కైక వరం కోరడంతో ఏర్పడిన పరిస్థితులు –
ఆ నేపథ్యంలో రాముని స్పందన
శ్రీ రామ పట్టాభిషేకం నిర్ణయింపబడింది. తదనుగుణమైన ఏర్పాట్లు సాగిపోయాయి. కాలోచిత మర్యాదలను నిర్వహించి రాముడు, కైకేయీ సహితుడై ఉన్న తన తండ్రి దశరథుడిని సమ్ముఖానికి వచ్చాడు. అక్కడ విషణ్ణవదనుడై దుఃఖిస్తున్న తండ్రిని చూచి కైకేయిని కారణ మడిగాడు. అప్పుడు ఆమె రామునితో ఇలా అంటుంది....
రామా! గతంలో నీ తండ్రి ప్రతిజ్ఞాపూర్వకముగా నాకొక మాట ఇచ్చి, ఇప్పుడా మాటను తప్పే మార్గాన్ని అన్వేషిస్తున్నాడు. అది నీవు మాత్రమే నెరవేర్చ గలవు. సత్య పాలన మీ వంశానికి ఆలంబన కదా. మీ తండ్రి ఇప్పుడా సత్య పథాన్ని తప్పి చరించడం ధర్మమా? ఈ రాజ్యపాలకుడు ధర్మాధ్వగామియై చరించేందుకు నీవే బోధించాలి, సహకరించాలి. నీ తండ్రి, మన పాలకుడు నైన దశరథుని మనోగతాన్ని, అది నీకు సమ్మతమైనా అసమ్మతమైనా నీవు తప్పక ఆచరిస్తానని మాటయిస్తే, ఆయన శోకానికి కారణం ఏమిటో చెపుతాను, అంటుంది, కైకేయి.
(ఇది కైకేయి సంభాషణలోని చతురత. ముందు కాళ్ళకు బంధం వేసి తన మాట నెగ్గించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రయత్నం. దశరథుడు ఎలాగూ చెప్పే మానసిక స్థితిలో లేడు. రామునికి ఆ రాజ్యంలో ఉన్న ప్రజాదరణ తనకు తెలుసు. భరతుని పట్టాభిషేకం నిర్విఘ్నంగా జరగాలి అంటే రాముడు స్వచ్ఛందంగా అడవులకు వెళ్ళాలి. అందుకే ఈ బిగింపు వేస్తుంది కైక. మాట తప్పని రాముడి నైజం తనకు తెలుసు కాబట్టి ముందే మాట తీసుకుంటుంది)
రాముని వద్ద ఆ మేరకు ప్రమాణం చేయించుకొని, కైకేయి; దేవాసుర సంగ్రామంలో దశరథుడు దేవతల పక్షాన యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో మూర్ఛిల్లడం, ఆ సమయంలో కైకేయి అతనిని రక్షించడం, దానితో సంతసించిన దశరథుడు ఆమెకు రెండు వరాలను ఇస్తానని వాగ్దానం చేయడం, ఆ వాగ్దానాని కనుగుణంగా ఆమె ఇప్పుడు ఆ వరాలను ప్రస్తావించి, మొదటగా రాముడు పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని, రెండవదిగా తన కుమారుడు భరతుడు అయోధ్యా పట్టణానికి ప్రభువుగా అభిషిక్తుడు కావాలని కోరడం, దానితో వ్యథ చెందిన రాజు, ఒకవైపు రామ వియోగాన్ని భరించలేక అలాగని ఇచ్చిన మాటను తప్పలేక, సందిగ్ధంలో కొట్టు మిట్టాడుతూ ఉన్న వైనాన్ని తెలుపుతుంది.
దానికి రాముడు, అమ్మా! నీ కోరిక తప్పక నెరవేరుస్తానని మాట యిచ్చి, తన తల్లికి తన వనవాసాన్ని నివేదించి ఆమె అనుమతి పొంది వస్తానని చెప్పి, కైక అనుమతితో, కౌసల్యా మందిరానికి వెళ్ళి, కౌసల్యకు ఆ విషయాన్ని విన్నవిస్తాడు. సహజంగానే తల్లి కనుక ఆమె బేలగా దుఃఖపడడం జరుగుతుంది. ఆ సందర్భంగా లక్ష్మణుడు.... కౌసల్యను ఓదార్చుతూ తన మనస్సును ఈ విధంగా ఆవిష్కరిస్తాడు.
