితిలో కనే కలలే కలలు. అంతే కాని సుష్టుగా మెక్కి సుఖంగా పడకపై చేరి గాఢనిద్రలో సుషుప్తిలో వచ్చే కలలు కలలు కావు అవి కల్లలు మాత్రమే. 
            "శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం" అన్నారు పెద్దలు. ఆ శరీరంలో దాదాపు 70% ఉన్న నీటిని అవసరమైన పరిమాణంలో తీసుకోవడం వల్ల మాత్రమే మన జీవ యాత్ర కొనసాగుతుంది. అయితే నీరు త్రాగడం కూడా ఒక కళయే. ఏ నీటిని త్రాగాలి? స్వచ్ఛమైన నీటిని మాత్రమే త్రాగాలి. నీటిని వడగట్టడం ద్వారా స్వచ్ఛతను సంతరించుకుంటుంది. ప్రాచీన భారతీయ సమాజంలో నీటిని వడగట్టేందుకు బట్టను లేదా చీరను 6 నుండి 8 మడతలుగా చేసి నీటిని వడగట్టేవారు. ఈ విధానం ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో అత్యుత్తమమైన విధానంగా నిరూపితమైంది. కాబట్టి వడగట్టబడిన శుభ్రమైన నీటిని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి?  సుఖాసనంలో 90 డిగ్రీల కోణంలో కూర్చొని గ్లాసును నోట కరుచుకొని నెమ్మదిగా చుక్కచుక్కగా చప్పరించి త్రాగాలి. ఎప్పుడు ధారగా పోసుకోవద్దు. ఉదయం నిద్రలేవగానే కనీసం ఒక లీటర్ నీటిని తీసుకోవాలి. అదీ గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అలాగే భోజనం చేసిన పిమ్మట నలుబది నిమిషాల సమయం ఇచ్చి గోరువెచ్చని నీటిని త్రాగాలి. చల్లని నీటిని వీలైన మేరకు వాడకూడదు. అలాగే నిలుచొని నీరుత్రాగడం కూడా పనికి రాదు. రాత్రి పడుకునేందుకు ముందు ఒక గ్లాసు పరిశుభ్రమైన నీటిని త్రాగడం వల్ల గుండె పోటు సమస్యలను నివారించ వచ్చునంటారు వైద్యులు. మరొక్క ముఖ్యవిషయం... శరీరం కోరుకోక ముందే (దాహం వేయక ముందే) నీటిని త్రాగడం అలవాటు చేసుకోవాలి.
            మాట్లాడడం ఒక కళ. అది స్వతహాగా రాకున్నా... కష్టపడైనా అభ్యసించి అలవాటు చేసుకోవాలి. తుపాకీ గుండు ఎలాగైతే బయటికి వస్తే వెనిక్కి తీసుకోలేమో అలాగే మాటనూ వెనిక్కి తీసుకోలేము. శాస్త్రం శాసిస్తుంది. ఏది మాటాడేందుకు యోగ్యమైనదో ఏది అయోగ్య మైనదో నిర్దిష్టంగా చెప్పేదే శాస్త్రం. మాటలతోనే సామ్రాజ్యాలను గెలవవచ్చు కోల్పోవనూ వచ్చు. ఒకసారి నాలుకతో దంతాలు అన్నాయట... మేము తలచుకుంటే నిన్ను నలిపేయగలమని. నవ్వుతూ నాలుక అన్నదట.. నేను ఒక్క మాట మాట్లాడితే మీరు 32 మందీ రాలిపోతారని. మాటకున్న శక్తి అలాంటిది. అందుకే బాగా విచారించి శాస్త్ర సమ్మతమైన మాటలను మృదువుగా, తగిన అంతరాలలో, మార్దవంగా మాట్లాడేవారికి విజయ సాధన కరతలామలకం.
            మనస్సు చెప్పిన విధంగా ఆచరణ ఉండాలి. మన ఆంతశ్ఛేతనకు భిన్నంగా ప్రవర్తిస్తే అలజడికి గురౌతాము. అలజడి ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి వల్ల మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. దానితో కార్య స్వరూపాన్ని సరిగా అంచనా వేయలేము. అందువల్ల ప్రణాళికలో లోపం ఏర్పడి ఆచరణ తప్పుతుంది. కార్య భంగం అవుతుంది. మరి అంతశ్చేతనకు ప్రాతిపదిక ఏది? సామాజిక ప్రయోజనం, మనకు ఎదుటివారికి ఆనందం కలగడం. ప్రలోభాలకు లొంగి పనిచేయడం లేదా భయపడి పని చేయడం వల్ల మనసును ఆ కార్యంపై వంద శాతం లగ్నం చేయలేము. అలాచేయడం పరధర్మంగా చెప్పబడుతుంది. మన అంతశ్చేతన సూచితఅ మార్గంలో వెళ్ళడం స్వధర్మంగా చెప్పబడుతుంది. గీతలో చెప్పిన విధంగా పరధర్మమెప్పుడూ భయావహమే.
            ఇలా చిన్న శ్లోకం ద్వారా అనల్పమైన జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు, ఆచార్య చాణక్యులు.
            శుభం భూయాత్
పాలకుర్తి రామమూర్తి

