Monday, April 1, 2019

ఎన్నికల సంస్కరణలు

ఎన్నికల సంస్కరణలు - మార్పు అవసరం

ప్రాచీన భారత దేశంలో వంశపారంపర్యంగా రాచరిక వ్యవస్థ ఉన్నా, ఆ నాడు ప్రభుత్వం మంత్రులు, ప్రజాప్రతినిధుల సలహాలతో నిర్వహింపబడేది. అవసరమైన సమయాలలో ప్రజలు ప్రభువును ఎన్నుకోవడం కూడా జరిగేది. రాజు యొక్క అధికారానికి పరిధులు ఉండేవి. గ్రామ పెద్దలందరి సమావేశాలను "సభలు" అనేవారు. రాజ్య ప్రజలందరి సమావేశాలను "సమితి"లు అనేవారు. సభలు, సమితుల ద్వారా రాజరికపు అధికారానికి పగ్గాలు వేసేవారు. పాలనలో ప్రజల  కవసరమైన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచడం, అవసరమైన సమయంలో పాలకులను ఎన్నుకోవడం "సమితు"ల ప్రముఖ విధిగా చెప్పబడింది. ఉదాహరణకు దశరథుడు చక్రవర్తియైనా రాముడిని యువరాజును చేసేందుకు సమితిని ఆశ్రయించి దాని అనుమతి పొందవలసి వచ్చింది.
అదే క్రమంలో భారత దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ రూపు దిద్దుకుంది. ఎన్ని మార్పులు వచ్చినా ప్రజాతీర్పుతో పాలన జరగడం అనబడే మౌలిక ప్రజాస్వామ్య స్వరూపం మారలేదు.
ఈనాడు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పబడుతున్న భారత దేశంలో పరిపాలన స్వతంత్ర ప్రతిపత్తులు కలిగిన మూడు వ్యవస్థల ద్వారా సాగుతుంది. అవి పార్లమెంటరీ వ్యవస్థ, బ్యూరోక్రసీ (ఉద్యోగ స్వామ్య) వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు. అందులో మన ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 167 దేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా (Democratic) ప్రభుత్వాలను నడుపుతున్నాయి. అందులో ఎన్ని విధాలయిన ప్రజాస్వామ్య పద్ధతులున్నా అంతిమంగా ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయడం జరుగుతుంది.
“ప్రజలయొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు” ప్రభుత్వం అనేది, నిజానికి ప్రజాస్వామ్యానికి ఇవ్వబడ్డ నిర్వచనం. కాని ప్రజాస్వామ్య వ్యవస్థ సుప్రతిష్టితం కావాలంటే, లక్ష్యించిన విధంగా నడవాలంటే, ఆ దేశ ప్రజలు విద్యావంతులు కావాలి. విద్య అంటే అక్షరాలను నేర్వడం మాత్రమే కాదు. మంచి చెడ్డలను విచక్షణా యుతంగా బేరీజు వేయగలిగిన విజ్ఞత, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, తెగువ, విలువలతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించే వివేచన నివ్వగలిగినదే నిజమైన విద్య. ఆ విద్య ఈ నాడు కొరవడింది. సమాజంలో ఆ విద్య లేని నాడు ప్రజాస్వామ్యం “పశువుల యొక్క, పశువుల చేత, పశువుల కొరకు” అని చెపుతారు.
It is also opined that democracy without education is Hippocracy without limitations
భారత దేశంలో రాజకీయం ఒకప్పుడు ప్రజా సేవకు ప్రభావ వంతమైన సాధనంగా ఉపయోగపడింది. సమాజ శ్రేయస్సు లక్ష్యంగా పనిచేయాలని, విలువల ఆధారితంగా సమాజాన్ని నడపాలని, తమ నైతిక జీవన ప్రవర్తన ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే భావన ఉన్నవారు రాజకీయ నాయకులుగా ప్రజలను చైతన్య వంతులను చేసారు. తమ స్వంత ఆస్తిపాస్తులను సమాజానికి దానం చేసి సమాజ సేవలో తాము ధన్యులుగా చరిత్రలో మిగిలి పోయారు. ఇప్పుడా స్పూర్తి పదవీ కాంక్షగా, ధన సంపాదనకు మార్గంగా మారడం వల్ల ప్రజాస్వామ్య నిర్వచనం మార్చుకోవలసిన ప్రమాదం ఏర్పడింది.
