Thursday, May 11, 2017

ఇంద్రియ సాధన వల్ల విజయాన్ని సాధించడం సాధ్యపడుతుంది.

సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం
అర్థస్యమూలం రాజ్యం, రాజ్యస్య మూలం ఇంద్రియ జయం!
            అంటుంది చాణక్య నీతి.

            ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. కాని దాని మూలం ధర్మాచరణ అనే విషయాన్ని విస్మరిస్తాడు. రాజ్యంలోని ప్రజలు తమకు సంక్షేమాలు కావాలని కోరుకుంటారు. అది న్యాయమే కాని అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే సకల సంపదలతో విలసిల్లే రాజ్యం మాతమే ప్రజలకు సంక్షేమాలు అందించ గలుగుతుంది. కాని దానికి ఆ రాజ్య సుస్థిరత అవసరమౌతుంది. స్థిరమైన ప్రజ్ఞాపూర్ణమైన రాజ్యం కావాలంటే ప్రజలు ముఖ్యంగా నాయకుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగిన నాయకుడు విజయ సాధకుడౌతాడు. అలాంటి వ్యవస్థ ప్రజలకు ప్రశాంతతను ఇస్తుంది.
            నాయకుని విజయ సాధనను నాలుగు ముఖ్యమైన అంశాలు ప్రభావితం చేస్తాయి.
            మొదటిది.... తన మేధో సంపద. బాగా తెలివి కలవాడు కావాల్సిన అవసరం లేదు కాని అవసరమైన చోట తెలివితేటలు ప్రదర్శించ వలసిన అవసరం ఉంటుంది. అలాగే అతి తెలివి అనర్ధ దాయకమని గుర్తించడం అవసరం.
            రెండవది... ఊహాశక్తి. ఎంతగా ఊహా శక్తిని పెంచుకోగలిగితే అంతటి  విజయాన్ని సాధించడం సాధ్యపడుతుంది. ఊహా శక్తి ప్రాధాన్యతను గుర్తించి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ను మానసిక శాస్త్రవేత్తలు తయారు చేసారు. సుప్త చేతనావస్థలో ఉన్న అంతర్మనస్సును జాగృతం చేయడం వల్ల దాని అపారమైన శక్తిని ఉపయోగించుకోవచ్చు అనేది ఆ సిద్ధాంత కర్తల అభిప్రాయం.
            మూడవది... తనపై తనకు నమ్మకం. నమ్మకాన్ని మించిన విజయ సారధి మరొకటి లేదు. విజయం సాధించ గలననే నమ్మకం కలిగితే సగం విజయం వరించినట్లే నంటారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాధారణంగా మనం అందరినీ నమ్ముతాము కాని మనల్ని మనం నమ్మం. మనలోని అంతర్గత శక్తిని నమ్మం. మనల్ని మనం ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమించ గలిగిన వారీ ప్రపంచంలో ఎవరూ లేరనే విషయం అర్థం అవుతే మనల్ని మనం ప్రేమిస్తాం. మన శక్తియుక్తులను ప్రేమిస్తాం. విజయాన్ని సాధిస్తాం.
            ఇక నాలుగవది అతి ముఖ్యమైనది.... అపజయం పొందడం. నిజానికి ఏ వ్యక్తీ కావాలని అపజయాన్ని ఆస్వాదించాలని అనుకోడు. కాని దానిని కూడా ఆస్వాదించడం నేర్చుకోవాలి. దాని అనుభవం ఎలాంటిదో అనుభవ పూర్వకంగా గుర్తించాలి. అపజయం వల్ల కలిగే బాధల లోతులు అర్ధం కావాలి. అయ్యో అపజయం పాలవుతామనే భయం దూరం కావాలంటే దానిని అనుభవించాల్సిందే. అప్పుడే మనలో పరిణతి వస్తుంది. పరిణతి వల్ల మరింత సాహసోపేత నిర్ణయాలు తీసుకో గలుగుతాము. మన కంఫర్ట్ జోన్ నుండి బయటపడ గలుగుతాము. ఇలాంటి అనుభవాలను రుచి చూసినప్పుడే విజయ సాధనలో ఉండే మాధుర్యం అవగతమౌతుంది. ఆ ఆస్వాదనను ఆనందంగా స్వీకరించ గలుగుతాము. ద్వంద్వ భావ సమన్వితమైన సృష్టిలో విజయాన్ని అంటి పెట్టుకునే అపజయం ఉంటుంది. దానిని గుర్తించడంలో జాగ్రత్త అవసరం. అపజయానికి భయపడడం బెంబేలెత్తి పోవడం వల్ల విజయం రాదు. ఓపిక కావాలి. సంయమనత కావాలి. ఆలోచన పదను తేలాలి. ప్రణాళిక ఆచరణయోగ్యమై ఉండాలి. ఆచరణలో నిబద్ధతకావాలి. జయాపజయాలను సమంగా స్వీకరించ గలిగిన మానసిక స్థిరత కావాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
            పై నాలుగు లక్షణాలను సాధించాలంటే ఇంద్రియాలపై పట్టు సాధించాలి. ఇంద్రియ సాధన అంటే వాటికి దూరంగా ఉండటం కాదు. అవసరమైన చోట అవసరమైన మేరకు అవసరమైన విధంగా వాటిని ఉపయోగించడం మాత్రమే. కొద్ది అవగాహనతో సాధ్యపడే ఇంద్రియ సాధన వల్ల విజయాన్ని సాధించడం జీవితాన్ని ఆస్వాదించడ సాధ్యపడుతుందని చాణక్య నీతి ప్రబోధిస్తుంది.

