మన మనసు లోని ఒక ఆలోచనయే నమ్మకం.
దేవుడున్నాడు... ఒక నమ్మకం; దేవుడు లేడు అదీ ఒక నమ్మకమే మనసులోని
ఆలోచనల కనుగుణం గా హేతుబద్ధమైన ఉపపత్తిని పెంచుకుంటూ ఆలోచనలను గట్టి పరచుకున్న
కొద్దీ ఆ నమ్మకాలకు బలం చేకూరి నమ్మకాలు విశ్వాసాలుగా అంతర్మనస్సులో ముద్రపడి
పోతాయి. ఆలోచనల కనుగుణంగా అలవాట్లు; అలవాట్ల ననుసరించి మనలో
ఉన్న సుప్త చేతనాత్మకమైన మానసిక శక్తి ప్రేరణ పొంది జీవితం లోని అన్ని దశలలో
సంవ్యాప్తమై చివరకు మన జీవితాలనే శాసించే స్థితికి చేరుతుంది.
ఒక పనిని నేను సాధించగలను అనేది ఒక నమ్మకం .. ఆ నమ్మకం ఆ
పనిని సాధించేందుకు అవసరమైన వనరులను సమీకరించే భౌతిక మానసిక చైతన్యాన్ని మనకు
అందిస్తుంది. తద్వారా ప్రణాళికలను సిద్ధం చేసుకున్న మనస్సు అనువైన విధానం తో
ముందుకు నడిపించి కార్యావిష్కరణకు మార్గం చూపుతుంది... ఆ మార్గాన్ని సుగమం
చేస్తుంది. అలాగే నేను సాధించలేను అనేదీ ఒక నమ్మకమే. ఇది కూడా మన ఆలోచనా విధానానికి అనుగుణమైన
రంగాన్ని సిద్ధం చేస్తుంది. మన జీవితం లో సంభవించే సంఘటనలూ, పరిస్థితులూ, అనుభవాలూ, చర్యలూ అన్నీ మన ఆలోచనలకు ప్రతిబింబాలుగా, ప్రతిక్రియలుగా
నిలుస్తూ మన నమ్మకాలను ప్రభావితం చేస్తుంటాయి.
మన జీవితాలను ఆనందమయం చేసే ఆలోచనలు... లేదా జీవితాలను
బాధామయం చేసే ఆలోచనలను మన మనస్సు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. ఏ ఆలోచనా
విధానాన్ని నిరంతర ధ్యానం తో సారవంతం చేస్తామో ... దాని కనుగుణమైన, అవసరమైన ఉపపత్తులను సంగ్రహించి బలోపేతం చేస్తామో... ఆ ఆలోచనా
విధానం లేదా నమ్మకం మాత్రమే మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. రంధ్రాన్వేషణా
పూరిత ఆలోచనా సరళి జీవితాలలో "సమన్వయా పూర్ణ విధానలను కూడా సంఘర్షణా పూర్ణం
గా మలచ గలదు. అదే ఆలోచనలను కొద్దిగా మార్చుకుంటే సంఘర్షణా మయమైన జీవితాలను కూడా
రసమయ జీవితాలుగా తీర్చి దిద్దుకోగలము.
మన మన్స్సుకు సంతోషాన్ని కలిగిస్తూ... విజయ పథం లో నడిపించే
ఆలోచనా విధానం లేదా నమ్మకం సర్వదా ఆదరణీయం. ఏ కారణం చేతనైనా ఆ ఆలోచనా విధానం
సంపూర్ణ విజయాన్ని తక్షణమే ప్రసాదించక పోయినా శాశ్వతమైన అపజయాన్ని మాత్రం ఇవ్వదు.
అంతే కాదు... ఉత్తేజితమైన మనస్సు అన్ని అవకాశాలనూ
నిరంతరం అన్వేషిస్తూ ఎప్పుడో ఒకప్పుడు విజయ మార్గాన్ని మనముందు
ఆవిష్కరిస్తుంది. ఉదాహరణకు... మనకొక విషయం పై ఆలోచన ఉంది కాని స్ఫష్టత లేదు..
ఎంతగానో ఆలోచిస్తాము. ఫలితం రాదు. దాన్ని ప్రక్కన పెట్టి మరో పనిలో నిమగ్నమౌతాము.
అయితే మనం ఆ ఆలోచనపై చూపిన నిబద్ధత, తీవ్రమైన
ఆవేదన కారణంగా ఎప్పుడో మనం వేరే ఏ పనిలోనో ఉండగా దాని పరిష్కారం స్ఫురిస్తుంది.
ఇది దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయం లో అనుభవంలోకి వచ్చిందే. మన సుప్త
చేతనాత్మకమైన మనస్సు యొక్క శక్తి పై మనకూ తెలిసి గానీ తెలియక కాని పెంచుకున్న
విశ్వాసం వల్ల ఆ మనస్సు స్ఫందించి మనకు కార్య సాఫల్యత నిస్తుంది. అలాగే
నకారాత్మకమైన ఆలోచనా విధానం లేదా నమ్మకం ఏనాడూ మనల్ని విజయపథం వైపు నదిపించలేదు.