డబ్బు రాజకీయాలను శాసించడం వల్ల, అది వ్యాపారంగా మారి లాభాపేక్ష పెరిగింది. ఎంత పెట్టుబడి పెడుతున్నాము అందులో ఎంత లాభం వస్తుంది.... ఈ అంచనాలే ఈ నాటి రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వార్ధపరులైన నాయకులు తమ సీటును గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా ఓటరును ప్రలోభ పెట్టేందుకు ఇచ్చే ఒక్క నోటు కోసమో, ఒక్క సారా బాటిల్ కోసమో, మరేవైనా నజరానాల కోసమో ఓటును అమ్ముకోవడం అంటే పాలిచ్చే ఆవును కసాయి వాడికి అమ్మినట్లుగా భావించాలి.
భారత దేశంలో 1952 నుండి 1962 వరకు ఎన్నికలు దాదాపుగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే నిర్వహింపబడడం, ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది. తదుపరి కాలంలో ముఖ్యంగా 1967 ఎన్నికల నుండి ఆరంభమయిన ప్రజాస్వామ్య విలువల పతనం ఈ నాటి వరకు దినదిన ప్రవర్ధమాన మౌతున్నది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, స్ఫూర్తికి తూట్లు పడడానికి పూర్వరంగం అనుకుంటే.... పతనావస్థ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఎన్నికలు రాజకీయ అవినీతికి మూలమైన విధానం ఈ నాడు మనం చూస్తున్నాము. దానికి కారణాలు అనేకం.. వాటిలో కొన్నింటిని చర్చించుకుంటే...
1) రాజకీయంలో నైతిక విలువలు లోపించడం, ఎలాగైనా ఎన్నికలందు గెలవాలనే ఒకే ఒక లక్ష్యంతో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రయత్నించడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలవుతున్నది.
2) మత కుల ప్రాతిపదికన వోటర్లను విభజించే ప్రయత్నాలు చేయడం, అవినీతి, నేర ప్రవృత్తి, మతం, కులం ప్రాతిపదికలుగా అభ్యర్ధులను బరిలో దింపడం,  ప్రతిభ ఆధారితంగా కాక అమితమైన డబ్బును వెచ్చించి ఓట్లను కొని సీటును గెలవ గలిగిన అభ్యర్ధులను ఎన్నికలలో నిలపడం ద్వారా ఎన్నికలందు లబ్దిపొందే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.
3) పలు విధాలుగా ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం, ప్రాంతీయ భావనలతో సహా, అవకాశం ఉన్న అన్ని మార్గాలలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, అన్ని రాజకీయ పార్టీలకు సర్వసాధారణమయింది.
4) రాజకీయం అవినీతిమయం కావడం, అవినీతి రాజకీయావతారమెత్తడం వల్ల నల్ల డబ్బుతో ఓట్లను కొనుక్కోవడం, పోలింగ్ బూత్ లను ఆక్రమించుకోవడం, కండబలంతో ఓటర్లను భయభ్రాంతులను చేసి ఎవరికి వారే తమ అభ్యర్ధికి ఓట్లు వేసుకోవడం సాధారణమయింది.
5) అధికారంలో ఉన్న వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుగా ఉపయోగించడం ఎక్కువగా కనిపిస్తుంది
6) స్వతంత్ర అభ్యర్ధులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్ వేసి గందరగోళాన్ని సృష్టించడం, ఒకే పేరుతో ఉన్న వారిని అభ్యర్ధులుగా నిలిపి ఓట్లు చీల్చే ప్రయత్నాలు చేయడం చూస్తున్నాము.
ఇలాంటి పలు కారణాల వల్ల ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పడడం జరుగుతుంది. నెమ్మదిగా ప్రజలను కూడా ఈ అవినీతి ప్రవృత్తికి అలవాటు చేస్తున్నారు. కుతర్కాలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ... తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్న నేతల మనుకునే వారు చేస్తున్న అకృత్యాలు పరమ నీచమైన స్థాయికి చేరాయని అనుకోవడం తప్పు కాదనేది నాభావన.
