Thursday, September 1, 2016

సంస్థ ఆశయాల కనుగుణంగా ఉద్యోగుల సామర్ధ్యాన్ని గుర్తించి నియోగించుకోవడం సంస్థ అభివృద్ధి చెందుతుంది.

ఏ సంస్థ అయినా , అది చిన్నదా పెద్దదా అన్న సంగతి వదిలేస్తే, దానికంటూ ఒక దార్శనికత ఉంటుంది. ఇంత కాలానికి ఈ సంస్థ ఈ స్థాయిలో ఉండాలి లేదా ఉంటుంది అనే పక్కా ప్రణాళికా బద్ధమైన దృష్టి ఉంటుంది. ఏ సంస్థకైనా ప్రాధమిక లక్ష్యం ఆర్ధికంగా లాభాలను ఆర్జించడం మరియు బహుముఖాలుగా విస్తరించి ఆ రంగంలో తన ప్రత్యేకతను చాటుకోవడం.
            ఏ సంస్థ ఉత్పత్తిని సాధించాలన్నా నాలుగు ప్రాధమిక అవసరాలు ప్రముఖంగా నిలుస్తాయి. ఒకటి... భూమి (Land)   రెండవది శ్రామిక శక్తి (Labour)  మూడవది నిధుల సమీకరణ (Capital) నాలుగవది నిర్వహణ (Organisation). ఈ నాలుగు అంశాలను వనరులుగా చెప్పుకుంటే వీటికి మూలం తనలోని తపనతో కూడిన వైఖరి.
            తన వద్ద భూమి ఉంది. తనకున్న పలుకుబడి మరియు తపనను చూసి తనను నమ్మిన వారు పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి, కావలసిన ధన సమీకరణ జరుగుతుంది. ఈ రెండూ తన ప్రతిభతో నడుస్తావి. కాని ఈ రెంటితో ఉత్పత్తి జరగదు. ముఖ్యంగా కావలసిన మానవ వనరులు కావాలి. అందులో నైపుణ్యం కూడిన శ్రామిక శక్తి , నైపుణ్యం అవసరం లేని శ్రామిక శక్తి ఈ రెండూ కావాలి.  దీనికి తోడూ వీటన్నింటినీ ఏకత్రాటిపై సమర్ధవంతంగా నడిపించ గలిగిన నిర్వహణా సామర్ధ్యం ప్రధానమైనది.
            నిర్వహణా సామర్ధ్యంలో... సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలపై దార్శనికత ఉంటుంది. నైపుణ్యాలకు సంబంధించిన సమగ్ర ఆలోచనా విధానం ఉంటుంది. అంటే ఏయే విభాగాలలో ఎలాంటి నైపుణ్యాలు అవసరం.. ఆ నైపుణ్యం ఎవరిలో ఉంది... వారి నైపుణ్యాన్ని సంస్థ ప్రయోజనాలకు ఎలా వినియోగించుకోవాలి... ఎవరిలో ఏ ఉత్సాహం ఉంది.. వారికి ఏ రంగంలో శిక్షణ అవసరం.. వారి నైపుణ్యాలను సంస్థ అట్టిపెట్టుకునేందుకు ఎలా వ్యవహరించాలి.. లాంటి విషయాలపై లోతైన అవగాహన ఉంటుంది. నిరంతరం వనరుల సమీకరణకు సంబంధించిన వ్యూహం ఉంటుంది. సాంకేతికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికా బద్ధ వైఖరి ఉంటుంది. వీటన్నింటికి ప్రాణ సదృశమైన కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఇందులో ఏది లోపించినా సంస్థ ఆశయాలు ఫలించవు. ఉదాహరణకు... దూరదృష్టిలేని సంస్థలో స్ఫష్టత ఉండదు సరికదా తత్తరపాటు లేదా తడబాటు ఉంటుంది. నైపుణ్యాలు లోపించిన సంస్థ ఒత్తిడికి గురవుతుంది... ఆశయాల మేరకు పని జరగదు. ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాన్ని సాధిస్తూ వెనుకబడిపోతుంది. వనరుల సమీకరణ సరిగా లేకుంటే అనుకున్న విధంగా సమయానికి పనులు పూర్తికాక ఆశాభంగానికి గురికావడం జరుగుతుంది. కార్యాచరణ ప్రణాళిక లేకపోతే ఎక్కడ నుండి ఆరంభించాలో ఎక్కడ ముగించాలో తెలియని అయోమయ స్థితి దాపురిస్తుంది.
            సంస్థ మౌలిక లక్ష్యాలైన విస్తరణ, ఆర్ధిక పరిపుష్టి ఈ రెండింటిని సాధించాలంటే... ముఖ్యమైన రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. మొదటిది ఉత్పాదనా సామర్ధ్యం పెంచడం కాగా రెండవది ఆ ఉత్పత్తిని అవసరమైన వినియోగదారునికి అందించడం ద్వారా మార్కెట్ పెంచుకోవడం.
            నిరంతరం ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న శాస్త్రసాంకేతిక ప్రగతిని పరిశీలిస్తూ,  ఆ సాంకేతిక విధానాలను తమ సంస్థకు అన్వయించుకుంటూ, తమ విధానాలను అవసరమైన మేరకు మార్చుకుంటూ, నాణ్యమైన ఉత్పత్తి ఉత్పాదకతలను సాధించేందుకు తమకున్న మానవ వనరులను సన్నద్ధం చేస్తూ, యాంత్రిక వనరులను ఆధునీకరించుకుంటూ పోటీ ప్రపంచంలో తమ ప్రత్యేకతను సాధించడం  ఉత్పత్తికి సంబంధించిన నిర్వహణా సామర్ధ్యాన్ని సూచిస్తుంది.
            అలాగే నిరంతరం కొనుగోలుదారుతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకుంటూ ఆ కొనుగోలుదారు సంతృప్తి మేరకు నాణ్యమైన సరకులను సరసమైన ధరలకు అందిస్తూ ఉత్పత్తి అమ్మకాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడంతో పాటుగా సంస్థపై కొనుగోలుదారుకు నమ్మకాన్ని పెంచడం అమ్మకాలకు సంబంధించిన నిర్వహణా సామర్ధ్యాన్ని సూచిస్తుంది.
            సంస్థ మనుగడకు, వికాసానికి ఈ రెండూ అవసరమైనవే.