Monday, May 15, 2017

ఇతరుల కష్టాలు పట్టించుకొనని వారు



ఇతరుల కష్టాలు పట్టించుకొనని వారు

రాజా వేశ్యా యమశ్చాగ్నిః చోరాః బాలక యాచకః
పరదుఃఖం నజానంతి అష్టమో గ్రామ కంటకాః!
            అంటాడు, చాణక్యుడు.                                                                    చాణక్యనీతి 17-17

            రాజు, వేశ్య, యముడు, అగ్ని, దొంగ, బాలకులు, యాచకులు మరియు గ్రామ కరణం... ఈ ఎనిమిది మందికీ ఇతరులు ఏ పరిస్థితులలో ఉన్నారనే ధ్యాస ఉండదు. ఎదుటి వారి బాధలను అర్థం చేసుకోలేరు అంటారు, చాణక్యులు.
            రాజుకు సాధారణంగా కష్టాలు దుఃఖాలు తెలియవు. స్వయంగా దుఃఖం ఏమిటో అనుభవించని వానికి ఎదుటి వారి కష్టం అర్ధంకాదు కదా. అంతేకాదు, నిరంతరం రాచకార్యాలలో మునిగితేలే వానికి కొంత కఠినంగా ఉండవలసిన అవసరమూ ఉంటుంది. రాజుల మనస్సు దారుణా ఖండల శస్త్ర తుల్యం, మాట మాత్రము నవ్య నవనీత సమానంగా ఉంటుంది అంటారు నన్నయ గారు భారతంలో. ఎదుటి వారి కష్టాలకు కరిగినట్లే కనిపించాలి కాని ఎప్పుడూ కరగిపోవద్దు. ఇతరుల సలహాలు తీసుకోవాలే కాని తన పద్ధతిలో తాను నడవాలి. అందరికీ స్నేహితునిగా నటించాలి కాని గూఢాచారిలా వ్యవహరించాలి. మిత్రులను, బంధుగణాన్ని చివరకు భార్యా పిల్లలను కూడా అతిగా నమ్మవద్దు. దీనినే విరాట పర్వంలో తిక్కనగారు చక్కని పద్యంలో చెప్పారు.
పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులనరు రాజు లాజ్ఞ మిగిలిన చోటన్
శత్రుల కా దమ యలుకకు బాత్రము సేయుదురు నిజ శుభస్థితి పొంటెన్!
            తమ ఆజ్ఞను ధిక్కరించిన వారు ఎవ్వరయినా ఏ పరిస్థితులలో ఉన్నా చివరకు తమ సంతానమైనా శిక్షిస్తారే కాని ఎదుటివారి బాధలను దుఃఖాన్ని అర్థంచేసుకొని క్షమించడం జరగదు. రాజకీయాలలో నీతిని పాటించేవారు అరుదుగా ఉంటారు. తమ భద్రత, తమ మేలు లక్ష్యంగా సాగే వారి కార్యాచరణలో శాసన ధిక్కారాన్ని ఏ పరిస్థితులలో కూడ సహించరు.
            వేశ్య... ఆమె వృత్తి విటులను ఆకర్షించడం వారి వద్ధ ధనాన్ని పొందడం. అయ్యో! వారి ఇల్లు నావల్ల గుల్ల అవుతుందే అని బాధ పడుతూ కూర్చుంటే తన వృత్తి సాగదు. కాబట్టి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఎదుటివారి కష్ట నష్టాలతో సంబంధం లేకుండా విటులను ఆకర్షిస్తుంది ధనాన్ని ఆర్జిస్తుంది.
            యమధర్మ రాజు యొక్క కర్తవ్యం ... ఆయువు తీరిన జీవుల ప్రాణాలు హరించడమే. మనకు సంబంధించిన వారు ఏ వయసులో ఉన్నా మనల్ని వీడి అనంత లోకాలకు వెళితే మనకు బాధయే. అయితే మృతుల బంధువులు స్నేహితులు దుఃఖిస్తున్నారని కరుణాయత్త చిత్తంతో కూర్చుంటే తన కర్తవ్య పాలనను యముడు చేయలేడు కాబట్టి ఎదుటివారి బాధలను పట్టించుకోకుండా తనపని తాను చేసుకు పోతాడు. అలా చేయకపోతే పెరిగే జన సాంద్రతకు ఈ భూమండలమే కాదు ఎన్ని భూమండలాలైనా సరిపోవు. ఆహార పానీయాదులకూ కష్టమౌతుంది. అయినా పాత నీరు అలాగే ఉంటే క్రొత్తనీరు వచ్చేందుకు అవకాశం ఉండదు కదా.