  నిజానికి ఈ అవినీతి విధానాన్ని గమనిస్తున్న విజ్ఞానులు,  సామాజిక స్పృహకలిగిన వారు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల దుర్మార్గం ప్రభావవంతంగా తన పని తాను చేసుకు పోతున్నది. చెడ్డ వారు చేసే చెడుకన్నా మంచి వారి ఉదాసీనత బహుళ ప్రమాదకరం. ఎప్పుడైతే ఎన్నికలు ఒక Free and Fair వాతావరణంలో నిర్వహింప బడతాయో అప్పుడు  అక్కడ ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబిస్తాయనే విషయం అందరికీ అవగాహనలో ఉన్నా, ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న రిగ్గింగ్ లాంటి వాటిని ధన ప్రవాహాన్ని నియంత్రించే విధంగా ప్రజలు స్పందించడం లేదు. అలాగే ప్రభుత్వమూ తన సంపూర్ణ అధికారాన్ని ప్రదర్శించడం లేదు.
చట్టం లోని లొసుగులు, కండబలం , ధనబలం, మందబలం కలిగిన నాయకత్వం సాగిస్తున్న అక్రమాల వల్ల, తప్పుడు విధానాల వల్ల ప్రజాస్వామ్యంలో ప్రతిబింబించాల్సిన  ప్రజల మనోభావాలు ప్రతిబింబించడం లేదు.
ఈ నేపథ్యంలో సామాజికస్పృహ కలిగిన కొందరు పెద్దలు, కొన్ని స్వఛ్చంద సంస్థలు సమాజంలో మార్పు కోరుతూ ఆ దిశలో ప్రయత్నాలు సాగించడం నిజానికి అభినందించాల్సిన విషయం. అలాంటి వారి ప్రయత్నం, కొద్ది శాతం ప్రజల ఆలోచనలలో నైనా ఏ కాస్త మార్పు తేగలిగినా అది ప్రజల నైతిక విజయం గానే భావించాలి.
ఈ ప్రయత్నం ద్వారా సమాజంలో మార్పు రావాలని అనుకుంటున్న నేపథ్యంలో ఆ మార్పు ఎలా ఉండాలి అనే చర్చ జరగాలి. దానికి సిద్ధపడే ముందు కొన్ని ప్రశ్నలు మనకు మనం వేసుకొని సమాధానాలు చెప్పుకుందాము.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యత ఏమిటి?
ప్రజాస్వామ్య మంటేనే... వయసురీత్యా అర్హత కలిగిన దేశ పౌరులు ఓటరుగా నామోదయి, తమ ఓటు ద్వారా, తమను పాలించ గలిగిన, విజ్ఞత గలిగిన, నాయకత్వ పటిమ గలిగిన నాయకులను ఎన్నుకోవడం హక్కుగా కలిగి ఉండడం. 18 సంవత్సరాలు నిండిన స్త్రీపురుషులు ఓటర్లుగా నమోదు చేసుకొని నిర్ణీత కాల వ్యవధిలో వివిధ సభలకు తమ ప్రతిని ధులను పంపడం జరుగుతుంది. అయితే ఏ ప్రతినిధి ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో ఆ ప్రతినిధి ఆయా సభలలో సభ్యుడుగా ఉండేందుకు దోహదపడేదే ఓటు కాబట్టి ఆ ఓటు హక్కు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
ఎన్నికలు ప్రస్థుతం ఎలా నడుస్తున్నాయి?
ప్రస్థుతం ఎన్నికలలో నిజాయతీ కన్నా ధనబలం మరియు ఇతర అవినీతి విధానాలే రాజ్యమేలుతున్నాయి,
ఈ పరిస్థితులు మారాలని మనం అనుకుంటున్నామా?
ఒక ప్రజాస్వామ్య వాదిగా దేశ భవిష్యత్ తరాలు బాగుపడాలనే సంకల్పంతో ఈ విధానం తప్పని సరిగా మారాలని కోరుకుంటున్నాము.
అసలు మార్పు అంటే ఏమిటి?
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం మార్పు. అధమ స్థితికి వెళ్ళడం కూడా మార్పే. కాని ఉన్నత స్థితిలో పరిణతి ఉంటుంది... అది పరివర్తన... ఆ పరివర్తన రావాలి.