                                                                                                                                                                                                పాలకుర్తి రామమూర్తి                         

సంతృప్తి చెందాల్సిన విషయాలు...

సంతోషస్త్రిషు కర్తవ్యః స్వదారే భోజనే ధనే
త్రిషుచైవ నకర్తవ్య౨ధ్యయనే జప దానయోః!

            ప్రతి వ్యక్తీ సంతృప్తి చెందాల్సిన విషయాలు సంతృప్తి పడకూడని విషయాలు గూర్చి చెపుతున్నాడు, ఆచార్య చాణక్యుడు. ముందుగా సంతృప్తి చెందాల్సిన విషయాలు... భౌతిక జీవన లక్ష్యాలు... స్వదార అంటే తన భార్య తో సంసారిక జీవనంలో; భోజనంలో; ధనార్జనలో.... ఈ మూడింటిలో సంతృప్తి ఉండాలి. అలాగే పారలౌకిక విషయాలైన ఆధ్యయనము, జపము, దానము ఈ మూడింటిలో సంతృప్తి కూడదంటాడు.
            స్వదారా.. ధర్మపత్నిని.. "సఖా సప్తపదాభవా" అనే మంత్ర పూర్వకంగా ఏడు అడుగులు నడచి ఆమెను మనజీవితంలోకి అహ్వానిస్తున్నాము. స్నేహాన్ని, ప్రేమను, అనురాగాన్ని ఇరువురం పరస్పరం పంచుకుందాము. సంపదను కలసి అనుభవిద్దాము. నాతి చరామి, నాతి చరితవ్య.... ధర్మార్ధకామ్యాలను కలసి ఆచరిద్దాము ఈ ప్రతిజ్ఞను నేను అతిక్రమించను అంటూ ఇరువురూ ప్రమాణాలు చేసి ఒకరి జీవితంలోకి మరొకరు వచ్చే క్రమంలో ఆ ప్రమాణాలను పాటించడం ఇరువురి కర్తవ్యం. కాబట్టి భార్యా భర్తలిరువురూ ఒకరికి ఒకరుగా మనసా వాచా కర్మణా బద్ధులై ఉండాల్సిన అవసరాన్ని చెపుతూ ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపడం కాకుండా లోపాలను సరిదిద్దుకుంటూ తోడూ నీడగా ఉండాల్సిన అవసరాన్ని చెపుతూ పరస్తీ కామన కూడదంటున్నాడు, చాణక్యుడు. ధర్మ బద్ధంగా అనుభవించడం శృంగారం కాగా అధర్మ బద్ధమైన అనుభవం కామంగా చెపుతారు.
            భోజనం... ముందుగా అది అవసరమనిపిస్తుంది, కొద్దిగా తిన్నాక అదే అనవసరమనిపిస్తుంది, ఇంకా తింటే అరుచి గా మారుతుంది, మరింతగా తింటే అసహనీయమౌతుంది. అవసరానికి మించి భుజించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మితాహారం మంచిది. మితాహారానికి సంతృప్తి ప్రధానం అంటాడు, చాణక్యుడు.
            ప్రతి వ్యక్తికీ ధన సంపాదన అవసరం. అభివృద్ధి కావాలి అంటే ధనం కావాలి. కాని ఎంత సంపాదించాలి? మన భౌతిక అవసరాలకు సరిపోయిన దానికన్నా అధికంగా ఉంటే అది అభివృద్ధి అనబడుతుంది. ఈ నిర్ణయం వ్యక్తిగతమే. అయితే మన ఆరోగ్యాన్నీ, కుటుంబాన్ని, ఆనందాన్నీ త్యాగం చేసి సంపాదిస్తే దాని వల్ల ప్రయోజనం ఏమిటి? ఆలోచించాలి. భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను సంతృప్తికరంగా నిర్వహించేందుకు అవసరమైన సంపదను గడించడం, అందులో సంతృప్తిపడడం మంచిదని చాణుక్యుల అభిప్రాయం.
            ఇక సంతృప్తి పడకూడని విషయాలు...
            అధ్యయనం... అధ్యయనం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానం వల్లనే బ్రహ్మ తత్త్వాన్ని, ఆత్మ తత్త్వాన్నీతెలుసుకో గలుగుతాము.  లోతైన ఆధ్యయనం వల్ల సామాజిక ఆర్ధిక సాంకేతిక ప్రగతి వెలుగు చూస్తుంది. కాబట్టి నిరంతర ఆధ్యయనం చేయమనై చెపుతారు. ఈ ఆధ్యయన ప్రక్రియలో సంతృప్తి కూడదని చెపుతున్నాడు, చాణక్యుడు.
            జపం. జపించడం వల్ల పురాకృత పాపసంచయం ప్రక్షాళనమౌతుంది అనేది ఋషి వాక్యం. ఎన్ని వేల జన్మలనుండి మనం మూట గట్టుకున్న పాపాలు ఎన్నో మనకు తెలియదు. కాబట్టి జప సాధన అపరిమితంగా ఉండాలంటాడు.
            "త్యాగేనైకేనేతి అమృతత్వ మానుషుః" త్యాగం వల్లనే అమృతత్త్వాన్ని సాధించగలము. దానం చేయడం వల్ల కలిగే ఆనందానుభూతి అపరిమితం. దానం అంటే డబ్బే కానక్కర్లేదు ప్రేమ, సేవ, ఆనందం, భరోసా ఇలాంటివి ఎన్నో... వీటిని కలసి అనుభవించడం వల్ల కలిగే అనుభూతి ఆనందానికి పరాకాష్ట యైన బ్రహ్మ తత్త్వాన్ని దర్శింపచేస్తుంది. కాబట్టి త్యాగభావన పెంపొంద చేసుకోవాలని ప్రబోధిస్తున్నాడు, చాణక్యుడు.
            ఇలా చిన్న శ్లోకం ద్వారా అలఘు తత్త్వాన్ని ప్రబోధిస్తున్నాడు, చాణక్యుడు.


