Sunday, August 17, 2025

 సంఘర్షణలో సానుకూలత ఆదరణీయం..


యః సర్వత్రా నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం

నభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా!

(భగవద్గీత - 2-57)

దేనియందూ మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు సంతోషము, ప్రతికూల పరిస్థితుల యందు దుఃఖములాంటి వికారములకు లోనుగాని వాడే స్థితప్రజ్ఞుడు అంటున్నాడు, కృష్ణపరమాత్మ. జీవిత గమనంలో ఎదురయ్యే ఎలాంటి పరీక్షలనైనా తట్టుకోగలిగే శక్తిసామర్ధ్యాలు, సమస్యలను అధిగమించే బుద్ధి సంపద, దేనికోసం దేనిని ఆదరించాలనే విచక్షణతో కూడిన స్వేఛ్చ.. స్థిత ప్రజ్ఞునిలో సహజ లక్షణాలుగా ప్రకాశిస్తాయి.

సృష్టిలో ద్వంద్వాలు సహజాలు. అలాగే ఒక పనిని చేస్తున్నప్పుడు లాభనష్టాలు, జయాపజయాలు కలుగుతాయి. శుభమైనా అశుభమైనా.. మంచైనా చెడైనా అవి మనస్సులో వెలుగు చూచే అభిప్రాయాలే కాని బాహ్య సన్నివేశాలు కావు. పుస్తకంలో వర్ణించిన నవరస భరిత సన్నివేశా లెలాగైతే పుస్తకానికి అంటుకుపోవో అలాగే శుభాశుభములు స్థితప్రజ్ఞునికి అంటుకుపోవు. ఒకరంగు పాత్రలో పోసిన నీరు మరొకరంగు పాత్రలో పోసిన నీటికి భిన్నంగా కనిపించినా రెంటిలో ఉన్నది ఒకేనీరనే భావన స్థితప్రజ్ఞుడు పొందగలుగుతాడు.

రెండూ భిన్నమనే భావనయే సంఘర్షణకు దారితీస్తుంది. అలాంటి సంఘర్షణలో కూడా సానుకూలతను అన్వేషించడమే స్థితప్రజ్ఞత. యుద్ధవిద్యలో ఎదుటి వ్యక్తి దాడి చేసిన సమయంలో ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అలవరచుకోవాలని నిపుణులు చెపుతారు. ప్రశాంత స్థితిని పొందిన మనసును యదేఛ్చగా వదిలివేస్తే .. అది పరిష్కారం దిశగా సాగుతుంది. ప్రశాంతత జీవన కేంద్రమై, ఆలోచన ఉత్తేజితమౌతుంది. కర్తవ్యం బోధపడుతుంది. ఎక్కువలో ఎక్కువగా ఏమవుతుంది?  ఎదుటి వ్యక్తి బలవంతుడైతే మనలను చంపేయవచ్చు. పెనుగులాడినా అదెలాగూ జరుగుతుంది. ప్రశాంతతను ఆదరిస్తే.. ప్రమాదం నుండి బయటపడే పరిష్కారం స్పురించవచ్చు. ప్రశాంతమైన మనసును దేనిపై లగ్నం చేస్తే దానినే సాకారం చేస్తుందది. మనసును వదిలివేస్తే అది పసిపాపలా అన్నింటినీ అద్భుతాలుగా భావిస్తుంది.. ఆస్వాదిస్తుంది. పసిపిల్లల మనసులో భేదభావనలు నిలువవు.. గతం పట్ల విచారం కాని భవిష్యత్తు పట్ల ఆందోళనకాని ఉండవు.. వర్తమానాన్ని అస్వాదిస్తారు.. ఆనందిస్తారు. సగటున పసిపిల్లలు రోజుకు మూడు వందల మార్లు నవ్వుతారని చెపుతారు.

ప్రశాంతమైన మనసుతో సముద్ర తరంగాలపై విహరించే వ్యక్తి ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. తరంగాలు పైకి లేపిన వేళ పూర్తి స్పృహతో తెలివితో దానికి అనుకూలంగా స్పందిస్తాడు.. పడిపోయినా "ఎఱుక"తో పడిపోతాడు.. పడిలేవడాన్ని సమచిత్తంతో ఆహ్వానిస్తాడు..  ఆనందిస్తాడు.. అద్భుతంగా భావిస్తాడు.. ఆస్వాదిస్తాడు. ఇక్కడ "పడడం" అనేది సమస్యగా భావిస్తే.. జయాపజయాలకు అతుక్కుపోతాడు.. దానితో ఒత్తిడి పెరుగుతుంది.. నిరాశానిస్పృహలు పెరిగిపోయి.. మనసును సంఘర్షణకు గురిచేస్తాయి. అలాకాక వాటిని సహజంగా భావిస్తే స్థితప్రజ్ఞతను ప్రదర్శిస్తాడు. సమస్య నుండి పారిపోవడం కాక దానిని ఎలా ఎదిరించాలో ఆలోచిస్తూ.. సానుకూలతను ఆదరిస్తే సంఘర్షణను అధిగమించడం సాధ్యపడుతుందని కృష్ణపరమాత్మ బోధిస్తున్నాడు.

దానిని సాధించడం ఎలా? ప్రశాంతమైన మనసుతో.. సమస్య పట్ల అవగాహనను పెందుకుంటే.. అంతర్మనస్సు పరిష్కార మార్గాన్ని అందిస్తుంది. కాని చాలా మంది పరిష్కారంలో భాగంగా కాక సమస్యలో భాగమౌతుంటారు. అదే సంఘర్షణను పెంచుతుంది. రెండావులను అడిగి ద్రుపదునితో అవమానింపబడిన ద్రోణుడిలోని సంఘర్షణ ద్రుపదునిపై ప్రతీకారానికి ప్రేరణనిచ్చింది. తద్వారా ద్రుపదునిలో వెలుగుచూచిన సంఘర్షణ ద్రోణవధ లక్ష్యంగా దృష్టద్యుమ్నునికి జన్మనిచ్చింది. అస్త్రవిద్యా ప్రదర్శనలో అవమానింపబడిన కర్ణుడు, అర్జునునిపై పెంచుకున్న మాత్సర్యం అతడిని జీవితాంతమూ సంఘర్షణకు లోనుచేసింది. కర్ణుని పరాక్రమాన్ని తలుచుకొని ధర్మరాజూ సంఘర్షణకు లోనయ్యాడు.. దానికి ప్రతిగా వారు సానుకూల వైఖరితో ఆలోచించి ఉంటే ఫలితం వేరుగా ఉండేది.

పాలకుర్తి రామమూర్తి

 ద్రోణుని రెండావుల యాచన.. పరిణామం..


ధనపతితో దరిద్రునకుఁ దత్త్వవిదుండగు వానితోడ మూ

ర్ఖునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణ శూరుతోడ భీ

రునకు, వరూధితోడ నవరూధికి, సజ్జను తోడఁ గష్ట దు

ర్జననుకు నెవ్విధంబున సఖ్యము దా నొడఁ గూడ నేర్చునే! 

(మహాభారతం - ఆదిపర్వము- 5-204)


ధనవంతునితో దరిద్రునికి, తత్త్వాన్ని తెలిసిన పండితునితో మూర్ఖునికి,  ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచాన్ని ధరించిన వానితో కవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? అని ప్రశ్నిస్తున్నాడు ద్రుపదుడు, ద్రోణుడిని. మానవ సంబంధాలలో లోక సహజమైన ఒక విధానాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, నన్నయగారు. ఇలా ఉండాలని కాదు కాని ఎలా ప్రపంచం "ఉన్నదో" ఆ స్వరూపాన్ని దర్శింప చేస్తున్నాడు. 