మార్పును గూర్చిన మన అవగాహన ఏమిటి?
మార్పు అనేది ప్రకృతిలో ప్రాథమిక లక్షణం. ప్రకృతిలో మార్పు చెందనిది నిజానికి మార్పు ఒక్కటే. మనం మారక పోతే మార్పే మనలను మారుస్తుంది. అందుకని మనమూ పరిస్థితుల కనుగుణంగా ముందుగానే పరివర్తన చెందాల్సి ఉంటుంది.
మార్పు యొక్క  అవసరం ఏమిటి?
సమగ్రమైన మార్పు ద్వారా ఈ విశాల విశ్వంలో ఉన్న అన్నింటితో సామరస్య పూర్వకమైన సహ జీవనం చేయడం సాధ్యపడుతుంది.
ఒకవేళ మార్పు అనివార్యం అనుకుంటే... అందులో మన పాత్ర ఏమిటి?
ఏ సమాజంలో నైనా మార్పు అనివార్యం అనుకుంటున్నాము కాబట్టి అవగాహనా పూర్ణమైన మార్పును ఆహ్వానించడం వల్ల ఆ సమాజంలో మన పాత్ర ప్రాధమిక మౌతుంది. మనం పొందిన మార్పు ద్వారా కలిగిన పరివర్తనకు పరిణతి నిస్తుంది. అనుకరణ, అనుసరణ మానవ లక్షణం కాబట్టి సమాజం మనలను అనుకరిస్తుంది, అనుసరిస్తుంది. ఆ పరిణతి సమాజ వికసనకు దారితీస్తుంది. అయితే ఆ మార్పు అవసరానికి మారే  మార్పుగా కాక ఒక పరివర్తనగా రావాలి. అవసరానికి మారిన వారు మళ్ళీ అవసరాలు తీరగానే పాత అలవాట్లకు బానిసలౌతారు. నీతి నిజాయతీ విలువలతో కూడిన జీవితాన్ని గడిపే వారు మార్పును ఆహ్వానిస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తారు.
మార్పు మనలో కావాలన్నా, సమాజంలో రావాలన్నా ఏం కావాలి?
మారేందుకు మనలో ఒక తపన రావాలి. ఈ దేశం నాది. ఈ జాతి నాది. దీని కోసం శ్రమించడంలో నాకు నిజమైన ఆనందం ఉన్నదనే భావన మనస్సులలో నిలవాలి. త్యాగ భావన పెరగాలి. ముఖ్యంగా నేనూ నాది అనే భావన కాక మనము మనది అనే భావనతో హృదయం పల్లవించాలి.
మారేందుకు ఉన్న ప్రతిబంధకాలు ఏమిటి?
స్వార్ధ భావనలే మారుటకు ఉన్న ముఖ్యమైన ప్రతిబంధకాలు.
ఆ ప్రతిబంధకాలలో మన చేతులలో ఉన్నవి ఏమిటి? అలాగే మన నియంత్రణలో లేనివి ఏమిటి?
మనం మారడం మన చేతులలో ఉన్నది. ఇతరుల మార్పు మనచేతులలో లేనిది. అయితే మనం మారడం వల్ల మన మార్పు ఇతరుల జీవితాలకు ప్రేరణ నివ్వవచ్చు. మార్పు వల్ల వచ్చే ప్రయోజనాలను ప్రజలకు సోదాహరణంగా ప్రచారం చేయడం ద్వారా వారిని చైతన్యవంతులను చేయవచ్చు. విజ్ఞత లేకుండా ప్రలోభాలకు లొంగిపోయి ఓటును అమ్ముకోవడం వల్ల మనం కోల్పోతున్నదేమిటో ఎదుటి వారికి అర్థం అయ్యే విధంగా చెప్పడం వల్ల ప్రజలలో క్రమేపీ మార్పు వస్తుంది. అయితే దానికి కావలసింది... ఒకటి మనం నమ్మిన సిద్ధాంతంపై నమ్మకం. రెండు... ఆచరాణాత్మమైన ప్రబోధ, మూడు... ఎదుటి వారికి అర్థం అయ్యే భాషలో వారి వద్దకు వెళ్ళడం వారి సందేహాలను ఓర్పుతో, ఓపికతో తీర్చడం. దీని వల్ల ఆశించిన ప్రయోజనాలు తొందరలోనే సాధించే అవకాశం ఉంటుంది.
