Tuesday, July 30, 2019

విజ్ఞులూ ఆలోచించండి.....


నిన్న టివి 5 లో "బాపనోడు" అనేపాటపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. శ్రీయుతులు మరుమాముల వేంకటరమణ, కదిరి కృష్ణ, సుదర్శన్ మరియు ఆ పాట వ్రాసిన రాజేశ్, ద్రోణంరాజు రవి గారలు ఆ చర్చాకార్యక్రమంలో పాల్గొనడం చూచాము.  ఆ చర్చలో విషయంపై చర్చించాలనే భావన కన్నా అందరిలో ప్రస్ఫుటంగా కనిపించింది ఒక సమాజంపై లేదా ఒక కులంపై "అసహనం" మాత్రమే.

ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారని పదే పదే వక్తలు ఉటంకించడం జరిగింది. అంతా చదువుకున్న వారు. ముఖం నుండి మనుషులు ఎలా పుడతారనే శాస్త్రీయ ఆలోచన ఉండవద్దా.

మనువు ఈ దేశంలో మొట్టమొదటి పాలకుడు. తన పాలనా ప్రయోజనాల కనుగుణంగా ఆ నాడు జీవించిన ప్రజలను 4 వర్ణాలుగా విభజించాడు. అక్కడ నాస్తి పంచమః అన్న సూక్తిని ఎలా మరచిపోతారు. మను ధర్మశాస్త్రంలో ఎక్కడా కులాల ప్రసక్తిని చూడము.... మనువుచే లేదా దేమునిచే కులాలు సృష్టింపబడ లేదు. చేస్తున్న వృత్తిని బట్టి ఆ యా ప్రజలను అలా విభజించడం జరిగింది అనే జ్ఞానాన్ని విస్మరించడం, అసహనాన్ని ప్రదర్శించడం ఏ మేరకు సమాజానికి ఉపయుక్తమో విజ్ఞులు ఆలోచించాలి.
విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే సమగ్రంగా ఆ విషయాన్ని అధ్యయనం చేయాలి. అందులో కూడా Empathic గా చదవడం చాలా ముఖ్యం. అక్షరాలను బట్టి కాదు అందులోని భావాన్ని పట్టుకునే ప్రయత్నం జరగాలి. Not the letter of the LAW but the spirit of the LAW కావాలి. మనకు కావలసినంత మేరకే తీసుకొని ఎవరో చెప్పిన భావాన్ని (మూలం చదవకుండా) చర్చలలో అసహనంగా మాట్లాడడం సమంజసమూ కాదు.
మనుస్మృతి పిమ్మట ఎన్నో స్మృతులు గతించి ఈ నాడు ఆపస్తంబ సూత్రం నడుస్తుంది. చర్చిస్తే దానిని ఉటంకించాలి కాని మనువును ఉటంకించడం ఎలా సమంజసం.

సమాజమనే విరాట్ స్వరూపానికి బ్రాహ్మణులు ముఖంలాంటి వారు. తత్త్వాన్ని తెలుసుకునే వాడు, మూలాలను అన్వేషించే వాడు, అధ్యయన అధ్యాపనలలో నిమగ్నమైన వాడు బ్ర్రాహ్మణుడు. సమాజానికి రక్షణ కల్పించేవాడు క్షత్రియుడయ్యాడు. వ్యాపారాదులు, వ్యవసాయాదులు నిర్వహించే వారు వైశ్యులు అయ్యారు. ఈ పనులలో ప్రావీణ్యం లేని వారు తమ జీవనోపాథికి వివిధ వృత్తులను ఎన్నుకున్నారు. వారిని శూద్రులు అని సంబోధించారు. వీటికి పైన ఎవరినీ మనువు చెప్పలేదు. ఈ విభాగం సమాజ నిర్వహణ కోసం మాత్రమే అనేది ఎన్నో మార్లు ఎందరో చెప్పారు. కాని రెచ్చగొట్టి తమ ఆధిక్యతను చాటుకోవాలన్న కొద్దిమంది అహంభావం సమాజాన్ని ఇన్ని కులాలుగా విభజించే ప్రయత్నం చేస్తుంది. ఆంగ్లేయుల "విభజించి పాలించు" అనే రాజనీతి, ఈ నాటి ఓటు రాజకీయంలో పబ్బంగడుపుకునే రాజకీయ నేతల ప్రవృత్తి వెరసి ఈ కులాల కుంపటి నిరంతరం జ్వలిస్తూనే ఉంది.... ప్రజల మధ్య వైరుధ్యం పెంచుతూనే ఉన్నది. ముఖ్యంగా చదువుకున్న "సాక్షర" జాతి ఆ ఆలోచనలకు మరింత ఆజ్యం పోస్తూ సజీవంగా ఉంచుతున్నది.