స్నేహితుడు కష్టాలలో ఉన్నప్పుడు అతనిని ఆదరించడం స్నేహధర్మం. ఆదరించక పోయినా ఎత్తిపొడుస్తూ అవమానించడం అతిశయానికీ గర్వానికీ ప్రతీకగా నిలుస్తుంది. తాను క్షత్రియుడననీ.. ఎదుటి వాడు బ్రాహ్మణుడని చెపుతూ "వర్ణాన్ని", స్వభావాన్నీ, అంతరాలను సభలో ఎత్తి చూపుతూ మిత్రుని మనస్సును చివుక్కుమనే విధంగా ద్రుపదుడు ప్రవర్తించాడు. ఏ మాత్రం అభిమానం కలిగిన వాడైనా ఆ మాటలకు బాధపడతాడు. పోలికలలో కూడా తనను తాను ఉత్తమునిగా (ధనపతిగా, తత్త్వవేత్తగా, ప్రశాంతునిగా, రణశూరునిగా, సురక్షితునిగా, సజ్జనునిగా) చెప్పుకుంటూ.. అధమ లక్షణాలను (దరిద్రునిగా, మూర్ఖునిగా, క్రూరునిగా, పిరికివానిగా, అరక్షకునిగా, దుర్మార్గునిగా) ద్రోణునికి ఆపాదించడం వల్ల పుండుపై కారం చల్లినట్లుగా కనిపిస్తుంది. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలన్న లోక సహజోక్తిని ఇక్కడ అన్యాపదేశంగా చెప్పడం గమనార్హం.

మహాభారతం ప్రకారం.. ద్రోణుడు శుక్రాచార్యుల అంశ.. కాగా ద్రుపదుడు వాయువు అంశ. భరద్వాజుడు ఘృతాచీని చూచిన సమయంలో జరిగిన రేతః పతనం వల్ల జన్మించిన వాడు.. ద్రోణుడు.. కాగా వృషతుడు మేనకను దర్శించిన సమయంలో జరిగిన రేతః పతనం వల్ల జనించిన వాడు, ద్రుపదుడు. వృషతుడు తన మిత్రుడైన భరద్వాజుని ఆశ్రమంలో ద్రుపదుని చేర్చి విద్యాభ్యాసం చేయించాడు. దానివల్ల ద్రోణునికి ద్రుపదునికి మధ్య గాడమైన మైత్రి ఏర్పడింది.. కాలాంతరంలో అటు వృషతుడు ఇటు భరద్వాజుడు మరణించడం.. కారణంగా ద్రుపద.. ద్రోణులు విడిపోయారు.. తన రాజ్యానికి వెళ్ళే సమయంలో ద్రుపదుడు.. ద్రోణునితో నీకే సమయంలో ఏ విధమైన అవసరం వచ్చినా నేనున్నానని మరచిపోకు.. పాంచాల దేశానికి ప్రభువునైన నా సహాయాన్ని నిస్సంకోచంగా తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు.

తదుపరి ద్రోణుడు అగ్నివేశుని వద్ద విలువిద్యను అభ్యసించడం జరుగుతుంది. కృపుని చెల్లెలయిన కృపితో వివాహం జరిగి అశ్వత్థామ అనే కుమారునికి జన్మనిచ్చాడు. వేదవేదాంగాలూ నేర్చాడు, అస్త్రవిద్యలో ఆధిక్యాన్ని సాధించాడు.. అయినా అపరిగ్రహ వ్రతంతో (ఎవరి వద్దా దేనినీ తీసుకోననే) జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నాడు. కటిక పేదరికం వల్ల కనీసం కుమారునికి పాలుకూడా ఇవ్వలేని దుర్భరస్థితిలో లౌకిక జీవనం సాగేందుకై.. పరుశురాముడు దానధర్మాలు చేస్తున్నాడని తెలుసుకొని ఆతనిని ధనార్థియై ఆశ్రయిస్తాడు. అయితే అప్పటికే తన ధనాన్ని అంతా ఇతరులకు దానం చేసిన పరశురాముడు.. తనవద్ద అస్త్రశస్త్ర విద్యలు మాత్రమే ఉన్నాయని కావాలంటే వాటిని ఇవ్వగలనని చెప్పడం వాటినే అతడు కోరి పరశురాముని శిష్యరికంలో సాంగోపాంగంగా అన్ని యుద్ధ విద్యలను నేర్చుకుంటాడు.

అస్త్రం ఎప్పుడూ హింసనే కోరుకుంటుంది... బ్రాహ్మణునిగా తన వృత్తిని అనాదరించినా.. శస్త్రవిద్యను నేర్చిన అతనిలో.. ఆ భావ తీవ్రత కనిపిస్తుంటుంది. దానికి తోడుగా శుక్రాచార్యుల అంశ.. ప్రేరణనిస్తుంది. ఎన్ని విద్యలు నేర్చినా "కలనాటి ధనము లక్కర గలనాటికి" ఉపయుక్తం కాకపోతే ప్రయోజనం ఏమిటి? పేదరికం వెంటాడగా.. చిన్ననాటి మిత్రుడు.. ద్రుపదుడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన చేసిన "బాసా" జ్ఞాపకం వచ్చింది. వెంటనే ద్రుపదుని పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు.. సభలో ద్రుపదుని దర్శించి తనను పరిచయం చేసుకొని.. అతని నుండి ఆశించిన ప్రతిస్పందనను కరవవడం వల్ల నేను నీ మిత్రుడనని జ్ఞాపకం చేస్తూ.. రెండావులను యాచించాడు. అది విన్న ద్రుపదుడు.. పరిహాస భావనతో చూచాడు.. పరుషమైన పదాలతో అవమానించాడు. రాజ్యాహంకారం దుశ్శీలత స్పష్టంగా కనిపిస్తున్నది, పై పద్యంలో..

ద్రోణుడు.. తాను పేదవాడే కాని దరిద్రుడు కాడు. సంపద లేకపోవడం పేదరికం.. సంపద లేకపోవడానికి తోడుగా ఆశ.. గుణహీనత కలిగియుండడం దరిద్రం.. అస్థిత్వానికి మూలాన్ని తెలుసుకోవడం తత్త్వజ్ఞత.. తెలిసిన దానిని ఆచరణలో పెట్టకపోవడం మూర్ఖత్వం... ప్రశాంతత.. స్థిత ప్రజ్ఞతకు ప్రతీక కాగా చాంచల్యత సంఘర్షణా మనస్సుకు ప్రతీక.. కార్య సాధనా శీలత.. సజ్జన లక్షణం కాగా పిరికితనం దుర్జన లక్షణం.. వీటిలో ఉత్తమ లక్షణాలను తనకు ఆపాదించుకొని అనుత్తమ లక్షణాలను ద్రోణునికి ఆపాదించడం వల్ల .. ద్రోణుని అభిమానాన్ని రెచ్చగొట్టి ప్రతీకారేఛ్ఛకు బీజం వేసాడు.. ద్రుపదుడు. "పొంగు క్రుంగు" లను సమంగా చూడగలిగిన ద్రోణుని వ్యక్తిత్వ పరిణతి.. అవమాన జ్వలితమై రగిలిపోయింది. తన శస్త్రాస్త్రబలంతో ద్రుపదుని ఎదిరించి.. పోరాడడం ఒక పద్ధతి.. అయితే తాను వచ్చింది యాచనకు.. ఇవ్వలేదనే కారణంతో చక్రవర్తిపై యుద్ధానికి సన్నద్ధమైతే.. తాను జయించవచ్చూ.. ఓడిపోనూవచ్చు.. ఏది లభించినా యుద్ధం వల్ల అత్యంత విలువైన మానవ వనరులు, ఆర్థిక వనరులు నాశనమౌతాయి. ఫలితం ఏదైనా  రాజ్య ప్రజలకు క్షోభనే మిగులుస్తుంది.  తన అవమానానికి మరింత ఆజ్యాన్ని అందిస్తుంది. అందుకే మౌనంగా వెళ్ళిపోయాడు. అప్పటివరకూ ద్రోణుడు క్షాత్రధర్మాన్ని స్వీకరించినా హింసను కోరకుండా బ్రాహ్మణ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు.