            సరైన పని సరైన విధానంలో సమయానికి జరిగిపోవాలంటే ఆ పనిని నిర్వహించేందుకు సరైన వ్యక్తులను ఎంచుకొని నియోగించాలి. పనిలో ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందమే ప్రేరణగా నిరంతరం క్రొత్తదనాన్ని అన్వేషించే ఉద్యోగులనే సంస్థకు నిజమైన ఆస్తులుగా పరిగణించాలి. నిజానికి అలాంటి ఉద్యోగుల వల్లనే సంస్థ ఉత్పాదనా సామర్ధ్యం పెరుగుతుంది. మార్పునంగీకరిస్తూ, మార్పును ఆహ్వానిస్తూ దానితో మమేకమయ్యే నైపుణ్యం కలిగిన వ్యక్తుల సమూహాన్ని ఎన్నిక చేసుకోవడం, వారినందరినీ సంస్థ ఆశయాల కనుగుణంగా ఒక్క త్రాటిపై నడిపిస్తూ సత్ఫలితాలు సాధించ గలగడమే నిర్వహణా సామర్ధ్యం. నిజానికి వ్యాపార రంగంలో పోటీ తత్త్వం పెరిగిపోయి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నాలుగు డబ్బులెక్కువ ఇస్తూ ఆకర్శించే దుస్సంస్కృతికి తెరలేచిన నేపథ్యంలో ఉద్యోగులూ అలాంటి వారి దగ్గరకు వలసలు గట్టే ఈనాడు నిజాయితీ కలిగి మన రహస్యాలను దాస్తూ సంస్థ ప్రగతికి అంకితభావంతో పని చేసే ఉద్యోగులను నియమించుకోవడం కష్టమైన పనే.  అయినా సంస్థలో ఉద్యోగులను నియమించుకునే అధికారం కలిగిన, బాధ్యత తెలిసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ వలసలను కొంతమేరకు అరికట్టడం సాధ్యమే.
            ఈ క్రమంలో రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి ఎలాంటి ఉద్యోగులను తీసుకోవాలి? రెండవది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇక్కడ గమనించాల్సింది... ఉద్యోగులు నైపుణ్యం కలిగిన వారైనా లేనివారైనా నిబద్ధతతో పని చేయాలి అంటే వారికి ప్రేరణకావాలి. అది జీతభత్యాల రూపంలో ఉండవచ్చు, ఆదరణ రూపంలో ఉండవచ్చు, హెచ్చు బాధ్యతల నప్పగించడం వల్ల రావచ్చు, పని చేసే పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం బాగుండడం వల్ల కావచ్చు, ఉద్యోగ భద్రత వల్ల కావచ్చు... ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ప్రేరణ పొందవచ్చు. వారిని గుర్తించి వారికి ఆ రూపంలో భద్రత లభిస్తుందనే సంకేతాలు పంపగలిగితే వారి వలసలు అరికట్టడమే కాక వారి సేవలు సంస్థ పురోగతికి ఉపయుక్తమయ్యే రీతిలో పొందవచ్చు.
            జీత భత్యాలు సరిపోవని భావించినా, సంస్థలో తన నైపుణ్యానికి సామర్ధ్యానికీ తగిన ఆదరణ లేదా గుర్తింపు లేదని ఉద్యోగి భావించినా, తన ప్రతిభా వ్యుత్పత్తులకు ఇది సముచితమైన వేదిక కాదని భావించినా, తనను కాదని తనకన్నా తక్కువ అనుభవం, అర్హతలు కలిగిన తన తరువాతి ఉద్యోగికి పై పదవీ బాధ్యతలు అప్పగించి నప్పుడు కూడా అవకాశం వచ్చిన ఉద్యోగి సంస్థను విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే, చుట్టూ ఉండే పరిసరాలు పని వాతావరణం తన వృత్తిగౌరవానికి లేదా ఆత్మ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నా ఉద్యోగిలో పెరిగే అసంతృప్తి సంస్థను విడిచేందుకు కారణమవుతుంది. తప్పదని వేరే గత్యంతరం లేక ఆ సంస్థలోనే పనిచేసినా వారి సంపూర్ణమైన శక్తిసామర్ధ్యాలను వారు పనిలో వినియోగించరు. వారిలో లోపించిన ఉత్సాహం నీరసాన్ని నింపడం వల్ల పనిలో ఏకాగ్రత తగ్గి నాణ్యత తగ్గుతుంది. డబ్బు రూపంలో అందే ప్రోత్సాహకాలు కొంతమేరకే ప్రేరణ నందించగలుగుతాయి. సమస్యలను సవాలుగా స్వీకరించి  ఆ సవాలును అధిగమించే విధానంలో పొందే ఆనందం దానికి యాజమాన్యం నుండి అందే సహాయ సహకారాలే ఉద్యోగిలో సంతృప్తితో కూడిన ప్రేరణగా నిలుస్తాయి. ఈ విధానంలో ఉద్యోగి క్రొత్తదనాన్ని ఆస్వాదిస్తాడు.  పరిమితులలో బంధించబడిన తన శక్తిసామర్ధ్యాలను  విముక్తం చేసుకుంటూ అన్వేషణా మార్గంలో అనంతంగా వికాసం చెందినప్పుడు తనలో కలిగే ఉల్లాసంతో కూడిన ప్రేరణకు సాటి చేయ గల ప్రేరణ మరే విధంగానూ ఉద్యోగి పొందలేడు.
             నిబంధనల రూపంలో లేదా పరిమితుల రూపంలో ఒక ఉద్యోగి చైతన్యాన్ని సమర్ధతను అణచివేస్తే ఆ ఉద్యోగిలో పెల్లుబికే అసహనం సంస్థను విడిచి వెళ్ళేందుకు దారితీయవచ్చు. ఉత్సాహం సాహసం కలిగిన బుద్ధిమంతుడైన ఉద్యోగికి సంవత్సరాల తరబడి ఎదుగుబొదుగు లేని ఒకే పనిని అప్పగిస్తే అది ఆ ఉద్యోగి పని సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. శక్తిసామర్ధ్యాలు తగ్గిన ఉద్యోగి సంస్థకు భారంగా తయారవుతాడు. 
            జీతభత్యాలు తన పని విధానానికి మరీ ఎక్కువగా లభిస్తే పనిపై ఆసక్తి పెరుగుతుందనే వాదన సరికాదు. అలాగని తక్కువగా ఇస్తే ఆ ఉద్యోగి ఆర్థిక ఇబ్బందులతో జీవితంలో నిలదొక్కుకోలేక  పనిపై శ్రద్ధ పెట్టలేడు. కాబట్టి ఉద్యోగి జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తన సామర్ధ్యాన్ని గుర్తిస్తూ తగిన జీతభత్యాలతో గౌరవిస్తే ఆ ఉద్యోగి ప్రేరణను పొంది సంస్థ పురోగతికై శ్రమిస్తాడు. నిజానికి ఎక్కువ మందికి ప్రేరణ నిచ్చేది పనిలో తాము పొందే ఆనందం మాత్రమే. ఆ ఆనందం వారి సామర్ధ్యాన్ని గుర్తించడం, ఆ సామర్ధ్యానికి తగిన బాధ్యతను అప్పగించడం, వారిఎదుగుదలకు కావలసిన వసతులు కల్పించడం, వారు వారి ప్రతిభాపాటవాలను ప్రదర్శించి సాధించిన ఫలితాలను అభినందించడం వల్ల మాత్రమే ఏ వ్యక్తి కైన నిజమైన ప్రేరణ లభిస్తుంది.
            అన్నింటి కన్నా ఎక్కువ ప్రేరణ నేను నీ వెనుకనే ఉన్నాను అనే భరోసాను ఇచ్చినప్పుడే కలుగుతుంది.

