Thursday, May 11, 2017

దేనికైనా తేజస్సు (పరాక్రమమే) ముఖ్యం కాని దేహ బలం దానికి ప్రత్యామ్నాయం కాగాజాలదు.

హస్తీ స్థూలతనుః స చాంకుశ వశః కిం హస్తి మాత్రో౨ఙ్కుశో
దీపే ప్రజ్వలితే ప్రణశ్యతి తమః కిం దీప మాత్రం తమః
వజ్రేణాపి హతాః పతంతి గిరయః కిం వజ్ర మాత్రం నగాన్
తేజో యస్య విరాజతే సబలవాన్ స్థూలేషు కః ప్రత్యయః!          11-3
            అంటాడు చాణక్యుడు.

            బాగా బలీష్ఠమైన ఏనుగు చిన్న అంకుశానికి లొంగుతుంది. ఏనుగు పరిణామం ఎంత? అంకుశం అరిణామం ఎంత? చిన్న దీప వెలిగితే  తమము (చీకటి) పారిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా పరుచుకున్న చీకటి పరిణామం ఎంత? చిన్ని దీపం పరిణామం ఎంత? చేత ధరించ గలిగిన వజ్రాయుధం దెబ్బకు పర్వతాలు పడిపోతున్నాయి. పర్వత పరిణామం ఎంత? వజ్రాయుధ పరిణామం ఎంత? దేనికైనా తేజస్సు (పరాక్రమమే) ముఖ్యం కాని దేహ బలం దానికి ప్రత్యామ్నాయం కాగాజాలదు.
            చాలామంది శ్రేష్ఠతా సాధనను చాలా పెద్ద సమస్యగా భావిస్తారు. కాని యాజమాన్య నిర్వహణా రంగ పరిశోధకులు, బోధకులు సాధారణమైన కృత్యాలను అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో నిర్వహించడం శ్రేష్ఠత అని చెపుతారు. ప్రయోజనం ప్రభావం; ఈ రెంటి మధ్య సంబంధం సరిగా అవగాహన చేసుకో గలిగితే శ్రేష్ఠతను సాధించడం కష్టతరం కాదని యాజమాన్య నిర్వాహక నిపుణులు చెపుతున్నారు. రాశి కన్నా వాశి మిన్న. పరిమాణానికన్నా పరిణామం మిన్న అన్న విషయానికి ప్రాధాన్యత నిస్తే యోగ్యత మరియు పరిపూర్ణతలను సాధించగలుగుతాము. అదే శ్రేష్ఠతగా అవతరిస్తుంది. పైన ఉదహరించిన అంకుశం కాని, దీపం కాని,వజ్రాయుధం కాని ఈ యోగ్యతా పరిపూర్ణతలకు ప్రతీకలుగా తీసుకుంటే జీవన గమనంలో మనమెలాంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలో అర్థం అవుతుంది.

ఆంగ్లంలో Too big to hit is too big to miss అనే సామెత ఉంది. భయపడితే సమస్య లన్నీపెద్దవిగానే కనబడతాయి. సమస్యలను ఎప్పుడైతే సవాళ్ళుగా స్వీకరిస్తామో ఆ సమస్యల పరిష్కారానికి అన్ని మార్గాలను అన్వేషిస్తాము.... సాధిస్తాము. అందుకే దేహ బలానికన్నా బుద్ధి బలం గొప్పదనే సామెత వచ్చింది.

కార్యం నిర్వహించే వరకు మనసులో మాట బయట పెట్టకండి

మనసా చిన్తితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్
మన్త్రేణ రక్షయేత్ గూఢం కార్యా చాపి నియోజయేత్!
అంటాడు, చాణక్యుడు.