1) కుటిలాత్మురాలైన ఒక స్త్రీ మూలంగా ధర్మ వర్తియైన రాముడు అడవులకు వెళ్ళడం సమంజసం కాదు
2) మాట యిచ్చిన తండ్రి విషయాసక్తుడు, కామ వికారాలకు లోనైన వాడు మరియు మతి చలించిన వృద్ధుడు. కామ మోహితుడైన దశరథుడు కైక ప్రేరణచే ఈ వరాల నెపంగా రాముని అడవులకు పంపడం అసమంజసం, అసంబద్ధం.
3) పెద్దవాడైన రామునికి రాజ్యార్హతను కాదని భరతునికి రాజ్యాన్ని కట్టబెట్టడం అన్యాయం. మన రాజు, అస్థిమితమైన బుద్ధియుతుడై, యుక్తాయుక్త వివేచనను విస్మరించి, దుర్బోధల వల్ల ప్రభావితుడైన వాడు కాబట్టి ఆ నిర్ణయం చెల్లదు. దానిని పాలించ వలసిన అవసరం రామునికి లేదు.
4) తల్లిదండ్రుల పట్లగాని, రాజ్య ప్రజల పట్లగాని ఏ విధమైన అపరాధం కాని, రాజ ద్రోహం కాని చేయని ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఒక నాగరికుని, అందునా కన్న కుమారుని, కారణం లేకుండా అడవికి పంపడం అధర్మం
5) ధర్మ బుద్ధి కలవాడిని, పరోక్షంలో కూడా ఎవ్వరూ తనను పల్లెత్తు అసంగతమైన మాటను అనని వానిని దండించిన రాజు అధర్మపరుడు కాబట్టి ఆ అధర్మ వర్తియైన పాలకుని ఆజ్ఞను పాలించాల్సిన అవసరం లేదు
అంటూ ఇంకా ఆవేషపూరితుడైన లక్ష్మణుడు, రామునితో ఇలా అంటాడు. ఓ రామా!
1) ఈ విషయం నగరంలో ఎవరికీ తెలియక ముందే.... రాజ్యాధికారాన్ని చేజిక్కించుకో. అందుకు నేను సహాయపడతాను
2) యుద్ధ సన్నాహివై నీవు, నీకు సహాయంగా నేను నిలిస్తే మనల్ని జయించగలిగిన వారెవ్వరూ లేరు
3) అవసరమైతే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యం చేద్దాం
4) భరతుని పక్షంలో నిలిచే వారందరినీ వధిద్దాము
5) కైక మాటలకు వత్తాసు పలికే మన తండ్రిపై మమకారాన్ని విడిచి పెడదాము. యుక్తాయుక్త విచక్షణా రహితుడై అధర్మ మార్గంలో పయనించే వాడు ఎంతటి వాడైనా వానిని శాసించాలని ధర్మం బోధిస్తున్నది. అతను గురువైనా తండ్రియైనా అతనిని బంధిద్దాము లేదా అవసరమైతే సంహరిద్దాము.
6) పరాక్రమ హీనుడు మాత్రమే దైవముపై ఆధారపడి క్రియా శూన్యుడై బ్రతుకుతాడు. స్వశక్తిపై ఆధారపడిన వాడు అవరోధాలను అధిగమించి (అవి దైవికమైనా) లక్ష్యాన్ని చేరే మార్గాన్ని అన్వేషిస్తాడు, సాధిస్తాడు, జీవిస్తాడు.
7) అంతెందుకు, భరతునికి రాజ్యం కట్టబెట్టాలనే దుస్సంకల్పంతో ఉన్న కైక మోహంలో మన తండ్రి కూడా అధర్మ వాదియై నీపై కుట్ర పన్ని ఉండవచ్చు. ఆ కుట్రను భగ్నం చేయడం మన హక్కును కాపాడుకోవడం క్షాత్ర ధర్మం కాదా?