పాలకుర్తి రామమూర్తి

ప్రయత్నం లేనిదే ప్రపంచంలో ఎవరూ ఏదీ సాధించలేరు.

ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః
నహి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగాః!
(కవి ఎవరో తెలియదు)

            ఉద్యమించనిదే అంటే ప్రయత్నం లేనిదే ప్రపంచంలో ఎవరూ ఏదీ సాధించలేరు. బలవంతమైన సింహమైనా సరే ప్రయత్నం చేయనిదే తన ఆకలి తీర్చుకోలేదు. అరే సింహం మృగరాజుకదా, బలవంతమైనది, ఆకలితో ఉన్నది కాబట్టి దానికి ఆహారమవుదామని ఏ జంతువూ కోరుకోదు కదా.
            సుప్త జాతికి ప్రగతి లేదు. పురోగతి లేని జాతికి సుగతి దుర్లభం. నిస్వార్థమైఅన్ చైతన్యంతో జాతి జాగృతమై అడుగు ముందుకు వేస్తేనే సమాజాభివృద్ధి సాధ్యపడుతుంది. నిస్వార్థత, నిరంతర తపన, కార్య దీక్ష, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం ఆయుధాలుగా ఉదాత్తమైన లక్ష్యాన్ని ఛేదించాలనే ఆశయంతో పురోగమించే వారికి భగీరథుడు ఆదర్శప్రాయుడు. (నేను వ్రాసిన గంగావతరణం పద్య కావ్యంలో  భౌతిక  లక్ష్యమైనా ఆధ్యాత్మిక లక్ష్యమైనా సరైన అవగాహనతో ముందడుగు వేస్తేనే విజయ సాధన సాధ్యమౌతుందనే సత్యాన్ని భగీరథుని చరిత్ర ద్వారా చెప్పించడం జరిగింది) భారత జాతి అలాంటి జాతులన్నింటికి ఆదర్శప్రాయమైనది. "భా" అంటే ప్రకాశం, "రతము" అంటే కోరిక. ప్రకాశము అంటే ఉన్నతిని సాధించాలనే తపన కలిగిన వారే భారతీయులు.
            సాధ్యాన్ని సాధనతో తప్ప సాధించడం సాధ్యం కాదు. లక్ష్య సాధన దిశలో గరుత్మంతుడైనా రెక్క లాడించనిదే గమ్యాన్ని చేరలేడు అలాగే తాబేలైనా ప్రయత్నిస్తే లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. నిరంతర కృషి మాత్రమే విజయ సాధనకు దగ్గర దారి. ప్రలోభాలకు లొంగిపోయే మానసిక వికలాంగులు ఏనాడూ లక్ష్య సాధకులు కాలేరు.
            మరొక్క ముఖ్య విషయం ఏమంటే మానవ ప్రయత్నానికి ప్రాకృతిక శక్తుల సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఏ ప్రాకృతిక ధర్మాన్ని తెలియచేయడమే ఈ చిన్ని శ్లోకం ఉద్దేశ్యం.
            పాలకుర్తి రామమూర్తి