అయినా ద్రోణుడు శుక్రాచార్యుల అంశ.. కాబట్టి అవమానాన్ని మరచిపోలేదు.. ఆలోచించాడు.. కౌరవ సామ్రాజ్యం భీష్ముని రక్షణలో ఉన్నది. ఆ రాజ్యంలో రాజ కుమారులకు తన బావమరిది కృపుడు ఆచార్యకత్వం నిర్వహిస్తున్నాడు.. భీష్ముని ఆశ్రయిస్తే.. రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి.. ఒకటి తన పేదరికం.. తొలగిపోతుంది.. రెండవది.. అవమానానికి ప్రతీకారం తీర్చుకోవచ్చు.. తదనుగుణంగా కౌరవ సామ్రాజ్యంలో ధనురాచార్యునిగా చేరాడు.. గురు దక్షిణగా ద్రుపదుని ప్రాణాలతో పట్టి తెమ్మని శిష్యులకు పురమాయించాడు. అర్జునుడు ద్రుపదుని బంధించి ద్రోణుని ముందు నిలిపాడు.. "బ్రాహ్మణస్య క్షణం కోపం" అంటారు. ద్రుపదుని బంధించడంతో సంతృప్తి పడవచ్చు. కాని శ్రుక్రాంశ.. ఆగనీయదు.. ద్రుపదుని అవమానించాడు.. 

"వీరెవరయ్య? ద్రుపద మహారాజులె.. యిట్లు కృపణులయి పట్టువడన్ వీరికి వలసెనె.. యహహ! మహారాజ్య మదాంధకార మది వాసెనొకో!" అంటూ అవమానకరమైన మాటలతో పరిహసించి... ద్రుపదుని విడిచిపుచ్చుతూ.. మిత్రమా.. ఇప్పుడు నీ రాజ్యం అంతా నా వశమయింది.. అయినా మిత్రధర్మంగా గంగానదికి ఉత్తరంగా ఉన్న పాంచాల దేశాన్ని నీకు ఇస్తున్నాను.. దక్షిణభాగాన్ని నేను తీసుకుంటున్నాను వెళ్ళుమంటాడు.. దీనితో... ద్రోణుని ప్రతీకారేఛ్ఛ సమసిపోయినా.. ద్రుపదునిలో జనించింది.. తనను రెండావులను కోరి పరిహసించబడిన ద్రోణుని దాతృత్వం వల్ల తాను రాజ్యాన్ని పొందవలసి వచ్చింది.. ఆ అవమానం ద్రోణుని వధ లక్ష్యంగా దృష్టద్యుమ్నుని జననానికి కారణమయింది.. కురుక్షేత్ర యుద్ధంలో అది ఆవిష్కృతమయింది. 

  నిజానికి మహాభారతాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ప్రతి ప్రధాన పాత్ర జననానికి ఒక కారణం ఉన్నది. అవన్నీ చివరగా భూభారాన్ని తగ్గించే కార్యానికి ఉపకరణాలయ్యాయి.

 పాలకుర్తి రామమూర్తి

Friday, August 15, 2025

 అమ్మకు మ్రొక్కెదన్, పలుకు లమ్మకు మ్రొక్కెద;

 

అమ్మకు మ్రొక్కెదన్, పలుకు లమ్మకు మ్రొక్కెద; ఐదు నాల్గు మా

సమ్ములు మోసి గర్భమున, జన్మము నిచ్చి, ప్రసన్న మూర్తియై

రమ్మని జేర బిల్చుచు, శిరమ్ము నురమ్మున జేర్చి, స్పర్ష సౌ

ఖ్యమ్ముల దేర్చి, నిల్పి యొడి( నగ్గలమౌ యనుకంప నిండు చి

త్తమ్మున ముద్దు జేసి; అమృతత్త్వము ప్రేమయు క్షీర ధారలై

పమ్మగ స్తన్యమిచ్చి, మృదుభావ సుశబ్ద పరీమళమ్ము ప

ద్యమ్ముల పాటలన్ కథల నార్ద్ర వచస్సుల సౌరు జూప, శ్రా

వ్యమ్ముగ జోలబాడుచు; నిహమ్ము పరమ్మును జూపు విద్యలన్

గొమ్మని సుస్వరావళిని గూర్చి, తదీయ వికాస శోభ, పూ

ర్ణమ్ముగ పల్లవింపగ, సనాతన జీవన వైఖరుల్ సమా

జమ్మును వ్యక్తి బాధ్యతల సారము నా హృదయాంతరమ్ములం

దిమ్ముగ నిండ; నొజ్జయయి యెంతయు ప్రేమను బోధ జేయు మా

యమ్మకు మ్రొక్కెదన్; సతత మాత్మను జ్యోతిగ వెల్గునట్టి మా

యమ్మ; నవ ప్రఫుల్ల దరహాస మయూఖ వికాస మాలికా

సమ్మిళితాస్య దీప్తి, మనసా వచసా కరుణార్ద్ర పూర్ణ నే

త్రమ్ముల జాలువారెడు నిరంతర వత్సలతా ప్రవృత్తి, చే

తమ్మున నిత్య సత్య నిరత క్రమ  ధర్మ పథాను రక్తి, వా

క్యమ్ముల సంస్కృతీ రుచి సమాశ్రిత భావ సుధామయోక్తి, యా

యమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గ పా

దమ్ముల భక్తి నిష్ఠల సతమ్మును గొల్చెడి చిత్త వృత్తి, శా

స్త్రమ్ముల సార మన్వయము సల్పి హితమ్ముగ జాతి అజ్ఞతాం

ధ్యమ్మును బాపు జ్ఞాన రతి, తాత్త్విక చింతన లేకమై ప్రపం

చమ్మున శాంతి దాంతి పృధు సారము నింపగ నుద్యమించు మా

యమ్మ పవిత్ర పాదముల కర్మిలి మ్రొక్కెద; పాలకుర్తి వం

శమ్మున విజ్ఞతామతి, ప్రశాంతు డుదీర్ణ మనస్వియున్, సుగీ

తమ్ముల సర్వమంగళ యుదాత్త పదాబ్జ సమర్చనారతుం

డమ్మహనీయ భావనలహర్నిశలంచిత భక్తి తత్త్వ రా

జ్యమ్ము పదమ్ము జూపగ నహమ్ము నిహమ్మును మాని నిష్ఠ ని

త్యమ్మును తచ్ఛరిత్రములు ధ్యానము చేయుచు తన్మయుండునౌ

యమ్ముని సన్నిభుండు చరితార్ధుడు నౌ నరసింహరాము చి

త్తమ్ము వికాస దీప్తిగను తాత్త్విక చేతన శక్తి యౌచు భ

ద్రమ్ముగ వంశ గౌరవము రాజిల జేసిన తల్లి మా సుభ

ద్రమ్మకు మ్రొక్కెదన్; స్వర సుధా మధు వాహిను లార్ణవంబులై

నెమ్మది పొంగగా; సతత నిశ్చల నిర్మల మూర్తి యైన దు

ర్గమ్మ సభన్ మహాజనుల ప్రక్క సమంచిత పీఠి నాత్మ తే

జమ్మును ధీ విలాసము లజేయములై రహి మించ శ్లాఘనీ

యమ్ములు సారవంతములు నైన పదమ్ముల ముచ్చటించు మా

యమ్మ సుభద్ర పాదయుగ మాత్మను నిల్పి నమస్కరించెదన్!

పాలకుర్తి రామమూర్తి

 అసతోమా సద్గమయ,

తమసోమాజ్యోతిర్గమయ,

మృత్యోర్మా అమృతంగమయ (బృహదారణ్యకము 91.3.28)



 Oh God, please lead me from Untruth to Truth, please lead me from Ignorance to Illumination and please lead me from Mortality to Immortality....