            ఉద్యోగులను ఎన్నుకునే విధానంలో మూసలో పోసినట్లుగా ఒకే  విధానం పాటిస్తే ఫలితం సామాన్యంగానే ఉంటుంది. అలాకాక, పై అంశాలను ఆలంబనగా చేసుకొని ఒక్కొక్క అభ్యర్ధి సామర్ధ్యాలను ప్రాతిపదికగా వారిని ఎన్నుకొని బాధ్యతలను అప్పగించే విధానంలోనే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని నమ్ముతున్నాను. 

Palakurthy Rama MUrthy

అన్వేషణ -- ఆవిష్కరణ

అన్వేషణ --  ఆవిష్కరణలు ప్రతి మనిషికీ సహజ లక్షణాలు. అయితే, దేనినన్వేషించాలి, దేనిని ఆవిష్కరించాలి అనేది ఆ వ్యక్తి యొక్క అభిరుచి, అవసరం, అవకాశం, అంతర్గత జ్వలన, తపనలపై ఆధారపడి ఉంటుంది.
            దార్శనికుడైన గురువు లేదా మార్గదర్శి అడుగుజాడలలో అతిశయించిన కోరిక, బుద్ధి వికసనతో, సకల జీవకోటీ శ్రేయస్సును పొందాలనే సంకల్పంతో అన్వేషణ జరిగితే సత్య పథం ఆవిష్కృతమౌతుంది. ఈ ప్రయాణంలో ఒక గురువు లేదా మార్గ దర్శకుని అవసరం రావచ్చు.
            అయితే, మార్గ దర్శకుడు లేదా గురువు దర్శింపజేసేది పరిమితమైనదే. ఎందుకంటే అపరిమితత్త్వంలో గురువు దర్శించిందీ పరిమితమైనదే కాబట్టీ. అయినా, ఆ పరిమితమైన దానిని ఆధారం చేసుకొని తన దీక్షా దక్షతలతో అపరిమితత్త్వాన్ని ఆస్వాదించేందుకు సాగే ప్రయత్నమే "అన్వేషణ".
            ప్రతి అన్వేషణా సరైన మార్గంలో సాగుతుందనీ, ఆశించిన ఫలితాన్ని ఇస్తుందనీ చెప్పలేము. ఒక్కొక్కసారి ఆ మార్గం తప్పుదారి కావచ్చు. కంటకావృతమూ కావచ్చు. అగమ్య గోచరం కావచ్చు. ఆ మార్గం మన సంకల్పాన్ని బలహీనపరచే అవకాశమూ లేకపోలేదు.  అప్పుడే బుద్ధి ప్రచోదన పొందాలి. ఇతరుల అన్వేషణ మనకు ప్రేరణ నివ్వవచ్చు. మార్గం చూపవచ్చు. కాని గమించాల్సింది మనమే. ఆ దారిలో ఎదురయ్యే కష్టనష్టాలను భరించాల్సిందీ మనమే. కాబట్టి అవగాహన పెంచుకుంటూ, అవాంతరాలను అధిగమించే విధానానికి రూప కల్పన చేసుకుంటూ మనదంటూ ఒక మార్గాన్ని ఏర్పరుచుకొని సాగిపోవడం సమంజసం.
            ఈ క్రమంలో మార్గం తప్పడం జరగవచ్చు. అయితే, ఎప్పుడైతే మార్గం తప్పామని నిశ్చయంగా తెలుస్తుందో అప్పుడు అవసరమైతే మళ్ళీ తప్పనిసరిగా ఆరంభంనుండి మన యాత్రను ప్రారంభించాల్సిందే. అంతం లేని గమ్యంవైపు సాగే క్రమంలో ఎక్కడి నుండి ఆరంభించామనే దాని కన్నా ఎంతటి సంకల్ప బలంతో మళ్ళీ ఆరంభించామనేదే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
            పరిపూర్ణత నుండి పరిపూర్ణత వైపు సాగే ప్రయాణానికి లక్ష్యం లేదా యోగం(పొందదగినది) ఆనందానికి అతీతమైన స్థితిని అన్వేషణ చేయడం మాత్రమే. అన్వేషణా జిజ్ఞాసలకు ఏ వ్యక్తీ ఆద్యుడూ కాదు, చివరివాడూ కాదు. ఎందరో మహానుభావులు తమ అన్వేషణలో ఆవిష్కరించిన సత్య మార్గంలో దారి పొడుగునా "అక్షర" బద్ధమైన సూచికలు ఏర్పరచారు.  ఛాయమాత్రంగా కొన్ని, బలమైన ముద్రలుగా కొన్ని, స్పష్టమైనవి కొన్ని, అస్పష్టమైనవి కొన్ని.. ఇలా ఎన్నొ ఎన్నెన్నో గుర్తులు భావి తరాల వారి కోసమని ఏర్పరస్తూ వారి అన్వేషణ సాగిపోయింది. అయితే అవి వారు, వారి  ఆంతరంగిక జిజ్ఞాస అన్వేషణలలో ఏర్పరచుకున్న దీపికలు మాత్రమే. అందువల్ల ఆ ఆవిష్కరణలు మనకుపయుక్తం కావచ్చు కాకపోవచ్చుకూడా. ఎందుకంటే,  అవి పూర్తిగా వారివారి దార్శనిక శక్తి సామర్థ్యాలపై ఆధారపడి వారి ప్రయోజనాలను లక్ష్యించి ఆవిష్కరించుకున్నవి మాత్రమే కాబట్టి. అయితే ఆ దీపికలు మన యానంలో ప్రయోజనం కలిగించేవి అయితే తప్పక ఆదరించుకోవలసిందే. అజ్ఞాతాన్ని జ్ఞాతం చేయాలనే తపనలో సాగే అన్వేషణలో ఏ పరిష్కార మార్గాన్నీ పనికిరానిదిగా లేదా వ్యర్ధమైనదిగా తలచవద్దు.
            మనిషిలోని మెదడు ఇంద్రియాల ఆధీనంలో తాను దర్శించ వలసిన లక్ష్యాన్నిచూపిస్తుంది. హృదయం అతీంద్రియ దార్శనిక ప్రజ్ఞతో అత్యున్నత జీవన విధి వికాసాన్ని "సాధ్యం"గా చూపుతుంది. మెదడు చూపే లక్ష్యాన్ని హృదయ సంజ్వలిత విధితో సంయోగం చెందించిన  సమయంలో గమ్యం సుగమమౌతుంది. ఈ రెంటినీ విడివిడిగా సాధించడం లక్ష్యంగా సాగే యానం నిర్దిష్ట ప్రయోజనాన్ని ఇవ్వదు. పరిమిత మొత్తంలో అంతర్గత శక్తిసామర్ధ్యాల వినియోగాన్ని దర్శింపచేసేది లక్ష్యం కాగా మనలోని అనంత శక్తిసామర్ధ్యాలను అనంతంగా వినియోగించుకునేందుకు ప్రేరణ నిచ్చేది జీవన విధి వికాసం. ఆ అన్వేషణలో ఒక్కొక్కమారు పరిష్కారమార్గం అస్పష్టంగా గోచరించవచ్చు.  