సహజమైన లక్షణాలు

దాతృత్వం ప్రియ వక్తృత్వం ధీరత్వ ముచితజ్జతా
అభ్యాసేన నలభ్యన్తే చత్వారః సహజాగుణాః!  17-1
            అంటాడు, చాణక్యుడు.

            దానమిచ్చే స్వభావము, అందరితో ప్రీతిగా మాట్లాడే స్వభావము, ధీరత్వము అనగా నిదానము లేదా నెమ్మదితనము, మరియు సరైన వస్తువులను గుర్తించడము ఇవి ప్రతి వ్యక్తికీ సహజ సిద్ధమైన గుణాలు. ఇవి పుట్టుకతోనే అందరికీ అలవడతాయి. అభ్యాసంతో వీటిని సాధించలేము. అభ్యాసం చేసినా చేయక పోయినా వీటిని పొందుతాము అంటాడు, చాణక్యుడు.
            జీవితము అతి సహజమైనది. సహజమైనది అనడంలోనే అన్నీ మనతో కూడా జనించినవే అని అర్థం. అంటే అనుకూలాంశాలు, ప్రతికూలాంశాలు రెండూ మనతో ఉదయించేవే. దేన్ని మనం ఆదరిస్తాము దేనిని దూరంగా పెడతాము అనే దానిపైనే మన జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.
            పైన ఉటంకించిన స్వభావాలే కాదు అన్ని సానుకూలాంశాలూ మన సహజాతాలే అయినప్పుడు మనమందరం ఎందుకని విజయం సాధించడం లేదు? విజయ సాధనలో పైన ఉదహరించిన అంశాలు సానుకూలాంశాలు కాని వాటిపై లోభత్వం, అభిజాత్యం, అహంభావం, పిరికితనం, అజ్జానం లాంటి ముసుగులను కప్పి పెట్టడం వల్ల సహజాతాలను గుర్తించడం లేదు.
            దీనికి ప్రధాన కారణం; మనలో చాలామంది ప్రతికూలాంశాలకు ఇచ్చిన ప్రాధాన్యతను అనుకూలాంశాలకు ఇవ్వకపోవడమే అనాలి. ఎందుకు ఇవ్వడంలేదు అంటే మనలో చాలా మందిమి ప్రాకృతికమైన ఒక ముఖ్యమైన ధర్మాన్ని విస్మరించడమే. అదే ఆకర్షణ ధర్మం లేదా అధ్యాత్మిక ధర్మం. అంటే మనం దేనిని బలంగా కోరుకుంటామో అది సాకారమౌతుంది. మన జీవితాన్ని ఏ కేంద్రం నుండి నిర్వహిస్తున్నామనేది ఇక్కడ చాలా ముఖ్య భూమిక నిర్వహిస్తుంది. నమ్మకం కేంద్రంగా పనిచేస్తే సానుకూలాంశాలు సాకారమౌతాయి. అలాకాక అపనమ్మకం కేంద్రమైతే ప్రతికూలాంశాలు సాకారమౌతాయి.
            తదాస్తు దేవతలుంటారని చెడు కోరుకుంటే అలాగే దీవిస్తారని చిన్నప్పుడు మనకు మన పెద్ద వాండ్లు చెప్పే వారు. ఇప్పుడు మనం వారి కంటే చదువులలో మించి పోయాము. సాంకేతికత అభివృద్ధి చెందింది. విదేశీ సంస్కృతి మనకు ప్రీతిపాత్రమైంది. పాత తరం పాత చింతకాయ పచ్చడయింది. అవన్నీ మూఢ నమ్మకాలయ్యాయి. కాబట్టి వాటిని విశ్వసించము. ఒకవేళ విశ్వసించాలి అంటే ఎవరో రష్యావాడో అమెరికా వాడో చెప్పాలి.
            కాని, కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారత దేశంలో యోగులు మునులు మన మనస్సు యొక్క అపూర్వమైన శక్తియుక్తులను గుర్తించగలిగారు. దానిని ఎలా మాలిమి చేసుకోవాలో ఎలా ఉపయోగించు కోవాలో బోధించారు. మన Subconscious Mind అదే సుప్తచేతనాత్మకమైన అంతర్మనస్సుకున్న శక్తిని తెలుసుకుంటే, దానికి చేతన నివ్వగలిగితే అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయవచ్చు.  ఒక ఇనుప ముక్క లోకి ఆయస్కాంత శక్తిని నింప గలిగితే, అది దానికి 12 రెట్ల బరువును పైకెత్త గలుగుతుంది. ఇదే సూత్రం పై స్వభావాలకు అన్వయిస్తుంది. సానుకూలాంశాలను పదే పదే గుర్తుచేసుకోవడం, ప్రతికూలాంశాలను పట్టించుకోక పోవడం వల్ల మన అంతర్మనస్సు సానుకూలాంశాల వైపు ఆకర్షించ బడుతుంది. ఒకసారి అలా ఆకర్షించబడ్డ మనస్సు తన విజయానికి కావలసిన అన్ని అంశాలను మన ముందుంచుతుంది. విజయం కరతలామలక మౌతుంది.