            అగ్ని లక్షణం కాల్చడం. అగ్నిని సర్వ భక్షకుడు అంటారు. అన్నింటినీ దహించి వేసే అగ్ని శిఖలకు తరతమ భేదం లేదు. ఎవరి బాధలు, కష్టాలను, దుఃఖాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతుంది.
            చోరులు అంటే దొంగల వృత్తి దోచుకోవడమే. అయ్యో ఈ ఇంటి యజమాని కష్టాలలో ఉన్నాడు ఇతని సంపదను దోచుకో వద్దని అనుకుంటే, జాలి కనికరం ఉంటే తన పని నడవదు. అంతే కాదు ఇతరుల బాధలను అర్థంచేసుకోవడానికి అతనేమీ మహానుభావుడు కాదు కదా. అనుసరించి, అదను చూసి, ఆదమరచిన వేళ దోచుకోవడం అలవాటయిన వాడు ఇతరుల దుఃఖానికి స్పందించే సున్నితత్త్వాన్ని ప్రయత్న పూర్వకంగా నైనా వదలివేస్తాడు.
            చిన్నపిల్లలు తమకు కావలసిన దానిని సాధించుకునే క్రమంలో తామెక్కడ ఉన్నదీ, అడిగేందుకది సరైన సమయమా కాదా, ఎలా అడగాలి అనే విషయాలను పట్టించుకోరు. తల్లిదండ్రులు దుఃఖంలో ఉన్నా సంతోషంలో ఉన్నా తాము కోరింది జరిగేదాక హఠం చేస్తారు. అవకాశం ఉంటే గారాబంగా అడిగి సాధిస్తారు. లేదంటే ఏడ్చి, గోల చేసి, పంతం పట్టి, అలిగి అల్లరి చేసి లేదా బ్లాక్ మెయిల్ చేసైనా సాధిస్తారు. ఈ క్రమంలో ఎవరి బాధలనూ వారు పట్టించుకోరు.
            యాచకులు ఎవ్వరినైనా యాచిస్తారు. తమ వృత్తిపరంగా ఎదుటివారు ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారనే విషయం వారికవసరం లేదు. అందరి ముందు చేయిచాచడమే వాడికి తెలిసిన విద్య.
            ఇక చివరగా... గ్రామ కరణాలు... ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించి వారి నుండి వీరి నుండి లబ్ధిపొందడమే వృత్తిగా కలిగి కరణీకం చేసే వ్యక్తులకు ఎవరైనా బాధపడతారనే ఆలోచన ఉండదు. వీరికి మిత్రులు శత్రులు అంటూ ప్రత్యేకంగా ఉండరు. తమ స్వార్థానికి ఎదుటివారిని ఎలా ఉపయోగించుకోవాలో నేరుస్తారు. నమ్మకద్రోహం చేయడం వీరి నైజం. ఈర్ష్యాసూయ  భావాలు కలిగిన వీరు అందరి వద్దా తలలో నాలుక లాగా చనువుగా వ్యవహరిస్తూ  అవకాశం రాగానే ఎదుటి వారిని ముంచివేసే ప్రయత్నం చేస్తారు.  ఎదుటివారి బాధలలో తమ సంతోషాన్ని వెదుక్కునే ఇలాంటి వారిని "గ్రామ కంటకాః" అని సంబోధిస్తాడు, చాణక్యుడు.
            ఇలా చాణక్యులు ఎదుటివారి బాధలను, దుఃఖాన్ని పట్టించుకోని వారిని గూర్చి చెప్పడంలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మానవులు మంచికన్నా చెడుకే ఎక్కువగా స్పందిస్తారు. సింహం నోట్లో తలపెడితే ఏమౌతుందో తెలిస్తే దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాము

ఎలాంటి వారితో ఎలా వ్యవహరించాలి?