The ultimate ambition of a human being should be to reach the destiny i.e. where he comes from.

The phenomenal world we perceive with our senses is only insentient. It is a gross part. It has a quality of composition and decomposition. So it is subject to destruction and over a period it vanishes. Therefore, it is said to be Unreal. Unreal or untruth is always non-existent. Our manifestation has taken place from un-manifestation, which is real or Truth and exists always. The truth is sentient and not gross or subtle. It has neither a beginning nor an end. So, we pray for the Ultimate to lead us to our birthplace which is real and unmanifest.

The wisdom of reality can be perceived only when our ignorance vanishes and enlightenment dawns. So, we pay the Ultimate to lead us from ignorance to illumination.

As the body is composed with five elements and over a period of time it vanishes. We call it death. Then all the five elements merge with the cosmic elements and we call it Mortality. Though the body disappears there is something which is immortal in our body, and it is called the Atman which is sentient. It is the manifestation of Ultimate and eternal. When we have such realisation, we pray to the Ultimate to lead us from mortality to immortality.

Realisation and attaining the state of eternity is the ultimate Goal of Human Life.

 భావవ్యక్తీకరణ ప్రాముఖ్యత


మహాభారతం జనమేజయునికి వైశంపాయనుడు చెప్పాడు. శ్రీశుకులు భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పాడు. ఒక నిర్వహణాధికారి తన క్రిందివారికొక పనిని చెప్పాడు. ఇలా ఎవరు ఎవరికి ఏది చెప్పినా దానిని భావవ్యక్తీకరణ అంటారు.. భావవ్యక్తీకరణ చెప్పినవారు (వక్త), సమాచారం, విన్నవారు (శ్రోత).. ఇలా మూడు స్థాయిలలో ఉంటుంది. ప్రభావవంతమైన భావవ్యక్తీకరణలో ముఖ్యమైనవి కూడా మూడు అంశాలే. చెప్పేవారికి వినేవారికి మధ్యనుండే సంబంధం, సమాచారం, సమాచారాన్ని అందుకున్నవారు దానిపై స్పందించిన విధానం. నిజానికి సమాచారాన్ని సరిగా అందించామా లేదా అనేది అవతలి వ్యక్తి దానిపై సరిగా స్పందించడంలోనే విదితమౌతుంది. ఇరువురికీ ఆసక్తి కలిగిన అంశంపై జరిగిన భావవ్యక్తీకరణ ఉత్తమ ఫలితాల నిస్తుంది. చెప్పిన వ్యక్తిలో అస్పష్టత, అసందర్భత వల్ల సమాచారం ఎదుటివారిలో ఆసక్తిని తగ్గించవచ్చు. అప్పుడు ఎదుటివారి స్పందన సరిగా ఉండకపోవచ్చు.
రామాయణంలో హనుమంతుడు మొదటిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు.. ఆత్మవిశ్వాసంతో, వినయంతో, తత్తరపాటు లేకుండా, సంక్షిప్తంగా, సందేహానికి తావులేకుండా, మధ్యమ స్వరంతో, సందర్భానికి అనువైన పదాలను ఎన్నుకొని సంస్కారవంతంగా తన మనసులోని మాటను స్పష్టంగా మృదుమధురంగా చెప్పాడు. మాట్లాడుతున్న సమయంలో ముఖంలో, కనులలో ఏ విధమైన వికారాలు కనిపించకుండా, సమయస్ఫూర్తితో మాట్లాడాడు, హనుమ. అలాకాక, వక్త ఆగిఆగి మాట్లాడడం, అర్థరహితంగా పదాలను విరిచి మాట్లాడడం, సాగదీస్తూ మాట్లాడడం, వేగంగా మాట్లాడడం, తొందరపాటుతో పదాలను ఉచ్చరించడం.. వినేవారిలో విసుగుకు కారణమౌతుంది.
భావవ్యక్తీకరణ అనేది.. మన దృష్టికోణాన్ని, ఆలోచనలను, భావనలను ఎంత ప్రభావవంతంగా ఎదుటివారికి చేరుస్తున్నామనేది తెలుపుతుంది. అలాగే వినడమనేది ఎదుటివ్యక్తి దృష్టికోణాన్ని, ఆలోచనలను, భావనలను ఎంత ప్రభావవంతంగా అవగాహన చేసుకుంటున్నామనేది తెలుపుతుంది. ఈ ప్రక్రియలో స్పష్టత లేనిచోట ప్రశ్నించడం, ఎదుటివారి దృష్టికోణాన్ని తెలుసుకోవడం వల్ల ఉత్తమమైన భావవ్యక్తీకరణ జరుగుతుంది. అవసరమైన చోట ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
భారతీయ సాహిత్యంలో ప్రశ్నోపనిషత్తు అనేపేరుతో ఒక ఉపనిషత్తే ఉన్నది. సరిగా ప్రశ్నించడం.. ఎదుటివారి పలుకుల కతీతంగా వారి హృదయాన్ని అవగాహన చేసుకోవడం ఉత్తమ సంభాషణకు ప్రతీకగా చెపుతారు. ఈ ప్రక్రియ సనాతన సంప్రదాయంలో గురుశిష్య సంభాషణలో కనిపిస్తుంది. లక్ష్యాన్ని నిర్వచించడంలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమంలో ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవడం, సమయపాలనతో ముగించడం, వితండవాదాన్ని నివారించుకోవడం వల్ల వక్తకు శ్రోతకు మధ్య సదవగాహనతో కూడిన సంబంధాన్ని ఏర్పరచడం సాధ్యపడుతుంది.
రామాయణంలో హనుమంతుడు సీతను చూచాక వెనుతిరిగి తన సహచరులను కలుసుకున్న సమయంలో "దృష్ట్వాసీతా".. సీతను చూచాను అంటాడు. తక్కువ మాటలతో సహచరులందరికీ అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందించాడు. చాలా కాలంగా వారంతా అమితమైన ఒత్తిడికి లోనై, ఎంతో ఆసక్తితో, ఉద్వేగంతో హనుమ రాకకోసం ఎదురుచూస్తున్నారు. చూచాను అనడం వల్ల దేనిని చూచేందుకు వెళ్ళాడో దానిని చూచాడనే భావన వెల్లడయింది. కార్య సాఫల్యతను సూటిగా చెప్పడం వల్ల భావవ్యక్తీకరణ లక్ష్యం నెరవేరింది. సహచరులు కుతూహలం చూపితే వివరాలు చెప్పవచ్చు.
ఈనాటి సంస్కృతిలో కూడా భావవ్యక్తీకరణకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. తప్పుడు భావాలు అనుచరులకు చేరితే ఫలితాలు అసమంజసంగా రావచ్చు. కాబట్టి ఉత్తమ స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న నాయకులు సరైన సంభాషణా నైపుణ్యాలను సంతరించుకోవాలి.
పాలకుర్తి రామమూర్తి

 అందరికీ శుభ సాయంకాలం.

 
ఈ రోజు ఒక మిత్రుడు మాట్లాడుతూ మార్క్స్ "కాపిటల్" చదవకుండా ఈ ధరల్ని అర్థం చేసుకోవడం తేలిక కాదు అన్నాడు. దాన్ని అర్థం చేసుకోవడమనేది అంత లోతైన విషయమేమీ కాదనేది రోడ్డు ప్రక్కన మిర్చీ బడ్డీ పెట్టుకొని జీవనం సాగించే వ్యక్తికీ తెలుసు. 
అయితే ఈ నాటి గ్లోబలైజేషన్ విధానంలో వస్తువు విలువను రూపొందించాల్సిన విధానం భారతీయ సాహిత్యం ఎలా చెపుతుందో ఒకసారి చూద్దాం.