            Subconscious Mind అదే సుప్తచేతనాత్మకమైన అంతర్మనస్సుకు మంచి చెడ్డలు తెలియవు. ఏది మనం బలోపేతం చేస్తే దానినే అది ఆవిష్కరిస్తుంది. దాని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనదే.

భార్యా భర్తల సంబంధం ఎలా ఉండాలి

సంతుష్టో భార్యయా భర్తా, భర్తా భార్యా తదైవచ
యన్నిన్నైవ కులోన్నిత్యం, కళ్యాణం తత్రవైధృవం!

            ఏ ఇంటిలో నైతే భార్యవల్ల భర్త, భర్తవల్ల భార్య సంతోషం పొందుతారో; ఆ ఇంటిలో సకల శుభములు, కళ్యాణములు  నిలుస్తాయని అంటాడు, మనువు.
            సంసారం అనే రథానికి భార్యా -- భర్త ఇరువురూ రెండు చక్రాల లాంటి వారు. అవగాహనతో కూడిన సమన్వయం వారిని సంతోషం అనే మార్గం ద్వారా ఆనందం అనే గమ్యాన్ని చేరుస్తుంది. ఆ అవగాహన కొరవడి అసహనాన్ని ఆశ్రయిస్తే వారి గమనం, గమ్యం రెండూ మారి పోతాయి.
            మారుతున్న కాలంలో వేగం పెరిగింది. భార్యాభర్త లిరువురూ సంపాదిస్తేనే తప్ప కనీస జీవన ప్రమాణాలతో జీవించడం సాధ్య పడదు. వ్యక్తిగత ఉద్యోగ జీవనముల మధ్య సమన్వయం సాధించ లేకపోవడం వల్ల పెరిగే ఒత్తిడి వల్ల దంపతుల మధ్య దూరం పెరుగ వద్దంటే వారి మధ్య అవగాహన పెరగాలి.
            చిన్న చిన్న కారణాలతో భార్యాభర్తలు విడిపోయి వారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తున్నారు. ఎవరి కారణాలను వారు సమర్థించుకోవచ్చు కాని ఫలితం సమాజానికి చెడు సంకేతాలను పంపుతుంది. ఇది సమర్థనీయమా?
            స్వేఛ్చ - రక్షణ ఈ రెండూ ముఖ్యమైనవే అయితే స్వేఛ్చకన్నా రక్షణయే ప్రాధాన్యతాంశంగా గుర్తించాలి.
            స్త్రీ పురుషులు ఇరువురూ రెండు విభిన్న కుటుంబ నేపథ్యాలనుండి ఒకచోట సహజీవనం చేసేందుకు, అనుభూతులు, అనుభవాలు, ఆకాంక్షలు, ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకొని ఒకరికొకరిగా కలసి ఉండేందుకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. వైవిధ్య భరితమైన ఆశలతో, ఆశయాలతో, ఆపేక్షలతో ఒకచోట చేరిన వారి ఊహలు యదార్ధం కాకపోతే వారిలో పొడసూపే అసంతృప్తి వారి సంసార జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది.
            మనువు "సంతుష్ట" అనే పదాన్నే వాడాడు. సంతుష్ట అంటే సంతోషం అని అర్థం. అది ఇంద్రియాలకు సంబంధించింది మాత్రమే. ఇంద్రియాలకు అతీతంగా మనసు స్ఫందించేది "ఆనందం".
            జాన్ గ్రే అనే రచయిత "Men are from Mars, Women are from Venus" అనే పుస్తకం వ్రాసాడు. దాదాపు 2 కోట్ల ప్రతులు అమ్ముడు పోయిన ఆపుస్తకంలో రచయిత ఇద్దరి మధ్య ఉండాల్సిన సున్నితత్త్వాన్ని గురించి చెప్పాడు. సంతోష సమయంలో అందరూ ఒకరి ప్రక్కకు ఒకరు నిలుస్తారు కాని కష్ట సమయంలో నిలిచినప్పుడే అనుబంధం గట్టి పడుతుందని చెపుతాడాయన.
            దీనిని గుర్తించిన భారతీయ సమాజం ఒకరిపట్ల ఒకరి నిబద్ధతను న్యాయం, చట్టం పరిధిలో నిర్వచించింది. నాతి చరితామి, నాతి చరితవ్య అంటూ ప్రమాణాలు చేయించింది.
            దీనిని యువతరం అర్థంచేసుకోగలిగితే ప్రశాంతమైన జీవనం సాధ్య పడుతుంది, ఆదర్శవంతమైన సమాజం ఆవిష్కరించ బడుతుంది.