సంకుచిత భావనా వలయం లో చిక్కుపడ్డ నకారాత్మక నమ్మకాలు, భయాలూ,
ఆంధోళనలు, అసహనాలు, ఈర్ష్యాసూయ
ద్వేషాదులు బహుమతులుగా ఇస్తూ.. జీవితాలను నరకప్రాయం చేస్తాయి. అలాంటి హానికరమైన
నమ్మకాలను పెంచుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
పుట్టిన ప్రతి వ్యక్తీ మరణిస్తాడు. అయితే పుట్తిన నాటినుండి
మరణాంతం వరకు సాగిపోతున్న జీవనక్రమంలో ఏం సాధించాము.. భావితరాలకు మన వారసత్వ
సంపదగా ఏమందిస్తున్నాము అనే విషయం ప్రతి వ్యక్తి జీవితం లో ప్రాధాన్యతను
సంతరించుకుంటుంది. సకారాత్మక వైఖరితో విజ్ఞానాన్ని సంతరించుకుంటూ, నిర్మాణాత్మకమైన అనుభవాలను బలోపేతం చేసుకుంటూ "నా
జీవితాన్ని రసమయం చేసుకోగలను.. సార్థకం చేసుకోగలను" అనే నమ్మకాన్ని
పెంచుకుంటే జీవితం సఫలమౌతుంది.
మనకు తెలిసి కానీ, తెలియక
కాని మన తల్లిదండ్రుల నుండి, చుట్టూ ఉన్న సమాజం నుండి,
ఉపాధ్యాయుల నుండి, స్నేహితుల నుండి మనం పొందిన
సూచనలు, అనుభవాలు ప్రాతిపదికగా సకారాత్మక లేదా నకారాత్మక
నమ్మకాలను సంతరిమ్చుకుంటాము. ఆ నమ్మకాలు సుప్త చేతనాత్మకమైన మనస్సులో నిక్షిప్తమై
మన జీవన మార్గం లో ప్రతిబింబిస్తాయి. అందులోని నకారాత్మకమైన ఆలోచనలను సకారాత్మకం
గా మార్చుకుంటే జీవితం ఆనంద మయమౌతుంది. ఆ విధానం లో ప్రార్థన ముఖ్య భూమిక
పోషిస్తుంది. ఒక నిర్దిష్టమైన ప్రయోజనాన్ని ఆశించి విజ్ఞతతో.. ఓరిమితో.. సంయమనం
తో.. అనునయంగా, ఆత్మీయంగా సుప్త చేతనాత్మకమైన మనస్సును
చైతన్యవంతం చేస్తూ.. క్రమబద్ధంగా ఆ చైతన్యవంతమైన మనస్సుకు సకారాత్మకమైన సూచనలు
ఇస్తూ ఆ సూచనలు బలపడేంత వరకు.. నమ్మకం తో,, విశ్వాసం తో పరిశ్రమించడం వల్ల
స్ఫూర్తి పొందిన సుప్త చేతనాత్మక మనస్సు మన లక్ష్యాన్ని, ఆశయాన్ని
ఆవిష్కరించేందుకు అవసరమైన అన్ని వనరులను వసతులను కల్పిస్తుంది. అవరోధాలను
అధిగమించే విధానాన్ని సూచిస్తుంది. కావలసిందల్లా.. ఆసక్తి, శ్రద్ధ,
పట్టుదల, తపించే మనస్సు మాత్రమే. ఉదాహరణకు...
మన మనస్సు భయభ్రాంతమై జీవితం పై నిరాశ నిస్పృహల తో నిండి పోతే... ఆ ఆలోచనా సరళి
మనసులో ఎంత లోతులో పాతుకు పోయినా దానిని సమూలంగా తుడిచి వేయడం సాధ్యమే.
మన సుప్తచేతనాత్మకమైన మనస్సుకు ప్రేరణ నిచ్చి అది
ఆవిష్కరించ గలిగిన కార్యాన్ని నిరంతరం గుర్తు చేస్తే చైతన్య వంతమైన మనస్సు
నెమ్మదిగా వ్యాప్తిచెంది భయాన్ని పారద్రోలుతుంది.
ఇలా అసాధ్యమని మనమనుకునే ఏ అడ్డంకినైనా విశ్వాసం అనే ఆయుధం
తో తొలగించు కునేందుకు మరియు దానికి వ్యతిరిక్త ఆలోచనా విధానాన్నిలేదా నమ్మకాన్ని
సంతరించుకోవడం .. దానిని బలోపేతం చేయడం వల్ల విజయ సాధకులమౌతాము. మన జీవిత
ప్రస్థానం కూడా భద్ర జీవనం నుండి భవ్య జీవనం వైపు మళ్ళించ బడుతుంది. మనం కూడా
జీవితాన్ని సఫలం చేసుకున్న వారమవుతాము.
Palakurthy Rama Murthy