            మనసులో ఏ కార్యాన్నైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనలను ఎవరి దగ్గరా ప్రస్తావించ వద్దు. అంతే కాదు, మంత్ర సమానంగా రహస్యంగా ఆ అలోచనలను కాపాడాలి. ఎందుకు? అంటే... ఆలోచనలకు కార్య రూపాన్నిచ్చేప్పుడు ఎవరైనా అవరోధాలు కల్పించ వచ్చు. సాఫల్యత జరగక పోతే అపహాస్యం చేయవచ్చు. అంతేకాదు ఆలోచనలను అమలు చేసినప్పుడు అందరూ అబ్బుర పడతారు, గుర్తింపూ వస్తుంది. కార్య భంగం కాదు. కాబట్టి
ఆలోచనలను విశ్లేషణ చేసుకొని కార్య నిర్వహణా ప్రణాళికను రచించుకొని ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం ఉత్తమమని చాణక్య నీతి చెపుతున్నది.
            ఒక హాల్ లో పెట్టుబడులకు సంబంధించిన ఒక సదస్సు జరుగుతుంది. అందులో చాలా చురుకైన సౌందర్యవతి యైన ఒక అమ్మాయి  పాల్గొన్నది. క్రియాశీలకంగా ప్రవర్తిస్తూ, అందరినీ ఆకట్టుకుంటున్న ఆ అమ్మాయిని ఒక యువకుడు చూచాడు.. మొదటి చూపులోనే ఆమెను ప్రేమించాడు. ఆమె అందానికి మోహితుడైన ఆ యువకుడు ఆమె వద్దకు వెళ్ళి "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" నీకు సమ్మతమైతే పెళ్ళి చేసుకుంటానని చెపుతాడు. ఆమె ఆర్థిక యోజనా, ప్రణాళికా రంగంలో నిష్ణాతురాలు కాబట్టి… ఆ అబ్బాయిని అడుగుతుంది. మంచిదే కాని నీ ఆర్థిక స్థితి గతులను గూర్చి కుటుంబ పూర్వాపరాలను గూర్చి చెప్ప మంటుంది. ఆ యువకుడంటాడు, ఇప్పుడు నేను తండ్రిచాటు బిడ్డడినే, సామాన్యుడినే... కాని కొన్ని నెలల తదుపరి కోటీశ్వరుడి నౌతానంటాడు. ఎలా అని అడుగుతుంది, ఆ అమ్మాయి. అతనంటాడు, నాతండ్రి జబ్బుతో తీసుకుంటున్నాడు బహుశా కొద్ది నెలలలో అతడు మరణిస్తాడు, తదుపరి అతని ఆస్తి మొత్తానికి అంటే దాదాపు రూ. 300 కోట్లకు నేనే అధిపతి నౌతానంటాడు. ఆ మాటల కా అమ్మాయి ప్రభావితమౌతుంది, ఇరువురు వారి అడ్రసులు, ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు.
            రోజులు గడుస్తున్నాయి, ఆ అబ్బాయి ఊహాలలో తేలిపోతున్నాడు. ఇలా ఉండగా, చాలా కొద్ది కాలంలోనే ఆ అమ్మాయి ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది.

            కాని, ఆ అబ్బాయికి భార్యగా కాదు, సవతి తల్లిగా. పెట్టుబడి మార్కెట్ రిస్క్ పై ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలను, ప్రణాళికలను కార్యరూపం దాల్చక ముందే ఇతరులతో పంచుకుంటే ఫలితం తారుమారయే ప్రమాదం ఉంటుంది.  