ఆ అస్పష్టతా పరిష్కార మార్గాన్ని ఆసరాగా చేసుకొని వికసిత బుద్ధిని మరింతగా ప్రచోదన చేస్తూ ప్రజ్ఞను జాగృతం చేస్తే అస్పష్టత లోని స్పష్టతను ఆవిష్కరణ చేయడం సాధ్యపడుతుంది. దర్శన అస్పష్టమైన సమయంలో మనసులో ఆందోళన చెలరేగవచ్చు. ఆ ఆందోళనను అధిగమించ గలిగితే ఆత్మీయ సంకల్పం బలోపేతమౌతుంది.  సాధకుడు తన అన్వేషణలో దర్శించిన దానిలో అస్పష్టత ఉన్నా అది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపాన్ని సంతరించుకుంటూ దర్శనమిస్తుంటే కలిగే ప్రేరణ అన్వేషణకు ప్రతిబంధకం కాదు, కారాదు. ఆ అస్పష్టత వల్ల ఎదురయ్యే ప్రలోభాలను అధిగమించేందుకు మార్గదర్శకులు ఇతఃపూర్వం ఏర్పరచిన "అక్షర" బద్ధ సూచికలు, ఛాయామాత్ర పరిష్కారాలు ఉపయుక్తమౌతాయి. సంకల్పం బలోపేతమై, సాధన తీవ్రతరమైతే ఆ సాధనలో ఆవిష్కృత అంతశ్చేతనా ప్రకాశం ముందుకు దారి జూపుతుంది. ఆ మార్గంలో ఇంతకు ముందు పయనించి ముందడుగు వేసిన  ఎందరో మహానుభావుల ప్రేరణాపూర్వక ప్రేషిత ధ్వని తరంగాలు ప్రబోధకాలుగా ముందడుగు వేసేందుకు దోహదపడతాయి.
            ఈ క్రమంలో, నిరంతర ప్రయత్నం మాత్రమే అస్పష్టతనుండి స్పష్టతను సాధించే లక్ష్యసాధనా ప్రయత్నాన్ని సులువు చేస్తుంది. అంతేకాదు... ప్రాకృతిక శక్తుల సహాయ సహకారాలు తప్పక లభిస్తాయి. అవగాహనాపూర్ణ అన్వేషణ అభ్యుదయ పరంపరగా ఆవిష్కృత మౌతుంది.
            లక్ష్యం లేదా గమ్యం అనంతమైనది. ఏ సందర్భంలో స్పష్టత సాధించామో, ఏ విషయంలో స్పష్టత కనిపించిందో, ఏ దార్శనికత వల్ల అంతశ్ఛేతనలోని అయోమయ స్థితి దూర మయిందో ఆ నిర్దిష్ట అంశాన్ని మరింత లోతుగా అన్వేషించడం వల్ల విషయంపై అవగాహన పెరిగి, దృశ్యాన్ని మరింత దగ్గరగా చూడగలుగుతాము. ఆ స్పష్టత అంతశ్ఛేతన నుండి జారిపోకుండా, నిశ్చలంగా ఆత్మలో శక్తి వంతం చేసుకోవడం, ముందుకు సాగడం కన్నా ప్రధానమైనది. ఎన్నో అవరోధాలు, ప్రలోభాలు, చంచలతలు, బలహీనతలు, బంధనాలు అంతరంగాన్ని కప్పివేస్తూ దృశ్యాన్ని కనుమరుగు చేసే అవకాశం ఉంది. అందుకే నిరంతరం ఆత్మప్రకాశాన్ని ప్రవృద్ధి చేయడం వల్ల, జాగృతం చేయడం వల్ల, చైతన్యం పొందడం వల్లదృశ్యాన్ని దర్శనం నుండి జారిపోకుండా కాపాడుకోగలుగుతాము.
            గమ్యం అగమ్యమైనది. పదునైన కత్తి అంచు కన్నా పదునైన మార్గంలో దుర్గమమైన గమ్యంవైపు పయనించే క్రమంలో మనస్సును అదుపు చేసుకోవడానికి దృఢ నిశ్చయంతో కూడిన ప్రయత్నం కావాలి. నిరంతర సాధనా దీప్తి వల్ల మాత్రమే లక్ష్యాన్ని చూడగలుగుతాము. చంచల స్వభావం కలిగిన మనస్సును మాలిమి చేసుకోవడం వల్ల మాత్రమే అది మనమాట వింటుంది. బలవంతంగా మనస్సును లొంగ తీసుకోవడం అసంభవం. మాలిమి చేసుకున్న మనస్సు మన కనుసన్నలలో సంచరించే ఆత్మ బంధువుగా మారిపోతుంది. సంతత సాధనా పటిమ వల్ల ఆ నైపుణ్యాన్ని సాధించగలుగుతాము.
            ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి ప్రచోదన, శక్తి మరియు పరాక్రమాలు అనుంగు సహచరులుగా ఉద్యమించే వ్యక్తిలో ప్రశాంత గంభీర చైతన్యం వెల్లి విరుస్తుంది. స్వేచ్ఛాపూర్ణ హృదయంతో నిరంతరానంద స్వాప్నికునిగా విజయపథంలో విహరించగలుగుతాము.
            ఎప్పుడైతే ఆనందానికి అతీతమైన తాత్త్విక శోభలో అంతశ్చేతన "యెఱుక" ను పొందుతుందో అప్పుడు తన లక్ష్యం, తన విధి పరిపూర్ణతవైపు దృష్టిని సారించ గలుగుతుంది. ఆ సాధన వల్ల తన "జన్మ స్థానం" ఆదికినాది యైన ఆ "పరిపూర్ణ"మే అనే సత్యాన్ని గుర్తించ గలుగుతాము. ఆ గుర్తింపు హృదయాకాశాన్ని అనంతమైన ప్రకాశంతో నింప్తుతుంది. ఆ వెలుగుకు తనకు మధ్య ఉన్న లేదా ఉన్నదనుకుంటున్న తెరలు తొలిగిపోయి అభేదమయిన సత్యం "బోధ"పడుతుంది. తనతోపాటుగా ఉన్న విశ్వ విశ్వాంతరాలను తనలో దర్శించుకోగలుగుతాము.
            అనంతంగా సాగే తన అన్వేషణకు ఒక నిర్దిష్ట కేంద్రం ఉండదు కనుక తన అన్వేషణ ఎక్కడికి చేరిందనేది కాకుండా తన "ఉనికి"కి మూలమేమిటో, అమృతత్త్వమేమిటో అవగతం అవడం జరుగుతుంది, తద్వారా తన కర్తవ్యం ఏమిటో బోధపడుతుంది. ఆ కర్తవ్య నిర్వహణలో .. అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు లేదా రెండింటి సమన్వయం కావచ్చు.. ఏది ఏమయినా అందులో తాదాత్మ్య భావనను పొందడం జరుగుతుంది. ఈ స్థితిలో అంతటా తన రూపమే కనిపించడం కారణంగా తాను పొందిన అభేదభావన వల్ల ఇతరుల కష్టసుఖాలు తనవిగా భావించే వికసన సాధకునిలో ఆవిష్కృతమౌతుంది. సేవాభావన తనలో ఆవిష్కృతమౌతుంది. జీవకోటిని సేవించడం లోనే పరమాత్మ సేవన ఉందనే సత్యాన్ని కనుగొన్నాక ఆ సేవాభావంలో కావలసిన "అర్హత"ను పొంది అనంతంలో తానూ అనంతునిగా మారిపోతాడు.