ఇవే సమగ్రమైన ప్రశ్నలు జవాబులు కాకపోవచ్చు కాని వీటి వల్ల కనీసం మార్పు యొక్క ప్రాథాన్యత అర్థం అవుతుంది.
ఇప్పుడు సమస్యను కొంత మేరకు అర్ధం చేసుకున్నాము కాబట్టి ఈ పరిస్థితులను చక్క దిద్దేందుకు మనమేం చేయాలి, ప్రభుత్వాలు ఏంచేయాలి, ప్ర్ర్రజా సంక్షేమం కోరే సంస్థల పాత్ర ఏమిటి అనే విషయాన్ని పరిశీలిద్దాము.
ముందుగా ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను పరిశీలిద్దాము....
చట్టబద్ధంగా ఎలక్షన్ కమీషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఓటర్లు నిర్భయంగా, స్వఛ్చందంగా, స్వేఛ్చగా ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమీషన్ బాధ్యత.
ధనబలం, నేరతత్వం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కులమత ప్రాంత భావనలు లాంటి ఎన్నో విధాలుగా విష పూరితమైన ఈ నాటి ఎన్నికల విధానంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించడం కమీషన్ కు కత్తి మీద సాము లాంటిదే. అయినా, ఎలక్షన్ కమీషన్ ఇప్పటి వరకు ఆర్ధిక వ్యయంపై నియంత్రణ, ఒక పార్టీ “బి” ఫారమ్ పై ఎన్నికైన అభ్యర్ధులు మరొక పార్టీకి మారడాన్ని నియంత్రించడం, పైడ్ న్యూస్ మరియు రాజకీయ అడ్వర్టైజ్ మెంట్లపై నియంత్రణ, ఒపీనియన్ పోల్స్ పై నియంత్రణ, నోటాను బాలెట్ పేపర్ లో చేర్చడం లాంటి ఎన్నోసంస్కరణలతో నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. చట్టాలు పటిష్టంగానే ఉన్నాయి. అయినా వాటిని అమలు చేసే వ్యక్తుల అలసత్వం అప్పుడప్పుడు అనుమానాలకు, విమర్శలకు తావిస్తుంది. వాటిని సరిదిద్దాల్సిన చర్యలు చేపట్టాలి.
అన్ని స్థాయిలలో యంత్రాంగాన్ని సన్నద్ధ పరచాలి. బాధ్యతలు అప్పగించడంలో సమర్ధతను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇక్కడ సీనియారిటీ కన్నా సమర్ధతయే ప్రథానమైన అర్హతగా పరిగణించాలి.
అధికారాలు లేకుండా కీలక బాధ్యతలను నిర్వహించడం అంటే ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపడమే అవుతుంది. కాబట్టి సమర్ధవంతంగా కార్యక్రమాలను నిర్వహించగలిగిన వ్యక్తులను ఎన్నిక చేసుకొని వారికి ఆ బాధ్యతల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే విధంగా అవసరమైన శిక్షణ నిచ్చి బాధ్యతల నప్పగించాలి.
కీలక బాధ్యతలను అప్పగించే సమయంలో అవసరమైన నిధులు, అధికారాలు వారికి కల్పించాలి. అదే సమయంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి ఆరోపణలు వస్తే విచారించి వీలైనంత త్వరగా వారికి తగిన శిక్షలు వేయాలి.
ఎన్నికల అధికార యంత్రాంగంలో ఉదాసీన భావాన్ని తొలగించాలి. ఎప్పటికప్పుడు తనను తాను ఉన్నతీకరించుకునే విధంగా ప్రేరణ నివ్వడం వల్ల ఆ అధికారి సన్నద్ధమై ఉంటాడు. దానికి అవసరమైన చర్యలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం సమర్ధవంతంగా అమలు చేయడం చాలా ముఖ్యం.