            పాలకుర్తి రామమూర్తి

విద్య గురు ముఖతః నేర్వాలి

పుస్తకం ప్రత్యాధీతం నాధీతం గురు సన్నిధౌ
సభా మధ్యే న శోచన్తే జార గర్భా ఇవ స్త్రియః!
                                                            చాణక్య నీతి --- 17-1

            విద్య నభ్యసించడం గురుముఖతః జరగాలని చాణక్యుల అభిప్రాయం. యోగ్యుడైన గురువు వద్ద విద్య నభ్యసించని వాడు పుస్తకాలనుండి గ్రహించిన విజ్ఞానంతో తానే విద్వాంసుడనని భావిస్తే అది అతని భ్రమయే అంటాడు, చాణక్యుడు. ఉదాహరణగా... జార స్త్రీ గర్భం దాల్చి సభలో నిలిస్తే ఎలాగో పుస్తకస్తమైన విజ్ఞానం ఆలంబనగా సభలో నిలవడం అలాంటి గౌరవాన్నే ఇస్తుందని అంటున్నాడిక్కడ. సక్రమ సంబంధంతో గర్భం దాల్చిన స్త్రీకి, అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన స్త్రీకి లభించే గౌరవ మర్యాదలు ఎలాంటివో... అలాంటి గౌరవమే గురు ముఖతః విద్య నేర్చిన వానికి, పుస్తకస్తమైన విజ్ఞానాన్ని మాత్రమే పొందిన వానికి విద్వత్సభలలో లభిస్తుందంటాడు, చాణక్యుడు.
            లోతుగా పరిశీలిస్తే, విజ్ఞానం ముఖ్యంగా అధీతి, బోధ, అవగతం, ప్రచారం అనే నాలుగు మార్గాలలో ప్రయాణిస్తుంది. అధీతి అంటే గురు ముఖతః లోతుగా అధ్యయనం చేయడం. విషయాన్ని లోతుగా పరిశీలించడం వల్ల అవగాహన పెరుగుతుంది. ఒక విద్యాలయంలో తనతో చదివే విద్యార్థుల అవగాహనా పరిధి చర్చల ద్వారా విస్తృత మౌతుంది. అనుమానాలు తీర్చుకునేందుకు గురువు యొక్క అవగాహన తోడవుతుంది. ముఖ్యంగా కలసి పనిచేయడం వల్ల సంయమనత అలవడుతుంది. ఎదుటి వ్యక్తి దృష్టి కోణం నుండి అర్థం చేసుకోవడం, ఆలోచన చేయడం అలవాటవుతుంది. ప్రజ్ఞాపూర్ణుడైన గురువు వద్ద విద్య పలుకుల ఆధారంగా కాక ఆత్మ నుండి ఆత్మకు (presence to presence) చేరుతుంది. విషయ పారీణత పుస్తకాలలో కొంత పరిధిలో మాత్రమే లభిస్తుంది. అదీ రచయిత అవగాహన మేరకు మాత్రమే లభ్యమయ్యే విజ్ఞానం సమగ్రతను సంతరించుకునే అవకాశం తక్కువ. ఒకవేళ రచయితకు సమగ్ర అవగాహన ఉన్నా వ్యక్తీకరణలో లోపం లేదా పఠిత అవగాహనా లోపం వల్ల అసమగ్రత చోటు చేసుకుంటుంది.
            బోధ అంటే విషయాన్ని అన్ని కోణాలలో పరిశీలించి విద్యార్థి అవగాహనకు గురువు అవగాహనకు లేదా తోటి వారి అవగాహనకు మధ్య ఉండే భేదాన్ని గుర్తించడం. ఎదుటి వాడెందుకు చెప్పాడనే అవగాహన పెరగడమే బోధ. అన్వయం చేసుకోవడంలోని క్లిష్టత గురు ముఖతః తెలుసు కోగలిగే అవకాశం ఉంటుంది.
            అవగతం అంటే దానిని ప్రతిక్షేపించి ఫలితాన్ని సరి చూసుకోవడం. పుస్తకగతమైన విజ్ఞానాన్ని సరి చూసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నైపుణ్యం కావాలి అంటే ఫలితాన్ని స్వయంగా ప్రతిక్షేపించి పరిక్షించాలి.
            ప్రచారం అంటే... తాను నేర్చిన విజ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయడం. తాను సంతృప్తి పొందిన పిమ్మట, విషయాన్ని సభలలో ప్రస్తావించడం వల్ల సభాసదుల ప్రశ్నలను ఆత్మ స్థైర్యంతో ఎదుర్కొన గలుగుతాము. అనుమానాలకు, సందిగ్ధతకు తావులేని విధంగా చెప్పడం గురు ముఖతః నేర్చిన వారికి సాధ్యపడినంతగా పుస్తకాలతో సాధించిన విజ్ఞానం ఆలంబనగా నిలిచే వారికి సాధ్యపడదు.
            ఒక డాక్టర్ తాను పుస్తకాలలో ఎంత నేర్చినా అది మిడి మిడి జ్ఞానమే అవుతుంది కాని ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. అలాగే ఒక ఇంజనీర్, ఒక ఉపాధ్యాయుడు అలాగే ఏ ఇతర వృత్తి వారయినా తాము గురు ముఖతః నేర్చిన దానికి పుస్తకాల ద్వారా తెలుసుకున్న దానికి భేదం ఉంటుందనేది ఆచార్య చాణక్యుల అభిప్రాయం.
            మరొక్క విషయం దీనికి జోడించాలి. అక్షరాలు ఒక విషయాన్ని చూపుతాయి. వాటిని పద్ధతి ప్రకారం అమరిస్తే అది సమాచారం అవుతుంది. సమాచారాన్ని భావానికి అను సంధానిస్తే అది విజ్ఞానం అవుతుంది. విజ్ఞానం పరీక్షింపబడి సంతృప్తికర ఫలితాలు వస్తే అది సాక్షాత్కార మౌతుంది. అది గురు ముఖతః జరిగితే, అనుమానాలు మాయమవుతాయి.