ఎలాంటి వారితో ఎలా వ్యవహరించాలి?

కృతే ప్రతికృతిం కుర్యాత్, హింసేన ప్రతిహింసనం
తత్ర దోషో న పతతి, దుష్టే దౌష్ట్యం సమాచరేత్!
                                                            చాణక్య నీతి -- 17-2
            ఉపకారికి ఉపకారం చేయాలి అలాగే హింసకు ప్రతిహింసయే మార్గము. దుష్టులతో దౌష్ట్యంగానే వ్యవహరించాలి. అది తప్పుకాదు అంటాడు, చాణక్యుడు. ఉపకారం చేసిన వానికి ఉపకారము చేయడం సమంజసమే. కాని మనం చిన్నప్పుడు చదివాము కదా "అపకారికి ఉపకారము నెపమెన్నక చేయాలని". అలా చేస్తే ఈ నాడది పిరికితనంగా వ్యవహరించ బడుతుంది. క్షమాగుణం ప్రధానమైనదే కాని అర్హులను మాత్రమే క్షమించాలి. బలం బలాన్ని గౌరవిస్తుంది. నీవొక చెంపకొడితే మరొక చెంప చూపుతాననడం ఈనాడు మూర్ఖత్వంగా పరిగణించ బడుతుంది.
            అన్ని ధర్మాలలో కెల్లా అహింసయే ఉత్తమం. పవిత్రంగా ఉండండి. నిజాయతీగా ఉండండి. గౌరవప్రదమైన జీవితాన్ని గడపండి. కష్టపడి పనిచేయండి. ఇలాంటి నీతులు మనమెన్నో విన్నాం. కాని ఈ నీతులకు భిన్నంగా ప్రవర్తించిన వారూ విజయ సాధకులైనారు. ఫలితాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనావేసే నేటి కాలంలో మంచిగా ఉండగలగడం మంచిదే కాని అది మన అసమర్ధతకు ప్రతీక కావద్దు. మీరంటే ప్రాణాలర్పించే అనుచరులు, మిత్రులు ఉండడం మంచిదే. వారిని ఉచిత రీతిని గౌరవించాలి కాని అతి చనువు నీయవద్దు.  దుష్టత్వాన్ని ఉపేక్షించ వద్దు. ఎవరికి ఏ విధంగా చెపితే అర్ధం అవుతుందో అలాగే చెప్పాలని సుచిస్తున్నాడు, చాణక్యుడు.
            మిత్రులకన్నా శత్రువును దగ్గరకు తీయాలంటాడు, రాబర్ట్ గ్రీన్ అనే రచయిత. శత్రువును ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి అంటాడాయన. ఉపకారం చేసినట్లు నటించే స్నేహితుడు కూడా నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. అందుకే అతిగా నమ్మొద్దు. మరి శత్రువును దగ్గరికి తీస్తే అతడు తనను తాను విశ్వాసపాత్రునిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కష్టపడి, ఇష్టపడి, ప్రేమతో పని చేస్తాడు. మనకు కావలసిన విజయాన్ని అతనే సాధిస్తాడు. అలాగని హింసామార్గంలో ప్రతిఘటించే శత్రువును ఎట్టిపరిస్థితులలో కూడా విడిచిపెట్ట వద్దంటాడు, చాణక్యుడు.

            