దేనిని త్యజించాలి

త్యజేద్ధర్మం దయాహీనం, విద్యాహీనం గురుం త్యజేత్
త్యజేత్ క్రోధముఖీ భార్యానిః స్నేహాన్బాంధవాంత్యజేత్!
                                                            చాణక్య నీతి 4-16
దేనిని త్యజించాలో అంటే విడిచి పెట్టాలో ఇక్కడ ఆచార్య చాణక్యులు చెపుతున్నారు.
మొదటగా....ఏ ధర్మంలోనైతే దయాగుణం లేదా ఆ ధర్మం ఎంత గొప్పదైనా దానిని విడిచి పెట్టాలి. ధర్మం అంటే ఆచరించ దగినది లేదా ఆచరణ యోగ్యమైనది. ధర్మం ఈనాడు మతంగా మారింది. సామాజిక ప్రయోజనం లేని సమాజానికి ఉపయుక్తం కాని ధర్మాన్ని ఆచరించడం వల్ల వ్యక్తికీ ప్రయోజనం ఉండదు, సమాజానికీ ప్రయోజనం ఉండదు. కాబట్టి అది విడిచి పెట్టదగినది. ఏ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు సిద్ధిస్తాయో అది ఆచరణీయమైనది, ఆదరణీయమైనది. అహింస, దయ, ప్రేమ, వాత్సల్యత లాంటి గుణాలు సమాజాన్ని ఒక్క త్రాటిపై నిలిపేందుకు సహకరిస్తాయి. ఆ గుణాలు మృగ్యమైతే స్వార్ధం పెరిగితే ఒకరినొకరు హింసించు కునేందుకు సమాయత్తమై అరాచకాన్ని సృష్టిస్తారు. కాబట్టి ఆ ధర్మాన్ని(మతాన్ని) విడిచి పెట్టమని చెపుతున్నాడు.
రెండవది... విద్యాహీనుడైన గురువు: విద్య వినయాన్ని, సంస్కారాన్ని ఇవ్వాలి. కలసి బ్రతకడానికి అవసరమైన మానసిక చైతన్యాన్ని ఇవ్వాలి. దూరదృష్టిని... శాస్త్రీయ భావాన్ని నింపాలి. సరైన విధానంలో సరైన సమాజాన్ని నిర్మించడానికి అవసరమైన అలోచనా విధానాన్ని రేకెత్తించాలి. అప్పుడే వ్యక్తి సంస్కారవంతుడౌతాడు. అతని సంస్కారం సమాజానికి ఉపయుక్త మౌతుంది. ఇక గురువు వ్యక్తిలోని అంధకారాన్ని లేదా అజ్ఞానాన్ని తొలగించ గలగాలి. ఉపాధ్యాయుడు అక్షరాలు నేర్పిస్తాడు. ఆచార్యుడు సంస్కృతిని పరంపరగా అందిస్తాడు, గురువు జ్ఞానజ్యోతిని మనస్సులో వెలిగిస్తాడు. అలాగే మామూలు ఉపాధ్యాయుడు పాఠం చెపుతాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు భావార్ధాలను వివరిస్తాడు. అత్యుత్తమ ఉపాధ్యాయుడు ఆ విలువలను ప్రతిక్షేపించడం ఎలాగో తెలియ చేస్తాడు. గురువు లేదా మార్గదర్శి (Mentor) "తెలుసుకునేందుకు" కావలసిన ప్రేరణ నిస్తాడు. ఆ తెలుసుకోవడమే "యెఱుక" దానికే విద్య కావాలి. ఆ విద్య లేనివాడు గురుత్వానికి పనికిరాడు. కాబట్టి అతనిని విడిచిపెట్టమంటాడు.
మూడవది... క్రోధమూర్తియైన భార్య. కోపం ఒక భావోద్వేగానికి సంబంధించినది. కోపాన్ని ప్రదర్శించడం సమంజసమే. అయితే కోపాన్ని అట్టే పెట్టుకుంటే  అది క్రోధంగా మారుతుంది. అది తనకు గాని తన చుట్టూ ఉండే వారికి గాని మంచిది కాదు. "క్రోధాద్భవతి సమ్మోహా, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశో బుద్ధినాశః, బుద్ధి నాశో ప్రణశ్యతి" అంటుంది గీత. అలాంటి క్రోధాన్ని పూనిని భార్యను విడిచి పెట్టమంటాడు, చాణక్యుడు. భార్యనే కాదు అలాంటి భర్తనూ విడిచిపెట్టవలసిందే.
అంతే కాదు, కోపిష్టులైన స్నేహితులు, బంధువులనూ విడిచి పెట్టమంటాడు, చాణక్యుడు.
కొన్ని బంధుత్వాలు సహజమైనవి.  తల్లి తండ్రి, సోదరులు ఇలాంటి వాటిని త్రొసిపుచ్చ లేము. భార్య, భర్త,  స్నేహితులు లాంటివి సహజమైనవి కావు అవి ఏర్పరచుకున్నవి. ఏ బంధుత్వమైనా సమాజానికి ప్రతిబంధకంగా మారినా, మన అభివృద్ధి నిరోధకంగా ఉన్నా అలంటి బంధుత్వాన్ని స్నేహాన్ని విడిచిపెట్టాల్సిందే.
నిజానికి ఏ బంధుత్వానికీ చావులేదు. మన అహంభావం, మూర్ఖత్వం, స్వార్థం మరియు ఆధిపత్యధోరణి లాంటివే మన బంధుత్వాలను మలినం చేస్తాయి, పాడు చేస్తాయి.

దీనిని గ్రహించి ఆ తీరుగా నడుచుకొమ్మని ప్రబోధిస్తున్నాడు, ఆచార్య చాణక్యులు.

ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలిసిన వాడే పండితుడు

ప్రస్తావనదృశం వాక్యం, ప్రభావనదృశం ప్రియమ్
            ఆత్మశక్తి సమం కోపం యో జానాతిన పణ్డితః!
            సందర్భానుసారంగా మాట్లాడడం, ప్రభావవంతంగా, ప్రియంగా మాట్లాడడం, తన పరిధిలో ఎంత వరకు ఎవరిపై కోపం చూపాలో తెలిసిన వాడు పండితుడు అంటాడు, చాణక్యుడు. ఆ తెలుసుకునేదే "జ్ఞానం" అంటాడాయన.
            పండితుడైన వానికి సభలలో సమావేషాలలో ఏమి చెప్పాలో ఎంత వరకు చెప్పాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎక్కడ కోపం నటించాలో తెలియాలి. ఒక శాస్త్రజ్ఞుల సమావేశానికి వెళ్ళి సామాన్య విషయాలు ప్రస్తావించినా, సామాన్యుల సమావేశంలో వేదాంతాన్ని సంస్కృతంలో ఉపన్యసించినా వక్తకు గౌరవం దక్కదు.
            విషయం మనకెంత తెలుసన్నది కాదు ముఖ్యం. దానిని ఎంత సమర్ధవంతంగా ఎదుటివారితో పంచుకోగలమన్న దానిపైననే మన విజయం ఆధారపడి ఉంటుంది. మన భావాన్ని ఎదుటివారికి సమర్ధవంతంగా తెలియజేయడం వల్ల మన జీవితానికి క్రొత్త మార్గం కనిపిస్తుంది. సమర్ధవంతంగా భావాన్ని పంచుకోవడం ద్వారా అంతర్గత ఆలోచనా సరళి వికసిస్తుంది. మన వైఖరి వ్యాప్తమై విశాలమౌతుంది. నమ్మకాలు లోతుగా పాతుకుపోతావి. దృక్కోణంలో స్పష్టత వస్తుంది. ఆశలు పరిమళిస్తాయి. నిరాశా నిస్పృహలు చెదరిపోతాయి. దెబ్బతిన్న హృదయ స్పందనలు సాధారణమౌతాయి. ఎదుటి వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
            అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడకూడదు? అంటే చిన్న ఉదాహరణ... ఒక మతపెద్ద ఒక పెద్ద పట్టణానికి వచ్చాడు. ఆయన విమానం దిగగానే ఒక విలేఖరి త్వరగా అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడి వ్యభిచారిణుల గూర్చి మీరేం చెపుతారని ప్రశ్నించాడు.  అయితే అక్కడ ఉన్న కొందరా విలేఖరిని మందలించి పంపించారు. కాని విలేఖరుల సమావేశంలో మరో విలేఖరి ఆ విషయాన్నే ప్రస్తావించాడు. దానికి మీ ఊర్లో వ్యభిచారిణు లున్నారా అని ఎదురు ప్రశ్నించాడు, మతపెద్ద. అయితే తెల్లవారి అన్ని పేపర్లలో ప్రచురితమయిన ప్రముఖ వార్త ఫలానా మత పెద్ద విమానం దిగగానే అడిగిన మొదటి ప్రశ్న"మీ ఊర్లో వ్యభిచారిణులున్నారా" గా ప్రచురితమయింది. అందుకే ఆలోచించి మాట్లాడాలి.
            అలాగే సరైన పద్ధతిలో సరైన పదాలను ఎన్నుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. ఆలోచనలు చేయడం ఎలాగో ఎక్కడ ఆ ఆలోచనలు ఉద్భవిస్తాయో గమనించి అక్కడే ఏవి ఉపయుక్తమైనవో, ఏవి కావో గ్రహించి వాటిని సమర్ధవంతంగా ఉపయోగించడం అభ్యసించాలి.
            అవసరమైన చోటా కోపాన్ని నటించక పోతే మనం తేలిక కావడం జరుగుతుంది. అలాగని కోపాన్ని మనస్సులో ఉంచుకోకూడదు. దాని వల్ల మన ఆరోగ్యమే పాడవుతుంది. సంబంధాలూ చెడిపోతావి.