పాలకుర్తి రామమూర్తి

ఏ సమాజంలో నివసించాలి

లోక యాత్రా భయం లజ్జా దాక్షిణ్యం త్యాగశీలతా
పంచయత్ర న విద్యంతే న కుర్యాత్తత్ర సంగతిమ్!
                                                            చాణక్య నీతి --- 1-10

            ప్రశాంత నివాసానికి అయిదు స్థానాలను వర్జనీయాలుగా చెపుతున్నాడు, చాణక్యుడు. జీవనోపాధి దొరకని స్థలం,  పౌరులలో భయము, సిగ్గు, ఉదారత మరియు దానశీలత లాంటివి కనిపించని స్థలాలు నివాస యోగ్యం కాదంటాడు, చాణక్యుడు.
            జీవనోపాధికి వృత్తి వ్యాపారాలు దొరకని స్థలాలు: ప్రతి జీవికీ ఆకలి ప్రాథమిక అవసరం. ఉపాధికి అవకాశాలు లభించడం వల్ల శరీరాన్ని పోషించుకునే అవకాశం ఉంటుంది. శరీరం, నేను లేదా ఆత్మ ఈ రెండింటి సంయోగం వల్ల మనకు ఉనికి కనిపిస్తుంది. శారీరక అవసరాలు వేరు ఆత్మ లేదు నేను యొక్క అవసరాలు వేరు. ఉదాహరణకు... ఆకలి వేస్తుంది.. ఆహారం తీసుకుంటాము.. ఆకలి తీరుతుంది. ఇది శారీరక అవసరం. ఏం తింటున్నాము ఎక్కడ తింటున్నాము అనేది శరీరానికి అవసరం లేదు. శరీరం కోరుకునేది తన పోషణకు అవసరమైన పోషకాహార విలువలతో కూడిన ఆహారం దొరికితే చాలు. మరి "నేను"కు కావలసింది? గౌరవంతో కూడిన ఆహారం, రుచితో కూడిన ఆహారం. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆహారం. ఉన్నత వర్గంతో కూర్చొని భుజించేందుకు అవకాశం ఇచ్చిన ఆహారం. తన అహాన్ని సంతృప్తి పరచ గలిగిన ఆహారం కావాలి. దానికై అది తపిస్తుంది. నిరంతరం శ్రమిస్తుంది, ఆలోచిస్తుంది, ఆవైపు గమిస్తుంది, దానిని సాధిస్తుంది.
            కనీస అవసరాలు దొరకని నాడు సమాజంలో అభద్రతా భావన నిండుతుంది. జనంలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేమిచేత సమాజం లో అలజడి ఏర్పడుతుంది. అలజడి సంఘర్షణకు దారి చూపుతుంది. శాంతి సౌహార్ద్రతలు సన్నగిల్లి బలహీనులను దోచుకునే అరాచక శక్తులు రాజ్య మేలుతాయి. ఈర్శ్యాసూయలు ఎక్కువై జీవనానికి విఘాతం కల్పిస్తాయి. అందువల్ల ప్రజలకు కనీస అవసరాలు తీర్చుకుని గౌరవంగా బ్రతుక గలిగేందుకు అవసరమైన ఉపాధి అవకాశాలు లభించే ప్రదేశంలో జీవించాలని చెపుతున్నాడు, చాణక్యుడు.