వర్తమానాన్ని ఆస్వాదించండి

వర్తమానాన్ని ఆస్వాదించండి

గతం శోకో  కర్తవ్యం, భవిష్యతో నైవ చింతయేత్
వర్తమనేన కాలేన ప్రవర్తన్తే విచక్షణాః!
చాణక్య నీతి 13-2
            జరిగిపోయిన దాన్ని గూర్చి విచారించకు. గతం గతః అని దానిని విడిచిపెట్టు. గతం గోష్ఠి నకర్తవ్యం. జరిగిన దాన్ని పట్టుకు వేళ్ళాడడం వల్ల ఉపయోగం ఉండదు. గతం ఒక చెల్లని చెక్కులాంటిది. దానిపై ఎంత సొమ్ము వ్రాసి సంతకం చేసినా అది మనకు ఉపయోగపడదు. అయిపోయిన దానిని గూర్చి పట్టించుకుంటూ అయ్యో ఇలా అయిందే... ఇలా కాక అలా చేసి ఉంటే బాగుండేది. అలా కాదు ఈ మాట అని ఉంటే బాగుండేది. ఇక్కడ కాదు మరోచోట మన డబ్బును దాచిఉంటే నష్టపోకుండా ఉండే వాళ్ళం. ఇలా చింతించడం వల్ల ప్రయోజనం శూన్యం. అలాగే, ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడడం లేదా సంతోష పడడం వల్ల కూడా ప్రయోజనం శూన్యం. జరుగుతుందో లేదో తెలియని దాన్ని గూర్చి ఊహించి వర్తమానాన్ని విస్మరించడం వల్ల వర్తమానంపై శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి విజ్ఞులైన వారు వర్తమానాన్ని సంతోషంగా స్వీకరించాలి. సుఖవంతం చేసుకోవాలి. మార్చుకో గలిగి నంతగా మార్చు కోవాలి, అంటారు, చాణక్యులు.
            భూతకాలం లేదా గడచిపోయిన కాలం మనకు అనుభవాన్నిస్తుంది. కాని ఆ అనుభవాలు మన నిర్ణయాలపై ఆధారపడినవే కదా. తప్పుడు నిర్ణయాల ఫలితం తప్పుడుగానే ఉంటుంది. అయితే ఎవరైతే అయ్యో తప్పుడు నిర్ణయల ద్వారా నష్ట పోయామని బాధ పడుతూ కూర్చుంటారో వారికి బాధ మాత్రమే మిగులుతుంది. అలాకాక ఎవరైతే ఆ అనుభవాల ద్వారా పాఠాలను నేర్చుకొని జీవితానికి అన్వయించు కుంటారో వారే విజయాన్ని సాధిస్తారు. అదే జీవితం.
            ఒక బాంక్ ఉంది. అది తన ఖాతాదారుల ఖాతాలో ప్రతి నిత్యం 86400 రూపాయలు జమచేస్తుంది.  ఆ డబ్బును మీరు నిరభ్యంతరంగా మీ ఆలోచన ప్రకారం ప్రతి నిత్యం ఖర్చుచేసుకోవచ్చు. కాని ప్రతిరోజు సాయంత్రం మీ ఖాతా సరిచూడబడి అందులో మీరు వాడని డబ్బు వెనుకకు మళ్ళించ బడుతుంది. అలాగని మీ అవసరానికి ఆ 86400 లకు మించి తీసుకునే వెసులుబాటు కూడా ఉండదు. ఆ పరిస్థితులలో మీరు ఎలా ఆ డబ్బును వాడుతారు. మీ ప్రణాళిక ఎలా ఉంటుంది?
            ఆ 86400 మనం ఒక రోజు గడపే కాలం సెకన్లలో. ఆ సమయాన్ని ఎంత ప్రణాళికా బద్దంగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటే అంత ప్రశాంతంగా ఉండ గలుగుతాము. అంతగా విజయ సాధకులమౌతాము.
            ప్రతి రోజు ఉదయమే నిద్రలేవగానే ఒక ప్రశ్న వేసుకోండి. నా ప్రమేయం లేకుండా నాకు విజయం కాని అపజయం కాని వస్తుందా? అదే మన బ్రతుకుకు (Adding Age to our Life) లేదా జీవితానికి (Adding Life to our Age) పునాది అవుతుంది. 
            మనలో చాలా మందిమి భగవంతుడిని నమ్ముతాము, ప్రార్థిస్తాము. కాని చాలా మందికి మన ప్రార్థన ఫలిస్తుందన్న నమ్మకం తక్కువ. ఇక నుండి ఆ ఆలోచన మానుకుందాము. మన ప్రార్థన ఫలిస్తుందన్న నమ్మకంతో ఆరంభిద్దాం. ప్రయత్నించి విఫలమవడం ప్రయత్న హీనతకన్నా మంచిది. కనీసం అనుభవమైనా వస్తుంది. ఎదుటి వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. దానికి ముందు వారు ఏం చెపుతున్నారో శ్రద్ధగా విందాం. సాధించ గలమనే నమ్మకం పెంచుకుందాం... అది మనం సాధించలేనిదైనా సరే, ప్రయత్నిద్దాం. సంకల్ప బలం ముందు కాలం కూడా దిగ తుడుపే.
            చివరగా... భవిష్యత్తు అనే ఆశల పల్లకిలో ఊరేగే దాని కన్నా ముందుగా వర్తమానాన్ని ఆస్వాదిద్దాం. ఆశల కన్నా ఆశయాలు గొప్పవి. ఆశ వ్యక్తిగతమైనది (Exclusive). ఆశయం సమష్టికి (Inclusive) సంబంధించినది. ఆశయ సాధన వర్తమానంలోనే సాధ్యపడుతుంది.
            శుభం భూయాత్...
            పాలకుర్తి రామమూర్తి.