    ఫై విషయాలు తెలిసి ఎవరైతే ప్రవర్తిస్తారో అతడే పండితుడంటాడు, చాణక్యుడు.                                                                                                                               పాలకుర్తి రామమూర్తి

ఆపదలను ధైర్యంతో ఎదురుక్కోవాలే కాని భయపడకూడదు


తావద్ భయేషు భేతవ్యం యావత్ ద్రయమనాగతమ్
ఆగతంతు భయం దృష్ట్వా గ్రహర్తవ్యమశంకయా!
                                                                        చాణక్య నీతి 5-3
            ఆపదలు సంభవిస్తాయని ఖచ్చితంగా తెలిసిన వేళ అవి దూరంగా ఉన్న సమయంలో కొద్దిగా భయపడినా ఆ ఇబ్బందులు క్రమ్ముకు వచ్చినప్పుడు మనసులో ఏ విధమైన శంకను అంటే అనుమానాన్ని పెట్టుకోకుండా వాటిని అధిగమించే ఉపాయాలు ఆలోచించాలి ధైర్యంతో వాటిని ఎదురుక్కోవాలే కాని భయపడకూడదు అంటారు, ఆచార్య చాణక్యులు.
            ఈ ప్రపంచంలో విపత్తులు లేని ప్రదేశము ఉండదు. మనలో కూడా ధైర్యము, భయము రెండూ ఉన్నాయి. ఈ రెండూ మనస్సుకు సంబంధించిన భావోద్వేగాలే. ఒకదానిని అంటిపెట్టుకోని మరొకటి ఉండే ఈ క్రమంలో దేనిని మనమాదరిస్తామనే దానిపై మన పురోగతి లేదా తిరోగతి ఉంటుంది. ఆపదలు దూరంగా ఉన్నప్పుడు అవి మనల్ని పలకరించే అవకాశం ఉన్నదని మనం భావించినప్పుడు అయ్యో అవి మనల్ని చుట్టుముడుతాయేమో ననే భయం కొద్దిగా ఉంటే ఉండవచ్చు గాక, కాని ఎప్పుడయితే ఆపదలు ముంచుకొస్తాయో అప్పుడు భయపడి ప్రయోజనం లేదు. మనముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి ధైర్యంతో ఎదుర్కోవడం లేదా పారిపోవడం. పారిపోతే అవేమీ వదలవు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భయంలేని ప్రదేశం లేదు. భయగ్రస్తుడైన వాడు ఒత్తిడికి లోనవుతాడు, ఒత్తిడి వల్ల నిర్ణయాలు సరిగా తీసుకోలేము. అసమంజసమైన నిర్ణయాల వల్ల అపజయం ప్రాప్తించ వచ్చు. కాబట్టి భయాన్ని జయించాలి అంటాడు, చాణక్యుడు. జయించడం అంటే అధిగమించడమే. అధిగమించాలి అంటే ఆ భయంయొక్క స్వరూపస్వభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మార్గాలు, ఉపాయాలను అన్వేషించాలి. అప్పుడు ఏ మార్గం ద్వారా దానిని అధిగమించడానికి అవకాశం ఉన్నదో అవగత మౌతుంది.
            ఉత్సాహం ప్రేరణ నిస్తుంది, సాహసం ముందడుగు వేయమంటుంది, ధైర్యం మానసిక సమతుల్యతను ప్రసాదించి సక్రమమైన ఆలోచనలను కలిగిస్తుంది. బుద్ధి మంచిచెడ్డలను వివేకాన్ని ప్రసాదిస్తుంది. ఏది యుక్తమో ఏది మనకు హానికరమో, దేని వల్ల తాత్కాలిక ప్రయోజనం కలుగుతుందో ఏది శాశ్వత ప్రయోజనకారియో తెలియచేస్తుంది. ఆసక్తిని రేపుతుంది. శక్తి వల్ల మనపై మనకు సాధించ గలమనే నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. ఏ అవాంతరాన్నైనా అధిగమించ గలననే నమ్మకం ఎంతటి అసాధ్యమైన కార్యాన్నైనా అవలీలగా సాధించ గలిగే చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. పరాక్రమం అంటే ప్రయత్నం ఉద్యమించే మనో చైతన్యాన్నిస్తుంది.
            బుద్ధి దారిని చూపితే, ఉత్సాహం ప్రేరణ నందిస్తే, ధైర్యం పరిణామాలను విశ్లేషిస్తే, సాహసం ఊపిరులూదితే, శక్తి వంతమైన చైతన్యం నేనున్నానని తోడుగా నిలిస్తే సాధించాలనే తపనతో ముందడుగు వేసే వారికి అపజయం, భయం లాంటివెన్నడూ ఎదురవవు, పలకరించవు. బుద్ధిమంతులకు, సాధించాలనే తపన కలిగిన వారికి ఇదే శక్తివంతమైన మార్గము, విపత్తులనధిగమిమ్చే మంత్రమని ప్రబోధిస్తున్నారు, చాణక్యులు.
            చివరగా, భయాన్ని గూర్చి మా తాతగారు కీ.శే. గురజాల గోపాలకృష్ణయ్య శాస్త్రిగారు, మాతో ఒక మాట చెప్పేవారు. ఆపదలు రానంత వరకు వస్తాయని ఆలోచించడం, భయపడడం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ వస్తే... వచ్చాక అనుభవించాలి... వాటిని అధిగ మించాలి అంతేకాని వచ్చాయని విచారించడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఎప్పుడూ ఎదో జరుగుతుందని భయపడుతూ కూర్చోవడం విజ్ఞతకాదు. ఉపాయాలు వెదుకు,  ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నం చేయి, ఫలితం భగవంతునికే వదిలేయమనేవారు.