ఆర్థిక స్వావలంబనకు నాలుగు పార్శ్వాలుంటాయి. మొదటిది అమ్మకం ద్వారా మనం పొందిన డబ్బు.. దీనినే Price అంటాం. రెండవది ఆ వస్తువు తయారీకి మనం వ్యయించిన సొమ్ము... దీనినే Rate అంటాం. మూడవది ఆ వస్తు ఉత్పత్తికి మనం పెట్టిన శ్రమ.. దీనినే Value అంటాం. ఇక చివరిది.. మన ఖర్చులన్నీ పోను నికరంగా మనకు మిగిలే సొమ్ము... దీనినే Wealth అంటాం. ఇందులో ఎప్పుడు కూడా మొదటిది అంటే Price తగ్గించుకోవాలి. అప్పుడా వస్తువు అందరికీ అందుబాటులోకి వస్తుంది. అమ్మకాలు పెరుగుతాయి... Goodwill పెరుగుతుంది.. ప్రాచుర్యం పెరుగుతుంది. ఇక రెండవది అంటే Rate పెంచుకోవాలి. దీని వల్ల నాణ్యత పెరుగుతుంది. నాణ్యత వినియోగదారుని మన్ననలను పొందుతుంది. ప్రచారం పెరుగుతుంది. మూడవది అంటే Value అభివృద్ధి పరచాలి. దీని వల్ల నిరంతరం క్రొత్తదనం అన్వేషిస్తూ సాంకేతికతను అభివృద్ధి చేస్తాం. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో సమున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తిని సాధించే ప్రయత్నం చేస్తాం. దానితో ఉత్పాదకత పెరుగుతుంది. ఏ సంస్థలో నైనా ఈ ప్రక్రియ నిరంతరం  సాగిపోయినట్లయితే ఆ సంస్థ ఆర్థికంగా బలపడుతుంది. ఆర్థిక పునాదులు బలోపేతమైన సంస్థ ఉద్యోగుల అవసరాలను తీర్చగలుగుతుంది... సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతుంది. చుట్టూ ఉండే సమాజాన్ని ప్రగతి వైపు నడిపించ గలుగుతుంది. ఇక నాలుగవది.. Wealth ఆదాయం ఖర్చు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి యైనా లేదా సంస్థ యైనా సంతోషంగా ఉండగలుగుతుంది. నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. నలుగురుకి ఉపయుక్త మౌతుంది. సమాజంలో గుర్తింపు పొందుతుంది. కాని ఎప్పుడైతే ఆదాయం ఖర్చుకన్నా తక్కువైతే ఆ సంస్థ నిలవడమే ప్రశ్నార్థకమౌతుంది. ఉనికియే ప్రమాదంలో పడిన సంస్థ తన ఉద్యోగులకుగాని, ఖాతాదారులకుగాని ఏ విధంగా ఉపయోగపడదు. మిగులు సొమ్ము మన వద్ద ఎంత ఎక్కువగా ఉంటే అంత ధీమా….గౌరవం.
          ఈప్రక్రియలో మరో ముఖ్య కోణం ఏమిటంటే.. వ్యర్దాలను నియంత్రించడం... వ్యర్ధాలనెంత సమర్థవంతంగా నియంత్రణ చేసుకుంటే అంత అభివృద్ధి సంస్థలో కనిపిస్తుంది. ఎంత సమర్ధవంతుడైన యజమాని ఉన్నా, ఎంత చక్కని యోజనా ప్రణాళికలు వినియోగించినా...నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తి సాధింపబడినా సమర్థులైన ఉద్యోగులు ఎంత అంకితభావంతో శ్రమించినా... అమ్మకాలు ఎంతగా పెరిగినా వ్యర్థ నియంత్రణ లేని సంస్థ నష్టాలలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. నష్టాలతో ఎవరూ సంస్థను నడపలేరు. సంస్థ నిలవక పోతే ఉద్యోగులకు ఉపాధిపోతుంది. అందువల్ల పరస్పరాధారిత విధానంలోనే ప్రయోజనం ఉంటుంది.
ఎవరెంత చెప్పినా వక్ర దృష్టి మారనంత వరకు వారు మారరనేది యదార్ధం. అలాంటి వారి దృష్టిని  ఆకర్షించేవి ఏమిటో కూడా ఒక కవి చాటువుగా చెప్పిన పద్యంతో ముగింపు పలుకుతున్నాను.
ఎవ్వతె వీవు కాళ్ళు మొగ మెర్రన; హంసను, ఏడ నుందువో?
దవ్వున మానసంబునను, దాన విశేషము లేమి తెల్పుమా?
మవ్వగు కాంచనాబ్జములు మౌక్తికముల్ గల వందు; నత్తలో?
అవ్వి యెరుంగ నన్న హహహా యని నవ్వె బకంబు లన్నియున్!

ఒక హంస ఒకనాడు దారి తప్పి ఒక మడుగు చేరిందట. అక్కడ కొన్ని కొంగలు ఉన్నాయి. తమ ఆకారానికి భిన్నంగా ఉన్న ఆ హంసను, దాని అందాన్ని, దాని సౌకుమార్యాన్నిచూచి ఈర్ష్య పడిన కొంగలు ఆ హంసను చుట్టుముట్టి అడిగాయట. "నీ వెవ్వరు నీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉన్నాయేమిటి? హంస చెప్పింది తాను హంసనని. ఎక్కడుంటావని కొంగల ప్రశ్న... చాలా దూరంగా మానస సరోవరంలో ఉంటానని హంస జవాబు. అయితే అక్కడి విశేషాలేంటి... కొంగల ప్రశ్న.. అక్కడ అందమైన కోమలమైన ముత్యాలు మరియు బంగారు పుష్పాలుంటాయని చెప్పింది, హంస. కొంగలకు అది అర్థం కాలేదేమో అందుకే అడిగాయట... మరి అక్కడ నత్తలుంటాయా? అని. అప్పుడు తెల్లబోయిన హంస అవి (నత్తలు) నాకు తెలియదు అన్నదట. దానికి ఆ కొంగలన్నీ హహహా అని నవ్వాయట". చిన్నప్పుడు ఎప్పుడో విన్న చాటువు పద్యం.
పాలకుర్తి రామమూర్త

 జ్ఞానం అంటే ఏమిటి?


 జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే యదార్ధ స్థితిని గ్రహించడానికి మనలోని అంతశ్చేతన జాగృతిని పొందడమే జ్ఞానం. ఇది స్వయం స్పురణ వలన కలిగే ఒక అనుభవం లేదా దర్శనం. దీనినే అపరోక్షానుభవం అంటారు. ఇంద్రియ జ్ఞానం చేత తెలుసుకోబడేది పరోక్షానుభవం కాగా దానికి అతీతమైన ఒకానొక దివ్య భావన హృదయంలో ఆవిష్కృతం కావడం అపరోక్షానుభూతి. తర్కం చేత లేదా చర్చల చేత ఈ అనుభవాన్ని పొందడం దాదాపుగా అసాధ్యం. సమర్ధుడైన గురువు బోధన వల్ల ఆత్మ సమర్పణాభావనతో తెలుసు కోవాలనుకునే శిష్యుని జిజ్ఞాసలో ఆవిష్కృతమౌతుంది ఈ జ్ఞానం.

శ్రద్ధ నిష్ఠ కలిగిన వ్యక్తి యొక్క గ్రహణ శక్తి అపారమై జ్ఞానాన్ని గ్రహించడానికి సన్నద్ధ మౌతుంది. ఇక గురువు పరిణత మనస్కుడై, సాధనా చిత్తుడై వాత్సల్య భావనతో తత్వాన్ని అందించేందుకు సన్నద్ధుడైన వేళ ఆ జ్ఞానం ఒకరి నుండి ఒకరి హృదయాలలో (Presence to Presence) ఆవిష్కృతమౌతుంది. దీనినే మనం "ప్రాణాహుతి" అంటాము.