మీ ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గకుండా చూచుకోండి.

మీ ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గకుండా చూచుకోండి.

నిర్ధనం పురుషం వేశ్యాం, ప్రజా భగ్నం నృపాం త్యజేత్,
ఖగాః వీత ఫలం వృక్షం, భుక్త్వా చాభాగతో గృహమ్!
                                                                                                            చాణక్య నీతి  2-17
            వస్తువుల వినియోగానంతరం, అవి నిరుపయోగం అనిపిస్తే వాటిని విడిచి వేస్తాము. అలాగే ఎంతగా బంధాన్ని పెంచుకున్నా కొన్నింటిని విడవడం లోకంలో కన్పిస్తుంది. వాటిని ప్రస్తావిస్తున్నాడు, చాణక్యుడు.
            విటుడు, పొట్టి వాడు, నడ్డి ముక్కు, బాన కడుపు, గార పండ్లు కలిగి కురూపి యైనా, వాని వద్ద డబ్బు ఉంటే నీవే మన్మధుడవని వేశ్య ఆదరిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాని వగలు పోతుంది. అదే వ్యక్తి సంపద పోగొట్టుకొని నిర్ధనుడైతే అతను నిజంగా మన్మధుడైనా వేశ్య అతని పట్ల విముఖత ప్రదర్శిస్తుంది. అతడిని విడిచి వేస్తుంది.
            ఒక రాజు ఆర్ధికంగా, సైనికపరంగా బలవంతుడు, శక్తివంతుడూ అయితే సామంతులు అతనిని గౌరవిస్తారు. ప్రజలు అభిమానిస్తారు. అదే రాజు ఆర్ధికంగా చితికి పోయి బలహీనుడై గౌరవ మర్యాదలు కోల్పోతే,  సామంతులే కాదు తన ప్రజలు సైతం అతనిని వదలివేస్తారు.
            అడవిలో బాగా పుష్పించి ఫలాదులతో కళకళలాడుతున్న చెట్టుపైకి పక్షులు చేరతాయి. అక్కడ ఆనందం, సౌభాగ్యం వెల్లివిరుస్తుంది. అదే చెట్టు ఫలపుష్పాలకు దూరమై మోడువారితే పక్షులు ఆ చెట్టును విడిచి మరోచోటుకు చేరుతాయి.
            అలాగే, విందు భోజనానికి ఆహ్వానితులైన అతిధులు చాలా సంతోషంగా యజమాని గృహాన్ని చేరుకుంటారు. కోలాహలాన్ని సృష్టిస్తారు. ఆనందాన్ని పంచుకుంటారు. భోజనానంతరం, ఆ ఇంటిని విడిచిపెట్టి మరో చోటికి వెళతారు.
            ఇది ప్రపంచంలో సహజంగా జరిగే ప్రక్రియ. ఉపయోగపడేంత వరకే ఏ వస్తువుకైనా విలువ ఉంటుంది. ఒకసారి అది నిరుపయోగ మనిపిస్తే అది ఎంత గొప్పదైనా త్యక్తమౌతుంది. మనిషి జీవితమూ ఇందుకు భిన్నం కాదు.
            To maintain your independence you must always be needed and wanted. The more you are relied on, the more freedom you have. Make people depend on you for their happiness and prosperity and you have nothing to fear. Never teach them enough so that they can do without you. అంటాడు రాబర్ట్ గ్రీన్, తన "THE 48 LAWS OF POWER" అనే పుస్తకంలో.