పాలకుర్తి రామమూర్తి

ఎదుటి వారి బాధలను అర్థం చేసుకోలేరు

రాజా వేశ్యా యమశ్చాగ్నిః చోరాః బాలక యాచకః
పరదుఃఖం నజానంతి అష్టమో గ్రామ కంటకాః!
            అంటాడు, చాణక్యుడు.                                                                    చాణక్యనీతి 17-17

            రాజు, వేశ్య, యముడు, అగ్ని, దొంగ, బాలకులు, యాచకులు మరియు గ్రామ కరణం... ఈ ఎనిమిది మందికీ ఇతరులు ఏ పరిస్థితులలో ఉన్నారనే ధ్యాస ఉండదు. ఎదుటి వారి బాధలను అర్థం చేసుకోలేరు అంటారు, చాణక్యులు.
            రాజుకు సాధారణంగా కష్టాలు దుఃఖాలు తెలియవు. స్వయంగా దుఃఖం ఏమిటో అనుభవించని వానికి ఎదుటి వారి కష్టం అర్ధంకాదు కదా. అంతేకాదు, నిరంతరం రాచకార్యాలలో మునిగితేలే వానికి కొంత కఠినంగా ఉండవలసిన అవసరమూ ఉంటుంది. రాజుల మనస్సు దారుణా ఖండల శస్త్ర తుల్యం, మాట మాత్రము నవ్య నవనీత సమానంగా ఉంటుంది అంటారు నన్నయ గారు భారతంలో. ఎదుటి వారి కష్టాలకు కరిగినట్లే కనిపించాలి కాని ఎప్పుడూ కరగిపోవద్దు. ఇతరుల సలహాలు తీసుకోవాలే కాని తన పద్ధతిలో తాను నడవాలి. అందరికీ స్నేహితునిగా నటించాలి కాని గూఢాచారిలా వ్యవహరించాలి. మిత్రులను, బంధుగణాన్ని చివరకు భార్యా పిల్లలను కూడా అతిగా నమ్మవద్దు. దీనినే విరాట పర్వంలో తిక్కనగారు చక్కని పద్యంలో చెప్పారు.
పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులనరు రాజు లాజ్ఞ మిగిలిన చోటన్
శత్రుల కా దమ యలుకకు బాత్రము సేయుదురు నిజ శుభస్థితి పొంటెన్!
            తమ ఆజ్ఞను ధిక్కరించిన వారు ఎవ్వరయినా ఏ పరిస్థితులలో ఉన్నా చివరకు తమ సంతానమైనా శిక్షిస్తారే కాని ఎదుటివారి బాధలను దుఃఖాన్ని అర్థంచేసుకొని క్షమించడం జరగదు. రాజకీయాలలో నీతిని పాటించేవారు అరుదుగా ఉంటారు. తమ భద్రత, తమ మేలు లక్ష్యంగా సాగే వారి కార్యాచరణలో శాసన ధిక్కారాన్ని ఏ పరిస్థితులలో కూడ సహించరు.
            వేశ్య... ఆమె వృత్తి విటులను ఆకర్షించడం వారి వద్ధ ధనాన్ని పొందడం. అయ్యో! వారి ఇల్లు నావల్ల గుల్ల అవుతుందే అని బాధ పడుతూ కూర్చుంటే తన వృత్తి సాగదు. కాబట్టి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఎదుటివారి కష్ట నష్టాలతో సంబంధం లేకుండా విటులను ఆకర్షిస్తుంది ధనాన్ని ఆర్జిస్తుంది.
            యమధర్మ రాజు యొక్క కర్తవ్యం ... ఆయువు తీరిన జీవుల ప్రాణాలు హరించడమే. మనకు సంబంధించిన వారు ఏ వయసులో ఉన్నా మనల్ని వీడి అనంత లోకాలకు వెళితే మనకు బాధయే. అయితే మృతుల బంధువులు స్నేహితులు దుఃఖిస్తున్నారని కరుణాయత్త చిత్తంతో కూర్చుంటే తన కర్తవ్య పాలనను యముడు చేయలేడు కాబట్టి ఎదుటివారి బాధలను పట్టించుకోకుండా తనపని తాను చేసుకు పోతాడు. అలా చేయకపోతే పెరిగే జన సాంద్రతకు ఈ భూమండలమే కాదు ఎన్ని భూమండలాలైనా సరిపోవు. ఆహార పానీయాదులకూ కష్టమౌతుంది. అయినా పాత నీరు అలాగే ఉంటే క్రొత్తనీరు వచ్చేందుకు అవకాశం ఉండదు కదా.