ఎప్పుడైతే నేర్చుకునే వాని నిష్ఠ అపరిమితమౌతుందో ప్రకృతి ఆ సాధకుని నిష్ఠకు, జిజ్ఞాసకు సరిపోయే జ్ఞానం కలిగిన పరిణత ఆత్మ ద్వారా ఆ విజ్ఞానం సాధకునికి చేరే ఏర్పాటు చేస్తుంది. జ్ఞానం ప్రయాణించాలి అంటే ఒక సాధనం కావాలి కాబట్టి అక్కడ గురువు అనబడే సాధనం కావాల్సి వస్తుంది. అందుకే గురువు వ్యక్తి కాదు అది ఒక మండలం అంటారు.

జిజ్ఞాసువు యొక్క నిష్ఠ అవసరమైన అపరోక్షానుభూతిని లేదా అనుభవాన్ని తనంతట తానుగా సమకూర్చుకునే యత్నంలో గురువు అనే సాధనం ద్వారా ప్రకృతి సాయపడుతుంది

 శ్రీ రమణీయ భావనల సేవధియై చెలువారు సాహితీ

సారము సద్రసజ్ఞ తతి స్వాంతము లందు సుధార్ణవంబులై
బారగ జేయు సాధనము భాషయె; భాషకు తల్లి యైన ఆ
భారతి సాహితీ విబుధ వర్గము నేలుత గూర్చి వాగ్ఝరుల్!

భక్తి వికాసమై బరగు వ్రాతల నాత్మ వికాస దీప్తియున్;
రక్తియు, సాధనా పటిమ, శ్రద్ధయు, శీలము, కార్య దీక్ష, లా
సక్తియు, స్థైర్య ధైర్యములు, జాగృతి, వస్తువులైన చేతనా
సక్త కవిత్వ రూపమగు శారద యేలుత సాహితీ భువిన్!

పాలకుర్తి రామమూర్తి

 

ఓం శ్రీ సరస్వత్యై నమః

 

శ్రీ రాజ రాజేశ్వరీ స్నిగ్ధ తత్త్వంబిలన్

            వ్యక్తమయ్యెను సృష్టి భావమంది

సర్వ జన హృదయ సమ్యక్ స్వభావమై

            వారాహి రూపమై ప్రభవమయ్యె

అమల రాజశ్యామ లాఢ్య తత్త్వంబునై

            ప్రకటిత మూర్తియై రాణగాంచె

ముగురమ్మలకు శక్తి మూలంబు తానయై

            మంత్రార్థ భావమై మహిమ గాంచె

 

జనని యొక్కతే అఖిల విశ్వంబు కైన

సాధకావళి సాధనా స్థాయి నరసి

ప్రకటితంబయ్యె వివిధ రూపంబులందు

అట్టి ఆది శక్తికి భక్తి నంజలింతు!

 

యోగియై యొకచోట భోగియై యొకచోట

            యలరు ననేకత్వమ్మరయ నొకటె

విషమైన సుధయైన భేదంబు చూపని

            అద్వైత భావనా వ్యాప్తి యొకటె

భోగ భాగ్యంబుల భూతి అస్థిర మెన్న

            అక్షయాక్షర మిలన్ త్యాగమొకటె

 అష్ట సిద్ధులనైన ఆసురీ శక్తుల

            నైన సమత జూపు నట్టి దృష్టి

 

 

అమల తపదీప్తి విశ్వ విశ్వాంతరముల

యేకమై నిండ యోగ లింగేశ్వరాఖ్య

వెలసి భక్తుల బ్రోచెడు విశ్వమయుని

ఆది యోగికి ఈశుని కంజలింతు!

 

తత్త్వంబు నారసి దర్శింప పూర్ణమై

            వ్యాప్తమై యొప్పారు ఆదిశక్తి

అమ్మయై అయ్యయై అలరారు  భక్తుల

            భావనా విస్తృతి పరిధి యందు

 పరిమిత దృష్టిలో పరికింప భిన్నమౌ

            దేవతా మూర్తియై దీర్చు కోర్కు

లే రూపు దర్శింప నా రూపుమున్ బొంది

            సంకల్ప మీడేర్చు శక్తి నొసగు

 

నట్టి జగదేక శక్తి నా ఆత్మలోన

కర్త, కర్మయు, క్రియయు నేకత్వ మగుచు

నిలిచి శ్రీయును కైవల్య నిరతిశయము

నొసగి బ్రోచుత సాధనోద్యోగ మందు!

 

 

 

ఆద్యయు విద్యయు నఖిల తత్త్వంబులు

    తానయై క్రీడించు జ్ఞాన మూర్తి

భావంబు శబ్దంబు భాషయు తానయై

    జగతిలో భాసించు సుగతి దాయి

కాలమున్ శాసించు కాల స్వరూపిణి

     కాళుని శాసించు కాళి యనగ

దుష్ట శిక్షణ కన్న దుష్టత్వ శిక్షణ

      పరమోత్త మంబన్న ప్రాజ్ఞురాలు

 

సకల సృష్టికి చేతనా శక్తి యైన

పరమ పావని "పూర్వజా" "పరయు" నైన

అమ్మ, విశ్వ కుటుంబిని నాశ్రయింతు

దివ్య తత్త్వంబు యెదలోన దీప్తి చెంద!               1

 

గుణ భేదములె గాని కులభేదములు లేని

   సత్సంస్కృతీ స్ఫూర్తి సమయ జగతి

మతముల పేరిట మారణ హోమంబు

   లాసురీ భావంబు లలుము కొనగ

లలితవై దుర్గవై లాలించి పాలించి

    సంస్కార రీతుల సారమలది

పరిపూర్ణ మానవత్వమ్ము దివ్యత్వమ్ము

      పల్లవించెడు శీల సంపదను బెంచి

 

స్వార్ధమును వీడి పరులకై పాటుపడెడు

చిత్త పరిణతి నీయవే చిత్స్వరూప

వివృత వాత్సల్య హృదయ ! సంప్రీత చరిత!

స్నిగ్ధ చైతన్య మూర్తి! సుశ్రేయ దయిత!                2

 

అరుణారుణ ద్యుతీ భరితమౌ గగనాన

   ప్రాభాత రుచిర సంప్రసవ శోభ

వృక్షాగ్రముల జేరి పక్షి సంతతి సల్పు

    కిల కిలారావ సంగీత రుచులు

లలిమీర గిరిబాల తలజారు జలపాత

     రమణీయ నటనా విలాస దీప్తి

ఆర్ఘ్య ధారల దాకి అర్క మయూఖాళి

     ప్రకటిత ప్రకట శంపా విభూతి

 

కెరలు కెరటాలు సలుపు సంక్రీడ సరణి

సాంధ్య కాంతుల రసమయోత్సాహ భరిత

ప్రకృతి సోయగ మందు నీ ప్రాభవమ్మె

గనగ నయ్యెడు: తల్లిరో గనవె దయను!                     3

ప్రత్యూష కిరణాలు లాలించ పద్మమ్ము

     ఫుల్ల శోభల నంది పల్లవించు

హరివిల్లు దలదాల్చి అతిశయించును నింగి

     తొలకరించగ నేల పులకరించు

ఘన పయోధుల దాటి గగన వీధుల దాటి

     విహరించు పక్షి తా విరియ బాఱు

పరవళ్లు ద్రొక్కుచు ప్రవహించు నది తాను

      వార్ధి సంస్పర్శచే పరవశించు

 

అడవి పూవుల పరిమళం బలుము కొనగ

నర్తనము చేయు వృక్షాళి నవ్య గతుల

అట్టి ప్రకృతి సౌందర్య సోయగ విభూతి

కెయ్య దాధార మా తల్లి నెద దలంతు!               4

 