            మన అవసరం ఇతరులకు ఉన్నంత వరకే మనకు గౌరవం. మనల్ని గుర్తిస్తారు. We should learn the art of Keeping People Dependent on us. దీని వల్ల మన అస్థిత్వం కాపాడబడుతుంది.
            మనం నీతిగా, నిజాయతీగా ప్రవర్తించడం వల్ల గౌరవం పెరుగుతుంది, ప్రయోజనం ఉంటుంది. కాని దాని కన్నా ఇతరులు మనపై ఆధారపడితే మనకెక్కువ లాభం ఉంటుంది.  దాహంతో ఉన్న వ్యక్తికి బావి అవసరం ఉంటుంది. ఎంత దూరమైనా ఓరిమితో నడుస్తాడు, అన్వేషిస్తాడు, సాధిస్తాడు, సంతోషిస్తాడు. కాని దాహం తీరాక, ఆ బావితో అవసరం తీరాక, దానిపై ఆధారపడడం తగ్గిపోతుంది. మరో ప్రత్యామ్నాయం లభిస్తే ఎన్నో ఏండ్లుగా తన దాహార్తిని తీర్చిన బావియైనా సరే, దానిపై మన్నన, మర్యాద తగ్గిపోతాయి, దానిని అనాదరణం చేస్తాడు.
            చిన్నప్పుడు ఒక కథ విన్నాము. ఒక మల్ల యోధుడు శిష్యులకు యుద్ధ విద్య నేర్పిస్తున్నాడు. అందరిలో చురుకైన ఒక శిష్యునికి యుద్ధ విద్యలన్నింటిలో నిష్ణాతుడయ్యేలా శిక్షణ నిచ్చాడు. శిష్యునిలో అహంకారం పొడసూపింది. గురువునే తనతో యుద్ధం చేసి గెలవమని సవాలు చేసాడు. తప్పని పరిస్థితులలో గురువు ఒప్పుకున్నాడు. కొద్ది సమయంలోనే గురువు శిష్యునికి తెలియని పట్టుతో శిష్యుని ఓడించాడు. ఈ విద్య నాకు నేర్పలే దెందుకని శిష్యుడడిగాడు.  అన్ని విద్యలూ నీకు అందిస్తే, నాపై నీకు గౌరవం తగ్గిపోతుంది. అహంకారం తలకెక్కుతే నన్నే సవాలు చేస్తావు. నా రక్షణ, గౌరవాన్ని గూర్చి కూడా ఆలోచించాలి కదా. అందుకే నీ వైఖరి, అర్హతల ప్రాతిపదికగా విద్య నందించడం జరిగిందని చెపుతాడు. దానితో శిష్యుని గర్వం సమసి పోవడమే కాక, జీవితాంతం గురువుపై ఆధారపడి ఉన్నాడు.
            దాదాపుగా ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు, చాణక్యుడు. మన అవసరం తీరితే మనమెంత గొప్పవారమైనా ప్రక్కన పెడతారు. ఆరబోసిన అందాలకన్నా, మరుగున ఉన్న అందలకే విలువ ఎక్కువ. ఏం చేసినా, మన అవసరం ఎదుటివారికి ఉండేట్లుగా చూడడం, మనకు విషయం తెలుసునన్నట్లుగా ప్రవర్తించడం, మనం లేకపోతే పనులు జరగవన్నట్లు గా పరిస్థితులను చూపెట్టడం నేర్చిన వారి ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గదు.
పాలకుర్తి రామమూర్తి.