            అగ్ని లక్షణం కాల్చడం. అగ్నిని సర్వ భక్షకుడు అంటారు. అన్నింటినీ దహించి వేసే అగ్ని శిఖలకు తరతమ భేదం లేదు. ఎవరి బాధలు, కష్టాలను, దుఃఖాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతుంది.
            చోరులు అంటే దొంగల వృత్తి దోచుకోవడమే. అయ్యో ఈ ఇంటి యజమాని కష్టాలలో ఉన్నాడు ఇతని సంపదను దోచుకో వద్దని అనుకుంటే, జాలి కనికరం ఉంటే తన పని నడవదు. అంతే కాదు ఇతరుల బాధలను అర్థంచేసుకోవడానికి అతనేమీ మహానుభావుడు కాదు కదా. అనుసరించి, అదను చూసి, ఆదమరచిన వేళ దోచుకోవడం అలవాటయిన వాడు ఇతరుల దుఃఖానికి స్పందించే సున్నితత్త్వాన్ని ప్రయత్న పూర్వకంగా నైనా వదలివేస్తాడు.
            చిన్నపిల్లలు తమకు కావలసిన దానిని సాధించుకునే క్రమంలో తామెక్కడ ఉన్నదీ, అడిగేందుకది సరైన సమయమా కాదా, ఎలా అడగాలి అనే విషయాలను పట్టించుకోరు. తల్లిదండ్రులు దుఃఖంలో ఉన్నా సంతోషంలో ఉన్నా తాము కోరింది జరిగేదాక హఠం చేస్తారు. అవకాశం ఉంటే గారాబంగా అడిగి సాధిస్తారు. లేదంటే ఏడ్చి, గోల చేసి, పంతం పట్టి, అలిగి అల్లరి చేసి లేదా బ్లాక్ మెయిల్ చేసైనా సాధిస్తారు. ఈ క్రమంలో ఎవరి బాధలనూ వారు పట్టించుకోరు.
            యాచకులు ఎవ్వరినైనా యాచిస్తారు. తమ వృత్తిపరంగా ఎదుటివారు ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారనే విషయం వారికవసరం లేదు. అందరి ముందు చేయిచాచడమే వాడికి తెలిసిన విద్య.
            ఇక చివరగా... గ్రామ కరణాలు... ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించి వారి నుండి వీరి నుండి లబ్ధిపొందడమే వృత్తిగా కలిగి కరణీకం చేసే వ్యక్తులకు ఎవరైనా బాధపడతారనే ఆలోచన ఉండదు. వీరికి మిత్రులు శత్రులు అంటూ ప్రత్యేకంగా ఉండరు. తమ స్వార్థానికి ఎదుటివారిని ఎలా ఉపయోగించుకోవాలో నేరుస్తారు. నమ్మకద్రోహం చేయడం వీరి నైజం. ఈర్ష్యాసూయ  భావాలు కలిగిన వీరు అందరి వద్దా తలలో నాలుక లాగా చనువుగా వ్యవహరిస్తూ  అవకాశం రాగానే ఎదుటి వారిని ముంచివేసే ప్రయత్నం చేస్తారు.  ఎదుటివారి బాధలలో తమ సంతోషాన్ని వెదుక్కునే ఇలాంటి వారిని "గ్రామ కంటకాః" అని సంబోధిస్తాడు, చాణక్యుడు.
            ఇలా చాణక్యులు ఎదుటివారి బాధలను, దుఃఖాన్ని పట్టించుకోని వారిని గూర్చి చెప్పడంలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మానవులు మంచికన్నా చెడుకే ఎక్కువగా స్పందిస్తారు. సింహం నోట్లో తలపెడితే ఏమౌతుందో తెలిస్తే దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాము. 