            ఎక్కడైతే భయము, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవో: వైవిధ్య భరితమైన నమ్మకాలతో, అలవాట్లతో ఒకే ప్రదేశంలో ఒక్కటిగా జీవించే వ్యక్తుల సమూహమే సమాజం.  ఆ సమాజంలో ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉండాలి, స్పందనలుండాలి, అభిమానాలుండాలి. అప్పుడే అక్కడ శాంతి సౌభాగ్యాలు నిలుస్తాయి.  ఏ సమాజమైనా కొన్ని విలువల ప్రాతిపదికన నడుస్తుంది. ఏది యుక్తమైనదో ఏది  చేయకూడనిదో సమాజం నిర్దేశిస్తుంది. అనుసరణీయమైన పనులు చేయడం వర్జనీయాలను చేయకపోవడం ఆదర్శణీయం, ఆదరణీయం. చేయకూడని పనులు చేయడంలో భయం, బిడియం, సిగ్గు, లజ్జల ప్రమేయం ఉంటుంది. ఆ సున్నితత్త్వం ప్రజలలో లోపిస్తే వ్యక్తులకు జంతువులకూ మధ్య బేధం ఉండదు. కాబట్టి అలాంటి సమాజం వర్జనీయం అంటాడు, చాణక్యుడు.
            దాక్షిణ్య భావం లేని సమాజం: ఏ సమాజంలో నైతే ఒకరి పట్ల మరొకరికి కృప, కనికరం, జాలి, దయ, దాక్షిణ్యం లాంటి భగవద్గుణాలు ఉండవో అక్కడ రాక్షసత్వం రాజ్యమేలుతుంది. అశాంతి కోరలు చాస్తుంది. అనైతిక భావనలు వెలుగు చూస్తాయి. విద్వాంసులు నిరాదరణకు గురవుతారు. తద్వారా ప్రగతి కుంటుపడుతుంది. ప్రగతి లేని సమాజానికి సుగతి ఉండదు. కాబట్టి అలాంటి సమజం వాసయోగ్యం కాదంటాడు, చాణక్యుడు.
            త్యాగశీలత లేని సమాజం: పరులకు ఉపకారం చేయడం వల్ల మనమేదో ఘన కార్యం చేసినట్టుగా భావించడం సమంజసం కాదు. ఎదుటి వారి సుఖసంతోషాలపైనే మన సుఖసంతోషాలు ఆధారపడి ఉంటాయి. స్వార్థం నిండిన సమాజంలో అనుమానాలు, అవమానాలు ఎక్కువవుతాయి. ఒకరికొకరు అవసరాలలో సాయపడడం వల్ల త్యాగ భావన చిగురిస్తుంది. అక్కడ చట్టాలు గౌరవించ బడుతాయి. మానవత వెలుగు చూస్తుంది. ఎదుటి వారి సంతోషానికై మనం కొంత త్యాగం చేయడం వల్ల ఆనందాన్ని అనుభవిస్తాము. అలాంటి త్యాగభావన లేని సమాజం వర్జనీయం అంటాడు, చాణక్యుడు.

ఏ సమాజమైతే సమగ్ర వికసనను కోరుకుంటుందో.. ఆ సమాజం అభ్యుదయ కారక మైన పై లక్షణాలను సంతరించుకోవాలి. వర్జనీయమైన లక్షణాలను విడిచి పెట్టాలి. ఒకవేళ అలాంటి సమాజం లభ్యం కాని పక్షంలో అక్కడ నివాసం యుక్తం కాదంటాడు, చాణక్యుడు.