ఏ యూరు వాసయోగ్యం?


 ఏ యూరు వాసయోగ్యం?

ధనికః, శ్రోత్రియో, రాజా, నదీ, వైద్యస్తు పంచమః
పంచ యత్ర నవిద్యంతే న తత్ర దివసే వసేత్!
                                                            చాణక్య నీతి  1- 9

            ఏ యూరిలో నైతే ధనికుడు, శ్రోత్రియుడు, రాజు, నదులు, వైద్యులు ఉండరో ఆ యూరిలో ఒక రోజు కూడా ఉండ కూడదు అంటారు, చాణుక్యులు. మనం చిన్నప్పుడు సుమతీ శతకంలో కూడా ఇలాంటిదే ఒక పద్యం నేర్చుకున్నాం కదా....
అప్పిచ్చువాడు వైద్యుడు
ఎప్పుడు ఎడతెగక పారు నేరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడ కున్నట్టి యూర( జొరకుము సుమతీ!
            ఒక వ్యక్తి ధనవంతుడు కావాలి అంటే; వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలి అంటే వ్యాపారానికి అనువైన వాతావరణం ఉండాలి. వస్తు ఉత్పత్తి జరగాలి. దానికి అవసరమైన  వనరులు అందుబాటులో ఉండాలి. రహదారులు, రవాణా సౌకర్యం ఉండాలి. కమ్యునికేషన్ వ్యవస్థ ఉండాలి. తయారైన వస్తువులు వినిమయం కావాలి. వినిమయం కావాలి అంటే ప్రజలలో కొనుగోలు శక్తి ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. గౌరవ ప్రదమైన జీవన యానానికి లోపం ఉండదు.  అవసరానికి అప్పు లిచ్చి ఆదుకునే వారికి లోటుండదు. కాబట్టి ఆ యూరు నివాసయోగ్యం.
            శ్రోత్రియుడు... అంటే శ్రుతి తెలిసిన వాడు. శ్రుతి అంటే వేదము. వేదమంటే తెలుసుకొనడం. ఏది తెలుసుకోవాలి? అంటే... ఏదైతే సమాజానికి హితకరమో, మానవ జీవనానికి ఉపయోగకరమో, దేని ద్వారానైతే ధర్మం ఆచరించ బడుతుందో, ఏదైతే అపారమైన మానవ మేధకు పదను పెట్టగలదో దానిని తెలుసుకోవాలి. దానినే వేదము లేదా శ్రుతి అంటారు. ఎవరైతే ఆ వేదాన్ని నిరంతరం అభ్యసిస్తూ, అధ్యయనం చేసిన దానిని అర్హులైన అర్ధులకు అందిస్తూ విజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తాడో అతడే శ్రోత్రియుడు. విజ్ఞానం కలిగిన వారు, మంచి చెడ్డల మధ్య భేదాన్ని తెలియ జాలిన వివేచన గలిగిన వారు ఉన్న యూరిలో శ్రేయస్సు, ప్రేయస్సుకు మార్గం కనిపిస్తుంది. శాస్త్ర సాంకేతిక ప్రగతి అక్కడ ఉంటుంది. కష్టకాలంలో సలహాలు లభిస్తాయి. కాబట్టి ఆయూరు వాసయోగ్యం.
            మానవాభ్యుదయానికి శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అత్యంతావశ్యకమైనది. భూమి, శ్రమ లేదా శ్రామికులు, ఆర్ధిక వనరులు మరియు ప్రణాళికాబద్ధ యోజనా నిర్వహణలు; ఈ నాలుగు ప్రధాన భూమికలుగా వ్యవసాయం లేదా పరిశ్రమలు లేదా సేవారంగాలు పనిచేస్తాయి. వీటన్నింటికి రక్షణ నిచ్చే వ్యవస్థ రాజ్య వ్యవస్థ. దానికి అధిపతే రాజు.
            కాబట్టి, ... రాజును రక్షణకు ప్రతీకగా గుర్తిస్తాం. అన్నీ ఉన్నా రక్షణ లేకపోతే, భయం రాజ్యమేలుతుంటే బ్రతుకు దుర్భర మౌతుంది. అన్యాయం జరిగిన వేళ దుర్మార్గాన్ని అణిచివేసి బలహీనులకు రక్షణ నివ్వగలిగిన మానసిక స్థితి క్షాత్రం. ఎవ్వరిలో నైతే క్షాత్రం ఉంటుందో అతడు ఇతరులకు రక్షణ సమకూర్చ గలడు. బలం బలాన్ని గౌరవిస్తుంది. గౌరవాన్నందుకున్న బలం ఆపన్నులను ఆదుకుంటుంది. అలాంటి రాజరిక వ్యవస్థ ఉన్న యూరిలో ఉండడం వల్ల నిర్భయంగా ఉండగలుగుతాము.
            నదులు... జలం ప్రాణదాయిని. సాగునీరు, త్రాగునీరు ఉన్నచోట జీవనం సాఫీగా సాగిపోతుంది. నాగరికతలన్నీ నదీ పరీవాహక ప్రాంతాలలోనే విరిసాయి. వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలకు మూలాధారం నీరే. ఆ నీటి వ్యవస్థ ఎక్కడ ఉంటుందో అక్కడ నివసించడం ఉత్తమం ఉంటారు, చాణక్యులు.
            వైద్యులు... ప్రాణదాతలు. రోగాల బారిన పడడం ప్రతి జీవికీ సహజం. చావును ఆపలేకపోయినా వీలైన మేరకు వైద్యులు ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారు. అందుకే.. మన నివాస స్థానంలో తప్పని సరిగా అనుభవజ్ఞులైన వైద్యులు ఉండే విధంగా చూసుకోవాలి.
            సుమతీ శతక కర్త కూడా పై అంశాలనే ప్రాతిపదికగా ఏది వాసయోగ్యమో ఏది కాదో చెప్పాడు.

            పాలకుర్తి రామమూర్తి