ఇలా అనేక విధాల ఆవేషపడే లక్ష్మణుడిని ఓదార్చుతూ, రాముడంటాడూ.... మంచి మనసుతో మనమొక కార్యాన్ని సంకల్పిస్తాము. విధి వశాత్తు అనుకోని పరిస్థితుల వల్ల దాని నిర్వహణలో అవాంతరం వస్తే దానికి కారణం మన తప్పిదం కాదు, అది విధి వ్రాత. ఆ వ్రాతను తప్పింపలేమనీ, పితృ వాక్య పరిపాలన ఔన్నత్యం సమున్నతమైనదనీ చెపుతూ, శాంతపరుస్తాడు రాముడు.
ఈ సన్నివేషాన్ని మన జీవితాలకు అన్వయించుకొని విశ్లేషణ చేసుకుంటే....
1) మనలో చాలా మందిమి లక్ష్మణుడి లాగానే ఆలోచిస్తాము.
2) ప్రతి సంఘటనకు అనుక్రియ ఉంటుంది అలాగే ప్రతిక్రియా ఉంటుంది.
3) ఇక్కడ లక్ష్మణుడి ఆలోచన ఆవేషపూరితంగా ఉండడం వల్ల "ప్రతిక్రియ" కై ఆలోచించాడు
4) రాముడు ధర్మ పథాన్ని ఆశ్రయించి యుండడంతో నిర్మల మనస్సుతో ధర్మ బద్ధంగా చేయవలసిన "అనుక్రియ"ను ఆలోచించాడు. ధర్మ చింతన వల్ల సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.
5) ధర్మాధర్మ విచక్షణ లేక నా ఆలోచనయే న్యాయం, అదే ధర్మం అన్న ఆవేషభరతమైన నిర్ణయాలు అంతర్గత కలహాలకు నాంది పలికితే, రక్తపాతం జరగడమే కాక, రాజ్య ప్రజల శాంతికి విఘాతం ఏర్పడుతుంది. సమాజంలో సంక్లిష్టత చోటుచేసుకుంటుంది.
6) నాయకుడు అధర్మ మార్గంలో నడిస్తే అది ఆచారమై ప్రజల చేత ఆచరింపబడుతుంది. అది అనాదరణీయం.
7) శక్తి కలిగి యుండడం కన్నా ఆ శక్తిని ఎప్పుడు ఎలా ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలియడం వల్ల ప్రయోజనం ఉండడమే కాదు, ఆ విజ్ఞత ప్రజా పాలనలో శాంతిని అందిస్తుంది.
8) ఏ పరిస్థితులలో కూడా ధార్మిక చింతనకు దూరం కాని మానసిక స్థితిని పొందిన వాడు కాబట్టే రాముడు ఆనాటి నుండి ఆదరణీయు డయ్యాడు. ఆయన మార్గం అనుసరణీయ మైంది.
9) నిత్య జీవితంలో మనకు కైక పాత్రలు, దశరథుని పాత్రలు, లక్ష్మణుడి పాత్రలూ అనేకం ఎదురవుతూనే ఉంటాయి. అంతేకాదు, మన ప్రయత్నాలలో అవరోధాలూ సహజంగానే కలుగుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొంటామో అదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.
10) అనుకున్నది అనుకున్న విధంగా జరిగితే ఆనందమే. విజయాన్ని నిర్వహించుకోవడం అందరికీ సాధ్యపడేదే కాని అపజయం ఎదురైతే దానిని ఎలా నిర్వహించుకుంటామనే దానిపై మన పరిణతి ఆధారపడి ఉంటుంది. అదే మనకు శాశ్వత విజయాన్ని, సంతృప్తిని, చరిత్రలో సుస్థిర మైన స్థానాన్ని సంపాదించి పెడుతుంది. దానికి ఉదాహరణయే రాముని పాత్ర.
వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలో ఈ సన్నివేషాన్ని చదివినప్పుడు నాకు కలిగిన భావాలను మీతో పంచుకునే ప్రయత్నం చేసాను. తప్పొప్పులు తెలిపి విజ్ఞులు సహకరించి దీనిని మరింత ఉన్నతంగా మలిచేందుకు సహకరిస్తారని ఆశిస్తూ.... సహృదయులను అభ్యర్ధిస్తున్నాను.
నమస్సులతో…..
పాలకుర్తి రామమూర్తి