మంగళ దాయియై మంగళమ్ములు గూర్చు

   శోభనంబుల నిచ్చు సుభగ మూర్తి

వాగ్వైభవములిచ్చి వరణీయులను జేయు

     అతిశయింపగ జేయు నక్షరముల

జన్మ మూల మెఱుంగు జ్ఞాన దీప్తి నొసంగు

      రసమయ భావ సామ్రాజ్య మిచ్చు

 

ఐహికమ్ముల నిచ్చు నాముష్మికము లిచ్చు

      వేద వేదాంగాది విద్య లిచ్చు

 

ప్రజ్ఞ జాగృతి గనెడు సౌభాగ్య మిచ్చు

ధిషణ సన్మార్గమున సాగు స్థిరత నిచ్చు

భోగ భాగ్యమ్ము లిచ్చును  మోక్షమిచ్చు

అమ్మ లలితాంబ నెదనిల్పి అర్చ సేయ!             5

 

మెరుగు తీగల బోలు మేని కాంతిని బూని

    ఆశ్రయ శక్తియై అలరు మూర్తి

శరదిందు రుచిరమౌ దరహాస విలసిత

     వదనాంబుజంబుతో వఱలు మూర్తి

అష్ట హస్తాలతో అష్ట దిక్కుల యందు

     తనరారు విశ్వ చైతన్య మూర్తి

సంకల్ప శక్తియు జ్ఞాన శక్తియు క్రియా

     శక్తియు తానయౌ సత్వ మూర్తి

 

సింహ వాహనాసీనయై చెలులు గొలువ

భద్ర సౌభాగ్య దాయియై భవ్య గతుల

జగము లేలు జనని సుప్రసన్న మూర్తి

ప్రజల కష్టముల్ బాపి కాపాడు గాక!               6

శివకరీ శుభకరీ స్నిగ్ధ విద్యాధరీ

    ప్రణవార్ధ రూపిణీ భద్ర మూర్తి

సకలాగమ జ్ఞాన సంవిత్స్వరూపిణీ

     జ్ఞాన ప్రకాశినీ జ్ఞాన దాయి

ప్రేయస్కరీ భవ్య శ్రేయస్కరీ దివ్య

     విభవ ప్రదాయినీ వేదమాత

షట్చక్ర సంచారి చైతన్య రూపిణీ

    అష్ట సిద్ధుల నేలు ఆదిశక్తి

 

పంచ కోశాంతరస్థితా పరమ పూజ్య

త్రిపుర వాసిని కళ్యాణి త్రిపుర హంత్రి

పంచ కృత్య పరాయణా వందనమ్ము

శాశ్వతానంద రూపిణీ శరణు, శరణు!             7

ఏదేవి నిరుపాధి, ఏదేవి నిర్గుణ

    బ్రహ్మంబు యేదేవి పరయు నపర

యేదేవి క్రీడార్థ మీ జగత్సర్వంబు

   సృజియింప బడియె విశిష్ఠ గతుల

యేదేవి శుభదృష్టి నించుక గనినంత

    సృష్టి సమస్తంబు స్థితిని బొందు

యేదేవి క్రీగంట యిసుమంత గాంచిన

    లయమౌను సృష్టి విలాస మెల్ల

అమిత సౌందర్య లహరియై వ్యాప్తమైన

శివము యేదేవి విభవమై చెన్ను మెరయు

నట్టి కాత్యాయనీ దేవి కంజలింతు

నభయ దాయియై జగముల నాదరింప!         8

ఏతల్లి చిద్రూప యేతల్లి చిన్మయి

   యేతల్లిని స్మరింపఁ నిహము పరము

యేతల్లి చిచ్ఛక్తి యేతల్లి ఆత్మ వి

    ద్యకు మూల మేతల్లి అగ్రగణ్య

యేతల్లి అవ్యక్త మేతల్లి వ్యక్తంబు

     యేతల్లి కనుదోయి నినుడు శశియు

యేతల్లి గాయత్రి యేతల్లి గుణనిధి

     యేతల్లి సర్వమయీ భవాని

 

అట్టి సాక్షర రూపయౌ ఆదిశక్తి

ముగ్గురమ్మల జనయిత్రి మూల ప్రకృతి

సర్వ లోక వశంకరి చారు హాస

యైన లలితాంబ నర్చింతు నహరహమ్ము!             9

 

కాలమే బ్రహ్మంబు కాలమే విఘ్నమ్ము

     కాలమే ప్రణవమౌ కల్పమదియ

కాలమే సత్యమ్ము కాలమే నిత్యమ్ము

     కాలమే శూన్యమ్ము కాష్ఠ మదియ

కాలమే జ్ఞాతయున్ కాలమే  జ్ఞేయమ్ము

     కాలమే జ్ఞాన మజ్ఞాన మదియ

కాలమే బిందువౌ కాలమే పూర్ణమౌ

    కాలమే తత్వ మక్షరము నదియ

 

కాలమే అంధకారమ్ము కాంతి యదియ

కాలమే కాళ రాత్రియు కాళి యదియ

కాలమె అఖండ విశ్వ వికాస శక్తి

అట్టి కాలమ్ము యిడుత శ్రేయస్సు ప్రజకు!           10

సత్య స్వరూపమై సర్వ సంవ్యాప్తమై

     అద్వితీయం బైన ఆదిశక్తి

తేజోమయంబైన స్త్రీ పూరుషాకృతుల్

      నిజ విలాసార్ధమై నియతి నంది

దివ్యత్వ భావనల్ దీపింప సముదాత్త

      పంచ కృత్యమ్ముల వరుస సలుప

అయ్యదే సృష్టియై వ్యాపించ దిక్కుల

     విశ్వ విశ్వాంతరాల్ వెలుగు చూచె

 

ముగ్గురమ్మలు నయ్యలు భువన తతియు

సకలమున నాత్మ రూపమై శక్తి నిండె

అట్టి శక్తియె చిచ్ఛక్తి అప్రమేయ

భద్ర మూర్తియై మనల కాపాడుగాక!              11

 

క్షేత్రమ్మొ తీర్థమ్మొ గిరులొక్కొ తరులొక్కొ

    భూతసంచయమొకో భువియొ దివియొ

నీ స్థాన మెయ్యదో నీ రూప మెయ్యదో

     యే స్వభావమొ నీది యెచటొ యునికి

వెతికితి తమములో వెతికితి వెలుగులో

     విశ్వ మంతట నిన్ను వెదికి, గనక;

ఆరాటమును బొంది ఆవేదనను చెంది

      దారి తెన్నును గాంచ తరము గాక.       

 

ఆశ్రయించితి "గురువు"; నా అలఘు మూర్తి

పలికె... సర్వేశు వెదుక నీ బాహ్య జగతి

కాదు; వెదుకుము అంతరంగమ్ము నందు..