ఆర్యులు వలస వచ్చారనే వాదం.... పురాణాలల్లో ఎక్కడా కనిపించదు. డా. అంబేడ్కర్ గారు కూడా తన "Who are shudraas' అనే పుస్తకంలో ఆ విషయాన్ని చర్చించి ఆ వాదన తప్పనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఆనాటి సమాజంలో ఆర్య శబ్దం గుణవాచకమే కాని జాతివాచకం కాదని ఆయన సప్రమాణంగా నిరూపించారు.
ప్రతి సమాజంలో మంచి ఉంటుంది చెడూ ఉంటుంది. వి.డి. మహాజన్ తన "Ancient India"అనే పుస్తకంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా మారిన వైనాన్ని చర్చించాడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుస్తక రూపంలో లేక ముఖతః మాత్రమే ప్రచారమైన విజ్ఞానం కొంత ప్రక్షిప్తమూ కావచ్చు, కొంత ఉపయోగంలో లేకపోవచ్చు. ఆచారవ్యవహారాదుల పేరుతో మూర్ఖత్వాన్ని ఆదరించవచ్చు.
ఒకనాటి సమాజంలో ఈ నాడు మనం దళితులుగా పిలవబడుతున్న "కులాలు" వివక్షకు గురయ్యాయన్నది కాదనలేని సత్యం. ఆవేశపరులూ ఆలోచనాపరులు అన్ని కాలాలలోనూ ఉంటారు. ఆవేశంతో విద్వేషం మరింతగా పెరుగుతుందే కాని చల్లారదు. శాంతి సహజీవనం కావాలి అంటే ఆలోచన కావాలి, సంయమనత కావాలి.
చాలా కొద్ది శాతం మాత్రమే ఉన్న బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకోవడం వల్ల లేదా ఒక కులాన్ని దూషించడం వల్ల సాధించే ప్రయోజనం శూన్యం అనేది విస్మరించకూడదు. ఆ టి.వి. వారి రేటింగ్ పెరగడమూ, మరింత మందిలో ఆ కులగజ్జి విస్తృతమవడమూ తప్ప అలాంటి చర్చల వల్ల ప్రయోజనమూ శూన్యమే.
అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆవేశపడడం జరగవచ్చు. అది తప్పని కాదు కాని ఆవేశాన్ని కొంత మేరకు తగ్గించుకొని శాస్త్రీయాంశాలు ప్రతిపాదిస్తే చూచే వారికి ఆలోచనను రేకెత్తించిన వారమవుతాము.
వ్యాపారం చేసేవారు ప్రతి దాన్నీ ఆ కోణం లోనే చూస్తారు. ప్రతి అంశాన్ని Market చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది కుహనామేధావుల ఆలోచనా సరళి సమాజాన్ని కుక్కలు చింపిన విస్తరి కానీయ వద్దన్నదే నా అభిప్రాయం.

ఎలాంటి భాషవల్ల సమాజం భ్రష్టుపడుతుందో, ఎలాంటి భాష వల్ల అందరం కలసి ఉండవచ్చో, ఆలోచించి రచయితలు, కవులు ఆ నిబద్ధత పాటిస్తే సమాజంలో శాంతి నిలుస్తుంది. కాకపోతే ప్రక్క వాణ్ణి అనుమానిస్తూ బ్రతికే దౌర్భాగ్యం దాపురిస్తుంది. ఈ నిబద్ధత పాటించడానికి చట్టాలూ అవసరం లేదు.

మరొక్క విషయంతో ముగిస్తాను. ఈ నాడు యువతలో కుల మత భేద భావనలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం కులాంతర, మతాంతర  వివాహాలు బ్రాహ్మలలోనే ఎక్కువగా జరుగుతున్నాయట. విజ్ఞులు ఆలోచించండి.....
పాలకుర్తి రామమూర్తి