            ఈ అన్వేషణ భౌతిక జీవితానికి అన్వయించుకుంటే ప్రగతి పథంలో విజయాన్ని పొందవచ్చు. ఆధ్యాత్మిక జీవనానికి అన్వయించుకుంటే సుగతి మార్గంలో అనంతత్త్వాన్ని సాధించవచ్చు.

Palakurthy Rama Murthy 

విజయ సాధనయే ఆత్మ సాధన

ప్రతి వ్యక్తీ జీవితంలో తాను విజయం సాధించాలనే కోరుకుంటాడు. ఓటమిని ఎవరూ కోరరు. కొందరు భౌతిక జీవితంలో విజయాన్ని కోరుకుంటారు మరి కొందరు ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని కావాలనుకుంటారు.
            నిజానికి ఈ రెండూ ఒకదానిని విడిచి మరొకటి సిద్ధించదు. భౌతిక ప్రగతి ఆధ్యాత్మిక సుగతికి దారి తీస్తుంది. భౌతిక ప్రగతి అనగానే డబ్బు కోణం నుండి చూడడం అలవాటయింది. అది సరికాదు. డబ్బు అనేది సాధించే లక్ష్యాన్ని వెన్నంటి ఉండే "బై ప్రోడక్ట్" మాత్రమే.
            డబ్బు సంపాదన మాత్రమే లక్ష్యం లేదా విజయం అనుకుంటే ఎంత సంపాదించా లనే ప్రశ్న వస్తుంది. సంపాదనకు పరిమితులు విధించుకోలేము. ఎందుకంటే ఇంత సంపాదిస్తే చాలు అని ఎవరూ అనుకోలేరు. ఒక పరిమితిని సాధించే వరకు అది "ఆశయం"గానే ఉండవచ్చు. కాని తరువాత ఆ ఆశయం "ఆశ"గా మారి మరింతగా సంపాదించాలనే అపరిమితత్త్వానికి విస్తరిస్తుంది. కాబట్టి విజయానికి కొలమానం డబ్బు మాత్రమే కాదు. డబ్బు కాకపోతే మరేంటి? అనే ప్రశ్న వేసుకుంటే....
                        అ)  తనను తాను తెలుసుకోవడం.
                        ఆ)  తనను తాను పునర్నిర్వచించుకోవడం,
                        ఇ)  తానున్న స్థాయిని పెంచుకోవడం,
                        ఈ) క్రొత్తదనాన్ని ఆవిష్కరించుకోవడం,
                        ఉ) క్రొత్తగా సంతరించుకోవడం,
                        ఊ) తన జీవితం నడచే కేంద్రాన్ని మార్చుకోవడం,
                        ఋ) గమన దశను దిశను ప్రభావవంతం చేసుకోవడం.
            ఇవి ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి.
            మరి ఈ పరంపరలో విజయ సాధన ఏ మార్గం వల్ల లభిస్తుంది అంటే ఇందుకు ఎన్నో మార్గాలను అన్వేషించుకోవచ్చు. ఏ మార్గం తమకు అనువైనదో , అనుకూలమైనదో, ప్రయోజనకారియో గుర్తించి ఆ మార్గంలో గమించడం మంచిది.  జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకుంటే వృద్ధి అభివృద్ధిగా మారుతుంది. అంటే జీవితం సమగ్రతను సాధిస్తుంది. ప్రకృతితో మమేకం కావడం జరుగుతుంది.
            దీనికి ప్రయత్నం కావాలి. అయాచితంగా ఏదీ తనంత తానుగా మన దరిచేరదు. మనలోని మాలిన్యాలు కరగిపోవాలి. చక్కనైన శీల నిర్మాణం జరగాలి. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తన పరిమితులను అతిక్రమించి అపరిమితమై వివిధముఖాలుగా విస్తరిస్తూ తనను తాను తెలుసుకునేందుకు దోహదపడాలి. ఆ "యెఱుక"  లేదా "ప్రజ్ఞ" సాధించడమే విజయ సాధన కు మూలమవుతుంది. ఈ ప్రక్రియలో తనను తాను అనుక్షణం పునర్నిర్వచించుకోవడం జరుగుతుంది. ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగడం, తన ఆలోచనలలో నూతనత్వాన్ని ఆవిష్కరించుకోవడం, క్రొత్తదనాన్ని సంతరించుకోవడం జరుగుతుంది.
            ఈ సాధనా పర్వంలో  ఆలోచనలు పరిణతి చెందుతాయి, ఆచరణలో ఉదాత్తత కనిపిస్తుంది, ఆత్మీయభావనలు చిగురిస్తాయి, అనుభూతులు పల్లవిస్తాయి, భావోద్వేగాలు ఉన్నత స్థాయిలో హృదయంతో సంగమిస్తాయి. “ఆత్మవత్సర్వభూతాని” అన్నట్లుగా... మొత్తంగా సకల సృష్టితో ఏకీకృత భావన అలవడుతుంది. 
            ఆ విజయ సాధనయే ప్రతి వ్యక్తికీ లక్ష్యం కావాలి. ఈ విజయ సాధనలో ఉపకరించే ఉపకరణాలు కొన్నింటిని పరిశీలిస్తే....
                        1) మనసు పరిశుద్ధతను పొందాలి
                        2) చేసే పనిలో నాణ్యత పెరగాలి
                        3) విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి

            మనసు పరిశుద్ధతను పొందాలి:  అత్యంత చంచల మైనది ఈ  సృష్టిలో మనసు మాత్రమే. ఈ చంచలతకు అహంకారం తోడవడం వల్ల ఏ వ్యక్తి ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఎవరూ ఊహించలేరు.  అయితే ఈ అవలక్షణాలతో పాటుగా విచక్షణను వివేకాన్ని సంతరించుకున్న బుద్ధినీ ఇచ్చాడు, సృష్టికర్త. చలనమే లక్షణమైన మనస్సును నియంత్రించడమూ కుదరదు. కాకపోతే బుద్ధిని వినియోగించుకొని నిరంతర చలన శీలి యైన చిత్తాన్ని అవసరమైన లేదా మనకనుకూలమైన మార్గం వైపుకు మళ్ళించేందుకు ప్రయత్నించవచ్చు. సమభావన యొక్క స్వరూప స్వభావాలను ఫలితాలను అవగాహన చేసుకోవడం ద్వారా అహంకారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రయత్న పూర్వకంగా నైనా విచక్షణాయుతమైన బుద్ధిని ప్రచోదన చేయడం వల్ల జీవితం యొక్క పరమార్ధం సిద్ధిస్తుంది.
            బుద్ధి వికసన ద్వారా మనలో అప్రయత్నంగా ఈ క్రింది లక్షణాలు చోటు చేసు కుంటాయి......
            1) మనో మాలిన్యాన్ని కడిగివేసుకోవాలనే ఆలోచన తపనగా మారుతుంది
            2) ఇతరుల ఆలోచనా సరళిని పరిశీలించడం, ఎదుటివారి పరిధిలో ఆలోచించడం జరుగుతుంది
            3) ఇతరుల భావాలలోని అనుకూల ప్రతికూలాంశాలను మనలోని ఆంతరంగిక ఆలోచనలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన, ఉపయుక్తమైన, ప్రయోజనకరమైన వాటిని స్వీకరించడం జరుగుతుంది.
            4) బుద్ధి ప్రచోదన ద్వారా పొందిన వివేకం, వివేచన, విచక్షణలు మనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై నిబద్ధతతో కూడిన ఆలోచనా సరళిని అందించగా.... ఆ యా అంశాల స్వరూప స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా అర్ధం చేసుకునే అవగాహనాపూర్ణ విధానం నెలకొంటుంది.
            5)  తోటివారిని అర్ధం చేసుకోవడం, వారిలోని అనుకూలాంశాలను గ్రహించడం వల్ల సమాజం పట్ల నిబద్ధత పెరిగి మనలో "అణుకువ" నెలకొంటుంది.
            6) అనేక మార్గాలలో పయనించే మనస్సు ఏక మార్గ గామి కావడం వల్ల విషయాలను నిశితంగా పరిశీలించడం, లోతుగా అధ్యయనం చేయడం, స్పష్టంగా దర్శించడం అలవడుతుంది.
            7) నిశితంగా చూచే దృష్టి వల్ల తెలిసిన దానికన్నా తెలియనిది ఎక్కువ ఉన్నదనే "సత్యం" బోధపడుతుంది. దానితో పెరిగిన ఆసక్తి అన్వేషణగా మారుతుంది.
            8) తెలియని దాని రహస్యాలను శోధించే క్రమంలో విజ్ఞులను ఆశ్రయించడం వల్ల వినయ విధేయతలు పెరుగుతాయి.
            9)  పొడసూపిన వివేకం వల్ల ఆత్మ పరిశీలన... దాని వల్ల అంతర్గత దోషాలను తుడిచివేసుకోవడం జరుగుతుంది. తద్వారా "శీల" సంపదను పొందగలుగుతాము.
            10) కామన తగ్గిపోయి శోధన పెరుగుతుంది. చూచిన దానినెల్లా ధర్మాధర్మ వివక్ష లేకుండా స్వంతం చేసుకోవాలనే యావ "కామన లేదా కామం". ధర్మ బద్ధంగా తన అవసరాలను తీర్చుకోవడం లేదా నిర్వహించుకోవడం "శృంగారం". బ్రహ్మ చర్యము శృంగారంలోనూ అంతర్భాగమే. సంతానాపేక్షతో భార్యాభర్తలు సంగమించడమూ బ్రహ్మచర్యంగానే పరిగణిస్తారు. సంతానాన్ని పొందడం మన విధ్యుక్త ధర్మ కర్మలలో ఒక భాగమే.
            11) దృశ్యాన్ని చూచే మానసిక కోణమూ మారుతుంది.
            12) అప్రయత్నంగా ఏకాగ్రతా అలవడుతుంది.

            ఈ ప్రక్రియ వల్ల మనో చిత్త అహంకార బుద్ధులు ఏకోన్ముఖమై ఒకే లక్ష్యం వైపు నడవడం వల్ల అంతర్గతంగా కప్పివేసిన "మాయా" యవనికలు తొలగిపోయి వ్యక్తిలో శీల నిర్మాణం జరుగుతుంది. శీల నిర్మాణం జరగడం వల్ల ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించే "సాధు స్వభావం" అలవడుతుంది.
            ఇదే అంతశ్చేతనలో బోధన లేదా ప్రబోధగా మారి నిరంతరం మార్గం తప్పకుండా హెచ్చరిస్తూ సరైన మార్గంలో ముందుకు నడిపిస్తుంది.