"ఎఱుక" నద్దాన గలిగె నా హృదయ సీమ!           12

పరిమితుల్ లేనట్టి పరిపూర్ణ తత్త్వమ్ము

    అప్రమేయంబు నవ్యక్త మదియ

అదె సచ్చిదానంద మదె అద్వితీయమ్ము

    పరమేష్టి యయ్యదే పరమశక్తి

మహదహంకారమ్ము మట్టియు జలమును

     అగ్నియు గాలియు నాకసమ్ము

నగుచు వ్యక్తంబయ్యె నయ్యదే దృశ్యమౌ

     ప్రకృతి బ్రహ్మాండమై పరిఢవిల్లె

 

అపరిమితము నవ్యక్తమౌ నాది శక్తి

పరిమితము నంది వ్యక్తమౌ వలను పుటుక

పరిమిత మపరిమితము నవ్యక్త మగుట

మరణ, మయ్యదే సంక్రీడ మాత నీకు!             13

 

ఉద్వేగమును బెంచు ఉద్యోగ చదువులు

   విద్యా విభూతిని వెలితి చేయ

అర్థమ్ముపై మోహ మధికార కాంక్షయు

   యశము కామములందు నారటమ్ము

బ్రతుకుపై నాపేక్ష రాగమ్ము ద్వేషమ్ము

    ఔద్ధత్య మోర్వమి నతిశయమ్ము

అహరహమ్మెదలోన అగ్గియై జ్వలియింప

    బాధామయమ్మునై బ్రతుకు సాగె

 

అట్టి చింతనా ఛాయల నాశ్రయించి

అలఘు జీవన సౌందర్య మానలేక

అలమటించెడు నాదు దైన్యమ్ము మాన్చి

పథము చూపవే తల్లి! భవాని శరణు!              14

ఉద్వేగ రహితమై యొప్పారు భాషణ

   సత్య ప్రియత్వమ్ము శాస్త్ర చర్చ

వాజ్మయ తపమును పలుకులో హితమును

   నిరతాధ్యయన కాంక్ష నియమ నిష్ఠ

సౌమ్య వర్తనమ్ము శ్రధ్ధయు గురుభక్తి

    మనసు నియంత్రణ మౌన దీక్ష

సంతోష సంతాప సంస్కార వృత్తుల

    నధిగమించెడు స్థితి నందు బుద్ధి

 

ఆత్మ సహచరత్వమ్ము విద్యా విభూతి

ధార ధారణ స్ఫురణయు ధ్యాన ధైర్య

గతుల నిలుపంగ మది నేక కాలమందు

తగిన సామర్ధ్య మీయవే తల్లి నతులు!             15

 

వ్యావహారిక సత్య వాదంబులే గాని

    పారమార్థిక సత్య ఫణితి లేదు

సమతయు మమతయు సద్భావనలు పల్కు

   సరణియే గాని ఆచరణ లేదు

అర్ధ నారీశ్వరు లాదర్శమే గాని

   వారితో నడచు దంపతులు లేరు

పలు ధర్మ పన్నముల్ ప్రవచించుటే గాని

  ధర్మాధ్వ గమన తత్పరత లేదు.                  

 

వలయు చర్చలు, మతభేదములను బాప

ననుటయే గాని; విడరు వాదనల నెపుడు

చూడ నేటికి త్రికరణ శుద్ధి లేని

బ్రతుకు నిచ్చితి వజ్ఞాన భావ మమర!              16

ప్రకటితంబయ్యె నీ పరిపూర్ణ తత్త్వమ్మె

   భవ్య ప్రపంచమై భద్ర గతుల

ప్రసవితంబయ్యె నీ ద్వంద్వ ప్రవృత్తులు

   మాయాంధకారాన మ్రగ్గ జనులు

త్రిగుణాళి క్రమ్మగా త్రిపురాళి చెర జిక్కి

   జనన మరణ చక్ర సంచయముల

తమ మూల మెయ్యదో తామెఱుంగగ లేక

    అపమార్గ గాములై అలమటించు

 

ప్రజల దయ నేలు టదె నీకు ప్రాభవమ్ము

కాక, భయ తాప గతుల సంఘర్షణముల

బ్రతుకు లీడ్చెడి జీవుల భ్రమలు బెంచి

తగునె ఆనంద మొందుట, తల్లి నీకు!             17

 

బ్రహ్మాండ భాండ సంవ్యాప్తమౌ చిచ్చక్తి

   చేతనాచేతన జీవ తతుల

ప్రాణశక్తి యగుచు రాజిల్ల పూర్ణమై

   భువన భాండమ్ములు అవతరించె

ఆర్ద్రమై జ్వలితమై అల చంద్ర తత్వమ్ము

    అగ్ని తత్వమ్ములు అమరె జగతి

ఆర్ద్ర జ్వలన తత్వ మంబువుల్ తేజస్సు

    లీ రెంటి కలయికే సృష్టి రచన

 

“అదితి” యనగ నఖండమై అఖిల జగతి

యందు వ్యాప్తమౌ తేజస్సు అదియ సుప్ర

కాశ మయ్యదే తొలగించు కర్మ ఫలము

అట్టి అదితికి భక్తి మున్నంజలింతు!            18

 

లలితాంబ తత్వమ్ము లాలించి పాలింప

   గ్రహతారకాదుల గతులు నిలిచె

శ్రీ సరస్వతి తత్వ చిద్విలాసంబున

   విభవంబు చూపె నవిద్య విద్య

శ్రీ లక్ష్మి తత్త్వ సుశ్రీ విభవ ద్యుతిన్

   సిరులు నైశ్వర్యముల్ స్థితిని గాంచె

శ్రీ పార్వతీ దేవి స్నిగ్ధ తత్వమ్మున

   సౌశీల్య విభవంపు సత్వ మమరె

 

రాజ రాజేశ్వరీ తత్త్వ రమ్య దీప్తి

నిత్య సౌభాగ్య సంపదల్ నియత మయ్యె

దుర్గ తత్వమ్ము రక్షణోద్యోగ మిచ్చె

నట్టి ఆది శక్తికి భక్తి నంజలింతు!         19

 

మంత్రమ్ము లెఱుఁగను తంత్రంబు లెఱుఁగను

   స్తుతి చేసి మెప్పించు మతియు లేదు

ఆహ్వానమును చేయు నట్టి విధ మెఱుఁగ

    నిన్నుపాసన చేయు నియమ మెఱుఁగ

ఎఱుఁగను ధ్యానమ్ము లెఱుఁగను ముద్రలు

    బాధల నెఱిగించు పథ మెఱుంగ

ఎటుల పూజించుటో ఎటుల ప్రార్థించుటో

     ఎటుల నిన్నరయుటో యెఱుగ నేను

 

అయిన తెలిసిన దొక్కటే అమ్మ నాకు

నిన్ననుసరించి నడచిన, నీవె నాదు

దురితముల బాపి పోగొట్టి దుఃఖ వితతి

భవ్య పథమిత్తు నను సత్య వాక్కు; శరణు!                  20

 

పాలకుర్తి రామమూర్తి

 

 

 

 

 

 

 

 

ఆర్యా..

నా పేరు పాలకుర్తి రామమూర్తి

ఉండేది.. భువనగిరిలో.

 

          సింగరేణి కాలరీస్ కంపెనీలో, బెల్లంపల్లి, ఏరియాలో ఆర్థిక మరియు గణాంక శాఖలో Dy. Supt. గా ఉద్యోగించినది.

          తెలుగు సాహిత్యాన్ని, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదవడం, వ్యక్తిత్వ నిర్మాణ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ప్రవృత్తి.  ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక యాజమాన్య నిర్వహణ నేపథ్యంలో వ్యాఖ్యానించడం అత్యంత ఇష్టమైన అంశం.  ఇప్పటి వరకు 21 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. అందులో పద్య కవిత్వానికి సంబంధించినవి 6 పుస్తకాలు. యాజమాన్య నిర్వహణ ఆధారితంగా 10 పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

          వివిధ విద్యాలయాలలో 10 వ తరగతి నుండి పి.జి. వరకు 300 పైగా వ్యక్తిత్వ నిర్మాణం, ప్రాచీన సాహిత్యం నేపధ్యంలో ఆధునిక  యాజమాన్య నిర్వహణ, మానవ విలువలు, వృత్తిలో నైతికత అనే అంశాలపై ప్రసంగించాను. వివిధ తెలుగు పత్రికలలో ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

          ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి సౌజన్యంతో పద్యాలయంలో నా భావాలను పంచుకోవడం, పెద్దలు ఎందరో వ్రాసిన పద్య సాహిత్యాన్ని ఆధ్యయనం చేయడం ఆనందంగా ఉన్నది. ఆచార్య భూమయ్య గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సులు.

          కృతజ్ఞతా నమస్సులతో...

పాలకుర్తి రామమూర్తి

ఇం.నెం. 5-6-25

టీచర్స్ కాలనీ, భువన గిరి; 508116

యాదాద్రి భువనగిరి జిల్లా