ఎలాంటి వారితో ఎలా వ్యవహరించాలి?

కృతే ప్రతికృతిం కుర్యాత్, హింసేన ప్రతిహింసనం
తత్ర దోషో న పతతి, దుష్టే దౌష్ట్యం సమాచరేత్!
                                                            చాణక్య నీతి -- 17-2
            ఉపకారికి ఉపకారం చేయాలి అలాగే హింసకు ప్రతిహింసయే మార్గము. దుష్టులతో దౌష్ట్యంగానే వ్యవహరించాలి. అది తప్పుకాదు అంటాడు, చాణక్యుడు. ఉపకారం చేసిన వానికి ఉపకారము చేయడం సమంజసమే. కాని మనం చిన్నప్పుడు చదివాము కదా "అపకారికి ఉపకారము నెపమెన్నక చేయాలని". అలా చేస్తే ఈ నాడది పిరికితనంగా వ్యవహరించ బడుతుంది. క్షమాగుణం ప్రధానమైనదే కాని అర్హులను మాత్రమే క్షమించాలి. బలం బలాన్ని గౌరవిస్తుంది. నీవొక చెంపకొడితే మరొక చెంప చూపుతాననడం ఈనాడు మూర్ఖత్వంగా పరిగణించ బడుతుంది.
            అన్ని ధర్మాలలో కెల్లా అహింసయే ఉత్తమం. పవిత్రంగా ఉండండి. నిజాయతీగా ఉండండి. గౌరవప్రదమైన జీవితాన్ని గడపండి. కష్టపడి పనిచేయండి. ఇలాంటి నీతులు మనమెన్నో విన్నాం. కాని ఈ నీతులకు భిన్నంగా ప్రవర్తించిన వారూ విజయ సాధకులైనారు. ఫలితాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనావేసే నేటి కాలంలో మంచిగా ఉండగలగడం మంచిదే కాని అది మన అసమర్ధతకు ప్రతీక కావద్దు. మీరంటే ప్రాణాలర్పించే అనుచరులు, మిత్రులు ఉండడం మంచిదే. వారిని ఉచిత రీతిని గౌరవించాలి కాని అతి చనువు నీయవద్దు.  దుష్టత్వాన్ని ఉపేక్షించ వద్దు. ఎవరికి ఏ విధంగా చెపితే అర్ధం అవుతుందో అలాగే చెప్పాలని సుచిస్తున్నాడు, చాణక్యుడు.
            మిత్రులకన్నా శత్రువును దగ్గరకు తీయాలంటాడు, రాబర్ట్ గ్రీన్ అనే రచయిత. శత్రువును ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి అంటాడాయన. ఉపకారం చేసినట్లు నటించే స్నేహితుడు కూడా నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. అందుకే అతిగా నమ్మొద్దు. మరి శత్రువును దగ్గరికి తీస్తే అతడు తనను తాను విశ్వాసపాత్రునిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కష్టపడి, ఇష్టపడి, ప్రేమతో పని చేస్తాడు. మనకు కావలసిన విజయాన్ని అతనే సాధిస్తాడు. అలాగని హింసామార్గంలో ప్రతిఘటించే శత్రువును ఎట్టిపరిస్థితులలో కూడా విడిచిపెట్ట వద్దంటాడు, చాణక్యుడు.