స్వఛ్చంద ప్రజా వేదికల ద్వారా ఎన్నికల సంస్కరణలను ప్రచారం చేయడం, వాటిపై అర్ధవంతమైన చర్చలు జరపడం, ఆ చర్చల సారాంశాన్ని విశ్లేషించి ప్రజోపయోగం అనుకున్న, అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని సంస్కరించడం ద్వారా ప్రజలకు సరైన అవగాహన కల్పించ వచ్చు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల ప్రజలలో ఎన్నికల కమీషన్ పై విశ్వాసం కలుగుతుంది.
సరైన పనిని, సరైన విధానంలో, సరైన సమయానికి, సమర్ధవంతంగా నిర్వహించడం కమీషన్ ప్రాథమిక కర్తవ్యం. ఆ విధానంలో అవకాశం ఉన్న అన్ని విభాగాలలో Information technology సహకారాన్ని అవసరమైన విధంగా తీసుకోవడం వల్ల…..
పనులు సులువవుతాయి.
పారదర్శకతను పెంచుకోవచ్చు.
ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవచ్చు,
ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎన్నికల నిర్వహణ సులువవడమే కాక ప్రజల ఆమోదాన్ని కూడా పొందుతుంది.
నిజానికి ఎన్నికల సంస్కరణలు ఒక్క ఓటు వేయడంలో రావలసిన మార్పులే కాక
ఓట్లను లెక్కించడం,
ఓటు హక్కు కల్పించడంలో అర్హతను గుర్తించడం,
నియోజక వర్గాల ఎల్లలను నిర్ణయించడం,
ఎన్నికల యంత్రంగానికి మరియు ఓటరుకు రక్షణ కల్పించడం,
ఓటు వేసిన పెట్టెలకు భద్రత కల్పించడం,
కావలసిన ఆర్ధిక వనరులను సమీకరించుకోవడం,
ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రచారం చేయడం,
ఓటింగ్ సామాగ్రిని, పెట్టెలను నమూనాలు చేయడం,
అభ్యర్ధులకు వారి ఏజంట్ లకు అవసరమైన గుర్తింపు లిచ్చి ఎన్నికలు సజావుగా జరిగేందుకు తోడ్పాటు నందించే విధంగా చూడడం లాంటి పలు అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.
ప్రజా సంస్థలు, ప్రజలు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములై ప్రజాస్వామ్య వ్యవస్థ స్పూర్తిని సజీవంగా నిలపాల్సి ఉంది. ప్రజా సంస్థలు ఎన్నికలలో పార్టీలు, ఎన్నికల యంత్రాంగం అక్రమాలకు పాలుపడకుండా నిఘా పెట్టడం చేయాలి. ఎప్పటి కప్పుడు ఆయా పార్టీలు పెట్టే ఖర్చులపై నిఘాపెడుతూ అవసరమైన చోట ఎన్నికల కమీషన్ కు సహకరించాలి. తప్పుడు విధానాలలో అభ్యర్ధులు ఓటర్లను భయభ్రాంతులను చేసినా, డబ్బు, సారాయి లాంటివి పంపిణీ చేసే ప్రయత్నాలు చేసినా వాటిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలి. సంఘటితంగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా అవసరమైన చోట పోలీసు సహకారం తీసుకోవడం, ఎన్నికల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం చేయవచ్చు.
ధార్మిక జీవనం గడిపేందుకు ఎంతటి నిబద్ధత అవసరమో లౌకిక జీవితంలో ధర్మాన్ని ఆచరించడం, అక్రమ పద్ధతులను విడనాడడం అంతే అవసరం. భగవంతుడిని చేరాలంటే కావలసింది భయం కాదు. అలాగే కర్మాచరణలో కావలసింది కూడా నిర్భయత. అధర్మాన్ని ఎదిర్చే మానసిక సన్నద్ధత లేని పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా పరిణతి నీయవు. జాతికి రాజ్యాంగం ఒక భగవద్గీతతో సమానం. ప్రజా క్షేత్రంలో నిబద్ధతతో ఆచరించే ప్రతి కర్మాచరణ ఆధ్యాత్మిక జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. భగవదారాధనకు ఎలాగైతే సన్నద్ధమౌతామో అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణకు సన్నద్ధం కావడం మన జీవితాన్ని ఉన్నతీకరిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
నాకీ వేదికను పంచుకునే అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ కృతజ్ఞతులు తెలుపుకుంటూ... సెలవు.... నమస్సులు.
పాలకుర్తి రామమూర్తి