            చేసే పనిలో నాణ్యత పెరగాలి: Man is not a Human Being but a Becoming అంటారు ఓషో.  Being ఎప్పుడూ Static కాగా Becoming ఎప్పుడూ Dynamic. స్థబ్దత మనిషి లక్షణం కాదు కాబట్టి జీవితాOతం మనిషి ఏదో ఒక పనిని చేస్తూనే ఉండాలి. అయితే మనిషి బుద్ధి జీవి కూడా కాబట్టి ఏ పని చేయ దగినది, ఏ పని చేయ గూడనిది అనే విషయంపై స్పష్టమైన అవగాహన కలిగి సంపూర్ణమైన చైతన్యంతో పనిచేయడం వల్ల మానవ జీవితం సాఫల్యత చెందుతుంది.
            పనిచేయడం వల్ల ఏమొస్తుంది?

1)         పని చేయడం వల్ల పని సంస్కృతి అలవాటవుతుంది
2)         అంతశ్చేతన జాగృతమౌతుంది
3)         పనిని చేసే క్రమంలో అంతరంగంలో చెలరేగే ఆలోచనలలో నుండి అవసరమైన వాటిని విడదీసి వాటిపై దృష్టి పెట్టడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది
4)         పనిలో నైపుణ్యం పెరుగుతుంది
5)         సంతృప్తిని, ఆనందాన్ని పొందగలుగుతాము
6)         నిబద్ధతతో పని చేయడం వల్ల బాధ్యతలు తెలుసుకో గలుగుతాము
7)         బుద్ధి కుశలత పెరిగి సమాజోపయోగ ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది
8)         ఉత్పత్తి, ఉత్పాదకతలు గణనీయంగా పెరుగుతాయి
9)         నాణ్యతా ప్రమాణాలు పనిలో అంతర్భాగమౌతాయి
10)      లోతైన అవగాహన పెరగడం వల్ల దార్శనికత అలవడుతుంది
11)      కర్తవ్య నిర్వహణలో స్వీయ నియంత్రణ అలవడుతుంది
12)      ఏ పనిని ఎక్కడ ఎలా ఆరంభించాలి, ఎక్కడ ఎలా ముగించాలి; ఆ పనిని నిర్వహించడంలోని సానుకూలాంశాలు ఏమిటి? వాటి నెలా ఉపయోగించుకోవాలి? ఎదురయ్యే అవాంతరాలు లేదా అవరోధాలు ఏమిటి? వాటి నధిగమించడం ఎలాగా? ఇలాంటి అనేకాంశాలపై స్పష్టత వస్తుంది.
13)      ఆ కార్య నిర్వహణ కవసరమైన సాంకేతిక అవగాహన పెరుగుతుంది. విజ్ఞానాన్ని ఆధునీకరించుకునే మార్గాలను అన్వేషిస్తాము.
14)      చేసే పని ఆనందాన్నిస్తుంది కాబట్టి దానిపై అంకిత భావం పెరుగుతుంది
15)      మనం చేసే పని వల్ల మనకూ, మనపై ఆధారపడిన వారికీ, సమాజానికీ ప్రయోజనం కలుగుతున్న సమయంలో మన మనస్సులలో కలిగే నిర్మలత, ఆనందం అభ్యుదయ మార్గంలో పయనిస్తుంది. తద్వారా భావనలో, స్పందనలో, భాషణలో పవిత్రత వెలుగు చూస్తుంది.
16)      నిర్మలతను, శాంతతను పొందిన మనస్సు సమర్పణా బుద్ధితో, బాధ్యతాయుతంగా చేస్తున్న పనిలో అనిర్వచనీయమైన ఆనందాన్ని; ఆ ఆనందానికీ అతీతమైన స్థితిని పొందగలుగుతాము. ఆ తాదాత్మ్య స్థితిలో చేసే ప్రతిపనీ భగవదర్పితంగా చేస్తూ సమాజానికి ఉపయుక్తమయ్యే రీతిలో శ్రమించడం వల్ల ఆత్మాశ్రిత "స్వార్ధపరత" నిష్క్రమిస్తుంది.
            ఈ ప్రక్రియ లో నిన్నటి మీద ఈరోజు మనం పనిలో చూపే ఉత్తమమైన లేదా మెరుగైన ప్రావీణ్యత లేదా నైపుణ్యం వల్ల పనిలో నాణ్యత పెరగడమే కాక త్వరగా పూర్తవుతుంది. దానితో సమయం ఆదా అవుతుంది. నాణ్యతా ప్రమాణాలతో పని చేయడం, సకాలంలో పూర్తిచేయడం ద్వారా పని సంస్కృతి మనకొక అలవాటుగా మారి పోతుంది. ఆ అలవాటు అనతికాలంలోనే ప్రవర్తనగా మారుతుంది.
            పనిని ఆరంభించిన సమయంలో "యెఱుక"తో చేస్తాము లేదా తెలిసి చేస్తాము. కాని నిరంతర సాధనద్వారా పని చేయడమనేది మనలో "సహజజ్ఞానం" గా మారిపోతుంది. చేపట్టిన పనిని నాణ్యతా ప్రమాణాలతో, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో, సునాయాసంగా, చైతన్యంతోనే కాక ఏ స్థితిలో ఉన్నా నిర్వహించ గలుగుతాము. దానితో మనపై మనకు ఏర్పడే  చేయగలనే ఆత్మ విశ్వాసం అనంత శక్తిని ప్రసాదిస్తుంది. ఆ శక్తి ప్రేరణ మరింత భారమైన క్లిష్టతరమైన కార్యాన్నైనా సునాయాసంగా నిర్వహించేందుకు కావలసిన ప్రేరణాపూర్వక శక్తిసామర్ధ్యాలను ప్రసాదిస్తుంది. అంతేకాదు నిరంతర చైతన్యమూర్తులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది.
            "షడ్భాగంతు మనుష్యాణాం సప్తమం దైవ చింతనం" అన్నారు పెద్దలు.  మనిషి ప్రయత్నశీలిగా మారి నిరంతరం ఉద్యమస్పూర్తితో ముందుకుసాగితే విజయపథంలో నడవ గలుగుతాడు. దైవమూ సహకరిస్తుంది. ఆ ప్రయత్నమే అతనికి "సాధన"గా మారుతుంది.

            విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి :  పూర్ణ మదః, పూర్ణ మిదం, పూర్ణాత్పూర్ణ ముదచ్యతే; పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటున్నాయి ఉపనిషత్తులు. అనంతమైన చైతన్యం నుండి  ప్రకటితమైన సకల జీవకోటీ పరిపూర్ణమైనదే. ఆ చైతన్యాంశ గలిగి అందులో అంతర్భాగమైనట్టి మనమూ పరిపూర్ణులమే. ఇంతటి విశాల విశ్వం ఆ అనంతం నుండి వెలువడినా ఆ మిగిలినదీ అనంతమైనదే పరిపూర్ణమైనదే. సనాతన తత్త్వం ప్రకారం ఈ విశాల విశ్వం అంతా భగవత్సృష్టి కాదు. భగవంతుని ప్రకటన (Manifestation) మాత్రమే.
            పరిపూర్ణత వైపు సాగే పయనంలో విజయ సాధన చిన్న మజిలీ మాత్రమే కాగా. అంతిమంగా సాధించాల్సిన "సాధ్యం" లేదా లక్ష్యం… మన పుట్టుకకు మూలాలను అన్వేషించడమూ ఆ మూలాలలో లయించడం. ఆ సత్యాన్వేషణలో సాగే ఆగని ప్రయాణంలో అనంతమైన మజిలీలు ఎన్నో.
            అయితే మనలోనే అంతర్భాగమైన పరిపూర్ణత్వాన్నిఎందుకని గుర్తించడం లేదు? నిజానికి నేను నాది అనే మాయా చీకటులు గ్రమ్మడం వల్లనే ఆ సత్యాన్ని గుర్తించ లేక పోతున్నాము. సాధనాబలంతో విచక్షణను మేల్కొలిపి అంతశ్చేతనలోని ప్రజ్ఞను దర్శించిన దార్శనికులైన మహానుభావులు ఆ చైతన్యం యొక్క స్వభావ స్వరూపాదులను తమ తమ "దర్శన" మేరకు జిజ్ఞాసువులకు బోధపరచే ప్రయత్నం చేసారు.            “నేను” ఎక్కడ నుండి వచ్చాను, ఎక్కడికి వెళతాను? ఈ ప్రయాణంలో నేను పొందేది  ఏమిటి, విడిచి పెట్టేది ఏమిటి? ఈ విషయాలపై అవగాహన ఏర్పడితే మాయా చీకటి తెరలు విడిపోయి స్వస్వరూపాదుల దర్శన మౌతుంది.
            అందుకై మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటి?.....

            1)         ఇతఃపూర్వం ఆ మార్గంలో ప్రయాణించి తమ అనుభవాలను "అక్షర"బద్ధం చేసిన దార్శనికుల అనుభవాలను అధ్యయనం చేయడం.... అవకాశం మేరకు వారి ప్రబోధలను ప్రత్యక్షంగా వినడం; ఇందువల్ల విషయంపై అవగాహన పెరుగుతుంది.
            2)         అనుమానాలు చిన్నవైనా, పెద్దవైనా, ఎలాంటివైనా నివృత్తి చేసుకోవడం: అనుమాన గ్రస్తమైన హృదయం విషయాన్ని ఎలా ఉన్నది అలా తీసుకోనివ్వదు. తన దృష్టి కోణంలో విషయాన్ని వడగట్టి మనస్సుకు అందిస్తుంది. ఇతఃపూర్వం ఏర్పరచుకున్న అభిప్రాయాల కనుగుణంగా తీసుకునే ఏ విషయమూ సత్యాన్ని ఆవిష్కరించనీయదు. అనుమాన నివృత్తి "సత్య స్థితి"ని  అవగాహన చేసుకునేందుకు ఉపకరిస్తుంది.
            3)         విషయాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న లేదా తెలిసిన బోధకుని ఆశ్రయించాలి
            4)         మనలో స్పష్టత ఉండాలి. ఏ విషయం తెలుసుకోవాలి.. ఆ విషయంలో మన అవగాహన ఎంత...  విషయంపై అవగాహన పెరిగాక దానిని ఎలా ఉపయోగించుకుంటాము. మొత్తంగా సాధించాక ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నాము.... ఇలాంటి విషయాలపై సమగ్రమైన అవగాహనతో కూడిన స్పష్టత ఉండాలి.
            5)         ఏ విషయాన్ని మథిస్తున్నామో ఆ విషయంపై సంపూర్ణమైన సమాచారం సేకరించగలగాలి, పట్టు సాధించాలి. ఏ విషయంపై నైనా సంపూర్ణ పారంగతుడు కావాలి అంటే దాదాపు 10,000 గంటల కాలం శ్రమించాలి అంటారు. అన్ని గంటల కాలం శ్రద్ధతో, ఆసక్తితో అనుక్షణం మేలైన పారంగత్వాన్ని సాధించడం వల్ల కలిగిన ప్రేరణ ముందుకు నడిపించడం వల్ల ఆ విషయంలో నిష్ణాతులం కాగలము. విషయం లోతులలో విహరించడం వల్ల మనదంటూ ఒక మార్గాన్ని సృష్టించుకో గలుగుతాము.
            6)         అలాగే నిలకడ లేని మనస్తత్త్వం వల్ల సాధించేదీ ఏమీలేదు. వేగము ఎంత అవసరమో విజయ సాధనలో నిలకడ అంతే అవసరము..
            7)         నూతన విధానాన్ని ఎప్పటికప్పుడు ఆలోచించాలి. భూతకాలంలోని అనుభవాలు ప్రాతిపదికగా భవిష్యత్తును దర్శించేందుకు వర్తమానంలో ప్రణాళికలు రచించుకోవాలి. భూతభవిష్యత్తులకు అతుక్కుపోయి వర్తమానాన్ని విస్మరిస్తే జీవితకాలం వ్యర్ధమైనట్లే.
            8)         అదీతి (అధ్యయనం చేయడం) బోధ (అర్ధం చేసుకోవడం) అవగతం (ఆచరించి ఫలితాలను బేరీజువేసుకోవడం) ఈ మూడు ప్రక్రియల వల్ల విషయం సంపూర్ణంగా అవగతమౌతుంది. అప్పుడు మనలో ప్రవహించే జ్ఞానప్రవాహం పదుగురికి ఉపయుక్తమయ్యే విధంగా ప్రవచనాల ద్వారా వ్రాతల ద్వారా ప్రచారం చేయడం వల్ల వర్తమాన, భావితరాల వారలకూ మార్గం చూపిన వారమౌతాము.

ఇలా తనను గూర్చి తాను చేసే శోధనను సాధన చేస్తూ బోధన చేయడం వల్ల ఆలోచనలలో ఉండే వ్యగ్రత పోయి నిర్మలత ఆవరిస్తుంది.

            అలాంటి వ్యక్తి తాను పునీతుడై అజాత శత్రువుగా మారిపోతాడు. సృష్టి సమస్తమూ తనలోనే ఉందని, ఈ సకల సృష్టిలో తానూ ఉన్నాననే "బోధకళ" వల్ల  చిత్త విభ్రాంతి శమించి తాను భగవత్తత్త్వానికి భిన్నుడను కాననే సత్యాన్ని గ్రహిస్తాడు. ఆ గ్రహణయే సిద్ధి పొందడంగా చెప్పుకుంటాము.

Palakurthy Rama Murthy